షరా మామూలుగా తవ్వకాలు, తగవులాటలూ…

 

స్లీమన్ కథ-24

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

తీరా మైసీనియాలో తవ్వకాలు ప్రారంభించ బోయేసరికి ఎక్కడినుంచి, ఎలా మొదలెట్టాలో స్లీమన్ కు వెంటనే తోచలేదు. ఆ ప్రాంతానికి చెందిన ఏవో స్థలపురాణాలు, విశ్వాసాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో స్పష్టత ఉన్నవి తక్కువ. పైగా కొన్ని తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. అక్కడి వీరుల సమాధుల గురించిన ప్రామాణిక వివరణ పసన్నియస్ రాతల్లో లభిస్తోంది:

మైసీనియా శిథిలాల్లో ‘పెర్షా’ అనే ఒక జలయంత్రమూ; ఏట్రియస్ కు, అతని కొడుకులకు చెందిన భూగర్భ భవనాలూ ఉన్నాయి. వీటిలో నిధినిక్షేపాలను పాతిపెట్టారు.ఏట్రియస్ సమాధితోపాటు; ట్రాయ్ యుద్ధం నుంచి తిరిగొచ్చి, ఏగిస్త్వస్ ఇచ్చిన విందులో పాల్గొని, ఆ తర్వాత అతని చేతిలో హతులైన వాళ్ళ సమాధులూ ఉన్నాయి. అలాగే, అగమెమ్నన్, అతని రథసారథి ఎవ్రిమిడాన్, ఎలెక్త్రాల సమాధులూ; కవలపిల్లలైన తేలమస్, పెలోపస్ ల సమాధులూ ఉన్నాయి. కసండ్రా(ట్రాయ్ రాకుమారి, గొప్ప సౌందర్యవతి, ఒక కథనం ప్రకారం అగమెమ్నన్ ఉంపుడుగత్తె)కు పుట్టిన ఈ కవలలను పసితనంలోనే, తల్లిదండ్రులతోపాటు ఏగిస్త్వస్ హతమార్చాడని చెబుతారు. అగమెమ్నన్, తదితరుల సమాధులకు దగ్గరలో సమాధి చేయడానికి తగరన్న ఉద్దేశంతో క్లైటమెనెస్ట్రా, ఏగిస్త్వస్ లను ప్రాకారానికి ఒకింత అవతల సమాధి చేశారు.

మైసీనియాకు సంబంధించిన గ్రంథాలను, నాటకాలతో సహా, స్లీమన్ అధ్యయనం చేశాడు. వాటిని దాదాపు కంఠస్థం చేశాడు. వాటిలోని వర్ణనలను మననం చేసుకుంటూ వచ్చాడు. హోమర్ రచనలతో సమానంగా వాటిని కూడా ప్రామాణికంగా భావించి గౌరవించాడు. ట్రాయ్ పతనమైన 1300 ఏళ్ల తర్వాత పసన్నియస్ దాని గురించిన సమాచారాన్ని గ్రంథస్థం చేశాడు. కేవలం స్థలపురాణాలనే ఉన్నవున్నట్టు నమోదు చేశాడు. తను చిన్నప్పుడు హెన్నింగ్ వాన్ హోస్టీన్ కు చెందిన స్థానికగాథను నమ్మినట్టే స్లీమన్ వీటినీ నమ్మాడు. నిధినిక్షేపాలను పాతిపెట్టడం గురించిన కథలను మరింత నమ్మాడు.

