మూలస్వరం మూగపోకూడదు: గౌరి

 

     – వారణాసి నాగలక్ష్మి

~

 

varanasi nagalakshmi

ఈ సంవత్సరం అనువాదరంగంలో ఇద్దరు ప్రవాసులకి సాహిత్య అకాడెమీ పురస్కారాలు రావడం తెలుగువాళ్ళందరికీ సంతోషాన్నిచ్చింది. ఒకరు తెలంగాణలో పాతికేళ్లు పెరిగి చెన్నైకి తరలి వెళ్ళిన గౌరీకృపానందన్. మరొకరు కేరళలో పుట్టి పెరిగి ఆంధ్రలో స్థిర నివాసమేర్పరచుకున్న ఎల్ ఆర్ స్వామి.‘సూఫీ చెప్పిన కథ’ని తెలుగువారందరికీ చెప్పిన స్వామి గారికీ, ఓల్గా ‘విముక్త’ని ‘మీట్చీ’గా తమిళులకి పరిచయం చేసిన గౌరీ కృపానందన్ కీ,  తెలుగు రాష్ట్రాలు రెండిటికీ  సాహిత్య ఎకాడమీ పురస్కారాలు సంపాదించి పెట్టినందుకు మనం ధన్యవాదాలు తెలుపుకోవలసిందే.

‘జాటర్ ఢమాల్’ అంటే ఏమిటో ఆ పిల్లల భాషని అనువదించగల ముళ్ళపూడి పుణ్యమా అని మనకి తెలిసింది గాని లేకపోతే  బుడుగు మనకి అర్ధమయ్యేవాడే కాదు.   ఉత్తర భారతీయుల్లో బెంగాలీలు మనకి అర్ధమయినంతగా మిగిలిన వాళ్ళు అర్ధంకారంటే దానికి కారణం విస్తృతంగా మనకి చేరిన బెంగాలీ సాహిత్యమే. ఒక ప్రాంతాన్ని కూలంకషంగా అర్ధం చేసుకుందుకు దోహదం చేసేది అక్కడి సాహిత్యమే. ఒక ప్రాంత సాహిత్యం ఆ ప్రాంతానికే పరిమితమైపోకుండా నలుగురికీ అందుబాటులోకి తెచ్చే అనువాద ప్రక్రియ ప్రతిభావంతంగా సాగాలంటే మూల భాషా, లక్ష్య భాషా నేర్చుకుంటే సరిపోదు. ఆ ప్రాంతపు సామాన్య జనానీకంలో మమేకమై జీవిస్తే తప్ప ఆ అనువాదం సహజంగా పరిమళభరితంగా సాగదు.

ఇంట్లో తమిళం, గడప దాటగానే తెలుగు వాతావరణం..   గోదారి రెండు తీరాల మధ్య తిరుగాడే నావలా గౌరి  భాషాధ్యయనం ఆట పాటల మధ్య సాగింది. తెలంగాణలోని తెలుగు మీడియం పాఠశాలల్లో చదువుకుని, ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన  గౌరి, వివాహానంతరం చెన్నైకి తరలి వెళ్లినా, తెలుగుని తన మాతృ భాషగా భావిస్తూ, గత రెండు దశాబ్దాలుగా ‘చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు’ రుచిని తమిళ సోదరులకి  చవి చూపిస్తున్నారు.

కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం అందుకోబోతున్నందుకు హార్దికాభినందనలు గౌరీ! వార్త వినగానే ఎలా అనిపించింది? మీ కుటుంబ సభ్యుల స్పందన ఏమిటి?

మీ అభినందనలకి ధన్యవాదాలు. నిజంగా ఇది నా జీవితంలో మరిచిపోలేని తరుణం. ‘దినమణి’ దినపత్రికలో ఉన్న ఒక సాహితీ మిత్రులు  సమాచారం వచ్చిన వెంటనే అభినందనలు తెలియ చేస్తూ ఈ మెయిల్ పంపారు. మొదట అది నిజమేనా అని సందేహం కలిగింది. వెంటనే సాహిత్య అకాడమి వారి వెబ్ సైట్ కి వెళ్లి చూసినప్పుడు అందులో ప్రెస్ నోట్ కనబడింది. ఆ తరువాతే నమ్మకం కలిగింది. వెల్లువలా వచ్చే ఫోన్లు,  సందేశాల మధ్య మా వారు, కొడుకులు, కోడళ్ళు  అనుకోని ఈ శుభ వార్తకి ఎంతగానో సంతోషించారు.

unnamed

మీకు లభించిన ఇతర పురస్కారాల గురించి చెప్పండి.

