జింబో బొంబాయి నగర ప్రవేశం

 

 

-వంగూరి చిట్టెన్ రాజు

~

 

chitten rajuకాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో డిగ్రీ ఫైనల్ పరీక్షలు రాశాక..ఆ మాట కొస్తే రాయడానికి కొన్ని నెలల ముందే “తరవాత ఏమిటీ?” అనే ప్రశ్న మా క్లాస్ మేట్స్ అందరినీ వేధించేది. కొంత మంది పై చదువుల కోసం ఆలోచిస్తూ ఉంటే మరి కొందరు ఉద్యోగాల వేట మొదలుపెట్టే వారు. ఆ రోజుల్లో పై చదువులు అంటే.ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ నాకు తెలిసీ మొత్తం ఆంధ్రాలో ఎక్కడా లేదు. హైదరాబాద్ ఉస్మానియాలో ఉందేమో కానీ అందరి దృష్టీ బెంగుళూరు ఐ.ఐ.ఎస్.సి లేదా మద్రాసు, ఖరగ్ పూర్ ఐ.ఐ.టి. ల మీద మాత్రమే ఉండేది. చాలా తక్కువ సీట్లు ఉండే వాటిల్లో అడ్మిషన్ కావాలంటే డిగ్రీ పరీక్ష లో ఫస్ట్ క్లాస్ వస్తే చాలదు. అందరి కంటే ఎక్కువగా డిస్టిన్క్షన్ కూడా వస్తే ఇంటర్వ్యూ కి అర్హులు అయ్యే చాన్స్ ఉంది. ఆ తరువాత ఆ ఇంటర్వ్యూ లో నెగ్గాలి. ఇక ఉద్యోగాల విషయాల కొస్తే..ముఖ్యంగా మెకానికల్ ఇంజనీర్ గా ఉద్యోగం కావాలంటే యావత్ ఆంధ్ర ప్రదేశ్ లో ఏవో అర డజను పంచదార ఫేక్టరీలు, వైజాగ్ లో కోరమాండల్ ఫెర్టిలైజర్స్ ….ఇలా వేళ్ళ మీద లెక్క పెట్టుకోవలసిందే. సివిల్ ఇంజనీర్స్ కి నాగార్జున డామ్ లో జూనియర్ ఇంజనీరింగ్ లాంటివి ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి రావచ్చును. ఆ మాట కొస్తే సివిల్ ఇంజనీర్లకి తప్ప ఇతర బ్రాంచ్ వాళ్ళెవరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు లేనే లేవు….బహుశా ఇప్పుడు కూడా…అంచేత అటు ఉద్యోగానికి కానీ, పై చదువులకి కానీ రాష్ట్రం విడిచి వెళ్ళిపోవలసినదే.