పసన్నియస్ ఇచ్చిన సమాచారం గురించి ఆలోచిస్తున్నకొద్దీ తనకు ముందటి వ్యాఖ్యాతలు తప్పులో కాలేశారన్న అభిప్రాయం అతనిలో బలపడింది. వారి ప్రకారం, క్లైటమెనెస్ట్రా సమాధి నగరప్రాకారాలకు అవతల ఉంది. ఏట్రియస్, అగమెమ్నన్, అతనితోపాటు హతులైన వాళ్ళ సమాధులు ప్రాకారాలకు లోపల ఉన్నాయి. అయితే, పసన్నియస్ కాలానికే నగరప్రాకారాలు కుప్పకూలి కేవలం శిథిలాలు మిగిలాయి. అగమెమ్నన్ సమాధి నగరప్రాకారాల లోపల కాకుండా, గిరిదుర్గ ప్రాకారాల లోపల ఉందని చెప్పడం పసన్నియస్ ఉద్దేశమని స్లీమన్ భావించాడు. దాంతో, ట్రాయ్ లో సింహద్వారం దగ్గర నిక్షేపాలు లభించినట్టే, ఇక్కడా లభిస్తాయన్న నిర్ధారణకు వచ్చి సింహద్వారం దగ్గరే 1876 ఆగస్టులో తవ్వకాలు ప్రారంభించాడు. అరవైముగ్గురిని పనిలోకి తీసుకున్నాడు. ట్రాయ్ అనుభవంతో ముందే జాగ్రత్తపడిన ప్రభుత్వం, అతని కదలికలపై నిరంతరం కన్నేసి ఉంచడానికి గ్రీకు పురావస్తు సంఘానికి చెందిన ముగ్గురు అధికారులను నియమించింది.

తనపై ఎవరు నిఘా పెట్టినా స్లీమన్ కు నచ్చదు. అందులోనూ అధికారులైతే కోపం నసాళానికి అంటుతుంది. సింహద్వారం అవతల రహదారిని మూసేస్తూ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. వాటిని తొలగించడానికి పనివాళ్ళను పురమాయించాడు. అధికారులు అభ్యంతరం చెప్పారు. నా ప్రణాళికకు అడ్డుతగులుతున్నారంటూ స్లీమన్ వాళ్లపై మండిపడ్డాడు. ఎప్పటిలా అధికారుల కళ్ళు కప్పడం కోసం పనివాళ్లను బృందాలుగా విడదీసి తలో చోటా పనిచేయించడం ప్రారంభించాడు. ఎండ విడుపులేకుండా దహిస్తోంది. దానికితోడు ఆ ప్రాంతమంతటా ధూళిమేఘాలు దట్టంగా కమ్మేశాయి. ఆ వాతావరణంతో పోటీపడి స్లీమన్ లో కోపతాపాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సందర్భాలలో అతనితో వాదనకు దిగడానికి ధైర్యం చాలని అధికారులు సోఫియాను కలసి ఫిర్యాదు చేయడం, ఆమె వీలైనంతవరకు వాళ్ళను శాంతింపచేయడానికి ప్రయత్నించడం, అది ఒక్కోసారి విఫలమవడం రివాజుగా మారింది.

పని వేగం పుంజుకుంటున్న కొద్దీ ఎక్కువమందిని పనిలోకి తీసుకున్నాడు. మరిన్ని గోడలను నేలమట్టం చేసేలా కనిపించాడు. ఈసారి అధికారులు మరింత గట్టిగా అభ్యంతరం చెప్పారు, గ్రీకు పురావస్తు సంఘం ముఖ్యప్రతినిధి స్టెమటేక్స్ ప్రభుత్వానికి ఇలా రాశాడు:

పురాతన కుడ్యాలను కూల్చడానికి గ్రీకు, రోమన్ తాలూకు పురావస్తువులనన్నింటినీ పగబట్టినట్టు ధ్వంసం చేసేస్తున్నాడు. గ్రీకు, రోమన్ కలశాలు కంటబడితే చీదరించుకుంటున్నాడు. వాటి తాలూకు ముక్కలను పారేస్తున్నాడు. నన్నో ఆటవికుడిగా చూస్తున్నాడు. నా విధినిర్వహణ మీకు సంతృప్తికరంగా లేకపోతే, దయచేసి నన్ను వెనక్కి పిలిపించండి. ఎందుకంటే, నా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇక్కడ ఉంటున్నాను. రాత్రి తొమ్మిది వరకూ రోజంతా అతనితో కలసి తవ్వకాల దగ్గర గడుపుతున్నాను. ఆ తర్వాత, అర్థరాత్రి రెండువరకూ అతనితో కూర్చుని బయటపడిన పురావస్తువులను నమోదు చేస్తున్నాను. తను అధ్యయనానికి అవసరమంటే, కొన్ని వస్తువులను ఇంటికి పట్టుకెళ్లడానికీ అనుమతిస్తున్నాను.

