అడివిలోంచి దూసుకొచ్చిన అక్షరం..

 

-అరణ్య కృష్ణ

~

 

“అన్నా! నేనిప్పుడు బతుకుతున్నది నా బోనస్ లైఫ్.  నేనో మెడికల్ వండర్ని”..ఇదీ అరుణ్ సాగర్ కొన్నాళ్ళ క్రితం నాతో అన్న మాటలు.

తన సున్నితమైన గుండెకున్న ఒక్క ఊపిరితిత్తితోనే కవిత్వాన్ని, జీవితాన్ని శ్వాసించినవాడు అరుణ్.  పైకి హాండ్సం గా, హుషారుగా మాట్లాడే అరుణ్ లోపల కొన్ని ముఖ్యమైన అవయవాలు శిధిలమైపోయాయి.  గాజుబొమ్మలాంటి శరీరంతో తరుచూ అస్వస్థతకు గురౌతూ కూడా జీవితాన్ని అద్భుతంగా ప్రేమించినవాడు.  మృత్యువు గుమ్మం ముందు కూర్చొని వుంటే దాన్ని కన్నుగీటి తోసుకుంటూ వెళ్ళినవాడు.  2012 నుండి అదనపు జీవితాన్ని గడుపుతున్నానన్న సంబరంలోనే వుండేవాడు కానీ చావు తనచుట్టూ తారట్లాడుతుందనే భయంలో మాత్రం వుండేవాడు కాదు. ఆకర్షణీయంగా వుండటం, అంతే ఆకర్షణీయంగా రాయటం అరుణ్ వ్యక్తిత్వంలో భాగమే.  ఎంత విభిన్నంగా కనిపించేవాడు.  ఫార్మల్ గా డ్రెస్ చేసుకున్నా, లేదా క్యాజువల్గా జీన్స్ వేసుకున్నా అతని స్టైలిష్ యాటిట్యూడ్ కనిపిస్తుంది.   ఫ్రెంచ్ కట్ బియర్డ్ తో, కళ్ళజోడులోంచి చూస్తూ చేసే మందహాసం మనోహరంగా వుండేది.  విభిన్నంగా ఆలోచించటం,  కళనీ, కౌశలాన్ని ఒకే స్థాయిలో మిళితం చేసి వైవిధ్యంగా వ్యక్తీకరించటం అరుణ్ కే చెల్లింది.

ఒక కవిగా, కాలమిస్టుగా, పాత్రికేయుడిగా “బుల్స్ ఐ” లోకి గురిచూసి కొట్టే మాట అతనిది.  పాలకులు సామాన్య ప్రజలకు పెట్టే భ్రమల గుట్టు విప్పి చెప్పటంలో కానీ, అభివృద్ధి పేరుతో సిద్ధం చేస్తున్న విధ్వంస ప్రణాళికల్ని బట్టబయలు చేయటంలో కానీ తిరుగులేని నిబద్ధత చూపిన వ్యక్తి, శక్తి అరుణ్!  అతను స్పర్శించని అంశం ఏమిటి?  సినిమా, జెండర్, సామాజికాభివృద్ధి, మానవ వికాసం, కృంగిపోతున్న పల్లెలు, “అభివృద్ధి” చెందుతున్న నగరాలు, రాజకీయాలు, బాల్యం, ఆర్ధికాంశాలు, ప్రపంచపరిణామాలు, యుద్ధాలు…ఇలా అతను ముట్టుకోని అంశం ఏదీ లేదు.  సృజనాత్మక పద ప్రయోగంతో, లలితతమైన భాషద్వారా దారుణవాస్తవాల్ని వొక ప్రవాహవేగంతో సాగిపోయే అతని శైలీవిన్యాసం మనల్ని చకచ్చకితుల్ని చేస్తుంది.  దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.  జ్ఞానాన్నిస్తుంది. ఆలోచింపచేస్తుంది. ఉడుకెత్తిస్తుంది.  ప్రేరేపిస్తుంది.

