మళ్ళీ వినాలనుంది!

 

 

-సుపర్ణ మహి

~

mahy

 

 

 

 

 

ఇప్పుడెందుకో ఆ పాట మళ్ళీ వినాలనిపిస్తుంది…

అదే పాట.

 

అంతా తనది అన్నట్లు చుట్టూ గొణిగేస్తున్న లోకం మొహం మీదకి
ఓ దూరాన్ని ముసుగులా విసిరి,

కొసప్రాణం ఆర్తిగా దాహాన్ని తీర్చుకుంటున్నట్లు

ఇప్పుడాపాటని మళ్ళీ వినాల్నుంది.

 

శభ్దానికీ – శభ్దానికీ మధ్యలోంచి
నాలోకి తర్జుమా అవుతున్న నిశ్శబ్దం గొంతేదో
మరొక్కసారి మనసుపెట్టి
దీక్షక్కూచున్న సిద్ధునిలా శ్రద్ధగా వినాలనుంది.

 

చీకటి కెరటాల మధ్య చిక్కుకున్న వెన్నెల దీపాన్ని చూపేందుకు,
చిగురుటాకుల మధ్య నలుగుతున్న మౌనాన్ని
చూపులమధ్యలోంచి చూస్తూ
ఇప్పుడు ఒక్కణ్ణై వినాలనుంది.

 

వేయి రేకుల పద్మమేదో మస్తిష్కంలో వికసించి మురిపిస్తుంటే
నడిచిపోయే దారంతా తోడుంటుందని
మనసు దగ్గిర నేర్చుకున్న ఆ ‘పాట’
ఇప్పుడు మళ్ళీ నాలోంచి కనుగొని వినాలనుంది.

*

మీ మాటలు

  1. రాధ మండువ says:

    చాలా బావుంది మహీ, మరిన్ని కవితలతో సారంగ పాఠకులని అలరించాలని కోరుకుంటూ – రాధక్క

  2. shrutha keerthi says:

    Wow Mahi congrats.Good poem.Happy to see your first poem in saranga.keep writing more.All the best.

  3. lasya priya says:

    మళ్ళీ మళ్ళీ వినాలనుంది మహి మీ కవితలు …చాలా హాయిగా ఉంది ..సూపర్బ్

  4. mithil kumar says:

    శభ్దానికీ – శభ్దానికీ మధ్యలోంచి
    నాలోకి తర్జుమా అవుతున్న నిశ్శబ్దం గొంతేదో
    మరొక్కసారి మనసుపెట్టి
    దీక్షక్కూచున్న సిద్ధునిలా శ్రద్ధగా వినాలనుంది.

    మౌనాన్ని మాటగ తర్జుమా చేసావ్ …సూతింగ్ పాత్ పోయెమ్ మహి అన్న

  5. మిమ్మల్ని మీరే వినడం ఎంతో బాగుంది . అభినందనలు

  6. Padma Sreeram says:

    “చీకటి కెరటాల మధ్య చిక్కుకున్న
    వెన్నెల దీపాన్ని చూపేందుకు,
    చిగురుటాకుల మధ్య నలుగుతున్న మౌనాన్ని
    చూపులమధ్యలోంచి చూస్తూ
    ఇప్పుడు ఒక్కణ్ణై వినాలనుంది.”

    నిజం నీ కవిత చదువుతుంటే ఘంటసాల వారి ఒక తాత్విక గీతం వింటున్న ఫీల్…ప్రశాంతమైన సెలయేటి ఒడ్డున ఏకాంత వృక్షాన్నై యేటి గలగల నేపధ్యంలో చక్కని సాహిత్యాన్ని తెలుసినట్లనిపించింది….నైస్ మహీఁ….

  7. ఆత్మ గానాన్ని ఎందుకు వినాలో ఎలా వినాలో అద్భుతంగా వర్ణించారు.

    ఎందుకు వినాలటా….
    కొసప్రాణం దాహం తీర్చుకోవటానికి వినాలట
    చికట్లో వెన్నెల దీపాన్ని చూపేందుకు వినాలట
    మస్తిష్కంలో వేయిరేకుల పద్మం వికసించటానికి వినాలట

    ఎలా వినాలటా……
    లోకపు రణగొణ ధ్వనులపై దూరాన్ని ముసుగులా విసిరి వినాలట
    ఏకాంతంలో వినాలట

    మంచి పొయెం…. గొప్ప వ్యక్తిత్వ వికాసతత్వాన్ని ఇముడ్చుకొన్న పద్యం.

    అభినందనలు మిత్రమా

  8. ఆదికి అంతానికీ మధ్య ఆరాటం

  9. శివారెడ్డి says:

    కవిత చాలా బాగుంది మహీ….

  10. మహీ మీ మొదటి కవితకు అందుకో మా అభినందన మందార మాల

  11. లోకం మీద ఒక దూరాన్ని ముసుగులా వదిలి.. మళ్ళీ ,మళ్ళీ మాకోసం ఇలాంటి కవితలు రాయాలి మహి..

  12. సాయి.గోరంట్ల says:

    మల్లీ మల్లీ వినాలనేలా..
    వింటున్నాముగా…ఇన్నాళ్ళుగా
    ఇంకా వింటూనే వున్నాం
    కానివ్వు మరి
    కంగ్రాట్స్ మహీ..
    నీ నుంచి మరిన్ని మంచి కవితలనాశిస్తూ

  13. బాగుంది అన్న ……..ఇలాగె మరెన్నో కవితల పువ్వులు పుయించాలని కోరుకుంటున్నాను .భార్గవ్ కందుకూరి

  14. చాన్నాళ్ల తర్వాత ఓ పసందైన భావుకత్వపు తుఫాను అలజడిలో కొట్టుకుపోతున్న ఫీల్ కల్పించారు మహీ. మరీ ముఖ్యంగ ఈ లైన్లు “అంతా తనది అన్నట్లు చుట్టూ గొణిగేస్తున్న లోకం మొహం మీదకి
    ఓ దూరాన్ని ముసుగులా విసిరి,” మీ మొదటి కవితలోనే బోలెడంత పరిణతి కనపరిచారు. కంగ్రాట్శ్

  15. వనజ తాతినేని says:

    మరిన్ని పాటలు వినాల్సిందే .. మహీ. ఇన్ని శబ్దాల మధ్య ఏదో ఒక కొసన పట్టుకోవాల్సిందే ! బావుంది. మరిన్ని కవితలు మీ కలం అందించాలని మనసారా కోరుకుంటూ … కాస్త ఆలస్యంగా స్పందన.

  16. బావుంది మహీ

మీ మాటలు

*