ఇంకా లాంగ్ డ్రైవ్ లోనే వున్నాం, అరుణ్!

 

-ప్రసాద మూర్తి

~

 

మనసు నిండ లేదురా. నీ స్నేహాన్ని పూర్తిగా..తృప్తిగా కడుపు నిండా నింపుకోనే లేదురా. ఉదయించే సూర్యుణ్ణి మన ధిక్కార అక్షరాలతో ఇంకా ఇంకా కవ్విస్తామని, అస్తమయాలను ఇంకా ఇంకా రెప్పవాల్చని మన యవ్వన స్వప్నాలతో నవ్విస్తామని ఎంతో ఆశపడ్డాను. ఆ ఆకాశం గోడ మీద నీడలమై మనం ఎన్ని నినాదాలు రాసుకున్నాం. ఏ చెట్టూ నీ కంటే పచ్చగా వుండలేదని మేమంతా ఎంత మురిసిపోయే వాళ్ళం? తనివి తీరలేదురా తమ్ముడూ. నీతో కలిసి వేసిన అడుగుల కడుపులో పూచిన చెలిమి మొగ్గల తొడిమలు ఇంకా తడితడిగా కదులుతున్న చప్పుడే వినిపిస్తోందిరా.

అన్నయ్యా నీ పెళ్ళికి(1985) నిక్కరు వేసుకుని విజయవాడ ప్రజాశక్తి కార్యాలయం మీటింగ్ హాల్లో కూర్చున్నానని అనేవాడివి. కావాలంటే చూసుకో అని అప్పట్లో నేను ప్రజాశక్తిలో రాసిన కవితల కటింగులు చూపించి నా కళ్ళల్లో చిరుబొట్టువై మెరిసేవాడివి. కాని కవిత్వంలో కొమ్ములు తిరిగిన వాళ్ళని కూడా నిక్కరు వేయించి నీ ముందు కూర్చోబెట్టుకునేంత ఎత్తుకు ఎదిగిపోతావని నీ మొదటి వాక్యం దగ్గరే పసిగట్టాను. ఆ మాట చాలాసార్లు నీతో అంటే నువ్వేమనేవాడివి? ఊరుకో అన్నయ్యా మరీ చెప్తావు అని నవ్వేసే వాడివి గుర్తుందా? నిన్నింకా పూర్తిగా స్పష్టంగా తేరిపార చూడనేలేదురా. నిద్దట్లోంచి అదాటున లేచి..నిన్ను చూసి..చాచిన నీ చేతుల్ని చూసి నిన్ను వాటేసుకొని ఇంకా నీ కౌగలి విడిపించుకోనేలేదురా. ఇంతలోనే అంత మాయ చేస్తావా తమ్ముడూ.

ఇంకా నీతో కలసి లాంగ్ డ్రైవ్ లో వున్నట్టే వుంది తమ్మీ. కింద మిత్రులు..పైన పగటి పూట సూర్యుడు, రాత్రి చంద్రుడితో కలిసి రయ్ రయ్ న తుపాకీ గొట్టంలోంచి వచ్చే అక్షరాల్లా దూసుకుపోతున్నట్టే వుంది. అదిగో అలా నువ్వింకా స్టీరింగ్ తప్పుతూ ఎక్సలేటర్ తొక్కుతూ ఇంకెంత దూరం అన్నా వచ్చేసాం. ఇదిగో ఈ పాట విని అంటూ ఏ రాజేష్ ఖన్నా షర్మిలా టాగూర్ ల మధ్య నలిగిన ఏ పూల గుత్తినో రేకులు రేకులుగా తుంపి నా చెవుల్లోనువ్వు పిండుతున్నట్టే వుంది. ఏంటో నీ మాటలు ఆగిపోయాయని..ఈ  చెవులు తుడిచేసుకోవాలని అనిపించడమే లేదు.