నా విషయంలో నేను అప్పటికీ పై చదువులు చదవాలి అని నిశ్చయించేసుకున్నాను కానీ మా కుటుంబం ఆర్ధిక పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవు. ఎలాగా ఫస్ట్ క్లాస్ వస్తుంది కదా, ఎక్కడో అక్కడ స్కాలర్ షిప్ రాకపోతుందా అనుకున్న నాకు రిజల్ట్స్ పెద్ద అశనిపాతంలా తగిలాయి. నా పేరు సెకండ్ క్లాస్ లో ఉంది. నా జన్మలో అలాంటి అనుభవం అదే మొదటి సారి. అప్పటి దాకా చిన్నప్పటి నుంచీ నేను ఏ నాడు ఏ పరీక్ష రాసినా నూటికి 60 % తప్పకుండా వచ్చేవి. అలాంటిది ఇంజనీరింగ్ ఫైనల్స్ లో మార్కులు వచ్చాక చూస్తే నేను ఏ నాడూ ఊహించనట్లుగా రెండు సబ్జెక్ట్ లో 40 శాతం..అంటే పాస్ మార్కులు…వచ్చాయి. ఇండస్ట్రియల్ ఎడ్మినిష్త్రేషన్ & మెటలర్జీ… ఆ రెండూ కూడా నేను చాలా బాగా రాసిన పేపర్లే. కేవలం పాస్ మార్కులే వేశారూ అంటే ఎక్కడో, ఏదో తేడా ఉంది అనిపించి ఆ పేపర్లు ఎవరు దిద్దారూ అని కాలేజ్ కి వెళ్లి ఆరా తీశాను. అప్పుడు తెలిసింది ఆ పేపర్లు దిద్దిన ఇద్దరు లెక్చరర్లు దగ్గర స్నేహితులు. అందులో ఒకాయన మాకు బంధువే కానీ ఎందుకో మా కుటుంబం అంటే పడదుట. మాకు ఆయన పాఠాలు చెప్పేటప్పుడు నన్ను కొంచెం చులకన గానే చూసేవాడు కానీ నేను ‘నలుగురిలో నారాయణా’ బాపతే కాబట్టి అసలు పట్టించుకోలేదు. అంచేత అంతా బాగా రాసినా నాకు అత్తిసరుగా పాస్ మార్కులు వెయ్యడానికి ఇతర కారణాలు ఏమీ కనపడక ఆయన వ్యక్తిగతంగా ఈ పని చేశాడు అనే అనుకోవలసి వచ్చింది. కానీ చేసేది ఏమీ లేదు. రివాల్యుయేషన్ కి అప్లై చెయ్య వచ్చును అని ఎవరో సలహా ఇచ్చారు కానీ అదేం జరిగే పని కాదు అని తెలుసును. ‘ఎప్పటికైనా బ్రాహ్మడికి బ్రాహ్మడే శత్రువు’ అని కూడా ఎవరో అన్నారు. యాభై ఏళ్ల తరువాత అమెరికాలో ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది.

BE V Marks Sheet

ఆ రోజుల్లో ఈ ఫస్ట్ క్లాస్ ..అంటే 60% శాతం మొత్తం అన్ని మార్కులూ కలిపి రావాలి. నాకు ప్రాక్టికల్స్ లో 61.5%, సెషనల్స్..అంటే వైవా పరీక్షలలో 65 శాతం వచ్చాయి. కానీ పైన చెప్పినట్లు రెండు సబ్జెక్టులలో   జరిగిన అన్యాయం వలన థీరీ లో 57.12 శాతం వచ్చాయి. మూడూ కలిపి మొత్తం మీద చూస్తే మార్కుల ప్రకారం నా సగటు మార్కులు 60.37 శాతం. కానీ దురదృష్టవశాత్తూ అప్పటి రూల్స్ ప్రకారం థీరీ, ప్రాక్టికల్స్ మాత్రమే కలిపి చూశారు. ఆ సగటులో నాకు 58.22శాతం వచ్చి, కేవలం 1100 లలో 1.78 మార్కు తక్కువ లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకోలేక పోయాను. అలాంటి నాకు నలభై ఏళ్ల తరవాత 2006 లో మా కాలేజ్ వజ్రోత్సవాలలో నన్ను “Distinguished Alumni” అని చిరు సత్కారం చేసినప్పుడు నాకు చాలా సిగ్గు వేసింది.