దానిపై ప్రభుత్వం స్టెమటేక్స్ కు మరోసారి కచ్చితమైన ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ప్రకారం, ఏ గోడనూ కూల్చడానికి వీల్లేదు. తవ్వకాలు ఒకే సమయంలో అనేకచోట్ల జరగకూడదు. ఒక్కచోట మాత్రమే జరగాలి. పర్యవేక్షణకు వీలైన మేరకు పనివాళ్ళ సంఖ్యను పరిమితం చేయాలి. చివరగా, ఈ ఉత్తర్వుల ఉల్లంఘనే జరిగితే అందుకు స్టెమటేక్స్ బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.

నాఫ్లియో ముఖ్యాధికారిని వెంటబెట్టుకుని స్టెమటేక్స్ జంకుతూనే వెళ్లి స్లీమన్ ను కలిశాడు. వీలైనంత మృదువుగా, మర్యాదగా పై ఉత్తర్వుల గురించి చెప్పాడు. అయినాసరే, స్లీమన్ భగ్గుమన్నాడు. స్టెమటేక్స్ ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించమని నాఫ్లియో ముఖ్యాధికారితో అన్నాడు. ఇలాంటి వాళ్ళతో తను క్షణం కూడా పనిచేయలేయనన్నాడు. మీరు చట్టాలకూ, ఒప్పందాలకూ లోబడి పనిచేయాలని స్టెమటేక్స్ అన్నాడు. ఇది ఒప్పందాలను ముందుపెట్టుకుని చేసే పనికాదని స్లీమన్ విరుచుకుపడ్డాడు…

ఈ అధికారులు వట్టి మూర్ఖులు, వీళ్ళకు ఏమీతెలియదు, పుండు సలిపినట్టు తనను సలుపుతున్నారు. భూగర్భంలో లోతుగా సమాధైన ఒక పురాతన నాగరికతకు చెందిన ఆనవాళ్లను బయటపెట్టడానికి తను ప్రయత్నిస్తున్నాడు. ఎంత పవిత్రమైన విధిని తను తలకెత్తుకున్నాడో వీళ్ళకు అర్థం కాదు. ఆధునిక శాస్త్రవిజ్ఞానం అందించిన అన్ని పద్ధతులనూ వినియోగించి ఈ  పురాతన నాగరికతా చిహ్నాలను పరిరక్షించడానికి సైతం తను సిద్ధంగా ఉన్నాడు. తను ఏం చేయాలన్నా తగినంత స్వేచ్ఛ ఉండాలి. ఈ అధికారులనే వాళ్ళు తన జోలికి రాకూడదు!…ఇదీ ఎప్పటిలానే స్లీమన్ వాదం.

స్లీమన్ నిప్పులు చెరుగుతుంటే, సోఫియా తెరవెనుక నిశ్శబ్దంగా ఉండిపోయింది. నాఫ్లియో ముఖ్యాధికారి ఎథెన్స్ నుంచి తనకు అందిన ఉత్తర్వును చదివి వినిపించాడు. ఒక పక్క, ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యతాయుతుడైన అధికారి! ఇంకోపక్క, కేవలం గతానికి మాత్రమే జవాబుదారీగా వ్యవహరించవలసిన పురావస్తునిపుణుడు! వాతావరణం చాలా వేడెక్కిపోయింది. కోపంతో స్లీమన్ ముఖం ఎర్రబడిపోయింది. పనివాళ్లు పని ఆపేశారు.

నాఫ్లియో ముఖ్యాధికారి ఉత్తర్వులను చదివి వినిపించడం పూర్తయింది. అధికారుల ఉనికినే పట్టించుకోనట్టుగా స్లీమన్ వెంటనే పనివాళ్లవైపు తిరిగి, మీ పని మీరు కానివ్వండని హూంకరించాడు. అతని కళ్ళల్లోని ఎరుపును చూసి పనివాళ్లు భయపడ్డారు. అయిష్టంగానే మందకొడిగా పని మొదలు పెట్టారు. అదే రోజు సాయంత్రం సంబంధిత మంత్రిత్వశాఖకు స్లీమన్ మరో సుదీర్ఘమైన ఉత్తరం రాశాడు. తపాలాశాఖ మీద నమ్మకం లేక మరునాడు ఆ ఉత్తరం ఇచ్చి సోఫియాను ఎథెన్స్ కు పంపించాడు. సోఫియా ఆ ఉత్తరాన్ని స్వయంగా మంత్రికి ఇవ్వడమే కాదు, అప్పటికప్పుడు ఆయన చేత జవాబు రాయించి తీసుకురావాలి.