“హైదరాబాద్ ని నేనే అభివృద్ధి చేసా” అని చంద్రబాబన్నప్పుడు ఆ అభివృద్ధి ధనవంతుల ఇళ్ళల్లో వాటర్ ఫౌంటేయిన్ల నుండి వారి ప్రహరీలు దాటి బైటకొచ్చే నీటి జల్లని తేల్చిపారేసాడు.  నగరాల స్త్రీల వెతల్ని మాత్రమే ఫోకస్ చేసే మీడియా టీ.ఆర్.పి. లేని కారణంగా నిర్లక్ష్యం చేస్తున్న గ్రామీణ స్త్రీల గురించి పట్టించుకోదని ఈసడించాడు.  స్మశానవాటికకు ఎదురుగా అందమైన అమ్మాయి హోర్డింగుని చూసి నవ్వుకున్నాడు.  బాహుబలి గురించి అంతర్జాతీయ స్థాయని తెగ ఊదరగొడుతుంటే “ఈ బూటకపు కబుర్లని కట్టిబెట్టండి, సీరియస్లీ” అని హెచ్చరించాడు.  “అవతార్” సినిమా పరమార్ధాన్ని అద్భుతంగా విశదీకరించాడు.  పురుషుడంటేనే దుర్మార్గుడని, నయవంచకుడన్న ముద్రని నిరసిస్తూ “మేల్ కొలుపు”, “మియర్ మేల్” సంకలనాలు రాసాడు.  అందరూ అమ్మని కీర్తిస్తారే కానీ నాన్న శ్రమని, బాధ్యతని గుర్తించరని ఎత్తిచూపాడు.  “ఓ తండ్రీ నిను దలంచి” అని నాన్నను స్మరించుకున్నాడు.  ఆధునిక సమాజంలో నాన్న పాత్రకున్న విలువని ఎలిగెత్తి చాటాడు.  దేని గురించి రాసినా, ఎలా రాసినా, వచనం రాసిన, కవిత్వం రాసినా అందులో తనదైన విశిష్ఠ వాక్యంతో  కవిత్వమే రాసేవాడు. ఇంగ్లీష్, తెలుగుల సమ్మేళనంతో అతని వాక్యం పరిమళించేది.

ఇంక అరుణ్ కవిత్వం గురించి కొత్తగా చెప్పేదేముంది?  అదో జీవధార.  సామాన్యుడి కడుపుమంట అది.  అతని తాజా సంకలనం “మ్యుజిక్ డైస్” అతను మనకిచ్చిన చివరి కానుక.  పోతూ పోతూ ఒక సాహిత్య ఉద్యమ బాధ్యతని మన చేతుల్లో పెట్టిపోయాడు.  ఇంకా ఆ పుస్తకం గురించి “అరుణ్ చాలా బాగా రాసావు. ధన్యవాదాలు భాయి” అని మనం చెప్పే లోపలే తన బోనస్ జీవితాన్ని కత్తిరించేసుకొని వెళ్ళిపోయాడు.  బహుశ “మ్యుజిక్ డైస్” గురించే జీవితాన్ని పొడిగించుకున్నాడేమో! ఇంకా కొన్నాళ్ళ తరువాత ఈ పుస్తకం తెచ్చుండాల్సింది అరుణ్, నువ్వింకా కొన్నాళ్ళుండేవాడివేమో!  “మ్యుజిక్ డైస్ అను ఒక మరణవాంగ్మూలము” అన్న ఈ సంకలనంలో పోలవరం ప్రాజెక్ట్ కారణంగా నశించిపోనున్న ఆదివాసీలందరి తరుపున వాంగ్మూలం ఇచ్చి తను మరణించాడు అరుణ్.

