అరుణ్ కాలింగ్ అరుణ్!

 

– అరుణ్ తోట

~

arun tota

ఏ సంవత్సరమో గుర్తు లేదు కాని ఆంధ్రజ్యోతిలో ‘నవీన’ అన్న కాలమ్ లో మొదటిసారి తన పేరు చూసినట్టు గుర్తు. కాలమ్ చదివిన వెంటనే అడిగాను అమ్మని, “ఎవరమ్మా ఈ అరుణ్ సాగర్? ఇంత బాగా ఎలా వ్రాస్తున్నారు?”

ఇక అప్పటి నుంచి ప్రతీ వారం అయన కాలమ్ కోసం ఎదురుచూడడం, ఆయన్ని కలవాలని తపించటం, కలవటం. అయన వ్రాసిన ప్రతీది పనిగట్టుకుని చదవడం, చదివించడం – కొద్ది కాలానికి ఫేస్బుక్ లో మా యాదృచ్ఛిక చర్చలు, ఆయనతో వ్యక్తిగత సంభాషణలు – తిరిగి చూసుకుంటే ఇప్పుడు అనిపిస్తుంది, అన్ని సంఘటనలు ఒక సహేతుక కారణంతోనే జరిగినట్టు.

తనకి ముందే తెలుసేమో ఇలా జరగబోతుంది అని. జీవితంలోని విషాదాన్ని “యు నో, ఐ డోంట్ హావ్ టైం ఫర్ యు” అని తన్నితరిమేసి, చేతనైనంత కాలం మాన్ వాచింగ్ చేసి, మనల్ని కాచి వడబోసి, పనికిరాని చెత్తను తన రచనలతో అలా పక్కకి తోసేసి, జీవిత గడియారంలో సమయం చూసుకుని “చలో, మేరా వక్త్ ఆగాయ” అని నిష్క్రమించారు.

ఎలా వ్రాస్తున్నారు అనే దానికంటే ఎలా వ్రాయగలిగారు అనేది ఒక శేష ప్రశ్నగానే మిగిలిపోయింది. తనని ఏ సంఘటనలు, అనుభవాలు ప్రేరేపించాయో ఇంకొంచెం సన్నిహితం అయినప్పుడు అడగాలనుకున్నా, కానీ ఆ అవకాశం లేకుండా ‘మ్యూజిక్ డైస్’ అని సైన్ ఆఫ్ చేసి వెళ్ళిపోయారు. ఏ జ్ఞాపకాల కొలిమి ఆయన గుండెల్ని సమ్మెట కొట్టి, కాల్చి ఇంతగా సానపెట్టిందో కదా?

అరుణ్ సాగర్ – ఆ పేరు తలుచుకుంటేనే ఏదో పులకరింపు, లేక జలదరింపా? తన కవితలు, రాతలు, వ్యాఖ్యలు, ఫేస్బుక్ పోస్టులు ఏవైనా కాని, చదువుతుంటే ఆ పదాల నుంచి అరుణ్ సాగరే ఒక్కసారిగా బయట కొచ్చి మన భుజాల్ని పట్టుకుని ఆపాదమస్తకం ఊపినట్టు ఉంటుంది. మాటలా లేక అక్షర తూటాలా అవి? కళ్ళు అక్షరాల వెంట పరుగుతీస్తుంటే నికోటిన్ , కేఫైన్, ఇథనాల్ మరే ఇతర ఉద్దీపన అవసరంలేని హిజ్(అరుణ్ సాగర్) హైనెస్ ఎఫెక్ట్ కి గురౌతాం.

 

చట్టబద్ధమైన హెచ్చరిక: ఈయన రచనలు చదువువారు వెంటనే వారికీ వీరాభిమనులవుదురు. జాగ్రత్త!

 

ఈయన ధరించే ఒక సాధారణ జీన్స్ ప్యాంటు నీల్ కమల్ అని సోల్ ఫుల్ ఆటిట్యూడ్ చూపెడుతుంది. తాటి తోపు కాడ తాటాకుల పరుపు, కల్లుకుండతో జతకట్టి ఆయనను ఊర్ధ్వలోకపు అంచులకి తీసుకెళ్తుంది. విశాఖ గాని దుబాయ్ కానీ మరే సాగరతీరం కాని, అరుణ సాగర ఆలోచనా తరంగాల ముందు అ కడలి కెరటాలు కూడా ‘మన కంత బలమేక్కడిదిలే బాస్’ అని చిన్నబుచ్చుకుని నెమ్మదిగా వెనక్కు జారిపోతాయి. సగటు మగాడిని ‘రోబోసేపియన్’ అని వెటకరించినా, బాహర్ నికల్ రే భై, నికల్కే నిన్ను నీవు తెలుసుకొనుము అని జిడ్డు గారి ఇష్టైల్లో ‘మేల్’ కొల్పినా ప్రతిదానిలో హిజ్ హైనెస్ ఎఫెక్ట్ నిను వీడని నీడను నేనే అంటుంది.

 

డిస్క్లైమర్: ఈయనను అనుసరించు వారు కార్పొరేట్ కొలిమిలో ఊపిరాడక, సాలెగూట్లో చిక్కుకున్న కిటకంలా గిలగిలా కొట్టుకుందురు.