తవ్వకాలు కొనసాగాయి. స్లీమన్, స్టెమటేక్స్ ఒకరి పీకలు ఒకరు పట్టుకునే ఉన్నారు. ఆ కలహాల కాపురంలో మధ్య మధ్య రాజీలు, పరస్పర అభిమాన ప్రకటనలూ ఉన్నాయి. బెదిరింపులు, అనునయ వాక్యాలతో పై వాళ్ళకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూనే, తను అనుకున్న పద్ధతిలో పని చేసుకుంటూ పోయే కళలో స్లీమన్ ఇప్పటికే ఆరితేరాడు. మంత్రికి రాసిన ఉత్తరంలో గ్రీసు పట్ల తన అచంచలమైన ప్రేమను, పురావస్తు తవ్వకాల పట్ల నిబద్ధతను మరోసారి నొక్కి చెప్పాడు. నాఫ్లియో ముఖ్యాధికారికి పంపిన ఉత్తర్వులను ఏదో క్షణికావేశంతో పంపినవిగా తను భావిస్తున్నానన్నాడు. తననింత అవమానకరంగా చూస్తున్న దేశంలో తవ్వకాలు జరపాలన్న కోరిక కూడా నాలో చచ్చిపోతోందన్నాడు.

గ్రీకు, టర్కీ ప్రభుత్వాల దగ్గర ఇలాంటి ఉత్తరాలతో పెద్ద పెద్ద దస్త్రాలు తయారయ్యాయి. అతని ఎత్తుగడలను అవి ఇప్పటికే ఆకళించుకున్నాయి. కనుక పై ఉత్తరంలో రాసింది బూటకపు బెదిరింపని గ్రీసు ప్రభుత్వానికి తెలుసు. తవ్వకాలు విరమించి పోతానంటే ఆపకూడదని అనుకుంది. అయితే, గ్రీస్ ను విడిచిపెట్టి వెళ్ళే ఉద్దేశం సోఫియాకు లేదు. ఆమె కూడా నటనలో ఆరితేరినదే. భర్త పక్కన పెట్టని కోటలా నిలబడింది. ప్రతిపక్షులను చిత్తు చేయడంలో తన మెళకువలను అన్నిటినీ ప్రయోగించింది. స్లీమన్ వ్యూహాలను పక్కాగా అమలుచేయడంలో ఆమె పూర్తి భాగస్వామి  అనీ, అతని కన్నా కూడా అసలు కుట్రదారు ఆమే ననీ స్టెమటేక్స్ కు త్వరలోనే అర్థమైపోయింది. పెద్దమనిషి తరహా కలిగిన అతడు కూడా ఆంతరంగిక సంభాషణాల్లో ఆమెను “రాక్షసి’గా తిట్టిపోయడం ప్రారంభించాడు.

9f5321c5acc5ed373c5ef569c44a9f3b

తవ్వకాలు ఆపేసి అమెరికా వెళ్లిపోతానని స్లీమన్, రాజీనామా చేసి తప్పుకుంటానని స్టెమటేక్స్ అలా బెదిరిస్తూనే ఉండడం; వివాదం విషమించినప్పుడల్లా సోఫియా రంగప్రవేశం చేసి ఇరుపక్షాలనూ శాంతింపచేయడం ఒక తంతుగా మారిపోయింది. ఇతరుల ఘనతను గుర్తించే అలవాటు బొత్తిగా లేని స్లీమన్, సోఫియా చాకచక్యానికి మాత్రం ముగ్ధుడైపోయేవాడు. తను నక్కజిత్తుల ఒడీసియస్ అయితే, ఆమె పెనెలోపి అనుకునేవాడు.