జాతుల్ని, వాటి సంస్కృతుల్నే కాదు ప్రకృతిని, పర్యావరణాన్ని అభివృద్ధి పేరుతో ధ్వంసించే పాలకుల దళారీ చర్యల మీద ఏదో ఒక కవిత రాసి ఊరుకోలేదు.  ఒక కవితల సంకలనమే తెచ్చాడు అరుణ్.   ఇది అరుణ్ సాగర్ మాత్రమే చేయగల మహత్కార్యం. ఎంత ఆవేదన, జ్ఞానం, అవగాహన, నిబద్ధత, పోరాట పటిమ లేకపోతే ఇంత గొప్పపని చేయగలడు?  అమరవీరుల స్తూపం ముందు ఎగురుతున్న ఎర్రజెండాకి పిడికిలెత్తి లాల్ సలాం చెబుతూ సగర్వంగా ఫోటో వేసుకొని తన పుస్తకాన్ని “పోడు కోసం గూడు కోసం తునికాకు రేటుకోసం అటవీహక్కుల కోసం జెండాలై ఎగిరిన తల్లులకు తండ్రులకు అక్కలకు అన్నలకు” అంకితమిచ్చిన అరుణ్ ప్రాపంచిక దృక్పధం తేటతెల్లమే.

 

“చెట్టుపుట్టలు కూలుస్తున్న ఒక పొక్లయిన్

గుండె బరువెక్కి మొరాయించినది

కానీ ఒక్క మట్టిపెళ్ళా పెకిలించలేక కూలబడినది

కాంక్రీటు మర ఒకటి నిస్సహాయంగా  తిరుగుతూనే ఉన్నది

ఆ శబ్దము దుప్పిపిల్ల అరణ్య రోదనలాగున్నది

సాయిల్ టెస్ట్

మట్టినింపిన పరీక్ష నాళిక రక్తముతో చెమ్మగిల్లినది

 

నది దిగులుపడి లుంగలు చుట్టుకు పోతున్నది

అమ్మ ఒడిలో చేరి 

వాగులు వంకలు ఏరులు పారులు

భోరున సుడులు తిరిగి

దుఖపడి పెగిలిపోతున్నవి”...అంటూ అడవితల్లి తరపున, ఆ తల్లి బిడ్డలకోసం మరణశోకాన్ని ఆలపించినవాడు అరుణ్.  “అరణ్యాన్ని ఆవాసాన్ని ఆవరణాన్ని లేడిపిల్లల్ని అడవి బిడ్డల్ని రెవిన్యూ రికార్డుల్నుండి తొలగించే” పాలక ముష్కర చర్య గురించి మనల్ని హెచ్చరించాడు.

“కథలు కన్నీళ్ళు

కూలిపోతున్న ఇళ్ళు

ఇళ్ళ నిండా  నీళ్ళు

ఇళ్ళ కళ్ళ నిండా నీళ్ళు

లక్ష టియంసీల నీళ్ళు

వెల్లికిలా తేలియాడుతున్న

కోటానుకోట్ల కళ్ళు

ఇంతింత కళ్ళేసుకున్న ఈళ్ళు

కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న గాధలు

అన్నా…మన కథలు“…అంటూ బావురుమన్నవాడు మనవాడు అరుణ్!

నశించబోతున్న నది మెరిసేలా నవ్వే సీదర సెంద్రయ్య గురించి, ఒడ్డున బతుకుతున్న రావిచెట్టు గురించి, ఒక పోరగాడు విసిరిన గులకరాయి గురించి, ఒక పోరి చూసిన పచ్చని, వెచ్చని చూపు గురించి బెంగ పెట్టుకున్నాడు అరుణ్. భోరుమన్నాడు అరుణ్.  కోపగించాడు అరుణ్. మనల్ని రెచ్చగొడుతూ దుడుకుగా తనెళ్ళి పోయాడు అరుణ్.  ఎక్కడికెళ్ళాడు అరుణ్?  ఈ మనుషులు, నేల, దేశం, ఖండం, మొత్తం భూమి, ఈ సౌరకుటుంబం, ఈ పాలపుంత చాలక అంతరిక్షంలో మన పొరుగున వున్న గెలాక్సీ “ఆండ్రొమెడా”ని కూడా ప్రేమించిన అరుణ్ తన పుస్తకాలన్నీ “ఆండ్రొమెడా ప్రచురణలు” కింద ముద్రించి మురిసిపోయాడు. బహుశ అక్కడ సేద తీరుతున్నాడేమో!