ఆ రోజుల్లో క్లాసులో ఒకరిద్దరికి మాత్రమే వచ్చే దిష్టింక్షన్..అంటే 70 శాతం మార్కులు…తెచ్చుకున్న వాళ్ళకీ,  ఫస్ట్ క్లాస్ వచ్చిన వారికి కూడా ఐఐటిలు, ఐఆఎస్ సి ల లో పై చదువు, లేదా మద్రాసు, బెంగుళూరు లలో పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు బాగానే వచ్చేవి కానీ, నా లాంటి వారికి ఎదరంతా ఎడారే!. ముఖ్యంగా రాజకీయ పలుకుబడి కానీ, వ్యాపార వారసత్వాలు కానీ లేని అగ్రకుల సంజాతుడి పరిస్థితి అధోగతే అనిపించేది. ఎటు నుంచి ఎటు చూసినా రాష్ట్రం వదలి వెళ్లి పోవడం తప్ప గత్యంతరం లేనే లేదు. ఏ రాష్ట్రం లో అయినా ఉన్నత విద్యావకాశాలు కానీ, ఉద్యోగాలు ఉన్నాయి అంటే అవి కేవలం ఆయా రాష్ట్రాల నుంచి వెలువడే ఇంగ్లీషు దిన పత్రికలలో ప్రకటనలు మాత్రమే ఏకైక ఆరాధం. లేదా, పెట్టే, బేడా సద్దేసుకుని ఏ మహా నగరంలో మనకి బంధువులో, స్నేహితులో ఉంటే అక్కడికి వెళ్లి పోయి గుమ్మాలు తొక్కి వెతుక్కోవడమే! ఆ రోజుల్లో బొంబాయి నుంచి వెలువడే టైమ్స్ ఆఫ్ ఇండియా, మద్రాస్ నుంచి ది హిందూ, ఇండియన్ ఎక్స్ ప్రెస్….ముచ్చటగా మూడే మూడు ఇంగ్లీషు పేపర్లు కాకినాడలో కనపడేవి. వాటిల్లో ఆదివారం నాడు స్థానిక రాష్ట్రాల ప్రకటనలు ఎక్కువగానే ఉన్నా, దేశం మొత్తానికి సంబంధించిన ప్రకటనలు ఈ మూడింటి లోనూ ఉండేవి.

ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది కానీ ఆ రోజుల్లో పై చదువులకి అమెరికా వెళ్ళవచ్చును అనే ఆలోచనే అస్సలు రాలేదు. ఆ మాటకొస్తే ఆ ఆలోచన మా కాలేజ్ లో చాలా తక్కువ మందికి ఉండేది. ఇంజనీరింగ్ డిగ్రీ చేతికొచ్సినా, జీవితంలో ఏం చెయ్యాలో తెలియక ఆయా పత్రికలలో నేను గమ్యం వెతుక్కుంటున్న ఓ శుభ సమయంలో బొంబాయిలో ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో మాస్టర్స్ డిగ్రీ కోర్స్ లో దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం దరఖాస్తులు కోరుతూ ఒక ప్రకటన చూశాను. నాకున్న డిగ్రీ కి నేను ఎటువంటి ఐఐటి అర్హుడిని కాదు అని అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన నేను దాన్ని కాదని వెంటనే అప్లికేషన్ పంపించి ఆ సంగతి మర్చి పోయాను. కానీ అదే విషయంలో మరో సంగతి ఖచ్చితంగా గుర్తు ఉంది. అదేమిటంటే గోవిందరాజులు కూడా నాతో బాటే బొంబాయి ఐఐటి కి అప్ప్లై చేశాడు.

