వెన్నెలదారుల్లో మంచుపూలవాన…

 

-అరణ్య కృష్ణ

~

 

కుప్పిలి పద్మ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు.  ఆమె జగమెరిగిన స్త్రీవాద రచయిత్రి.  స్త్రీవాద దృక్పధంతో దాదాపు గత 20 సంవత్సరాలుగా ఎంతో క్రియాశీలకంగా రచనలు చేస్తున్నారు.  కథ, నవల, పత్రికా కాలం, ప్రేమలేఖలు, మ్యూజింగ్స్….ఇలా అన్ని రకాల రూపాల్లోనూ స్త్రీవాద భావజాలన్ని బలంగా వినిపిస్తున్నారు.  అయితే ఏదో స్త్రీ స్వేచ్చ గురించి ఉపరితల స్పర్శతో వాపోవటంగా కాక మారుతున్న వ్యవస్థ మూలాల్లోకి వెళ్ళి, అక్కడ వస్తున్న మార్పులు వ్యక్తుల మీద, తద్వారా మానవసంబంధాల మీద, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల మీద చూపుతున్న ప్రభావాన్ని ఒడిసి పట్టుకోవటం, ప్రతికూల ప్రభావాల్ని తన స్త్రీ పాత్రలు అవగతం చేసుకొని తెలివిగా, ధైర్యంగా ఎదుర్కొనే విధానాన్ని సూచించటం కూడా ఆమె రచనల్లో కనిపిస్తుంది.

పద్మ మొత్తం ఆరు కథా సంకలనాలు వెలువరించారు.  ఒక్కో కథా సంకలనం లో స్త్రీలకి సంబంధించిన ఒక్కో అంశం బాటం లైన్  గా ఉంటుంది.

ఒక స్త్రీవాదిగా కుప్పిలి పద్మ తన కథల్లో సమాజాన్ని అవగతం చేయటమే ముఖ్యంగా కనిపిస్తుంది.  అస్తిత్వవాద సాహిత్యకారులందరిలాగే ఆమె ఏ సిద్ధాంత రాజకీయ దృక్పథానికి కట్టుబడినట్లు కనబడరు.  స్త్రీల అస్తిత్వం చుట్టూ మానవసంబంధాల్లో జరిగే రాజకీయాల్ని గొప్పగా పట్టుకున్నప్పటికీ ఎక్కడా వర్తమాన రాజకీయాల ప్రస్తావన వుండదు.  బహుశ ఈ విధానం వలన ఇంకా ఎక్కువమందికి తను రీచ్ అయ్యే అవకాశం వుండొచ్చని ఆమె భావన అయ్యుండొచ్చు.

ఆమె ఎంచుకున్న వస్తువుకి సంబంధించిన పాత్రల నివాస వాతావరణం, ఆహారం, వస్త్రధారణ, భాష….అన్నింటిమీద ఆమెకున్న మంచి పట్టు కనబడుతుంది.  అది హోటల్ కావొచ్చు లేదా ఇల్లు కావొచ్చు లేదా ఆఫీస్ కావొచ్చు…తన పాత్రలు సంచరించే, తన పాత్రల్ని ప్రభావితం చేసే వాతావరణాన్ని చాలా పకడ్బందీగా మన కళ్ళముందుంచగలరామె.  ఆమె తనకు తెలియని వ్యక్తుల జీవితం గురించి, వాతావరణం గురించి ఎప్పుడూ రాయలేదు.  ఇది కథకి ఎంతో బలాన్నిచ్చే అంశం.  ఆమె ప్రధానంగా అర్బన్ రచయిత్రి.   మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి, అక్కడక్కడా ఉన్నత వర్గాల స్త్రీలే ఆమె కథానాయికలు.

ఇప్పటి సమాజంలో స్త్రీ ఒంటరి అయినా, వివాహిత అయినా సమస్యలు మాత్రం తప్పవు.  ఒంటరి స్త్రీలకు వారి కష్టాలు వారికుంటాయి.  చుట్టు పక్కల వారి మోరల్ పోలీసింగ్ పెద్ద సమస్య.  సింగిల్ వుమన్ అనగానే చుట్టుపక్కల వారికి అత్యంత సహజంగా చులకన భావం కలగటమో లేదా మోరల్ పోలీసింగ్ చేయటమో లేదా వ్యక్తిగత విషయాల్లోకి తలదూర్చి పెత్తనం చేయటమో జరుగుతుంది.  స్వంత కుటుంబ సభ్యులైతే ఆమె సంపాదన మీద, కదలికల మీద, స్వేచ్చా భావనల మీద పెత్తనం చేస్తారు.  శ్రేయోభిలాషుల రూపంలో అధికారం చెలాయిస్తుంటారు.