సమాజానికి అతనో మేధావి, కవి, కాలమిస్ట్, జర్నలిస్ట్ కావొచ్చు.  అతని పరిచయస్థులకు మాత్రం అతనో గొప్ప మానవీయ వనరు.  అద్భుత స్నేహశీలి.  నిరాడంబరుడు.  అతనికి నేను గొప్ప ఆప్తుణ్ని కాను కానీ చాలా మంచి పరిచయం వుంది.  కవి శ్రీకాంత్ పెళ్ళిలో నాకు పరిచయం అయిన మొదటి సారి నుండి “అన్నా” అనే పిలిచే వాడు.  “మీ సంకలనం నాకెవరు ఇచ్చారో తెలుసా? త్రిపురనేని శ్రీనివాస్ ఇచ్చాడు. అది మీ కవిత్వమనే కాదు త్రిశ్రీ ఇచ్చినందుకు కూడా భద్రంగా ఉంచుకున్నాను” అంటూ చెప్పాడు.  ఆ రకంగా ఒక ఆపేక్ష బంధం ఏర్పడింది అతనితో.  మధ్యలో చాలా గ్యాప్ వచ్చినప్పటికీ ఈ మధ్యకాలంలో ఆవిష్కరణ సభలు, సాహిత్య సమావేశాల్లో తరుచూ కలిసాను.

చివరిసారిగా మొన్న జనవరి 24న తెలుగు యూనివర్శిటీలో కలిసాను.  అప్పుడే “అన్న అరణ్యకృష్ణకు” అంటూ రాసి “మ్యుజిక్ డైస్” ఇచ్చాడు.  అరుణ్ ఎప్పుడూ ఒంటరిగా ఉండడు.  చుట్టూ పెద్ద స్నేహబృందం ఉంటుంది.  ఒక టీవీ చానెల్కి సీయీవో స్థాయిలో వున్నా ఎక్కడా ఆ దర్పం కనిపించనిచ్చేవాడు కాదు. సాహిత్య సమావేశాల తర్వాత ప్రెస్ క్లబ్ కి తీసుకెళ్ళి అక్కడ ముచ్చట్లు పెట్టేవాడు.  అటువంటి ఆత్మీయ జ్ఞాపకాలు నాబోటి మిత్రులెందరికో పంచాడు.  వాళ్ళ ఆఫీసుకి రమ్మంటే ఒకసారి వెళ్ళాను.  నేనో మామూలు గుమస్తాని.  సాంఘికంగా నాకంటే ఎన్నో రెట్ల పరపతి ఉన్న పొజిషన్లో వున్నా ఎక్కడా అది కనిపించలేదు.  చాలా సహజంగా వుండేవాడు.  వాళ్ళాఫీసులో కాసేపు కూర్చొని తిరిగి వెళ్ళిపోతుంటే కింద దాకా వచ్చి సాగనంపాడు.  ఎంతమందికుంటుంది అంతటి డీక్లాసిఫైడ్ ప్రవర్తన, నిరాడంబరత?  అరుణ్, నువ్వు నీ సాహిత్యాన్నే కాదు ఒక ప్రవర్తనని కూడా ఇచ్చి వెళ్ళావు.

ఇంక ఆపేస్తున్నాను.  నీ కడపటి చూపు కోసం వెళ్తున్నాను. నిన్ను కడసారి చూసాక నేనీ నాలుగు ముక్కలు కూడా రాయలేనేమో! అందుకే ఇప్పుడే హడావిడి పడుతున్నాను. క్షమించు అరుణ్, ఇంతకు మించి ఏమీ చెప్పలేకపోతున్నందుకు.

