కొంత కదలిక…కొంత గలగల!

 

-రామతీర్థ

~

 

ramateerthaఒట్టాప్ళాక్కన్ నీలకండన్  వేలు కురుప్ గా జన్మించి (27.05.1931 – 13.02.2016)  ఎనభై నాలుగేళ్ల ఒ.ఎన్.వి.కురుప్ శనివారం 13.02.2016న మరణిస్తే,  కేరళ శాసన సభ ఆయన పట్ల గౌరవ సూచకంగా, ఈ ఒక్క విషయాన్నే ప్రస్తావించి, మరుసటి పనిదినానికి వాయిదా పడ్డది. ఒక్క శాసన సభ్యులకే  దక్కే ఈ గౌరవాన్ని, కేరళ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు తొలిసారిగా ఒక మహాకవికి ప్రకటించింది. 2011-12 సంవత్సరపు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు, కేరళ ఆర్థిక శాఖ మంత్రి “దినాంతం” అన్న  కురుప్ దీర్ఘ కవిత నుంచి ప్రారంభ చరణాలు చదివి  తన బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టారు.

 మలయాళ కవిత్వంలో గేయ ఫణితి లయాత్మకత, గాన లక్షణం,  సాహిత్యంలో ఇప్పటికీ అంతర్భాగాలే. వాటిని తన కవిత్వపు అంతర్భాగాలుగా మలుచుకుంటూనే, కురుప్ “నేను ప్రాచీన కవినే” అని చెప్పే వారు, ఎంతలా  ఆధునిక విషయాలపై రాసినా. కురుప్ ఉన్నత విలువలతో రాసిన సినిమా పాటలు ఆయనను, ఈ తరం యువ మలయాళీలకు కూడా  చిర పరిచితుడిని  చేసాయి. ఒకింత శృంగార సన్నివేశాలకు కూడా, మనోహర గేయాలు రచించిన ఖ్యాతి కురుప్ దే. మొదటి సారిగా “కాలం మారున్ను” 1954 సినిమాకు పాటలు రాసిన కవిగా కురుప్,   పలు దశాబ్దాలు అటు సాహిత్య రంగంలో, ఇటు సినిమా రంగంలో కూడా, తన సృజన ప్రమాణాలను రాజీ పడకుండా నిలబెట్టుకున్నారు.

 సినిమా రంగపు హడావిడి, రాత్రుల పార్టీలు, అవసరానికి మించి సినీ రంగపు వ్యాపార వేత్తలతో  కలిసి మెలిసి తిరగడాలు వీటన్నిటికీ, కురుప్ ఎప్పుడూ దూరంగా ఉండే వారు. ఒక యువ దర్శకుడు ఒక సారి, కొని పదాలు వాడి ఆయనను  పాట  రాయమంటే, అలాంటివి కుదరవని నిక్కచ్చిగా చెప్పిన  కళాకారుడు ఆయన. అయినా, “వ్యాపార రంగంలో  మేం డబ్బులు పెడుతున్నాము కనుక, సరకును మా ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటాము” అనే ఈ కాలపు పద్ధతి అయిన  లాభాల పంట పండించుకునే బండ వాదన ప్రభావంలో పడ్డ, ఆ యువ దర్శకుడు, పాట  రికార్డింగ్ సమయంలో ఏ మాటలైతే, కురుప్ రాయలేదో, వాటిని చేర్చిన విషయం  తెలిసి, పెద్ద  యెత్తున  అభ్యంతర పరిచిన వేళ , ఆ దర్శకుడు, ఆ మాటలను తొలగించడమే  కాక, కురుప్ కు బహిరంగ క్షమాపణలు కూడా చెప్పిన సంఘటన, కురుప్ సాహిత్య నైతిక స్థాయి పట్ల కేరళ సమాజంలో ఎంతటి గౌరవాదరాలు ఉన్నాయో తెలియ చేస్తుంది.  రెండు వందల ముప్ఫై రెండు సినిమాలకు రాసిన తొమ్మిది వందలు పైగా సినీ గీతాలు కురుప్ కలం  నుంచి వెలువడ్డాయి.