ఈ సింగిల్ వుమన్ యాతనలన్నీ మనకు “ముక్త” (1997) సంకలనంలో  ఎక్కువగా కనబడతాయి.  ఈ కథల్లోని కథానాయికలు ఇన్నాళ్ళూ స్త్రీల మనశ్శరీరాల మీద అమలవున్న భావజాలాల్ని నిక్కచ్చిగా ప్రశ్నిస్తారు.  “ముక్త” కథలో వర్కింగ్ వుమన్ అయినా     ముక్త తన కుటుంబసభ్యుల చక్రబంధం నుండి విముక్తమయ్యే తీరే కథాంశం. ఇంక “కేసు” అన్న కథలో ఒంటరి స్త్రీని ఒక “కేసు”గా చూసే అనైతిక నైబర్స్ యొక్క విశృంఖల నైతిక పెత్తనం కనబడుతుంది.  “గోడ” కథ స్త్రీలు తమ శరీరాలపై తామెందుకు అధికారం కలిగి ఉండాలనే విషయంపై పద్మగారి సునిశిత అవగాహన, విశ్లేషణ తెలియచెప్పే కథ.  పురుషుడి పట్ల ప్రేమని, మోహాన్ని అధిగమీంచేంత నియంత్రణ ఆడవారికి తమ శరీరాలపై ఎందుకుండాలనే విషయాన్ని ఎంతో ప్రభావవంతంగా చెప్పిన కథ.  ఒక లిబరేటెడ్ వుమన్ అయినంత మాత్రాన స్త్రీలెందుకు ఆచితూచి సంబంధాలేర్పరుచుకోవాలో తెలియచెప్పే కథ.  “నిర్ణయం” కథలో స్త్రీ తను తల్లి అవ్వాలా వద్దా అన్న విషయంలో నిర్ణయం స్త్రీకే వుండాలని బలంగా చెప్పిన కథ.   సూటిపోటి మాటలతో ఎటువంటి సంకోచం లేకుండా దాడి చేసే మొగుళ్ళు,  కొంతవరకు ప్రోగ్రెసివ్ ఆలోచనలతో ముందుకొచ్చిన పురుషుల్లోనూ కీలకమైన సమయాల్లో స్త్రీకి మద్దతుగా నిలవలేని తనం, వారి దృష్ఠిలో స్త్రీ-పురుష సంబంధాల్లో అస్తిత్వ గౌరవం కంటే శారీరిక సంబంధమే ప్రధానంగా మిగిలిపోవటమే బాధ కలిగించే విషయంగా “నిర్ణయం, గోడ” వంటి కథలు చెబుతాయి.  “విడీఅరెల్” అన్న కథలో పెళ్ళైన యువతి గైనిక్ సమస్య ఎదురైనప్పుడు చెప్పుకోలేనితనం, ఎవరూ బాధని అర్ధం చేసుకోకుండా ఏకాకిని చేయటం కథాంశం.  అత్యంత సహజమైన శారీరిక సమస్యల్నెదుర్కోవటంలోని ఏకాకితనపు దుర్భరతనాన్ని విశదంగా చిత్రించిన కథ అది.

“మసిగుడ్డ” కథ స్త్రీ సంసార నిర్వహణలో ఎంత బాధ్యతాయుతంగా వున్నప్పటికీ , ఆమెకు దక్కే అప్రాధాన్య గుర్తింపుని ఎత్తిచూపుతుంది.  పిల్లలు పైకొస్తే “నా పిల్లలు” అని గర్వంగా చెప్పుకునే భర్త అదే పిల్లలు తప్పటడుగు లేస్టెనో లేదా వెనకబడిపోతేనో “ఏం చేస్తున్నావ్ అసలు? నీ పెంపకం అలా ఏడిసింది” అంటూ భార్యని నిష్ఠూరమాడతాడు.  వంటగది తుడుచుకోవటానికి ఉపయోగించే మసిగుడ్డ లాంటి అస్తిత్వాన్ని మోసే స్త్రీల ఆవేదన ఈ కథలో ప్రస్ఫుటంగా కనబడి మనల్ని విచలితుల్ని చేస్తుంది.  “ఆడిపాడిన ఇల్లు” ఒక వైవిధ్య కథాంశం.  తను ఆడిపాడి పెనవేసుకుపోయిన ఇంటికి సంబంధించిన నోస్టాల్జియా ఈ కథాంశం.  శిధిలమైన ఆ ఇల్లు తిరిగి కొనుక్కునే అవకాశం వచ్చినా వసుధ వద్దనుకుంటుంది.  శిధిలమైపోయిన ఇంటిని చదును చేసి ఓ మూడంతస్తుల ఇల్లు కట్టొచ్చు కానీ  ఆ నాటి ఇల్లవదుగా? “ ఆ నాటి బాల్యస్మృతుల ఆనవాలు లేని ఆ ఇల్లెందుకు? వద్దు” అనుకుంటుంది.  ఇలాంటి సున్నిత భావుక ప్రధానమైన అంశంతో కూడిన కథ కూడా ఈ సంకలనంలో వుండటం విశేషమే.