తవ్వకాలలో చెప్పుకోదగినవేవీ బయటపడడం లేదు. ట్రాయ్ లో దొరికినట్టుగా  రోమన్, బైజాంటైన్ నాణేలు కూడా ఇక్కడ దొరకకపోవడం స్లీమన్ కు వింతగా అనిపించింది. శిథిలాల అడుగున, రేఖాగణిత నమూనా చిత్రణలు కలిగిన పురాతన కలశాలు; విచిత్రంగా, బొర్డో మద్య పాత్రలను తలపించే గుండ్రని మృణ్మయపాత్రలు దొరికాయి.  ఆపైన ట్రాయ్ లో లానే ఎరుపురంగు పులిమిన చిన్న చిన్న అమ్మవారి మట్టిబొమ్మలు, కత్తులు, బొత్తాలు, జంతువుల మట్టిబొమ్మలు, మోత్యా తవ్వకాల్లో దొరికిన లాంటి బాణపు మొనలు, చక్కని నీలిరాతితో చెక్కిన వందలాది బొంగరం ఆకృతులు, దువ్వెనలు, సూదులు, స్ఫటికపు ముక్కలు, తిరగళ్ళు, గొడ్డళ్ళు: మైసీనియా వాద్యపరికరాలలో భాగంగా స్లీమన్ భావించిన ఎముక ముక్కలు కనిపించాయి. చూడబోతే, ట్రాయ్ లో తనకు ఎదురైన అనుభవమే పునరావృత్తమవుతోందా అని అతనికి అనిపించింది. అక్కడిలానే అసంఖ్యాకమైన బొంగరం తరహా బొమ్మలు, లింగాకృతులు, అమ్మవారి మట్టిబొమ్మలు! అంతకు మించి విశేషమైనవేవీ లేవు.

ఎట్టకేలకు, నాలుగు లేదా అయిదో వారంలో సింహద్వారా(Lion Gate)నికి దక్షిణంగా జరుపుతున్న తవ్వకాలలో రెండు ఇసుకరాతి సమాధి రాళ్ళు బయటపడ్డాయి.  ఒక్కొక్కటి నాలుగు అడుగుల ఎత్తు ఉన్నాయి. వాటిపై ఆదిమకాలపు దారుచిత్రాల శైలిని పోలిన బొమ్మలు ఉన్నాయి. వాటిలో ఒక దానిలో ఒక వేటగాడు రథంమీద ప్రయాణిస్తూ జింకను వేటాడుతూ ఉంటాడు. రథం పక్కనే ఒక వేటకుక్క పరుగెడుతూ ఉంటుంది. ఇంకో బొమ్మలో ఒక నగ్నసైనికుడు ఒక పెద్ద కత్తి పుచ్చుకుని రథం మీద వెడుతుంటాడు. ఈ బొమ్మల శైలికి, సింహద్వారంపై ఉన్న బొమ్మల శైలికి పోలిక ఉన్నట్టు స్లీమన్ గమనించాడు. గుర్రాల తోకలు, కుక్క తోక మామూలుకు భిన్నంగా చాలా లావుగానూ, పొడవుగానూ ఉన్నాయి. రథాలను మాత్రం రేఖామాత్రంగా చెక్కారు. ఈ రథాలు అచ్చంగా ట్రోజన్ యుద్ధాలలో ఉపయోగించిన రథాలలానే ఉన్నాయని స్లీమన్ నిర్ధారించాడు.

ఆ తదుపరి రోజుల్లో జరిపిన తవ్వకాల్లో కూడా సమాధి రాళ్ళ శకలాలు దొరికాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక బంగారు బొత్తం కనిపించింది. అలా సమాధి రాళ్ళ దగ్గరే బంగారు బొత్తం కనిపించేసరికి సమీపంలోనే నిక్షేపాల వాసన ఏదో స్లీమన్ కు ఘాటుగా సోకింది.

