భైరవ నాదం అను మిస్టర్ అండర్ డాగ్ లైఫ్ స్టోరీ!

 

కుక్క- శునకము-  విశ్వాసమునకు మొదటినోరు. నమ్మికకు మారుపేరు. ఆటపాటలందు ఆరితేరు. ఎప్పటి విశ్వాసం. ఎప్పటి కుక్క. భారత కాలం నాటిది. కుక్క లేకపోతే ఏకలవ్యుడు ఈ ప్రపంచానికి తెలిసేవాడా?

అసలు ఏకలవ్యుడెవరు ? నిషాద రాజ కుమారుడు. కిష్టప్పకు వరసకు సహోదరుడు అని కథ. నిషాదులకు దత్తతకే వెళ్ళాడని ఒక కథ. నిషాదులంటే అప్పట్లో అందరికీ చిన్నచూపు.  నిషాదులకు రాకుమారుడు కానీ బయటి ప్రపంచానికి పనికిరానివాడు. ఇంటికి పులే కానీ బయటకు  ఏదోనని ఒక సామెత. ప్రపంచానికి అలుసు.

 

అలా ద్రోణుడికి కూడా అలుసే.

అవును, ఆచార్యుడికి కూడా అలుసే.

నీకేమి, నా శిష్యరికమేమి అని వెళ్ళగొట్టినాడు.

వెళ్ళగొడితేనేమి?

ఏకలవ్యుడికి గురువులంటే అభిమానం.

గురువులంటే గౌరవం.

పెద్దలంటే ఆదరణ.

 

అలా ఒక బొమ్మ చేసుకుని కూర్చున్నాడు.

ఎక్కడ ?

మగధ రాజ్యం సరిహద్దుల్లో.

 

ఎందుకు ?

ఆ రాజ్యంలో వాళ్ళ పెంపుడు నాన్న సామంతుడు.

 

జరాసంధుడు సామంతుల్ని సైన్యాధిపతులుగా చేసి ఊడిగం చేయించేవాడు.

అవును, జరాసంధుడి కొలువులో నిషాదులు సైన్యాధిపతులు.

అలా ఏకలవ్యుడు మగధలో పెరిగాడు.

మరి పెరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ తిరిగాడు.

అడవులు ఔపోసన పట్టినాడు.

అవసరం వచ్చినప్పుడు, విద్య నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆ అడవినే ఆశ్రయించినాడు.

 

సరే ఇదొక కథ, దీనికి ఇంకో కతా రూపం కూడా ఉన్నది.

మహానుభావుడు ఆరుద్ర రాసిన ఒక కథలాటి వ్యాసంలో, వ్యాసంలాటి కథలో.

ఆయనంటాడూ – ఏకలవ్యుడు జరాసంధుడి సేనాధిపతి.

ద్వారకమీదికి 18 సార్లు జరాసంధుడు దండెత్తినప్పుడు ఏకలవ్యుడు సేనాధిపతి అని.

ధర్మజుడు చేసిన రాజసూయంలో ప్రముఖ పాత్ర వహించినాడని తెలియచేస్తాడాయన.

 

పుట్టుపూర్వోత్తరాలకు వస్తే కిష్టప్ప, ఏకలవ్యుడు మేనత్త మేనమామ బిడ్డలని చెప్తాడు కూడాను.

 

సంస్కృత హరివంశంలో

దేవశ్రవా: ప్రజాతస్తు

నైషాదిర్య: చ్రతిశృత:

ఏకలవ్యో మహారాజ

నిషాదై: వధివర్థిత:

అని ఉన్నది

 

సరే అది అంతా పక్కనబెట్టి అడవిలోకి వచ్చేద్దాం.

ఏకలవ్యుడు బొమ్మ చేసినాడు అని చెప్పుకున్నాం కదా

ఇంతకీ ఆ బొమ్మ ఎవరిదీ ?

ద్రోణుడిది. ఆచార్యుడిది. పరమవిద్య పారంగతుడిది.

బొమ్మతో మాట్టాడుకుంటూ విల్లెక్కుపెట్టి దదదడలాడించేవాడు.

బొమ్మని కాదండి, బాణాలను, విల్లుని, మొత్తం విలువిద్యని.

అలా కళ్ళు మూసుకొని బాణం వేసాడంటే జేజమ్మ దిగిరావల్సిందే!

అంత గురి.

 

ఓ రోజు ఆటాడుకుంటున్నాడు.

విద్యకు సానపెట్టుకుంటున్నాడు.

ఇంతలో పాండవులూ పాండవులూ తుమ్మెదా అయ్యింది.

అంటే వాళ్ళంతా కలిసి మగధ అడవుల్లోకొచ్చారు.

ఎందుకు?

అదేం ప్రశ్న?