“సాలభంజిక” (2001) కథా సంకలనంలోని కథలు విశ్వవ్యాపితమై, మూడో ప్రపంచపు మానవసంబంధాలను అతలాకుతలం చేస్తున్న గ్లోబలైజేషన్ మీద రాసినవే.  గ్లోబలైజేషన్ని వ్యతిరేకించే మేధావులు సైద్ధాంతికంగా, ఆర్ధికాంశంగా దాన్ని వ్యతిరేకిస్తే రచయితలు అవి సామాన్యుల జీవితాల్ని అల్లకల్లోలం చేసే తీరుని ఒడిసిపట్టుకోవాల్సి వుంది.  పద్మ గారు ఈ బాధ్యతని గొప్పగా నిర్వహించారు.  “ఇన్ స్టెంట్ లైఫ్” కథలో చిన్న చేపని పెద్ద చేప చందంగా పెట్టుబడి బలంతో ఇడ్లీబండీ ని ఒక ఆధునిక ఈటింగ్ జాయింట్ మింగితే,  దాన్ని మరో స్టార్ హోటల్ మింగుతున్న క్రమానికి సమాంతరంగా కథానాయకి మునీరా జీవితంలో వచ్చిన మార్పులను అనుసంధానిస్తూ చెప్పిన తీరు విస్మయం కలిగిస్తుంది.  ప్రపంచీకరణ బాంకుల దగ్గర ఆగిపోకుండా పడగ్గదుల్లోకి చొచ్చుకొచ్చిన వైనాన్ని చెప్పిన కథ ఇది.  మనిషిని మనిషి అర్ధం చేసుకోవటానికి కార్పొరేట్ ప్రపంచానుకూల వ్యక్తిత్వ వికాస తరగతులు అనివార్యమైన విషాద సందర్భంలో రాసిన కథ ఇది.

“ప్రకంపనం” కథ కార్పొరేట్ రంగం అన్ని సామాజిక పార్శ్వాలకూ వ్యూహాత్మకంగా విస్తరించి వృత్తులను, బతుకు తెరువును పెట్టుబడితో కొల్లగొట్టి, బతుకుల్ని లొంగతీసుకునే క్రమాన్ని, ఈ లొంగుబాటు ఫలితంగా మనుషుల అంతరాత్మల్లోనూ, జీవనశైలుల్లోనూ వచ్చిన మార్పులవల్ల కంపేటిబిలిటీ చెడిపోయి అగాధాలు ఏర్పడిన తీరుని వెల్లడించిన కథ.  ఈ కథలో కార్పొరేట్ వ్యూహాల్ని కూడా సమర్ధవంతంగా చెప్పటం జరిగింది.  ఆర్ధిక పశుబలంతో వస్తువులను మార్కెట్లో తక్కువకు సప్లై చేసి, తద్వారా దేశీయ పెట్టుబడిదారులకు నష్టం కలిగించి, వారు తమ కర్మాగారాలను తమకే అమ్మేసే పరిస్తితి కలిపించి, టేకోవర్ చేసుకున్నాక, పోటీ ఉత్పత్తిదారుడు లేని పరిస్తితుల్లో ఉత్పత్తుల ధరల్ని పెంచేసే కార్పొరేట్ మాయాజాలాన్ని తేటతెల్లం చేసిన కథ ఇది.

“సాలభంజిక” కథ కార్పొరేట్ వ్యాపారం ప్రవేశపెట్టిన ఎస్కార్ట్ విధానం (విదేశీయులు భారత్ వచ్చినప్పుడు వారికి “తోడు”గా వుంటూ ఉల్లాసం కలిగించటం) ఊబిలోకి అమ్మాయిలు ఎలా జారిపడతారో, ఫలితంగా వారి మానసిక, శారీరిక ఆరోగ్యాలు సంక్షోభంలోకి ఎలా వెళ్ళిపోతాయో చెప్పే కథ.  అమ్మాయిల దయనీయ కుటుంబ పరిస్తితులు, భావోద్వేగాల బలహీనతల్ను స్వార్ధపరులు ఎలా ఉపయోగించుకుంటారో చెప్పే కథ ఇది.  ఈ కథ చదివాక మనసు కకావికలమై పోతుంది.   “కుబుసం” కథ కుటుంబ సంబంధాల్లో సరసరా సంచరిస్తూన్న కార్పొరేట్ పాము కక్కే విషం మీద కథ.  లాభార్జనే ధ్యేయంగా మసలే కార్పొరేట్ సంస్కృతికి అనుకూలంగా కుటుంబసంబంధాల్ని పునర్నిర్వచించే యంత్రాంగాన్ని బట్టబయలు చేసే కథ.  కుటుంబం దగ్గరుంటే, సహచరి పక్కనుంటే ఎటువంటి టెన్షన్ లేకుండా ఉద్యోగులు పనిచేస్తారనే కార్పొరేట్ లాభాపేక్ష ఒక కుటుంబంలో పెట్టిన చిచ్చు ఈ కథాంశం.

