తెలుగులో రాయడమే గొప్ప తృప్తి!

 

 

– జగద్ధాత్రి

~

 

తమిళం మాతృ భాష , మలయాళం విద్యాభ్యాసం చేసిన భాష , తెలుగు నేర్చుకుని పట్టు సాధించిన భాష . అందుకే నాకు ముగ్గురమ్మలు అని చెప్తారు స్వామి గారు. తెలుగు భామనే కాక తెలుగు భాషను కూడా స్వంతం చేసుకుని , అందులో మంచి రచనలు చేసి తనకంటూ ఒక ముద్ర వేసుకోగలిగిన వారు స్వామి గారు. అలాగే అనువాదకునిగా తెలుగు భాషలో సాహిత్య అకాడెమీ పురస్కారం సాధించడం  ఆనందదాయకం ఆశ్చర్యకరం కూడా. ఈ సందర్భంలో  రండి ఆయన మనసు విప్పి చెప్పే నాలుగు మాటలు విందాం. నిరంతర కృషీవలుడు , నిగర్వి ఎన్ని సాధించినా , ఎన్ని అవార్డులు వచ్చినా నిర్మమంగా తన పని చేసుకుంటూ పోయే స్వామి గారు మనందరికీ ఆదర్శంగా నిలుస్తారనడం లో అతిశయోక్తి లేదు. 2015 కు గాను “సూఫీ చెప్పిన కథ “ రామన్ ఉన్ని నవల తెలుగు అనువాదానికి సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారాన్ని స్వామి గారికి ప్రకటించింది. ఇది మన తెలుగు వారికి అందరికీ గర్వ కారణం. నేనెప్పటికీ తెలుగు రచయితగానే ఉంటాను అని చెప్పే స్వామి గారి మనో భావాలు మనం కొన్ని ఇక్కడ తెలుసుకుందాం.

1 . కధకుడిగా మీ ప్రారంభాలు, అనువాదకుడిగా ప్రారంభాలు ఒకే సారి జరిగాయా ?

       లేదు. ఒకే సారి జరగలేదు. నా మాతృభాష కాని తెలుగులో సాహిత్య రచన చేయాలని నేనెప్పుడూ అనుకోలేదు.   కధకుడిగా ఆరంగేట్రం చేసిన పది సంవత్సరాల తరువాతనే అనువాదకుడి పాత్ర ధరించాను. నిజం చెప్పాలంటే ఒక అనువాదాలు చేయటం మొదట్లో నాకు ఇష్టం లేని పని గానే వుండేది. విశాఖలో స్దిరపడ్డాక తెలుగు నేర్చుకుంటే నా మిత్రులతో,  సహోద్యోగులతో కలసి మెలసి తిరగటం సుళువుగా వుంటుందనుకొని  తెలుగు నేర్చుకున్నాను. భాషా పరిజ్ఞానంతో తెలుగు సాహిత్యం చదివి ఆనందించేవాడ్ని. దీనికి ఒక కారణం ఉంది. నేను పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టీ సమాజాన్ని బట్టి సాహిత్యం చదవటం బాగా అలవాటైంది. విశాఖలో ఆ రోజుల్లో మలయాళ పుస్తకాలు దొరికేవి కావు . నాకు ఆంగ్ల సాహిత్యం చదివే అలవాటు అప్పుడు –ఇప్పుడు కూడా లేదు –అందువల్ల తెలుగు సాహిత్యమే అందుబాటులో వుండేది. 1980 తరువాతనే తెలుగు బాగా చదవటం నేర్చుకున్నాను. అయినా కధలు వ్రాయాలని కానీ సాహిత్య రచన చేయాలని కానీ అనిపించలేదు.1988 ప్రారంభంలో ఒకానొక సందర్భమున  పోటీలో బహుమతి పొందిన ఒక కధ గురించి మా సహోద్యోగుల మధ్య జరిగిన వేడి వేడి చర్చ , తద్ఫలితంగా వాళ్ళు  విసిరిన సవాలు వల్ల తెలుగులో మొదటి కధ వ్రాసాను –నన్ను నా భాషా పరిజ్ఞానాన్ని రుజువు చేయటం కోసం –అదే నా మొదటి తెలుగు కధ –జవాబులేని ప్రశ్న –ఆ కధకి అలనాటి ఆంధ్రజ్యోతి వార పత్రిక నిర్వహించిన కధల పోటీలో బహుమతి వచ్చింది [1988 ]. ఆ హుషారులో ఎన్నో కధలు వ్రాసాను . అప్పుడే కొందరు పత్రికా సంపాదకులు మలయాళ కధలు తెలుగులోకి అనువాదం చేయమని నన్ను అడగటం జరిగింది. కాని ఒక సృజనాత్మక రచయితగా కొనసాగాలనుకునే నేను ఏ అనువాదమూ చేయలేదు. ఆ తరువాత 2000 ప్రాంతంలో కే. అయ్యప్పపనికర్ సంకలనం చేసిన మలయాళ జానపద గేయాలను తెలుగులోకి అనువదించమని   సాహిత్య అకాడెమి కోరటం వల్ల తప్పనిసరిగా ఒప్పుకున్నాను. ఆ పని పూర్తి అవగానే ప్రముఖ మలయాళ కవి కే. సచ్చిదానందన్ తన 96 కవితలను తెలుగులోకి అనువాదం చేయమని కోరారు [శరీరం ఒక నగరం]సమయాభావం వల్ల కొంత ఆలస్యం చేసినా మొత్తానికి అనువాదం పూర్తి చేసాను. నా అనువాదాలు బాగున్నాయనే పేరు రావటం వల్ల అనువాదాలు చేయమనే ఒత్తిడి పెరిగింది.మరో రెండేళ్ళు తరువాత పదవి విరమణ చేసాను కనుక ,సమయం అందుబాటులో వచ్చి,  వరసగా అనువాదాలు చేసి తెలుగులోకి 17 పుస్తకాలనూ మలయాళంలోకి 13 పుస్తకాలనూ అనువాదం చేసాను; ఇంకా చేస్తున్నాను.