నీకు స్క్రీన్ మీద ఫ్రేములు బిగించడం తెలుసు. దృశ్యాలను ఫ్రేముల్లోపెట్టే రహస్యాలు తెలుసు. మాటలను కూడా ఫ్రేముల్లో దృశ్యాలను చేసే మాంత్రికుడివని మరి మాలాంటి వాళ్ళకు తెలుసు. నువ్వు మాగ్జిమమ్ రిస్క్ చేసినప్పుడే అనుకున్నాను వీడు మా తొక్కలో లెక్కల్లో ఒదిగేవాడు కాదని. నీ రెండో కవితా సంపుటి మియర్ మేల్ కి చిన్న ముందు మాట రాయమన్నావు. రాస్తే అన్న వాక్యం అని ఎంతో గౌరవంగా వేసుకున్నావు. అది నాకు దక్కిన గొప్ప గౌరవం అని నేననుకున్నాను. అప్పుడే అన్నాను నీ మీద అసూయగా వుందిరా అని. అప్పుడు కూడా పో అన్నా నువ్వు మరీనూ అని నవ్వేశావు. నువ్వు నవ్వుతావురా. నీ నవ్వు వినడం కాదు చూడాలి. ఒరేయ్ ఇంకా నీ నవ్వు చూడ్డంలో వున్న హాయి తీరలేదురా. నీ నవ్వుల్లో ఏవో కెరటాలు కెరటాలుగా కాంతి గోళాలు కనిపించేవి మరి. రాజేష్ ఖన్నాని వర్ణించేవు చూడు.  అంత కంటె అందగాడిగా కనిపించేవాడివి. అవును మరి అమ్మాయిల్ని ఎలా కళ్ళతో పడేయాలో రాజేష్ ఖన్నాని చూసి తెలుసుకోవాలనేవాడివి. ఆ మర్మ విద్య నీకు తెలిసిందా అంటే చెప్పీ చెప్పక తప్పించుకునేవాడివి. చెవి దగ్గరగా పెడితే చాల్లే అన్నా అని సిగ్గుపడే వాడివి.

నువ్వు చెప్పని రహస్యాలు చాలా వున్నాయిరోయ్. నీ వయసెంతో మాకింకా పజిల్ గానే మిగిల్చావుకదా. అందరినీ అన్నా అనే పిలిచేవాడివి కదా. టీవీ 9 ఆఫీస్ బాయ్ దాసు గుర్తున్నాడా? వాడు నీకంటె పదేళ్ళుపైనే చిన్నోడు. అయినా దాసన్నా అని పిలిచేవాడివి. ఇదేం అన్యాయంరా అంటే ఏంటన్నా నేనింకా పోరగాడినేగా అని కొంటెగా కొట్టిపారేసే వాడివి. లోకంలో అందరిలోనూ నువ్వే చిన్నవాడివనిపించుకోవాలని నీ ఆశచూసి మేం నిన్నెంత ఉడికించేవాళ్ళం? ఎప్పుడో నలభై గీత దాటక ముందే నీ వయసు ఆగిపోయింది. అదేంటంటే సర్టిఫికెట్ దొంగ లెక్క అనేవాడివి. ఫార్టీప్లస్ అనిపించుకోవడమే ఎలర్జీ. మరి ఫిప్టీకి దగ్గరపడ్డాన్ని నువ్వెలా తట్టుకోగలవులే. లోపల్లోపలే అవయవాలు ఎదురు తిరుగుతున్నా శరీరాన్ని మాత్రం నలభై దగ్గరే అట్టిపెట్టి వుంచావు. ఇంకా వుంటే మేమంతా నీ వయసు కనిపెట్టేస్తామని అనుకున్నావో ఏమో నీతోపాటే నీ వయసునూ మాయం చేద్దామనే ఇలా మాయమైపోయి వుంటావు.

bandaru

పూలండోయ్…పూలు!

నువ్వు కులం గురించి నాకు చెప్పిన మాటలు ఎవరికీ చెప్పనులే తమ్ముడూ. నిన్ను కౌగలించుకుని గట్టిగా హత్తుకున్నచేతుల్లో కూడా కులం ఏ రంగులో ప్రవహిస్తుందో చూడగలిగిని వాడివి. నీ వయసులానే నీ కులం విషయం కూడా ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేశావు.తెలుసుకోడానికి ఎందరు ఎన్ని రకాల అంజనాలు వేశారో..ఎన్నిరహస్యోద్యమాలు నడిపారో తెలిసి మనం ఎంత గట్టిగా నవ్వుకున్నాం. వాళ్ళకి తెలిస్తే ఆ నవ్వుకి బట్టలూడి  పరుగులు తీసేవారేమో. కమ్యూనిజంలో నిజం వుందని గట్టిగా నమ్మినవాళ్ళం కదా. ఆఫ్టరాల్ అవర్ హార్ట్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ అని కదా నీ లెక్క. అవును నీ అక్షరాక్షరం వామపక్షమే. కానీ కమ్యునిజంలో వున్న నిజం నాయకుల్లో లేదని నువ్వెంత బాధపడేవాడివి?

