ముసుగు

 

 

-భువన చంద్ర

~

bhuvanachandra (5)‘సుమీ ‘ అంటే చలనచిత్ర పరిశ్రమలో ఎవరికీ తెలియదు. ‘సుమీ ‘ అసలు పేరు ‘సుమిత్ర ‘.

‘నల్లమణి’ అంటే ‘ ఆవిడా ‘ అని అందరూ అంటారు. తెలుగులో ‘నల్ల ‘ అంటే నలుపు. తమిళంలో ‘ నల్ల ‘ అంటే ‘మంచి’ అని అర్ధం. సుమీని ‘నల్ల మణి ‘ అనడం కేవలం ఆమె మంచితనాన్ని గుర్తించడానికే. అలాగని సుమీ అరవ పిల్ల కాదు. పదహారణాల తెలుగు పిల్ల.  పిల్ల అనడం తప్పే. ఆవిడ వయసు ఎట్టా చూసినా ముప్పై అయిదుకి తగ్గదు … ముప్పై ఆరుకి మించదు.

ఆమె ఉత్సాహం చూస్తే మాత్రం పదహారేళ్ళ పడుచుపిల్లలు కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిందే.

‘తలలో నాలుక ‘ అంటారే  అలా వుంటుంది అందరికీ. కార్తవరాయన్ పెళ్ళానికి పురుడొచ్చినప్పుడు వాడు వూర్లో లేకపోతే తనే హాస్పటల్ లో జేర్పించి, డిశ్చార్జ్ అయ్యే వరకు తోడుండి మరీ ఇంటికి తీసుకొచ్చి దిగబెట్టింది.

“గాజులేమయ్యాయి?” అనడిగిన  ‘తాలాట్టు  సరళ ‘ కి “హాస్పటల్ బిల్లు కింద మారినై ” అని సమాధానం చెప్పిందిట.

“ఆ తాగుబోతు చచ్చినాడు నీకు గాజులు కొనిచ్చినట్టే! ” అని తాలాట్టు సరళ దెప్పిపొడిస్తే “వాడో సిగ్గోసిరి .. వాడివ్వడని నిండుచూలాల్ని రోడ్డు మీద వదుల్తామా? ” అని నవ్విందిట.

కోడంబాకం మొత్తంలో ఏనాడూ తలుపు మూయని ఇల్లు ఏదైనా వుంటే అది సుమీదే. అదేమీ ఆవిడ సొంతిల్లు కాదు. నెలకి ఏడొందలకి తీసుకున్న మేడ మీద పాకలో ఓ గది. ఆ పాకలో మొత్తం ఐదు పోర్షన్లు . అవన్నీ కొబ్బరాకుల తడికల్తో  సెపరేటు చేసినవే కానీ, గోడలతో కాదు. స్నానానికీ, టాయిలెట్టుకీ కింద వుండే రెండు బాత్ రూమ్ లు , టాయిలెట్లే గతి. అవి కామన్వి కనుక ఎవరూ కడగరు. రోజుకి రెండుసార్లైనా వాటి అతీగతీ  చూసేది సుమీనే.

“నీకెందుకే? ” అని పక్క పోర్షన్ లో వుండే కాటరింగ్ సావిత్రి అడిగితే ” ఆ.. ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా అందరం చస్తాము. సౌతాఫ్రికాలో గాంధి గారు అనుసరించిన మార్గాన్నే నేనూ అనుసరిస్తున్నాను. ” అన్నదట. అదీ ‘సుమీ ‘ అనబడే సుమిత్ర వ్యక్తిత్వం.

ఈ ‘ట ‘ లు ఎందుకంటే సుమిత్ర మొదట్లో నాకూ తెలియదు. ఆరుద్ర గారి ఇంటి ఎదుట వున్న ‘భగవతీ ‘ విలాస్  దగ్గర కనబడేది. అక్కడ ‘ప్రొడక్షన్ ‘ డిపార్టుమెంటు’ వాళ్ళుండే వాళ్ళు. పొద్దున్నే సినిమా కంపెనీలకి టిఫిన్లు ‘భగవతి ‘ విలాస్ నుంచే ఎక్కువగా సప్లై అయ్యేవి. గిన్నెలు అవీ కడగడానికి ‘కార్డు’ వున్న ఆడవాళ్లని ప్రొడక్షన్ వేన్ లలో ఎక్కించుకొని పోతూ వుండేవాళ్ళు. మొదట్లో సుమిత్ర కూడా అదే బాపతు అనుకున్నాను. కానీ కాదు.

ఆవిడ ఓ హీరోయిన్ కి “టచప్  విమెన్ “. సదరు హీరోయిన్ గారు సుమిత్ర ని పాండీబజార్ కారు ఎక్కించుకునేది. ఆ కారు వచ్చే వరకు సుమిత్ర ప్రొడక్షన్ వాళ్ళతో కబుర్లాడుతూ మంచీచెడ్డ తెలుసుకుంటూ వుండేదిట. అక్కడా సాయం చేయడమే లక్ష్యం.

మామూలుగా అయితే పరిచయం అయ్యే అవకాశం లేదు. ఎవరు ఎవరికి ఎప్పుడు తారస పడతారో అప్పుడే వారు తారసపడతారని మా అమ్మగారనేది. “ఇంతమంది అన్నల్ని, అక్కల్ని వదిలి నువ్వు ఇంత దూరంగా ఢిల్లీలో   ఎందుకున్నావో తెలుసా? ఏ జన్మలోనో అక్కడి నేలా, నీరు, గాలీ నీకు ఋణమున్నాయి. ఎప్పుడో నువ్వక్కడ పుట్టి వుండకపోతే అక్కడకి ఎన్నడూ పోలేవు. ” అన్నది ఢిల్లీ నుండి వచ్చిన రోజున. ఎడార్లో వున్నప్పుడు అదే మాట అనేది.

సుమిత్ర నాకు తారస పడటం ” —–  గెస్టు హౌస్ ‘ లో నేను పాట రాయడానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు, నన్నా గెస్టుహౌజ్  లో పెట్టారు. రూంస్ చాలా కాస్ట్లీ. కానీ బ్రహ్మాండంగా  వుండేది. భోజనం రుచిగానూ, శుచిగానూ వుండేది.  హీరోయిన్ కూడా అక్కడే దిగేది. విశాలమైన గదులు, చక్కని గార్డెన్.

రెండో రోజు మెట్లెక్కుతూ జారిపడ్డాను. కాలికి మెట్టు కొట్టుకొని విపరీతమైన బాధ. ఆ శబ్ధానికి ఎదుటి గదిలో నుంచి బయటకు వచ్చింది సుమిత్ర. చెయ్యి ఆసరా ఇచ్చి పై అంతస్తులో వున్న నా గది దాకా నడిపించింది. భుజం కూడా ఆసరా అయ్యింది.

గంటలో మా వాళ్ళు వచ్చి  ఏక్స్ రే అవీ తీయించారు. ఏదీ విరగలేదు కానీ మజిల్ రప్చర్ అయ్యిందన్నారు. మళ్ళీ నా గదిలో ‘బెడ్ రెస్ట్ ‘ అంటూ దిగబెట్టారు. న్యాయంగా నాకు సేవ చేయాల్సిన అవసరమో , నన్ను చూసుకోవాల్సిన బాధ్యతో ఆమెకి లేదు.