 ముణ్ణోట్టు ( ముందుకు) అనే కవితను తన పదహారేళ్లకే రాసిన ఈ కవి “దాహికున్న పానపాత్రం” కవితా సంపుటి తో  మొదలై, ఇరవైఒక్క సంపుటాలు రచించారు.  ఆరు  వచన రచనలు కూడా వీరు వెలువరించారు. “భూమిక్కొరు చరమ గీతం” పేరిట, వెలువడ్డ కురుప్ రచన గానయుక్త లక్షణంతో, మలయాళ  సమాజంలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది.  రష్యా దేశపు పుష్కిన్ పురస్కారం, మన దేశపు పద్మశ్రీ , పద్మ విభూషణ్, కేరళ విశ్వవిద్యాలయపు డాక్టరేట్,  కమలా సురయ్య పురస్కారం, జ్ఞానపీఠ పురస్కారం ఇలా ఎన్నో గౌరవాలు కురుప్ ను వరించాయి. “వైశాలి”  చలన చిత్రానికి, జాతీయ స్థాయిలో ఉత్తమ గీత రచయిత గా(1989)  పురస్కారం పొందారు. కేరళ రాష్ట్ర చలన చిత్ర పరిషద్  కురుప్ ను పదమూడు సార్లు ఉత్తమ సినీ గీత రచయితగా పలు వార్షిక గౌరవాలను అందచేసింది.

 2013లో గోర్కీ ఇన్స్టిట్యూట్  ఈయన  రాసిన యాభై కవితలను రష్యన్ భాషలోకి అనువాద ప్రచురణ గా ఆ దేశ ప్రజలకు అంద చేసింది. రష్యా దేశం “పుష్కిన్  ఆఫ్ కేరళ” అని గౌరవప్రదంగా సంభావించింది కూడా. రాజకీయాలు, విభేదాలు ఎన్ని ఉన్నా కేరళ సమాజం మౌలికంగా ఒక సాంస్కృతిక విలువల సమాజం. అది  కురుప్ విషయంలో, అసెంబ్లీ ఆయన మృతికి సంతాప సూచకంగా ఒక రోజు మూత పడితే, అటు  ఆయన అంత్యక్రియల్లో, సంగీతం ప్రధాన పాత్ర వహించింది. ఆయనే పేరి పెట్టిన కేరళ ప్రభుత్వ  శ్మశానవాటిక “శాంతికవాటం” లో, ఆయన  వయసు ఎనభై నాలుగేళ్ల సంఖ్యకు సరిపోయేట్టుగా, ఎనభైనాలుగు మండి గాయకులు, కురుప్ రచించిన గీతాలను ఆలపిస్తుండగా, ఆయన  పంచభూతాల్లో లీనమయాడు. కూచుని అంత్యక్రియలను తిలకించిన వారిలో కేరళ ముఖ్య మంత్రి ఊమెన్ చాండీ ముందు వరసలో ఉన్నారు.

కేరళ సాంఘిక రంగంలో ప్రముఖులు, ప్రఖ్యాతులు, భిన్న భిన్న రంగాలనుంచి, ఆయన కడసారి  చూపులకు తరలి వచ్చి, తమ ప్రేమ, గౌరవం, తెలుపుకున్నారు.భాషా  రాజకీయాల్లో పడి , మాతృభాషలను అలక్ష్యం చేయవద్దన్నది, కురుప్  హెచ్చరిక. విశాల వామపక్ష చింతనకు నెలవైన ఆయన రచనల్లో ఏదో ఒక రకంగా మనుషులను వేరులు పెట్టే  వివక్షల, ఆధిపత్య సంస్కృతుల పట్ల ఆగ్రహ ప్రకటన ఒక కేంద్ర స్వభావంగా కనిపిస్తుంది. అశాంతిపర్వం అనే కవితలో, ఆయన మందలింపు చాలా తీవ్రమైనది. “ కొయ్యి, ముక్కలు చెయ్యి, విడగొట్టు, వేరుపరచు, పల్లెనూ,పట్నాన్ని, తెగలనూ, నగరాన్నీ, భాగాలుగా ఎడం పెట్టు, వాటాలుగా ఎడ పెట్టు, ఒప్పందాలుగా పంచేసుకో – మృగాల్లా బతకండి, చంపుకుంటూ, కబళిస్తూ, పీక్కుంటూ, పులుల్లా, సింహాల్లా – ఒక్క  క్షణమైనా మనుషులుగా బతకవద్దు – మృగత్వానికి  పట్టం  కట్టి పండుగ చేసుకోండి”

