సృజన, అనువాదం బొమ్మా బొరుసూ: నలిమెల

 

బహుభాషా వేత్త, ఆదర్శ అధ్యాపకుడు, కవి, రచయిత, అనువాదకుడు, తెలంగాణ పదకోశ రూపకర్త  నలిమెల భాస్కర్ తెలంగాణ లోని కరీంనగర్ జిల్లాకు చెందిన వారు.     పద్నాలుగు భారతీయ భాషల నుండి తెలుగులోకి, తెలుగు నుండి ద్రావిడ భాషల్లోకి అనువాదాలు చేసిన వారు. మలయాళంలో పునత్తిల్ కుంజ్ అబ్దుల్లా రాసిన ‘స్మారక   శిలగల్’ నవల తెలుగులోనికి అనువాదం చేసినందుకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ       అవార్డును అందుకున్నారు.  బహుముఖీన మైన వారి ప్రతిభను కృషిని తెలుసుకోవడంలో       భాగంగా భాషారంగానికి పరిమితమవుతూ ఈ ముఖాముఖి బూర్ల వేంకటేశ్వర్లు మన        ముందుంచారు.

 

@  నమస్తే! ఉద్యోగమూ, సృజనా, వ్యక్తిగత జీవితమూ చక్కబెట్టుకుంటూ ఇన్ని  భాషలు నేర్వడంలో ఎట్లా సఫలీకృతులైనారు?

 • ఉద్యోగము చేయక తప్పని సరి పరిస్థితి, చేస్తే తప్ప వెళ్ళని స్థితి, కాకుంటే నిబద్ధతతో, నిజాయితీగా చేయడానికి మా తండ్రి రామచంద్రం స్ఫూర్తి. ఇక సృజన అంటారా! అది శ్వాసతో సమానం. ఐతే, అనువాదాలు ఆరంభమయ్యాక సృజన తగ్గింది. మా తరం అంతా ఆదర్శాల తరం. ఎటు చూసినా ఉద్యమాలు, పోరాటాలు. పొతే… భాషల అధ్యయనం గురించి నేను టీచర్ గా పనిచేసిన ఊరికి కనీసం పేపర్ రాదు. ఆ ఊళ్ళో గ్రంథాలయమూ లేదు. అక్కడ ఐదేండ్లు పని చేయాల్సి వచ్చింది. నాకు తొమ్మిదవ తరగతి నుండి పుస్తక పఠనం తప్ప మరే అలవాటు లేదు. ఏం చేయను. ముప్పై రోజుల్లో కన్నడ భాష పుస్తకం కంట బడింది. నేను దాని వెంట పడ్డాను. తర్వాత తమిళం వంతు అయ్యింది. ఐతే, భాషలు నేర్చుకోవడం అనేది ఒక అధ్బుతమైన క్రీడలాంటిది. గణితంలో కఠిన మైన లెక్కలు చేయడం లాంటిది. పైగా, అనేక భాషలను ఏక కాలంలో తులనాత్మకంగా నేర్చుకోవడం ద్వారా సులభమైంది. కొంత విలక్షణంగా పని చేయడం అనేది మొదటి నుండి నా స్వభావంలో ఉంది.

@ జాతీయ భాష, త్రిభాషా సూత్రం ఏమేరకు సాధించినై , భాష వలన ఇది సాధ్యమౌతుందా?

 • ఇది అకాడెమిక్ ప్రశ్న! జాతీయ భాష హిందీ ద్వారా దేశ సమైక్యతను కాపాడాలన్న సంకల్పం మంచిదే! కానీ, ఇది వికటించింది. హిందీ ఆధిపత్య భావజాలం దక్షిణాది మీద ముఖ్యంగా తమిళం మీద రుద్దబడింది అన్న అభిప్రాయలు ప్రచలితం అయినవి. ఇక, త్రిభాషా సూత్రం కూడా దాదాపు దక్షిణాది రాష్ట్రాలకే పరిమితమైంది. జాతీయ సమైక్యత బలపడాలంటే ఉత్తరాది వాళ్ళు సైతం దక్షిణ దేశ భాషలలోని ఏ ఒక్కటైనా చదవాలి కదా! కానీ, అలా జరగడం లేదు. జాతీయ భాష హిందీతో పాటు ఆంగ్లాన్ని చదువుకొని ఉత్తరాది వారు ద్విభాషా సూత్రానికే పరిమితమవుతున్నారు.

