ఒక్కడు కాదు  –  ఇద్దరు!

 

 

(మహా రచయిత, డాక్టర్ కేశవరెడ్డి చనిపోయి ఫిబ్రవరి 13 కి  సంవత్సరం కావస్తున్న తరుణంలో   కేశవరెడ్డి గారి మిత్రులు హైదరబాద్ స్టడీ సర్కిల్, దోమల్ గూడ, హైదరబాద్ లో ఆ రోజు  సాయంత్రం సమావేశమవుతున్నారు. ఈ సంధర్భంగా కేశవరెడ్డి లోని అన్ని కోణాలు తెల్సిన ఆయన ఆప్త మిత్రులు, అంబటి సురేంద్ర రాజు (అసుర)ని  ‘ఛాయ’ సంస్థ తరుఫున కృష్ణ మోహన్ బాబు పలకరించారు.  ఆ మాటల ముచ్చట్లు ఇవి.)

 

కేశవరెడ్డి గారి చాలా పుస్తకాలకి వెనుక మాటల్లో మీరు ఉన్నారు.  అసలు కేశవరెడ్డి గారికి, మీకు పరిచయం ఎలా జరిగింది? ఇన్ని సార్లు వెనుక మాటలు రాయడం ఎలా సాధ్యమయ్యింది?

కేశవ రెడ్డి  గారిని 1979 నుంచి నేనెరుగుదును.  ఎమ్మే ఫిలాసఫీ  చదువుతున్న రోజులలో నా రూమ్ మేట్ అతిధి గా ఆయన మా గదికి ఆ రాత్రి ఉండడానికి వచ్చారు.  అప్పటికి ఆయన, ‘ఇంక్రెడిబుల్ గాడెస్’ అచ్చయ్యింది.  చలం గారు, కృష్ణ శాస్త్రి, కుటుంబ రావు లాంటి పెద్దలు బతికున్న రోజులు.  ఆ రాత్రి తెల్లారే దాకా నాకు, కేశవరెడ్డి గార్కి మధ్య మాటల యుద్ధమే జరిగింది.  తక్షణ కారణం త్రిపుర నేని మధుసూధన రావు ‘ముందు మాట’ అంటూ రాసిన చెత్త చెదారం. కేశవరెడ్డి గార్కి ఆయన అంటే మహా ప్రీతి, భక్తి.  అందుకనే అడిగి మరీ రాయించుకున్నారు.  ఆనాడు నా బాధేంటంటే ముందు మాట రాసిన పెద్ద మనిషికి ‘అర్జున రెడ్డి’ పాత్ర అర్ధం కాకపోవటం.  ఆ పాత్ర అర్ధం కాకపోతే, కేశవ రెడ్డీ అర్ధం కాడు.  ఆ సహ అనుభూతి (empathy) లేనివాడు ముందు మాట రాయడమేంటి? అదే అడిగా కేశవరెడ్డి ని.  ఆ ముందు మాటలో నవల గురించి ఒక్క మాట కూడా లేకపోవటమే కాదు, అదే అదనుగా తన సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని వాంతి చేసుకున్నాడు.  నా మాటలు కేశవరెడ్డి గార్కి రుచించ లేదు.   ఆయన కోపంతో విశ్వ రూపం చూపించాడు.  ఆ రోజు మధుసూధన రావు, మార్క్సిజం, సిధ్ద్ధాంతమ్, ఆచరణ అన్ని అంశాలు మా మధ్య చోటు చేసుకున్నాయి.  తర్వాతి కాలంలో కేశవరెడ్డి గారితో మంచి స్నేహం ఏర్పడింది.  నాకు ఆయన రచనలంటే చాలా ఇష్టం.  అందుకే ఆ ముందు మాట మీద అంత ఘర్షణ జరిగింది.  ఆ సంఘటన తర్వాత ఎంత కలవాలనుకున్నా, 1996 దాకా ఆయన్ను మళ్ళీ కలవటం జరగ లేదు.  కారణం ఆయన హైదరబాదు రాడు, నా పాత్రికేయ వృత్తి పని ఒత్తిడి వల్ల నేను డిచ్ పల్లి వెళ్ళటం కుదరలేదు.  ఈ మధ్యలో ‘శ్మశానం దున్నేరు, అతను అడవిని జయించాడు, రాముడుండాడు-రాజ్యముండాది, సిటీ బ్యూటీఫుల్’ నవలలొచ్చాయి.  కాండ్రేగుల నాగేశ్వర్రావు గారు పాత పుస్తకాలను మళ్ళీ వేస్తూ, కొత్త పుస్తకాలు, ‘మూగవాని పిల్లనగ్రోవి, చివరి గుడిసె’ లకి పరిచయాలు  రాయమన్నారు.  నా ఈ పరిచయాలు  చూశాక, తన నవల లన్నింటికి రాయమని కేశవరెడ్డి గారు కోరినా, కారణాంతాల వల్ల వీలు పడలేదు.  అలా కేశవరెడ్డి గారు నాకు మరింత దగ్గరయ్యారు.   మనల్ని విడిచి పోయే దాకా ఆయన నాతో మాట్లాడని రోజు లేదు.