కానీ తనంతట తానే వచ్చి కాలుకి కాస్త కాపడం పెట్టడం , డాక్టర్ ఇచ్చిన లిక్విడ్స్ పూయడం , నేను వీలుగా పడుకుంటే టిఫిన్ ప్లేట్లో, భోజనం ప్లేట్లో చేతికివ్వడం, మంచి నీళ్ళు తాగాల్సి వచ్చినప్పుడు ఆ ప్లేట్లు తను పట్టుకొని నాకు మంచినీళ్ళు తాగే వీలు కల్పించడం లాంటి సేవలు చేసేది.  నేను మొహమాట పడితే ” ఇందులో ఏముందండీ? అయినా మీ పాటలంటే నాకు ఇష్టం… పోనీ ఏ పాటలోనైనా నా పేరు ఇరికించండి. ” అనేది నవ్వుతూ.

ఆ ‘హీరోయిన్ ‘ కూడా వచ్చి పలకరించేది. వస్తూ పళ్ళు అవీ తీసుకొచ్చేది. “ఎందుకివన్నీ ” అని నేను మొహమాట పడితే “, “నాకో సూపర్ హిట్ సాంగ్ ఇస్తారని కాకాపడుతున్నా ” అనేది.

వారంలోగా రెండు పాటలు పూర్తి చేశాను. కాలూ బాగుపడింది. సాయంత్రాలు ముగ్గురం కాఫీ తాగుతూ కాసేపు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. పాటలు రాశాను కనక వెళ్ళిపోవచ్చు. కానీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇద్దరూ మరో నాలుగు రోజులు వుండమన్నారు. కారణం ఇంకో రెండు ట్యూన్లు రెడీ అవుతున్నాయిట.

“మీదేవూరండీ?” అడిగింది సుమిత్ర ఓ ఉదయమే. “ఫలానా ” వూరని చెప్పాను. పకపకా నవ్వి “చూశారా! నేను అనుకున్నదే నిజమయ్యింది. నిన్న మీరు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ సరదాగా “చేద్దాం.. చూద్దాం ” అంటూ యాసలో మాట్లాడారు. ఆ యాస మా పక్కదే.”

“అంటే?” నవ్వాను

“మీ వూరి దగ్గరే మా వూరూనూ! అయినా పొట్ట చేత పట్టుకున్నవాళ్ళకి ఏ వూరైతేనేం. కానీ, ఏదో పాశం పుట్టిన గడ్డకి లాగుతూనే వుంటుంది. ” మామూలుగా అన్నా ఓ చిన్న బాధ ధ్వనించింది.

“సుమిత్ర గారు! నేను చాలా కాలం నుండి  మిమ్మల్ని చూస్తున్నాను… భగవతీ హోటల్ దగ్గర. మా వూరి దగ్గరే మీ వూరు అన్నారు కనక అసలు మద్రాస్ ఎలా వచ్చారో  చెప్తారా? కేవలం కుతూహలంతో అడుగుతున్నా! ” అన్నాను.

“అందరూ నన్ను ‘మణి ‘ అనో, ‘నల్లమణి ” అనో, పిలుస్తారు. తెలిసిన వాళ్ళు సుమీ అనో, సుమిత్ర అనో లేకపోతే ఒసేయ్ సుమిత్ర అనో పిలుస్తారు. మీరు మాత్రం ‘గారూ ‘ అన్న గౌరవవాచకం తగిలించి నా నెత్తిన కిరీటం పెట్టారు. మొదట మనిషిగా చూసినందుకు థాంక్స్. ఇక నా కథ అంటారా… కోడంబాకంలో వున్న నాలాంటి వాళ్లందరిదీ ఒకటే కథ. మరీ ప్రత్యేకమైనది ఎమీ లేదులెండి. ” తేలిగ్గా నవ్వేసింది.

“చూడటానికి, వినడానికి అన్నీ ఒకేలా వున్నా , ఎవరి కథ వారిదేనండీ. ఎవరి కథ ఎవరిని ఎలా మార్చగలదో ఎవరికి తెలుసు? నేనూ ఒకరి జీవితాన్నించి స్ఫూర్తి పొంది మద్రాసుకి వచ్చాను. కుతూహలంతోనే అడిగాను సుమిత్ర గారు. ఇందులో బలవంతం ఏమీ లేదు ” అనూనయంగా అన్నాను.

“చెప్పకూడదని ఏమీ లేదండి. చెప్పినా నష్టం లేదు. నిజం చెబితే చెప్పాలనే వుంది. అన్నట్లు మీరు “చినరాయుడు’ లో “చెప్పాలనుంది సుందరి … కథ విప్పి చెబుతాను సుందరీ ” అని పాట కూడా రాశారుగా. నేనూ చెబుతా. .. అయితే నాకు  కొంచం టైం ఇవ్వాలి. ” చిన్నగా నవ్వి అన్నది.

“ఓ పదేళ్ళు తీసుకోండి ” నవ్వి దిండు మీదకు వాలాను.

“హి.. హి.. మరీ అంత తక్కువ టైమా? సరే! చిన్నప్పటి నుంచీ ‘ప్రేమ ‘ అంటే నాకు అసహ్యం. నా ఫ్రెండ్స్  లో ‘ప్రేమ ‘ పేరుతో చాలా మంది కన్యత్వాన్ని సమర్పించుకున్నారు. కొంతమందైతే రహస్యంగా డాక్టర్లని కూడా బ్రతిమాలుకొని ‘బుద్ధి ‘ తెచ్చుకున్నారు ” ఆగింది. నేను పడుకున్నవాడిని కాస్తా మళ్ళీ వీలుగా కూర్చున్నాను. మరింత అటెంటివ్ గా.

“నాకు తెలియని విషయం ఏమిటంటే ‘ప్రేమ’ ని కంట్రోల్ చేసుకోవడం తేలికేగానీ ‘పెళ్ళి’ ని కంట్రోల్ చేయడం కష్టం అని. మగాళ్ళలో ఓ మాదిరి తెలివిగలవాళ్ళు ‘మూర్ఖులు ‘ , ‘ప్రేమ ‘ పేరుతో ఆడదాన్ని ప్రలోభ పెట్టే పద్ధతి ఎన్నుకుంటే, మహా  తెలివైనవాళ్ళూ , ప్రేమకు ‘సొడ్డు ‘ కొట్టడం తెలిసినవాళ్ళు ‘పెళ్ళి ‘ పేరుతో వలవేస్తారు. నా విషయంలో జరిగింది వేరు. ” ఓ క్షణం ఆగి కళ్ళు మూసుకుంది. బహుశా గతపు నీడల్లోకి పయనించి వుండొచ్చు.

