ఇది ఆకలి కత కాదు – అవమానాల వెత

 

 -ఎ . కె . ప్రభాకర్

~

 

ఒక్కో కథ చదివాకా ఆ  కథ లో పాత్రలు చాలా కాలం గుర్తుండిపోతాయి.  కొన్ని పాత్రలైతే వెంటాడతాయి. పాత్ర పేరు చెప్పగానే కథంతా స్ఫురణకి వస్తుంది. కొన్ని కథల్లో సంఘటనలు కథని మరచిపోనివ్వవు. ఏక వాక్య కథలుగా కొన్ని మనసులో పాతుకుపోతాయి ; సారం చెప్పగానే కథ యాదికొస్తుంది. కొన్ని కథలు రచయిత శిల్ప కౌశలం కారణంగా కేవలం విలక్షణమైన టెక్నిక్ ద్వారా  మెదడు పొరల్లో జ్ఞాపకాలుగా కదులుతూ వుంటాయి. చాలా తక్కువ కథలు మాత్రమే శీర్షిక పేరు చెప్పగానే కథలోని పాత్రలూ వాటి ప్రవర్తన సంఘటనలూ సన్నివేశాలూ సంభాషణలూ యితివృత్తం దాని నిర్వహణా కథనపద్ధతీ భాషా వాటిని వాహికలుగా మలచుకొన్న రచయిత దృక్పథం అన్నీ వొక దాని వెంట మరొకటి కళ్ళముందు దృశ్యమానం అవుతాయి. అటువంటి అరుదైన కథల్లో వొకటి ఎమ్ ఎమ్ వినోదిని రాసిన

(తొలి ముద్రణ : అరుణతార  – జనవరి, 2015 ,  ‘బ్లాక్ ఇంక్’ సంపుటిలో పునర్ముద్రితం). ఆ కథ అరుదైనది కావడానికి మొదటి  కారణం స్వీకరించిన వస్తువు. రెండోది చెప్పిన వైనం.

***

చానాళ్ళ కిందట వూరినుంచి పనిమీద నగరానికి వచ్చి అక్కడ అభివృద్ధి చెందిన రాజపథాల్లో వుచ్చ పోసుకోడానికి మరుగు దొరకక విలవిల్లాడిన మహిళ  క్షోభని కథగా చదివి క్రోధంతో రగిలిపోయిన జ్ఞాపకం వుంది. దశాబ్దాలు నడిచి వచ్చాకా  యిప్పుడు వినోదిని కట్ట చదివినప్పుడూ అదే అనుభూతి. జపాన్ సింగపూర్ నమూనాల వర్తమాన చరిత్ర కూడా అంతే సంబడంగా వుందని గుండె జలదరించేలా ‘కట్ట’ మరోసారి నిరూపిస్తుంది.

దళితవాడ నుంచి పై చదువుకోసం హాస్టల్లో చేరి అక్కడ లెట్రిన్ సౌఖ్యం అనుభవించే పదహారు పదిహేడేళ్ళ అమ్మాయి ‘సొరూప’ సెలవలకి యింటికి వచ్చినప్పుడు మరుగుదొడ్డి సదుపాయం లేక రైలు పట్టాల మీదకి ‘దొడ్డికి’ పోవాల్సినప్పుడు అనుభవించిన బాధల పరంపర కట్ట.

ఆస్టల్లో వుప్పూకారం లేని కూరలు తినటం మూలాన నాలికంతా చప్పబడిపోయిన సొరూప అమ్మ చేసిన ‘గోంగోర పచ్చిమిరగాయాలు వుడకబెట్టి నూరిన పచ్చడి’ వేసుకొని యిష్టంగా రెండు ముద్దలు అన్నం యెక్కువే తింది. ఫలితంగా తెల్లారక ముందే ‘దొడ్డి నెప్పి’. కూర్చుంటే రెండు మడాలూ తడిసి పోయేంత పెద్ద యిరోచనం. ఇక తెల్లారుతూనే మొదలైంది నరకం.

కరుణామయుడు సినిమాలో ‘యేసయ్య సిలవ మీద చచ్చిపోయినపుడు – కొండరాళ్ళు దొర్లుతయ్ , సముద్రాలు వుప్పొంగుతయ్ , అగ్నిపర్వతాల కుండ మీద మూత పేలిపోయి , మంట యెక్కువైతే పప్పుచారు పొంగినట్టు లావా పొంగిపోద్ది . అట్టా వుంది నా కడుపులో.’  స్వరూప తన  శారీరిక బాధని తనకు తెలిసిన భాషలోకి తర్జుమా చేయడానికి పడడిన అవస్థ యిది.

తలమీద ముళ్ళకిరీటం బెట్టి లోపలికేవరో గట్టిగా వొత్తుతున్నట్టున్న సొరూప పడ్డ బాధని ఆమెతో పాటు కథ చదివే వాళ్ళు కూడా అనుభవిస్తారు. కానీ అసలు సమస్య – పగటి పూట పదే పదే కట్ట మీదకి పోవాల్సి రావడమే.