వాళ్ళూ రాచబిడ్డలే

అప్పట్లో వేటలూ, వేటపోతులు వాళ్ళకు చాలా కామను.

 

రాచకుమారులకు వేట ఒక ఆనందం

అందుకని వచ్చారు.

 

అర్జునుణ్ణి నువ్వు వీరా కాబట్టి బాణం వెయ్యరా అని ఓ పొగిడి ఆయన వేటాడుతుంటే చోద్యం చూస్తున్నారు.

ఆ ఆటలో వీళ్ళెక్కిన గుర్రాలు ఏకలవ్యుడున్న ప్రాంతానికి వచ్చినై.

వేటకొచ్చినప్పుడు కుక్కలు వెంటబెట్టుకుపోవటం మరింత సాధారణం.

పాండవుల దగ్గరున్న కుక్కొకటి దారితప్పో, దారిచేసుకునో ఏకలవ్యుడి దగ్గరికొచ్చింది.

దానికేమో పాండవులంటే విశ్వాసం.

ఈ ఏకలవ్యుడెవరో తెలవదు.

కొత్తవాడు కనపడగానే పళ్ళికిలించి అరవటం మొదలుపెట్టింది.

ఈయన చూశాడు.

విద్య భంగం అవటం మొదలెట్టింది.

 

కుక్క అరవటం చూసి అర్జునుడొచ్చాడక్కడికి.

యజమానిని చూసి మరింత రెచ్చిపోయింది ఆ కుక్క.

అరుపులు మెరుపులుగా కురిపిస్తోంది

ఈ ఎదవ గోలంతా ఏమిట్రా నాయనా అనుకున్నాడు ఆయన.

 

అర్జునుణ్ణి, ఒరే నాయనా నువ్వెవరు, ఈ కుక్కేంది, ఈ కతేంది అన్నాడు.

నేనెవరా? నన్నే అడుగుతావా, ముందు నువ్వెవరు చెప్పు అన్నాడు ఫల్గుణుడు.

నేను ఏకలవ్యుణ్ణి, ఇదీ సంగతి, అదీ సంగతి అని మొత్తం కతంతా చెప్పినాడు కోపం తెచ్చుకోకండా.

 

కుక్కేమో అరుస్తూనే ఉన్నది.

ఈయన చెప్పేది అర్జునుడికి సగం వినపడీ వినపడక గోల గోల

ఈ కుక్క అరుపులు తగ్గే మార్గం కనపట్టల్లా

సరే ఇట్లా కాదని విల్లందుకున్నాడు

నారి సవరించాడు

కన్నుమూసి కన్ను తెరిచేలోగా గుప్పెడు బాణాలు ఆ కుక్క నోట్లో కొట్టాడు.

విచిత్రంగా దానికి దెబ్బా తగలకుండా, గొంతులోకి వెళ్ళిపోకుండా నోరంతా నిండిపోయినాయ్ ఆ బాణాలు

 

అంతే ఆ కుక్క మౌనవ్రతం దాల్చింది

అరుపులు ఆగిపోయినై

ఇప్పుడు ప్రశాంతంగా మాట్టాడుకోవచ్చు అబ్బాయ్, ఏమిటి సంగతి అన్నాడు అర్జునుడితో

కుక్క పరిస్థితి చూసి అర్జునుడికి ఆల్రెడీ కళ్ళు బైర్లు కమ్మినై

కుక్క నోరు కన్నుమూసేలోగా మూసేయించాడు ఈయనెవడండీ అని విభ్రమంగా చూస్తున్నాడు

అవును, సాక్షాత్ కిరీటి నోట్లో కూడా మాట పడిపోయింది

ఒక రెండు నిముషాలకు తేరుకున్నాడు

బాబూ, స్వామీ, నాయనా నీకు దణ్ణం పెడతా, ఈ విద్య ఏందండి, ఎక్కడ నేర్చుకున్నా ఇందాక ఏదో అనుకున్నా, నా పేరు అర్జునుడు, నువ్వెవరో ఇప్పుడు చెప్పు అన్నాడు

 

ఓ నువ్వు అర్జునుడివా? అంటే కుంతి కొడుకువేనా అన్నాడీయన

అవును అన్నాడు బీభత్స బాబాయ్

నా పేరు ఏకలవ్యుడు, మా అమ్మ పేరు శ్రుతదేవ మీ అమ్మ పేరు పృథ

ఇద్దరూ తోడబుట్టిన అక్కాచెల్లెల్లు కాబట్టి నువ్వు నాకు కజినువి అన్నాడు

 

అటు చేసి ఇటు చేసి నా అన్నవా నువ్వు, ఆనందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అన్నాడు అర్జున్

బయటకైతే ఆనందం అన్నాడు కానీ లోపల బెంబేలు, కుతకుత

వీరుడికి తనకన్నా ఒక మెట్టు పైనున్నవాణ్ణి చూస్తే అలానే ఉంటుంది

సరే పిచ్చాపాటీ అయిపోయినాక, అర్జునుడు వెళ్ళిపోతూ – అన్నా ఆ కుక్క సంగతేంది అన్నాడు

ఆ బాణాలు ఊరకే చేత్తో సుతారంగా తాకితే వొచ్చేస్తయ్ కానీ ఖంగారు పడమాక అన్నాడు అన్న.