భాష వల్ల జాతీయ సమైక్యత అనేది కొంత మేరకే సాధించ గలమనేది నా వ్యక్తిగత    అభిప్రాయం. అపారమైన దేశభక్తే ఈ దేశ సమైక్యతను, సమగ్రతను నిలబెట్టగలదు.

@ జ్ఞానార్జనలో, సృజనలో, భావ వ్యక్తీకరణలో మాతృభాషకు మరో భాష ప్రత్యామ్నాయం  కాగలుగుతుందా, అంతర్జాతీయ భాష ప్రభావం ఇతర భాషల మీద ఎలాంటి ప్రభావాన్ని    చూపుతున్నది?

 • దేనిలోనూ మాతృభాషకు మరో భాష ప్రత్యామ్నాయం కాదు. అది తల్లి వంటిది. మాతృమూర్తికి బదులుగా మరొకరు ఆ స్థానాన్ని పొందగలరా, లేదు. తల్లిభాష సహజమైనది, సులభమైనది, శాస్త్రీయమైనది. అతి తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సముపార్జించే సాధనం తల్లి భాష. వ్యక్తి సమగ్ర వికాసానికి, మూర్తిమత్వ వృద్ధికి మూలకారణం భాష. అది, మాతృభాష ద్వారా జరిగినప్పుడు అనేక సత్పలితాలు చూడగలం.

అంతర్జాతీయ భాష ప్రభావం ఇతర భాషల మీద బాగా పనిచేస్తున్నది. ఎంత  కాదన్నా… శాస్త్ర సాంకేతిక సమాచారమంతా ఆంగ్లంలో ఉండిపోయింది. జ్ఞాన     సముపార్జనకు ఆంగ్లాన్ని వాడుకోవాల్సిందే. ఐతే, ఆ క్రమంలోనే మాతృభాషను మరింత సుసంపన్నం చేసుకోవాలి. విరివిగా అనువాదాలు జరగాలి. ఆంగ్లంలో ఉన్నఅపారమైన ఆయా శాస్త్రాల జ్ఞానాన్ని ఇతర         భాషల్లోకి తెచ్చుకోవాలి. అట్లు జరగక      పోగా రాను రాను ఆంగ్ల భాష ప్రభావం వల్ల ఇతర భాషలు కనుమరుగయ్యే ప్రమాదం   ఏర్పడుతున్నది. మాతృభాష తన మూలాలు కాపాడుకుంటూనే అంతర్జాతీయ భాష వల్ల  ప్రభావితమైతే ఏ రకమైన ఇబ్బంది రాదు.

@ బహుభాషలు నేర్చుకున్న మీరు తెలంగాణ పదకోశం గల కారణాలు ఏమున్నాయి?

 • సాహిత్యంలో నిర్దిష్టత ప్రవేశించాక స్థానికత ప్రబలమయ్యాక, అస్తిత్వ ఉద్యమాలు బాగా ప్రచలితం అయ్యాక మన చరిత్ర, భాష, సంస్కృతి పట్ల సోయి పెరిగింది. తెలంగాణ మలిదశ పోరాట సందర్భంలో తెలంగాణ రచయితల వేదిక ఆవిర్భావం జరిగింది. ఆ వేదిక నన్ను నేను తవ్వి పోసుకోవడానికి కారణమైంది. ఆంధ్రా ఆధిపత్య వాదులు తెలంగాణ తెలుగుకు వెక్కిరించడం వల్ల అది తెలంగాణ ఆత్మకు శరాఘాతమైంది. తెలంగాణ ఆత్మ మేల్కొంది. కొందరు ఆ భాషలో కైతలు రాశారు. మరికొందరు కథల్ని పండించారు. నేనేమో పదకోశం వేశాను.

@ తెలంగాణ రాష్ట్రంలో భాషకు ఇస్తున్న ప్రాధాన్యత ఎలా ఉన్నది?