“అతని పేరు సుధాకర్. నేను డిగ్రీ రెండో సంవత్సరం , అతను అప్పటికే బ్యాంక్ ఉద్యోగి . నేను కాలేజీకి వెళ్ళినప్పుడు చాలాసార్లు ఎదురుపడ్డాడు కానీ , ఎప్పుడూ వెకిలిగా బిహేవ్ చేయ్యలా! అలాగే నేను చామనఛాయ కంటే కొంచం తక్కువ. అతనేమో ‘ఫారన్ ‘ కలర్. అంటే గోల్డన్ బ్రౌనన్న మాట. ఓ రోజు సడన్ గా “సుమిత్ర గారు… మిమల్ని చాలా రోజుల నుంచీ గమనిస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. మీకు నేనంటే మంచి అభిప్రాయం వుంటే ‘పెళ్ళి ‘ చేసుకుందాం.. మీరెప్పుడు ఓ.కే అంటే ఆ క్షణాన్నే మీ ఇంటికొచ్చి మీ వాళ్లతో మాట్లాడుతా. పెళ్ళైంది కదా అని మీరు చదువు మానక్కర్లేదు. డిగ్రీనే కాదు.. పోస్ట్ గ్రాడ్యేషన్ కూడా నేనే చేయిస్తా… నో కట్నం. ఆలోచించుకొని చెప్పండి. ” అని వెళ్ళిపోయాడు. నాకు షాకు. అసలు నా పేరు అతనికి ఎవరు చెప్పారో కూడా నాకు తెలియదు. ” మళ్ళీ ఆగింది సుమిత్ర. కొన్ని క్షణాలు మౌనం పాటించాము.

“తరవాత” కుతూహలంగా అడిగాను.

“అతను డైరెక్ట్ గా అడిగిన విధానం నచ్చి నేను ఓ.కే. చెప్పాను. అతనూ మాట తప్పకుండా మా ఇంటికి వచ్చాడు. అయితే అతను వచ్చిన రోజు ఇంట్లో నేను వదినా తప్ప పెద్దవాళ్ళు ఎవరూ లేరు. కారణం మా నాయినమ్మ చనిపోవడం. అతను చెప్పదలచుకున్నది మా వదినతోటే సూటిగా స్పష్టంగా చెప్పాడు. ” మళ్ళీ ఓ బ్రేక్.

“మీ కులం ఏమిటి? ” ఒకే ఒక ప్రశ్న అడిగింది మా వదిన. మా ఒదిన అంటే చాలా పెద్దదని అనుకునేరు. ఆవిడ నాకంటే కేవలం ఐదేళ్ళే పెద్దది. ” సుమిత్ర పెదవుల మీద చిరునవ్వు.

“ఊ.. ” అన్నాను.

“అవసరమా? సరే.. నా కులం ఏమిటో నాకే తెలియదు. ‘ఫలానా ‘ కులం వాళ్ళు నన్ను పెంచుకున్నారు గనక నా కులం ‘ఫలానా ‘ దే అనుకోవచ్చు” అన్నాడతను.

“అయితే.. ఈ జన్మకి మావాళ్ళు ఒప్పుకోరు. మీ కులానికి మా కులానికి పురాణ వైరం వుంది. మా వాళ్ళు

ప్రాణాలన్నా  వదులుకుంటారు కానీ కులాన్ని వదులుకోరు ” స్పష్టంగా చెప్పింది మా వదిన. ఆవిడ అన్న మాట తప్పు కాదు. మా వాళ్లకి ‘కులం ‘ అంటే చెప్పలేనంత అభిమానం ” నిట్టూర్చింది సుమిత్ర.

“అదీ నిజమేలెండి. ఇవాళ మనిషిని సంస్కారాన్ని బట్టి ఎవరూ గుర్తించడం లేదు. గుర్తించేది కేవలం కులంతోటే ” నవ్వాను నేను.

“అంతేగా! ఆ తరవాత మా వదిన ఒక సలహా ఇచ్చింది! ” నవ్వింది

“ఏమని? ”

“లేచిపొమ్మని!” నవ్వింది

“లేచిపోతే మా ప్రేమని దక్కించుకున్నట్టు అనడమే కాక, ఎప్పుడో ఒకప్పుడు మావాళ్ళు ఒప్పుకోవచ్చు . ఒప్పుకుంటే వేరీ గుడ్, ఒప్పుకోకపోతే ప్రేమైనా దక్కుతుంది గదా.. అదీ ఆవిడ రీజనింగు ” మళ్ళీ నవ్వింది సుమిత్ర.

“నవ్వుతారెందుకూ? మంచి సలహానేగా? “అన్నాను.

“మంచి సలహానే. రెండు నెలల క్రితం వాళ్ళ చెల్లెలు ఇదే సమస్య తో మా వదినని సలహా అడిగితే “పెద్దవాళ్ళని క్షోభపెట్టి మీరేమి బావుకుంటారు, నోరు మూసుకొని అమ్మానాన్న కుదిర్చిన సంబంధం చేసుకో. ప్రేమా గీమా అంటూ పిచ్చివాగుడు వాగకు ” అని నానా తిట్లు తిట్టింది ” ఈ సారి పగలబడి నవ్వింది  సుమిత్ర.

“ఇంత నవ్వెందుకంటారా? నేను ప్రేమ పేరుతో లవ్ మారేజ్ చేసుకుంటే నా పెళ్ళి ఖర్చు తప్పుతుంది. ఆస్తిలో కూడా చిల్లిగవ్వ ఇవ్వక్కర్లేదు. మొత్తం మా అన్నవదినలకే దక్కుతుంది. ఇంత దూ(దు) రాలోచన వుంది…. ఆ సలహా వెనుక.

“మరేం చేశారు? ” కుతూహలంగా అడిగాను

“సుధాకర్ కి సారీ చెప్పాను. కానీ..” నిట్టూర్చింది…

“ఊ…”

“నెలరోజుల పాటు ఆలోచించి ఆలోచించి అతని దగ్గరకే వెళ్ళి “మీకు ఓ.కే అయితే నాకూ ఓ.కే ” అని చెప్పాను.

దానికతను నవ్వి ” సారీ సుమిత్ర గారు! మీరెప్పుడైతే నో అన్నారో అప్పుడే నేను మావాళ్ళు చెప్పిన సంబంధం ఓ.కే అని చెప్పాను, ప్రేమ గొప్పదా?.. కాలం గొప్పదా? అనడిగితే నా దృష్టిలో కాలమే గొప్పది . ప్రేమించినవాళ్ళు ప్రేమించిన వారి కోసం కొన్నాళ్ళు ఆగొచ్చు. కానీ కాలం క్షణం సేపు కూడా ఆగదు అన్నాడు ” ఈ సారీ సుధీర్ఘంగా  నిట్టూర్చింది సుమిత్ర.

“తరవాత?”

“మా వదిన చెడ్డది కాదు, అలాగనీ మంచిదీ అనలేను. సుధాకర్ విషయం మా వాళ్ళతో చెప్పింది. అప్పటినుంచి నా బ్రతుకు ఘోరమైంది.

