ఉత్తరం: రెండు మనసుల సంగమం!

     

  -గొరుసు

~

(ఉత్తరాలు – చేత్తో రాసుకున్న ఉత్తరాలు- ఎప్పటికీ చెరిగిపోవు జ్ఞాపకాల్లోంచి! అవి జ్ఞాపికలు గతానికి, నిన్నటి విలువలకీ, తపనలకీ, బంధాలకీ! అవి ప్రముఖులు రాశారా, ఆత్మీయ మిత్రులు రాశారా  వ్యక్తిగతంగా రాశారా అందరి  కోసం రాశారా అన్నది కాసేపు పక్కన పెట్టండి. ఇదిగో ఇదీ  జీవితం ఇవీ  ఆలోచనలు ఇదీ నా  లోపలి అలజడి అనే ప్రతి  ఉత్తరమూ  ఇక్కడ ప్రస్తావించ దగిందే…ఆత్మీయంగా తలచుకోవాల్సిందే..అలాంటి ఉత్తరాలకు  ఆహ్వానం. ఉత్తరం స్కాన్ ఫోటో, యూనికోడ్ లో తిరిగి టైప్ చేసిన ప్రతీ రెండూ పంపండి. ప్రముఖ కథకుడు  గొరుసు జగదీశ్వర రెడ్డి  ఈ  వారం  ఈ లేఖాయణానికి శ్రీకారం చుడుతున్నారు. వచ్చే వారం…?!)

~

                                 Gorusu     ‘నీ చూపులు తుమ్మెద బారులు కట్టి

నీ కోర్కెలు గజ్జెలవలె ఘలంఘలించి

వీథి  వీథి నంతా మేల్కొలుపుతున్నాయి

వీథి వీథి నంతా కలియ చూస్తున్నాయి

అడుగో – పోస్ట్ మాన్!’

పై మాటలు తిలక్ ఎవరికోసం రాశారో కాని…అన్వయించుకుంటే నా గురించేనేమో అనిపిస్తుంది. అచ్చంగా అలాగే పోస్ట్ మాన్ కోసం నా చూపులు తుమ్మెద బారులయ్యేవి. టెలిఫోన్ తో పాటు, అంతర్జాలం నా జీవితంలోకి చొచ్చుకు రానంత కాలం అదొక అద్భుత నిరీక్షణ పర్వం. ఉత్తరాల్లో మనసు విప్పుకున్న మధుర గడియలు ఎన్నెన్నో.

ఉత్తరం: రెండు మనసుల సంగమ కూడలి; లింగ భేధమెరుగని పరిష్వంగ కేళీ వినోదం. రెండు వందల పై చిలుకు మిత్రులు – ఎవరి ఉత్తర బాణం ఏ దిశ నుండి నా గుండెను తాకబోతోందనేది ఓ ఉత్కంఠ . చదివిన అక్షరాలనే మళ్ళీ మళ్ళీ చదివి భావోద్రేకంతో చెంపలు చెలమలయ్యేవి.

మనిషికి తిక్క ఎప్పుడైనా పుడుతుంది కదా – అలా పుట్టినప్పుడు గాలి పువ్వులై శూన్యంలోకి ఎగిరిపోగా అటకెక్కినవి  దాదాపు వెయ్యి లేఖలు. వాటిలోంచి రెండు ఉత్తరాలు ఏరడమంటే మెదడు మోకాల్లోకి జారింది. చివరకు జ్యోతిష్యం చెప్పే చిలకలోకి పరకాయ ప్రవేశం చేసి ముక్కుతో లాగక తప్పింది కాదు.

సరిగ్గా 40 ఏళ్ల క్రితం, నూనూగు మీసాల నా  యౌవ్వన ప్రాయంలో పరిచయమైన కలం మిత్రుడు ప్రదీప్. ఆయన రాసే ఉత్తరాలు అర్ధం చేసుకునే స్థాయి నాకప్పటికి లేకపోయినా మేకపోతు గాంభీర్యంతో సాహిత్యాన్ని వడబోసినట్టు జవాబులు రాసేవాన్ని. చివరికి నాకేమీ తెలియదని నిర్ధారించుకుని…అలా…అలా…అలా…పొగమంచులా అదృశ్యమయ్యాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో మరి!

