వేదనలోంచి మొలకెత్తిన కవిత

 

 

 

షాజహానా దర్దీ చదువుతున్నప్పుడు సమకాలీన సాహిత్య స్పృహతో మైనారిటీ వాదాన్ని మోస్తున్న బలమైన గొంతుక ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది.తన అస్తిత్వాన్ని ఆ గొంతుక ఎంతగా నొక్కి చెబుతుందో,అదే సమయంలో సమకాలీన సమాజంలోని ప్రధాన తాత్వికాంశను ఉమ్మడి చేతనలోకి తీసుకున్నారని అర్థమవుతుంది.దానికి కారణం బౌద్ధికంగా అనేక వాతావరణాలు నిండి ఉండడం.లేదా ఆ వాతావరణాల చైతన్యం ఉమ్మడిదవటం.

తెలుగులో అస్తిత్వ ఉద్యమాలు వచ్చాక సమాజాన్ని భిన్నకోణాలనుండి అంశాత్మకంగా పరిశీలించే అవకాశం కలిగింది.బహుశఃకాలిక స్పృహ వల్లనేమో..ఒక అనుశీలనలో ఈవాదాలు ధోరణులన్నీ ఉమ్మడినిర్మాణాన్ని వ్యష్టిగా కలిగి ఉన్నాయనిపిస్తుంది.ఒక ప్రాతిపదిక దశలో అన్నీ ఒక ఉమ్మడి చేతనకు లోబడడమే అందుకు కారణం.
షాజహానా కవిత్వం సుస్పష్టంగా ముస్లిం స్త్రీల వైపు నిలబడింది.అదే సమయంలో ఈ వాతావరణం చుట్టూ ఉన్న స్త్రీ వాద భూమికనూ అర్థం చేసుకోవాలి.-” చమ్కీ,అబ్‌నార్మల్ పెయిన్,జమానత్,దేశాంతర దుఃఖం”మొదలైనవన్నీ ముస్లిం స్త్రీ జీవితాన్ని మోసాయి. ఈ కవిత్వంలో వర్తమానమే అధికం.నిజానికి తెలుగులో వచ్చిన అస్తిత్వ ఉద్యమాలు గతితార్కిక సిద్ధాంతాలపై ఆధారపడ్డాయి. గతంలోని చారిత్రక అణచివేతను ప్రశ్నించాయి.చాలావరకు అస్తిత్వ వాద దార్శనికతను,ఒకింత వైప్లవిక భావనను మోస్తున్న కవిత్వాన్ని వస్తు సంబంధంగా మాత్రమే గుర్తించడం కనిపిస్తుంది.దానికి కారణం ప్రత్యేక రాజకీయ.సాంస్కృతిక,సామాజిక లక్ష్యాలుండటమే.షాజహానా స్వరం రీత్యా వర్తమానాన్ని,అస్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పటికీ,కవిత్వీకరణపై దృష్టిసారించారు.ఆమె కవితల్లో హృదయాన్ని కదిలించే బలమైన వ్యక్తీకరణలే అందుకు సాక్ష్యం.

1.ఉరుములు మెరుపులతో ఆకాశం / అచ్చం అమ్మలా బాధతో మెలితిరిగిపోతున్నప్పుడు/కుండపోతగా కన్నీరు కళ్లలోనూ పైనుంచి/గుడిసె చూరునుంచి/అబ్బా మనసునుంచి ఏకధాటిగా కన్నీళ్ళు“-(మాదిగ బుచ్చమ్మ-63పే.)

2.దుఃఖం గడ్దకట్టిన మంచు శిల్పం పై/చిక్కని చీకటి వంకర్లు తిరిగిన గిరిజాల జుట్టు“-(దేశాంతర దుఃఖం-57 పే.)
3.
కుబుసం విడవని పాముల్లా /సూర్య కాంతిలో లోహం ప్రవహిస్తున్నట్టు సన్నని గీతలుగా నదులు“-(ప్రాణవాయువు-56.పే.)
4.
రేగ్గంపలో చిక్కుకున్న ఓణీలా/ఎక్కడ తట్టుకుని ఉండిపోయాం“-(కఠ్ఠామిఠ్ఠా దోస్తానా-69)

 

 

