పురాస్మృతుల స్వర్ణ మధూళి

 

 

 

-సాంత్వన చీమలమర్రి

~

 

sant3అనుకోకుండా ఒక ఉదయం ఏటవాలు గా పడుతూన్న యెండ ఎప్పటి గుర్తుల్నో మెరిపిస్తుంది. ఊరికే తోచక రెపరెపలాడే రోజూవారీ గాలి సరిగ్గా అప్పుడే పది వేసవుల పరదాల్ని కదిలిస్తుంది. అలవాటయిపోయిన దారుల్లో కాళ్ళు తిరుగుతూన్న మలుపులు ఇప్పటివే. మనసు చూసే దృశ్యం ఎక్కడిదో, ఎప్పటిదో. వర్తమానాన్ని మర్చిపోగలగడమే గొప్ప intoxication అయితే nostalgia ని మించిన మధువెక్కడుందీ?

ఎంత గమ్మత్తో పసితనం అసలు. నేర్చుకొమ్మని గట్టిగా అరిచి చెప్పినవేవీ తర్వాత గుర్తుండవు. మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేవల్లా ఎవరూ చూడని చోట్ల ఎవరి కోసమూ కాదన్నట్టు పూసే గడ్డిపూల్లాంటి అల్పత్వాలూ, లేతదనాలే. అలాంటి పసితనం వసంతం అయితే, ఆ పూసే పూలకి తామేంటో తెలిసి తలలు ఎగరేసే కాలం వేసవి. ఇంకా మగత వదలని ఆకాశాల ధూసరవర్ణ ఛాయల్ని తన గులాబీతనం తో కడిగేసే వేసవి. వచ్చే ప్రతీ రోజునీ బంగారపు కెంపు సంధ్యల మధ్య పొదివిపట్టుకునే వేసవి. వేసవంటే బాల్యానికి చివర. కౌమారపు తొలి గడప. యవ్వనానికి Passage way. అంత అందాన్నీ conscious గా అనుభవించడానికి ఆ వయసూ, పరిణతీ చాలా మందికి సరిపోవు. కావాల్సినదానికంటే ఎక్కువే సరిపోయే అదృష్టవంతుడొకడు, పన్నెండేళ్ళ డగ్లస్ స్పాల్డింగ్స్, రచయిత Ray Bradbury ప్రతిబింబం.

తెంపిన తక్షణమే వడలే గడ్డిపూలని ఎలా దండ గుచ్చడం? అదిగో అని తాకి చూపించగానే ఆవిరయ్యే సబ్బు బుడగల రంగుల్ని ఎలా రాశిపోయటం? అందుకు తెచ్చుకున్నారు Bradbury ఈ రంగురంగుల అక్షరాల అద్దం ముక్కల్ని. ఈ పుస్తకం మనల్ని మనకే వంద fragments గా విడగొట్టి చూపించే తళుకుటద్దాల mosaic.

నీలం ఆకుపచ్చా కలిపి అల్లిన అడవి నీడల కింద, రెండు చెవుల్లో వినపడే గుండె చప్పుడు లో, గాయమయ్యి ఉబికే రక్తపు ఎరుపు లో, పని చేసి వచ్చిన అలసట లో, ఆ అలసటని ఒప్పుకోని అహం లో తను జీవించి ఉన్నాననే స్పృహ ఒక వెలుతురు జలపాతం లా డగ్లస్ ని ముంచెయ్యటమే మొదలు ఈ పుస్తకానికి. జీవించి ఉండటాన్ని గుర్తించటమంటే తెలిసిన లెక్కల్లో సాగే మొనాటనీల మధ్య మోగే అభౌమ సంగీతపు nuances వినిపించుకోగలగటం.  ఆ మొనాటనీలని కూడా వాటికోసం వాటిని ప్రేమించగలగడం. ఆ యెరుక ఓసారి పుట్టిందా, ఇంక కనిపించేదంతా అద్భుతమే. ప్రతి రోజూ పేజీల మధ్య నెమలీకే.