 తన కవిత్వ రచన పట్ల కురుప్ విశ్వాసం  ఇది –

 “కవిత్వం నాకు అలా కలుగుతుంది అంతే. ఏది దాన్ని ఎగసన  తోస్తుందో నాకు అవగతం కాలేదు. అలాగని అదేదో కాలక్షేపపు ఆలోచన అని అనుకోలేను. ఒక స్ఫూర్తి అయితే తప్పకుండా ఉన్నది. మనం జీవితాన్ని గాఢంగా జీవిస్తాము. అన్నిటి పట్లా అదే గాఢ  భావన కలిగి ఉంటాము. జీవితమే నాకు ఒక కవిత్వ దోహద కారి. అదే నా స్ఫూర్తి, నాకు మరింకే ఆలంబనలూ లేవు. సూర్యుడి కింద ఉన్నదేదీ, కవిత్వానికి అతీతం కాదు.  లోకపు సంఘటనలన్నీ, కవి పట్టించుకోదగ్గవే. ప్రతీ రాత్రీ కొన్ని పీడకలలు మన తలల చుట్టూ తిరుగుతుంటే మనం నిదురిస్తాము. చెట్లు నరికే గొడ్డళ్ళ  చప్పుడో, బాంబులు పేలుతున్న బీభత్సారావాలో,  ఆడపడుచుకో, అవని తల్లికో, నిర్దయా  హైన్యంలో జరిగే మాన భంగాలో, అవి ఆందోళన కలిగించి మెదడులో ఉత్పాతాలకు కారణమవుతాయి. ప్రతీ విషాదంలో, ఇంకా తీవ్రమైన మరుసటి విషాదపు బీజాలు ఉండనే  ఉంటాయి. ఒక దుర్ఘటన, మరొక దుర్ఘటనకు పురిటి పక్క అవుతుంది. అవి అలా రెట్టింతలవుతాయి. ఒక నగరం అంతా  మత విద్వేషాల మంటల్లో మాడి  మసి అయితే, అది కవిత్వాన్ని, సాహిత్యాన్ని తప్పక ప్రభావితం చేస్తుంది. కవిగా నా కర్తవ్యం ఏమిటని నేను అనుకుంటున్నానంటే, ఈ దుఖాల, పెనుగులాటల, తీవ్ర వేదనల ఒడ్డు నుంచి, స్వేఛ్చ  అనే మరొక ఒడ్డుకు, వంతెనలు కట్టడమే. ఎక్కడో ఒక చోట, నా పాట  కొంత కదలిక,  కొంత గల గల,   కలిగిస్తే నేను గర్వ పడతాను. గౌరవం దక్కిందని భావిస్తాను, ఇదే నా పని అని కొనసాగిస్తాను. కవిత్వం పట్ల నా దృష్టి ఇది.”                          