‘లేఖిని’ సంస్థలో కామేశ్వరిగారి పురస్కారం, తిరుప్పూర్ లయన్స్ క్లబ్ వారి ‘శక్తి’ పురస్కారం అందుకున్నాను.

2014 లో కుప్పం ద్రావిడ  యూనివర్సిటీకి  అతిధిగావెళ్లాను.  అనువాదరంగంలో నా అనుభవాలు పంచుకున్నాను. అదే విశ్వవిద్యాలయంలో 2015 మార్చ్ లో జరిగిన పది రోజుల వర్క్ షాప్ లో అనువాదం లో ఉన్న సాధక బాధకాలు విద్యార్దులతో ముచ్చటించాను.

మీరు పుట్టిన కుటుంబ వాతావరణం, మీరు పెరిగిన పరిసరాలు ఎలాంటివి?

మాది మధ్య తరగతి కుటుంబం. మాతృభాష తమిళమే అయినా నాన్నగారి ఉద్యోగ రీత్యా ఆంధ్రప్రదేశ్ లో (ఇప్పటి తెలంగాణా) ఇరవై ఏళ్ల దాకా పెరిగాను. చదువు పూర్తిగా తెలుగు మీడియం లోనే సాగింది. (హైదరాబాద్, భువనగిరి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, వరంగల్) చిన్నప్పుడు స్కూల్ నించి ఇంటికి రాగానే అమ్మ పెట్టింది తిని వెంటనే ఆడుకోవడానికి బైటికి పరిగెత్తే వాళ్ళం. పిల్లలందరూ తెలుగులోనే మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పటిలా కాన్వెంటు చదువులూ, ఇంగ్లీషు లో మాట్లాడుకోవడాలు ఆ రోజుల్లో లేవు. చదువు గురించిన వత్తిడి, మార్కుల బెడద అప్పట్లో అంతగా లేవు. ఇప్పుడు ఎల్కేజీ  చదువుతున్న పిల్లలకి కూడా తలమీద కొండంత బరువు ఉంటోంది

ఈ మధ్య తెలుగు విశ్వ విద్యాలయంలో జరిగిన సాహితీ సదస్సులో దక్షిణాది భాషల మధ్య రావలసినంతగా అనువాదాలు రాలేదన్న భావన వ్యక్తమయింది. అందువల్ల ప్రాంతీయంగా సాంస్కృతికంగా ఎంతో సారూప్యతలున్నా ఒక భాషలోని సాహిత్యం గురించి మరో భాష వారికి పెద్దగా తెలియకుండా పోతోందన్న వాదనతో మీరు ఏకీభవిస్తారా?

ఇండియాలో ఉన్నన్ని భాషలు ఏ ఒక్క దేశం లోనూ లేవు. ప్రాంతీయంగా సారూప్యతలు ఉన్నా ఒక భాషలోని సాహిత్యం మరోభాష లోని వారికి అందకుండా పోతూ ఉంది అన్నవాదనని ఒక విధం గా ఒప్పుకున్నా, దానికి మూల కారణాలను అన్వేషించి, వాటిని పరిష్కరించే మార్గాలు చూడాలి. ఎలాంటి రచనలు ఇంకో భాషలోకి వెళ్ళాలి అన్న దాంట్లో ప్రామాణికం అంటూ ఏమీ లేకపోవడం, మంచి అనువాదకులు లేకపోవడం, అనువాదాలు చేసినా ఆ రచనలు ప్రచురణ కి నోచుకోక పోవడం ఇలాంటి అవరోధాలు ఎన్నో ఉన్నాయి. సాహిత్య అకాడమీ, నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు కొంతవరకు కృషి చేస్తున్నా పూర్తి స్థాయిని అందుకోలేక పోతున్నాయి.

అనువాద రంగంలోకి మీ ప్రవేశం ఎలా జరిగింది?