“మంచుపూల వాన” (2008) సంకలనం లోని కథలు ప్రేమ, కుటుంబం, దాంపత్యం వంటి విషయాల్లో స్త్రీల భావోద్వేగాలకు సంబంధించిన కథలు.  ప్రధానంగా స్త్రీలు ఎదుర్కొనే ఎమోషనల్ వయోలెన్స్ గురించి రాసిన కథలు.  “వర్షపు జల్లులలో” కథ సాధారణంగా అబ్బాయిలకు అమ్మాయిల పట్ల ఉండే ఆకర్షణ, అమ్మాయిలకు అబ్బాయిల పట్ల కలిగే భావోద్వేగ స్పందనలతో డీల్ చేసిన కథ.  ఇందులో కథానాయకి మహి తల్లి దెబ్బతిన్న కూతురికి చెప్పే మాటలు చాలా బాగుంటాయి “కొన్ని సార్లు గాయపడటం అనివార్యం. అవసరం. ఒక కొత్త జీవితం అందులోంచే చిగురిస్తుంది.”  “మంచుపూల వాన” కథ పెళ్ళికి ముందున్న విలువలు మర్చిపోయి డబ్బు మనిషిగా తయారైన భర్త నుండి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ని ఎదుర్కొని అతని నుండి బైటపడ్డ మేఘ కథ.  రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇచ్చే ఇన్స్టెంట్ లాభం మనుషుల్ని ఎంతగా పతనం చేస్తుందో చెప్పే కథ ఇది.   “చలెగచలెగా యే ఇష్క్ కా జమానా” కథ కొంత హిలేరియస్ గా సాగుతుంది. ఈ సంకలనంలో ఇదో భిన్నమైన కథ.  తన గర్ల్ ఫ్రెండ్ ప్రేమని పొందటం కోసం ఆమె సామాజిక బాధ్యతగా ఫీలయ్యే విషయాల్లో పాలు పంచుకొనే కుర్రాడి అవస్థ భలేగా అనిపిస్తుంది.  “మంత్రనగరి సరిహద్దులలో” కథ  మంత్రముగ్దంగా సాగే కథ.  ఈ కథలో భావోద్వేగాల హింస కనబడదు కానీ ప్రేమ పట్ల స్త్రీ భావోద్వేగాల ఫోర్స్ కనబడుతుంది.  హృద్యమైన మోహప్రపంచం గురించి పద్మగారి భావుకత పరవళ్ళు తొక్కిన కథనం వున్నదిందులో.   ఒక ఆత్మగౌరవంగల స్త్రీ తనంత తానుగా మోహపడాలంటే  పురుషుడిలో ఎటువంటి ప్రవర్తన వుండాలో సూచించే కథ ఇది.

“వాన చెప్పిన రహస్యం” ఒక వైవిధ్యపూరితమైన కథనంతో సాగుతుంది.  తనని ప్రేమించలేదని క్లాస్ మేట్ మీద కత్తితో దాడి చేసిన యువకుడికి తనకు తెలియకుండానే, అనుకోకుండా ఆశ్రయమిచ్చిన అమ్మాయి కథ ఇది. ప్రేమ గురించి, ప్రేమైక అనుభవం గురించి తనకు ఆశ్రయమిచ్చిన ఆ అమ్మాయి ఆలోచనలతో ఇంటరాక్ట్ అయిన కుర్రాడి పరోక్ష కథ ఇది. “సెకండ్ హజ్బెండ్” కథలో భర్త చనిపోయాక రెండో వివాహం చేసుకున్న యువతి యాతన కథాంశం.  ఆ రెండో భర్త ఇంట్లో తన మొదటి భార్య పటం పెట్టుకోగలడు.  ఆమె పుట్టినరోజుని ఘనంగా చేయగలడు. అందుకు అందరూ అతన్ని ఎంతో మెచ్చుకుంటారు కూడా.  కానీ తన రెండో భార్య తన దివంగత భర్త ఫోటోని అతని వర్ధంతి రోజున బైటకి తీస్తే తట్టుకోలేక పోతాడు.  అతని తల్లి కూడా అభ్యంతర పెడుతుంది.  అతను తన కోపాన్ని లైంగిక హింసలో చల్లార్చుకుంటాడు.  ఇటువంటి పడగ్గది హింసని విచారించే ఏ న్యాయ వేదికలూ ఉండవు.  మంచాల మీది నేరాలు ఏ చట్ట పరిధిలోకీ రావు.  అయితే ఈ కథలన్నింటిలోనూ ముఖ్య పాత్ర సమాజాన్ని, అందులో భాగమైన తననీ అర్ధం చేసుకుంటుంది.  ఎలా నిలబడాలో తెలుసుకుంటుంది.

