ఓడిపోని యుద్ధం గురించి నీతో…

-అరణ్య కృష్ణ
~
అవమాన గరళాన్ని దుఖపు బిరడాతో గొంతులోనే ఒత్తిపట్టిన నీలకంఠా!
నీలిజెండా రెక్కలతో ఎగురుకుంటూ ఎచటికి పోయావీ రాత్రి?
కులమతాల వైతరిణీలకు తావులేని
ఏ నక్షత్రాల వీధిలో రోదశీ మానవుడిగా విహరిస్తున్నావు రోహిత్?
నానా రకాల మృతపదార్ధాలతో కుళ్ళిపోయిన హృదయాల మధ్య
పుట్టుకే ఓ భయంకర ప్రమాదమైన వ్యవస్థలో
దేహానికి హృదయానికి మధ్య వైరుధ్యం  నీ ఒక్కడిదేనా?
అంతర్వీక్షణలో చీకటికోణాల మీద అబద్ధపు ముఖమల్ దుప్పట్లు కప్పి
రాక్షస ముఖాల వికృతత్వాన్ని మర్యాదల మేకప్లో దాచేసుకునే దుర్మార్గులమే కదా  మేమంతా!
చావు పుట్టుకలనే రెండు శిఖరాగ్రాల మధ్యలోని జీవితం లోయ మీద
అప్పుడే మొలిచిన రెక్కలను కూడతీసుకొన్న తూనీగలా
స్వేచ్చగా ఎగరాల్సిన నీ బాల్యం
వేల ఏళ్ళ సాలెగూడులో
నువ్వు పుట్టకముందే చిక్కుకుంది రోహిత్!
ఇల్లంటే మానవసంబంధాల వేదిక కాదని
ఇల్లంటే ప్రేమానురాగాల పండగ కాదని
ఇల్లంటే ఆత్మలు చచ్చిన మనుషులు సాగించే నిరంకుశ పాలనా వ్యవస్థ అని
నీకు తెలిసేటప్పటికే నీ శరీరమ్మీద బతుకు కొరడా మచ్చలు మిగిలాయి
నీ పసితనం నీకే
కరెంటు తీగలకు వేళ్ళాడే పక్షి కళేబరంలా కనిపించింది
వరసలు పెట్టుకొని పిలుచుకునే మానవసంబంధాల కర్కశత్వాలు
వేటకొడవళ్ళలా వెంటాడి వీపులొకి దిగినప్పుడు
ఆ నొప్పి నీకే తెలుస్తుంది నాన్నా!
మనిషిని మనిషి వాహనంగా చేసుకొని ఎక్కి ఊరేగే వ్యవస్థలో
ఇంటా బైటా వరసలన్నీ ఉరితాళ్ళే కదా!
*****
అవును ఈరోజు నీ చావుకి పేనిన ఉరితాడు
నువ్వు పుట్టినప్పుడు నీ బొడ్డుతాడుతోటే పుట్టింది
చెప్పులు చేతబట్టుకొని
మూతికి ముంత కట్టుకొని
బెదురు కళ్ళతో తడబడే అడుగులతో వెలివాడల్లోనే నేలరాలిన
నీ పూర్వీకుల రక్తమేదో ఇప్పుడు నీలో ఎలుగెత్తి అరిచింది
అందుకే
నీ అపరూప సృజనాత్మక హృదయం మీద
చతుష్పాద మనువు శూలాలతో దాడి చేసి చిల్లులు పొడిచాడు
నీ అద్భుత మేధో కౌశలాన్ని
రాతిరధాలనెక్కొచ్చిన శతృవులు క్రూరంగా తూట్లు పొడిచారు
ఆకాశం భూమి చెట్టూ చేమ మనుషులు…. అంతా
అనంత విశ్వంలో భాగమైన ఓ విజ్ఞాన పదార్ధంగా పరిమళించాల్సిన విద్యావనాలు
నెత్తిన కులం కొమ్ములతో నారింజ రంగు వృషభాల కారడివిగా మారిపోతే
మొసళ్ళు నిండిన ఏ దిగుడు బావిలోనో దిగుళ్ళతో చిక్కడిపోయినట్లే వుంటుంది
బహుశ అప్పుడు నీ కలలు కూడా నిన్ను వెక్కిరించే వుంటాయి
బతుకు పోరాటమైతే పర్లేదు కానీ
బతుకంటే ఓడిపొయే యుద్ధం చేయటమే అనిపిస్తే
మనుషులందరూ శూన్యపు గొట్టాలుగా తిరుగుతూ కనబడుతుంటారు
శూన్యం నుండి విస్ఫోటనతో సృష్ఠి ఏర్పడినట్లు