వివాహానంతరం చెన్నై వెళ్లాక తెలుగు పుస్తకాలు దొరక్క తమిళపుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. అలా ఒకసారి తెలుగు నించి అనువదించబడ్డ నవల చదవడం తటస్థించింది. ఆ అనువాదం ఎంత హీనంగా ఉందంటే కోపం పట్టలేక వెంటనే ఆ అనువాదకులకి ఉత్తరం రాశాను. అప్పుడు మీరే అనువాదం చేసి చూడ మన్న సవాలే జవాబుగా వచ్చింది. దాన్ని స్వీకరించి నా మొదటి అనువాద రచన మొదలుపెట్టాను.

ఆ రచన ఎవరిదో చెప్తారా?

యండమూరి వీరేంద్రనాథ్ గారిది. ఆయన రచనలని నేను 1995 లో చదవడం ప్రారంభించాను. అవి ఎంతగా నన్ను ప్రభావితం చేసాయంటే, పుస్తకం చేతిలోకి తీసుకోగానే గబ గబా చదివేయాలి అనిపిస్తుంది. మళ్ళీ అలా చదువుతూ ఉంటే త్వరగా ముగిసి పోతోందే అని బాధగానూ అనిపిస్తుంది. ఇలాంటి ద్వైదీ భావం నాకు అంతకు ముందు ఎవరి రచనల పట్లా కలగ లేదు. ఆయన వ్రాసిన “పందెం” అన్నకధను వారి అనుమతితో తమిళంలోకి అనువదించాను. అది ‘కుంకుమ చిమిళ్’ అన్న పత్రికలో ప్రచురితమయింది.

మీ వివాహం ఎప్పుడు జరిగింది? ఎవరితో? వివాహంతో మీ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది?

నా వివాహం 1976లో జరిగింది. మా అత్తయ్య కొడుకుతోనే. ఇరవై ఏళ్ల దాకా తెలంగాణా లో పెరిగిన నేను ఒక్క సారిగా చెన్నైకి రావడం తో నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. ముఖ్యంగా చదువుకోవడానికి తెలుగు పత్రికలు, నవలలు అందుబాటులో ఉండేవి కావు. అప్పుడే తమిళ పత్రికలు, నవలలు చదవడం ప్రారంబించాను. మాతృ భాష తమిళమే అయినా అప్పటి వరకు తమిళంలో చదవడం తక్కువ. ఉత్తరంముక్క కూడా తమిళంలో రాసింది లేదు. ఇప్పటి లాగా కంప్యూటర్లు, ఇంటర్ నెట్ అప్పుడు లేవు.

సాధారణంగా ప్రతి వ్యక్తి విజయం వెనుక ఆ వ్యక్తికి స్ఫూర్తినో, శక్తినో, సాధించాలన్న కసినో అందించే వ్యక్తి ఒకరుంటారు. మీ జీవితంలో ఆ వ్యక్తి ఎవరు?

ఇరవై ఏళ్ల దాకా పట్టుమని ఒక్క పేజీ కూడా తమిళం లో నేనురాసింది లేదు. అలాంటిదిడెబ్బై నవలల దాకా అనువాదం చేశాను. వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేనా అని ఒక్కో సారి ఆశ్చర్యం కలుగు తుంది. మన విజయాన్ని కుటుంబంలో అందరూ గుర్తిస్తే, ముఖ్యంగా జీవిత భాగస్వామి నుంచి ఆ గుర్తింపు దొరికితే ఆ సంతృప్తి వేరు. ఆ విషయంలో నేను అదృష్ట వంతురాలిని. మా వారికీ సాహిత్యంలో మంచి అభిరుచి ఉంది.”విముక్త” అనువాదం లో మా వారు కంటెంట్ ఎడిటింగ్ చేసారు.”విముక్త” కధలో భాష స్థాయి వేరు. ఆ స్థాయి అనువాదంలోనూ ఉండాలని సూచించారు.

మీ గురించి మీరు గర్వపడిన సందర్భం?

గర్వపడక పోయినా, ఒకసారి బెంగళూరులో నిడమర్తి ఉమా రాజేశ్వరరావుగారింట్లో జరిగిన సాహిత్య సమావేశానికి వెళ్ళినప్పుడు నేను ముందుగా వెళ్లాను. అప్పుడు ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఆయన “అవును అవును. ఐదు గంటలకే సమావేశం మొదలవుతుంది. చీఫ్ గెస్ట్ కూడా వచ్చేశారు” అని అన్నారు. అప్పుడు హాల్లో నేనూ ఆయన మాత్రమే ఉన్నాము. ఎవరినో చీఫ్ గెస్ట్ అంటున్నారు అని నా వెనక ఒకసారి తల తిప్పి చూశాను. ఒక్క క్షణం తరువాతే నేనే అని అర్ధం అయ్యాక కాస్త సిగ్గుగా అనిపించింది. అంతకు ముందు నెలలోనే కవనశర్మ గారి “విడాకులు” తమిళ అనువాదం “Kanaiyazhi”అన్న పత్రికలో వెలువడింది. కవనశర్మ, వివిన మూర్తి గార్ల పరిచయ భాగ్యం ఆ సమావేశంలోనే కలిగింది.

