మతం ఎప్పటికైనా ఒక అవశేషమే – 5

 

 

[పోయిన వ్యాసానికి కొనసాగింపు]

 

పురాణ ఇతిహాసాలు పుట్టడానికీ, అవి లిపిబద్ధం అవ్వడానికి (రాయబడటానికి) మధ్య సులభంగా కొన్ని వందల సంవత్సరాల దూరం ఉంది. లిపి బాగా వృద్ధి చెందాక నాగరికయుగం దిగువ దశలో ఎప్పుడో వాటిని లిపిబద్ధం చెయ్యడం ప్రారంభమయ్యింది. అప్పటిదాకా కొన్ని వర్గాల ప్రజలు వాటిని కంఠతా పట్టి ప్రచారం చేస్తూ చాలా తరాల పాటు కాపాడుకుంటూ వచ్చారు. ఇన్ని వందల సంవత్సరాల పాటు జనాల నోట్లో నానుతూ ఈ పురాణాలు సజీవంగా ఉన్నాయి. కాకపోతే ఈ క్రమంలో వాటిలో ఉన్న అసలు కథలు చాలా వరకు మారిపోయాయి. ఎన్నో పిట్ట కథలు, కట్టు కథలు వచ్చి చేరాయి. ఆ పురాణ కథలని లిపిబద్ధం చేసిన కవులు తాము రాస్తున్న కాలం లో ప్రచారంలో ఉన్న కథనే రాయడం జరిగింది.

మతం ఘనీభవించడంలో లిపి పాత్ర చాలా ముఖ్యమయినది. జనాల నోట్లో నానే కథలు మారినంత తేలికగా రాయబడి ఉన్న కథలు మారవు. వాటిని ఎవరైనా పనిగట్టుకుని మార్చినా అది బయటికి సులభంగా తెలిసిపోతుంది. ఒకసారి రాతప్రతులు తయారయ్యాక ఆ కథలని విస్తృతంగా ప్రచారం చెయ్యడం సాధ్యపడింది. మత ఆచారాలు, నియమాలు ఇంకా బలంగా ప్రజలలో అమలయ్యేలా చెయ్యడం సాధ్యపడింది. ఆ తరవాత వచ్చిన ఎన్నో తరాలకి ఈ కావ్యపుస్తకాలే ఒక reference లాగా ఉపయోగపడ్డాయి. ఏ మతపరమయిన విషయానికైనా ఈ పురాణ, ఇతిహాస, శాస్త్రాలనే refer చేస్తారు. ఆ కాలం నాటి మత అచారాలే అసలైన మత ఆచారాలుగా, అప్పటి “దేవుని రూపమే” అసలైన దేవుని రూపం అని నమ్ముతారు. అందుకనే ఇప్పటికీ కిరీటాలు, కత్తులు పట్టుకున్న దేవుళ్లే ప్రచారంలో ఉన్నారు. అలాంటి బొమ్మలూ, విగ్రహాలే మనకి కనిపిస్తాయి.

మతానికి ఉన్న ఇంకొక ప్రత్యేకమయిన లక్షణం “మౌఢ్యం”. అది మనుషులకి ప్రకృతి మీద ఉన్న అజ్ఞానం లోంచి పుట్టినది. మతం చెప్పే విషయాలకి “గుడ్డి విశ్వాసం” తప్ప ఇంకొక రుజువు ఉండదు. మనుషులు ఒకవైపు తమ స్వీయ అనుభవంతో ఎన్నో శాస్త్రాలు (Science) అభివృద్ధి చేసుకుని, ప్రకృతి విషయాలకి రుజువులు సాధించినప్పటికీ కూడా మతం వాటిని ఒప్పుకోదు.  ఆ అజ్ఞానం, ఈ గుడ్డి విశ్వాసం కలిసి మౌఢ్యంగా తయారవుతుంది.