నీచుట్టూ ఆవరించిన శూన్యం నీలో మృత్యుకాంక్ష బద్దలుచేసిందా?
నిజానికి ఇంతటి మానవ మహా శూన్యపు ఎడారిలో
చర్మంలో నీళ్ళు దాచుకున్న నీబోటి ఒంటెల్లాంటి వాళ్ళు
నీకు అసలు కనిపించనే లేదా రోహిత్?
****
దేశపటాన్ని కసిగా కరిచిన
కండచీమ దేహాన్ని ఉరితీసి ఆనందించే రాజ్యం చర్యని తప్పుబట్టి
నువ్వో దేశద్రోహివయ్యావు
దేశమంటే చుట్టుకొలతల విస్తీర్ణమని
దేశభక్తి అంటే సరిహద్దుల ఆవల శత్రుత్వాన్ని ఆపాదిస్తూ
మనుషులకంటే దేశపటాల్ని, ప్రతీకల్ని ప్రేమించే వాళ్ళ దృష్ఠిలో
నువ్వో దేశద్రోహివయ్యావు
వాళ్ళకేం తెలుసు?
దేశాన్ని ప్రేమించటమంటే మనుషుల్ని ప్రేమించటమని!
వ్యవస్థని ద్వేషించకుండా మనుషుల్ని ప్రేమించలేమని!
మనుషుల్ని ప్రేమించటమంటే విభజన రేఖలతో యుద్ధం చేయటమని!
ఆయుధాలతో నిమిత్తం లేని ఆ యుద్ధంలో
నీ గుండె నెత్తురోడింది రోహిత్
ఇంత తొందరగా అలసిపోతావని నీక్కూడా తెలియదేమో
****
నీ తండ్రే కులంలో ఎవతెకి పుడితే ఏమిటి?
నువ్వే అమ్మకి పుట్టావన్నదే ముఖ్యం
ఆ అమ్మ ఏ మట్టి వేళ్ళతో
నిన్ను సాకిందనేదే ముఖ్యం
బీజవిసర్జనతో చేతులు దులుపుకునేవాడి గొప్పదనమేమున్నది?
ఐనా బీజాలది మాత్రమేమున్నది?
గాలికి ఎగిరి కొట్టుకుంటూ కూడా రాగలవు
క్షేత్రమే కదా పొదివి పట్టుకొని
గర్భంలోకి తీసుకొని ఊపిర్లూది
బొడ్డుతాడుతో అంటుకట్టుకొని
తన నెత్తురూ నీరూ పోసి ఉపరితలమ్మీదకి తెచ్చేది
తను తిన్న అన్నం ముద్దని
చనుబాలుగా మార్చి సహాజత ఉద్వేగంతో రొమ్ముకదుముకొని
నీ చిట్టినోటిగుండా ప్రాణప్రతిష్ఠ చేసే అమ్మకే కదా బిడ్డవి
అమ్మ ఇచ్చిన పుట్టుమచ్చలే కదా నీకో గుర్తింపునిచ్చేది
అమ్మ చెంగుని పట్టుకొని
అమ్మ భుజాల మీదుగా లోకాన్ని పరిచయం చేసుకుంటూ ఎదిగి ఎదిగి
లోకం మీదకి దండెత్తి, కలబడి, అలిగి
తీరా నువ్వెళ్ళిపోతే
నీ దేహం మీద పంచనామాలో
ఓ నమ్మకం లాంటి నాన్న వాంగ్మూలం ఏమిటి?
ఐనా అమ్మ ప్రేమని తెలిసిన వాడివి కదా
ఉరి బిగుసుకుంటున్నప్పుడు
అమ్మకి కలిగే నొప్పికి విలవిల్లాడక వుంటావా?
మట్టిపనిలో కమిలిన అమ్మ చేతులు
కుట్టుపనిలో పగిలిన ఆమె మోకాళ్ళు
నీకు గుర్తుకు రానంతగా ఎంతటి ఆగ్రహ ప్రకటన చేసావు రోహిత్?
స్వేచ్ఛా ప్రబోధం చేసిన వీరుడు
చౌరస్తాల్లో తర్జనితో తాను నడిచొచ్చిన దారిని చూపిస్తూ ధైర్యాన్నిచ్చే ఆ వీరుడు కూడా
నీకు నమ్మకం ఇవ్వలేదా రోహిత్?
****
నువ్వొక్కడివే హతుడివి
హంతకులు మాత్రం కోట్లాదిమంది
మా కళ్ళల్లో ఎంత దిగులుమేఘంగా నువ్వు తారట్లాడినప్పటికీ
మా కన్నీటి చుక్కల్లో కూడా అపరాధ భావముంది
అందుకేనేమో ఒక్కో కన్నీటి బొట్టు
ఒక్కో చెంపదెబ్బలా తగులుతున్నది !