ఉద్యోగం నిమిత్తం నేను రాష్ట్రాలు పట్టి తిరిగి తిరిగీ 2000లో హైద్రాబాద్ చేరుకున్నది మొదలు ఇప్పటిదాకా మనం కలుసుకోని రోజులు తక్కువే. ఒకరినొకరం తలుచుకోని క్షణాలూ తక్కువే. ఏది రాసినా ముందు నాకే చూపించే వాడివి. దగ్గర లేకుంటే ఫోనులో వినిపించేవాడివి. వయసైపోతోంది. నీలా నేనెప్పటికి రాస్తాన్రా అంటే పో అన్నా నువ్వలా నన్ను పెద్దోణ్ణి చెయ్యకు. ఆయుక్షీణం అనేవాడివి. నిజంరా అంటే నమ్మేవాడివి కాదుకదా. ఇప్పటికీ నేను అదే మాటమీదున్నాను. నువ్వు డిఫెరెంట్. నీ స్టయిల్ డిఫెరెంట్. నీ కలం డిఫెరెంట్. నీ కవిత డిఫెరెంట్. నీ కంటెంట్ విషయంలోనే నేనప్పుడప్పుడూ గొడవపడేవాడిని.

నీకు గుర్తుందో లేదో నీ లంగ్ ఆపరేషన్ చేసినప్పుడు నా ఊపిరితిత్తుల మీద కత్తెర్లు పడినట్టు గిలగిల్లాడాను. లంఘించరా తమ్ముడా ఉల్లంఘించరా ఒక్క ఛలాంగ్ తో ఈ లంగ్ జంగ్ జయించరా అని రాశానే. మరి నువ్వలాగే అన్నావుగా. అదో వేలంవెర్రిగా నిన్ను చుట్టేసుకునే నీ చేలాగాళ్ల ఊపిరి కూడా పోసుకుని పయనించరా తమ్ముడా ప్రస్థానించరా..నిండు నూరేళ్ళూ హాయిగాజీవించరా అని అన్నాను కదా. మాటిచ్చావుగా. ఎందుకిలా ఇంత తొందరగా నీ మాటను కూడా ఉల్లంఘించిపోయావురా?

నువ్వు పదికాలాలు బతికుంటే తెలుగు కవిత్వం పదికాలాలు బతికుండే జవసత్వాలు పుంజుకుంటుందన్న ఆశతోనే నిన్ను చాలా చాలా తొందరపెట్టాను. నువ్వు జేగురు రంగు జ్ఞాపకాలు రాస్తే నీ అక్షరాల్లో అసలు రంగు అదే అన్నాను. నువ్వు యాన్ ఆఫ్టర్ నూన్ యట్ చట్టి అంటే నీలో మండుతున్న మధ్యాహ్నాలు చాలా వున్నాయి. వాటినే బయటకు తీయమన్నాను. భద్రాచలం రాముడి పాదాలు ముద్దాడే పాపికొండలకు నువ్వు తలబాదుకుంటే రానీయ్ రానీయ్ నీలోంచి లక్షల క్యూసెక్కుల ఉధృతిలో అక్షరాలను ఉరకనీయ్ అన్నాను. అన్నీ పక్కన పెట్టి పోలవరం ముంపు గ్రామాల కంటె ముందు వందల సార్లు మునిగి తేలి మునిగి తేలి ఊపిరాడక కొట్టుకుంటున్న నీ కవితల్ని ఒక్కచోట చేర్చి పోగుపెట్టమన్నాను. నా మాట కాదనలేదు. అలాగే అన్నా అన్నావు. అలాగే చేశావు. నా మాటదేముందిలే నీకు మిగిలిన టైం నిన్నలా తొందరపెట్టి వుంటుంది. ఇంక ఈ సాగరానికి అడ్డూ ఆపూ లేదనుకున్నాను. నేనే కాదు.