“ఎందుకు చెప్పావు? ఆల్రెడీ అతనికి పెళ్ళి కుదిరింది కదా ‘ అని అడిగితే ” ఏమో మీవాళ్ళూ సరే అంటే నీ ప్రేమ సఫలం అవుతుందని ఊహించాను.   అందుకే మీ అన్నయ్యకి చెబితే, మీ అన్నయ్య మీ అమ్మానాన్నకు చెప్పారు. ఇలా అవుతుందనీ నాకేం తెలుసు ” అని దీర్ఘం తీసింది.

నేను ఎవరితో లేచిపోతానో అనే భయంతో నా కాలేజి చదువు మానిపించారు. అంతే కాదు రోజంతా ‘నడవడిక ‘ గురించీ పరువూ- ప్రతిష్టల గురించీ క్లాసులు! ” మొహంలో నైరాశ్యంతో కూడిన నవ్వు కానీ నవ్వు.

“ఊ…” అన్నాను. ఓ ఎమోషన్ లో వున్నవారిని మాటల్తో విసిగించేకంటే ‘ఊ..ఊ… ‘ల భాష ఉపయోగించడమే మంచిది.

“సార్… పెద్దవాళ్ళు ఒకరకంగా మూర్ఖులు.. పిల్లలకేదో ‘బుద్ధి ‘ చెబుతున్నామనకుంటూ ‘పిచ్చి ‘ పుట్టిస్తారు. చెప్పిందే వందసార్లు చెప్పి విసిగిస్తే ఏమౌతుందీ? మెదడూ, మనసూ కూడా మొద్దుబారతాయి. నాకు జరిగిందీ అదే! ‘తిక్క ‘ పుట్టుకొచ్చింది. చదువు మాన్పించడంతో ‘కచ్చ ‘ పుట్టుకొచ్చింది. ఆ సమయంలో పరిచయమయ్యాడు బదిరీ… అంటే బదిరీనారాయణ ” మళ్ళీ మౌనంలోకి జారిపోయింది.

రాలిపోయిన క్షణాల్ని ఏరుకోవాలంటే మౌనం ఒక్కటే ఆయుధం “అతను అందగాడు కాదు. అనాకారి. కానీ గొప్ప మనిషి. ఒకసారి  మా అమ్మతో పాటు గుడికెళ్తే అక్కడ పరిచయమయ్యాడు. మా అమ్మని “మీరు ఫలానా కదూ ” అనడిగి పరిచయం చేసుకున్నాడు. అతనిదీ అమ్మ వాళ్ళ వూరే. నాకంటే పదిహేనేళ్ళు పెద్దవాడు. ఓ రోజు నా బాధలు అడిగి తెలుసుకున్నాడు. మావాళ్ళు అతన్ని మాయింటికి రానివ్వడానికి కారణం అతను మా కులం వాడే. మెల్లగా మా వదిన రాజకీయం నడిపింది , నాకు అతన్ని ‘పెళ్ళికొడుకుగ్గా ‘ మాట్లాడేట్లు మా వాళ్ళని వొప్పింది.

ఇదో కొత్త ట్విస్ట్ .. అయితే అసహజమైనది కాదూ. ఘనత వహించిన భారతీయ సగటు తల్లిదండ్రులకి ‘పిల్లలకంటే, వాళ్ళ భవిష్యత్తు కంటే, ‘పరువు-ప్రతీష్టలే ‘ ముఖ్యం అని పురాణకాలం నుంచీ స్పష్టమైన ఆధారాలు మనకున్నాయి.

‘చచ్చినా సరే.. పెళ్ళి చేసుకొని చావు ‘ అనేది ఇంగ్లీషు రాజ్యంలా , అన్ రిటెన్ కాన్స్టిట్యూషన్.

“నా వాళ్ళ దగ్గర వుండే కంటే నరకంలో వున్నా గొప్పగానే వుంటుందని నేను పెళ్ళికి ఒప్పుకున్నా.

“సుమిత్రా.. కాలం మనకోసం ఆగదు. ఆగని దాన్ని మనమెందుకు గుర్తించాలి? ప్రేమ ఆగుతుంది… ఎన్నాళ్ళయినా.. ఎన్నేళ్ళయినా .. అందుకే నువ్వు నీ మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించేవరకూ నేను ముట్టుకోను. రేపే కాలేజీలో చేరు… ట్యూషన్ తీసుకో. డిగ్రీ తెచ్చుకొని తీరాలి! ” అన్నాడాయన శోభనం రోజు ! ”

సుమీ దీర్ఘంగా నిట్టూర్చింది. ప్రతి నిట్టూర్పు వెనకాల కొన్ని వేల ఆలోచనలు సమాధుల్ని చీల్చుకొని బయటకొస్తున్నాయని నాకు అర్ధమయింది.

“టైమ్‌కి విలువిచ్చి సుధాకర్ వేరేదాన్ని పెళ్ళిచేసుకుంటే, ప్రేమకి విలువిచ్చి బదరీ నాకు స్వేచ్చనీ, చదువునీ ప్రసాదించాడు. అందం ‘వయసు ‘ తోనూ ‘తనువు ‘ తోనూ వుండదనీ , అందుండేదీ ‘ మనసు ‘ లోనేననీ నాకు అర్ధమవడానికి సంవత్సరం పట్టింది.

పట్టుపట్టి పరీక్షలు పాస్ అయ్యాను. డిగ్రీ చేతికొచ్చిన రెండో సంవత్సరానికల్లా  ఓ బిడ్డకి తల్లినయ్యాను ” ఓ చిన్న నిట్టూర్పు..

“ప్రతి కష్టం ఓ సుఖానికి పునాదే అని ఎవరూ చెప్పరు. కానీ అది నిజం. ఉద్యోగం చేస్తున్న బదిరి, సడన్ గా పోవడంతో భయంకరమైన శూన్యం నన్ను ఆవహించింది.అదృష్టం ఏమిటంటే, అతను చేస్తున్న ఉద్యోగమే ఆ కంపెనీ వారు నాకు యిచ్చి నన్ను ఆదుకున్నారు ” మళ్ళీ మౌనం.

“అయ్యా జరిగింది జరిగినట్టుగా, వరుస క్రమంలో చెప్పాలంటే , ఓ నవల తయారవుతుంది. ఒకటి మాత్రం నిజం ఆడకానీ మగ కానీ ఒంటరిగా వుండటం చాలా కష్టం. యవ్వనం ఎటువంటిదంటే ఎంతకైనా తెగింపచేస్తుంది. బదరీ వాళ్ళ అమ్మ వచ్చి ఓ రోజున నాతో దెబ్బలాట పెట్టుకుంది… మాకు పుట్టిన పిల్లాడిని తనకు ఒప్పజెప్పాలని. మొదటి నుంచీ నా విషయంలో ఆమె దురుసుగానే వుంది. కారణం నేను అంతకు ముందే ‘ప్రేమ ‘ లో పడ్డానని ఆమెకు ఎవరో ‘ఉప్పు ‘ అందించడమే. ఓ పక్కన భర్త పోయిన బాధ, రెండో పక్క అత్తగారితో దెబ్బలాటలు నా మనశ్శాంతిని  వంచించాయి. అప్పటికే ‘ఓదార్పు ‘ పేరుతో నాతో కొంచం సన్నిహితంగా వచ్చిన  ‘వినోద్ ‘ నాకు ధైర్యం చెప్పాడు. వినోద్ నిరుద్యోగి.. కానీ గొప్ప నటుడు. అతని డ్రామాలు నాలుగైదు అంతకు ముందే మా వారితో  కలిసి చూశాను. ఓ విధంగా అతను మా వారికి ఓ మాదిరి స్నేహితుడే! ” గుక్క తిప్పుకోవడం కోసం ఆగింది.