నేను పంపిన అనువాద కధను ప్రచురించే ముందు, ఆయా పత్రికల సంపాదకులు నాకు ఫోన్ చేసి కధనూ, నా అనువాదాన్ని మెచ్చుకున్న సందర్బాలు రెండు మూడు ఉన్నాయి.

మీ జీవితపు మరపురాని మధుర సన్నివేశం?

తొలిసారి మాతృమూర్తి అయినప్పుడు. “అంతర్ముఖం” నవల మొదటి ప్రతిని అందుకున్నప్పుడు.

మీరు చేయాలనుకుని ఇంతవరకు చేయలేకపోయిన పని?

తమిళంలో ప్రపంచన్ గారి “vaanam vasappadum”నవలను తెలుగులో తేవాలని, అశోకమిత్రన్ గారి సికింద్రాబాద్ కధలను ఒక సంపుటిగా తెలుగులో తేవాలని.

మిమ్మల్ని గాఢంగా ప్రభావితం చేసినవ్యక్తి ఎవరు?

ప్రత్యేకించి ఒక వ్యక్తి అని చెప్పలేను. మాటలు, చేతలు ఒక్కటిగా ఉండేవాళ్ళు, ఎదుటి మనిషిని మాటలతో కూడా గాయపరచని వాళ్ళు, స్నేహ శీలులు నాకు మార్గదర్శులు.

రచన?

తెలుగులో యండమూరిగారి ‘అంతర్ముఖం’. ఓల్గా గారి ‘తోడు’ కధ.

నా రచనలు కొన్ని మీ అంతట మీరే అడిగి అనువదించారు. సాధారణంగా మూల రచనల్ని మీరే ఎన్నుకుంటారా? రచయితలే మిమ్మల్ని సంప్రదిస్తారా అనువాదాల కోసం?

సాధారణంగా, నాకు నచ్చిన కధలను ఆయా రచయితల అనుమతి తీసుకుని మరీ చేస్తాను. యండమూరి, యద్దనపూడిగారి రచనలను అన్నింటినీ తమిళంలో చేయాలని నా తపన. కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ‘నిర్జనవారధి’ని తమిళంలో అనువాదంచేసి ఇవ్వగలరా అని ‘కాలచువడు’ అన్న ప్రముఖ పబ్లిషర్స్ నన్ను అడిగినప్పుడు కొంచం సంకోచించాను. ఎందుకంటే అంతవరకు నేను కధలు, నవలలు మాత్రమే చేసి ఉన్నాను. నిర్జనవారధి లాంటి ఆత్మకధను అదే స్వరంతో తేవాలి. అప్పుడే దానికి సార్థకత. ఆ పుస్తకం తమిళ అనువాదం “Alatrapalam” అన్నటైటిల్ తో వెలువడింది. పాఠకుల ఆదరణ పొందింది.

ఇప్పటి వరకూ ఎన్ని పుస్తకాలు అనువదించారు? ఎన్ని విడి రచనలు, పుస్తక రూపంలో రానివి, అనువదించారు?

ఇంతవరకు తమిళంలో డెబ్బై నవలలు వచ్చాయి. ప్రచురణలో పది నవలల దాకా ఉన్నాయి. తమిళంలో నుంచి తెలుగులోకి ముప్పైఐదు కధలకి పైగా అనువదించాను. ఈ బుక్ గా కినిగెలో ‘తమిళ కధలు-ఆణిముత్యాలు’ రెండు భాగాలుగా ఉన్నాయి. పుస్తక రూపంలో రావాల్సి ఉంది. అలాగే తెలుగు నుంచి తమిళంలో అనువదించిన కధలు పుస్తక రూపంలో రావలసి ఉంది.