 కురుప్ కవితలు రెండు 

క్షణికమే కానీ –
మంచుబిందువును నేను

ఆకుకొస నా ఆకుపచ్చ సింహాసనం

నింగి నిమ్మళమైన నీలం కరిగిపోతుంది నాలో

నా శిరసు పై సూర్య కిరణాలుశిలువ గుర్తులు గీస్తాయి

ఉదయ రవిబింబ మూర్తినా ఒళ్ళో  కిలకిలా నవ్వుతాడు

రొమ్ము తాగుతున్న అల్లారు ముద్దు బిడ్డలా –

కొంచెం ఒంగి చూసుకో ఒక సారి

నీ చిన్నదయిన ప్రతిబింబం స్పష్టంగా ప్రతిఫలించడం లేదూ  నాలో –

అయినప్పటికీ

నన్ను పొదివి పట్టుకున్నా ఆకు కొస

ఒకింత రవంత కదిలినా

ఏ అలికిడీ లేకుండా ముగిసిపోతుంది నా కథ

రాలిపోతూ కటిక నేలపై –

నాలో కరిగిపోయిన  సూరీడూ, ఆకాశమూ,

నావయినవన్నీ అంతరిస్తాయి – అప్పుడిక శూన్యమే –

ఆవిరై ఆ ఎగువనున్న స్వర్గాలకు వెళ్లాలనుకోను  నేను

అవసరమైతే నా చెమ్మను అంద చేస్తా

ఈ నేల  మట్టి రేణువుకు.

 

 

 పల్లె పదం

పల్లెటూరి కవులమయ్యా మరలా పాట  పాడమా

పాడిన పాటలు బాట తప్పి పోయాయి

నడిరేయి కాక గళం ఒరిసి అరుస్తున్నది

ఆ కాకిగోలలా  పదే పదే  పాడమా పాడమా

కను తెరవని వేకువలకు స్తుతి సంగీతాలూ

పిట్టలకు ముంగిలినా గింజలు జల్లేసి

పావురాళ్ల రాకకై పిట్ట పాట  పాడమా

లేని మావి చెట్టుకు ఊహ మావి కొమ్మకు

ఊగి ఊగేలా ఉయ్యాల పాట  పాడమా

ఎండిన వాగుల నెర్రెల  పర్రల బీడులా

హైలెస్స హైలెస్సా కాగితపు పడవలై

ఎండిన గొంతులా మేము పాటలు  పాడాలా

పాడాలా పాటలు తడి లేని మబ్బులకు

ఎత్తాలా గొంతులు మనసు లేని వానలకు

నిదరలు నటించే లేవని  వారిని లేపేలా

మేము డప్పులు మోగిస్తూ చప్పుడై రేగాలా

అలనాటి విందుల ఆ నిండు కథలన్నీ

చెప్పాలా పిల్లలకు కడుపుకోత జోలలుగా

ఆకొన్న బిడ్డలకు చేత లేని ముద్దలుగా

పాడాలా తీయగా పాడాలా  హాయిగా

ఆ పట్టు పుట్టాల సుతిమెత్తందనాలను

ఆ రాజు, ఈ రాజు ఎక్కినా  రథాలను

పాడాలా  జోరుగా, పాడాలా హోరుగా

ఈ నేల పాలకుల దిస మొల దర్పాలూ

ఊరేగే డాబులా ఆ బట్టబయలులూ

మునుపు పాడిన పాటలన్నీ ఏక మొత్తంగా

బాట తప్పి పోయాయి, దారి ఎరుగకున్నాయి

చెప్పండి అన్నలూ, చెప్పండి నాన్నలూ

పల్లెటూరి కవులమయ్యా మరలా పాట  పాడమా..

 

మీ మాటలు

 1. చొక్కరతాతారావు says:

  ఒక కవి గురించి కేరళ ప్రభుత్వం శాసనసభలో
  ప్రస్థావించిందంటే ఆప్రభుత్వానికి సహజంగానే
  కవులు,కళాకారుల మీద అపారమైన గౌరవం
  ఉందనిచెప్పాలి.కేరళ ప్రజలకు తమ మాతృభాష
  మీద ఉన్నంత మమకారం మనతెలుగువాళ్ళకు
  లేదు.మనప్రభుత్వాలైతే ప్రభుత్వ బడులను
  మూసేసి కార్పోరేట్ బడులకు,కళాశాలలకు
  ద్వారాలు తెరిచారు వాళ్ళిచ్చే ముడుపులకు
  కక్కుర్తిపడి.

మీ మాటలు

*