నీ మరణ వాంగ్మూలం అనబడే మ్యూజిక్ డైస్ చూసిన ప్రతివాడూ ఆ మృత్యు సంగీతం విన్నవారంతా వందల అడుగుల నీటి లోతులో సమాధైన గ్రామాల్లా దు:ఖించడం ప్రారంభించారు. ఎవడూ నాకు ఒక్క అవార్డన్నా ఇవ్వలేదేంటన్నా అనేవాడివి. ఒకటేంట్రా వందలొస్తాయి అనేవాడిని. ఆ రోజులు వచ్చేశాయిక అని అన్నాను కదా. నువ్వే తొందరపడ్డావు. ఆ రోజులు చూడకుండానే తొక్కలో అవార్డులు నాకెందుకు..నేనే మీకో అవార్డు అని ప్రకటిస్తూ వెళ్ళిపోయావు. కొందరు కాలం కంటె ఎప్పుడూ ముందే వుంటారు. తమ్ముడూ నిన్ని అర్థం చేసుకునే కాలంలోకి మమ్మల్ని నడపకుండానే ఎలా వెళ్ళిపోయావురా?

నేను చెబుతున్నానుకదా నీ డిక్షన్..నీ కవన కుతూహల రాగం తెలుగు కవిత్వ విద్యార్థులకు..విరాట్టులకూ ఒక తప్పనిసరి పాఠం అవుతుందిరా. నీ పదాల్లో మార్మికత లేని మంత్రధ్వని వుంది. నీ ముందు కూర్చోడానికి అందరం పలకాబలపం పట్టుకుని కూర్చునే టైమొచ్చినప్పుడే నువ్విలా అదృశ్యమైపోవాలా? నిన్ను ఎవరు అనుకరించినా ఇట్టే దొరికిపోయేట్టు పోయెం పోయెం మీదా నీ పేరును వాటర్ మార్క్ గా వేసిపోయావు.ఎంతైనా టీవీవోడివి కదా. అసాధ్యంరా నిన్ను చూసి పొంగిపోవలసిందే తప్ప నిన్ను దొంగిలించడం అసాధ్యం. ఇంగ్లీషు చదువుకున్న తెలుగు కవులున్నారు.

కానీ తెలుగు కవిత్వం ఇంగ్లీషు చదుకునే దశ నీతోనే మొదలైందనుకుంటా. ఆంగ్లమా..ఆంధ్రమా లాంగ్వేజి కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా చూడమన్నావు. నువ్వు భలే తుంటరోడివిరోయ్.  నువ్వొక పక్క..మిగిలిందంతా ఒక పక్క రెండు పాయలుగా తెలుగు కవిత్వం అలా వుండిపోతుందేమో అని అనుకునే వాడిని. ఆ స్థాయికి నువ్వు ఎదిగే దశలోకి రాగానే ఉన్నట్టుండి నీ ప్రయాణం దిశ మార్చేశావు. నిన్నింకా చదువుకోవడం పూర్తికానేలేదురా. పొయిట్రీని ప్రోజ్ చేసి పోజుకొట్టే  మనోపాజ్ ఘనాపాటీలున్నారిక్కడ. నువ్వేమో ప్రోజ్ ని కూడా పొయిట్రీగా పొర్లించవచ్చని నిశ్శబ్దంగా నిరూపించావు. అన్నట్టు నిశ్శబ్దమంటే గుర్తొచ్చింది వ్యూహాత్మకంగా నిశ్శబ్దాన్ని పాటించే శబ్దాడంబరులున్నారిక్కడ. నీ నిష్క్రమణతోనైనా నిన్నలముకున్న నిశ్శబ్దం బద్దలవుతుందేమో చూడాలి.