‘చెంబు తీసుకొని యిళ్ళ మజ్జ నడుచుకుంటా బోవాల. ‘యెప్పుడొచ్చావమ్మాయ్?’– అని అందరూ పలకరిస్తావుంటారు. దానికి తోడు కట్టకి పొయ్యొచ్చే మా గేరి మొగోళ్ళు యెదురవుతావుంటారు. అన్నయ్యలూ , అంకుళ్ళు. నాతోపాటు మా లూథరన్ హైస్కూల్లో చదువుకున్న సీనియర్లు , జూనియర్లు కూడా వుంటారు. వీటన్నిటికీ మించి పగలు ఆడోళ్ళు కట్టమీద కూర్చోడానికి లేదు! కట్ట పక్కన డవున్లో వున్న ముళ్ళ కంచెల్లోపలికి వొంగొంగి నడుచుకుంటాబోయి కూర్చోవాల. అసలే పెంటలరొచ్చు. రోతగా వుంటది. దానికి తోడు రాత్రంతా వానబడివుంది. కుప్పలన్నీ చింది, చుట్టూ చెల్లాచెదరుగా యెగిరిపడి వుంటాయ్. యెంత కష్టమో నడవడం. తావు వెతుక్కోవడం.’

అందుకే సెలవలు వస్తే లేటుగా లేస్తామని చెప్పుకొనే వాళ్ళని చూస్తే స్వరూపకి అసూయ.  ‘తెల్లగా తెల్లవారడం’ గురించి పంచుకోలేని  భయం , చెప్పుకోలేని ఆందోళన.

‘స్వచ్ఛ భారత్’ ప్రాంగణాల్లో కెమెరాల ముందు చీపుర్లతో దర్శనమిచ్చి  ‘నమో’ వాక్యాల భజన చేసే రాజకీయ దుర్గంధ నాయుళ్ళందరూ కట్ట మీదినుంచి వీచే యీ గవులును వొక్కసారి పీల్చి సిగ్గుపడాల్సిన అవసరాన్ని గుర్తుచేసే యీ కథలోని  వస్తువుతో కొందరికి పేచీ అయితే రచయిత సొరూప ముఖత: వర్ణించిన చీదర కొంతమందికి కడుపులో కెలికినట్టు చేసింది.

‘నా యెడం పాదం ముందు నుంచి – నలుపు మీద నాలుగు యర్ర మచ్చలున్న పురుగు పోతావుంది. అది ముందుకాళ్ళతో కుంకుడు గింజంత పియ్యి వుండని దొర్లించుకుంటా పోతావుంది. దొర్లించుకుంటా పోటం వలనేమో , వుండ బో గుండ్రంగా , చూట్టానికి చిన్నసైజు లడ్డులాగా వుంది.

‘ … పాదాల్నిండా పియ్యి. కజాబిజి తొక్కానేమొ , అతుక్కుపోయింది. యేళ్ళ మజ్జ నుంచి పొడుచుకొచ్చి , అంచుల్లోకెల్లకొచ్చి …! చెప్పుల్లేకుండా నల్లమట్టి పొలంలో నడిస్తే మట్టి బూట్లొస్తాయే , అట్లొచ్చినయ్ పియ్యబూట్లు!’

యిటువంటి వర్ణనలు చాలా మంది కథా శిల్ప ప్రేమికులకి , సమీక్షకులకి మింగుడు పడలేదు. ఇది కథ కాదు అని కంగారు పడ్డారు. ఇన్నాళ్ళూ కథలకి గీసుకొన్న కొలతల్లో యిమడని  రచనా శైలి యిది. ఈ శైలే  ప్రధాన స్రవంతి పత్రికలకు ఈ కథ పట్ల అసహ్యం కలిగి ప్రచురించకపోటానికి కారణమయింది. మన యీ సభ్య నాగరిక సమాజం లోపలి – బయటి  కల్మషాన్నంతా పై నుంచీ కిందకి ‘చేపని కడిగినట్టు సుబ్బరంగా రుద్ది’ కడిగి పారేయడానికే రచయిత కావాలనే యీ ముళ్ళ దారిలో నడిచిందని  గ్రహించాలి. నిజానికి మనం యింకా  యిటువంటి సమాజంలో బతుకుతున్నందుకు దిగులుతో  సిగ్గుతో బెంగతో  ‘సిరిసెవట్లు’ పుట్టాలి గానీ పీతుర్ల వర్ణనల పట్ల అసహ్యం కలగనేల?

నాకైతే కథ చదివాకా చదివిన ప్రతిసారీ రోజుల తరబడి నిద్ర పట్టలేదు. కారణం యిదంతా – యీ చీదరంతా – చెరువు గట్టున పందుల కుమ్ములాటలోనో , కాలవ వొడ్డున రెల్లు దుబ్బుల చాటునో , రోడ్డు వార కంచె తుమ్మ కంపల మధ్యనో   కాలేజీ చదువు పూర్తయ్యేదాకా నేనూ అనుభవించా. అది కేవలం  స్వీయానుభవం మాత్రమే కాదు; నా చెల్లీ తల్లీ అక్క అవ్వ కుటుంబ స్త్రీలు మా వాడకట్టులోని ఆడవాళ్ళందరూ అనుభవించారు. వాళ్ళందరికీ చెంబట్టికొని వెళ్ళే ఆ చీకటి కార్యక్రమం యెంత అవమానాస్పదమైనదో యెంత లజ్జాభరితమైనదో యెన్ని యిబ్బందులకు హేళనలకు నెలవో యెంత హింసకు పాదో  ఆ వయసులో నాకు తెలీదు. ఆ తర్వాత తెలిసొచ్చింది. కానీ  వినోదిని కట్ట చదువుతుంటే ఆ అవమాన గాయాల్ని మళ్ళీ మళ్ళీ కెలికినట్టయింది. చాలా డిస్టర్బ్ అయ్యా.  అయాం అగైన్ యిన్  డీప్ షిట్ !