 

అయన వ్రాతలలో ఒక్కోసారి కవితావేశం కొంచెం ఎక్కువై పిచ్చితనం లాగ (భావోన్మాదం అనాలా?) అగుపడచ్చేమో. కాని అరుణ్ సాగర్ మాటలలో మనల్ని మనం చూసుకోగలిగినప్పుడు మాటలలో వ్యక్తపరచ లేని, చేతలతో చూపెట్టలేని భావ సంచలనానికి గురి కావడం, అది బయటకు పిచ్చితనంగా కనపడడం సహజం. అసలు అలా కనపడక పోవడమే నిజమైన పిచ్చితనమేమో! అలా కాలేదు అంటే మన జీవిత పరిణామ క్రమంలో ఏర్పడ్డ మానసిక కాలుష్యం మనల్ని కుళ్ళపొడిచేసిందని అర్ధం. ఆయన రాతలు ఒక్కసారి చదివితే అర్ధం కావట్లేదా? ఒకటికి పదిసార్లు, ఇంకా కావాలంటే వంద సార్లు చదవండి, చదివిన ప్రతీసారి ఒక కొత్త కోణం ఆవిష్కృతమౌతుంది.

 

ఇంతకీ ఆయనదే శైలి? సర్రియలా, అబ్స్త్రాక్టివా, హైకూనా లేక ఇంకేదైనానా? ఆయన ఎంచుకునే అంశాలు, భావజాలం ఎటువంటిది? రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ లేదా లిబరల్? బహుశా ఆయననే అడిగి వుంటే, తన మార్కు చిరునవ్వుతో భుజాలు చిన్నగా ష్రుగ్ చేసి “యు డిసైడ్ అండ్ టెల్ మీ డ్యూడ్” అనేవారేమో. తన భావజాలాన్ని ఏ గాటన కట్టలేం. అదొక స్వచ్చమైన నీటి లాంటి స్థితిలో వుంటుంది. వరద ప్రవాహమయ్యి ఏమీ మిగుల్చకుండా సమస్తాన్ని తనతో తుడిచిపెట్టుకు పోగలదు, బావిలో నీటి ఊట లాగ ఉండుండి ఉబికుబికి విస్తారించవొచ్చు లేదా నీటితో నిండివున్నకుండలా నిశ్చలంగా ఉండి కదలక – ఎప్పుడో భళ్ళున బ్రద్దలవనూ వొచ్చు. ఆయన ప్రభావం ఇలాగే ఉండబోతుంది అని ఖచ్చితంగా ఏమీ చెప్పలేం. ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ‘హిజ్ హైనెస్’ హిప్నొటైజ్ చేస్తుంది.

కాని ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలం. అరుణ్ సాగర్ వ్రాతల్ని అంచనా వేయాలంటే ఇంకో అరుణ్ సాగర్ కావాలి. నాకున్న (కొద్దిపాటి) పరిజ్ఞానంలో ఈయన లాగ వ్రాయగలిగిన సమకాలీకులు ఎవరూ లేరు. బహుశా ఏ శ్రీశ్రీ కాలంలోనో పుట్టి వుంటే ఈయన, శ్రీశ్రీ గారి అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి కొన్ని కొత్త పిడివాదాల్నితెలుగు ప్రజలకి రుద్దేవారు. వారిద్దరూ మాత్రం ఒక చోట కూర్చుని చాయ్ సిప్పుతూ చిద్విలాసంగా ఒకరినొకరు చూసుకుని నవ్వుకునేవారు. ఇప్పుడు కూడా వారు ఆ పని చేయ్యటం లేదని చెప్పలేం సుమా – కాకపోతే , చాయ్ బదులు అమృతం – అంతే తేడా.

ఏమైనప్పటికీ, ఐ టిప్ మై టోపీ టు అరుణ్. నేను తెలుగువాడి ఒంటి మీద వున్నాను అని నా నీల్కమల్ డెనిమ్ కాలరెగరేసిందంటే అది అరుణ్ లాంటి వారి రచనలని చదవగల్గినందుకే. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఆయనొక అలజడిని, భిన్నమైన శైలితో-బిగువైన మాటలతో కొత్త ఒరవడిని, తన వైబ్ అందుకో ప్రయత్నించిన వారికి గుండెతడిని మిగిల్చి – బాబ్ డైలాన్ పాట గాలిలో ఊదుకుంటూ (‘బ్లోయింగ్ ఇన్ ద విండ్’) వెళ్ళిపోయారు. బాబ్ డైలాన్ అంటే గుర్తుకువోచ్చింది, తను పీటర్ సీగర్ పాటల్ని చింతూరు ఏజెన్సీ కోయలకు వినిపించారో లేదో.

అయన నాకు ప్రత్యేకంగా సంతకించి పంపిన కొత్త పుస్తకం ఇంకా నా చేతికి రానే లేదు, పక్షం రోజుల క్రితం దాని గురించి ఫేస్బుక్ లో అయనతో మాటలు ఇంకా స్మృతి నుంచి చెరగనేలేదు. ఈలోగానే ఆయన్ను “లగజా గలే” అంటూ ఒకానొక దేవత – క్వశ్చన్, మియ్యర్ మేల్స్, పురుషులు, “షు” అక్షరం పీకగా వొచ్చిన పురుగులు అక్కడ కూడా వున్నారా? – చుపా రుస్తుంలా వొచ్చి అసలు సిసలైన ఆండ్రోమెడ పబ్లిషింగ్ యూనిట్ కి తీసుకెళ్లింది.

ఇంతకీ అక్కడ ఎలా వుంది ప్రభు? ఆ గాలక్సీ కూడా మీ మాటల తూటాలకి మేధోవిస్ఫోటం చెందుతుందా? చెందే వుంటుంది లెండి, మాకిక్కడి నుంచి రాత్రివేళ ఆకాశవీధిలో కొత్త పాలపుంత అలజడి కనపడుతుంది.

– అరుణ్ తోట

peepal-leaves-2013

 

మీ మాటలు

  1. baavundi arun – atani gurinchi oka kotta gontuku dwaaraa vinadam …

మీ మాటలు

*