“పుష్ప విలాపమో, బతుకు విషాదమో నీ జనమే పోరాడుతున్న చోటా కనీసం గొంతైనా కలపకపోవటం నేరం! కవిత ఆచరణకు సాటిరాదు.  అయితేగియితే ఒక సహానుభూతి. ఒక మద్దతు ప్రకటన. ఒక విధాన అనుసరణ.  ఒక ధైర్యవచనం.  ఒక నినాద రచన. ఇది మరణిస్తున్న పాటని చూసి వ్యధ లోతుల్లోకి కూరుకుపోతున్న హృదయం. ఇది మరణవాంగ్మూలం వినిపించడం మాత్రమే.  మిలార్డ్!  ఆపై రేలపాట ఫీనిక్స్ వలె ఆకాశం నుండి మళ్ళీ ధ్వనిస్తుంది. దిక్కులు పిక్కటిల్లి దేహాలు దద్దరిల్లి జలాశయం గజగజ వణుకుతుంది. ఎప్పుడో ఒకప్పుడు అభివృద్ధి నమూనా మిమ్మల్ని కూడా ముంచేస్తుంది. గోదాట్లో కలిసిపోతారొరేయ్. ఇది డెత్ సెంటెన్స్.” (అరుణ్ సాగర్ “మ్యుజిక్ డైస్” కి రాసుకున్న ముందుమాట నుండి)

*

 

మీ మాటలు

  1. Great personality. No words to describe

  2. Rajendra Prasad, says:

    ఫెంటాస్టిక్ ట్రిబ్యూట్ అరుణ్ గారికి
    >>>

  3. We lost a different and powerful writer, above all a great friend. He wrote in his own daring style. Mixing of local language dialects is wonderful. No one is his substitute.

  4. mohan.ravipati says:

    నేను చివరిసారిగా మీతో పాటే తెలుగు యూనివర్శిటీలోనే కలిశాను. అయన “మ్యూజిక్ డైస్ ” అయన చేతి మీదుగా అరుణాక్షారాలతోనే అందుకున్నాను. “సార్ ! నేను నా పొయెట్రీ బుక్ వేద్దామనుకుంటున్నాను సార్, మీరు ముందు మాట రాయాగలరా “అని అడిగితే , ఎప్పటికి గుండెల మీద ముద్ర వేసి అయన స్టెయిల్ లో ఒక అంగీకార మందహాసం చేశాడు. నా దురదృష్టం ….

  5. గ్రేట్ సిన్సియర్ ట్రిబ్యూట్, అరణ్య కృష్ణ!
    అతడొక మరుపు రాని మనిషి. మనతోనే ఉంటాడు ఎప్పటికీ.
    .

  6. గ్రేట్ ట్రిబ్యూట్ సోదరా. ఇలాంటివి చదివినపుడు ఆ వ్యక్తిపై గౌరవం, ప్రేమ మరింత పెరిగిపోతూంటాయి. మనల్ని మనమే ఓదార్చుకోవాల్సిన సందర్భమిది.

  7. Kalyani SJ says:

    ఆత్మీయమైన వీడ్కోలు అరణ్య కృష్ణ గారూ! అయన నిరాడంబర వ్యక్తిత్వాన్ని గురించి చెప్పినందుకు ధన్యవాదాలు…

    బాహుబలి కి సంబంధించిన వ్యాసం చదివి ఎవరీ అరుణ్ సాగర్ అని నిర్ఘాంతపోయాను…ఒక సినీమాకు సంబంధించి అంత సీరియస్ థాట్ ప్రొవొకింగ్ ఆర్టికల్ రాయవచ్చని నేనేనాడూ ఊహించలేదు …అప్పటినుండీ అయన పోస్ట్లు చదువుతూనే ఉన్నాను …మొన్నటికి మొన్న కుక్క పేరు తో ఆయన కొట్టిన చెప్పుదెబ్బలు చదివి ఆనందం తో చప్పట్లు కొట్టుకున్నాను…ఎంతమందికో చదివి వినిపించాను.
    ఇలా మీ అందరి జ్ఞాపకాలతో ఆయన్ను తెలుసుకుంటున్నాను… ఆయన మరణం మనందరికీ పెద్ద లోటు …

  8. అరణ్యకృష్ణగారూ,

    నిక్కచ్చిగా, నిజాయితీగా, దేశంగా పిలవబడే ప్రజలమీద నిజమైన మమకారంతో, చివరిదాకా ఆలోచించిన అరుణ్ సాగర్ గురించి, అంతే నిజాయితీగా, మనసుని స్పృశిస్తూ వ్రాసిన గొప్ప నివాళి.
    “తీరని లోటు” అంటూ చాలామంది విషయంలో మర్యాదకి అంటుంటాం గాని, అరుణ్ సాగర్ విషయంలో అక్షరాలా నిజం.
    మీకు నా హృదయపూర్వక అభినందనలు