 • మన రాష్ట్రంలో కూడా ఇప్పటికీ శిష్ట వ్యావహారిక భాషనే వాడడం ఒకింత విచారాన్ని కలిగిస్తున్నది. పాఠశాల స్థాయిలో ఒకటి నుండి పదవ తరగతి వరకు తెలుగు వాచకాలు మారాయి. వీటిల్లో ఎనభై శాతం తెలంగాణ వాళ్ళవే ఉండడం ఆనందాన్ని కల్గించే  అంశం. అయితే, ప్ప్ర్వపు భాషే ఉన్నది. తెలంగాణ తెలుగులో వాచకాలు లేవు. ఒక ప్రామాణిక భాష ఏర్పడ లేదు. ఏదో ఒక స్థాయిలో ఎంతో కొంత మేరకైనా తెలంగాణ తెలుగును బోధనా భాషగా చేసుకోకపోతే బోలెడు నష్టం జరిగిపోతుంది. కేవలం బోధనా భాషగానే కాక, అధికార భాషగానూ, పత్రికా భాష గానూ, సినిమా భాషగానూ తెలంగాణ తెలుగు నిలదొక్కుకోవలసిన అవసరాన్ని ప్రభుత్వం తక్షణమే గుర్తించాలి. ఒక సమగ్ర నిఘంటు నిర్మాణం జరగాలి. తెలంగాణ తెలుగులో రాస్తున్న రచయితల్ని ప్రోత్సహించాలి. పాల్కురికి, పోతన వంటి కవుల పద ప్రయోగ సూచికలు రావాలి. భాషకు ఒక మంత్రిత్వ శాఖ ఉండాలి.

@ సృజనలో భాష నిర్వహించే పాత్ర గురించి చెబుతారా?

 • సృజనలో భాష ఒక అంగం. పైగా ముఖ్యమైన అనుఘటకం. రచనకు అది ఒక కవితైనా, కథైనా, నవలైనా మరేదైనా వస్తువు చాలా ముఖ్యమైన అంశం. ఐతే, ఆ వస్తువు ఎంత ఉదాత్తమైనది ఐనా, ఎంత ఉన్నతమైనది అయినా ఏ భాషలో చెబుతున్నామనేది ఎంతో ముఖ్యమైన విషయం. నన్నయ తన భారతాన్ని తెలుగులో కాక సంస్కృతంలోనే అతనికి అంత ప్రశస్తి వచ్చి ఉండేది కాదేమో! పాల్కురికి సోమన దేశీ కవితా మార్గంలో బసవ పురాణాన్ని తీర్చిదిద్దడం వల్లే దేశి కవితా మార్గానికి ఆది పురాణమైంది. వేమన అలతి అలతి పదాలతో ఆటవెలదులు రాసినందువల్లనే అతని పద్యాలు ఈనాటికీ అందరి నోళ్ళలో నానుతున్నాయి. సృజనలో ఉన్న అంతస్సత్త అంతా భాష అనే మాధ్యమం ద్వారానే పాఠకుణ్ణి చేరుతుంది. అది మాతృభాష కాకున్నా, ప్రజల భాష కాకున్నా రచనలకు అంత ప్రాధాన్యత ఉండదు.

@ ప్రాచీన భాష తెలుగు అభిమాన భాషగా ఎదగక పోవడానికి ఆటంకాలు ఏమున్నాయంటారు?

 • మాతృభాష పట్ల మన ప్రభుత్వాలకు ఉన్న అభిమాన రాహిత్యమే ప్రధాన ఆటంకం. తమిళనాడులో ప్రజల కన్న మిన్నగా పాలకులకే భాషాభిమానం ఉంటుంది. కర్ణాటకలో సైతం కన్నడ భాషాభిమానం మెండు. తెలుగు వాళ్లకి తెలుగు పట్ల ఒక తేలిక భావం. పొరుగింటి పుల్లకూర రుచి వీళ్ళకి. ముఖ్యంగా ఈ విషయంలో ప్రభుత్వాల్లో కదలిక రావాలి, చిత్తశుద్ధి కావాలి. మొక్కుబడి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇవ్వవు.