swami 1

2 –    మలయాళ భాషలో మీరు రచనలు చేసారా ?మీ చిన్నతనం లో అటువంటి విశేషాలు వివరించండి

నేను విశాఖ రాక ముందు మలయాళంలో ఎన్నో రచనలు చేసాను. చిన్నప్పటినుంచి అంటే ఎనిమిదో తరగతి చదివే రోజుల్లోనుంచి మలయాళం లో కవిత్వం వ్రాసేవాడ్ని. కాని అచ్చైన మొదటి మలయాళ రచన నేను వ్రాసిన ఏకాంక నాటిక. ఈ నాటిక నేను పదో తరగతి చదివేటప్పుడు [1960] వ్రాసాను. ప్రముఖ మలయాళ వార పత్రిక వారు విద్యార్ధులకోసం [కాలేజీ స్కూల్ పిల్లలకోసం ] నిర్వహించిన ఏకాంక నాటక రచన పోటీలో మొదటి బహుమతి పొందింది ఈ నాటిక. 1960 నుంచి 1970 వరకు సుమారు 100 కవితలు వ్రాసి వుంటాను ,మలయాళంలో. కవితలు మాతృభూమి మలయాళ మనోరమ మొదలగు పత్రికల్లో వెలుబడ్డాయి. జాతీయ చంధసులో వ్రాయబడిన భావ కవితలే వాట్లో ఎక్కువ.

 1. మీరు ఎరిగిన, జీవించిన, మలయాళ సమాజంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వారి గురించి చెబుతారా ?

అలనాడు నేను జీవించిన మలయాళ సమాజం మొత్తం నన్ను ప్రభావితం చేసిందనే నేను అనుకుంటున్నాను. గుండెలో కవిత్వపు బీజం దాగివుంటే మొలకెత్తి చిగురించి విస్తరించడానికి అనువైన సామాజిక వాతావరణం సమాజంలో వుండేది. ప్రతి పల్లెలోని గ్రంధాలయం, అక్కడ చేరేవాళ్ళ చర్చలు, ఏదో ఒకటి వ్రాస్తే దాన్ని సరిదిద్ది ప్రోత్సాహించే పెద్దలు ,రచయితకి ఇచ్చే గౌరవం వగైరాలు చెప్పుకోదగ్గవి. అంతే కాదు మలయాళ భాషా భోదకులు [స్కూల్ లోనూ కాలేజీలో కూడా ] భాషా సాహిత్యాల పట్ల ఆసక్తి పెరిగేలా పాఠాలు చెప్పేవారు . ఇక రచనల విషయానికి వస్తే నేను మౌలికంగా కవిని. కవి హృదయం కలిగినవాడని నేను భావిస్తున్నాను. మలయాళం లో కవిత్వమే వ్రాసే వాడ్ని.ఆధునిక మలయాళ సాహిత్యం  మహాకవి పి. కుంజీరామన్ నాయర్ నన్ను కొంతవరకు ప్రభావితం చేసాడనే చెప్పాలి , కవిత్వ రచనలో-

4 . తెలుగులో కధలు వ్రాసినప్పుడు, అనువాదకులుగా మీకొక  భవిష్యత్తు ఊహించారా ?

