పుస్తక ప్రేమికులకు రోహిత్ కాన్క!

 

ఈ  వాలంటైన్ డే  రోహిత్  ఒక కొత్త ప్రేమ సందర్భాన్ని ఆవిష్కరిస్తున్నాడు. ఈ ప్రేమ పేరు: పుస్తక పఠనం!

పుస్తక ప్రేమికులకు అతను ఇస్తున్న కాన్క పేరు: అనతపురం పబ్లిక్ లైబ్రరీ!

“సమయమే లేదు..” అన్న  మాట  ఎక్కువగా వింటాం ఈ కాలంలో! కాలాన్ని డబ్బుతో లెక్కించే  ఇప్పటి పరిస్థితిలో  ఒక వ్యక్తి అదనంగా సమయాన్ని సృష్టించుకొని, ఒక పని మీద దాన్ని కేటాయించడం – ఆ వ్యక్తిలోని తపనకి సాక్ష్యం! ఎవరికి వాళ్ళం  పుస్తకాలు చదువుకోవడం, మన ఇండ్లలో దాచుకోవడం మంచి అలవాటే. కాని, చదివిన పుస్తకాన్ని నలుగురికీ అందించాలనుకుంటే అది తపన. చదువు అనే భావనకి  సార్ధకత సాధించాలనే అన్వేషణ.

అనంతపురంలాంటి చోట పుస్తకం దొరకడం కష్టం. అదీ ఇంగ్లీషు పుస్తకం ఇక చెప్పక్కర్లేదు. పుస్తకాల కోసం మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళే తపన వున్నవాళ్ళు ఈ జిల్లాలో వున్నారు. అలాంటి వారి కోసం కవి, అనువాదకుడు రోహిత్ ఒక సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు- తన సొంత డబ్బుతో , ఏర్పాట్లతో  లైబ్రరీ పెట్టడం!

సొంత లైబ్రరీలు వుండడం పెద్ద విశేషం కాదు. కాని, ఆ సొంతం అనే భావన వదులుకొని, దాన్ని పబ్లిక్ లైబ్రరీగా మార్చడం రోహిత్ లాంటి సాహసికులు మాత్రమే చేయగలరు. ఈ లైబ్రరీ ఈ 14 న ప్రారంభమవుతోంది. ఆంద్ర లో మొదటి సారిగా  ఈ ప్రయోగానికి నాంది పలికిన రోహిత్ తో ముఖాముఖి.

 

library2

రోహిత్,  లైబ్రరీ పెట్టాలని ఆలోచన ఎందుకొచ్చింది

గత ఇరవై-ముప్పయ్ సంవత్సరాలుగా పుస్తకాలు సేకరిస్తూ వచ్చాము. అత్యంత అరుదైన పుస్తకాలన్ని అతి కష్టం మీద సంపాదించాము. అలాంటి పుస్తకాలు అందరికీ అందుబాటులోకి రావాలంటే లైబ్రరీ అవసరమని భావించాము . ఉర్సుల లె గ్వయ్న్ అన్నట్టు పుస్తకాలు ఏ ఒక్కరి సొత్తూ కాదు. అవి అందరికీ అందుబాటులో ఉంచాలి (It(the joy of reading books) must not be “privatised,” made into another privilege for the privileged…. It must be available to all who need it.). ఈ ఆలోచనే మా లైబ్రరీ కి అంతరాత్మ.