 

__

pradeep -3

secunderabad

27th Dec, ‘76

23.20hrs

వెల్! జగదీశ్వర్ గారూ,

మీ ఉత్తరం చూసి నవ్వు వచ్చింది. నా చేతి రాత బావుందేమో కాని… నేను మాత్రం మీరూహిస్తున్నట్లు ‘ఎంతో అందంగా’ లేను. అయినా రాత ఎప్పుడూ మనిషి స్వభావాన్ని తెలియజేస్తుంది గానీ, భౌతిక రూపాన్ని కాదు. మరో సంగతి, స్త్రీలకూ అందం ఉంటే అందమేనేమో కాని పురుషులకు శక్తిసామర్ధ్యాలు, అన్న మాట నిలుపుకోవటం, నీతి నిజాయితీ లనే ఆత్మసౌందర్యమే అందం. స్త్రీలకూ ఆత్మ సౌందర్యంతో పాటు సౌకుమార్యమే అసలైన అందం. ఇక తెలుపు నలుపు, కనుముక్కు తీరు ఇవన్నీ ‘అందానికి ప్రకృతి దిద్దిన తుదిమెరుగులు’. ఏవంటారు?

ఇంకా… మీ ఉత్తరంలో “నేను హృదయస్పందనకే ప్రాధాన్యతనిస్తాను కాని బాహ్య సౌందర్యానికి కాదు” అని చదివి కాస్త ఆలోచనలో పడ్డాను. ’స్పందన’ అనే చోట సౌందర్యం ఉండాలేమో?

అసలు స్పందన అంటే ఏమిటి? ”తాము ఆరాధించే గుణగణాలు మొదటిసారిగా, తమకు తెలియకుండానే ఎదుటి వారిలో (అంటే స్త్రీలు పురుషుల్లో, పురుషులు స్త్రీల్లో) దర్శించినపుడు ‘ఉవ్వెత్తున లేచి పడే కెరటం’ లాంటి ఉద్వేగపూరితమైన భావానుభావమే స్పందన’. అద్భుతమూ, అనిర్వచనీయమూ అయినా ఈ అనుభవం మనస్సుపై ముద్రించే ఆనవాలు శాశ్వతమై తలచుకొన్నప్పుడల్లా మనసును పరవశింపచేస్తుంది.

ఓ మూడు నాలుగు సంవత్సరాల క్రితం చదివిన, ‘బసవరాజు అప్పారావు’ గారి గేయం జ్ఞాపకం ఉన్నంత వరకు (చాలా వరకు కరక్టే) రాస్తున్నాను చూడండి.

దేహమున  బుల్కలివి  సందేహమేల

భారమైనది హృదయము బ్రతుకుపైన

మనుట కొరకయి పుట్టిన మనుజు నెడద

తీయతీయని తలపులు ప్రేయసి గద

ఎవ్వరితెవు దేవీ?!! నన్నీ లీల విలపింప

జేతువు సుంతైన కరుణ లేక???…

చివురుటాకుల దిన్న కూజిత రవమ్మే

మధుర మధుభాషిణీ కంట రవమ్ము

ఎప్పుడో విన్న గుర్తుగా నిపుడు విందు

నీదు నడకల కవ్వింపు నాట్య బర్హిపద

నేర్పరులరయ ఎక్కడో కన్నగుర్తుగా

నిపుడు గందు! ఏల దేవీ నన్నీ లీల

విలపింపజేతువు సుంతైన కరుణ లేక

తెలుపుమీ ‘………..’ ఏలనో!!!