  కధకుడిగా కాని అనువాదకుడిగా కాని ఏదో ఒకటి సాధిద్దామనుకొని రచన కాని అనువాదం కాని చేయలేదు. ఎవరూ ఎవరినీ రచన చేయమని బలవంతం చేయరు ఇష్టమైతే చేస్తారు అంతే. Just for the pleasure చేస్తారు. అలాంటప్పుడు ఆశలు పెట్టుకోవటం అనవసరం.

SufiBookFrontCover

5 . మలయాళం లోని సూఫీ పరంజ కధ అనువాదానికి ఎంచుకున్నారు –ఈ నవల వివరాలు చెప్పండి

1993 లో వెలుబడిన సూఫీ చెప్పిన కధ అనే నవల మలయాళ సాహిత్యంలో గొప్ప సంచలనం రేపింది. వస్తు పరంగానూ భాషా పరంగానూ కొత్త పోకడలతో కూడిన ఈ నవల పాఠకుల హృదయాన్ని ఆకట్టుకుంది. 2010 వరకు పది ముద్రణలు పొందింది. అంతే కాదు ఆంగ్ల, ఫ్రెంచ్,  హింది తమిళ్ కన్నడ భాషల్లోకి అనువదింపబడి పాఠకుల మన్ననలు కూడా పొందింది. మానవ జాతికి ఉమ్మిడి పైతృకం ఉందనేది చక్కగా గుర్తు చేస్తుంది ఈ నవల. గతంలో రెండు సంస్కృతుల మధ్య నిలిచిన సమన్వయాన్ని కూడా గుర్తు చేస్తుంది గతం సలిపే గాయాల పుట్ట కాదు ఇక్కడ. దయార్ద్రమైన స్నేహ శిలలు –సంఘర్షణా భరితమైన ఈ కాలం లో అది ఒక ఔషదంగా పరిణమిస్తుంది. గుడి అయినా మసీదు అయినా మానవుని అధ్యాత్మిక అవసరాలను తీర్చే మార్గమేననే స్పృహ కలుగుతుంది. విగ్రహారాధనను గౌరవించని వారు కూడా విగ్రహారాధన పట్ల వున్న వైమనస్యపు పట్టు సడలిస్తున్నారు. తెలియని ఒక సత్యం గురించిన ఆలోచన మనసులో ఒక వెలుగు రేఖగా కదులుతుంది కత్తులు నూరి గొడవ పడటానికి సిద్ధంగా నిలిచిన రెండు మతాల మధ్య అతి ప్రాచీనమైన సహవర్తిత్వం ఉండేదని సూఫీ చెప్పినప్పుడు ఏవేవో అడ్డుగోడలు కూలిపోతున్నాయి . ఈ సూక్ష్మ స్వరాన్ని మనకు వినబడే విధంగా వినిపించ గలిగింది ఈ నవల. ఈ నవలను అనువాదం చేయాలనుకోవడానికి ఇదొక్క కారణమైతే, ఈ నవలలో కనబడే అతి సుందరమైన కావ్యాత్మకమైన భాష. ఈ పుస్తకాన్ని నేను అనువాదం చేసి ప్రచురణ కోసం ఎదురు చూస్తున్నప్పుడు అనుకోకుండా కల్పనా రెంటాల గారు ఈ పుస్తకాన్ని పంపమని,  చదివి వెంటనే తమ సారంగా బుక్స్ వారే ఈ పుస్తకాన్ని ప్రచురిస్తామని మాట ఇచ్చారు. అంతే కాకుండా ఈ పుస్తకం ఇంత వేగం వెలుగు చూసేలా చేయడం, దానికి ఇలా అవార్డ్ రావడం రెండు నాకు చాలా ఆనందం కలిగించాయి. ఇందుకు కల్పన గారికి నా కృతజ్ఞతలు. తెలుగు లో కూడా ఈ పుస్తకం మంచి పేరు తీసుకొచ్చింది.

6 మలయాళం నుంచి తెలుగులోకి, తెలుగునుంచి మలయాళం లోకి ఎన్ని రచనలు వెలుబడ్డాయి ఏ ప్రముఖ రచయితలను అనువదించారు ?