మీ మాటలు

  1. Indra Prasad says:

    గమ్భీరమైన కవిత.అరణ్య కృష్ణ గారూ వందనం

  2. Nagabhushanam Dasari says:

    అరణ్య కృష్ణ గారు,

    రోహిత్ మృత్యువుపై కవితా రూపంలో మీరు వెలుబుచ్చిన భావజాలం అత్యద్భుతంగా ఉంది. కుల నిర్ధారణలో రక్తమాంసాలు పంచి పెద్దచేసిన తల్లి కంటే గొప్పవారెవరు? బీజం నాటి పట్టించుకోని వాడి కులమేల జీవం పొసుకుని పుట్టినవాడికి అణ్వయిస్తుంది? మీరు వెలుబుచ్చిన అభిప్రాయంతో ఏకీభవిస్తూ అభినంధనలతో…

    నాగభూషణం దాసరి.

  3. ఒక్కో అక్షరం శూలంలా దిగబడుతోంది. అయినా సరిపోవడం లేదు, ఇంకేం చేద్దాం….

  4. Potagani Kavi says:

    అద్భుతం..ఒక ఉద్వేగ భరితమైన అంశాన్ని సంచలన కవితా వస్తువుగా మార్చడం…సామాజిక రుగ్మతలపై భాధ్యతాయుతంగా మందు పూసిన కత్తిలా గాయంచేయడం…బాగా తెలిసిన కలం అరణ్యకృష్ణుడిది…కవితాసారంతో ఏకీభవిస్తున్నాను,100%..

  5. Indus Martin says:

    Anna, I waited for this poem from you. You made my waiting worth. Everything behind and after his death is covered in a poetic grandure !

  6. విలాసాగరం రవీందర్ says:

    గొప్ప నివాళి

  7. రోహిత్ says:

    చాలా బాగుంది అండి అరణ్య కృష్ణ గారు. ఇది నాకు తెలిసినతవరకు మీ రెండో కవిత రోహిత్ హత్య మీద. మొదటి దాంట్లో క్రోధం ఐతే ఇందులో ఆవేదన. అంటే రెండు వేరు వేరు అని నా అభిప్రాయం కాదు. దొమినతింగ్ థీమ్ గురించి అలా చెప్పింది. రోహిత్ హత్య లో మనమందరం మన మన పాత్ర ఎంత సమర్థవంతంగా పోషించాము అనేది చివరి భాగం లో చాల అద్భుతంగా చెప్పారు.

  8. చదివినంతసేపూ ఉద్వేగం కలిగించింది. గొప్ప కవిత

  9. THIRUPALU says:

    చాలా ఎద్వేగా బరితమైన కవిత!

  10. THIRUPALU says:

    దేశ భక్తికి ఇచ్చిన నిర్వచనం బాగుంది.
    దేశమంటే మట్టి కాదోయి. దేశమంటే మనుషులోయి అన్నగురజాడ ఇంకా బతికే ఉన్నట్లుంది.

  11. చొప్ప వీరభధ్రప్ప says:

    మహా కవీ.ఇది ,ఎన్నటికీ ఓడిపోదు. సమర్థనీయం. బీజం బీజి, క్షేత్ర సంబంధం లో తల్లి యొక్క విశిష్టత గుర్తించవలసిందే..అనేక రుగ్మతలను ,ఎత్తిచూపి బాధ్యతలను గుర్తు చేసిన మీ కవితలో ,ఒక్కరి ఆవేదన మాత్రమే కాదు .అందరి ఆలోచనాతీరు మార్పులవైపే పయనిస్తుంది.

  12. “బతుకు పోరాటమైతే పర్లేదు కానీ
    బతుకంటే ఓడిపొయే యుద్ధం చేయటమే అనిపిస్తే
    మనుషులందరూ శూన్యపు గొట్టాలుగా తిరుగుతూ కనబడుతుంటారు”

    బహుశా ఈ ఫీలింగ్ సీరియస్ activists గా ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక సందర్భంలో కలిగే ఉంటుంది.
    రోహిత్ మీద మీ రెండు కవితలూ బాగున్నాయి.

  13. చాల బాగుంది అరణ్య కృష్ణగారు రోహిత్ మరణం వెనక ఉన్న అన్ని కోణాలు మీ కవితలో కనిపించాయి. ఆవేదన కూడా కనిపించింది.

  14. మీ కవిత ముందు చదవకపోయినందుకు సారి
    ఒకవేళ నేను ఈ కవిత ముందే చదివి ఉంటే
    నేను నా కవిత రాసే వాడిని కాదు.కాకపోతే ఓ సీరియస్ విషయం మీద స్పందించామనే తృప్తి తప్ప మరే ప్రయోజనం నా కవిత సాధించలేదు.

    • Aranya Krishna says:

      ధన్యవాదాలు మహమూద్ గారూ! అలా అనుకోకండి దయచేసి. స్పందించే ప్రతి హృదయం గొంతెతాల్సిన సందర్భం ఇది. ప్రతి కవిత విలువైనదే.

  15. jhansi kammela says:

    బాగుంది . అరణ్యకృష్ణ గారు,
    మీరు రోహిత్ పుట్టకముందు నుంచి,
    అతని మరణం వరకు మరియు ఆ తర్వాత
    జరిగిన మొత్తం సంగటనలు అతనికే చెప్పారు.
    మీ కవిత కదిలించింది.
    కన్నీటి చుక్కల అపరాధభావం
    మా చెంపల ఫై కూడా ప్రసరించింది

  16. బాగుంది. అయితే ఒకట్రెండు అచ్చుతప్పులున్నట్లున్నాయి.

  17. Felt the pain..a real tribute.

  18. Aranya Krishna says:

    మిత్రులందరికీ ధన్యవాదాలు.

Leave a Reply to Vasu (Srinivasa Nyayapati) Cancel reply

*