@ అనువాదాల గురించి మీ అభిప్రాయమేమిటి?

* అనువాదం అనేది పొరుగు వాడి గురించి తెలుసుకోవడం వంటిది. ఇతరులగురించి అవగాహన ఉన్నప్పుడే వాళ్ళకన్నా మనం ఎంత ముందున్నాం లేదా వెనుకబడినాం అనేది తెలిసి వస్తుంది. ఎప్పటికప్పుడు ఇతరులను పోల్చుకుని పోటీపడే స్వభావం పెరుగుతుంది. సృజన, అనువాదం ఇవి రెండు పరస్పర పరిపూరకాలు. ఇందులో ఏది లోపించినా మన జ్ఞానం అసంపూర్ణం. అనువాదాలు లేకపోతే ఇతర భాషల సాహిత్యం లేదు. ప్రపంచ సాహిత్యం లేదు. శాస్త్ర సాంకేతిక జ్ఞానం శూన్యం. హృదయ వైశాల్యానికి, దృష్టి నైశిత్యానికి, వ్యక్తి వికాసానికి అనువాదం ఒక ముఖ్యమైన మెట్టు.

*

మీ మాటలు

 1. Nagabhushanam Dasari says:

  శ్రీ నలిమెల భాస్కర్ గారు తెలుగు వారై ఉండి తన మాతృ భాష కానటువంటి మలయాళ భాషలో రచించిన నవలను తెలుగులోనికి అనువదించి కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాన్ని పొందడం అత్యంత అభినందనీయమైన విషయం. అట్టి బహు భాషా ప్రవీణ్యులైన వారితో ఇంటర్వ్యూ ఇంకా ఎక్కువ వివరాలు/సమాచారాన్ని సేకరించేదిగా ఉండి ఉంటే బాగుండేదని అనిపించింది. అయినప్పటికిని నలిమెల భాస్కర్ గారితో ముఖా ముఖి నెరపిన శ్రీ బూర్ల వెంకటేశ్వర్లు గారు అభినందనీయులు. మన తెలుగు వారైన శ్రీ నలిమెల భాస్కర్ గారు విశ్వజనీన సాహిత్యలోకానికి ఇంకెంతో సేవ చేయాలని. వారికి ఆ శక్తి సామర్థ్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ వారికి శుభాబినందనలతో…
  నాగభూషణం దాసరి,
  8096511200

 2. బూర్ల వెంకటేశ్వర్లు says:

  ధన్యవాదాలు దాసరి నాగభూషణం గారు. వారి బహుముఖ ప్రజ్ఞాపాటవాలను పరిచయం చేయడానికి స్థలాభావం వలన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేవలం భాషకు పరిమితం కావడం జరిగింది. మీ సూచన శిరసావహం…

 3. Rammohanrao thummuri says:

  బహుభాషావేత్త ,తెలంగాణా భాషా వైతాళికుడు,నిబద్ధత,నిజాయితీ కలిగి నిరాడంబర
  సాహితీ తపస్వి తో ముఖాముఖి చాలా బాగుంది. దీనికి తోడుగా మరిన్ని వివరాలు ఆయన గురించి ఇస్తే ఇంకా బాగుండేది.ఈసారి ఆ పని చేస్తారని ఆశిద్దాం.అభినందనలు వెంకటేశ్వర్లు గారు .

 4. బూర్ల వేంకటేశ్వర్లు says:

  ఆసక్తి గల పాఠకుల కోసం
  సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన సందర్భంలో నలిమెల భాస్కర్ గారి మరొక ఇంటర్వ్యూ
  నలిమెల భాస్కర్ గారూ! కేంద్ర సాహిత్య అకాడమీ మీకు అవార్డు ప్రకటించినందుకు ఒక అనువాదకునిగా మీ స్పందన తెలియజేస్తారా?
  చాలా సంతోషించాను. ఆనంద సమయాల్లో మనుషులందరూ ఎట్లా స్పందిస్తారో అలాంటి స్పందనలే నాలోనూ కలిగాయి. ఐతే, ఈ సంతోషం తెలుగు వాళ్లందరిదీ. ముఖ్యంగా తెలంగాణకు సంతోషదాయకమైన వార్త ఇది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక జాతీయ స్థాయిలో వచ్చిన తోలి పురస్కారం కనుక ఆనందం కాక మరేముంటుంది? అనువాద సాహిత్యంలో నాకన్నా ముందరినుండి గొప్ప అనువాదాలు చేస్తున్న వ్యక్తులున్నారు. నా తర్వాతి వాళ్ళు చేసిన కృషి తక్కువ కాదు. అనువాద రంగంలో సహవాసి లాంటి వాళ్ళు చేసిన కృషిని తెలుగు పాఠకులు ఎలా మరిచిపోగలరు? నాకు కలిసి వచ్చిన అవకాశం ఏమంటే నా కృషికి గుర్తింపు లభించడం. ఎంత కృషి చేసినా గుర్తింపు రానప్పుడు కించిత్తు బాధ ఉండడం సహజం. నా విషయంలో ఆ బాధ లేకపోవడం ఆనందించదగ్గ పరిణామం.
   మీ అనువాద కృషికీ, సాఫల్యానికి ప్రేరణా సహకారాలు ఎవరివి?
  నా అనువాద కృషికి ప్రేరణ వాలామంది ఉన్నారు. నా కన్నా ముందు అనువాదరంగంలో కృషి చేసిన మద్దిపట్ల సూరి, సూరంపూడి, గన్నవరపు సుబ్బరామయ్య, వాకాటి పాండురంగారావు, యజ్ఞన్న శాస్త్రి మొదలైన అనువాదకులు అందరూ పరోక్షంగా నాకు స్ఫూర్తి ప్రదాతలు. అయితే… ఈ అనువాదాలు విస్తృతంగా చేయవలసిన అవసరం ఉందంటూ ఎప్పటికప్పుడు ప్రోత్సహించిన వాళ్ళు నా సమకాలీన మిత్రులు ఐన జూకంటి జగన్నాథం, నిజాం వెంకటేశం, వారాల ఆనంద్, పెద్దింటి అశోక్ కుమార్, అన్నవరం దేవేందర్ తదితరులు. నా సహచరి సావిత్రి సహకారం మరువలేనిది. ముఖ్యంగా నిజాం వెంకటేశం సార్ సికిందరాబాద్ రైల్వే స్టేషన్ లో దొరికే ఇతర భాషా పత్రికల్ని ఎప్పటికప్పుడు కొని నాకు పంపించడం మరిచిపోలేనిది.
   14 భాషలు ఎలా నేర్చుకున్నారు?
  “30 రోజుల్లో ఫలానా భాష నేర్చుకోండి” అని మార్కెట్లో చాలా పుస్తకాలు వస్తున్నాయి. 1979 ప్రాంతాల్లో మద్రాసు బాలాజీ పబ్ల్లికేషన్సు వారి ‘కన్నడం నేర్చుకోండి’ అనే పుస్తకం నా కంట పడింది. దాన్ని ముప్పై రోజులల్లో పూర్తి చేశాను. ఎంత సులభం! ఒక భాష మనకు రావాలంటే ముందు వర్ణమాల మొత్తం నేర్చుకోవాలి. ఆ తర్వాత గుణింతమూ, ఒత్తులూ. తెలుగు, కన్నడాలు లిపి పరంగా, ఒకేలా వున్న కారణం చేత ఆ భాష నాకు తొందరగా అబ్బింది. తెలుగులో ‘నేను, కన్నడంలో ‘నాను’ అని ఉంటుంది. పెద్దగా ఇబ్బంది ఉండదు. అట్లా నామవాచకాలు, సర్వ నామాలు, క్రియలు, విభక్తి ప్రత్యయాలు క్రమంగా అన్ని నేర్చుకొని తర్వాత తమిళం నేర్చాను. ఇలా నా ఖాతాలో అదనంగా మరో భాష చేరింది. తెలుగులోని ‘నేను’ అన్న సర్వనామం తమిళంలో ‘నాన్’ అనే హలంత రూపంగా ఉన్నది. అదే అజంతమై కన్నడలో ‘నాను’ అయ్యింది.
  ముప్పై రోజుల్లో వర్ణమాల, గుణింతమూ, ఒత్తులూ వచ్చినా భాష మొత్తంగా రావడానికి కనీసం ఒక ఏడాది పడుతుంది. ముప్పైరోజుల్లో అనేది భాషాధ్యయన ప్రవేశద్వారం. భారతీయ భాషలు నేర్చుకోవడంలో ఉన్న మరొక సౌకర్యం ఏమిటంటే మన దేశ భాషలు అన్నింటిలో దాదాపు సంస్కృత శబ్దాలే ఎక్కువగా ఉంటాయి. తెలుగలో ఉన్న ‘మాత’ శబ్దం కన్నడంలో ‘మాతే’, హిందీలో ‘మాతా’ లేదా ‘మా’, ఇట్లా ఇతర భాషల్లో, భాషలు నేర్చుకోవడంలో నేను ఏకకాలంలో రెండు లేదా మూడు భాషల్ని తులనాత్మకంగా బేరీజు వేసుకొన్నాను కనుక నా అధ్యయనం సులభమైపోయింది.
  అయితే ఒకటి మాత్రం నిజం… పట్టుదల ఉండాలి. ఆసక్తి కావాలి.
   అనేక భాషలు నేర్చుకోవడం వలన ప్రయోజనమేమిటి?
  భాషలు నేర్చుకోవడం వలన కలిగే ప్రయోజనం ఏమిటంటే… మనకు ఇతర భాషా సంస్కృతులు తెలిసి వస్తాయి. మన భాష మాత్రమె గొప్పది అన్న దూరంభిమానం ఉంటే గింటే దూరమవుతుంది. రెండు భాషలు తెలిస్తే రెండు సంస్కృతులు తెలిసి వచ్చినట్లు. ఇరుగుపొరుగు భాషలలోని సాహిత్యాలు తెలిసివచ్చి మనం మరింత సంస్కారవంతులుగా, విశాలంగా ఎదుగుతాం. మన మాతృ భాష మరింత ఎక్కువగా మనకు అర్థమవుతుంది. భాషాధ్యయనం తర్వాత అనువాదాలు చేయగల్గినప్పుడు పరస్పర ఆదానప్రదానాలు ఆయా భాషల మధ్య జరిగి సాహిత్య సుహృద్భావ వాతావరణం ఒకటి ఏర్పడుతుంది.
   మీరు ఉపాధ్యాయునిగా, సాహిత్యకారునిగా, అనువాదకునిగా, భాషావేత్తగా ఎలాంటి అనుభూతిని మూటగట్టుకున్నారు?
  ఉపాధ్యాయునిగా నాకు ముప్పై ఐదేళ్ళ అనుభవం ఉన్నది. ఎనిమిదేండ్లు ఆయా ఉన్నత పాఠశాలల్లో సైన్సు టీచరుగానూ, మిగాతాకాలం తెలుగు ఉపన్యాసకునిగానూ పనిచేశాను. సాహిత్య కృషి చేస్తున్నప్పుడు ఎంతగా సంతోషిస్తూ ఉంటానో, పిల్లలకు పాఠాలు చెప్పుతున్నప్పుడు అంతగానూ ఆనందిస్తాను. ఉపాధ్యాయ రంగంలో ఉన్నవాణ్ణి కనుక ఈ అవార్డు వచ్చినప్పుడు నా పూర్వ విద్యార్థులుపెద్దగా స్పందించారు. ప్రతి ఏటా వందలాది విద్యార్థులు మా దగ్గర చదువుకొని ప్రయోజకులు అవుతారు కాబట్టి వాళ్ళంతా ఫోన్లలో అభినందిస్తుంటే ఉబ్బి తబ్బిబ్బు అయ్యాను. ఈ అవకాశం ఇంకొక వృత్తిలో ఉండదు. నిత్యం విద్యార్థులతో సంబంధంగల వృత్తి ఉపాధ్యాయ వృత్తి.