మలయాళం నుంచి తెలుగులోకి 17 పుస్తకాలనూ తెలుగునుంచి మలయాళంలోకి 13 పుస్తకాలనూ అనువదించాను. నేను అనువదించిన రచయితలు ,మలయాళం నుంచి తెలుగులోకి  మహాకవి అక్కితం నంబూద్రి “ఇరవయ్యవ శతాబ్దం” [ ఒక దీర్ఘ కవిత ], ఆధునిక మలయాళ కవి సచ్చిదానందన్ [రెండు కవితా సంపుటాలు ], జ్ఞానపీఠ అవార్డ్ గ్రహీత ,కవి ,ఓ.ఎన్.వి . కురుప్ [ఒక కవితా సంపుటం ],  నారాయణన్ [ ఒక నవల .ఒక కధా సంపుటి ], సేతు [ మూడు నవలలు ,20 కధలు ], శ్రీనారాయణ గురు,  సి . రాధాకృష్ణన్ [నవల ],  జెక్కేరియా [97 కధలు ],  తకలి, బాషీర్, కారుర్, హరికుమార్, సంతోష్ ఎచ్చికాణం, వైశాఖన్, కె .ఆర్ . మీర, పొంకున్నం వర్కి మొదలైనవారి కధలు

తెలుగు నుంచి మలయాళం లోకి, ఇక తెలుగు నించి  గోపి ,శివారెడ్డి ,కేతు విశ్వనాధ రెడ్డి ,సలీం ,జయంతి పాపారావు గురజాడ వారి కధలు , దివాకర్ల వేంకటావధాని గారి ఆంధ్ర వాగ్మయ చరిత్ర ,శ్రీ శ్రీ మోనోగ్రాఫ్ ,చక్రపాణి మోనోగ్రాఫ్  చాగంటి సోమయాజులు వగైరా.

స్వామి గారితో జగద్ధాత్రి

స్వామి గారితో జగద్ధాత్రి

7 .కధకుడిగా ఒక కధ మీరు వ్రాసినప్పుడా మంచి కధను అనువాదం చేసినప్పుడా మీకు ఎక్కువ సంతృఫ్తీ కలిగింది ?

కచ్చితంగా మంచి కధ వ్రాసినప్పుడే నాకు సంతృప్తి కలుగుతుంది.

8 తెలుగు సాహిత్య అనువాద రంగపు అభివృద్ధికి మనం ఎటువంటి చర్యలు చేపెట్టాలని మీరు భావిస్తున్నారు ?

 పూర్వంకన్నా ఇప్పుడు తెలుగునుంచి ఇతర భాషల్లోకి ఇతర భాషల్లోనుంచి తెలుగులోకి చేసే అనువాదాల సంఖ్య పెరిగింది . ఎప్పుడైనా ఎన్ని అనువాదాలు చేసివున్నా ప్రతి సారి అనువాదం ఒక సవాలే, మూల లక్ష్య భాషల సంస్కృతుల పట్ల మంచి పట్టు లేనివాడు మంచి అనువాదం చేయలేరు. తెలుగు  మాతృభాష గలవాడు హింది నుంచి తెలుగులోకి అనువాదం చేసినప్పుడు మూల భాషా సమాజం గురించి సరైన అవగాహన లేకపోవటం వల్ల అనువాదం మూల కృతికి న్యాయం చేయకపోవచ్చు. అందువల్ల అనువాదాన్ని ఒక సాధనగా భావించి మూల లక్ష్య భాషల సమాజాల గురించీ వాళ్ళ సంస్కృతుల గురించి వాట్లో చోటు చేసుకునే పరిణామాల గురించి నిరంతరం అధ్యయనం చేస్తూ వుండాలి-దానికి తగిన వాతావరణం వుండాలి, లేకపోతే కల్పించాలి.

 1.  మలయాళ సాహిత్య రంగం, పాఠకుల అభిరుచి ఇటువంటి రంగాల్లో తెలుగు సంస్కృతిక సమాజం అలవర్చుకోవలసిన ముఖ్యమైనవేమన్నా గమనించారా ?