అర్జునుడు సుతారంగా తాకినాడు.

ఏదీ రాలేదే? ఊహూ బాణాలు రాలా! కుక్క నోట్లో ఇరుక్కున బాణాలు రాలా!

దిగాలుగా చూచినాడు అన్న వంక.

 

తమ్మీ ఇంతేనా నువ్వూ నీ సుతారం ఇంతేనా అని నవ్వి తన సుతారం ఉపయోగించి బాణాలన్నీ బయటపడేసాడు

ఒక్క రక్తం బొట్టు లేదు, ఒక్క గాయం లేదు, ఒక్క పన్ను ఊడలేదు

కుక్క, నాలిక బయటపెట్టి రింగులా తిప్పుతూ మూతి అంతా తడిమి తడిమి చూసుకుంది

తర్వాత ఆనందంతో గంతులేసింది

నాయనా ఇంకోసారి నీ దగ్గర అరిస్తే ఒట్టు అనుకుంటూ ఏకలవ్యుడి కాళ్ళని నాకి నాకి వదిలి పెట్టింది

అడవిలో ఉన్నాడు, దుమ్ము కొట్టుకుపోయున్నాడు, కాళ్ళు సుబ్బరమైపోయినై ఈ నాకటంతో

నాకింది చాల్లే అని అర్జునుడు ఆ కుక్కను తీసుకుని బై బై చెప్పి అన్నకు వీడ్కోలు పలికినాడు

 

వేట ముగిసింది. రాత్రయ్యింది.

అందరూ నిద్రపొయ్యేవేళ.

గుడారాల్లో గురకలు గుర్రుగుర్రుమంటూ వినపడుతున్నయ్

ఒక్కడు మటుకు నిద్దరోవట్లా.

ఆ ఒక్కడు ఎవరు ?

అర్జున్

కన్ను మూస్తే కుక్క

కన్ను తెరిస్తే బాణం

కన్ను మూస్తే విల్లు

కన్ను తెరిస్తే ఏకలవ్యుడు

పక్క మీద ఎటు తిరిగినా కుక్క నోట్లో బాణాలే గుర్తుకొస్తున్నయ్

ఈ బాణాల గోల తట్టుకోలేక లేచి పక్కనే ఉన్న గుడారంలోకి పొయ్యాడు

 

ఆ గుడారం ఎవరిది? ద్రోణుడిది

గుర్రుపెడుతున్న ఆయన్ని లేపాడు

నాయనా బీభత్స్, ఈ అర్థరాత్రి నాకు అంకమ్మ శివాలు ఏమిటి అన్నాడు

కాదు ఆచార్యా, ఇవి ఏకలవ్య శివాలు అన్నాడు అర్జున్

 

అదేమి శివాలు, కొత్తగా ఉన్నాయి, కథేమిటి చెప్పు అన్నాడీయన

 

కత చాలా ఉన్నది కానీ ఆచార్యా, ఇప్పుడే మిమ్మల్ని చూశాక, ఒక సంగతి గ్యాపకం వచ్చిందన్నాడు ఫల్గుణ్

 

నాయనా కతలకోసం ఏడ్చే పసిపిల్లాణ్ణి కాను, నీ గ్యాపకాల కోసం తపించే ఆడపిల్లనూ కాను – అర్థరాత్రి నాకు ఈ చిత్రహింస ఏమిటి నాయనా అన్నాడు గురువుగారు

 

ఆచార్యా మీరు ఆరోజు గురుకులంలో ఏమన్నారు ?

ఏ రోజు ?

ఆ రోజు, ఆ రోజు పేద్ద విష్ణుయాగం జరిగిన రోజు

ఏమన్నాను ?

ఈ అర్జునుడికి సరిజోడీ ఈ ప్రపంచంలోనే లేకుండా చేస్తానని అందరి ముందు చెప్పారా లేదా?