మా క్లాస్ లో ఇద్దరు గోవింద రాజులు  ఉండే వారు. వారిలో ఆర్. గోవిందరాజులు ఎలెక్ట్రానిక్స్ చదివి ఆ తరువాత వరంగల్ కాలేజీ కి వెళ్లి అక్కడ పి.జి. చేశాడు. ఆ తరువాత అక్కడే ప్రిన్సిపాల్ గా కూడా పని చేశాడు అని విన్నాను కానీ 1966లో మా కాలేజ్ రోజుల తరవాత అతన్ని ఇప్పటి దాకా చూడ లేదు. ఇక రెండో వాడు ఎన్. గోవిందరాజులు కాకినాడ వాడే. జగన్నాధ పురంలో ఉండే వాడు. అతని నాన్న గారు మైన్ రోడ్ లో మసీదు పక్కన చుట్టలు చుట్టే వ్యాపారం చేసీవారు. ఇతనూ, ఇతని అన్నయ్యలూ మంచి బాడీ బిల్డర్స్. కండలు తిరిగిన శరీరంతో మా ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్న ఐదేళ్ల పాటూ అతనే మిస్టర్ కాలేజ్. మిత భాషి. అతనికి తెలిసిన తిట్టు అల్లా “సంపేత్తాను”. అలా అనడమే కానీ ఎప్పుడూ ఎవరిమీదా చెయ్యి చేసుకునే వాడు కాదు. ఒక సారి మటుకు మా కాలేజ్ వాళ్ళు ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ లో రంగరాయ మెడికల్ కాలేజ్ టీమ్ తో కోకో ఆట ఆడుతున్నప్పుడు ఇతను పరిగెడుతూ కేవలం గట్టిగా వీపు మీద “ముట్టు” కోగానే పాపం ఆ దెబ్బకి డాక్టర్ చదువుతున్న ఒకానొక అర్భకుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇతను కావాలనే కొట్టాడు అని వాళ్ళ టీమ్ నానా గొడవా చేసి ప్రిన్సిపాల్స్ దాకా తీసుకెళ్ళారు. అది ఇంకా పెద్ద గొడవ అవును కానీ గోవిందరాజులు హాస్టల్ లో ఉండే పై ఊరి వాడు కాక స్థానికంగా కాకినాడ వాడే కాబట్టి సరిపోయింది. ఏమైతేనేం, నాకు మటుకు అతను చాలా మంచి స్నేహితుడు. నాతోబాటే అతను కూడా బొంబాయి ఐఐటి కి అప్ప్లై చేశాడు. నాకంటే మంచి మార్కులు వచ్చాయి కాబట్టి బెంగుళూరు ఐఐఎస్ సి కి కూడా అప్లై చేశాడు.

ఓ రోజు అనుకోకుండా ఆ ఐఐటి నుంచి మా ఇద్దరికీ ఇంటర్వ్యూ ఆహ్వానం వచ్చింది. గోవిందరాజులు కి అది రావడంలో ఆశ్చర్యం లేదు కానీ నాకు కూడా ఒక ఐఐటి …అందునా ఎక్కడో అవతలి తీరాన్న ఉన్న బొంబాయి ఐఐటి నుంచి మాస్టర్స్ డిగ్రీ కి ఇంటర్వ్యూ రావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. నేను ఎగిరి గంతేశాను కానీ మా నాన్న గారు “అంత దూరం పై చదువులకి పంపించడానికి డబ్బు లేదు.” అని చెప్పేశారు. అప్పుడు నాకు కావలసిన మొత్తం డబ్బు కాకినాడ నుంచి  బొంబాయి రానూ, పోనూ రైలు టిక్కెట్టు 60 రూపాయలు, నాలుగు రోజులు తిండికీ, ఇతర ఖర్చులు 50 రూపాయలు, ఒక వేళ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయితే వంద రూపాయలు ఫీజు వెరసి సుమారు 200 రూపాయలు. మా పెద్దన్నయ్య ని అడగగానే ఎప్పటి లాగానే పొలం పనులు ఉన్నాయి అంటూ పొలం పారిపోయాడు. అప్పుడే లాయర్ ప్రాక్టీస్ మొదలుపెట్టినా ఇంకా ఆదాయం లేని మా చిన్నన్నయ్య “ఇది చాలా మంచి చాన్స్ రా. వదులుకోకు.” అని ఓ వంద రూపాయలు ఇచ్చాడు. నా పై అన్నయ్య సుబ్రహ్మణ్యం మణిపాల్ లో మెడిసిన్, మా తమ్ముడు కాకినాడ లోనే ఇంజనీరింగ్ మూడో ఏడు చదువుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు ఉండే అవకాశం లేదు. మొత్తానికి నేనూ, గోవిందరాజులూ కలిసి ఇద్దరికీ కావలసిన మొత్తం మూడు, నాలుగు వందలు పోగేసి బొంబాయి వెళ్ళడానికి రైలు ఎక్కేశాం. రాత్రి కాకినాడలో ఎక్కి, మర్నాడు పొద్దున్న హైదరాబాద్ లో దిగి, అక్కడ మా అక్కా, బావ గార్లని పలకరించి, రాత్రి బొంబాయి రైలు ఎక్కి మర్నాడు మధ్యాహ్నం ఒంటి గంట కి బొంబాయి దాదర్ స్టేషన్ లో దిగాం నేనూ, గోవిందరాజులూనూ.