గమనించాను. మలయాళీలకు సాహిత్యం పుస్తక పఠనం జీవితంనుంచి విడదీయలేని ఒక భాగం. చిన్నప్పటినుంచి పిల్లలకు సాహిత్య పుస్తకాల పఠనం అలవాటు చేస్తారు.  మలయాళ రచనలు బాగా చదివించేవిగా  ఎక్కువగా ఆర్ద్రంగా వుంటాయి. 300 –400 వందల పేజీల నవలలు కూర్చుని ఏకదాటిగా చదివేస్తారు. అందుకే అలాంటి నవలలు లక్షల  కాపీలు అమ్మకమవుతున్నాయేమో !

10 . అనువాద రంగంలో ప్రస్తుతం మీరు చేస్తున్న, అకాడెమి అప్పగించిన కర్తవ్యాలు గురించి చెప్పండి

   2013 లో అకాడెమి అవార్డు పొందిన కే . సచ్చిదానందన్ గారి మలయాళ కవితా సంపుటి MARANNU VECHA VASTHUKKAL AND OTHER POEMS  అనే పుస్తకం తెలుగులోకి అనువాదం చేస్తున్నాను . అంతే కాక ఒక మలయాళం తెలుగు నిఘంటువు  కూడా తయారు చేస్తున్నాను

 1.  కధకుడిగా అనువాదకుడిగా మీ సాహిత్య జీవితం మీకు సంతృప్తి నిచ్చిందా ?

 కొంత వరకు…పూర్తిగా సంతృప్తి పొందినవాడు తరువాత పని చేయడు.  నేను ప్రస్తుతానికి సంతృప్తి పొందినా ఇంకా ఈ రంగంలో కృషి చేయాలననుకుంటున్నాను కనుక మానసికంగా పూర్తి సంతృప్తి పొందానని చెప్పలేను . ఇంత క్రితం పలు మార్లు చెప్పినట్లు నాకు ప్రత్యేకమైన టార్గెట్ లేదు సాహిత్యంలో. ఒక టార్గెటు అంటూ వుంటే అది అందగానే సంతృప్తి చెందుతారు. ఆ తరువాత కొందరు నిష్క్రమిస్తారు కూడా. నాది నిరంతర సాధన.

 1. సమాజం లో సాహిత్యం పాత్ర ఎంతవరకు ఉందని మీరు అభిప్రాయపడుతున్నారు ?

 సాహిత్యం తాలూకు పాత్ర ఎంతో ఉంది –ముఖ్యంగా అనువాద సాహిత్య పాత్ర –ఎక్కువ భాషలు నేర్చుకోవటం వల్ల ఇతర భాషా సాహిత్యం చదవటం వల్ల,భిన్న సంస్కృతులు తెలుసుకోవటం వల్ల మనిషి మనోభావాలు వాడు ఎక్కడున్నా ఒకటేనని అర్ధం చేసుకోగలుగుతారు. మనిషి తన లోపల వున్న మనిషిని డిస్కవర్ చేస్తాడు. భాషా ,వేషం ఆహారం కళా రూపాలు బ్రతుకుతున్న వాతావరణాన్ని బట్టి వచ్చేవేనని అవి కేవలం బాహ్యమేనని తెలుసుకోగలుగుతాడు. అలా తెలుసుకున్నప్పుడు ప్రాంతాల మధ్య మనుషుల మధ్య సఖ్యత పెరిగి మనుషులందరూ కలసి మెలసి బ్రతికే అవకాశం ఉంది.

peepal-leaves-2013

 

 

మీ మాటలు

 1. BUCHI REDDY GANGULA says:

  స్వామి గారు

  SALUTES…..SIR..

  మీ జవాబు లలో నిండు తనం — భాష (ల ) బి మానం —
  చాల చక్కగా — గొప్పగా చెప్పారు సర్
  ——————————————
  బుచ్చి రెడ్డి గంగుల

 2. మలయాళీలకు సాహిత్యం పుస్తక పఠనం జీవితంనుంచి విడదీయలేని ఒక భాగం. చిన్నప్పటినుంచి పిల్లలకు సాహిత్య పుస్తకాల పఠనం అలవాటు చేస్తారు. మలయాళ రచనలు బాగా చదివించేవిగా ఎక్కువగా ఆర్ద్రంగా వుంటాయి. 300 –400 వందల పేజీల నవలలు కూర్చుని ఏకదాటిగా చదివేస్తారు.

  ఇలాంటి వాతావరణం తెలుగులోనూ ఉండాలి. పాఠశాల స్థాయినుంచే పాఠ్యాంశాలతో పాటు, ఇతర సాహిత్య పుస్తకాలను చదివే అలావాటు ఏర్పడాలి పిల్లలకు.