అవును చెప్పాను

ఈరోజు మీ మాట నిలబెట్టుకోలేకపోయినారు

అంతే, ఆ మాట వినగానే ఉగ్రుడైనాడు కుంభసంభవుడు

నేను మాట తప్పానని అభాండం వేస్తావా అని భాండం మీద ఉన్న విల్లు అందుకున్నాడు

అభాండం కాదు సార్, మీకు ఋజువు చూపిస్తాను అని ఈల వేసాడు అర్జున్

తోక ఊపుకుంటూ కుక్క వచ్చింది

ఋజువు చూపిస్తానని కుక్కను పిలుస్తావా అని మరింత ఆగ్రహోదగ్రుడైనాడు ద్రోణుడు

దీని నోట్లో ఏముందో చూడండి అన్నాడు కిరీటి

నిద్ర లేపింది కాక, మాట తప్పానని చెప్పి చిమ్మచీకట్లో నల్లకుక్కనోరు చూడమంటావా! ఇక లాభం లేదు అని వింటినారి ఠక్ ఠక్ లాడించాడు

అది కాదు ఆచార్యా ఓ సారి చూడండి మీరు అన్నాడు అర్జున్

ఈ చీకట్లో ఏం కనపడుతుంది ఆ దివిటీ ఇటు తీసుకురా అన్నాడు కుంభసంభవుడు

ఆ తర్వాత దివిటీలో ఆ నోరు చూసి ఆశ్చర్యపోయాడు

అర్థమైపోయింది ఆయనకు

 

 

నేను చిన్నప్పుడు నేర్చుకున్న విద్య, నేను తప్ప ఈ ప్రపంచకంలో ఎవరూ వెయ్యలేని బాణవిద్య ఎవరు ఉపయోగించారు అని తల గిర్రున తిరిగింది ఆయనకు

ఈ విద్య తెలిసినవాడికి ప్రపంచకంలో తిరుగు లేదు, ఎవరు ఈ పని చేసింది అన్నాడు

మీ శిష్యుడే అని అర్జున్ సమాధానం

నా శిష్యుడా? నాకు తెలియని శిష్యుడా? ఎవడు వాడు అన్నాడీయన

ఏకలవ్యుడు, వరుసకు మా అన్న, మీరు విద్యనేర్పనని పంపేసిన నిషాదుడు, మీ బొమ్మ పెట్టుకొని మిమ్మల్ని గురువుగా పూజిస్తూ అడవుల్లో కుక్కనోట్లో బాణాలు కొట్టి నాకు మాట రాకుండా చేసినవాడు అనె అర్జున్

ఇది చాలా ప్రమాదకరం! నా మాట నిలబడాలంటే ఏదో ఒకటి చెయ్యాల్సిందే! ద్రోణుడు మాట తప్పాడంటే ఇంకేమన్నా ఉందీ? నువ్వు పో, రేప్పొద్దున్నకల్లా సంగతి తేల్చేస్తా! ఆ కుక్కని కూడా తీసుకుపో నీతోపాటు అని ఆలోచనలో పడిపోయాడు

కుక్కను తీసుకుని అర్జున్ వెళిపోయె

తెల్లవారగానే అడవుల్లోకి ద్రోణుడు వెళిపోయాడు

ఏకలవ్యుణ్ణి పట్టుకున్నాడు

ఏకలవ్యుడి బొటనవేలు తీసేసుకున్నాడు

అర్జునుణ్ణి ధనుర్విద్యలో ఏకవీరుడిగా నిలబెట్టినాడు

అలా కుక్క, దాని అరుపులు చేసిన సాయంతో అర్జునుడు ఏకవీరుడిగా నిలబడిపోయినాడు

అయ్యా, అమ్మా – అందువల్ల కుక్క లేకపోతే మనకు తెలిసిన భారతం మరోలా ఉండేది అన్న సంగతి మీకు ఇప్పటికి తెలిసిపోయుండాలి.

అయితే కుడిచేతి బొటనవేలు లేకుండా కుడిచేత్తో బాణాలెయ్యలేమోమో కానీ, ఎడం చేత్తో వెయ్యొచ్చు. అదికాకుంటే ఎడమ చేత్తో కత్తియుద్ధం చెయ్యొచ్చు, ఇంకా బోల్డు చెయ్యొచ్చు. అందువల్ల ఏకలవ్యుడిని సేనాధిపతి పదవి నుంచి పీకెయ్యలా జరాసంధుడు

అలా ఎన్నో ఏళ్ళు ఆ జరాసంధుడి దగ్గర పంజేసి రిటైరు అయిపోదాం అనుకుని తన నిషాద రాజ్యానికి రాజుగా వెళ్ళిపోయాడు.

ఇంతలో ధర్మరాజు రాజసూయం వచ్చి పడింది.

రాజసూయం మొదలైపోతోంది.

ఎవరూ ఏకలవ్యుణ్ణి జయించడానికి రాలేదు.

రాజసూయానికి రాజులంతా ఓడిపోవాలి.

ఆ తర్వాత ఆ యాగానికి రావాలి.