“ఎందుకు .. ఎలా అనేదాని కంటే , బిడ్డను అత్తగారికిచ్చేసి వినోద్ తో నేను మద్రాస్ వచ్చేశాను. నాలుగేళ్ళపాటు పాండీబజారులో ‘ఫలానా ‘ షాప్ లో సేల్స్ గార్ల్ గానూ, ఆ తరవాత ఎకౌంటెంట్ గా, ఆ తరవాత ‘ఫలానా ‘ హోటల్లో హౌస్ కీపింగ్ ఎగ్జిక్యూటివ్ గా , బోలెడు అవతారాలెత్తాను. నిజం చెపితే వినోద్ అవకాశాలు వెతుక్కోడానికి అవకాశం కల్పించాను. ”

“వినోద్ అంటే? ”

“తొందరెందుకు సార్ , మామూలు ఎగస్ట్రా వేషాల్నించి ‘హీరో ‘ గా ఎదిగిన ‘ఫలానా ‘ వ్యక్తి గురించే నేను చెప్పేది ” నవ్వింది.

“మై గాడ్ కోట్ల మీదేగా అతని సంపాదన? ” షాక్ తిన్నాను.

“అవును నిచ్చెన ఉపయోగపడేది మేడ ఎక్కడానికే. ఎక్కాక నిచ్చెనతో పనేముంది? ” నిట్టూర్చింది.

“మొదట్లో చాలా బాధపడ్డాను. కానీ తరవాత అర్ధమయింది. ‘వినోద్ ‘ అనే రాయిని ‘శిల్పం’ గా మార్చాలనేది నా కోరిక. నిచ్చెనగా ఉపయోగపడమని అతను నన్ను అడగలేదు.  శిల శిలగా ఉన్నప్పటి కథ వేరు. శిల శిల్పమైతే? దాని అసలైన స్థానం ఏమిటో అక్కడకి అది చేరి తీరుతుంది. వినోద్ కూడా అతని చేరాల్సిన స్థానానికి చేరాడు. అతని తప్పేముంది? “మళ్ళీ ఓ సుదీర్ఘ నిట్టుర్పు. నిజంగా నాకు షాక్. వినోద్ (అసలు పేరు వాడలేదు) అంత ఎత్తుకి ఎదుగుతాడని మేము ఎన్నడూ వూహించలేదు. అతని టాలెంట్ కాక అదృష్టమూ అతని తలుపు తట్టింది. అదే, సుమిత్ర తలుపు మూసేసింది.

“తరవాత?” మౌనాన్ని ఛేదిస్తూ అడిగాను.

“ఏ ‘మగవాడి ‘ దగ్గర పనిచేసినా వాడి చూపులు “శరీరం” మీదే వుండేవి. కోరికకీ – అందానికి సంబంధం పెద్దగా వుండదేమో. ఒకరు నన్ను ప్రేమించి వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారు. ఇంకొకరు నన్ను పెళ్ళి చేసుకొని ప్రేమించారు. మరొకరు నన్ను ఓదార్చే ప్రయత్నంలో దగ్గరై మరో స్థాయికి చేరారు. నేనూ మాత్రం ఏం చెయ్యనూ? నా అత్తమామలకి వారసులు లేరు గనక , నా బిడ్డని వాళ్ళ వారసుడిగా వారికే వప్పచెప్పాను. ప్రేమ మీద నమ్మకం లేని నాకు ప్రేమే కరువయ్యింది. కానీ , ఆ ప్రేమ కోసం శరీరాన్ని తాకట్టు పెట్టలేదు. ఈ హీరోయిన్ నాకు చాలాకాలం నుండి పరిచయం వున్న వ్యక్తే. అందుకే ఆమె దగ్గర “టచప్ వుమెన్ ” గా చేరాను. నన్ను చాలా ప్రేమగా ఆదరిస్తోంది. ఇక కంఫర్ట్ అంటారా? అంతెక్కడా? ” మళ్ళీ ఆగింది.

“మరి.. ” ఓ ప్రశ్న వెయ్యబోయి ఆగాను.

“ఇప్పటి జీవితం గురించా? నిజం చెబితే చాలా ఆనందంగా వున్నాను. గురూజీ.. ‘ఫలానా ‘ది కావాలని అని కోరుకున్నంత కాలం నేను అనుభవించింది క్షోభే. కానీ ఇప్పుడు ‘నాకేదీ వద్దు ‘ అనుకున్నాను కనక హాయిగా వుంది. అసలేం కావాలి డబ్బా? పదవులా? పెద్ద ఉద్యోగమూ, జీతమూ పరపతి అవా? అవన్నీ వుంటే సౌకర్యం వుంటుందే కానీ ‘సుఖం ‘ దక్కుతుందా? ఇలా.. ఎన్నో ప్రశ్నలు నన్ను చాలా కాలం వెంటాడాయి. ఇవన్నీ వున్నవాళ్ళు సుఖపడుతున్న దాఖలాలేవీ నాకు కనిపించలేదు.

డబ్బు సంపాదన పెరిగే కొద్ది అనవసరమైన వస్తువులు  కొనడం, అర్ధం లేని ఆడంబరాలకు పోవడం, తప్ప ‘నిజమైన సుఖం ‘ నాకు అవగతం కాలేదు. ‘రేపటి మీద ‘ ఆశలతో మనిషి ‘ఈనాడు’ ని నిర్వీర్యం చేసుకున్నాడని అనిపించింది. అందుకే, అన్నీ వదిలేసి అతిసామాన్యులు వుండే పాకలో వుంటున్నా. నాకు తోచినంతగా పదిమందికీ వుపయోగపడే ప్రయత్నం చేస్తున్నాను ” ఆగింది.

“సరే.. పాకలో వుంటే ఏమి తెలిసిందీ? ” కుతూహలంగా అడిగాను

పకపకా నవ్వింది సుమిత్ర “కవిగారూ.. మీలో ఇంకా ఆ ‘సైనికుడి ‘ మనస్తత్వమే వుంది కానీ, సినిమా మనస్తత్వం రాలేదు. అయ్యా, తాజ్ మహల్లో వున్నా, పూరి గుడిసెలో వున్నా మనుషుల ‘ నిజమైన ‘ మొహాల్ని ఎప్పటికీ చూడలేమని అర్ధమయ్యింది. గొప్పవాళ్ళు ఒక రకం ‘ముసుగులు ‘వేసుకొని కృత్రిమంగా జీవితం గడుపుతుంటే , పేదవాళ్ళు మరోరకం ముసుగులు తగిలించుకొని కృత్రిమమైన జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు. నాకు నిజంగా అర్ధమైనదేమిటంటే , పేదా గొప్ప తేడాలు ‘ఆస్తిపాస్తుల్లో ‘ లేవని కేవలం ‘మనసుల్లో ‘ మాత్రమే వున్నాయని అర్ధమైంది! ” అన్నది.