“ద లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్” కథ దర్శన, విహాస్ ల మధ్య వుండీ లేనట్లుగా దోబూచులాడే ప్రేమ భావన కథాంశం. వారి మధ్య ప్రేమ అసత్యం కాదు.  కానీ అది సజీవమూ కాదు.  బతకాలంటే ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా మరొకరికి లొంగాలి, అబద్ధాలు చెప్పాలి.  ఇంకెక్కడి అమాయకత్వం, స్వచ్చత?  “నా స్నేహితురాలి పేరు సుధీర” కూడా క్విక్ మనీ, ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ల క్యాట్ రేస్ లో తనని, తన మనసుని, ఆ మనసులోని సున్నితత్వాన్ని మర్చిపోయి, చివరికి జీవితంలో చతికిల బడ్డ స్నేహితుణ్ని అక్కున చేర్చుకొని “ఇది మన జనరేషన్ క్రైసిస్.  ఇది గ్లోబల్ ఎకానమీ సృష్ఠించే వికృతం” అని ఓదార్చిన సుధీర కథ.   పెళ్ళి చేసుకుంటే తనకొక ఇల్లు ఏర్పడటం కాకుండా తను పెళ్ళి చేసుకున్న వాడింటికి తను వెళ్ళటమనే పరిస్తితి మీద తెలివిగా తిరుగబాటు చేసిన గ్రీష్మ కథ “ఫ్రంట్ సీట్”.

స్త్రీ శరీరాన్ని సరొగసీ రూపంలో సరికొత్త పద్ధతిలో వెలగట్టి వాడుకునే ప్రపంచీకరణ విశృఖలత్వం “మదర్ హుడ్ @ రియాలిటీ చెక్” కథలో కనబడుతుంది.  ఈ కథ ఒక ప్రత్యేక కథనంతో పరుగులు పెడుతుంది.  అద్దె గర్భం చుట్టూ వ్యాపారం చేసే వికృతస్వభావాలు బట్టబయలు చేస్తారు రచయిత్రి.  “హ్యుమన్ టచ్” ఎలిమెంటుతో ఎక్కువ టి.ఆర్.పి.ల కోసం లేని మెలోడ్రామా కోసం ప్రయత్నం చేసే చానెళ్ళ వాళ్ళు, ఎక్కడికక్కడ దండుకునే మధ్యవర్తులు, వచ్చిన సొమ్ముని దోచుకునే కుటుంబసభ్యులు అంతా స్త్రీ గర్భం మీద ఆధారపడే వాళ్ళే. చాలా కదిలించే కథ ఇది.  “గాల్లో తేలినట్లుందే” కథ యువత ఎలా పెడదారి పడతారో, వారు అలా పెడదారి పట్టడాన్ని ప్రోత్సహించే వ్యాపార సంస్కృతి ఏమిటో తెలియచెప్పే కథ.  “మౌన” కథ చాలా భిన్నమైన కథ.   ఇద్దరు స్త్రీల మధ్య పుట్టిన అనురాగం శారీరిక అనుబంధంగా ఎదిగిన తరువాత ఏర్పడిన కల్లోలాన్ని వివరించే కథ.  ఎన్.వేణుగోపాల్ ఈ సంకలనానికి ముందు మాటలో రాసినట్లు “ఈ కొత్త తరం అమాయకత్వం కోల్పోవటాన్ని నిజానికి చాలా రంగాల్లో, కోణాల్లో, స్థాయిల్లో అర్ధం చెసుకోవలసి ఉంది. అది సంఘ్ పరివార్, ఖాఫ్ పంచాయితీలు చూస్తున్న ఏకైక, సంకుచిత, పురుషాధిపత్య అర్ధంలో మాత్రమే  జరగడం లేదు. సంక్లిష్ట, అసాధారణ రూపాల్లో జరుగుతున్నది”.  ఆ అసాధారణ, సంక్లిష్ట రూపాలన్నింటినీ తన కథల్లో పద్మ గారు ప్రస్ఫుటంగానే చూపించారు.