అంతకు ముందుటేడు మేము ఇంజనీరింగ్ ఫైనల్ సంవత్సరం లో ఎడ్యుకేషనల్ టూర్ లో మా బేచ్ అంతా బొంబాయి వచ్చి, చాలా ఫేక్టరీలు చూసినా, మాకు అక్కడ ఎవరూ తెలియదు. దాదర్ స్టేషన్ లో దిగి “ఇక్కడ ఏదైనా హోటల్ ఉందా?” అని అడగగానే “పక్కనే మాటుంగా లో మద్రాసీ హోటల్స్ ఉంటాయి” అని ఓ టాక్సీ వాడు మా ఇద్దరినీ మాటుంగా తీసుకెళ్ళి ఓ అయ్యర్ హోటల్ దగ్గర దింపాడు. 48 గంటల రైలు ప్రయాణంలో ఒళ్లంతా బొగ్గు నుసితో నీరసంగా ఉన్న మమ్మల్ని చూసి రూములు ఖాళీ లేవు కానీ స్నానం చేసి బట్టలు మార్చుకోడానికీ, కావాలంటే రాత్రి వరండాలో పడుకోడానికి మడత మంచాలు ఇస్తాను అన్నాడు ఆ అయ్యర్ గారు. ఆ చుట్టుపక్కల అంతా అచ్చు మద్రాసు అడయార్ వాతావరణమే. అందరూ లుంగీలతోటే, నిలువు బొట్లూ, అడ్డ వీభూతులతోటే ఉన్నారు.

ఇక భాష ఎలాగా తమిళమే….బొంబాయి నడిబోడ్డులో తమిళుల ఒయాసిస్ ఆ మాటుంగా అనే ప్రాంతం. మొత్తానికి నేనూ, గోవిందరాజులూ స్నానాలు చేసి రెడీ అయి, ఆ మర్నాడు ఇంటర్వ్యూ లు కాబట్టి ముందే అక్కడికి వెళ్లి చూసి వద్దాం అని మా అయ్యర్ గారిని పవయ్ అనే ప్రాంతం లో ఉండే ఐఐటికి ఎలా వెళ్ళాలో కనుక్కుని, లోకల్ రైలు ఎక్కి, విక్రోలి స్టేషన్ లో దిగి అక్కడ బస్సు ఎక్కి సాయంత్రం ఐదు గంటలకి ఐఐటి మైన్ గేట్ దగ్గర దిగాం. అక్కడ కాపలా ఉన్న సెక్యూరిటీ వాళ్ళని చూసి కొంచెం భయం వేసింది కానీ వాళ్ళు కార్లలో వెళ్ళేవాళ్ళనే ఆపి వివరాలు అడిగి అప్పుడు పెద్ద గేటు తియ్యడం చూసి ధైర్యంగా నడిచి చిన్న గేటు లోంచి లోపలకి వెళ్ళిపోయాం. సిమెంట్ రోడ్డుకి అటూ, ఇటూ పోక చెట్లతో ఎంతో హాయిగా ఉన్న రోడ్డు మీద భయం భయంగా నడుస్తూ ఒకాయన కనపడగానే మా వివరాలు చెప్పి మెకానికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ ఎక్కడో చెప్పగలరా అని అడిగాం. ఆయన చెప్పినట్టు ముందు పచ్చటి తివాసీ లా పరుచుకున్న అందమైన లాన్ లో ఓ పెద్ద బిల్డింగ్ కనపడగానే ఆనందంతో తబ్బిబ్బు అయిపోయాం. అదే నాలుగంతస్తుల మైన్ బిల్డింగ్.  లోపల ఆహ్వానం పలుకుతూ ఈ ఐఐటి అనే అత్యున్నత స్థాయి సాంకేతిక విద్యాలయాల ఆలోచనకి మూల పురుషుడూ, ఆ భవనానికి శంఖుస్థాపన చేసిన జవహర్లాల్ నెహ్రూ గారి ఫోటో, స్వాగత వచనాలు మాలో మరింత హుషారు పెంచాయి. 1958 లో నెహ్రూ గారు శంఖుస్థాపన కోసం వచ్చిన ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. అందులో ఆయనతో కరచాలనం చేస్తున్న ఆయన బ్రిగేడియర్ బోస్ గారు, పక్కన ఉన్నాయన ఎ.కె. కేల్కర్ గారు.