ఇక్కడ మరొక ఆసక్తికరమైన సంఘటన చెప్పుకోవాలి. ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఓ ఆదివారం నాడు అనంతపురం లో మా నాన్న – పాత పుస్తకాలు అమ్మే చోట ఓ కుప్పగా (వంద పుస్తకాలు పైచిలుకు) పుస్తకాలు పడిఉండటం చూసాడు. అవన్నీ ఎంతో ఆసక్తికరమైన, అరుదైన రష్యన్ పుస్తకాలు. మార్క్స్ నుండి లెనిన్ దాక, డోస్టొవెస్కి నుండి మయకొవిస్కి దాక అనేక పుస్తకాలు ఉన్నాయట. వాటన్నిటినీ కొని ఇంటికి తెచ్చాడు. ఆ పుస్తకాలన్నిటికీ మొదటి పేజీ లో ‘భైరవప్ప’ అనే సంతకం ఉంది. అనంతపురం లాంటి చోట ఇలాంటి పుస్తకాలు కొన్న ఈ భైరవప్ప  ఎవరబ్బా అని కొంచం కుతూహలం మొదలయ్యిందట. తర్వాత్తర్వాత కొన్ని రోజులయ్యాక ‘విశాలాంధ్ర బుక్ హౌస్’ దగ్గర ఎవరో భైరవప్ప గురించి మాట్లడుతుండటం విని – ఇంతకూ ఎవరతను అని అడిగాడట. అప్పుడు తెలిసింది.

భైరవప్ప రెజిస్ట్రార్ ఆఫీసులో పని చేసే వాడట. ఆయనకు పుస్తకాలంటే పిచ్చి. జీవితాంతం పుస్తకాలు కొంటూనే ఉన్నాడు. ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఎప్పుడూ ఆయన విపరీతంగా పుస్తకాలు కొనేవాడని విసుక్కునేవారట. పుస్తకాలకు తన ఇంట్లో స్థలం సరిపోక ఇంకొక గదిని అద్దెకి తీసుకొని ఆ గదిలో కూడా పుస్తకాలని నింపేసాడు అట. చివరికి అందరి లాగనే ఆయన కూడా ఒక రోజు చనిపోయాడు. అప్పుడు  ఆయన భార్య ఒక్క సారి నిట్టూర్చి ఆ పుస్తకాలన్నీ గుజిరీకి వేసి అమ్మేసిందట.

భైరవప్ప లాంటి పుస్తకప్రేమికులెందరో జీవితాంతం ఇష్టం గా, ఆత్మీయంగా పుస్తకాలను సేకరించి ఉంటారు. అలాంటి పుస్తకాలన్ని చివరకు చేరటానికి అందరికీ అనువుగా, విశ్వజనీయంగా- ఉండే ఒక చోటు ఉంటె బాగుంటుందని- ఈ లైబ్రరీ ని ప్రారంభించదలిచాము.

rohit1

 

లైబ్రరీ కి అనంతపురం ఎందుకు సెంటర్

గత ముప్పయ్ సంవత్సరాలుగా అనంతపురంలో నే మేము నివాసమున్నాము. అనంతపురం లాంటి వెనకబడ్డ జిల్లాలో స్వేచ్చాయుతంగా ఆలోచనలు బయటపెట్టటానికి ఒక ప్రదేశం అవసరం ఎంతగానో ఉంది. సమాజం గ్లోబలైజేషన్ గొడవలో  కొట్టుకుపోతున్న తరుణంలో, కార్పొరేట్ సంస్థలు ప్రతీదానికీ ఓ విలువకట్టి అమ్మటానికి పొంచిచూస్తున్న సందర్భంలో – ఉచితంగా సమాచారం, జ్ఞానం అందరికి అందుబాటులొ ఉంచటం తక్షణం చేయవలిసిన కార్యం అని తలచాము.అందుకుగాను మాకు అనువుగా ఉన్న ఓ చిన్న స్థలం ఎంచుకొని, అక్కడ పుస్తకాలన్నీ సముపార్జించి తదనుగునంగా వేరు వేరు కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాము. ఈ ప్రయత్నం ద్వారా వివిధ రకాల భావాలున్నవారందరూ ఒక చోటికి చేరి పరస్పరం జ్ఞానాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తున్నాం.