సాహిత్య అకాడెమి వారి కోసం కు. అళగిరి సామి గారి “Anbalippu” అన్న కధా సంపుటిని తెలుగులో “బహుమతి” పేరిట అనువదించాను. స్క్రిప్ట్ అప్రూవ్ అయింది. పుస్తకరూపంలో రావలసి ఉంది.

ఒక రచన చదివాక అది మిమ్మల్ని వెంటాడి వేధిస్తేనే అనువాదాలు చేస్తారని విన్నాను, నిజమేనా?

నిజమే. కొన్ని కథలు మనసులో ముద్రించుకుని ఉండిపోతాయి. వాటిని అనువాదం చేసేటప్పుడు కలిగే సంతృప్తి మాటలకి అందనిది.

మీ అభిరుచులు? మీ దిన చర్య?

ఎక్కువగా చదువుతాను. రోజుకి ఎనిమిది గంటలైనా కంప్యూటర్ లో చదవడం, అనువాదం చేయడం నా అలవాటు. మంచి పుస్తకం చదువుతూ ఉంటే విందు భోజనం చేసినంత తృప్తి కలుగుతుంది. నచ్చిన పుస్తకాలను కొని చదివి, నా సొంత గ్రంధాలయంలో ఉంచుకుంటాను. సాహిత్య సమావేశాలు ఎక్కడ జరిగినా నేనూ, మావారూ కలిసి వెళతాం.

IMG_3836 (2) (2)

మీ కుటుంబ సభ్యుల గురించి నాలుగు మాటలు?

మా వారు బాంక్ నుంచి రిటైర్ అయ్యారు. ముగ్గురు కొడుకులు. అందరికీ పెళ్ళిళ్ళు అయి పిల్లలు ఉన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్థులు(Seattle, US).

మీరెన్నుకున్న రంగం గురించి, అందులోని సాధక బాధకాల గురించి చెప్పండి.

అనువాదం నేను ఎంచుకున్న రంగం కాదు. ఆ రంగమే నన్ను ఎంచుకుంది. తెలుగు నించి తమిళం లోకి, తమిళం నించి తెలుగు లోకి అనువాదం చేయడం నా మనస్సుకి నచ్చిన ప్రక్రియ. వృత్తి, ప్రవృత్తి ఒక్కటిగా ఉండటం నా సుకృతం.

కొన్ని రచనలను చదవగలం. కాని అనువదించడం కష్టం. అందరికీ కాక పోయినా చేయి తిరిగిన రచయితలకి ఒక స్వరం ఉంటుంది(tone). అనువాదంలో ఆ స్వరాన్ని తేగలిగితేనే ఆ అనువాదం పూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. ఒక భాష నుంచి నేరుగా ఇంకో భాషకి అనువాదం వెళ్ళినప్పుడే బాగా ఉంటుంది. మన దేశంలో పలు రకాల భాషలు ఉండటం వల్ల మొదట హిందీలో లేక ఆంగ్లం లో అనువాదం చేయబడి, వాటి నుంచి ప్రాంతీయ భాషలకి అనువాదం చేయడం ఆచరణ లో ఉంది. ఒక అనువాదానికి మళ్ళీ అనువాదం చేసినప్పుడు విషయం పలచబడిపోయే ప్రమాదం ఉంది. వీలైనంత వరకూ నేరుగా అనువాదాలు జరిగితే మంచిది. అనువాదకులకి మూలభాష, లక్ష్యభాషలమీద మంచి పట్టు ఉండాలి. రెండు భాషల యొక్క సంస్కృతి, ఆచార వ్యవహారాల పట్ల అవగాహన ఉండాలి.

గొప్ప స్పందన లభించిన మీ అనువాద రచన?

కథల్లో పి.సత్యవతిగారి “సూపర్ మాం సిండ్రోం”, వి.విజయలక్ష్మి గారి “మాతృత్వానికి మరో ముడి.”

మీకేవి ఎక్కువ ఇష్టం- కథలా నవలలా?

రెండూనూ.

మీ అభిమాన రచయితలు?

తెలుగులోయద్దనపూడి సులోచనారాణి, యండమూరి వీరేంద్రనాథ్, ఓల్గా. తమిళంలో అశోకమిత్రన్, D.జయకాంతన్, ఇందిరా పార్థసారథి.

తమిళ, తెలుగు సాహిత్యాల మధ్య పోలికలూ వైరుధ్యాలూ ఎలా ఉన్నాయంటారు?