Nehru-Bose Handshake నేను ఐఐటి లో ఉన్న మొదటి మూడేళ్ళు బోస్ గారు’, ఆ తరువాత మూడేళ్ళు కేల్కర్ గారు డైరెక్టర్లుగా పని చేశారు. బొంబాయిలో నిరంతరం కురిసే వర్షాలలో తడవ కుండా అన్ని డిపార్ట్ మెంట్ ల భవనాలనీ కలుపుకుంటూ ఒక పొడుగాటి కారిడార్ ఐఐటి భవన సముదాయాల ప్రత్యేకత. వాటిల్లో ఒకటయిన మెకానికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ కి మేము వెళ్లినా అప్పటికే చీకటి పడింది కాబట్టి అక్కడ కూడా కాపలా ఉన్న సెక్యూరిటీ వాడు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వ లేదు. మొత్తానికి ఆ మర్నాడు ఇబ్బంది లేకుండా ముందు రోజే అన్నీ చూసుకుని, నేనూ, గోవిందరాజులూ వచ్చిన దారినే వెనక్కి మాటుంగా వెళ్లి ఆ రాత్రి మడత మంచాల మీద వరండాలో పడుకున్నాం. మా ఇద్దరి పెట్టెలూ ఆ మంచాలకే గొలుసులతో తాళం వేసుకోమని ఆ అయ్యర్ గారు ఇచ్చిన సలహా పాటించాం.

ఆ మర్నాడు నా జీవితాన్నే మార్చేసిన ఇంటర్వ్యూ  తతంగం గురించి….వచ్చే సారి ….నమ్మండి, నమ్మకపొండి, ఆ రోజు తరువాత నేను ఇప్పటి దాకా..అంటే గత యాభై ఏళ్లలో గోవిందరాజులుని మళ్ళీ చూడ లేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాడని విన్నాను.