 

పుస్తకాలు ఎలా సేకరించారు

మాకు వివిధ విషయాల్లో అభిరుచులు ఉండటం చేత ఆయా అంశాలకు సంబంధించి అనేక పుస్తకాలను పోగు చేయగలిగాము. ఇవే కాక బయట నుండి కుడా ఎవరైనా స్వచ్చందంగా పుస్తకాలు ఇవ్వటాన్ని ఆహ్వానించాము. ప్రపంచం నలుమూలల నుండీ మా లైబ్రరీ కి పుస్తకాలు పంపించటానికి ఇప్పటీకే  ఎందరో మమ్మల్ని కాంటేక్ట్ చేసారు. ముఖ్యంగా సాహిత్యం, చరిత్ర, తత్వ శాస్త్రం, జీవిత చరిత్రలు తదితర  విభాగాలకి సంబంధించి ఈ పాటికే  మా దగ్గర ఓ 2500-3000 పుస్తకాలు ఉంటాయి. పుస్తకాల పై మక్కువ ఉండి – ఒక పట్టున చదవాలి అనుకునే వాళ్ళకు ఈ లైబ్రరీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి

పాశ్చాత్య సాహిత్యం, సైన్స్ ఫిక్షన్, తెలుగు, ఇంగ్లీష్ నవలలు, క్లాసిక్స్, ఫిలాసఫీ, చరిత్ర, పిల్లల పుస్తలాలు, మార్క్సిస్టు సాహిత్యం, అర్థశాస్త్రం, కవిత్వం, జీవిత చరిత్రలు- మొదలగు అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి.

పుస్తకాలు మాత్రమేనా వేరే కార్యక్రమాలు కూడా చేస్తారా

నెలకొక సందర్భం పురస్కరించుకొని మిత్రులూ,పుస్తక ప్రియులూ కలిసేందుకు కార్యక్రమాలు ఏర్పాటు చేయదలిచాము.కవిత్వ పఠనం,పుస్తక సమీక్షలు,సాహిత్య సమాలోచనలు,సినిమా ప్రదర్శన మొదలగు ఎన్నో విధాలుగా అందరినీ కలపాలని మా ఆలోచన. ఫిబ్రవరీ 14 న లైబ్రరీ ప్రారంభం సందర్భంగా “కోర్ట్” అనే మరాఠీ సినిమా ప్రదర్శించదలిచాము.

ఈ లైబ్రరీ కార్యక్రమం వల్ల మీరు కవిత్వం రాయటం తగ్గిపోతుందనుకుంటున్నారా?

నేను అలా భావించను. లెనార్డ్ కోఎన్  అనే కవీ అన్నట్టు “కవిత్వం జీవితానికి రుజువు. జీవితం బాగ మండితే, దాని బూడిదే కవిత్వం అవుతుంది.” (Poetry is just the evidence of life. If your life is burning well, poetry is just the ash. -Leonard Cohen)  జీవితం ఎంత వైవిధ్య భరితంగా ఉంటే కవిత్వం అంత నూతనంగా, నవీనంగా ఉంటుంది. లైబ్రరీ కోసం పని చేసేటప్పుడు -పుస్తకాలు సద్దటం, పుస్తకాలని సరైన క్రమం లో అమర్చటం అన్న ప్రక్రియకీ , అక్షరాలనూ ఆలోచనలను సరైన క్రమంలో అమరుస్తూ కవిత్వం రాయటం అనే ప్రక్రియకీ ఎక్కడో పోలిక ఉన్నట్టు అనిపిస్తుంది.  “కుక్క పిల్ల అగ్గి పుల్ల సబ్బు బిబిళ్ళ” లో కూడా కవిత్వం ఉంటుంది అనుకున్నప్పుడు- లైబ్రరీలో కవిత్వం ఉండదంటారా?

*

మీ మాటలు

 1. Mohammad Nazeeruddin says:

  Hatsup to రోహిత్. ఒక మంచి పనికి అందరి సపోర్ట్ ఉంటుంది. కీప్ it అప్ రోహిత్ గారు మీకు నా శుభాకాంక్షలు. భగవంతుడు ఒక మంచిపనికి తోడ్పాటు అందించుగాక! శుభమ్.

