బాజీరావ్ మస్తానీ – గీత్ సుహానీ!

 

-ఫణీంద్ర 

~

phaniడబ్బింగ్ సినిమా పాటలనగానే, అదీ హిందీ నుంచి అయితే, తెలుగుభాషా చిత్రవధకి శ్రోతలు సిద్ధపడి ఉంటారు! డబ్బింగ్ పాటల్లో తెలుగు అంత కృతకంగా ఉండడానికి సంగీత దర్శకుడూ, దర్శకుడూ వగైరా వాళ్ళ పాత్ర అంతో ఇంతో ఉన్నా నింద మాత్రం ఎప్పుడూ పాటల రచయితకే వస్తుంది! కొన్నిసార్లు తెలుగు అనువాదం అస్సలు సరిగ్గా కుదరనప్పుడు, శ్రోతలు రచయితకి ఓ దండం పెట్టి తమిళంలోనో హిందీలోనో ఉన్న ఒరిజినల్‌ని వింటూ సంతృప్తిపడతారు. అయితే డబ్బింగ్ పాటలో కూడా తెలుగులా వినిపిస్తున్న తెలుగుని విని, ఎంతో అందంగా ఉన్న భావాలకి పరవశించి, అంత అద్భుతంగా రాసిన రచయితకి నిజమైన గౌరవవందనాలు సమర్పించే సందర్భాలు అరుదుగా వస్తూ ఉంటాయి! అలాంటి గౌరవాన్ని “బాజీరావ్ మస్తానీ” చిత్రానికి రాసిన పాటలద్వారా రామజోగయ్య శాస్త్రి గారు దక్కించుకున్నారు. ఆ చిత్రంలోని ఓ చక్కని ప్రేమగీతాన్ని ఈ వారం పలకరిద్దాం!
“బాజీరావ్ మస్తానీ” ఓ చారిత్రాత్మక కథకి చేసిన కల్పన. మరాఠా యోధుడు బాజీరావ్‌కి, మస్తానీకి మధ్య సినిమాలో చూపించిన ప్రేమకథ నిజంగా జరిగిందా లేదా అన్నది అంత ముఖ్యం కాదు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమని సినిమాలో ఎంత అందంగా, కళాత్మకంగా చూపించారో, ఈ పాటలో మస్తానీ తన హృదయాన్ని ఎంత ఆర్తిగా నివేదించుకుందో అన్నదే ముఖ్యమైన విషయం సాధారణ ప్రేక్షకుడికి. ఈ సినిమాకి ఎంతో ముఖ్యమైన ఇలాంటి పాటలో తన గీతరచనా ప్రతిభని సంపూర్ణంగా ప్రదర్శించి, ప్రేక్షకుడికి పూర్తి సంతృప్తి కలిగించిన ఘనత రామజోగయ్య శాస్త్రి గారికి దక్కుతుంది.
శాస్త్రిగారు ఈ సినిమాలోని అన్ని పాటలూ చాలా అందంగా రాసినా, ఈ పాటకంటే కవిత్వం ఎక్కువ ఉన్న పాటలు సినిమాలో ఉన్నా, ఈ పాటే ఆయనకి వన్నె తెచ్చేది. ఎందుకంటే ఈ పాట రాయడం అంత సులభమేమీ కాదు. ఒరిజినల్‌లో ముందు మరాఠీలో వచ్చే సాకీ, తర్వాత హిందీలో మధురంగా వినిపించే పల్లవీ చరణాలు, చివర్లో ఉర్దూలో వచ్చే ఖవ్వాలీ…ఇలా పాట నడకంతా విభిన్నంగా సాగుతుంది, ముగ్గురు గీతరచయితలు (హిందీ భాగాన్ని రాసిన జంటకవులు సిద్ధార్థ్ – గరిమలను ఒకరిగా పరిగణిస్తే) రాశారు ఆ పాటని. అలాంటి పాటని తానొక్కడే మొత్తం రాసి మెప్పించడం, క్లిష్టమైన మరాఠీ సాకీని కూడా తెలుగులో ఒప్పించేలా రాయగలగడం శాస్త్రి గారికే చెల్లింది!

పాట సాకీ అద్దాల మేడలోని కళామందిరానికి విచ్చేస్తున్న మస్తానీ అందాన్నీ, ఔన్నత్యాన్నీ కీర్తిస్తూ సాగుతుంది –

 

సాకీ:
దివినించి జారె జర జరా
కలికి అప్సర కలల తెమ్మెర!

 

కోరస్: జారే ఇలకు జారే దివినించి జారే

 

పగడాల సొగసు దొంతర
నచ్చిన కళ్ళలో విచ్చిన కెందామర!