ఈ బహిర్భూమి కార్యక్రమం స్త్రీలకు అనునిత్యం చిత్రహింసే. కూర్చొని వుండగా అంతదూరంలో రైలు బండి వస్తుందంటే , యెవరైనా ‘మొగమనిషి కనబడ్డాడంటే లేచి నిలబడాల్సిందే!’. ఆడవాళ్ళకి మాత్రమే యీ  హింస. ‘యిట్లా మజ్జలో లేచి  నిలబడే అవసరముండ’ని మగపుటకకి ఆడజన్మలో లేని గొప్ప వెసులుబాటు వుందని అనుకొన్న స్వరూప పాయింట్ లోని చేదు ‘అనుభవించినోళ్లకే తెలుస్తది’.

అంతేకాదు అక్కడ పియ్యి తినడానికొచ్చే పందులతో కుక్కలతో యుద్ధమే చెయ్యాలి. అన్నిటికీ మించి తమ లేకి చూపులతో గాలి మాటలతో వెకిలి చేష్టలతో అత్యాచారానికి పూనుకొనే మగకుక్కల బారిన పడకుండా కాపాడుకోడానికి అనుక్షణం అప్రమత్తంగా వుండాలి.  ఒక విధంగా యిన్ని అవమానాల మధ్య ఆడదానికి  కాలకృత్యం తీర్చుకోవడం దినదిన గండమే , జీవన్మరణ సమరమే.

పగటి పూట కట్ట పక్కన ముళ్ళ కంచెల్లో సిగ్గుతో నొప్పితో సతమతమవుతున్న స్వరూప వొక పోకిరీ వేధింపుకి భయపడి ముళ్ళ కంచెల్లో పరుగెత్తినపుడు ఆమె అనుభవించిన శారీరిక – మానసిక క్షోభ మాటల్లో చెప్పలేనిది. పాపం అరికాళ్ళలో గుచ్చుకొన్న ముళ్ళని తీయగలిగినన్ని తీసి (యిరిగి లోపలే వుండిపోయినవి కాక యిరవైమూడు) పొట్లం కట్టి అమ్మకి చూపించిన సందర్భంలో స్వరూప యేడుపుకి కరగని పాఠకులుండరేమో! ఇక  ‘సెవిటి కరుణమ్మదొడ్డికెల్లి రైలు కిందబడి’ చనిపోయే ముగింపు అయితే హృదయవిదారకం.

***

జీవితాన్ని వున్నది వున్నట్టుగా యథాతథంగా చిత్రిస్తే అది కళ కాదు ; కేవల వాస్తవానికీ కళకీ మధ్య వున్న రేఖని స్పష్టంగా గుర్తించడంలోనే రచయిత మెళకువ చూపాలి – అని చెప్పే రొట్టకొట్టుడు విమర్శ సూత్రాలకి అందని కథ యిది. జీవిత సత్యావిష్కరణ కంటే మించిన కళ వుండదన్న స్పృహతో చెక్కిన మొరటు శిల్పం యిది. ఎటువంటి మేలి ముసుగులు అలంకారాల తొడుగులు లేకుండా వొక దు:ఖ భాజనమైన – అవమాన భరితమైన పేద దళిత జీవన పార్శ్వాన్ని సామాజిక బీభత్సంతో అన్వయించిన కథనం యిది. నోట్లో వెండి చెంచాల్తోనూ యింట్లో అటాచ్డ్ ప్రాచ్య – పాశ్చాత్య స్నానాగారాల ఫ్లషవుట్లతోనూ పుట్టి బతికే నాగరికులకు అర్థంకాని దుర్భరమైన వేదన యిది.

జుగుప్స కలిగించే పియ్యి పీతుర్ల వర్ణనల్లేకుండా యీ కథ రాయడం యిదే కథలో తెనాలి రామలింగడు వొకానొక విద్వాంసుడితో చాలెంజ్ చేసినట్టు పాస్ పొయ్యకుండా దొడ్డిక్కి కూర్చోవడమంత కష్టం అని రసజ్ఞులైన భావుక విమర్శకులు తెలుసుకోవాలి (ఈ చీదరని భరించలేని తనం నుంచి బయట పడటానికే జీవితంలో , కథలో దొడ్డికి చుట్టూ జోకులూ పిట్టకథలూ చోటుచేసుకొన్నాయేమో!).

అయితే రైలు కట్ట పట్టాల పక్కన పెంటలు ‘చూడ్డానికి ఇరగబూసిన బంతిపూల్లగా, చేమంతి పూల చెండుల్లాగా కనపడతయ్’ అని రచయిత వొకచోట చేసిన  ఆలంకారిక వర్ణన శుద్ధ కళా వాదుల ముఖమ్మీద రచయిత ఐచ్ఛికంగా విసిరి కొట్టిన అశుద్ధమే. సాహిత్య భావుకులకీ  సౌందర్య పిపాసువులకీ కళారాధకులకీ  చెంప పెట్టులా గబ్బిల దౌత్యం నెరపిన మహాకవి గుర్రం  జాషువా వారసత్వమిది. పదాల మాటునో అంతరార్థాల వెనకో దాక్కోకుండా ముక్కుసూటిగా మాట్లాడే దళిత తత్త్వమిది. కళ్ళముందు కనపడే వాస్తవాలతో  యెటువంటి దాపరికాలకీ తావులేని యింత సాదాసీదా కథని నేనిటీవల చదవలేదు.