పదిలంగా జీవన తాత్వికతను అన్వయిస్తూ,దృశ్యాలను కవిత్వం చేయడం కనిపిస్తుంది.సందర్భం,వ్యక్తి,ప్రకృతి,ఉనికి అనే అంశాలు ఈ వాక్యాల్లో కనిపిస్తాయి.మొదటిరెండువాక్యాల్లోని కళ,మూడవ వాక్యంలోని ప్రకృతి క్రియాశీలక సూత్రాన్ని కప్పేస్తున్నాయి.నాలుగవ వాక్యంలో ఈ క్రియాశీలత స్పష్టంగా ఉంది.కొన్ని పద సంయోజనాలనుంచి వేరుచేసి చూస్తే సాధారణ స్త్రీ కవితకూ ఇవి దూరం కాదు.ఆ పద సంయోజనాలే ఈ అస్తిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడుతాయి.

సాధారణంగా భాషకు రస భావ వ్యంజక శక్తి ఒకటుంటుంది.దీన్ని సాధించడానికి కవి భాషను అలంకారికంగా వాడుతాడు.ఐ.ఏ .రీచర్డ్స్(I.A.Richards)భాషకు నాలుగు వృత్తులుంటాయన్నాడు.1.అర్థం (Sence) 2.అనుభూతి(Feeling) 3.ధోరణి(Tone) ఉద్దేశ్యం(Intention) ఇంకాస్తా లోతుకు వెళితే ఉద్దేశ్యంలోనూ కొన్ని అంశాలను చూడవచ్చు.1.వస్తుగత ఉద్దేశ్యం  2.కళా సంబంధ ఉద్దేశ్యం.మొదటిదానిలో ఉద్దేశ్యం వస్తువుపై ఆధారపడితే,రెండవదాంట్లో కళ ఆధారపడుతుంది.షాజహానా వాక్యాల్లో వస్తుగతమైనవి,కళాగతమైఅనవి ఎక్కువ.సాధారణంగా అస్తిత్వ సాహిత్యంలో వస్తుగత సంబంధాలే ఎక్కువ.దళితవాదం కళా,సమాజ జ్ఞానంతో కొంత భాషను సృష్టించుకుంది.తన ఉనికిలోంచి ఉపయోగించుకుంది.ప్రాంతీయ చేతనతో వచ్చిన కవిత్వంకూడా తన ఉనికిలోని నిసర్గ సౌందర్యాన్ని ఆధారం చేసుకుంది.

షాజహానాలోనూ ముస్లిం మైనారిటీ ముద్ర కనిపించే భాషా సంయోజనం ఉంది.పదాల అర్థక్షేత్రం (Semitic field)వల్ల స్త్రీ కనిపిస్తుంది.వైఖరి పరంగా స్త్రీ,మిగతా అంశాలలో మైనారిటీ గొంతుక కనిపిస్తుంది.”దేశాంతర దుఃఖం” లాంటి కవితలను గమనిస్తే సాధారణ జీవితానికి,ముస్లీం మైనారిటీ జీవితానికి మధ్య ఉండే వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తుంది.

 shajahana

కొన్ని సార్లు లక్ష్యాన్ని గురించి మాట్లాడుకుంటే ఇందులో కొంత మార్క్సిస్టు ఊహలు,వైప్లవికమైన ఉద్వేగాలు కనిపిస్తాయి.”జమానత్””బుషాడా గో బ్యాక్”లాంటి కవితలు ఆ ధోరణిలో కనిపిస్తాయి.ఈ కవితల్లో బలమైఅన రాజకీయ దృష్టి ఉంది.ఇందులోనూ వైఖరి సారవంత మైన జీవితాన్నే ఆవిష్కరిస్తుంది.