 

కోరస్: జారే ఇలకు జారే

 

మరువాల పవనంలా
పరువాల దవనంలా

అరుదెంచెనీ వెన్నెల!

 

కోరస్: అరుదెంచే చూడు! అరుదెంచే చూడు! అరుదెంచే మహరాణీ!

 

Ramajogayya Sastry @ Rabhasa Movie Audio Launch Stills

ఆ అమ్మాయి అందంలో అప్సరసే! అయితే “కలికి” (చక్కనైన) అని శ్రేష్ఠమైన విశేషణాన్ని వాడి అందానికి హుందాతనాన్ని అద్దారు రచయిత. అటువంటి సుందరిని చూస్తే కలలు చల్లగాలిలా (తెమ్మెర) తాకవు మరి! సిగ్గెరుపో లేక మేనెరుపో మరి ఎర్రని పగడాల దొంతరలా ఉందట ఆమె సోయగం! ఎంత అందమైన ఊహ! ఆ అమ్మాయిపై మనసుపడ్డ వారి కళ్ళలో (నచ్చిన కళ్ళలో) ఆమెను చూసినప్పుడు ఎర్రకలువలు (కెందామరలు) విచ్చుకుంటాయట! ఆహా! ఆమె అందరికి కళ్ళకి అందే సోయగం కాదు, నచ్చిన, మనసిచ్చిన వారికే అందే అద్భుత దృశ్యం మరి! కేవలం కంటికే కాదు పంచేంద్రియాలకీ పులకింత ఆ సౌందర్యం! ఆమె వెంట మరువపు ఆకుల సుగంధం నడిచొస్తోంది. కాదు కాదు, పరువమే దవన పరిమళమై ఆమెను అంటిపెట్టుకుంటోంది (దవనము కూడా మరువము లానే సుగంధమూలిక). ఇలా పరువాల పున్నమిలా వచ్చి తన సోయగాల వెన్నెలని కురిపిస్తున్న ఆ సుందరి రాజసం చూస్తే మహరాణీ అని కీర్తించదూ జగమంతా?

మస్తానీ బాజీరావుకి ఆరాధనాపూర్వకంగా ఓ సైగచేసి పాట పాడడం మొదలుపెడుతుంది –
పల్లవి: (మస్తానీ)
కనులతో తీగలాగి పడేసావే మాయలో
వరంగా సోలిపోయా వలేసే హాయిలో!


బహుమానమై నీదానిగా తరించా ప్రేమలో
వద్దన్నా ప్రపంచం జన్మం నీకు సొంతం

 

అదో వెర్రి ప్రేమై నిన్నే చేరుకున్నా
కళ నీవే కాంతి నీవే మస్తానీ శ్వాసలో! 

 

ఈ ప్రేమ మాటగా వెలికిరానిది, మాటల్లో చెప్పలేనిది. అయితే అతని కళ్ళలో తనపై ఆరాధన కనిపిస్తూనే ఉంది. అతనిలో తన పిచ్చిప్రేమని చూసి నవ్వుకోకుండా అర్థం చేసుకునే ఓ హృదయాన్ని చూసింది. అందుకే అతనికి దాసోహమైంది. “నీ చూపులనే తీగలతో నన్ను మెల్లగా లాగి ఈ ప్రేమ మాయలో పడేశావు! నన్ను వలేసి మరీ లాగిన ఈ వరమైన హాయిలో ఉండిపోనీ” అంటోంది! ఈ భావం ట్యూన్‌లో ఎంతందంగా వినిపిస్తుందో (ముఖ్యంగా “వరంగా సోలిపోయా” అనే లైను)!

తన ప్రేమని లోకం ఒప్పుకోదని తెలుసు, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని తెలుసు. అయినా, “నీ ప్రేమే నాకు బహుమానం! ఈ జన్మ నీకు సొంతం, ఎవరిని ఎదిరించైనా సరే నిన్ను చేరుకుని నీ ప్రేమలో తరిస్తాను” అంటోంది. నిజమైన ప్రేమకి ఉండే ధైర్యం అది. గుండెల్లో ప్రేమరూపాన్నీ, ఊపిరిలో ధైర్యాన్నీ నింపుకున్నది ప్రేమవుతుంది కానీ కేవలం కనులలో కలలు ఒంపుకున్నది కాదు! “నా బ్రతుకులో (శ్వాసలో) కళా కాంతీ అన్నీ నీ వల్లే! కలగన్నా, మెలకువలో ఉన్నా ప్రతి తలపూ నీదే” అనేంతగా అతనికి తనని తాను అంకితం చేసుకున్న పిచ్చిప్రేమ ఇది.