నీ నరనరంలో టీయార్పీ మందుపాతర పేలిన సంగతులు నాకు తెలుసు. చేసే ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం కోసం నువ్వు రోజురోజూ శకలాలు శకలాలుగా విఛ్చిన్నమైన విషయాలూ తెలుసు. టీవీ రేటింగ్ నీ హార్ట్ బీటింగ్ ని ఎలా కొంచెం కొంచె కొరుక్కు తినేసిందో తెలుసు. నిన్ను లొంగదీసుకుని..కుంగదీసిన అసలు జబ్బు నీ ఉద్యోగమే అదీ తెలుసు. నీ శరీరంలో మృత్యు కవాతులు నువ్వే చూస్తూ మాకు మాత్రం నిత్యం నవ్వుల కవిత్వపు కబాబులు తినిపించావు. ఈ మిగిలిన లైఫ్ అంతా బోనస్ అన్నా అనేవాడివి. కాని నువ్వే మా బోనస్ కదరా. మా బోనస్ ని మేమింకా పూర్తిగా అనుభవించక ముందే వెనక్కి తీసేసుకున్నావా?  సావాసగాళ్ళతో తిరుగుళ్ళంటే నీకెంత ఇష్టం. కారు నడపడం..కవిత్వం రాయడం..దోస్తులతో సూర్యాస్తమయాలను కోసుకోవడం..అడవినీ గోదావరినీ కొండలనీ ప్రవహించే రాత్రులనీ  స్నేహితుల చేతలన్నీ నీవే చేసుకుని వాటేసుకోవడం నీ నుండి ఇంకా మేం నేర్చుకోలేదురా. అందరూ తాగుతుంటే నువ్వందరినీ తాగేవాడివి. అయినా ఇంటిదగ్గర మల్లెపూదండనీ బంగారు కొండనీ అశ్రధ్ధ చేయలేదుగా. నీ మత్తు మాకింకా దిగకుండానే ప్రయాణాల మత్తులోపడి ఎటో కొట్టుకుపోయావు కదా. పోరా పో.

నీకు నేనంటే ఎంతిష్టమో నాకు తెలుసు. నీ చివరి మెసేజ్ నాకొక అత్యున్నత అవార్డు సైటేషన్ అనుకుంటాను. ఫిబ్రవరి 1 న ఆంధ్రజ్యోతి వివిధలో అచ్చయిన నా కవిత చూసి నువ్వేం రాశావు? “ poem adbhutam. Maatallo cheppalenanta adbhutam.very touching, very deep, very poetic. And highly dense. You have shown how a poem should be. Congrats for setting high standards.”  మరి నేనేమన్నాను. ఇటీజ్ యువర్ హైనెస్ అన్నాను. నా మీద ప్రేమతో నువ్వెక్కువ చెప్పావేమో. కానీ ఈ మాటలు నీ  ప్రతి వాక్యానికీ  వర్తిస్తాయి.

ఎన్ని వందలమందికో నువ్ జీతాన్ని జీవితాన్నీ ఇచ్చావు. నువ్వు ఒకసారి వెళ్ళొస్తా బాస్ అని అందరి దగ్గారా సెలవు తీసుకున్నప్పుడు..నీ ఇంటి నుండి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం స్మశానవాటిక దాకా రోడ్డంతా వందలాది కళ్ళు కురిపించిన కన్నీటి వర్షం మమ్మల్ని ఎప్పటికీ తడుపుతూనే వుంటుంది. నువ్వెంత ధన్య  జీవివో మాకు తెలుపుతూనే వుంటుంది.

అందరూ నీ తమ్ముడు ఎక్కడున్నాడని అడిగితే వాడు టీవీ5 కి వెళ్ళాడు నేను 10టీవీలోనే వున్నానని అనేవాడిని. ఇక ఇప్పుడెవరైనా అడిగితే వాడు పైకి వెళ్ళిపోయాడు. నేను కిందే వుండిపోయానని చెప్తాను. తమ్ముడూ నీతో అన్నయ్యా అని పిలిపించుకున్న గర్వాతిశయం నా మీదా నా అక్షరాల మీదా ఎప్పుడూ వెలుగు రేఖై వెలుగుతుందిలే. అయినా ఏమోరా  మనసు నిండ లేదురా. అంతా అధూరాగానే మిగిలిపోయినట్టుందిరా. మన మాటలు..మన పాటలు..మన చెలిమి అంతా సగం సగంగానే ముగిసిపోయినట్టుందిరా. కడుపు నిండలేదురా. సాగరా. సాగరా. సోదరా.