ఇదేమి సంగతండి అని రాజసూయానికి వచ్చినప్పుడు కిష్టప్పని అడిగినాడు

కిష్టప్ప చిరునవ్వి నవ్వి, అయ్యా – రాజులెవ్వరూ నీతో పోట్టాడరు అన్నాడు

ఎందుకు అన్నాడు ఈయన

 

రెండు కారణాలు – ఒకటి నువ్వు నిషాదుడివి కాబట్టి నీతో పోట్టాడితే వాళ్ళకు తలవంపు, రెండు నీతో యుద్ధంలో నిలబడి గెలవటం అంత సులభం కాదు కాబట్టి

ఈ లెక్కన రాజైనా ఉపయోగమేమీ లేదన్నమాట అని నిట్టూర్చి, పరమాత్మా ఈ జీవితమ్మీద విరక్తి పుట్టేసింది, ఇన్ని యుద్ధాల తర్వాత  శాంతి కావాలి నాకు, మన:శ్శాంతి కావాలి నాకు, నీ మీదకు అన్నిసార్లు యుద్ధానికి వచ్చినా ఎప్పుడూ ఏమీ అనకుండా వదిలేసావే నన్ను. నాతో నువ్వుపోట్టాడతావా ఒక్కసారి అన్నాడు ఏకలవ్యుడు

అదే నీ కోరికైతే అలాగే కానివ్వు అన్నాడు కిష్టప్ప

ఎప్పుడు ? ఎప్పుడు ? ఎప్పుడు ? పరమాత్మా ఎప్పుడు ? అని ఆనందభాష్పాలు కారుస్తూ కరిగిపోయినాడు ఏకలవ్యుడు

తొందరెందుకు నాయనా వస్తా! ఇంతలో నువ్వెళ్ళి ఆ ధర్మరాజుకి బంగారు పాదరక్షలు ఇచ్చిరా అన్నాడీయన

అంతా అయిపోతూండగా, పనీపాట లేని శిశుపాలుడు లేచి గావుకేకలు పెడుతుంటే, నాయనా టైమొచ్చింది, ఓ సారి వాడి పని చూడు అని కిష్టప్ప సుదర్శన్ కి ఆర్డరిచ్చాడు.

వాడి ఖేల్ ఖతం చేసి మళ్ళీ వేలెక్కి కూర్చునె సుదర్శన్.

అది చూసి అంతా గప్ చుప్ అయిపోయి ఇంటికి పోయినారు.

ఏకలవ్యుడు కూడా వెళ్లిపోయినాడు కానీ, శిశుపాలుణ్ణి అలా చంపెయ్యటం నచ్చలా ఆయనకు

మానవుడుగా మరి! అంతే! ఓ క్షణం ఆనందభాష్పాలు, ఓ క్షణం రక్తభాష్పాలు! ఏం చేస్తాం!

కొద్ది రోజులు, కొన్ని ఏళ్ళు గడిచిపోయినయ్

కిష్టప్ప ప్రామిస్ చేసినవిధంగానే ఈయన టైమొచ్చినప్పుడు వచ్చి యుద్ధం చేసి ఖతం చేసినాడు

ఇదంతా భారత యుద్ధం మొదలవ్వకముందే

మొదలయ్యాక జరాసంధుడు, ఏకలవ్యుడు, శిశుపాలుడు వీళ్ళంతా బతికుంటే యుద్ధానికొచ్చేవాళ్ళు

అప్పుడు వీళ్ళను ఆపటం పాండవుల వల్ల ఏమవుతుందీ అని ప్లానేసి అందరినీ ఖతం చేసేసాడు పరమాత్మ

అదీ లెక్కన్నమాట

ఉద్యోగ పర్వంలో సంజయుడి సందేశంలో ఇలా చెప్పించాడని కథ

అయం స్మ యుద్ధే మన్యతేఽన్యైరజేయం

తమేకలవ్యం నామ నిషాదరాజం।

వేగేనైవ శైలమభిహత్య జంభః శేతే స కృష్ణేన హతః పరాసుః ॥ 5-48-77 (33649)

 

అలా కిష్టప్ప చేతిలో హతమైనాడు.

కోరుకున్న విధంగానే హరీమన్నాడు.

భగవంతుడి మీదకు యుద్ధానికి పోయి, చివరకు సత్యం తెలుసుకుని ఆయన చేతిలోనే హతమైనాడు

అరివీర భయంకరుడు, అఖిలబాణవిద్యా పారంగతుడు, ప్రపంచంలోనే మేటి శూరుడు ఏకలవ్యుడు

అలా భారతంలో కుక్క ప్రాధాన్యం మనకు పూర్తిగా తెలిసింది.

కుక్క మూలాన ప్రపంచానికి ఒక వీరుడు పరిచయమైనాడు.

అదే కుక్క మూలాన ఆ వీరుడి బొటనవేలూ తెగిపోయింది.

అదే కుక్కను తీసుకొని పాండవులు స్వర్గారోహణానికి వెళ్ళినారు

అలా భారతంలో ఎన్నో వింతలు, ఎన్నెన్నో వింతలు.