మీ మాటలు

 1. చాలా బావుందండి వ్యాసం. కౌముది లో వేమూరి వెంకటేశ్వర రావు గారు అమెరికా అనుభవాలలో ఇటువంటి వ్యాసం చదివినట్లు గుర్తు. ఇలాంటి అనుభవాలు ఈ తరం వారికి అర్ధం కావు. కథలు అనుకుంటారు. ఇప్పుడు ఎలాంటి కాలేజీ అయినా కాంపస్ ఇంటర్వ్యూ లు, మంచి జీతాలు. 95-96 వరకు కూడా ఇంజనీరింగు చదివితే అమెరికా కి వీసా రాకపోతే ఇండియా లో ఏం చేయాలి అన్న పరిస్థితే ఉండేది. ఇంజనీరింగు చదువుతున్నపుడు ఉన్న గర్వం ఒక్కసారి గా ఆవిరి అయిపోయేది. గోల్డ్ మెడలిస్ట్ అన్నా అవ్వాలి లేదా డబ్బు గల కుటుంబం అవ్వాలి లేదా రిజర్వేషన్ ఉండాలి. మధ్య తరగతి రకం గా ఉండే వారి పరిస్థతి ఘోరం. పైన పటారం లోన లొటారం అన్న మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాలలో దాదాపు అందరికీ ఇటువంటి కథలే ఉంటాయి. ఆత్మాభిమానం చంపుకుని ఎవరిని యాచించలేని, అప్పు చేయలేని పరిస్థతి. ఆ న్యూస్ పేపర్ కటింగ్ కో, జిరాక్సు కాపీ ల కో కూడా డబ్బులు ఉండవు. పైగా డబ్బు అడిగితే ఇవ్వలేనందుకు ఆ కోపం ఎక్కడ చూపించాలో కూడా అర్ధం కాక, ఆ గోల్డ్ మెడల్ ఎందుకు రాలేదన్న అక్షింతలు కూడా ఇంట్లో వాళ్లతో పడినా పడతాయి. మీరు వ్రాసింది బ్రహ్మానందం కామెడీ లాగా నవ్వుకున్నా అలాంటి బాధ స్వానుభవం మీద కానీ కొంత మందికి అర్ధం కాదు. అమెరికా లో ఉన్నారు అంటే పుట్టినపుడే బంగారు చెంచాలతో పుట్టారు అని చాలా మంది కి అభిప్రాయం. ఇలాంటి అనుభవాలు బాధ్యతారహితం గా ప్రవర్తించే యువతరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 2. వంగూరి చిట్టెన్ రాజు says:

  మీ స్పందనకి ధన్యవాదాలు. ఏ తరం లో ఉన్న ఇబ్బందులు ఆ తరానివే అయినా అవి అన్ని తరాలకీ తెలియ వలసిన అవసరాన్ని గుర్తించి నందుకు సంతోషం. నా కథలో చాలా మంది కథలు కలిసే ఉంటాయి అని నా నమ్మకం.

 3. రమణ బాలాంత్రపు says:

  అన్నయ్యా, మీ జీవన ప్రస్తానం, ఆనాటి సామాజిక పరిస్తితులూ మనసుకి హత్తుకునేలాగ అద్భుతంగా కొసరి కొసరి వడ్డిస్తున్నారు. అయితే మీ సహజమైన హాస్యరసం నీరసించకుండా చూసుకోండి.

  కాకినాడలో మీరు ఇంజినీరింగ్ చదివేరోజులలో మీ క్రికెట్ అనుభవాలను దాటవేశారేమి? నా ఉద్దేశ్యంలో మీలో నాయకత్వలక్షణాలు వృద్ధిచెందటానికీ, దరిమిలా విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదగడానికి మీ కాకనాడ క్రికెట్ సారధ్యం కూడా ఒక ముఖ్యకారణం అని నేను భావిస్తున్నాను. అంతేకాక, అలనాటి మీ క్రికెట్ టీమ్ మెంబర్స్ గురించి ఒకసారి జ్ఞాపకంచేసుకున్నట్లవుతుంది. నా స్వార్ధం నాదీ మరి.

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   కంగారు పడకు నాయనా, నేనూ, నా క్రికెట్టు గురించి అక్కడక్కడా కాకుండా ఒకే ఒక వ్యాసం రాద్దాం అనుకుంటున్న నా రహస్య ప్రణాళిక ని రెచ్చగొట్టి బయట పెట్టించేశావు. అందులో నీ పేరు తప్పకుండా ఉంటుంది.