కాస్త ఏమరుపాటుగా ఉంటే పచ్చిక పెరిగి ఊరిని ముంచేస్తుందా అనిపించే 1928 నాటి గ్రీన్ టౌన్ లో ని కొందరు మనుషుల  జీవితాలూ, వాటి మధ్య అన్నిటినీ లోతు గా అనుభవించగలిగే అదృష్టమూ ఆపదా ఉన్న డగ్లస్ వేసవి అనుభవాలూ ఈ Dandelion Wine పుస్తకం నిండా.  వేసవంటే వాళ్ళకి ఎవరూ పైకి గుర్తించని కొన్ని ఆనవాయితీలు. లెమనేడ్ తయారు చేసుకోవడం, ఐస్ క్రీం తెచ్చుకోవడం, కొత్త టెన్నిస్ షూస్ తొడుక్కుని తోక చుక్కల్లా పరిగెత్తడం, గడ్డి లో పూసే డాండీలియాన్ పూల నుంచి వైన్ తయారు చేసుకుని సోమరి తూనీగల రెక్కల్లోని సూర్య కిరణాలనీ, తేనెటీగల కాళ్ళకంటిన వెయ్యి పూల సౌరభాల్నీ సీసాల్లో  దాచుకోవడం. ఇంకా ఎండ తగ్గి చల్లబడే సాయంకాలాలు వాకిట్లో ఊగే కుర్చీల్లో, చెక్క బల్లల మీదా పెద్దవాళ్ళంతా కూర్చుని ముసురుతూన్న చీకట్లకి చిక్కు తీసి జడలల్లుతూ చెప్పుకునే కబుర్లు. మరునాటికి మర్చిపోయి అందరూ మళ్ళీ మొదలెత్తుకునే కబుర్లు. అతిప్రియమైన ఆ కబుర్లకి అర్థం లేదు, శబ్దం మాత్రమే ఉంది. ఎంత నిశ్చింత!

sant2

 

జూన్ మాసపు ఆగమనం తోనే వినబడే లాన్ మూవర్ శబ్దమంటే తాతగారికి ప్రేమ. అది వినపడితే ఆయన నిద్ర లో నవ్వుతాడు. ఊరిలో అన్ని లాన్ మూవర్ల నాదాలూ కలిసి సింఫనీ పాడినట్టు ఊహించుకుంటాడు. అసలు కత్తిరించాల్సిన అవసరమే లేని టైం సేవర్ లాన్ జాతి ని అమ్మేందుకు వచ్చిన బిల్ ఫారెస్టర్ తో అంటాడు కదా “అసలు అన్ని పనులూ త్వరత్వరగా చేసి ఏం సాధిస్తాం? మిగిలిపోయే సమయం లో చెయ్యటానికి కొత్త పనులు కల్పించుకునేందుకు బుర్ర బద్దలుగొట్టుకోవడం తప్ప? దారివెంట ఎదిగే మొక్కల్ని చూస్తూ, వాసనలు పీలుస్తూ నడిచే కాస్త దూరం కార్లో యాభై మైళ్ళ వేగం తో వెళ్ళటం కంటే ఎందుకు బావుంటుందో కొంచెం అర్థం చేసుకోడానికి ప్రయత్నించరాదూ?” అని.  ఆ ఆలోచనల్లోకి వెళ్ళి వచ్చే లోపు బిల్ కి డబ్బులిచ్చేసి సరుకంతా లోయలో పడేయిస్తాడు. ఆ తర్వాత బిల్ కూడా లాన్ మూవర్ని ప్రేమ గా బయటికి తేవటం ఒక తియ్యటి ఆశావాదపు కొసమెరుపు.

సంతోష యంత్రాన్ని కనిపెట్టాలనుకునే లియోది ఓ కథ. ఎప్పటికీ చెయ్యలేమనుకున్న పని ఒక్కసారే చెయ్యటంలో సంతోషం ఉందా లేక అశాంతా? క్షణికమైన సౌందర్యాలు- సూర్యాస్తమయాలు, ఇంద్రధనుస్సులూ… క్షణికం కనుకే అపురూపం కాదూ? అవన్నీ నిత్యమూ నిరంతరమూ అయితే అవి అలవాటు అయిపోవటాన్ని తట్టుకునీ నిలబడగలిగేంత సంతోషం పుడుతుందా మనకి? Now and Here ని మించిన సంతోషముందా? ప్రశ్నలు. వినపడీ వినపడనట్టుండే జవాబులు.