  సాహిత్యకారునిగా సంతోషించాను. సాహిత్యరంగంలో నా సమకాలీనులూ, సమ వయస్కులుఅందరికీ ఈ అవార్డు వచ్చినట్లు భావించాను.
  అనువాదకునిగా, భాశావేత్తగా నా అనుభూతి చాలా గొప్పది. భాషలు నాకు నేనుగా నేర్చుకొని, ఆ భాషలు నాల్గింటిలో ఎం.ఫిల్, పి.హెచ్.డి వంటి ఉన్నత విద్యకు సంబంధించిన డిగ్రీలు తీసుకొని, అనువాదాలు చేసి, జాతీయ స్థాయి బహుమతిని తీసుకోవడం అంటే నామట్టుకు నాకు చాలా సంతోషాన్ని కలిగించిన విషయం.
   తెలంగాణా పదకోశ కర్తగా మీ అనుభవాలు ఏమిటి?
  “తెలంగాణ పదకోశం”…. అస్తిత్వ ఉద్యమంలో భాగంగా వచ్చిన చిన్న నిఘంటువు. అయితే, అది బాగా చేశాను అన్న సంతృప్తి నాకు మిగులకున్నా, కనీసం ఆ మాత్రమైనా నేను మాత్రమే చేసిన మొదటి ప్రయత్నంగా సంతోషించాను. మొదటి ప్రచురణలో సుమారు ఆరువేల పదాలు చోటు చేసుకుంటే, రెండవ ముద్రణలో పదివేల పదాలకు స్థానం లభించింది. ఇప్పుడు మూడవ సారి పరివర్ధిత ముద్రణ కోసం కనీసం పదిహేను వేల పదాలతో పదకోశం తయారవుతున్నది. పదకోశ సంకలనంలో కష్టాలు ఎక్కువే! తెలుగులో యాబై ఆరు అక్షరాలు , పైగా ‘క’ వంటి హల్లులకు క,కా,కి,కీ,కు,కూ…. మొదలైన గుణింతాలు… ఇంగ్లీషు నిఘంటు నిర్మాణంలో ఈ ఇబ్బంది లేదు. సాంకేతికంగా చూసినప్పుడు తెలుగు సాఫ్ట్ వేర్ ఎక్కువగా సపోర్టు చేయకపోవడం (అకారాదిగా పదాలు పొందుపరచడం లో) పెద్ద అద్దంకి. ఇంకొకటి… సంప్రదాయ నిఘంటువుల నిర్మాణం కొంత మేరకు నల్లేరు మీద నడక. ఆ మార్గంలో చాలా పని జరిగింది కదా! ప్రాంతీయ, ఉప ప్రాంతీయ, మాండలిక పదకోశాలు వేయడం చాలా కష్టం . ఆధునిక ప్రమాణ భాషకు సమానార్థకంగా ఉన్న పదాలను తెలంగాణ ప్రాంతంలో ఏమంటారు అని ప్రతిసారీ ఆలోచించుకొని వేయవలసి ఉంటుంది.
   తెలంగాణ భాషలో మీ కృషిని గురించి వివరిస్తారా?
  తెలంగాణ భాష గురించి తెరవే సభల్లో నేను అనేక ప్రసంగాలు చేశాను. ఈ దిశలో నాకు స్ఫూర్తి నందిని సిధారెడ్డి. మా ఆవిడ సావిత్రి కుడా తెలంగాణ భాషలో మాట్లాడాలని ప్రోత్సహించేది. తెలంగాణ భాష ఎంత గొప్పదో చెబుతూ “బాణం” భాషా సాహిత్య వ్యాసాల సంపుటి వేశాను.తెలంగాణ భాష ఔన్నత్యం గురించి దాదాపు పదిహేను వ్యాసాలు రాశాను. అవి అందరికీ సోర్సు మెటీరియల్ గా పనిచేయడం నాకు ఆనందదాయకం.
   తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా పాఠ్యపుస్తకాల్లో భాష ఎలా ఉండాలంటారు?