రాక్షస రెక్కలతో తల్లుల్నీ తండ్రుల్నీ
ఎత్తుకెళ్ళిన నరహంతకుడని తెలిసాక
చందమామ కథలెట్లా చెప్పుకుంటారు ?
తెగిన చేతుల్నే /ఆయుధాలుచెయ్యకుండా ఎలా ఉంటారు.”-(పే-77)

పాలస్తీనా ఆఫ్గన్ ఇరాక్ /వాడు ఒక్కొక్క దేశాన్నే/
మింగుతూ వస్తున్న అనకొండ“-(పే.77)
వాడొస్తున్నాడంటే/మాగంజి నీళ్ల మీద గద్ద తిరుగాడు తున్నట్లుంది“-(బుషాడా గో బ్యాక్పే.79)

ఊహ తెలిసాక మసీదు కూల్చబడింది/కులాలు మతాలు రాజకీయాలు /నా బాల్యం తెల్లటి మస్తిష్కపు తెరమీద బొమ్మలాడాయి/భూగోలం గుండ్రంగా పరచుకున్న చుట్టీస్ అండ్ లాడర్స్ పటం/యవ్వనం దూకింది మతం గోడలమీదుగా /డోక్కుపోయిన అనుభూతులు“-(జమానత్-37.పే.)

ఈ కవిత్వం చదివాక కొన్ని అంశాలను గమనించవచ్చు.పరికరాలు,లక్ష్యం మొదలైఅనవాటివిషయంలో షాజహానాకు ప్రత్యేకమైన అభిప్రాయాలున్నాయి.అనేక సార్లు స్త్రీల అణచివేతను గురించి మాట్లాడటం వల్ల స్త్రీగొంతుక,నిర్దిష్ట పాత్రలు,ప్రత్యేక వర్గ దృక్పథం వల్ల మైఅనారిటీ గొంతుక వినిపిస్తాయి. కార్ల్ గూస్టాఫ్ యూంగ్ ఉమ్మడి అచేతన(Collective unconsciousness)ను గురించి చెప్పాడు. జాతి అనుభవ జనితాలైన భావనలు ఉమ్మడి అచేతనలు.షాజహానా కవితలో స్త్రీ,ముసిలిం అనే భావనలు ఉమ్మడి అచేతన లోనివే.ఇందులోని పాత్రల్లోకూడ ఈ ఉమ్మడి ప్రతిమ(Collective image)కనిపిస్తుంది. ఆధునిక కవితా మాధ్యమంలో “బుష్”ఒక చారిత్రక పాత్రగా ఊహించడం,స్త్రీ దుఃఖాన్ని “దేశాంతర దుఃఖం ‘గా ఊహించడంలోనే ఈ ఉమ్మడి అచేతన కనిపిస్తుంది.ఇతిహాస చారిత్రక సామాజిక భావనలనుండి ప్రతిమను ఊహించడాన్ని (Collective imagination)అంటారు.ఇలాంటి మనోవైజ్ఞానిక లక్షనాలు కూదా ఈ కవిత్వంలో కనిపిస్తాయి.అనేక ఉమ్మడి భావనలకు లోనవుతూనే “దర్దీ”తనదైన సామాజిక,వర్గ సంఘర్షణను వెలిగక్కింది.

*

మీ మాటలు

  1. renuka ayola says:

    ఇలా ”షాజహన’ గురించి అయిన
    జాతి అనుభవ జనితాలైన భావనలు ఉమ్మడి అచేతనలు.షాజహానా కవితలో స్త్రీ,ముసిలిం అనే భావనలు ఉమ్మడి అచేతన లోనివే.ఇందులోని పాత్రల్లోకూడ ఈ ఉమ్మడి ప్రతిమ(Collective image)కనిపిస్తుంది
    .
    ” అరుణ” గారి ఈ కవితలో గడప స్త్రీ అనే జీవితాన్ని వ్యక్తం చేయడానికి మాధ్యం(code)స్త్రీని వ్యక్తం చేసిన సందర్భం, గడప మాధ్యమంగా ఇంటా,బయట అనేక్రమాల్లో ప్రస్తావించడం. స్త్రీగా భావావేశస్థాయి చెప్పినపుడు కవిత్వార్థంగా అణచివేతను వ్యక్తం చేయడం. ఇవన్నీ సాంకేతికంగా ఈకవిత సాధించిన పరిణతులు. గురించి చెప్పాలన్నా నారాయణ శర్మ
    గారి వల్లనే అవుతుంది దానిని ప్రోత్సహించే అఫ్సర్ గారు ధన్యు లు
    మరో చేరా రాతలై ఎంతోమంది కవుల ఆత్మను ,కవిత్వాన్ని పట్టుకున్న శర్మగారికి
    ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను …..

మీ మాటలు

*