 2. Very good rohit garu, please think if you can accept books as contributions?

 3. Prof P C Narasimha Reddy Ph D says:

  We are rather apprehensive of people visiting libraries in these days of fast life. However they can be attracted through exhibiting art film shows, group discussions, interviews, book releases,writers meet and lecture programmes. Lending books home will be tiresome and risky proposition. Literary journals can also be placed to know the contemporary literary scene. We look forward for the launching of this unique library in a hassle free Anantapuram our best wishes in advance!
  Prof P C Narasimha Reddy

  • అవన్నీ చేస్తున్నాం! ఫిబ్ravari 14 న కోర్ట్ అనే మరాఠి sinimA స్క్రీన్ చేయబోతున్నాం

   • నరేందర్ దేవులపల్లి. says:

    నా పేరు నరేందర్ దేవులపల్లి. నేను మీ లైబ్రరి గురించి ప్రచురించాలి అనుకుంటున్నాను.మీ నెంబర్ ఇస్తార. నాకు పుస్తకు, రచయితలు, రచనలు అంటే ప్రాణం. నాకు మీలాగే పుస్తకాలు సేకరించే అలవాటు ఉంది. మిగతా వివరాలు నేను ఫోన్ లో మాట్లాడతాను. నా మెయిల్ ఐడి : telugufoxceo@gmail.com

 4. Anil battula says:

  వావ్..awesome రోహిత్ …కీప్ ఇట్ అప్…

 5. ప్రసాద్ చరసాల says:

  చాలా మంచి పని. అభినందనలు.
  లైబ్రరీ అందుబాటులో వుంటే ఎన్ని జీవితాలు బాగుపడతాయో! ఈ మధ్యనే ఇక్కడ ఒకాయన కేవలం లైబ్రరీకి వెళ్ళి చదువుకొని plumbing నేర్చుకొని జీవితంలో స్థిరపడటం గురించి తెలుసుకున్నా.
  ఎక్కడ చూసినా McDonalds వుంటాయని అనుకుంటాం గానీ, అమెరికాలో McDonalds కంటే లైబ్రరీలే ఎక్కువట!

 6. Mamatha . K says:

  Awesome!!! Rohith. Great going!!

 7. Mani Vadlamani says:

  Ro Hith Lovely gift All the best

 8. భలే రోహిత్, రియల్లీ గ్రేట్. కంగ్రాట్స్.

 9. చొప్ప వీరభధ్రప్ప says:

  రోహిత్ గారూ, మీ ఆలోచన చాలా గొప్పది.విజ్ఞాన కేంద్రంగా ఎందరికో జ్ఞానదాహాన్ని తీర్చగరదని ఆకాంక్ష.

 10. రోహిత్ గారు చాలా మంచి పని చేస్తున్నారు . నేను కూడా 6,000 కు పైగా పుస్తకాలు సేకరించాను . సన్నిహిత మిత్రులకు చదవడానికి ఇవ్వడం , వారితో అభిప్రాయాలు పంచుకోవడం చేస్తున్నానుగాని , ఒక గ్రంధాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచన రాలేదు . ALL THE BEST ROHIT GAARU .

 11. Aranya Krishna says:

  రో! కంగ్రాట్స్! ప్రేమికుల దినాన పుస్తక ప్రేమికులకు మీరిస్తున్న పుస్తక చుంబనం మధురంగా ఉంది. మనుషుల్ని నమ్మి భంగపడతాం కానీ పుస్తకాన్ని నమ్మి గాయపడ్డ వాడు లేడు. పుస్తకపఠనం పతనావస్థలో ఉన్నట్లనిపిస్తుంది కానీ స్పృహ తప్పించే యాంత్రికతలో అది మొహం మీద నీళ్ళు చల్లటం లాంటిదని తొందరగా తెలిసిపోతుందిలే. రేడియో పునరుతానం చెందలేదూ? భూమ్మీద విత్తనాలు, మనుషులు ఉన్నంత కాలం పుస్తకానికేమీ ఢోకా లేదు.