పుస్తకం చివర్న వచ్చే అమ్మమ్మ వంటల్లాగా ఈ సంతోషానిక్కూడా ఓ రెసిపీ లేదేమో. వంటగది ఎంత చిందరవందరగా అయినా ఉండనీ. డబ్బాల్లో దినుసులన్నీ ఏకమైపొనీ. చివరికి చేసే వంట మాత్రం దివ్యంగా ఉండాలి. యేది యెంత వేస్తే రుచో, ఆ మారిపోతూ ఉండే పాళ్ళ రహస్యం ఏమిటో తెలిసిన పెద్దవాళ్ళ దగ్గర శిష్యరికం చెయ్యాలి. అప్పటికీ వాళ్ళు చెప్పగలిగే algorithm యేదీ ఉండదు. తోచినంత వేసుకుంటూ పోతే ఎప్పుడో ఒక రోజుకి epiphany.

ఈ బంగారపు వెలుతురుకి అవతల యేముంటుంది? గాఢమైన ఈ వెలుతురు దాచే నీడలు ఎంత నల్లటివో! వేసవి లో కూడా అమావాస్యలుంటాయి. తీతువులూ కూస్తాయి. ఎప్పుడూ పక్కనే ఉండే మనవాడు ఓ మధ్యాహ్నం వేరే ఊరికి వెళ్ళిపోతున్నానంటాడు, ఆ సాయంత్రం ఏం ఆడుకోవాలో ముందే అనుకున్నా కూడా. వాడేం మామూలు మనిషా? మన దృష్టి లో సగం దేవుడు. మన భాష అర్థమయ్యే ఒక్కగానొక్కడు. అన్నాళ్ళూ చెప్పుకున్నా మిగిలిపోయినవన్నీ గుర్తొస్తాయి. ఆ పైన జరగబోయేవన్నీ ఎవరితో చెప్పాలి? భయమేస్తుంది. ఒకరినొకరు మర్చిపోయే రోజు వస్తుందేమో అని. వెళ్ళిపోతాడు వాడు. ఊరూ వాడా, పచ్చికా చీకటీ అన్నీ అలాగే ఉంటాయి. వాడు మాత్రం అక్కడ ఉండడు. కలుస్తూ ఉండొచ్చు లెమ్మనే సగం నిజం మాత్రం ఉంటుంది. కోపమే వస్తుంది వాడిమీద. పసి గుండె కొంచెం ఎదుగుతుంది. ఒకింత మొద్దుబారుతుంది. కళ్ళ ముందే కట్టిపడెయ్యగలిగితే ఎంత బావుండు ఇష్టమైన వాళ్ళందరినీ!

sant4

మర్రి చెట్లలాంటి మనుషులు హఠాత్తుగా మాయం అయిపోతారు. జీవించి ఉన్నట్టు తెలిస్తే జీవించి లేకపోవటం అంటే ఏంటో కూడా తెలుస్తుంది నెమ్మదిగా. దిగులు పట్టుకుంటుంది. ఒంటరితనం ముంచేస్తుంది. అసలు ఎవరినైనా యే హామీ మీద ప్రేమించాలి? ఎన్నాళ్ళు మనతో ఉంటారని ప్రేమించాలి? అనిపిస్తుంది. అవును కొందరంతే. ఇంకా పెద్దరికం మీద పడకుండానే చప్పున విషాదం పాలైపోగలరు. గాఢంగా ప్రేమించగలరు. గాయపడి యేడవగలరు. ఎరువు మూటల్లో కూడా పూల తోటల్నే చూడగలరు. స్ఫటికాలకి మల్లే ప్రపంచాన్ని వర్ణాల్లోకీ, పదాల్లోకీ, స్వరాల్లోకీ విప్పార్చగలరు. ఓ చిన్న ఆకుపచ్చని పడవమీద కాలం లో వెనక్కి తీసుకుపోయి ఇదీ అని చెప్పలేనివన్నీ ఇక్కడే ఇప్పుడే చూపించగలరు. “ప్రేమ భ్రమ కదూ?”  అని అడిగితే… “మంచు ఆవహించేవేళ సూర్యుడూ భ్రమే అనిపిస్తాడు” అని మార్మికంగా నవ్వేయనూగలరు.