కథల విషయానికి వస్తే తమిళంలో నిడివి తక్కువగా ఉంటుంది. ఒక సమస్య గురించి మాత్రమే ఉంటుంది. తెలుగులో సంభాషణలు, వర్ణనలు కాస్త ఎక్కువగానే ఉంటాయనిపిస్తోంది. తమిళంలో చారిత్రాత్మిక నవలలు వ్రాసే రచయితలు చాలా మంది ఉన్నారు. వాటిని తీవ్రంగా అభిమానించే పాఠకులు ఉన్నారు. కల్కి వ్రాసిన “పోన్నియిన్ సెల్వన్” ఇప్పటికీ మొదటి స్థానంలో ఉంది. తెలుగులో విశ్వనాధ సత్యనారాయణ గారి రచనలను చదివి అర్థం చేసుకునే ఓపిక  కొత్త తరం పాఠకులకి కొంచెం తక్కువే. పెద్ద రచయితలను వదిలేస్తే మిగిలిన రచయితలు తమ రచనలను తామే సొంత ఖర్చులతో ప్రచురించుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. మంచి రచనలను ప్రోత్సహించే విధంగా పబ్లిషర్స్ ముందుకు రావాలి.

తమిళ సాహిత్యాన్ని విస్తృతంగా చదివిన వ్యక్తిగా  తెలుగు కథకులకి మీరిచ్చే సూచన?

వీలైనంత వరకు తక్కువ మాటల్లో ఎక్కువ అర్ధం వచ్చేలా చూసుకోండి. ప్రతి విషయాన్ని విపులంగా పాఠకులకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు తెలివైనవాళ్ళు. అర్థం చేసుకోగలరు. కధలనువ్రాసిన వెంటనే పత్రికలకి పంపించకుండా రెండు మూడు రోజుల తరువాత మళ్ళీ మళ్ళీ చదివి చూడండి. అనవసరమైన పదాలు, వర్ణనలు తగ్గించండి. సమాజం పట్ల, మనిషి మనుగడ పట్ల బాధ్యతతో రచనలు చేయండి.

ప్రస్తుతం ఎలాంటి రచనల ఆవశ్యకత ఎక్కువగా ఉందంటారు?

ఎలాంటి సమాజం ఉండాలని ఎదురు చూస్తున్నామో, అటువంటి సమాజాన్ని రూపొందించ గలిగే రీతిలో మార్గ నిర్దేశం చేసే రచనలు.

అత్యంత శక్తివంతమైన టీవీ మాధ్యమాన్ని మెరుగైన సమాజ రూపకల్పనకి వాడుకోవాలంటే ఏం చెయ్యాలంటారు? ఇవాళ పెరిగిపోతున్న హింసకీ , సినిమాల్లో, టీవీల్లో కనిపిస్తున్న దృశ్యాలకీ సంబంధం ఉందంటారా? 

టి.వి. సీరియళ్ళ గురించి నాకు చాలా అసంతృప్తి ఉంది. ఒక ఇంట్లో ఎలాంటి సంభాషణలు ఉండకూడదో అలాంటి డైలాగులు, వయసుకి మించిన మాటలు మాట్లాడే పిల్లలు ….. చూసే వాళ్ళ ఇంట్లో ఒక ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని నా భావన. సినిమాల్లో ఆడపిల్లలని తక్కువ చేసి చూపించడం, చులకనగా చిత్రీకరించడం.. వీటిని బహిష్కరిస్తేనే సమాజం బాగు పడుతుంది. సంస్కరణ మన ఇంట్లో నించే మొదలవ్వాలి.

                                   *

మీ మాటలు

 1. సాహితీ says:

  గౌరీకృపానందన్ గారు, ఇది మీరు చదివితే (పోష్టు) నాదొక ప్రశ్న. తెలుసు కోవాలనే కుతూ హలం కూడా.
  మీ అభిమాన రచయితలు?
  తెలుగులోయద్దనపూడి సులోచనారాణి, యండమూరి వీరేంద్రనాథ్, ఓల్గా. తమిళంలో అశోకమిత్రన్, D.జయకాంతన్, ఇందిరా పార్థసారథి.
  ఈ రచయితల మధ్య భావ వరుధ్యాలున్నాయి గదా? మీ అను వాదానికి అవి అడ్డంకి కాదా?