మరైతే సంజీవ్ దేవ్ గారి ముందు మాట సరైనదేనా?

మధుసూధన రావుది ఎంత అసంబద్ధమో , ఇది కూడా అంతే అసంబద్ధం.   విషయం ఏం లేదు.

ఒక్క ‘సిటీ బ్యూటీఫుల్’ తప్ప మిగిలిన నవలలన్నిటి కథా కాలం 1900 – 45 మధ్యలో ఉంటుంది.  అది కూడా సూచనప్రాయంగా మాత్రమే తెలుస్తుంది.  దీనికేదైనా బలమైన కారణముందా? లేకపోతే ఆ తర్వాతి కాలంలో ఈ వాతావరణం అంతగా లేదనుకున్నారా?

వాతావరణం లేదని కాదు, వీటి మూలాలు ఆ కాలం లో ప్రస్ఫుటంగా ఉన్నాయని ఆయన ఉద్దేశ్యం.  1950 కి ముందు క్లాసికల్ ఫ్యూడలిజమ్ బలంగా ఉంది.  అదొక vantage పాయంట్ గా తీసుకుంటే వర్తమానాన్ని స్పష్టంగా చూసి అర్ధం చేసుకోవడం సాధ్యమవుతుంది. అలాగే మీరు ఇంకో విషయం గమనిస్తే, ఆయన రాసిన ఏ కథ అయినా తను పుట్టి, పెరిగిన చిత్తూరు జిల్లా ఎల్లలు దాటవు.  మిగతా చోట్ల అలాంటివి లేవని కాదు.  తను స్వయంగా చూసిన వాస్తవిక పరిస్థుల చిత్రణ అది.

asura

 ‘మూగవాని పిల్లనగ్రోవి, చివరి గుడిసె, మునెమ్మ’ లలో అంటే, చివరి నవలల్లోనే మీరనే పొయిటిక్ జస్టిస్ ఉంటుంది.  అంతకు ముందు లేని ఈ ప్రక్రియ వీటిలోనే ఎందుకు ఉంది? దీనికి  ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?

వాస్తవికతకి, చారిత్రకంగా ఒక సామాజిక సంక్షోభ సందర్భాన్ని పొదివి పట్టుకొని, పరిశీలించి, పరిష్కరించే శక్తి యింకా సాధించలేదు. ఈ పరిస్థితులలో రచయిత మానవేతర శక్తులతో న్యాయాన్ని సాధించాలనే లక్ష్యంతో, కాల్పనీకతను జోడించి, పరిష్కారాన్ని సూత్రప్రాయంగా చెప్తాడు.  ఇంతా చేసి యిది పరిష్కారం కాదు, ప్రతి చర్యే.  ‘మూగవాని పిల్లనగ్రోవి’ నాటికి కేశవరెడ్డి గారి ఆలోచనల్లో మౌలికమైన మార్పు వచ్చింది.  అదే ఆయన రచనల్లో ప్రతిబింబించింది.  తొలి అయిదు  నవలలు రాసిన కేశవరెడ్డి, అమెరికన్ నవలా సాహిత్యంతో ప్రభావితమైతే,  ఆ తర్వాత వచ్చిన మూడు  నవలల్లో లాటిన్ అమెరికన్ సాహిత్య ప్రభావం స్పష్టంగా  చూడ చ్చు.  దీనితో కంటెంటు, ఫాము  అన్నీ  మారాయి.  ఈ పొయటిక్ జస్టిస్ కి కారణం అదే.   మరో విషయం గమనిస్తే 1986 నుంచి 1996 దాకా ఆయన రచనలు మనం చూడలేదు.  ఈ మధ్య కాలంలో ఆయన చేసిన లాటిన్ అమెరికన్ సాహిత్య సేవని ‘మూగవాని పిల్లనగ్రోవి, చివరి గుడిసె’ ల్లో మనం చూస్తాం.   అలాగే 1997 నుంచి 2007 దాకా మౌనం.  ఆ తర్వాత వచ్చిన ‘మునెమ్మ’ మళ్లీ లాటిన్ అమెరికన్ ప్రభావంతో వచ్చింది.

ఆయన రచనల్లో  ‘సిటీ బ్యూటీఫుల్’ ఒక విభిన్నవైన నవల.  అదెలా కుదిరింది?

