మంత్ర పుప్పొడి

 
-కె. గీత
~
ఒక తొలి చిరునవ్వు లేని
చివరి వీడ్కోలు
నన్ను నిద్దట్లోనూ
కుదుపుతూంది
కవికి మరణం ఉందేమో
కవిత్వానికి మరణం లేదు కదూ!
భూమిపై సజీవంగా ఉండే
అక్షరానికి అంతం లేదు కదూ!!
ఆకాశం నించి
మంచు పుష్పాలు రాలినట్లు
శరీరం జీవితం నించి
వీడిపోవచ్చు-
జ్ఞాపకాలు పునర్జన్మలై
మిరుమిట్ల మంచు పర్వతాలై
పెరుగుతూనే ఉంటాయి
సముద్రం నించి
కొన్ని అలలు సగమే లేచి పడిపోవచ్చు-
అనంతాకాశం నించి
ప్రాణాధార చినుకులై
మరోచోట కురుస్తూనే ఉంటాయి
అయినా
రచయిత కాల గర్భంలో
కుంచించుకు పోతున్న
నీటి బొట్టు
చివరి ఊపిరి చిత్రం
నన్ను  మెలకువలోనూ
వెంటాడుతూంది
జీవితం వెనుక
జ్ఞాపికల్ని అమాంతం మింగేస్తున్న
కృష్ణ బిలమేదో
నన్ను అపస్మారకంలోనూ
జలదరింపజేస్తూంది
మరణం మూసి వేస్తూన్న
తలుపుల్ని ఎవరైనా
ఎప్పుడైనా తడితే బావుణ్ణు
తెగిపోతున్న ఆలాపనా
తంత్రుల్ని ఎవరైనా
అంది పుచ్చుకుంటే బావుణ్ణు
అక్షరానికి ఆధారమైన
అనుభవైక వేదననీ
అనుభూతుల వెల్లువని
అనుక్షణం అక్షరీకరించే
కవి హృదయాన్ని
ఇక సజీవీకరించవలసిందే-
అందని చోటునా జల్లి
చెరిగిపోతున్న
కాలాక్షరాల్ని
సాక్షాత్కరింపజేసే
మంత్ర పుప్పొడేదో
కనిపెట్టాల్సిందే-
—–
(అరుణ్ సాగర్ కి-)

మీ మాటలు

*