బహుశా పేద గొప్పలకి ఇంత పెద్ద నిర్వచనం ఇచ్చింది సుమిత్ర ఒకతేనేమో! మనిషి యొక్క గొప్పతనము, పేదతనమూ నిజంగా డబ్బుతో కాదు , మనసు బట్టి ఆధారపడి వుంటుందన్న మాట ఆ తరవాత 72 గంటల్లో ఋజువైంది.

ఈ సంభాషణ జరిగిన రోజే నేను చెన్నై వచ్చేశా యీవినింగ్ ఫ్లైట్ లో. కారణం ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా కంపోజింగ్ రికార్డింగ్ చెన్నై లో చేద్దామనుకోవడం వల్ల.

రెండు రోజుల తరవాత పాండీబజారు లో ‘సుమీ ‘ కనిపించింది.

“అదేంటీ? ఈ నెలాఖరు వరకు మీ షెడ్యూల్ వుందన్నారుగా? క్యాన్సిల్ అయ్యిందా? “ఆశ్చర్యంగా అడిగాను.

సన్నగా నవ్వింది సుమిత్ర.

“షెడ్యూల్ మామూలుగానే వుందండీ.. నాకే పని “ఊడిపోయింది! ” అన్నది.

“అదేంటీ? మీకూ హీరోయిన్ కి …. ” ఆగాను..

“ఊహూ.  సినిమాహిరో గారితో ప్రాబ్లం వచ్చింది. మొన్నటి వరకు అన్నీ హీరోయిన్ ఓరియంటెడెడ్ సీన్లు , మిగతా సీన్లు షూటింగ్ జరిగాయి.  మొన్న హీరో గారు ఎంటర్ అయ్యారు. వారు నన్ను చూసి ఇబ్బంది పడ్డరనుకుంటాను. ‘సెట్ ‘ నుంచి నన్ను తప్పించమని వారు డైరెక్టర్ కి చెబితే , డైరెక్టర్ ప్రొడ్యుసర్ కి, ప్రొడ్యుసర్ హీరోయిన్ గారికి చెప్పారుట. చివరికి హీరోయిన్ గారు నన్ను పిలిచి “సారీ సుమీ.. నిన్ను చూసి బహుశా హీరోగారికి మొహం చెల్లలేదనుకుంటా… ఏమైనా, అతనా టాప్ హీరోలలో ఒకడు. నేనింకా అంతగా నిలబడిపోలేదు. నువ్వే అర్ధం చెసుకొని.. ” అంటూ చెక్కుబుక్కు తీసింది. ఇంకేం చెస్తా, నాకు రావల్సిన మొత్తం మాత్రం తీసుకొని ట్రైనెక్కాను ” నిట్టూర్చింది సుమిత్ర.

“మరి.. ఇప్పుడు… “ఆగిపోయాను “అంటే ఆ హీరో వినోదేనా?” ఆత్రంగా అడిగాను.

“అవును.. ఒకప్పుడు నా మీద ఆధారపడ్డవాడు నన్ను ఆఫ్ట్రాల్ ఓ టచప్ విమెన్ గా ఎలా చూడగలడూ? అందుకే… ” పకపకా నవ్వింది.

“మరి.. ఇప్పుడు ” ఇందాకటి ప్రశ్నే మళ్ళీ అడిగాను.

“జీవితం చాలా విశాలమైనది సార్.. ఎన్ని తలుపులు మూసుకుపోయినా ఏదో ఒకటి మళ్ళీ తెరుచుకుంటుంది. అయినా యీ మాత్రం సస్పెన్సు లేకపోతే జీవితం నిస్సారంగా నడుస్తుంది కదూ! ” నవ్వీ నడక సాగించింది సుమీ అనబడే సుమిత్ర ఉరఫ్ నల్లమణి. నేను అక్కడే నిలబడ్డా.. చాలా సేపు.. నడిచే సినిమా చూస్తూ…

మీ మాటలు

 1. వసంత రావు దేశపాండే says:

  కథ బాగుంది.సుమిత్ర ఎవరో , వినోద్ ఎవరో , ఈ పాత్రలు సజీవనమైతే ఏవరు అనేది మాకు అంతుపట్టని సస్పెన్స్ . కత చెప్పిన తీరు సూపర్

  • BHUVANACHANDRA says:

   చాలా చాలా చాలా ధన్యవాదాలు వసంత రావు దేశపాండే సాబ్ . మీ స్పందన నాకు అమితానందాన్ని ఇచ్చిందండీ .

 2. buchireddy gangula says:

  sir…
  ఎప్పుడు నిజాలే రాస్తారు —భాగుంది సర్
  ———————————–
  బుచ్చి రెడ్డి గంగుల

  • BHUVANACHANDRA says:

   బుచ్చి రెడ్డి గంగుల గారూ …మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అండీ …..మిమ్మల్ని ”సారంగ”’ లో కలవడం నాకు ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తూనే వుంటుంది థాంక్స్ వన్స్ అగైన్

 3. గొరుసు says:

  భువన చంద్ర గారూ … ఇలాంటి కథలు రాస్తూ మమ్మల్ని ఇంకెన్నాళ్ళు ఏడిపిస్తారు ? “జీవితాన్ని” పండు వలచినట్టు చెప్పే నేర్పు ఇంత సహజంగా ఎలా అబ్బింది మీకు ? కథ పూర్తి చెయ్యగానే ఏమిటొ అంతా పిచ్చి పట్టినట్టు … మీకు తెలిసిన సుమిత్ర గారు నన్ను ఆవహించడం ఏమిటో అర్థం కాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నా గుండె తడిపి మెలితిప్పి దండెం మీద ఆరేశారు సుమీ !

  • BHUVANACHANDRA says:

   గొరుసు, గారూ ..ఎలావున్నారూ ? నామీద నాకు బోలెడంత ”నమ్మకా న్ని” ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు .

   సర్ ,ఇక్కడ , అంటే, ఈ ఫీల్డ్ కి వొచ్చే ప్రతివారి వెనకా ఎదో ఓ కధ వుంటూనే వుంటుంది . ”గొప్పవారి ”గురించి వొచ్చే రచనలు కోకొల్లలు ….అవి కూడా చాలా అతిశయోక్తులతో వుంటాయి .కానీ , ”సుమీ ” లాంటి వ్యక్తులు జీవితాన్ని ఎలా జీవించాలో చూపిస్తూ వుంటారు .అటువంటి వారివే నేను కదా రూపంలో తెస్తున్నాను . మీకు మరోమారు ధన్యవాదాలతో …..భువనచంద్ర

 4. Jaya Reddy Boda says:

  చాలా బాగుంది సార్ కథ మంచి మనసున్న వారు స్వార్థ పరుల చేతుల్లో మోసపోయే విధానం చాలా ఆర్ద్రంగా చెప్పారు సార్ ..