కేవల యథార్థ జీవిత చిత్రణకి ప్రలోభపడి  వినోదిని కథానిర్మితి విషయంలో యెక్కడా యే మాత్రం అశ్రద్ధ చూపలేదు. కథ చెప్పేది యింటర్మీడియట్ చదివే అమ్మాయి. ఆమె సామాజిక నేపథ్యం పేద దళిత క్రైస్తవ జీవితం.  పదహారేళ్ళ ఆ  పిల్ల మౌఖిక కథనంలో అనేక  ఆర్ధిక – సాంస్కృతికాంశలనీ , వాటితో ముడివడి వున్న భాషనీ  అతి సహజంగా తీసుకువచ్చే విషయంలో  రచయితగా వినోదిని చూపిన నేర్పు ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది.  కథా గమనంలో అనేక సామాజికాంశాలు ప్రస్తావనకొస్తాయి. ఆ యా సందర్భాల్లో రచయిత  దృక్పథం కూడా స్పష్టంగానే తెలుస్తుంది. కథ ప్రారంభమే అందుకు మంచి వుదాహరణ.

కాలేజికి సెలవలని వినగానే  స్వరూపకి అందరిలా సంతోషం కలగలేదు. ‘గుండెల్లో రాయి పడింది. ఆస్టల్ అన్నంలో దొరికేంత చిన్నసైజు కాదు. రైలుకట్ట మీదుంటదే , చేతిలో సరిపోయేంతది, అంతది.!’

మొదటి పంక్తుల్లోనే కథాంశం , కథా సారం రెండూ వొకేసారి  వ్యక్తమయ్యాయి. రచయిత ప్రతిపాదించదల్చుకొన్న విషయం హాస్టల్ అన్నం , అన్నంలో రాళ్ళ సమస్య కాదు – వాటిని మించిన భీతావహమైన సమస్య యింట్లోనో బయటో మరుగుదొడ్డి లేకపోవడం అని తెలుస్తుంది.  అందువల్ల యిది ఆకలి కత కాదు – అవమానాల వెత . ఆకలికే కాదు అవమానాలకి కూడా పాదు పేదరికమేనన్న స్పృహ  రచయిత  యే సందర్భంలోనూ మర్చిపోలేదు.

యూరియా సంచులు కలిపి కుట్టి నాలుగు మూలలా పాతిన బొంగుల ఆసరాతో మూడు గోడల్లా చుట్టి , తలుపు బదులు పాత చీర అడ్డంగా కట్టిన బాత్రూం , నున్నగా అలికిన నేలమీద బొంతేసుకొని పొణుకోవడం ,  ఇంటి తాటాకు కప్పులోంచి కురిసే వానకి కప్పుకున్న దుప్పటి తడవడం , నీళ్ళు కారిపోయే చిల్లు రబ్బరు చెంబు , కిరసనాయిలు దీపం బుడ్డీ , చిన్న చిన్న బట్టల సబ్బు ముక్కల్తో వొళ్ళు రుద్దుకోవడం , బయటుండి చదువుకొనే గేరి పిల్లలు సెలవలకి యిళ్ళకొచ్చినపుడు కూలి పనులకి పోయి పుస్తకాలకీ బట్టలకీ నాలుగు డబ్బులు సంపాదించడం … యిలా   కథావరణానికి అవసరమైన సామగ్రి యేదీ  ఆమె దృష్టి నుంచి తప్పించుకుపోలేదు.

నిజానికి వాస్తవ జీవిత చిత్రణ దానికదే కథ అయిపోదు. యథార్థతని గ్రహించడానికి , గ్రహించినదాన్ని సరైన మాధ్యమంలో ఆవిష్కరించడానికీ సమ్యగ్ దృక్పథంతో కూడిన సునిశితమైన పరిశీలన అవసరం. అది వినోదినిలో నిండుగా వుందని కట్ట నిరూపిస్తుంది. ఆమె కన్ను కెమెరా కన్ను. చూపు మైక్రోస్కోపిక్ చూపు. చిత్రణ మల్టీ డైమన్షనల్. వాడిన రంగులు సహజ సిద్ధమైనవి. కాన్వాస్ జీవితమంత విశాలమైనది.