ఉదాహరణకి, హిందూ మతవాదులు “మను ధర్మ శాస్త్రాన్ని” అసలైన ధర్మ శాస్త్రం అని అంటారు. తమ మతానికి అది ప్రామాణికం అనీ, అందులో ఉన్న ధర్మాలే ఎల్ల కాలాలపాటు అనుసరించాలి అని అంటారు. వారు గమనించని విషయం ఏమిటంటే ఆ మను ధర్మ శాస్త్రం కూడా మిగతా అన్ని పురాణాల లాగే ఎప్పుడో ఎక్కడో పుట్టి కాలంతో పాటు మారుతూ వచ్చి ఎవరిచేతనో ఒకానొక కాలంలో రాయబడింది. అది రాయబడే కాలం నాటికి రాచరిక వ్యవస్థ నడుస్తోంది. అందులో ఉన్న ధర్మాలు అన్నీ ఆ వ్యవస్థని ఉద్దేశించి రాసినవే. రాజులు ఎలా పరిపాలించాలి, ఏ తప్పుకు రాజు ఏ శిక్ష వెయ్యాలి. వర్ణ సంకరం జరగకుండా ఎలా చూసుకోవాలి. ఏ పనికి ఎన్ని బంగారు నాణేలు పన్నులు వెయ్యాలి – ఇలాంటి ధర్మాలు చాలానే ఉన్నాయి అందులో. మరి అవి నేటి ప్రజాస్వామిక వ్యవస్థకి ఎలా apply అవుతాయి? అసలు విషయం ఏమిటంటే, ఆ మను ధర్మ శాస్త్రం పుట్టిన కాలం నుంచి సమాజం చాలా దూరం ముందుకి వచ్చేసింది. ఎంతో ఎదిగింది కూడా. ఈ సమాజానికి అది ఏ రకంగానూ ఉపయోగకరం కాదు. కాస్త logical గా ఆలోచిస్తే ఆ విషయం ఎవరికయినా అర్థమవుతుంది. కాని మతంతో పాటే వచ్చే మౌఢ్యం మతవాదులని ఆలోచించనివ్వదు.

ఇక మన ప్రశ్నలోని రెండో భాగం “ఏ దేవుని బొమ్మ, కథ కూడా దేవుడు గన్ను, బాంబులు పట్టుకున్నట్టు చూపించదు ఎందుకని?” ఇప్పటిదాకా చర్చించుకున్న సమాజ పరిణామ క్రమం అర్థమయితే పాఠకులకి ఈ ప్రశ్నకి సమాధానం సులభంగా అర్థమవుతుంది.

గన్నులు కత్తులకన్నా చాలా అభివృద్ధి చెందిన ఆయుధాలు. మందుగుండు తయారు చెయ్యడానికి రసాయన శాస్త్రం మీద మంచి అవగాహన అవసరం. సల్ఫర్, పొటాషియం నైట్రేట్ లని తయారు చెయ్యాలి, సరైన పాళ్ళలో కలపాలి. ఈ పరిజ్ఞానం నాగరిక యుగం ఎగువ దశలో అభివృద్ధి చెందింది. గన్నులు తయారయ్యేదాకా (క్రీ.శ. 1600 దాకా) ప్రపంచమంతా కత్తులే రాజ్యం చేశాయి. క్రీ.శ. 18, 19 వ శతాబ్దాలు వచ్చేసరికి ఆయుధాలతో పాటు అనేక శాస్త్రాలలో మానవులు అద్వితీయమైన పురోగతి సాధించారు. ప్రకృతి శాస్త్రాలు (Biology, Environmental science etc.) వైద్య శాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు అన్నిట్లో ఎన్నో గొప్ప ఆవిష్కరణలు జరిగాయి.