 

భారతం పక్కనబెడితే తెలుగువాళ్ళకు కుక్కతో ఎంతో అనుబంధం

సామెతలలో (1)కనకపు… (2)కరిచే కుక్క….(3)కుక్కకు సయ్యాట….

వృక్షవిశేషాల్లో (కుక్కతులసి….)

భక్ష్యాల్లో (కుక్కగొడుగు…..)

పద్యాల్లో (జాగిలములు మొఱసడములు…)

జనజీవనంలో (కుక్కజట్టీ…..)

అలా అలా ఎన్నో విధుల్లో, విధానాల్లో, జీవనాల్లో ఉన్నది కుక్క.

అందువల్ల మీరు తెలుసుకొనవలసినది – కుక్క అంత గొప్ప జంతువు ఈ ప్రపంచకంలోనే లేదు అని!

*

 

పేరడీ Thoughts

 

కుంపాటి తీపించి డియ్యాలో

బొగ్గులే పోయిస్తి డియ్యాలో

రాజేస్తి నిప్పే డియ్యాలో

లేసింది అగ్గే డియ్యాలో

గంటెలే గల్లాని వాయిస్తి డియ్యాలో

పొయ్ మీదా పెనముంచి డియ్యాలో

గంతంత నీళ్ళోస్తి ఉయ్యాలో

నీళ్ళన్నీ సుయ్యానె ఉయ్యాలో

గిన్నిలో గరిటేసి డియ్యాలో

ఓ తిప్పు తిప్తీనె డియ్యాలో

పుల్లాటి వోసనా డియ్యాలో

గుండెల్కు తగిలేసే డియ్యాలో

గంటెడు పిండిని డియ్యాలో

సర్రూన పోస్తీనె డియ్యాలో

నూనేను తీస్తీని డియ్యాలో

సుట్టంతా తగిలిస్తి డియ్యాలో

ఆనూనె ఈపిండి డియ్యాలో

సక్కంగ కాల్నెమ్మ డియ్యాలో

పిండీను పెనమూను గలిసె డియ్యాలో

బెమ్మదేవుడి అట్టిచ్చే డియ్యాలో

డియ్యాలో డియ్యాలో

డియ్యాలో డియ్యాలో

*

చమత్కారాలూ మిరియాలూ 

నిజంగా భట్రాజే!

Portrait of Dr. Pattabi Sitaramayya.

జాతీయవాది, దేశభక్తుడు అయిన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని ఒక సారి బందరులో ఘనంగా సన్మానించారట.

ఆ సభకు వక్తగా విచ్చేసినవారిలో శ్రీ పి.పి.భట్ గారు ఒకరు. ఆయన పట్టాభి గారిని గురించి చెపుతూ – భోగాన్ని అనుభవించడంలో ఆయన భోగరాజు, ధర్మగుణంలో ఆయన ధర్మరాజు, దానం చేయడంలో దానరాజు, త్యాగశీలతలో త్యాగరాజు అని ఇలా పొగడడం మొదలెట్టారట.

పొగడ్తలంటే అసలే గిట్టని పట్టాభి గారు ఆయన ప్రసంగం అయ్యాక “నా గురించి భట్ గారు చెప్పింది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ భట్ మాత్రం నిజంగా భట్రాజే” అన్నారట.

*

peepal-leaves-2013

ఎవరోహో..

radio 1

 శ్రీ నండూరి సుబ్బారావు గారి పర్సనల్ అల్బం నుండి 

అపురూప చిత్ర సౌజన్యం : సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి

ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో

ఒక నాటకంలో పాల్గొన్న నిలయ కళాకారులు – సి.రామమోహనరావు, కూచిమంచి కుటుంబరావు, నండూరి సుబ్బారావు, ఎం.వాసుదేవమూర్తి, వి.బి.కనకదుర్గ, ఎ.బి.ఆనంద్, ఎం.నాగరత్నమ్మ, ఆమంచర్ల గోపాలరావు (ప్రొడ్యూసర్), నారాయణమూర్తి.

peepal-leaves-2013

 

మీ మాటలు

  1. చందు తులసి says:

    వంశీ గారూ బాగుందండీ….
    మీ స్టైల్లోనే వెరైటీగానూ వుంది.
    నిజమే కుక్క మన అసలైన జంతువు.
    కొందరి బుద్దులు కుక్క తోకలు…
    కొందరి బతుకులు కుక్క చావులు