  తెలంగాణ ప్రత్యెక రాష్ట్రం ఏర్పడిన ఈ సందర్భంలో పాఠ్య పుస్తకాల్లో రూపపరంగానూ, సారం దృష్ట్యానూ మార్పు రావలసిన అవసరం ఉంది. రూపపరంగా అంటే భాషాపరమైనది. సారపరమైన పరిణామం సిలబస్ కు సంబంధించింది. భాషాపరమైన మార్పు అంటే ‘వచ్చాడు’ మొదలైన క్రియాపదాలకు బదులు ‘వచ్చిండు’; ‘కావాలి’, ‘చదవాలని’ మొదలైన పదాలు ‘కావాలె’, ‘చదువాల్నని’; ‘ఎదురుగా’, ‘సరిగా’ మొదలైన మాటలు ‘ఎదురుంగ’, ‘సరింగ’ వంటి మాటలుగా పుస్తకాల్లో ప్రవేశపెట్టాలి.
   తెలంగాణ రచయితల వేదిక అఖిల భారత అధ్యక్షులుగా మీరు చేసిన కృషి ఏమిటి? వివరిస్తారా!
  తెలంగాణ రచయితల జాతీయ (అఖిల భారత) అధ్యక్షునిగా నేను “ఉడాన్” అనే ఒక హింది పుస్తకాన్ని తెచ్చాను. తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా వచ్చిన ఒక యాబై రెండు కవితలు ఇందులో ఉన్నాయి. ఇవి ప్రాతినిధ్య కైతలు. వీటిని ఎన్.ఆర్.శ్యామ్ చేత అనువదింప చేశాను. నేనూ అన్నవరం దేవేందర్ ఇద్దరం దీనికి సంపాదకులుగా ఉన్నాం. అంతేకాదు మా సంస్థ కార్యదర్శి మచ్చ ప్రభాకర్ “తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు?” అనే పేరుతో మరాఠీలో ఒక గ్రంథం వెలువరించారు. ఇటీవల కరీంనగర్ లో పెద్ద ఎత్తున డిల్లీ, బరోడా, మైసూర్, భీవండీ, బొంబాయి, ఝార్ఖండ్ తదితర ప్రాంతాలనుండి ప్రవాస తెలంగాణ రచయితల్ని పిలిపించి సభలు చేశాం. అనేక పుస్తకావిష్కరణలు కావించాం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి, అల్లం రాజయ్య, డా.ఎన్.గోపి సార్ వంటి వాళ్ళతో ఉపన్యాసాలు ఇప్పించాం.
   నెలకు లక్ష రూపాయల జీతాన్ని వదులుకొని స్వచ్చంద పదవీ విరమణ ఎందుకు చేశారు?
  నా అనారోగ్యం కారణంగా వృత్తికి సరైన న్యాయం చేయలేనని నేను స్వచ్చంద పదవీ విరమణ చేశాను. అప్పటికే ముప్పై ఐదేండ్లు బోధనావృత్తిలో వుండి కొంత విసుగునూ అనుభవించాను. పదవీ విరమణ అనంతరం సాహిత్య కృషిని మరింతగా కొనసాగించవచ్చునన్నదీ ఒక ప్రధాన కారణమే!
   చివరిగా మీరు ప్రస్తుతం ఏ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు? భావి ఆలోచనలు ఏమిటి?
  ఇప్పుడు బూర్ల వేంకటేశ్వర్లు తదితరులతో కలిసి పాల్కురికి సోమన బసవపురాణానికి పదప్రయోగ సూచిక తయారు చేస్తున్నాను. పెద్దింటి అశోక్ కుమార్ తో కలిసి తెలంగాణ సామెతల బృహత్సంకలనం తేవాలన్న ప్రణాళిక ఉన్నది. కనీసం పదిహేను వేలకు తగ్గకుండా మూడవసారి తెలంగాణ పదకోశాన్ని పరివర్ధిత రూపంలో తెచ్చే పని కొనసాగుతున్నది. ఇవి కాక నా దగ్గర వివిధ భారతీయ భాషలకు సంబంధించిన గొప్ప కథలు ఒక యాబై వరకూ ఉన్నాయి. వాటిని తెలుగులోకి అనువదించాలన్నది నా సంకల్పం.

మీ మాటలు

*