Science అభివృద్ధి మనుషులలో క్రమంగా ప్రకృతి మీద, సమాజం మీద ఉన్న అపోహలని పోగొట్టడం మొదలుపెట్టింది. ఈ అపోహల మీదే పునాదులు వేసుకున్న “మతం” క్రమంగా తన పట్టు కోల్పోవడం మొదలయ్యింది. ప్రజల్లో శాస్త్రీయ పరిజ్ఞానం పెరిగే కొద్దీ వారికి ఏవో “కట్టు కథలు” చెప్పి మభ్యపెట్టడం సాధ్యం కాకుండా పోతుంది. “పోసేడాన్ అనే దేవుడు సముద్రం లోపల కూచుని తన త్రిశూలం తిప్పి సముద్రంలో సుడిగుండాలు సృష్టిస్తాడు” అని గ్రీకులు ఒకప్పుడు నమ్మేవారు. ఇవ్వాళ ఆ విషయాన్ని గ్రీకు ప్రజలు కూడా నమ్మరు ! అలాగని త్రిశూలం తీసేసి గన్నులు పెట్టినా నమ్మరు ! ఎందుకంటే గన్నులు అనేవి దైవదత్తమైన వస్తువులు కావనీ, మనుషులు తమ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న వస్తువులు అనీ ఈనాటి మానవులకి తెలుసు. అందువల్ల ఇప్పుడు కొత్త దేవుళ్ళని సృష్టించడం గానీ, పాత దేవుళ్ళ చేతుల్లో కొత్త ఆయుధాలు పెట్టడం గానీ అంత సులభం కాదు.!

ఈ అనివార్య పరిస్థితులలో మతం తన పునాదులని ప్రజల ఆర్ధిక అవసరాల/ఇబ్బందుల మీదకి మరల్చుకోవడం మొదలు పెట్టింది. నేటి మతంలో భక్తులకి ఆధ్యాత్మిక చింతన కంటే వారి ఆర్ధిక ప్రయోజనాలే ఎక్కువ ముఖ్యం. మతాన్ని ప్రచారం చేసేవాళ్ళు కూడా ఈ ఆర్ధిక అవసరాలనే target చేసుకుంటున్నారు. ఈ క్రమం సుమారు రెండు శతాబ్దాల క్రితం మొదలయ్యి ఇంకా కొనసాగుతోంది. ఇది అనివార్యంగా జరుగుతున్న మార్పు.

ఆటవిక యుగం మధ్య దశలో మనుషులకి ప్రకృతి శక్తుల మీద ఉన్న అవగాహనా లేమి లోంచి మతం పుట్టింది. “లక్ష” సంవత్సరాల పాటు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ, బలపడుతూ నాగరిక యుగ మధ్య దశకి వచ్చేసరికి మానవ సామాజిక జీవితంలో అత్యంత ముఖ్యమయిన అంశంగా అవతరించింది. కుటుంబ వ్యవస్థలు, పాలనా వ్యవస్థలు అన్ని మతం కనుసన్నల్లో నడిచే అంత స్థాయికి బలపడింది. నాగరిక యుగం ఎగువ దశలో సాంకేతిక, సామాజిక శాస్త్రాల అభివృద్ధి తరవాత “మతం” యొక్క పరిణామ క్రమంలో బలహీన పడే దశ మొదలయ్యింది. ఇంకొన్ని అభివృద్ధి దశలు గడిచేసరికి మతం సమాజంలో ఒక అవశేషంగా మిగిలిపోతుంది. మతంతో పాటే దేవుడు కూడా !

***

మీ మాటలు

 1. చందు తులసి says:

  మీరన్నట్లు కొత్త దేవుళ్ల సృష్టి‌..ఇక మీదట సాధ్యం కాదు. కానీ కొందరు…ఇప్పటికీ కొత్త దేవుళ్లని పుట్టిస్తున్నారు. వాటికి పురాణాలతో సంబంధం అంటగడుతున్నారు. మామూలు మనుషుల్లాగే..తింటూ తాగుతూ, సెల్ ఫోన్ వాడుతూ…అన్ని సౌకర్యాలూ అనుభవిస్తూ తామే దేవుళ్లమని చెబుతున్నారు.
  ఆశ్చర్యమేమంటే దొంగలు ఏం చెప్పినా‌‌…నమ్మేవాళ్లుండడం.మంచిని చెప్పే వాళ్లను సంఘ వ్యతిరేకులని చిత్రించడం.