ఆమె కథలన్నీ వర్ష బిందువులు, చిరుజల్లులు, పున్నాగపూలు, మంచు ముత్యాలు, తుషారాలతో నిండి వుంటాయి.  ఒక్కోసారి కథలో ప్రవేశించటానికి ఈ ప్రకృతి మోహం కొన్ని ఆటంకాల్ని కలుగచేస్తుంది కూడా.  ఇంక పాత్రల పేర్లైతే గ్రీష్మ, ధాన్య, దక్షిణ, సుధీర, దర్శన వంటి అందమైన పేర్లతో అలరారుతుంటాయి.  జీవితం ఎంత బీభత్సంగా ఉన్నా సరే,  మొత్తానికి పాత్రలన్నీ జీవితంతో ఘర్షణ పడుతుంటాయి.  మర్రిచెట్లు కూలుతున్న నేపధ్యంలో అవి లొంగిపోకుండా తుఫాను గాలికెదురొడ్డి నిలబడ్డ చిన్న మొక్కల్లా తమని బతికించుకుంటాయి.  అందుకే ఈ కథలు చదివాక జీవితం మీద ధైర్యం, ఆత్మ విశ్వాసం కలిగించే అవకాశం వుంది.  పద్మగారి కథల్లో అమ్మ పాత్రకి చాలా విలువుంది. చాలా కథల్లఉజ జీవితాన్ని అర్ధం చేసుకోవటంలో అమ్మ చాలా దోహదం చేస్తుంది.  అమ్మ అంటే ఒక గొప్ప సపోర్ట్ అనే భావన బలంగా కలుగుతుంది.

సమాజం మీద, జీవితం మీద అపారమైన అవగాహన, నమ్మకం మాత్రమే కాక ప్రేమని కూడా కలిగివున్న కుప్పిలి పద్మ ఇప్పటికే తనదైన సంతకం చేసారు.  ఆమె నుండి మరిన్ని మాస్టర్ పీసెస్ ఆశిస్తూ…

peepal-leaves-2013

మీ మాటలు

 1. kurmanath says:

  పద్మ సీరియస్ రచయిత్రి. ఎప్పుడూ గేప్ రాకుండా కన్విక్షన్ తో తను చూసిన దాన్ని అక్షరబద్ధం చేస్తుంది.

 2. THIRUPALU says:

  సమీక్ష. చాలా బాగుంది. అయితే నాది ఒక సందేహం. అస్తిత్వ వాద రచయిత లకు ఏ సిద్దాంతాలు లేకండా ప్రాపంచిక ద్ృకపదం ఎలా ఏర్పడుతుంది? ఒక వేళ ఏర్పడి నా సమాజ. గమనాన్ని ఏ వెలుగులో అర్థం చేసుకుంటుంది?

 3. Dr.Mahendra Kumar says:

  కాంటెంపరరీ ఇశ్శ్యూస్ ని వెంటనే ప్రెజెంట్ చేసి ఆ ఇశ్శ్యూ పట్ల ఆర్ధ్రమైన సమగ్ర అవగాహన కల్పించడంలో పద్మ గారి నిబద్దత కొనియాడదగినది.

 4. chandolu chandrasekhar says:

  tirupalu , గారు సామాజిక సంబదాల నుండి ఎవరు తప్పించు కాలేరు. ఎవాదమైన మానవ సంభాదల నుండే వస్తాయి .అందుకే chetan sarma రచనలు అన్ని iit కాలేజీ ల నేపధ్యంలో సాగుతాయి .జీవితం నుండి తప్పిచు కాలేరు

 5. THIRUPALU says:

  //సామాజిక సంభందాల నుండి ఎవరు తప్పించు కోలేరు// నిజమే ! కానీ ఆ సామాజిక సంబందాల్ని అందరు ఒకే రీతిలో అర్ధం చేసు కోరు కదా. ఎవరి చైతన్యాన్ని ( ఇక్కడ చైతన్య మంటున్నది దృక్పధమ్ ) బట్టి వారి జీవిత అవగాహణ ఉంటుంది. దీన్నే తాత్విక దృక్పధమంటున్నాము.

  //అస్తిత్వవాద సాహిత్యకారులందరిలాగే ఆమె ఏ సిద్ధాంత రాజకీయ దృక్పథానికి కట్టుబడినట్లు కనబడరు. స్త్రీల అస్తిత్వం చుట్టూ మానవసంబంధాల్లో జరిగే రాజకీయాల్ని గొప్పగా పట్టుకున్నప్పటికీ ఎక్కడా వర్తమాన రాజకీయాల ప్రస్తావన వుండదు.//
  కట్టబడి లేక పోతె ఇంత సృజనాత్మక రచనలు చేయలేరని నా అభి ప్రాయం.

 6. THIRUPALU says:

  కట్టబడి లేక పోతె ఇంత సృజనాత్మక రచనలు చేయలేరని నా అభి ప్రాయం. సారీ! నా అభి ప్రాయాన్ని సవరించు కుంటున్నాను.