 4. Janardhana Rao says:

  అయ్యా , ఇంచుమించు నా కథే మీరు రాశారనిపించింది… మీ పేజీని ఆక్రమించుకున్నాననుకోకపోతే నా కథ కూడా కొద్దిగా రాయాలనుకుంటున్నాను.. నేనుకూడా బి ఈ మెకానికల్ , 1979 లో అనంతపురము జే ఎన్ టి యూ లో పూర్తిచేసి మీలాగా ఇక్కట్లు పడ్డాను. అఫ్ కోర్స్ , మా బ్యాచ్ నుండీ అక్కడ [ అనంతపురం లో ] ఎమ్ టెక్ మొదలైంది..బొంబాయిలో నాలుగు చోట్ల ఇంటర్‌వ్యూ లకెళ్ళి సెలెక్ట్ కూడా అయ్యాను.. .ఉద్యోగాలలో సెలెక్ట్ అయ్యాను గానీ నాకు తెలిస్తేగా…. అదెలాగో ముందర చదవండి. ఖాళీగా ఎందుకుండాలని పైగా స్టైపెండ్ వస్తుందని, ఎమ్ టెక్‌లో చేరా.. నాకు బి ఈ లోనూ ఎమ్ టెక్ లోనూ డిస్టింక్షనే వచ్చింది.. నాకూ మీ లాగా ముగ్గురన్నయ్యలున్నారు.. కానీ మీ రెండో అన్నయ్య లాంటి దేవుడు నాకెవరూ లేరు. పైగా టెల్‌కో , సెయిల్, బి ఈఎల్ , వంటి మంచి కంపెనీల నుండీ నాకొచ్చిన అపాయింట్ మెంట్ లెటర్లను నాకు చూపకుండా చించేశాడు మా పెద్దన్నయ్య. అంతేకాదు , నా ఎమ్ టెక్ సర్టిఫికేట్ ను కూడా చించేశాడు.. తర్వాత ఎప్పుడో గానీ తెలియలేదు.. దైవం నావైపు ఉండబట్టి [ :) ] ఏదో ఒక మంచి గవర్న్‌మెంటు ఉద్యోగమే దొరికింది.

  ఇంకా చాలా రాయాలనుంది గానీ ఇక్కడ మీ ప్రత్యేక అనుమతి దొరికితే గానీ రాయలేను కదా..

  ధన్యవాదాలు.

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   మీ కథ రాసుకోడానికి నా అనుమతి ఎందుకు సార్..శుభ్రంగా అన్ని వివరాలతోటీ రాయండి. అందరూ చదివి ఆనందిస్తారు కదా! ఎంతయినా పీత కష్టాలు పీతవే కదా!

 5. చొప్ప వీరభధ్రప్ప says:

  సార్., మీ జీవితానుభవం బాగుంది. చదువు కోవడానికి ఈనాడు ఎన్నో అవకాశాలు న్నా యి. ఆనాడు ఇవేవి మృగ్యం. ఇట్టి స్వఛ్ఛమైన జీవితానుభవం భావితరాల యువతకు ఆదర్శంగా వుండగలదు .

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   అందరి జేవితానుభవాలూ స్వచ్ఛమైనవే కదా! రాసుకోడాన్ని బట్టి అది బయట పడిందా లేక లోపల దాక్కుని ఉందా అని తెలుస్తుంది…ఏమంటారు?

 6. ఉమా భారతి says:

  బాగుందండీ…. గోవిందరాజులుతో టచ్ ఎందుకుకని లేదో కూడా చెబితే….
  పోతే మీ మార్కుల విషయం చదవగానే – మీరు స్టేజీ మీద చెప్పిన – ఆంధ్ర నుండి పీతల ఎగుమతి షిప్మెంట్ – గుర్తొచ్చింది…
  నైస్ అండీ ఆర్టికల్…

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   గోవిందరాజులు తో టచ్ లో లేక పోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. బహుశా అతను బెంగుళూరు లో ఉండడం, నాకు బెంగుళూరు వెళ్ళే అవసరం ఎప్పుడూ లేకపోవడం ప్రధాన కారణం అయి ఉంటుంది. అదే కనక హైదరాబాద్ లో ఉంటే కనెక్ట్ అయ్యేవాళ్ళం ఏమో!
   మీ స్పందనకి ధన్యవాదాలు…ఉమా గారూ

మీ మాటలు

*