 3. Aranya Krishna says:

  చాలా సంతోషంగా అనిపించిందీ ఇంటర్వ్యూ చదివాక. ఇరవై ఏళ్ళ క్రితం నేను విశాఖలో గడిపిన రోజులు గుర్తుకుతెచ్చారు జగద్ధాత్రి గారు. నేను అప్పట్లో విశాఖ సాహితీ సమావేశాలకు వెళ్ళేవాణ్ని. రామతీర్థ, నౌదూరి మూర్తి, రాంభట్ల నృశింహశర్మ, ఆత్రేయ, ఆదూరి సత్యవతీదేవి, నరసింహమూర్తి గార్లు వచ్చేవాళ్ళు. ఎల్.ఆర్.స్వామీ గారు చాలా సహృదయులు. అప్పుడే ఆయన ఒక కథా సంకలనం వేసారు. మంచి నేటివిటీతో వున్నాయవి. రామతీర్థ, నౌదూరి మూర్తి, స్వామీ గారు..ముగ్గురూ అనువాదకళలో మంచి ఉద్దండులు. స్వామీ గారు నా కవితలు ఒక రెండు మళయాళంలోకి అనువాదం చేసారు. ఇన్నాళ్ళ తరువాత ఆయన చాయాచిత్రం, పలుకులు చూసినందుకు సంతోషం వేసింది. ఆయనకు నేను గుర్తున్నానో లేనో! స్వామీ గారూ నమస్తే!

 4. వృద్ధుల కల్యాణ రామారావు says:

  ఇంటర్వ్యూ చేయడం ఓ కళ. సమాధానాలు ప్రశ్నల బట్టే ఉంటాయి. సమాధానాలు బట్టే అవతలమనిషి అర్ధం అవుతాడు.స్వామిగారిని మా విశాఖలో చాలా మందికి బాగా తెలుసు. మిగతా వాళ్లకు కూడా చక్కగా తెలిసేలా ఇంటర్వ్యూ చేసిన జగద్ధాత్రి గారికి అభినందనలు. ప్రశ్నలకు జవాబులు చాలా సూటిగాను, వివరణాత్మకంగాను ఉన్నాయి. స్వామి గారికి మరో మారు అభినందనలు.

 5. చందు తులసి says:

  స్వామి గారు చెప్పినట్లు….మనదగ్గరా….పిల్లలకు పుస్తకాలు చదివించే అలవాటు వస్తే బాగుంటుంది.
  చాలా విషయాలు తెలిశాయి జగద్ధాత్రి గారూ.
  ఇద్దరికీ అభినందనలు

 6. ‘….మనిషి మనోభావాలు వాడు ఎక్కడున్నా ఒకటేనని అర్ధం చేసుకోగలుగుతారు. మనిషి తన లోపల వున్న మనిషిని డిస్కవర్ చేస్తాడు. భాషా,వేషం, ఆహారం, కళా రూపాలు బ్రతుకుతున్న వాతావరణాన్ని బట్టి వచ్చేవేనని, అవి కేవలం బాహ్యమేనని తెలుసుకోగలుగుతాడు. అలా తెలుసుకున్నప్పుడు ప్రాంతాల మధ్య మనుషుల మధ్య సఖ్యత పెరిగి మనుషులందరూ కలసి మెలసి బ్రతికే అవకాశం ఉంది’ గొప్ప ఆశావహంగా ఇంటర్వ్యూని ముగించారు! స్వామి గారి లోతైన అవగాహనని తెలియజేసే ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది జగధ్ధాత్రి గారు.

 7. శ్రీనివాసుడు says:

  ఆర్యా,
  ‘‘తెలుగు మాతృభాష గలవాడు హింది నుంచి తెలుగులోకి అనువాదం చేసినప్పుడు మూల భాషా సమాజం గురించి సరైన అవగాహన లేకపోవటం వల్ల అనువాదం మూల కృతికి న్యాయం చేయకపోవచ్చు. అందువల్ల అనువాదాన్ని ఒక సాధనగా భావించి మూల లక్ష్య భాషల సమాజాల గురించీ వాళ్ళ సంస్కృతుల గురించి వాట్లో చోటు చేసుకునే పరిణామాల గురించి నిరంతరం అధ్యయనం చేస్తూ వుండాలి-దానికి తగిన వాతావరణం వుండాలి, లేకపోతే కల్పించాలి’’. – అనువాదానికి వుండవవలసిన మూలసూత్రాన్ని బాగా చెప్పేరు.

మీ మాటలు

*