చరణం (మస్తానీ)
ప్రియం తీయనైన అపాయం
కోరస్: ఎదంతా లిఖించావు గాయం కవ్వించే చూపుగా!


వలపై చేసినావే సహాయం
కోరస్: తపించే వయారం శమించే మలామూ నీవేగా


నిజమున్నది నీ కమ్మని కలలో (2)
జగాలే వినేలా సగంలా

కోరస్: నీ పేరే నాదిరా

ప్రేమ ఎప్పుడూ అపాయమే! తీయని అపాయం, ప్రియమైన అపాయం! మస్తానీ విషయంలో నిజమైన అపాయం కూడా. ఐనా అన్నిటికీ తెగించిన ప్రేమ ఇది. ఈ అపాయం వలన కలిగేది గాయం. కవ్వించే చూపులతో మనసుపై చేసిన గాయం! అది జన్మంతా మాననిది. ఓ తీయని బాధగా, ఆహ్లాదమైన ఆరాటంగా మిగిలేది. అయితే దానివల్ల ఓ సహాయమూ దొరికింది. అదేమిటంటే తపించే వయ్యారానికి ఊరటనిచ్చే లేపనం (మలాము) కూడా ఈ ప్రేమేనట! ఎంత చిత్రమో కదా! గాయమూ తనవల్లే, సహాయమూ తనవల్లే! ఏమిటో ఈ ప్రేమ!

కల నిజం కాదు ఎప్పుడూ. కానీ కొన్ని కలలే నిజంకన్నా గొప్పగా అనిపిస్తాయి. నిజమైన జీవితాన్ని కలగా మారుస్తాయి. కలలోని జీవితాన్ని నిజం చేసేలా ప్రేరేపిస్తాయి. ఆ స్ఫూర్తితోనే సాగుతోంది మస్తానీ. “జగం వినేలా చాటి చెప్పనీ! నువ్వు నావాడివి! నేను నీలో సగం అయ్యి తీరుతాను” అని నిశ్చయంగా చెబుతోంది. నీ ప్రియురాలిగా ఉంటూ తీపిని మాత్రమే పంచుకోవడం కాదు, నీ ధర్మపత్నిగా మారి జీవితంలో కష్టసుఖాలను పంచుకోవాలన్నదే నా ఉద్దేశ్యమని చాటిచెప్తోంది!

 

ఖవ్వాలీ (బాజీరావ్):
చెలి పాలపుంతలా మెరిసావే
బ్రతుకంత జిగేలై కలగలిసావే

పులకింత నింపి మనసు బంతినెగరేసావే


నా సిరి నీవే, మాధురి నీవే
నేలంతా గెలిచాననిపించే కేరింతయ్యావే

 

బాజీరావ్ ఇప్పటి వరకూ మౌనంగా ఉన్నాడు పాటలో! ఒక అపురూప సౌందర్య రాశి, ఒక అద్భుత మానధన రాశి కళ్ళముందు మెరిస్తే మాటలెలా వస్తాయి! కానీ అతని గుండె స్పందిస్తోంది, మౌనంగా పాట పాడుతోంది. తన చెంత మెరిసిన పాలపుంత, బ్రతుకంతా జిగేలనిపించే ప్రేమ పులకింత అని తెలుసు! ఆ పులకింత నిండిన మనసు ఉండబట్టలేక బంతిలా ఎగిరెగెరి పడుతోందట! ఇప్పటి వరకూ యుద్ధాలు గెలవడం, రాజ్యాలు ఏలడమే జీవితం అనుకున్నాడు కానీ కాదు. సిరి అంటే మస్తానీ, జీవితంలో మాధుర్యం అంటే మస్తానీ. తన ప్రేమ ఉంటే చాలు ప్రపంచాన్నంతా జయించినట్టే. నిజమే కదా, ప్రేమలో సమస్తం దొరుకుతుంది, ప్రేమలో విశ్వం తనని తాను చూసుకుంటుంది!

ప్రేమ మహిమ తాకిన రెండు హృదయాలని రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతంగా ఆవిష్కరించిన వైనాన్ని పాట వింటేనే కానీ పూర్తిగా తెలుసుకోలేం! “సంజయ్ లీలా బన్సాలీ” మధుర స్వరకల్పనలో, శ్రేయా ఘోషల్ మధురాతిమధురమైన గాత్రంలో ఈ పాటని ఇక్కడ విని కాసేపు ప్రేమ నీడలో సేద తీరండి!

*

 

మీ మాటలు

*