  2. VASANTHRAO DESHPANDE says:

    వంశీగాికి ! కుక్క గురించి చెప్తూ …ఏకలవ్యుడి గురించి చెప్పారు ,కుక్క సంగతి సరే కాని ఏకలవ్యుడి విషయం మళ్లీ రొటీన్ గానే చెప్పారు. బుద్ది తెలిసినప్పటినించి ఏకలవ్యుడి కథ అందరూ ఇలానే చెప్పి బులిపిస్తున్నారు. మిత్రుడు సౌదా రాసిన ‘ అపూర్వ పురాణగాథలు’లో ఏకలవ్యుడి కథ ఇలా ఉంది. –ఏకలవ్యుడి ఒక ఆటవిక రాజు కొడుకు . అపూర్వ మైన విలువిద్య పుట్టుకతో వచ్చినవాడు . ద్రోణాచార్యుని మనసులోనో , బొమ్మనో పెట్టుకొని నేర్చుకున్న వాడు కాదు.కుక్క — నోట్లో బాణాలు వేయండి అంతా ఒ.కే . ఏకలవ్యుడు గురు దక్షణగా బొటనవేలు ఈయలేదు. ద్రోణాచార్యుడు అతడి 105 మంది శిష్యులు కలిసి , పట్టి బంధించి, బలవంతంగా ఏకలవ్యుడి బొటనవేలునితెగనరికి, ద్రోణాచార్యుడుతన శిష్యులకు ఎదురు లేకుండా చేసాడు. ఏకలవ్యుడి చెల్లెలే సుధీష్ణ కర్ణుని బార్య.ప్రతీసారి ఏకలవ్యుడికి చరిత్ర కు అన్యాయమే జరుగుతోంది. సినిమా వాళ్ళు, పాఠ్యపుస్తకాలవాళ్ళు, ఎందుకో అతణ్ణి పగ బట్టారు. బహుషా ఏకలవ్యుడు ఆటవికుడు గిరిజనుడు కావడమే కారణామా ?
    పనిలో పనిగా యింకో సంగతి కుక్క గురించి సౌదా ‘అపూర్వ పురాణగాథ’ లో రామాయణం లోన కూడ ఒక కుక్క ప్రసంగం విస్తారంగా , ఆసక్తికరంగా ఉంచింది .

  3. వంశీ says:

    వసంతరావు గారు, చదివి కామెంటినందుకు కృతజ్ఞతలు. మీ మంచి వ్యాఖ్య బోలెడు ఆలోచనలు రేకెత్తించింది. ఈ మీ వ్యాఖ్యకు సుదీర్ఘమైన జవాబు రాయాలని ఉన్నది కానీ, అలా రాస్తే సుదీర్ఘమైపోటమ్మూలాన, అందులో ఎవరిక్కావల్సిన, ఎవరికర్థమైన ముక్కలు వాళ్ళు తీసుకొని ఆ ముక్క చెక్కల మీద అనవసరమైన రభస, దీర్ఘ చర్చ(లు) చేయటం నాకిష్టమైన పని కాదు, అంత సమయమూ లేదు. అందువల్ల క్లుప్తంగా ఒక రెండు ముక్కలు చెప్పి శలవు తీసుకుంటాను. ఆ రెండు ముక్కలు కూడా మీ మంచి వ్యాఖ్య మూలాన, నా బుర్రకి పనిపెట్టిన బ్రెయిన్ స్టార్మింగులో నాకు నేను బయటికి మాట్లాడుకుంటున్న మాటలుగా భావించాలని, వాటికీ, దానితో పాటు నాకూ – వేరే ఉద్దేశాలని ఆపాదించవద్దని మిమ్మల్ని కోరుకుంటూ

    ఏకలవ్యుడికి అన్యాయం జరగిందని అనుకోవలసిన పని లేదు. ఒక మనిషి మీద, ఉంటే ఒకరికి పగ ఉన్నదనుకోవచ్చు, ఇద్దరికి పగ ఉన్నదనుకోవచ్చు, ముగ్గురికి పగ ఉన్నదనుకోవచ్చు, పదిమందికి పగ ఉన్నదనుకోవచ్చు. కానీ ఇప్పటిదాకా మనకు ఆ కథ చెప్పిన వందలాది మందికి, అంతమందికీ ఆయన మీద పగ ఉన్నదనుకోవటం తప్పేమో ఆలోచించుకోవాల్సిన అవసరమూ ఉన్నది. అదీకాక అంతమంది ఉన్నప్పుడు, ఎన్నోరకాలుగా బులిపించటానికి అవకాశం వున్నా, ఒకే విధంగా ఎందుకు చూపించినారన్న దాని మీద ఆలోచన జరగవలె. సాధారణంగా సత్యమే అలా నిశ్చలంగా, ఒకే విధంగా మారకుండా వస్తుంది. వక్రీకరించడం చేతిలోని పనే అనుకోండి. కానీ అది జరగలేదు కాబట్టి అది, అంతమంది చెప్పినది నిజమేనని అనుకోవాలి. దీనికి కూడా ఒక తప్పు వందసార్లు వల్లిస్తే ఒప్పు అయిపోతుందని పితలాటకం పెట్టొచ్చు కానీ, అది నా పరిధిలోకి రాదు, ఆసక్తీ లేదు. వేరేచోట నాకు తెలియదు కానీ ఈ కథలో ఆయన వ్యక్తిత్వాన్ని, శూరత్వాన్ని చూపిస్తూ, ఆయనలోని ధర్మాధర్మాలకి న్యాయం చెయ్యటానికే ప్రయత్నం జరిగిందనే అనుకోలు!