ఆ సమాధిరాళ్ళు సింహద్వారానికి అవతల ఉన్న ఒక వలయాకార ప్రదేశంలో కనిపించడంతో అక్కడే తవ్వకాలు కొనసాగించాడు. అక్కడ బయటపడుతున్నవి మొదట అతనికి చిక్కుముడిగా కనిపించాయి. ఆ వలయాకారప్రదేశంలో చుట్టూ బల్లల రూపంలో రాతి పలకలను అమర్చారు. అధికారిక శాసనాలను చదివి వినిపించడానికి చాటింపు వేసి ప్రభువర్గాన్ని పిలిపించే బహిరంగ సమావేశస్థలిగా అది కనిపించింది. బహుశా అదొక నృత్యస్థలి, కవిసమ్మేళనస్థలీ కూడా కావచ్చు. అక్కడే గొప్ప గొప్ప వక్తల ప్రసంగాలు, బహుమతి ప్రదానాలూ జరుగుతూ ఉండివేమో. ఆయా సందర్భాలలో రాచరికానికి చెందిన పవిత్ర చిహ్నాలను అక్కడే ప్రజల సందర్శనకు ఉంచేవారేమో….

పవిత్రప్రదేశాలుగా పరిగణించే ఇటువంటి తావులు సాధారణంగా మృతవీరుల స్మారకనిర్మాణాలతో ముడిపడి ఉంటాయి. అక్కడి రాతి పలకల అడుగున రాజుల సమాధులు ఉండడమూ కద్దు. ఇలాంటి ప్రదేశాలను ‘ఆగొరా’(agora) అని పిలుస్తారు. ఇవి పవిత్రమైన తావులే అయినా విపణి ప్రదేశాలుగా కూడా వాడుకలో ఉండేవి. యురిపిడిస్ తన ‘ఎలెక్త్రా’ అనే రచనలో, బంగారు ఉన్ని కలిగిన గొర్రెపిల్లను దర్శించడానికి మైసీనియా ప్రజలను ఆగొరాకు ఆహ్వానించడం గురించి రాస్తాడు. బంగారు గొర్రెపిల్ల మైసీనియా రాచరికచిహ్నం. వీరుల సమాధులు ఆగొరా లోపలే ఉన్నాయని పసన్నియస్ రాశాడు. తెరా దీవిలోని ఆగొరాలో వీరులను సమాధి చేశారని పింధరోస్(ప్రాచీన గ్రీకు గేయకవి)రాశాడు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మైసీనియా వీరుల సమాధులు ఈ వలయాకారపు ఆగొరా లోనే ఉండి ఉంటాయని స్లీమన్ నిర్ణయానికి వచ్చాడు.

అయినా వెంటనే ఈ ప్రదేశంలో మరిన్ని తవ్వకాలు జరిపించకుండా, దానికి దక్షిణంగా కిటికీలు లేని ఏడు గదులతో ఉన్న ఒక రాతి కట్టడాన్ని రాజప్రాసాదంగా ఊహించుకుని మొదట అక్కడ తవ్వకాలు ప్రారంభించాడు. కానీ నిరాశే ఎదురైంది. ఎప్పటిలానే నీలిరంగు రాతితో మలచిన బొంగరం ఆకృతులు, గొడ్డళ్ళు, చిత్రిత మృణ్మయ కలశాల తాలూకు ముక్కలు కనిపించాయి. 12 అంగుళాల ఎత్తున్న ఒక కలశం మాత్రమే ఉన్నంతలో విలువైనదిగా కనిపించింది. దాని మీద యుద్ధానికి వెడుతున్న సైనికుల చిత్రం ఉంది. వారిని ముదురు ఎరుపు రంగులో చిత్రించారు. విశేషమేమిటంటే, ట్రాయ్ యుద్ధానికి ముందునాటి సైనికులను, వారి ఆయుధాలను ఈ చిత్రం ప్రదర్శిస్తోంది. వీటిలో మంచి జీవకళ ఉట్టిపడుతూ, ఆధునిక సరళిని తలపిస్తూ ఉండడం మరింత ఆసక్తికరం. అతి పురాతన గతానికి చెందిన ఈ సైనికులు సజీవంగా మన ముందుకొచ్చి నిలబడినట్టు ఉంటారు. అంతేకాదు, ఈ సైనికులు ధరించిన దుస్తుల లాంటివే హోమర్ చిత్రించిన వీరులు ధరించి ఉంటారని స్లీమన్ అనుకున్నాడు.

(సశేషం)

 

 

 

మీ మాటలు

*