 

మీ మాటలు

 1. గుఱ్ఱం సీతారాములు says:

  ఇప్పటివరకూ అరుణ్ మీద వచ్చిన వ్యాసాల్లో కాస్త నిజాలు ఉన్నది ఇదొక్కటే “చేసే ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం కోసం నువ్వు రోజురోజూ శకలాలు శకలాలుగా విఛ్చిన్నమైన విషయాలూ తెలుసు. టీవీ రేటింగ్ నీ హార్ట్ బీటింగ్ ని ఎలా కొంచెం కొంచె కొరుక్కు తినేసిందో తెలుసు” ఇన్ని నిజాలు తెలిసీ రాయలేని ప్రసాద మూర్తి మధ్య తరగతి ఊగిసలాటా నాకు తెలుసు. నాకు తెలుసు అరుణ్ సాగర్ హృదయ కవాటాల్లో ఎవరెవరు ఏం కుమ్మరించారో. తన తండ్రి చంద్రం గారి సంస్మరణ సభకు ఆయన కొడుకో కుటుంబ పాయో పిలవాలనే ఇంగిత జ్ఞానం లోపించిన ఎలిసిన జేగురు రంగు విన్యాసాలూ నాకు తెలుసు. అవును అన్నయా బ్రతుకు మునిగి పోతున్న చోట కవితలతో కన్నీరు దాచుకోడానికి తొక్కలో కవిత్వం అయినా ఉంది. అవును ఇప్పుడు నిర్వాశితుని ఎండిపోయిన కళ్ళల్లో చెలిమ కూడా మిగలలేదు

 2. Aranya Krishna says:

  అరుణ్ సాగర్ మీద మోస్ట్ ఆథెంటిక్ ఆర్టికల్. చాలా టచింగ్ గా వుంది. అనుభవించి పలవరించాలే తప్ప వ్యాఖ్యానం అనవసరం. మీ కవిత్వం తనకెంతో ఇష్టమని అరుణ్ నాతో కూడా అన్నాడోసారి.

 3. కె.కె. రామయ్య says:

  అవును అరుణ్ సాగర్ లాంటి కొందరు కాలం కంటె ఎప్పుడూ ముందే వుంటారు.

  ” ఇప్పుడెవరైనా అడిగితే వాడు పైకి వెళ్ళిపోయాడు. నేను కిందే వుండిపోయానని చెప్తాను ”
  అని చదవగానే గుండె కలుక్కు మంది.

 4. చందు తులసి says:

  ప్రసాదమూర్తి గారూ…..
  పక్కవాడిని అణగదొక్కి….తాము పైకెదిగే తెలుగు మీడియాలో…ఇద్దరు మనుషుల ఇంతటి అనుబంధం ఆశ్చర్యమే కాదు..ఆదర్శం కూడా.
  ప్రతీ అక్షరంలోనూ ఆవేదన వుంది.
  అణగారిన వర్గాల కోసం పాటుపడడం ద్వారానే….మీడియా లోని మిత్రులు ఆయనకు నిజమైన నివాళి ఇవ్వగలరు.

 5. “చేసే ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం కోసం నువ్వు రోజురోజూ శకలాలు శకలాలుగా విఛ్చిన్నమైన విషయాలూ తెలుసు. టీవీ రేటింగ్ నీ హార్ట్ బీటింగ్ ని ఎలా కొంచెం కొంచె కొరుక్కు తినేసిందో తెలుసు. నిన్ను లొంగదీసుకుని..కుంగదీసిన అసలు జబ్బు నీ ఉద్యోగమే అదీ తెలుసు.”
  ఇంత దగ్గరిగా మసలిన మీ సాంగత్యంలో పూచిన స్నేహం, కవిత్వం చాలా గొప్పది. గొప్పగా రాశారు. ఆరుణ్ లేక పోవడం కొండంత విషాదం- అది భరించలేకే, లేడనుకోవట్లేదు. ప్రస్తుతానికి అబద్దాన్నే నమ్ముతున్నాను.

 6. చదవగానే ఓ ముక్క రాయడం సాధ్యం కావడం లేదు.ఎక్కడో కూరుకుపోయిన గుండెను వెతుక్కోవడానికే రోజులు పట్టేట్టు ఉంది.దాన్ని ఊరడించడానికి మరింత కాలం …ప్రస్తుతానికి very touching, very deep, very poetic. And highly dense …..

  • ప్రసాదమూర్తి says:

   థాంక్యూ బ్రదర్. రాయడానికి చాలా వుంది. రాయాలి. కొంత తెప్పరిల్లాక.

 7. N Venugopal says:

  ప్రసాదమూర్తి గారూ,

  కళ్ల నిండా నీళ్లతో, చెంపల మీద ఆరని తడితో….
  కృతజ్ఞతలు. మీ అంతరాంతర విషాదాన్ని పంచుకున్నందుకు.