 7. చాలా రాశారు. అయితే “స్త్రీ వాదం ” అంటే ఏమిటి ? ఎందుకు? తెలియచెయ్యగలరు . క్రియాశీలకంగా అంటే ఏమిటి ? మొత్తంగా ఈవిడ కథల ప్రయోజనం ఏమిటి ? దయచేసి తెలియ చెయ్య గలరు . తీసి పారేయ్యవద్దు . కథలు ఎందుకు రాయాలి ? ఎందుకు చదవాలి ? సుక సప్తతి కథలైనా , విప్లవ కథలైనా సరే . ఎందుకు ? తెలియ చెయ్యండి ప్లీజ్ . ది లాస్ …. ఏమి వున్నది ? ఆ ఒక్క కథ గురించి దయ చేసి విపులంగా రాయగలరు

  • ఎవరూ వ్యాసం యొక్క లోతును ప్రశ్నించక పొతే ఆవ్యాస రచయత లోతుగా వ్రాసినట్టే.. నీలాగా లోతు గురించి ప్రశ్నిస్తే దానిని పరిశోధించే బాధ్యతా నీదే అవుతుంది.

 8. Aranya Krishna says:

  తిరుపాల్ గారూ! అస్తిత్వ వాదం అణచివేతకు, వివక్షకు, హింసకు గురైన ప్రాంతీయ లేదా ప్రజాసమూహాలకు సంబంధించి వ్యవస్థ లోపాల్ని ఎత్తిచూపుతుంది. సైద్ధాంతిక దృక్పథం లేదా రాజకీయ వ్యూహం పరిష్కారానికి సంబంధించినది. అది వారు క్లెయిం చేసుకోవచ్చు లేదా చేసుకోక పోవచ్చు. ఇక్కడ పద్మగారి విషయంలోనే కాదు ప్రతిభావంతులైన ఏ అస్తిత్వ వాద రచయితైనా ఎరుకతో కానీ లేదా ఎరుక లేకుండా కానీ “కార్య కారణ సంబంధం” అనే మార్క్సిస్ట్ టూల్ వాడతారు. అది సమాజాన్ని, సమస్యని అవగతం చేసుకునే విధానం. అది చెప్పటానికి ఏ సైద్ధాంతిక నిబద్ధతనో లేదా రాజకీయ వ్యూహాన్నో వెల్లడి చేయాల్సిన అవసరం లేదు. మీ స్పందనకు ధన్యవాదాలు.

 9. Aranya Krishna says:

  చిత్ర గారూ! నేను చేసినది కేవలం పరామర్శ లేదా పరిచయం మాత్రమే. స్త్రీవాదం గురించి, అసలు కథల ప్రయోజనానికి సంబంధించి మీకు మౌలికమైన సందేహాలుంటే నేను తీర్చను. అది నా పని కాదు. మీరే స్వయంగా పరిశోధించి తృప్తి పడితే బాగుంటుంది. క్రియాశీలకంగా అంటే యాక్టీవ్ గా రాయటమే అని తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువాదం చేసి చెప్పాల్సి రావటం మన దుర్గతిని తెలియచేస్తుంది కదూ!

 10. chandolu chandrasekhar says:

  చిత్ర గారు feminism అంటే స్త్రీని కేంద్రంగా చేసుకొనే వాదమే feminism .. మనిషి సామూహికత నుండి విడివడి వ్య క్తి గా స్తిరపడే క్రమం లో వాదాలు తలెత్తుతాయి .కొంతమంది ని కొంతమంది పాలించే వారికీ శాసనాలు ,మతగ్రంధాలు .సాహిత్యం ప్రచారం చేస్తుంది .అదే వారికి తలనొప్పిగా మారుతుంది .ఆధునిక సమాజాలు ఏర్పాటు అవుతాయి , వీటికి మూలమ్ సామాజిక ఉద్యమాలే కారణం .వీటివల్ల స్త్రిలుగాని ,పురుషులు గాని భాహుముకంగా ఎదుగుతారు .ఏ వరో అన్నట్టు ‘man is bridge of between animal and budha ..బుద్ధా స్తానంలో stories .అని పెడితే బావుంటుంది .జంతువు నుండి మనిషి ని వేరు చేసేవి అవే .కథలు చీకటి దారుల్లో వెలుగు దీవిటిలు.మన దేశం విబ్బిన్న సంస్క్రతుల సంగమం .feminism యూ రో పియాన్ నుండి దిగుమతి అయిన భావజాలం .ఇక్కడ మధ్య తరగతి వాళ్ళని బాగా ప్రభావితం చేసింది .బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ మద్య తరగతిని తయారు జేసారు చలం నుండి కుప్పిలి పద్మ వరకు విరే .వీళ్ళు విప్లవవాదులు గ కనిపించే కార్పోరేట్ భావవాదులు .ఈ దేశం లో సగం మంది శ్రామిక జీవుల రెక్కల కష్టం ఫలితంగా చదువు కున్న స్త్రీ మద్య తరగతి ఏర్పడి వాకి ఒక వాదాన్ని తయారు చేసుకున్నారు ,ఇంక చాల వుంది ఈ పూ టకి ఇది chaalu

  • Aranya Krishna says:

   కార్పొరేట్ భావవాదం అంటే? కార్పొరేట్ రంగంలో పనిచేసే మధ్యతరగతి వారందరూ కార్పొరేట్ మనుషులేనా? చివరికి చలం కూడా? ఆయన యాక్టివ్ గా రాసే సమయంలో అసలు కార్పొరేట్ సంస్కృతే లేదుగా? అసలు కార్పొరేట్ అంటే ఏమిటనుకుంటున్నారు? ఏమిటో గందరగోళం!