    సౌదా గారెవరో నాకు తెలియదు. వారి రచనలేవి నేను చదవలేదు. వారు రాసినదిగా మీరు చెప్పింది చూస్తే, ఎవరి నిర్ధారణ, ఎవరి కథారూపం, ఎవరికిష్టం వచ్చినట్టుగా వారు రాసుకునేందుకు అవకాశం కల్పించిన ఆ వ్యాసుడికి మనమందరమూ ఋణగ్రస్తులమే. ధర్మం పక్కన నిలబడనివాడికి ఆ న్యాయం జరగటం అన్యాయం అయితే ఆ పరమాత్మ ఆయన బొటనవేలు తీసుకుందుకు ద్రోణున్ని, ద్రోణ సంకల్పం లేకుండగా నియోగించిన కారణమూ [కర్మవశాన కానీ ఇంకో వశాన కానీ] ఆపైన ఆయన్ని చంపటం ఆ అన్యాయానికి విధించిన న్యాయం. అది కాదనలేని సత్యం. అసలు దేవుడే లేడంటే చెప్పేదేమీ లేదు. దేవుడి రూపాన కాకున్నా, ధర్మరూపాన, ఆ కాలపు ధర్మానికి జరగవలసిన, జరపవలసిన కార్యం జరిపినాడాయన. ఇక్కడ మళ్ళీ ఆటవికుడు, నిమ్న జాతి, గిరిజనుడు అని భేదాలు చూపించి ఆ వాదాల్లోకి లాగొద్దు. ఆ కాలానికి అది ధర్మం. అది ధర్మం కాదని చెప్పటానికి మీ సంగతేమో కానీ నాకు శక్తి లేదు, చెప్పనూలేను. పోతే, ఆ కాలపు ధర్మాలను అధర్మాలుగా చూపించి, చూపిస్తూ మనల్ని మనమూ, మనతో పాటు మన సాహిత్యాన్ని కూడా తక్కువ చేసుకున్నాము, చేసుకుంటాము, చేసుకుంటూనే ఉంటామేమో కూడానూ. ఇక ఆ ధర్మాన్ని పుచ్చుకునే ఇప్పటికీ ఈనాటికీ కొంతమందికి అన్యాయం జరుగుతున్నదని ఇతర వాదాలు వస్తవి. వాటి గురించి చర్చించవలసిన ఉద్దేశం నాకు లేదు, చెయ్యను కూడాను. అవి చేసుకోవటానికి జనాభా వేరుగా ఉన్నారని విన్నవించుకుంటూ, రెండు ముక్కల సమయం అయిపోయినది కావున, ఇప్పుడు నిజమైన శలవు పుచ్చుకుంటాను.

    ఈ వ్యాఖ్య పూర్తిగా మీకోసమే! మరొక్కసారి చదివినందుకు, మనసారా ఒక మంచి వ్యాఖ్యతో కామెంటినందుకు, నాకు తిరుగు జవాబు ఇచ్చే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ

    భవదీయుడు
    వంశీ

  4. rahul varanasi says:

    వంశీ గారు మీ శునకాల మీద రాసిన “భైరవ నాదం అను మిస్టర్ అండర్ డాగ్ లైఫ్ స్టోరీ” చాల బాగుంది. మీరు ఇలాంటి రచనలు ఇంకా చాల చెయ్యాలని అభిననదిస్తున్నాను..!!!

  5. Srinivas Vuruputuri says:

    వంశీ గారికి,

    మీరు ఉద్యోగ పర్వంలోనుంచి కోట్ చేసిన శ్లోకానికి రెఫరెన్సు ఇస్తారా?

    శ్రీనివాస్

  6. వంశీ says:

    శ్రీనివాస్ గారు

    రిఫరెన్సు ఇదండి :- 5-48-77

    మొత్తం పదం ఇదీ

    అయం స్మ యుద్ధే మన్యతేఽన్యైరజేయం తమేకలవ్యం నామ నిషాదరాజం। వేగేనైవ శైలమభిహత్య జంభః శేతే స కృష్ణేన హతః పరాసుః ॥ 5-48-77 (33649)

    • Srinivas Vuruputuri says:

      Thanks a lot, Vamshee gaaru. I thought I did know a little bit about Mahabharata. But I keep hearing new stories again and again. I hope, I will be able to read the entire Mahabharata one day.

      And I must say, I enjoyed reading your article. Thanks again.

Leave a Reply to వంశీ Cancel reply

*