చివరి పేజీ మూస్తూనే తరుముకొస్తాయన్నీ. ఆకాశమంతా నిండే చందమామ నేరేడు చెట్ల వెనకనించీ తేలి వస్తోంది… చుక్కలు మాత్రమే మెరుస్తోన్న ఇంకో రాత్రి- గాజు పగిలినట్టు కారణం లేకుండా కలిసి నవ్వుతున్నారంతా. వేడి చల్లారుతున్న గచ్చు మీద, మొక్కలు తాగి మిగిల్చిన నీళ్ళ మీద మార్చి మార్చి అడుగులు వేస్తున్నాయి సైజ్ ఫైవ్ పాదాలు. నిద్రగన్నేరుల మీద ఎవరిదో నిర్దయ తెలిసి గొంతు లో ఏదో అడ్డుపడుతోంది. ఎపుడో విడిపోయిన వారి మాట వినపడి వాగ్దానాలు చేస్తోంది. తురాయి పూలు రాల్తూనే ఉన్నాయి. అన్నీ- అలాగే- అక్కడే… సరిగ్గా అప్పటిలాగే… ఎందుకంటే? గుర్తున్నాయి కదా మరి!

peepal-leaves-2013

 

 

మీ మాటలు

 1. ” అతిప్రియమైన ఆ కబుర్లకి అర్థం లేదు, శబ్దం మాత్రమే ఉంది. ఎంత నిశ్చింత! ” , సాంత్వనా … మీ సొంత మనసు భాష ఒకటి మేల్కొంది, ఇప్పటి కి ఈ ప్రవాహం లో తేలిపోవడం కంటే గొప్ప సుఖం మరొకటి లేదు!! చిన్నవారు కనుక ఆశీస్సులు … ఫీలింగ్ nostalgia !!

 2. Venkat Suresh says:

  ఈ వ్యాసం “చాలా బాగుంది” అని చెప్ప్తే ఏదో పేలవంగా ఉంటుంది. ఇది ఒక “అద్భుతం” అంతే, వేరే మాటే లేదు. ఈ రచయిత (Ray Bradbury ) నాకూ బాగా ఇష్టమైన వారే. ఈ dandalion వైన్ పుస్తకం మొదలు పెట్టి, పనుల వొత్తిడి వల్ల పూర్తి చేయలేక పోయాను. మీ వ్యాసం చదివాక ఆ పుస్తకానికి ఇంకేదో ప్రత్యేకత వచ్చినట్లు అనిపించింది (ఇది పొగడ్త కాదు… నాకు నిజంగా అలానే అనిపించింది).

 3. Intha andam gaa, ardram gaa pustakam gurinchi raayochani cheppavu pilla. Nijam ga peru ki tagina rachana. Your mom is blessed to have you n vice-versa.

 4. c v Mohan rao says:

  Sahityapu parimalalu ela vuntayo main rachana kanna manaki parichayam chestu rase mundu mata lo thelisipotundi. Santhvana (vayo bhedam valana Garu pettaledandi) thana thalli ni minchina thanaya ga ganathi kekkadam khayam.