అందుకే – బొట్టు బొట్టుగా యింట్లోకి కారే వాన నీళ్ళు గిన్నెలోకి పడుతున్నప్పుడు చేసే శబ్దానికి నిద్ర చెడకుండా వుండడానికి గిన్నెలో బన్నీ (బనియన్) వేయడం , కట్ట మీదకెళ్ళినపుడు చిల్లు చెంబులో నీళ్ళు కారిపోతే పక్కవాళ్ళనుంచి పంచుకోవడం , పీతుర్ల మధ్య చెంబు పెట్టడానికి బెత్తెడు చోటులేక పాదమ్మీదే పెట్టుకోవడం , దొడ్డిక్కూడా వొక్కచెంబులోనే నీళ్ళు తీసకపోయే సావాసాలు , పక్కపక్కనే కూర్చుని చెప్పుకొనే కతలు – కబుర్లు , దసరా సంక్రాంతి పండగలప్పుడు స్కూల్లకీ కాలేజీలకీ అన్నేసి రోజులు సెలవలిచ్చి క్రిస్టమస్ కి వొక రోజు సెలవివ్వడంలో కనిపించే ఆధిపత్య మత భావన గురించిన ప్రస్తావన , కూర్చుంటంటేనే తినడంకోసం కాసుకున్న పందుల ఆరాటం , కట్ట మీద నుంచి తిరిగొచ్చేటప్పుడు చెంబు కుడి చేత్తోనే పట్టుకురావాలని గుర్తుచేసుకోవడం , చెంబు మళ్ళీ గాబులో ముంచేముందు అడుగు కడగడం , యిరోచనాలు కట్టుకోడానికి మాత్తర్లేసుకొనే సొంత వైద్యాలు – సగ్గుబియ్యం గంజి తాగడం – పంచాదారేసుకొని యిడ్లీ తినడం , కాకెత్తక పోద్దని వొంటి సబ్బు యింట్లో దాచిపెట్టుకోవడం  … వంటి నిర్దిష్ట జీవితానికి సంబంధించిన అనేక సూక్ష్మాంశాలు కథలోకి అలవోకగా వొచ్చి చేరాయి. వాటితోబాటు యింటా బయటా గేరీ మనుషుల్లో మాటల్లో కనిపించే వినిపించే క్రైస్తవ సంస్కృతి కథకి మరింత సహజ పరిమళాన్ని అందించింది.

అయితే వీటిలో యేవీ రచయిత దృష్టికోణం నుంచి చూపినవి కావు. ఇంటర్ చదివే టీనేజి అమ్మాయి చూపు ద్వారా కథలోకి యెక్కినవే ( ఇస్లాం పేట మసీదు నుంచీ విన్పించే అజా తప్ప). ఆ వయసు పిల్లల ఆలోచనలు , భయం ఆందోళన సంతోషం దు:ఖం వంటి మానసిక వుద్వేగాలు , వాటి వ్యక్తీకరణ రీతులు , అందుకు వుపయోగించిన భాష – పదజాలం , వుచ్చారణా పద్ధతులు – అన్నిటినీ అపూర్వమైన నైపుణ్యంతో రచయిత ఆవిష్కరించి ఆత్మకథాత్మక  కథనానికి విశ్వసనీయతని సాధించింది. అదే యీ కథలో అంతర్గతంగా కనపడని శిల్పం. అదే ఈ కథలోని బలం కూడా. గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రాంతపు గేరీల భాషని వినోదినిలా యింత అద్భుతంగా సాహిత్యంలోకి యింతకుముందు యెవరూ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. అందుకే అపూర్వమనడం.

***

నీళ్ళులేని కమ్యూనిటీ టాయిలెట్లకి సంబంధించిన విషయాన్ని యితివృత్తం చేసుకొని తీవ్ర క్రోధంతో  శాంతి నారాయణ రచించిన  ‘అసలవి లేనప్పుడు …’ కథ  దీని తర్వాతి  కాలంలోనే ( ప్రజాసాహితి , జూలై – 2015) వచ్చింది. మధ్యాహ్నం పూట చెంబు పట్టుకొని జొన్నతోట్లోకి వెళ్లి ఎలుగుబంటి కి చిక్కి చచ్చిపోయిన  మండల ప్రెసిడెంటు మాదిగ మారెక్క వుదంతాన్ని పేర్కొంటూ  ‘ఒక ఆడడానికి ఈ దేశంలో స్వేచ్ఛ కంటే మరుగుదొడ్డి చాలా ముఖ్యమని’ ఆత్మ గౌరవ ప్రకటన చేసిన పద్మావతి , ‘సాగునీల్ల కత దేవుడెరుగు , కడాకు తాగడానికి గుటికెడు మంచినీల్లూ ముడ్డి కడుక్కోడానికి చెంబెడు నీల్లూ ఈలేనప్పుడు ఈ రాట్రం బంగారుదైతే మాకేమొత్తది , యెండిదైతే మాకేమొత్తది?’ అని రాష్ట్రాన్ని సింగపూరో జపానో చైనానో చేస్తామని వూదరగొట్టే నాయకుల్ని ప్రశ్నించి రాజకీయ చైతన్యం చూపిన రామన్న , ‘నీల్లు ఎటూ దొరకవు , దినామూ బయటికి ‘దొడ్డికి’ పోయినంక ముడ్డి తుడుసుకుందేకి’ గులకరాళ్ళు పంపించమని కలెక్టర్ ని నిలదీసి అధిక్షేపించి హేళన చేసిన సుబ్బమ్మ యీ కథలో గొప్ప పోరాట యోధులుగా దర్శనమిస్తారు.

‘కట్ట’ కథలో యిటువంటి పాత్రలు లేవు. రాత్రిపూటే కావొచ్చు రోడ్డు పక్కనే కూర్చోవాల్సి వచ్చినప్పుడు యెల్తుర్లో ఆ యిబ్బంది నుంచి అవమానాల నుంచి తప్పించుకోడానికి ‘కరెంటు స్తంబం మీద లైటు పగల్నూకిన’  అంజమ్మత్త చేతిలోని రాయి కేవలం గౌరవం కాపాడుకొనే సాధనంగానే కాకుండా తమ దురవస్థకి కారణమైన వ్యవస్థపై ఆయుధంగా మార్చుకొంటే బాగుండుననిపిస్తుంది.