 11. chandolu chandrasekhar says:

  తిరుపాలు గారు ,వ్యకి చైతన్యం అంటూ వుండదు .వర్గ చైతనయం మాత్రమె వుంటుంది దేవుడు లేడనే వారు చాలామంది వుంటారు వున్నాడు అనేవారు అంతే. ఒకరి కోసం ఎ వాదం వుండదు ఐతే అది ప్రగతిశీల మైనదా ? కాదా?అనేదే . ముక్యం .కాకపొతే కొతమంది ముసుగు లో సిదాంతం చెపుతారు సైన్స్ అడిగే ప్రశ్నలకి మతం జావాబు లేక సైన్స్ ని అరువు తెచ్చు కుంటువుంది .దాన్ని నేను ఎప్పుడో కనిపెంటాను అని చెపుతుంది , అది ఏది కనిపెట్టా దు .తప్పు ఎక్కడ ఆంటే సమాజాన్ని విరు అతడు వీడు, అది ,ఆమె వ్యక్తుల సమాహరమని అనుకోవడం .వీరంతా శ్రమ చేయడం ద్వారా జీవిస్తారని వారు కూలిగానో గుమాస్తా గానో ఏదో ఒక వృతి తో ఒకరి తో ఒకరు సంబధం కలిగి వుంటారని వాటినే మానవ సంబధాలు అంటారని ఉత్పతి సంబదాలే మానవ సంబధాలని తెలుసుకోరు తెలుసుకుంటే ఎ సిద్ధాంత మైన అర్ద మౌతుంది .

 12. chandolu chandrasekhar says:

  క్రిష్న గారు మీరు విరసం లో వున్నారనుకుంట నేను చలం నుండి కుప్పిల పద్మ గారి వరకు అనాను .బ్రిటిష్ మద్య తరగతి నుండి corporate మద్య తరగతి వరకు మీకు కార్పొరేట్ అర్దం కాకపొతే కుప్పిలి పద్మ గారు తన రచనలలో కార్పొరేట్ అనాయ్యలు ఎండా గట్టింది అని ఎలా అంటారు ..నేను చెప్పింది feminism గురించి .అసలు వాదాన్ని వదలి కార్పొరేట్ ని పట్టుకుంటే ఎలా ,నేను చెప్పింది బ్రిటిష్ వాడి దాక గురించి వాడు వెళ్ళేక వచ్చిన కార్పొరేట్ శక్తుల గురించి chetan bhagat రచనలు చదివితే వాటి ప్రభావం బాగా అవగత మౌతా ఇ .ఇక మీరు తిరుపాలు గారికి ఇచిన జవాబు సరిగా లేదు అస్తిత్వ వాదం గురించి jean -paul sartre .ఈయన సామాజిక కోణం నుండి సిద్దాంతం చెప్పేడు .dr కేశవ రెడ్డి గారి రచన లలో ఈ వాదం ప్రతిఫలి స్తుంది . కాని హిమ జ్వాల , అనుక్షణికం ,నవల లలో జీవుని వేదన ,సామజాన్ని అర్దం చేసుకోలేక ,చీకటి కూడా భలేగా వుంటుంది , ఇది సమాజానికి హాని చేసే ధోరణి .ముందు నన్ను అర్దం చేసుకోండి .నేను గతితార్కిక వాదిని .అప్పుడే నావాదం లో మాటలు అర్దం అవుతాయి

 13. క్రియాశీలకంగా అంటే ఏమిటి ?
  క్రియాశీలకంగా అంటే యాక్టీవ్ గా రాయటమే అని తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువాదం చేసి చెప్పాల్సి రావటం మన దుర్గతిని తెలియచేస్తుంది కదూ
  ఇప్పుడే చూసాను మీ సమాధానం. నా దుర్గతి అర్థం అయ్యింది వెయ్యి కి పైగా కథలు రాసిన వాళ్ళు ఉన్నారట తెలుగులో . అంతటి క్రియాసీలురని వదిలేసి పున్జీడు కథలు రాసిన మాస్టార్ని పట్టుకుని ఏడుస్తున్నాను . థాంక్స్
  సాగర్ నిజమే నాదే పొరపాటు . ఒప్పుకుంటున్నాను

మీ మాటలు

*