 5. సాంత్వనా, ఎంత బాగా రాసావు! మాటల్లో వర్ణించ శక్యం కాని అందం నిలువెల్లా … నీ వ్యాసం అంతటా! ఒక పుస్తకాన్ని ఊరికే చదివి పారేయడం చాలా మంది చెసేపనే! కాని అందులోని విషయాన్ని ఇంత అందమైన మయూర తూలికలా (పుస్తకం పేజీల మధ్య పెట్టినది కొన్నాళ్ళకి వన్నె మాయవచ్చు) అందరికీ దర్శింప చెయ్యడం మాటలు కాదు, కొందరే చెయ్యగలరు. నిన్ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది నాకు, మా సాంత్వన ఎంత నైపుణ్యం సంపాదించింది అని!
  “అలాంటి పసితనం వసంతం అయితే, ఆ పూసే పూలకి తామేంటో తెలిసి తలలు ఎగరేసే కాలం వేసవి. ఇంకా మగత వదలని ఆకాశాల ధూసరవర్ణ ఛాయల్ని తన గులాబీతనం తో కడిగేసే వేసవి. వచ్చే ప్రతీ రోజునీ బంగారపు కెంపు సంధ్యల మధ్య పొదివిపట్టుకునే వేసవి. వేసవంటే బాల్యానికి చివర. కౌమారపు తొలి గడప. యవ్వనానికి Passage way. అంత అందాన్నీ conscious గా అనుభవించడానికి ఆ వయసూ, పరిణతీ చాలా మందికి సరిపోవు.”
  “వర్తమానాన్ని మర్చిపోగలగడమే గొప్ప intoxication అయితే nostalgia ని మించిన మధువెక్కడుందీ?”

  అమ్మమ్మ ఆత్మీయతని రంగరించి చేసిన వంట ఎంత ఇష్టంగా తినేలా ఉంటుందో నువ్వు రాసిన ఈ కవితాత్మక విశ్లేషణ కూడా అంటే చవులూరుతూ ఉంది.
  “తురాయి పూలు రాల్తూనే ఉన్నాయి. అన్నీ- అలాగే- అక్కడే… సరిగ్గా అప్పటిలాగే… ఎందుకంటే? గుర్తున్నాయి కదా మరి!” ఆ రాలిన పలాశ సుమాలు ఏరుకొని భద్రంగా పదిలపరుచుకునే బాల్యం … ఎన్నేళ్ళైనా గుర్తుంచుకుంటుంది ఆ మధుర స్మృతుల్ని!
  ఇటువంటి వ్యాఖానాలని ముందు చదివి తరువాత Dandelion వైన్ వంటి పుస్తకాల్ని చదివితే ఇంకా బాగా ఆస్వాదించగలం.
  నేను నవలని చదవలేదు కానీ, ‘స్వర్ణ మధూళి’ ఎవరు?

 6. Sasikala Volety says:

  సాంత్వనే ఒక అద్భతం అనుకుంటా నేను..మరి సాంత్వన రాతలు మరింత అద్భుతంగా ఉన్నాయి. కధంతా కళ్ళకు కట్టించావ్. నేపధ్యంలోని పకృతి ఇంకా కళ్ళకి కాటుకలా పట్టేసింది. ఈ ప్రాంతం నైసర్గికం ఏంటో నాకు తెలియక పోయిన ,అక్కడ వేసవి ఇంకా నా మనసులో వెచ్చగానే ఉంది. చదవ గలనో లేదో తెలియని పుస్తకం గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పావు. ధన్యవాదాలు. తెలుగుకు భవిష్యత్తు చూస్తున్నా నీలో.

 7. ఒక పుస్తక విశ్లేషణను ఇంత కవితాత్మకంగా నడిపించిన సాంత్వన గారికి అభినందనలు. Like mother like daughter ! మళ్లీ మళ్లీ చదివించే స్వర్ణ మధూళి ! తేనెవాకలలో డోలలూగించే పూల బాణి ! థాంక్స్.

 8. Krishna Veni Chari says:

  నైస్.

 9. కె.కె. రామయ్య says:

  రచయిత Bradbury గారి ” Dandelion Wine ” పుస్తక విశ్లేషణ వ్యాసం ‘పురాస్మృతుల స్వర్ణ మధూళి’ ఎంతో కవితాత్మకంగా, అద్భుతంగా నడిపించిన సాంత్వన చీమలమర్రి గారికి (ప్రసిద్ధి రచయిత్రి డాక్టర్ అబ్బరాజు మైథిలి, డాక్టర్ చీమలమర్రి శ్రీనివాస్ గార్ల అమ్మాయి) హృదయపూర్వక అభినందనలు.

