నీ నిశ్శబ్దంలో నుండి…

 

 

-తిలక్

~

 

నీ నిశ్శబ్దంలో నుండి నేను  రావాలి
వొక రాత్రిలా వొక పగటిలా
నిన్ను నింపుకుంటూ
నన్ను చేర్చుకుంటూ
ప్రపంచమంతా వెలేసినా నువ్వు నన్ను
పొదువుకుంటావన్న ఆశే నన్ను బతికిస్తూ వుంది యింకా-
నేను నీకోసం యే మాటలూ రాయనవసరంలేదు
నువ్వు నాకోసం యే ప్రేమనూ చెప్పనవసరంలేదు
అలా మిగిలిపోతాం అంతే
నిలువెల్లా వొకరిలో మరొకరం తడుస్తూ
యెందుకంటే నాకు ప్రేమను వ్యక్తపరచడం అస్సలే రాదు
నీకు ప్రేమను అడగడం సంపూర్తిగా తెలియదు
కళ్ళు లెక్కలేసుకుంటాయి నీవీ నావీనూ
అవి యే కలల్నో యిలా పారబోసి వెళ్లుండకపోతే
నువ్వూ నేనూ యెలా కలిసే వాళ్ళం
సంద్రం చిమ్మిన ప్రతి కెరటంలో
అడవి కన్న ప్రతీ వర్షంలో మనం వున్నాం
అవును !
నువ్వో అడవి
నేనో శూన్యం
నన్ను నింపేసిన నిండుతనం కదూ నువ్వు
నన్ను నువ్వెప్పుడూ అడుగుతూనే వుంటావు
మట్టిలా మాట్లాడమని…
అవును అది నాకో ప్రశ్నార్థకమే  నాకు మాట్లాడ్డం రాక
కాని చాలానే రాస్తాను నీకోసం
నిద్రరాని  యే రాత్రో నిన్ను తలచుకుంటూ యెన్ని పద్యాలు రాస్తానో
నా కళ్ళపైకి నువ్వు వో మంచుతూనీగలా చేరతావు
నా రెప్పలు విరగొట్టి కొన్ని చిత్రాలనూ పోస్తావు
నీకెలా చెప్పడం ఆ వాన కళ్ళనూ
అవి నీతో చెప్పాలనుకున్న మాటలనూ
నాలో నేను నాతో నేను నిన్ను పోగేసుకుపోవడమే చేసేది.
*

 

 

 

మీ మాటలు

  1. bhanu prakash says:

    అబ్ద్భుతః తిలక్ గారు

  2. lasya priya says:

    అద్భుతంగా చెప్పారు తిలక్ … పోగేసుకోవటమే తెలుసు మాకు … చక్కని పదచిత్రాలతో చాలా బాగా రాశారు .మరిన్ని కవితలు రాస్తూనే ఉండాలి …!

మీ మాటలు

*