కథ మధ్యలోనో చివరనో  ఒక చూపుడు వేలి కోసం వెతుక్కోవడం తప్పుకాదేమో! సూచ్యంగానో వాచ్యంగానో అటువంటి భరోసానివ్వని కథ కంప్లైంట్ కథగా మిగిలిపోయే ప్రమాదముంది. దాన్నుంచి తప్పించడానికే రచయిత కరుణమ్మ మరణాన్ని కథకి ముగింపుగా మలచినట్టు అనిపిస్తుంది. చీకట్లో మొదలై చీకట్లోనే ముగిసే రోజువారీ బతుకు వెతలపై నిరసనే ఆగ్రహ ప్రకటనే ఆ అవ్వ మరణం. ఈ దేశంలో దొడ్డికెళ్ళడం కూడా చచ్చేచావు అన్న పచ్చినిజం కోపానికి కారణమవుతుంది. కట్ట మీద దొడ్డిక్కూర్చోడానికెళ్ళిన సెవిటి కరుణమ్మవ్వ రైలు కింద పడి చనిపోవడం పాఠకుల్లో ‘పెద్ద రైలుకూతలా  గుండెల్లో దుఖ్ఖాన్ని’ మాత్రమే కలిగించదు ;  ఆగ్రహాన్నీ ఆవేశాన్నీ సైతం  రగిలిస్తుంది.

ఫిర్యాదు కథల ముద్రకి గురికాకుండా వినోదిని తీసుకొన్న యిటువంటి జాగ్రత్తల గురించి పి. సత్యవతి స్పష్టంగానే గుర్తించారు. అందుకే  ‘కన్నీళ్లు  తెప్పించడం ఈ  కథల ప్రయోజనము లక్ష్యము ఏ మాత్రం కాదు … నిలవ నీటిలో ఆనందం పొందే మొద్దు చర్మాలని అంకుశంతో పొడవాల్సిందే – ఆ అంకుశాన్ని తన కలం చేసుకుంది వినోదిని’ ( ‘బ్లాక్ ఇంక్’ పుస్తకానికి ముందు మాటలో) అంటారామె. నిజానికి కథ పొడవునా రచయిత ప్రాపంచిక దృక్పథం పరచుకొని వుండడం వల్ల కూడా వినోదిని కథలు కేవలం ఫిర్యాదు కథల్లా మిగిలిపోవు. దళిత సామాజిక వాస్తవికత వినోదిని కథలకి ఆయువుపట్టు. దానికి క్రైస్తవ సంస్కృతీ , స్త్రీ చైతన్యం జోడించడంతో ఆమె కథలు విశిష్టతనీ  ప్రత్యేకతనీ అనితరతనీ సాధించుకొన్నాయి.

ఇళ్ళలో సరైన టాయిలెట్ల సదుపాయం లేని ‘గరీబు ముస్లిం ఆడోల్ల బతుకు’ దైన్యంలోని భిన్న కోణాన్ని పదేళ్ళ కిందే షాజహానా కథగా రాసింది( వతన్ – 2004). అప్పుడు అదేదో ఘోషాలోని మైనార్టీల కడుపు నొప్పి అని యే కొందరో వుపేక్షించారేమో గానీ   ‘ఊర్ల ముస్లింలు కానోల్లంతా ఊరి బైటికెల్తరు గదా .. వీళ్లు గూడ ఎల్తేంది ??’ అని సోచాయించే కొత్త దుల్హన్ , నయీ బహూ షమీమ్ బాధకి కారణమైన సామాజిక – ఆర్థిక నేపథ్యం చాలామందిని ఆలోచింపజేసింది.  సండాస్ లో షమీమ్ అనుభవించిన వేదన , కట్ట మీద స్వరూప పడిన యాతన వొకటే. రెండుచోట్లా అందుకు కారణం పేదరికమే.

ఇటువంటి  నిజాల్ని దాచిపెట్టి బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాలు చేసినందుకు హేళనగా చప్పట్లు కొట్టే అడ్వర్టైజ్మెంట్ వొకటి యీ మధ్య టీవీ లో వస్తుంది. యెంత శాడిజం! మరుగుదొడ్డి లేని యింట్లో పిల్లనివ్వవద్దని చెప్పే విద్యాబాలన్ మరుగుదొడ్లు కట్టివ్వని పాలకులకు వోటెయ్యొద్దని ప్రచారం చేస్తే బావుణ్ణనిపిస్తుంది. కాంట్రాక్టర్లు అధికారులు రాజకీయ దళారులు లక్షలు స్వాహా చేసి కట్టిన పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ యెంత గొప్పగా వుంటుందో చూస్తే మొత్తం వ్యవస్థ మీదే రోతపుడుతుంది. పెయిడ్ పబ్లిక్ టాయిలెట్ల బాగోతం మళ్ళీ వేరే.