 8. అరుణ్ పోయి ఏడిపిస్తే మీరు అక్షరాలతో ఏడి పిస్తున్నారు .ప్రసాద్ మూర్తి గారూ.ఓపిక లేదండీ !

 9. వెరీ వెరీ టచింగ్ సర్ ..
  కొన్ని ఫీలైనవి .. కొన్ని చెప్పాలనుకున్నవి చెప్పారు.. ఇంకొన్ని పంచుకునే ఎమోషన్ కలిగించారు..
  ఫీలింగ్స్ లోనే ఇప్పటికి.. పంచుకోవాలి తరువాతైనా..

 10. ఎవడూ నాకు ఒక్క అవార్డన్నా ఇవ్వలేదేంటన్నా అనేవాడివి. ఒకటేంట్రా వందలొస్తాయి అనేవాడిని. అరుణ్ సాగర్ అవార్డునొకటి ప్రవేశ పెట్టి ఏటా యువకలానికి ఇవ్వొచ్చు కదసార్.. ఇందుకు మీకు మించిన అర్హులు లేరని నా అభిప్రాయం..

 11. Nagabhushanam Dasari says:

  చీకటి లోకంలోకి అరుణ కిరణంలా వచ్చి గోదావరి అలల తరగలపై తేలుతూ నవ నాగరిక ప్రగతి శిఖరాల క్రింద భస్మీపటలమై నామరూపాల్లేకుండా శాశ్వతంగా అంతరింపబడిపోబోతున్న గిరిజన బ్రతుకుల అక్రందనల స్వరాల దిక్కార వాణివై – బద్రాద్రి రామునితో మొరపెట్టుకుని, భవిష్యత్తులో సాక్షాత్కరించబడే వికృత పర్యావరణ విశ్వరూపాన్ని తన మనో నేత్రంతో అందరిముందు ఆవిష్కరింపజేసి – కలచివేసే పచ్చినిజాల మరచిపోలేని కవితాక్షర పూరేకులను వెదజల్లుతూ చెదిరిపోయిన కలలా – అప్పుడే సాగరంలో ఇక సెలవంటూ కలసిపోతె – నవ్వుతూనే ఆకాశంలోకి పక్షిలాగా ఎగిరిపోతే – కనబడని లోకాలకి వెళ్లిపోతే… మామూలువాడికే గుండె తరుక్కుపోతుంటే – “ప్రసాద మూర్తి” గారి బాధ మాటలకందనిదే…..
  నాగభూషణం దాసరి.

 12. Jhansi Papudesi says:

  తమ్ముడూ నీతో అన్నయ్యా అని పిలిపించుకున్న గర్వాతిశయం నా మీదా నా అక్షరాల మీదా ఎప్పుడూ వెలుగు రేఖై వెలుగుతుందిలే. అయినా ఏమోరా మనసు నిండ లేదురా. అంతా అధూరాగానే మిగిలిపోయినట్టుందిరా. మన మాటలు..మన పాటలు..మన చెలిమి అంతా సగం సగంగానే ముగిసిపోయినట్టుందిరా. కడుపు నిండలేదురా. సాగరా!!
  Heart touching tribute Sir!! Sorry for the loss of your dear one.

 13. Padma Meenakshi says:

  జస్ట్ టియర్స్…కన్నీరు తప్ప ఇంకేమి రాలేదు…..

 14. buchireddy gangula says:

  excellent..tribute..sir…
  ఎలా eyes..తో పడేయాలో –అ మర్మ విద్య తెలిసి —Rambha — ooravashi– మేనక లు
  లైట్ కొట్టడానికి — ఎవరికి చెప్పకుండా జారుకున్నాడు –Prasad గారు//
  acted..differentely…

  communisam..లో ఉన్న నిజం — నాయకుల్లో లేదని —–ఎంత నిజం సర్ యి రోజుల్లో ??
  కల నేత తో —తెలుగు సాహిత్యెం లో ఇష్టాన్ని కలిగించిన ప్రసాదమూర్తి గారు —
  నా అబిమాన రచయిత
  ————————————————————————————————————
  బుచ్చి రెడ్డి గంగుల

 15. ప్రసాదమూర్తి says:

  మిత్రులారా అంతా బావుంది బావుందని అంటుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. అందరికీ ధన్యవాదాలు

Leave a Reply to B.Narsan Cancel reply

*