 5. వనజ తాతినేని says:

  సుమిత్ర గారి కథ చాలా వ్యధ గా ఉంది. ముసుగులు వేసుకున్న మనుషులలో వినోద్ ఉండటం ఆశ్చర్యమేమీ అనిపించలేదు భువన చంద్ర గారు . నల్ల మణి ని పాఠకుల డెందాల పై ఆరేసి మీరు తేలికయ్యినట్టున్నారు. పాఠకురాలిగా నేను మొయ్యలేకపోతున్నాను. మంచి మనిషిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సర్ !

  • BHUVANACHANDRA says:

   నమస్తే వనజ తాతినేని గారూ …మీ బ్లాగ్ లో మీరు నా ”మనసుపొరల్లో ”గురించి రాసిన అభిప్రాయాన్ని శ్రీ కిరణ్ ప్రభ గారు చదివి నాకు పంపారు అండీ . నిజంగా నా కళ్ళు చెమర్చాయి మీ మంచి మాటలకి నేనెలా ఋణం తీర్చుకోగాలనూ ? ఎన్ని ధన్యవాదాలు చెప్పినా ,ఎన్ని పేజీలు  కృతజ్ఞతలతో నింపినా తక్కువే అవుతుంది …ఇప్పుడు మళ్ళీ ఈ స్పందనతో నాకు అమితమైన ఉత్సాహాన్ని ఇచ్చారు ……._____/\_____ ఇంకేం చెప్పగలనూ …

 6. భువన చంద్ర గారూ,

  మీరు రాసే కథలు ఆసక్తిగా చదువుతాను. చాలా బాగా రాస్తారు. అవి చదువుతూంటే మహేష్ భట్ చెప్పిన సినేమా రంగ అనుభవాలు గుర్తుకువస్తుంటాయి. ఆయన కూడా మంచి రచయిత. ఆయన ఆధ్యాత్మిక గురువు యు.జి. కృష్ణమూర్తి పై రాసిన పుస్తకాలలో అక్కడక్కడ సినెమా పరిశ్రమ అనుభవాలు రాస్తూంటాడు.

  • BHUVANACHANDRA says:

   శ్రీరామ్ గారూ ,ముందుగా నా కృతజ్ఞతలు అందుకోండి …..కొండంత నమ్మకాన్ని ఇచ్చినందుకు హృదయ పూర్వక ధన్యచాదాలు

 7. baala gayathri kumar says:

  భువనచంద్ర గారూ మీరు కవిత్వమే కాదు వచనం కూడా ఇంత బాగా రాస్తారని ఈ కథ చదివిన తరువాతే అర్థమయింది. లోకం లో వున్న వంచన తెలిసే కొద్ది మనుషులు కఠినంగ గడుసుగా మారిపోతారు
  . సుమిత్ర వంటి ఆర్ద్రహృదయులు మరింత మానవీయంగా ప్రవర్తిస్తారు . వారివల్లనే ఈ సమాజం లో ఇంకా మానవ విలువలు బ్రతికున్నయనే భరోసా కలుగుతుంది

  • BHUVANACHANDRA says:

   BAALA GAYATHRI కుమార్ గారూ హృదయపూర్వక ధన్యవాదాలండీ ….మీ స్పందనే నాకు ఇంధనం …సదా మీ అభిప్రాయాల్ని కోరుకుంటూ ……భువనచంద్ర

 8. Y RAJYALAKSHMI says:

  గొప్పవాళ్ళు ఒక రకం ‘ముసుగులు ‘వేసుకొని కృత్రిమంగా జీవితం గడుపుతుంటే , పేదవాళ్ళు మరోరకం ముసుగులు తగిలించుకొని కృత్రిమమైన జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు. – Excellent

 9. BHUVANACHANDRA says:

  ధన్యవాదాలు Y రాజ్యలక్ష్మి గారూ .మీకు నా కృతజ్ఞతలు .

 10. G.venkatakrishna says:

  కథ బాగుంది ….వాస్తవికత అనే గడ్డు పొరను తొలగిస్తే అసలు కథ ,నిఖార్సైన కథే ….భువన చంద్ర అనే ఐడెంటిటీ వాళ్ళ ఏవేవో కామెంట్స్ వచాయిగాని ,ఆ ఐడెంటిటీ ని మారిస్తే ,ఎంత సిసలైన జేవితం ,ఈ కథగా మారిందో గదా …..

 11. BHUVANACHANDRA says:

  ధన్యవాదాలు G.వెంకటకృష్ణ గారూ .మీరన్నది నిజమే ,,,,”’సుమీ”’ ఇంకా నాలాగే చెన్నై లోనే వుంది..”ముసుగు ”కధని చూపిస్తే ఆనందం గా నవ్వింది . ”జీవితం కధ అయితే భలే వుంటుంది భువన్జీ….ఇలాగే !”అన్నది .
  …………………..మనకి ”స్ఫూర్తి ని ”ఇచ్చే వాళ్ళు వున్నారు అనే ఆనందం ….ఆ ఆనందాన్నే ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను అండీ ……………….

 12. మాటలు రావడం లేదు …. సుమిత్ర గారిని అడిగాను అని చెప్పండి …

  • BHUVANACHANDRA says:

   శ్రీ ,గారూ టీ నగర్ వెళ్ళినప్పుడు తప్పక అన్ని కామెంట్లూ చూపిస్తాను .
   మీకు నా ధన్యవాదాలు

 13. కె.కె. రామయ్య says:

  ” ఏ జన్మ బంధాల సుమగంధమో ” అని పాటగా రాసిన భువనచంద్ర గారు, జీవితంలో మీకు తారసిల్లిన అద్భుత వ్యక్తులను పరిచయం చేస్తూ జీవితాన్ని ఎలా జీవించాలో గుర్తు చేస్తున్నదుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  ‘ఫలానా‘ ది కావాలని కోరుకున్నంత కాలం నేను అనుభవించింది క్షోభే. కానీ ఇప్పుడు ‘నాకేదీ వద్దు ‘ అనుకున్నాను కనక హాయిగా వుంది. జీవితం చాలా విశాలమైనది .. ఎన్ని తలుపులు మూసుకుపోయినా ఏదో ఒకటి మళ్ళీ తెరుచుకుంటుంది అన్న తంగచ్చి ‘నల్లమణి’ ‘సుమీ‘; నలుగురి కోసం నిలబడే సుమీ కి అంతా మంచే జరగాలని, భగవంతుడు చల్లగా చూడాలని ప్రార్ధిస్తున్నాను.

  కాలం నాడు కొ.కు. నాయన ( కొడవగంటి కుటుంబరావు ) రచనలో కనిపించిన పాత్ర కూడా ‘సుమీ’ లాగే ఉంటుంది.