  “ఎప్పుడో ఒక రోజుకి ఎపిఫని” అన్న సాంత్వన గారూ! త్రిపుర గారూ ఈ epiphany మాట వాడారు. ప్రాచెట్ ని చదవటం మేధస్సు కు పంచ భక్ష్య పరమాన్నం లాంటిది అని వేరే వ్యాసంలోఅన్న సాంత్వన గారూ! త్రిపురని చదివి ఇలాంటి వ్యాసమొకటి రాస్తే మీకెప్పటికీ ఋణపడి ఉంటాను.

  • మీకు నచ్చినందుకు, పాత వ్యాసం గుర్తుంచుకున్నందుకు చాలా సంతోషం గా ఉంది సర్. తప్పకుండా ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.

 10. Bhavani Phani says:

  ఎంతో అందమైన , అర్థవంతమైన ప్రయోజనకరమైన రచన . ధన్యవాదాలు

 11. Kuppilipadma says:

  సాంత్వన, యెంతో అందంగా అపురూపంగా వుంది మీ పరిచయం. యెన్నిసార్లు చదివానో వాక్యంపై నుంచి చూపులని తిప్పుకోలేకపోయాను. యింత సంతోషాన్ని యిచ్చినందుకు కృతజ్ఞతలు. లవ్ యు డియర్.

 12. మహీ says:

  ఓ చక్కని అనుభూతి…

  థాంక్యూ…

 13. అమ్మమ్మ వంటల్లా సంతోషానికి రెసిపీ లేదు…అద్భుత మైన వాటికి అందమయినవాటికి వర్ణన లేదు మీ వ్యాసము అంతే వర్ణింప వీలు లేదు చదివి ఆస్వాదించాల్సిందే ….

 14. samanya says:

  అమ్మలూ ఎంత బాగా రాసావో … నువ్వు ఇంకా ఎక్కువగా రాస్తీ మేం ఇంకా ఎక్కువ సంతోషంగా బ్రతుకుతాం ఆయువు పొడిగించుకుని !

 15. Vijaya Karra says:

  Excellent Analysis !!!

 16. Srinivas Vuruputuri says:

  సాంత్వన గారికి,

  ఎంత బాగా రాసారు! తొలి వాక్యం చదవగానే చలం గుర్తుకు వచ్చారు. వ్యాసం పూర్తిగా చదవేలోపే అమెజాన్‌కెళ్ళి DanDelion Wine పుస్తకాన్ని కొనేసాను.

  ఈ సున్నితమైన సంవేదన, ఈ కవిత్వపు తడి “ఎరువు మూటలో పూల తోటలను” చూడగల లోచూపు రానున్న సంవత్సరాలలో భద్రంగా కాపాడుకొంటారని ఆశిస్తాను.

  శ్రీనివాస్

  • Santwana says:

   మీరు చెప్పిన మంచి మాటలకి ధన్యవాదాలు సర్! ఆ పుస్తకం మీకూ నచ్చుతుందని ఆశిస్తున్నాను…

 17. KOLLIKONDA BINDUSREE says:

  EXCELLENT

 18. Mohan Penijerla says:

  ఇది పుస్తక పరిచయమనాలా?
  అక్షర గంభీర మేఘమేదో చిరుజల్లులు కురిపించినట్లు…
  భీకర ప్రవాహవేగమేదో పిల్లకాలువై అలరించినట్లు..
  విస్మృతిలో పడిన కాలాన్నంతా చిటికెన వేలు పట్టి చూపించినట్లు…
  అభినందించడానికి కూడా పదాలు వెతుక్కుంటున్న స్థితి నాది…
  సాంత్వన గారూ… హ్యాట్సాఫ్… ఇంతకన్నా నాకు శక్తి లేదు

మీ మాటలు

*