అంతర్జాతీయ మార్కెట్లో మెకిన్ యిండియా నినాదంతో  వూదరకొడుతోన్న పాలకులకి కట్ట , సండాస్ , అసలవి లేనప్పుడు … వంటి కథలు గొంతులో పచ్చి వెలక్కాయల్లా మింగుడు పడక పోవచ్చు. కంట్లో నలుసుల్లా మెరమెరలాడవచ్చు. దేశమంతటా వీస్తోన్న యీ గవులు వారికి పెద్ద విషయం కాకపోనూవచ్చు. కానీ సామాన్యుడికివ్వాళ కావాల్సింది – డిజిటల్ ఇండియా కాదు  టాయిలెట్స్ ఇండియా అని యీ కథలు ముక్కు మీద గుద్ది మరీ చెబుతున్నాయి. దేశభక్తుల పన్నులతో నడిచే వొక విశ్వ విద్యాలయంలో పనిచేస్తూ దేశ గౌరవాన్ని మంటగలిపే యిటువంటి కథ రాసినందుకు వినోదినిని  దేశద్రోహనేరం కింద విచారణ లేకుండానే అసహనంతో శిక్షిస్తారేమోనని అనుమానంగా వుంది. సృజనాత్మకతనే ఆచరణగా మార్చుకొన్న వినోదిని నిబద్ధతకు (దీన్నేFawzia Afsal-Khan ‘artivism’  అంటారు) సంఘీభావం ప్రకటించాల్సిన సందర్భమే యిది.

తాజా కలం : స్మార్ట్ సిటీల విశ్వ నగరాల అంచుల్లో కొత్తగా వెలిసే వెలివాడల్లో సిగ్గులేకుండా దొడ్డికి కూర్చోడానికి యెక్కడెక్కడ సదవకాశాలున్నాయో స్మార్ట్ ఫోనుల్లో క్షణాల్లో తెలుసుకొనేందుకు వీలుగా ‘మహిళా బహిర్భూమి యాప్’ తయారీకోసం  స్టార్టప్ మేధావులకి ప్రభుత్వాలు లోన్స్ సాంక్షన్ చేస్తాయనీ , అందులో భాగంగా పల్లె పల్లెకీ వాడవాడకీ వై ఫై సదుపాయం కలగజేస్తారనీ   మన్ కీ బాత్ లో ప్రధాని వరమివ్వబోతున్నట్టు యిప్పుడే  వార్త అందింది. ఇక  కూర్చున్నప్పుడు ‘పిర్రలమీద దోమలు కుట్టి దద్దుర్లు కట్టడానికి’ ఆస్కారం యివ్వని ఎ సి వాష్ రూమ్ ల కోసం గూగుల్ మేప్ లో వెతుక్కొని  చూడ్డమే యిప్పుడు మన ముందున్న తక్షణ కర్తవ్యమ్. అంత వరకూ కట్టల మీద సెవిటి కరుణమ్మవ్వల సహజ / అసహజ  మరణాలు తప్పవు. ఆధునికీకరణ లో రూపాంతరం చెంది రైలు కట్టలన్నీ  బుల్లెట్ ట్రైన్ ట్రాక్ లుగా మారిపోబోతున్నాయి కాబట్టి  అటువంటి బహిరంగ ప్రదేశాల్లో మల/మూత్ర విసర్జనలు చేసినందుకు లోకల్ బాడీ అధికారులు విధించే జరిమానాలు కట్టుకోడానికి సిద్ధంగా వుండక తప్పదు. ఇతి శమ్ … బే షరమ్.

*

 

 

 

మీ మాటలు

 1. గొప్ప కధకి మరింత గొప్ప విశ్లేషణ ! RTC క్రాస్రోడ్స్ బస్సు స్టాప్ పక్కనే సాయంత్రం 4.30 కి ఒక పేద ముసలామె గుంపు మధ్యనే కింద కూర్చుని మూత్ర విసర్జన చేస్తుంటే ఈ కధే గుర్తొచ్చింది . 80 వ దశకం లో విజయనగరం మైదానంలో ఒక రోజు పట్టపగలు మలవిసర్జన చేయవలసి వస్తే ముఖానికి గుడ్డ వేసుకుని , రోజూ ఆ అవస్థ పడుతున్న గ్లోరియా మీద ప్రేమ పొర్లి పోయింది . తీరని కనీస అవసరాల పునాదుల పై విరాజిల్లుతున్న విలాస భారత దౌర్భాగ్యాన్ని విశదీకరించిన వినోదిని , ప్రభాకర్ గార్లకు కన్నీటి కోపాల అభినందనలు . పై పై మెరుగుల పధకాల నిర్వీర్యతకు ఖండనలు .

 2. jilukara srinivas says:

  very good article

 3. Katta Katha gurinchi Chadivina. Sahityamlo konni vasthuvulni nishedinchinaru. 120 years pettindi. .. Avi vasthuvu gaa munduku raavadaaniki. Inkaa chaalaa ne vunnayi ee laanti vasthuvulu. Okadu chachhi poyi banks chusthe appudu Vaani mancham kinda doddiki poyina endaro streela chembulu. Vaadu cherichi chembulni saakshyanga gunjukunnadu. That is India that is Bharath. Jayho Vinodini.. Bsramulu .

 4. వినోదిని గారి కధ చదవి మాకున్న జ్ఞానం తోటి అనుభవాల తోటి మాగ్నిపై చేసుకని చూశాం. అనుభవించాం. కాని మీరు మరింత మాగ్నిపై చేసి చూపించటమ్ అద్బుతం! పేద వాళ్ళని సిటీలకు దూరంగా తరిమేసి తాము మాత్రం స్మార్ట్ గా ఉండాలని, స్మార్ట్ సిటీలకు శ్రీ కారం చుట్టే తోలు మందపు పాలకులకు ఈ కధలు అర్ధం కావు.