 2. భావ వైరుధ్యాలు ఉన్నందువల్లనే వారి రచనలు నాకు ఇష్టం. పి.సత్యవతిగారి దేవుడు, గాంధారి, సూపర్ మాం సిండ్రోం, ఒక రాజా ఒక రాణి,కవనశర్మ గారి విడాకులు, ఆమె ఇల్లు నాకు ఎప్పటికీ ఫేవరేట్ కధలు. రంగనాయకమ్మ గారి “చదువుకున్న కమల” నాకు ఇప్పటికీ ఇష్టమైన నవల. అందులోని కొన్ని వాక్యాలను నా డైరీలో వ్రాసి పెట్టుకున్నాను. సాహిత్యం మనిషిని సానబెడుతుంది. కొన్ని సార్లు మార్గ నిర్దేశం చేస్తుంది కూడా..

 3. రాధ మండువ says:

  చాలా మంచి ఇంటర్వ్యూ నాగలక్ష్మి గారూ… గౌరి గారి గురించి వివరంగా తెలుసుకోవాలని చాలా సార్లు అనుకున్నాను. సంతోషంగా ఉంది. అనువాదాలు చేయడం చాలా కష్టం. ఆ కష్టాన్ని ఇంత బాగా ఇష్టపడతారని, ఇన్ని కథలు అనువాదాలు చేశారని తెలుసుకుంటుంటే ఆవిడ ఎంత ఎనర్జిటిక్ అనిపించింది. ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలి మనందరం అనిపించింది. థాంక్ యు నాగలక్ష్మి గారూ… అభినందనలు గౌరి గారూ!

 4. Bhavani Phani says:

  మంచి ఇంటర్వ్యూ అండి. గౌరీ గార్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు

 5. Sujatha Bedadakota says:

  డియర్ గౌరి గారూ,

  మీ గురించి మీ అనువాదాల గురించి మరింత తెలుసుకోవడం చాలా బావుంది. చాలా ఏళ్ల క్రితం శివ శంకరి గారి నవల “మలయన్ మరుపక్కం” అనే తమిళ నవలని (చిన్నదే) మాలతీ చందూర్ గారు “కొండకి ఆ పక్క” పేరుతో అనువదించారు వనిత మాస పత్రిక కోసం! పాత సంచికల్లో కొన్నేళ్ళ క్రితం చదివాను. అది ఎంతగా ప్రయత్నించినా ఎక్కడా దొరకలేదు. అది నవలగా బయటకు రాలేదని,వనిత తోనే ముగిసి పోయిందని తెల్సింది. చాలా మంచి కథ! దాన్ని అనువదించకూడదా, అవకాశం ఉంటే?

  థాంక్యూ!

  నాగలక్ష్మి గారూ మీక్కూడా థాంక్స్, గౌరి గారి ఇంటర్వ్యూ అందించినందుకు

 6. G.S.Lakshmi says:

  గౌరీ కృపానందన్‍గారి గురించి ఇలా ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకోవడం చాలా సంతోషంగా వుంది. గౌరీగారూ కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం అందుకుంటున్న శుభసందర్భంలో మీకు హృదయపూర్వక అభినందనలండీ. నాగలక్ష్మిగారూ, గౌరీగారిని చక్కగా ఇంటర్వ్యూ చేసి, మంచి వివరాలు అందించినందుకు మీకు అభినందనలండీ.

 7. Vani Devulapalli says:

  చాలా మంచి ఇంటర్వ్యూ అందించారు నాగలక్ష్మి గారూ ! థాంక్ యూ! గౌరీ క్రుపానందన్ గారికి మనసారా అభినందనలు !

 8. Prasuna.B.N. says:

  మంచి ఇంటర్వ్యూ నాగలక్ష్మి గారు . మీకు , గౌరీ గారికి మా అభినందనలు . గౌరీ గారికి పురస్కారం అందుకున్నందుకు ప్రత్యెక అభినందనలు

 9. చాలా మంచి ఇంటర్వూ. కంగ్రాట్స్. గౌరీ గారెకి, లక్ష్మిగారికి.. యండమూరి.

 10. vijaya Karra says:

  చక్కని పరిచయం. గౌరీ గారి అనువాద కథలు , ఆ సెలెక్షన్ బావుంటాయి. వారు అనువాదం చేసిన వదిన కథ నాకు నచ్చిన – ఎప్పుడూ గుర్తుండే కథ !

మీ మాటలు

*