  • BHUVANACHANDRA says:

   కె.కె. రామయ్య గారూ , నమస్తే . మీస్పందన ఎంతో ఆనందాన్ని ఇచ్చింది .నా జీవితం లోనూ ”నిరాశ” అలుముకున్నప్పుడు సుమీ ని తలుచుకుని ఉత్సాహం తెచ్చుకున్న సందర్భాలు ఎన్నో వున్నాయి . వయసులో చిన్నదైనా పరిణితి చెందినా మానసామెది…. కధ చదివి ,మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలతో ………………………BC

 14. కె.కె. రామయ్య says:

  కొ.కు. నాయన (కొడవటిగంటి కుటుంబరావు) రాసిన “ఎండమావులు” నవలిక (రచనా కాలం 1962) లోని సుందరం పాత్రను గుర్తుకు తెచ్చింది తంగచ్చి ‘నల్లమణి’ ‘సుమీ‘, భువనచంద్ర గారు.

  మీరీ నవలికను చదివి ఉంటారనుకుంటున్నాను. లేకుంటే వీలుచూసుకుని చదవమని విన్నపం. మద్రాసులో మీకీ పుస్తకాలు దొరకవు కాబోలు. మీరు నవోదయ బుక్ హౌస్ కాచీగూడా వారి ( వెబ్ సైట్ http://www.telugubooks.in/ మొబైల్ : 9000 413 413 ) నుండి తెప్పించుకోవచ్చు.

  కొన్నేళ్ల క్రితం నేను మద్రాసులో ఉండేటప్పుడు రోజూ రాత్రి చంద్రముఖి సినిమాలోని మీ పాట ( నీ పొందు నే కోరి అభిసారికనై నేను వేచాను సుమనోహరా, రా రా సరసకు రారా ) వింటుంటే దెయ్యం ( పేత్తి ) పాట వింటున్నానని నన్ను గేలిచేసేవారు నా తమిళ్ తంబీలు. నాకా పాట, ఆ లిరిక్ అంటే చాలా ఇష్టం.

  • BHUVANACHANDRA says:

   DHANYAVAADAALU కె.కె. రామయ్య GAAROO .పుస్తకాలు తప్పకుండా తెప్పిస్తా …..మీ అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ

 15. రాధ మండువ says:

  మరో వ్యధ. ఈ వ్యధలన్నీ పుస్తకరూపంలో రావాలి. అందరికీ చేరాలి. కనీసం కొంతమందైనా జాగ్రత్తపడాలి. రాయండి మరిన్ని భువనచంద్ర గారూ…

 16. BHUVANACHANDRA says:

  రాధ మండువ గారూ , నమస్తే.. పుస్తకరూపంలి తేవడానికి ప్రయత్నిస్తాను అండీ ……మీ అభిమానానికి హ్రుదయ పూర్వక ధన్యవాదాలు అండీ ..

 17. కె.కె. రామయ్య says:

  ప్రియమైన శ్రీ భువనచంద్ర గారు, రిషీవ్యాలీ రాధ మండువ మేడమ్ గారి నోటి వాక్కు చలువ వల్ల ఈ సీరిస్ లో మీరు రాస్తున్నవన్నీ పుస్తక రూపంలో తప్పకుండా వస్తాయి. మానవతా విలువల్ని, మౌలిఖ విలువల్ని నిత్యజీవితంలో సునాయాసంగా ఆచరిస్తున్న సగటు మనుషుల ఈ కధలు ఎందరికో స్పూర్తిదాయకం అవుతాయి. దీన్నో బాధ్యతగా తీసుకుని రాస్తున్న మిమ్మల్ని మరోసారి అభినందిస్తున్నాను.

 18. BHUVANACHANDRA says:

  కె.కె. రామయ్య గారూ ,మరోమారు మీకు ధన్యవాదాలండీ ….పుస్తకం వస్తే తప్పక ముందే చెబుతాను …మీ ఇద్దరి నోటివాక్కూ ఫలించాలని కోరుకుంటూ నమస్సులతో భువనచంద్ర

 19. BHUVANACHANDRA says:

  కె.కె. రామయ్య గారూ నమస్తే ….మీ ఇద్దరి నోటివాక్కూ ఫలించాలని మనస్పూర్తి గా కోరుకుంటూ నమస్సులతో ………భువనచంద్ర

 20. సుమీని చదివి మనసు చెమరించింది. ప్రేమ విలువను తెలిసినవాడ్ని సమయానికి గుర్తించలేని పొరపాటు విధి రూపంలో ఆమెని వెక్కిరించినా ఆమె ఆత్మస్థైర్యం ముందు అదృష్టం సైతం దిగదుడుపేగా. నిజంగా గెలిచానని విర్రవీగే వారికి ఆమెని చూపించి విజయానికి నిర్వచనం చెప్పాలి. మీ రచనాశైలి అమోఘం. మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా మమ్మల్నీ పాత్రలకు చేరువగా తీసుకుపోతూ.._/\_

 21. BHUVANACHANDRA says:

  RADHIKA గారూ హృదయపూర్వక ధన్యవాదాలు అండీ …. మీ ”’స్పందన ” నాకు ఏంతో ఆనందాన్నీ ఆత్మా విశ్వాసాన్నీ కలిగించింది …..గాడ్ బ్లెస్ యూ ….శివరాత్రి శుభాకాంక్షలతో , మరోసారి ధన్యవాదాల తో ……భువనచంద్ర

 22. Venkata Subba Rao says:

  భువనచంద్ర గారు – మీ కధనం లో వాస్తవికత ధ్వనిస్తోంది .సుమిత్ర పట్ల సమాజం ప్రవర్తించిన తీరు అత్యంతబాధాకరం – అభినందనలండీ

 23. BHUVANACHANDRA says:

  ధన్యవాదాలు VENKATA SUBBA RAOగారూ …..

 24. lakshmi yalamanchili says:

  మనిషి మనిషికీ ఒక్కో వ్యధ ..సుమిత్ర కధ అత్యంత బాధాకరం… మనసు చెమర్చింది

  • BHUVANACHANDRA says:

   ధన్యవాదాలు Lakshmi యలమంచిలి గారూ …నమస్తే నాకు మీ కామెంట్ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది

 25. దేవరకొండ says:

  భువన చంద్ర గారు, ఈ మీ రచనలు మన సాహిత్యంలో ప్రత్యేక స్థానంలో నిలుస్తాయి. వీటిని మీరు ఏ లక్ష్యంతో రాస్తున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, వీటిని సినిమా వాళ్ళు (మీ తోటి కవులు, కథా రచయితలూ హీరోలూ హీరోయిన్లూ నటులూ దర్శకులూ టెక్నీషియన్లు …) చదువుతున్నారా, వారి స్పందన ఎలా ఉందీ తెలియచేయగలరని ఆశిస్తూ…

  • BHUVANACHANDRA says:

   దేవరకొండ గారూ ధన్యవాదాలు సర్ …తోటి రచయితలు (సినిమా వారు )ఎవరూ చదువుతున్నారని అనుకోను .కారణం సమయాభావం కావొచ్చు . బలభద్రపాత్రుని రమణి గారు మాత్రం చదివి స్పందిస్తూ వుంటారు..అయినా ,నడిచే కాళ్ళూ ,రాసే చేతులూ ,చదివే కళ్ళూ స్పందించే మనసూ ఊరికే వుండవు కదా ! మరోమారు నమస్సులతో ,ధన్యవాదాలతో

మీ మాటలు

*