 5. swarnababu rachapudi says:

  Vastvalanu chala baga chepparu good ఆర్టికల్

 6. chandolu chandrasekhar says:

  వినోదిని గారు , వ్యధార్త జీవుల యాదర్ద దృశ్యం .మీరు రాసిన కథ . మగవాడిగా నాకే అనుభవం .రైలుకుడా మాగాడే భావన నిజంగా గుండెని తట్టింది . ఇష్టంగా తిన్న గోంగూర పచ్హడి నాకు నరకాన్ని చూపించిది . మీరు రాసిన ప్రతి అక్షరం నాజివితమే
  ఇక ఆడవాళ్ళ వెతలు చెప్పా లిసిన పనిలేదు feminism ముసుగు లో వున్నా మహిళా మానసిక అగ్రవర్ణ లారా మిమ్మలిని present చేయాటానికి అవార్డ్లు ఇప్పించ టానికి మివాళ్ళ పత్రికలూ మీకు వున్నై ఇప్పటికైనా డెమొక్రాట్ అవండి .

 7. potu rangarao says:

  జీవితం లోతులను ,badalanu చూపించిన Katta కథ.రచయితా కు abinandanalu .

 8. Dr.Pasunoori Ravinder says:

  తెలుగు సాహిత్యం క‌ట్టుకున్న బ్రాహ్మ‌ణ మ‌డిని, వినోదిని గారి క‌థ ప‌టాపంచ‌లు చేసింది. అద్భుత‌మైన క‌థ‌. ఈ దేశంలో క‌నీస అవ‌స‌రాలు తీర్చుకోలేని ల‌క్ష‌లాది మంది కిందికులాల ఆడ‌వాళ్ల వ్య‌థ ఇది. అలాంటి వారి వ్య‌థ‌ను ఏ మాత్రం ముసుగులు లేకుండా ప్ర‌జెంట్ చేసిన తీరు రియ‌ల్లీ అమేజింగ్‌. కంటెంట్ సెన్సార్ అనేది ఇప్ప‌టికీ జ‌రుగుతోంది. ఏది రాయాలి, ఏది రాయొద్దో ఈ అగ్ర‌వ‌ర్ణ సాహిత్య‌కారులు ఇంకా ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో ఆంక్ష‌లు విధిస్తూనే ఉన్నారు. ఈ క‌థ‌ను ప్ర‌చురించ‌డానికి తెలుగుసాహిత్యంలోని మెయిన్ స్ర్టీమ్ ప‌త్రిక‌లు ధైర్యం లేదు. అయినా స‌రే ఎవ‌రో ప‌బ్లిష్ చేయాల‌ని వినోదిని గారు రాయ‌లేదు. ఇది మా జీవితం. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చెప్పిన ర‌చ‌యిత్రి ధైర్యానికి స‌లాం. ఇంతమంచి క‌థ గురించి ఓ మంచి వ్యాసాన్ని రాసి, మ‌రింత మంది పాఠ‌కుల‌కు ద‌గ్గ‌ర చేసిన ఏకే ప్ర‌భాక‌ర్ సార్‌కు ధ‌న్య‌వాదాలు.
  -డా.ప‌సునూరి రవీంద‌ర్‌

 9. K Niranjan says:

  ఆ మధ్య కప్లేట్ పైనా ఇప్పుడీ కట్ట పైనా వచ్చిన విమర్శా వ్యాసాలు రెండూ కల్చురల్ విమర్శలో భాగమా, లేక విడి విడి అస్తిత్వాల ఉద్యమ సాహిత్య విమర్శలో భాగమా? ఏమో…ఏమో….సాగతీత మరీ ఎక్కువ అయిందనుకుంటా…. ది రూట్స్ నవలలో ఇంతకంటే భయంకరమైన చిత్రణ లేదా….కాని దానికి ఈ కథా చిత్రణ కీ ఎంత తేడా ? అయినా ఇది బబుల్గమ్ విమర్శ
  కాదంటారూ ??

 10. నిత్య జీవితం లో ఎదురుయ్యే కథ చాలా బాగా రచయిత్రి తీసుకు వచ్చారు , మన ప్రభుత్వానికి ఇది చెంప పెట్టు లాంటి కథ .

  ధన్యవాదాలు

 11. purushotham.satheesh.karimnagar says:

  chaa baagundi elanti kavithalu enka raavaali saamanya janaaiki chythanyam ragilinchali very very nice.

 12. G B Sastry says:

  నాటి ఎన్ టీ ఆర్ గారి ‘తెలుగు మహిళా బహిర్భూమి పధకం నుండి నేటి స్వచ్చ భారత్ వరకు కడగకుండా ఉండిపోయిన రోచ్చును
  ఆడవారు పడే బాధను చెంప చెల్లు మనేట్టు చెప్పి రచయిత్రి దిగంబరకవులు చేసిన ప్రయత్నం మళ్ళి చేసారు అందరికి అన్నం పెట్టలేకున్నాము తిన్నతర్వాత సమస్యలకి మేమేమిచేయగలమంటారేమొ మన పెద్దలు.

మీ మాటలు

*