  9. Nagabhushanam Dasari says:

    వ్యక్తిగా, సన్నిహితుడిగా వారితో అనుబంధమున్నవాళ్లు అదృష్టవంతులు. వారితో పరిచయం లేకపోయినప్పటికిని అక్షర పదబంధాలతో ఆయన వ్యక్త పరచిన భావ పరంపరకు ఆయన వాస్తవ పరిస్థితుల్లోకి పరాకాయ ప్రవేశం చేసి పెనవెసుకుని దాంట్లో నిండా మునిగి అనుభవించితే గాని అంతటి విస్ఫోటన శక్తి వాటికి ఉండదు. గుండెలోతుల్లోంచి వచ్చిన అక్షరాలకు ఎప్పటికీ చావుండదు. భవిష్యత్ వాణిగా ఆయన పుస్తకం “మ్యూసిక్ డైస్” ముందుమాటలొ వ్యక్తపర్చిన అభిప్రాయం ” ఎప్పుడో ఒకప్పుడు అభివృద్ధినమూనా మిమ్మల్ని కూడా మంచేస్తుంది. గోదాట్లో కలసిపోతారొరేయ్. ఇది డెత్ సెంటెన్స్”. ఇది 100% నిజం అవుతుందనిపిస్తుంది. ప్రకృతిని ఎదిరించి వినాశనాన్ని సృషించినవాడెప్పుడూ బ్రతికి బట్టకట్టడం సాద్యంకాదన్నది పచ్చి నిజం. వారికి నివాళులర్పిస్తూ…
    నాగభూషణం దాసరి.

  10. గోదాట్లో కలిసిపోతారొరేయ్. ఇది డెత్ సెంటెన్స్.

  11. మిలార్డ్! ఆపై రేలపాట ఫీనిక్స్ వలె ఆకాశం నుండి మళ్ళీ ధ్వనిస్తుంది. దిక్కులు పిక్కటిల్లి దేహాలు దద్దరిల్లి జలాశయం గజగజ వణుకుతుంది. ఎప్పుడో ఒకప్పుడు అభివృద్ధి నమూనా మిమ్మల్ని కూడా ముంచేస్తుంది. గోదాట్లో కలిసిపోతారొరేయ్. ఇది డెత్ సెంటెన్స్.” ఇలా మనల్ని హెచ్చరించి తన పాలపుంతకు చేరుకున్న ఎర్ర సముద్రానికి జోహార్లు..

  12. చావును పక్కన పెట్టుకుని ఏ జంకూ గొంకూ లేకుండా, అంతగా కాలరెగరేసుకుని తిరిగిన వాణ్ణి ఇంకొకన్ని చూసుండం…..
    We miss you అరుణ్!

  13. Aranya Krishna says:

    మిత్రులందరికీ ధన్యవాదాలు.

  14. కె.కె. రామయ్య says:

    అమరవీరుల స్తూపం ముందు ఎగురుతున్న ఎర్రజెండాకి పిడికిలెత్తిన లాల్ సలాం అరుణ్ సాగర్ కి జోహార్లు..

  15. మంచి పరిచయం మంచి కవిత

  16. sadlapalle chidambarareddy says:

    అరణ్యక్రిష్ట్నగారూ ఈ ఫెస్బుక్కులొనికి వచ్చాక కనిపించిన అద్భుత వ్యక్తీ అరుణ్ గారు. వారి కవిత్వం చదువుతుంటే నా గుండెలు మరిగేవి.ఇప్పుడు మీద్వారా ఆటను నాలాగే పుట్టుకతో ఉపిరితిత్తుల జబ్బు మనిషి అని తెలిసి నిజంగా హృదయం ద్రవించింది.

  17. Sreenivaasu Gaddapati says:

    మిస్ యు అరుణ్ భయ్యా

మీ మాటలు

*