ఇలాంటి గేయాలు చదివినప్పుడు హృదయాంతరాల్లో చెలరేగే భావానుభూతిని ఏమని వర్ణించగలం. కళ్ళల్లో చిలికే రెండు కన్నీటి చుక్కలు తప్ప ఈ అద్భుతమైన భావనను పైకి చెప్పటానికి ఏభాషలోనూ తగిన పదజాలం లేదేమో! నిర్మలమైన స్నేహం, మమతామమకారం, ఆత్మీయతానురాగాలు…ఓహ్!…వీటిని పొందగల్గటం ఎంత అదృష్టం. కాని ఒక్కోసారి అనిపిస్తూంటుంది, భరించరాని ఒంటరితనంలో మగ్గిపోతున్న నేను, నేను కోరే ఈ స్నేహ మాధుర్యం గూర్చి ఎంతో గొప్పగా ఊహించుకుంటూ ఈ స్వార్ధపూరిత ప్రపంచంలో నిజంగా అలాంటి మమతానురాగాలు ఉన్నాయనుకుని మోసపోతున్నానా? నో! నెవ్వర్!! అలా జరగటానికి వీల్లేదు. …దైవమే నిజమైతే ఈ నిర్మల స్నేహానుబంధాలుకూడా నిజమే. కాని…భగవద్దర్శనం ఎంత దుర్లభమో, ఈ మధురమూ, మహత్తరమూ అయిన నిర్మల స్నేహ సంబంధాలు ఆప్యాయతానురాగాలు పొందటం కూడా అంత కష్టతరమే.

మననుండి ఏదో అందకుండా చేసి భగవంతుడు మనని ఏడిపిస్తాడు అనిపిస్తుంది. మన జ్ఞానం, విజ్ఞానం కూడా భగవంతుడి అనుమతి మేరకు పరిమితమై ఉంటాయేమో! మనుషులు వట్టి మూర్ఖులు తెలుస్తూనే భ్రమలో పడతారు.

ప్చ్! ఇలా మనసు విప్పి చెప్పుకుంటే ఎన్ని పేజీలైనా రాయొచ్చు…గాని…ఆ…మీరు లెటర్ పాడ్ పంపమని రాశారు కదూ, తప్పకుండా పంపుతాను. కాని బహుశా వారంలోగా టర్మ్ హాలిడేస్ మొదలైతాయేమో!? రిజిష్టర్ పోస్టులో పంపితే, ఏ అడ్రసుకు పంపాలో రాయండి.

త్వరలో మీ అభిప్రాయం రాస్తారు కదూ!

మరిక ఉండనా…

ప్రదీప్ కుమార్

మీ మాటలు

 1. Ivaturi Balatripurasundari says:

  చాలా బాగుంది. .ఆశ, నిరాశల మధ్య , ఆత్రుత.., ఆవేదనల గుండె చప్పుడుల ఎదురు చూపుల మేఘమాలిక ..అలనాటి ..లేఖా నిరీక్షణ..ఈనాడు మాయమైన మయూరము.

 2. చందు తులసి says:

  కలం స్నేహం అపురూపం. ఒక వ్యక్తి గురించి ఏమీ తెలియకుండా…కేవలం భావాల ఆధారంగా స్నేహం అపురూపం.
  గొరుసు గారూ మీరు అదృష్టవంతులు

 3. G.venkatakrishna says:

  ఉత్తరం బాగా దాచుకున్నారు .ఇలాంటి సాహిత్య విలువలున్న ఉత్తరాలు అపురుపమే .గొరుసు అన్న కు ఆ మిత్రుడు మల్లి కలిస్తే ఎంత బాగుండునో ,అనిపిస్తోంది ….

 4. కె.కె. రామయ్య says:

  గొరుసన్న గారి 40 ఏళ్ల క్రితపు కలం స్నేహితుడు ప్రదీప్ గారు మళ్లీ ఇప్పుడొచ్చి బాగున్నావా నేస్తం, ఎం చేస్తున్నావు, ఎం రాస్తున్నావు, ఇప్పటి వరకూ ఏవేవి రాసావు, ఎంత రాసావు, నీ బుక్కులు ఎక్కడ దొరుకుతాయి అని గొరుసన్నను అడిగితే ఎంత బాగుండునో కదా అని నాకూ అనిపిస్తోంది ~ తంపులమారి రావయ్య

మీ మాటలు

*