ఆ నవల పూర్తిగా ఆయన ఆత్మ కథే.  పాండిచ్చేరిలో ఆయన వైద్య విద్యార్ధిగా గడిపిన కాలాన్ని, అనుభవాన్ని విమర్శనాత్మకంగా చిత్రిస్తే వచ్చిందే ఆ నవల.  ఇదో విధంగా పీడకల లాంటి గతాన్ని రాసి వదిలించుకోవడమే.  ఉన్నత విద్యా విధానాన్ని, ముఖ్యంగా వైద్య విద్యా విధానం మీద ఉన్న అసహ్యాన్ని ఈ నవలలో ఎత్తి చూపాడు.  ఈ విధానం తెలివైన విద్యార్ధి కోసం కాదు.  మొక్కుబడిగా, వివేచన లేకుండా చదివేవాళ్ళ కోసం మాత్రమే.  ఇది ఈ రోజు సమస్త విద్యా వ్యవస్థ లకి వర్తిస్తుంది.

కేశవరెడ్డి గారిని అంత దగ్గరగా చూశారు కదా;  ఆయన గురించి మీకున్న బలమైన అభిప్రాయమేంటి? 

రచయితగానే కాకుండా మనిషిగా కూడా ఆయన ఉన్నతుడు, సర్వ స్వతంత్రుడు.  పుట్టుకతో వచ్చిన ప్రివిలేజ్ లన్నీ వదిలి పెట్టి, మధ్య తరగతి జీవితాన్ని తోసిపారేశాడు.  తమ సామాజిక వర్గపు విద్యాధిక యువతుల్ని కాదని అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తిని పెళ్ళి చేసుకున్నాడు.  తను డాక్టర్, ఆమె నర్స్.  డాక్టర్ గా కూడా ఆయన మధ్య తరగతికి దూరంగా ఉండి, సమాజం తిరస్కరించిన నిరుపేద కుష్టు రోగులకి బంధువుగా నిల్చి ఆచరణ లో జీసస్ అయ్యాడు.  సాహిత్య సంఘాల్ని, ముఠాలని విసర్జించాడు.  వేసిన పుస్తకాల మీద హైదరాబాద్ బుక్ ట్రస్ట్  అధిపతి, గీతా రామస్వామి చిల్లర పైసలని విదిల్చినా  పల్లెత్తు మాటనలేదు.   కేశవ రెడ్డి ఒక గొప్ప డాక్టర్.  అణగారిన జీవితాల్లో వెలుగు నింపిన దార్శనికుడు.  రచయితగా ఆయన ఒకే ఒక్కడు.  అందుకే నే నంటాను ఆయన ఒక్కడు కాదు – ఇద్దరు.

***

 

మీ మాటలు

 1. నిరుపేద కుష్టు రోగులకు బంధువుగా నిలిచి ఆచరణలో జీసస్ అయ్యాడు !

 2. indra Prasad says:

  కేశవరెడ్డి ఒరవడిని సరిగ్గా పట్టుకొన్నారు.లాటిన్ అమెరికన్ సాహిత్యపు పోకడలు చిత్తూరు జిల్లా కావ్యరంగం గానూ నిజామాబాద్ కార్యరంగం గానూ కేశవరెడ్డి జీవితం ఉత్తమాదర్శమ్. అసురా తో inTarviieu బావుంది.

 3. Anil battula says:

  నైస్ ఇంటర్వ్యూ…ఎస్..ట్రూ..ఒక్కడు కాదు – ఇద్దరు!

 4. Dr G V Ratnakar says:

  కేశవరెడ్డి గారిని ఈ తరానికి పరిచయం చేసిన అన్నగారు ‘అసుర’గారికి ధన్యవాదాలు.

 5. jilukara srinivas says:

  అసుర, నిజంగా అద్భుతం. అన్నా, కేసవరెడ్డి ని మీరే సరిగా అర్థం చేసుకున్నారు. నాలాగే.

 6. chandolu chandra sekhar says:

  నేను మీ కేశవరెడ్డి గారి మిద
  మీ
  అభిప్రాయము చదివాను మాకు కేవరేడ్డిగారి రచనలు అంటే సదాభియముంది దానికి త్రిపురనేనిని తిట్టానికి వేదిక ఇదికాదు నీది త్రిపురనేని ని విమర్స్స చేసే సరుకు ని దగ్గరలేదు సురెంద్రరజుకి అంత లేదు n

 7. రా రెడ్డి says:

  కేశవరెడ్డి గార్ని సరిగ్గా ఎసెస్ చేస్తూ వస్తున్న అ.సు.రా గార్కి అభినందనలు .

మీ మాటలు

*