 2. G B Sastry says:

  చాల చక్కని, తర్కానికి నిలబడే వివరణ ఇచ్చారు
  అన్ని మతాలవారు నిన్న చెప్పినదానికి సార్వ జనీనత సర్వ కాలాలకి సంబంధత ఉండదన్న మాట గుర్తిస్తే మత మౌధ్యాలు మత ఘర్షణలు తగ్గుతాయి
  పెరిగిన జనాభాకి హిందూ ధర్మం చెప్పే ముక్కోటి దేవతలు సరిపోక కొత్త బాబాలు దేవతలు పుట్టుకు రాక తప్పదనుకొంటాను చందు తులసి గారు
  లోకోభిన్నరుచి పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారుకదా అందరిని తా మూలిగింది గంగ తా వలచింది రంభ అనుకోనీయండి అలా మిగిలిన వారు అందరూ అనుకోవాలనంతవరకు పేచి లేదుకదా?

 3. I believe from my understanding that real life for a human being starts only after he starts analysing “god” thing by himself & find out an answer rather than blindly follow the existing beliefs. Since I’m in that journey your article is so informative for me..thanks Vinod. One confession: I’m more comfortable with English to express myself..

 4. satyanarayana says:

  ఇంత చదువుకున్న వాళ్ళు పాలుపంచుకునే Web మ్యాగజైన్ లో ,మీ పోస్ట్ కి వచ్చిన స్పందనకి , ” సిగ్గు చేటు ” అనుకోవాలి . సిగ్గు పడాల్సింది మీరు కాదు .

  వినోద్ ఆనంతోజు గారికి ,
  చాలా విపులంగా వివరించారు “దేవుని చేతిలో గన్నులు ఎందుకు లేవో !
  వినడానికి చాలామందికి ఓపిక లేదు ,వాళ్ళ వాళ్ళ విశ్వాసాలు అంత గుడ్డివి .

  “మతానికి ఉన్న ఇంకొక ప్రత్యేకమయిన లక్షణం “మౌఢ్యం”. అది మనుషులకి ప్రకృతి మీద ఉన్న అజ్ఞానం లోంచి పుట్టినది. మతం చెప్పే విషయాలకి “గుడ్డి విశ్వాసం” తప్ప ఇంకొక రుజువు ఉండదు. మనుషులు ఒకవైపు తమ స్వీయ అనుభవంతో ఎన్నో శాస్త్రాలు (Science) అభివృద్ధి చేసుకుని, ప్రకృతి విషయాలకి రుజువులు సాధించినప్పటికీ కూడా మతం వాటిని ఒప్పుకోదు. ఆ అజ్ఞానం, ఈ గుడ్డి విశ్వాసం కలిసి మౌఢ్యంగా తయారవుతుంది.”
  వినోద్ గారూ ,మీరు పైన చెప్పిన మాటలు చెప్పి ఊరుకుంటే కుదరదు .
  “మతం ” ఎంత నష్టదాయకమో కూడా చెప్పాలి ,నా దృష్టి లో ,మానవ పురోభివృద్ధికి అతి భయంకరమయిన కందకం , ఊబి, నూక్లియర్ Fission , కంటే కూడా ప్రమాదకరమయినది మతమే .
  ప్రపంచ జనాభాలో ,99 శాతం ,వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఒక పనికిరాని ప్రక్రియ కి ,ఎంతో సమయం వెచ్చించి ,తమ విజ్ఞత కోల్పోవడానికి , తద్వారా వినాశనానికి కూడా కారణం కాబోయే ఈ జాడ్యాన్ని ” ,మనలాంటి “బుద్ధిజీవులు ” వీలయినంత ఖండించి ,ప్రచారం చేయాలి .
  మీరు ,తెలిసిన పుస్తకాలేమయినా ఉంటే చెప్పమన్నారు , ఒక సమాధానంలో ,
  Richard Dawkins ” The Greatest Show On Earth “,” Cosmos ” by Carl Sagan ,”God is Not Great ” By Christopher Hitchens ,తప్పక చదవాలి .

 5. కె.కె. రామయ్య says:

  “మతం” యొక్క పరిణామ క్రమాన్ని చక్కగా వివరించిన వినోద్ ఆనంతోజు గారికి, ఈ సందర్భంలో తప్పక చదవాల్సిన పుస్తకాలను సూచించిన సత్యనారాయణ గారికి ధన్యవాదాలు.

మీ మాటలు

*