 12. balasudhakarmouli says:

  గ్రేట్ రోహిత్ !

 13. Indus Martin says:

  Hey Ro Hith , kudos boy! Love u for this wonderful gesture of love for people. Pls keep updating the happenings . we will see you soon in your library .

 14. KiranKumar Satyavolu says:

  Rohit bhayya,
  You did an excellent job. Keep going. It is really inspiring. all the best bhayya :-)

 15. మళ్ళి మత మౌధ్యం చీకట్లు చిమ్ముతున్న వేళ అభ్యుదయ సాహిత్య దివ్వెల ఓ చోట చేర్చి వెలుగుల అందించాలన్న నీ ప్రయత్నమే ఓ గొప్ప విజయం. నిన్ను మనసారా అభినందిస్తున్నాను.

 16. అనంతపూర్లో ఇ గ్రంధాలయం ఎక్కడ ఉంది ?

  • anantapuram ప్రజా vaidya శాల వెనకాల
   sangamesh నగర్ లో – మీకు దారి తెలియకపోతే ఈ నంబర్ కి కాల్ చేయండి – 9502766182

 17. యం.ప్రగతి says:

  అభినందనలు రోహిత్!

 18. సాయి.గోరంట్ల says:

  వెరీ గుడ్ రోహిత్
  చాలా మంచి పని అదీ అనంతపురంలాంటి వెనుకపడ్డ జిల్లాలో.గత వారం మీ నాన్న గారిని కలిసినపుడు ఇదే విషయం నాతో అన్నారు.
  లైబ్రరీని స్టార్ట్ చేస్తున్నాం అని
  కీప్ ఇట్ అప్ రోహిత్👌👌

 19. Rajaram thumucharla says:

  మీ గ్రంధాలయానికి నా దగ్గరున్న బుక్స్ ఇవ్వొచ్చా.నీ అభిలాషకీ నా అభినందనలు.జీవితాన్ని మండించుకోవడం అందరు ఎప్పుడిష్టపడతారో.

 20. shanti prabodha says:

  మంచి పని. అభినందనలు రోహిత్ . తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ గ్రంధాలయోద్యమం మొగ్గ తొడుగుతోందన్న మాట. తెలంగాణాలో కవి యాకూబ్ , స్కై బాబా గ్రంధాలయాలు ప్రారంభిస్తే, షేక్ సాదిక్ అలీ పెద్ద కార్యక్రమం నెత్తినేసుకుని తోపుడు బండి తో పల్లెపల్లె నా తిరుగుతున్నాడు. ఈ మధ్య వివిధ సందర్భాల్లో కలసిన యువకులు తమ తమ గ్రామాల్లో గ్రంధాలయం ప్రారంభించబోతున్నాం పుస్తకాలు సేకరిస్తున్నామని చెప్పారు. శుభ పరిణామం

 21. b.ramnarayana says:

  బ్రేవో రోహిత్ ! గో ఎహెడ్ .

 22. Maruthi, kurnool says:

  రోహిత్
  మంచి ప్రయతం చేస్తున్నందుకు అభినందనలు. రాయలసీమ సాహిత్యం మీద ద్రుష్టి పెట్టండి. ప్రాచీన రాయలసీమ సాహిత్యం పై తగినంత కృషి జరగడం లేదు.

 23. రొహిత్ అభినందనలు.. ..

 24. అతి ప్రేమతో దాచుకున్న పుస్తకం ఒక్కటి మిగల లేదు . ఇలా పంచుకుంటే నైనా పది కాలాలు చేతిలో నిలుస్తాయేమో. పదిమంది కోసం అంటే మరింత భాద్యత గా జాగ్రతగా పుస్తకాలని కాపడుకోగలమేమో. మంచి ప్రయత్నం. ఇది ఒక జాతరలా అందర్నీ ముంచెత్తు తుందేమో. రోహిత్ పుస్తకభినందనలు.

మీ మాటలు

*