కొమ్మ చాటు కోకిల ఎమిలీ డికిన్సన్

 

 

    – నాగరాజు రామస్వామి

~

ఏభై ఆరేళ్ల జీవిత కాలంలో 1800 లకు పైగా ఆణిముత్యాల లాంటి  కవితలు రాసి, కేవలం ఏడింటిని మాత్రమే ప్రచురించుకున్న 19 వ శతాబ్ది అమెరికన్ కవయిత్రి ఎమిలీ  డికిన్ సన్. తన యావజ్జీవితాన్ని నాలుగు గోడలకే పరిమితం చేసుకొని, కొమ్మల్లోంచి బయటకు రాని కోకిల ఎమిలీ. ఆమె మరణానంతరం ఆమె సోదరి లవీనియా కలుగజేసుకొని, చిత్తుకాగితాలలో దాగిన కవన స్వరాలను ఆవిష్కరించకుండా ఉంటే, బహుశ, ఆ అభినవ కోకిల గొంతు కొమ్మల్లోనే సద్దుమణగి పోయేదేమో.

ఎమిలీ – ఏమిలీ ఎలిజబెత్ డికిన్సన్ (1830 – 1886 ) – అమెరికా లోని ఆమర్స్ట్ (Amherst ) లోని క్రైస్తవ సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది. ఆమర్స్ట్ అకాడమీ లో తెలివైన విద్యార్థినిగా పేరు పోందింది. 17 ఏళ్లకే చదువు చాలించి, తండ్రి కట్టిన ఇల్లు హొమ్ స్టెడ్ లో  శేష జీవితాన్ని ఒంటరిగా గడిపింది. ఒకటి రెండు సార్లు వాషింగ్టన్ డి.సి, ఫిలడల్ఫియా, బోస్టన్ కు మాత్రమే వెళ్లింది. అడపాదడపా కలిసే ఒకరిద్దరు మిత్రులు తప్ప చెప్పుకోదగిన ఆత్మీయులు లేరు. పెళ్లిచేసుకోకుండా ఉండి కన్య గానే మరణించింది. ఎప్పుడో గాని చర్చికి వెళ్లేది కాదు. తెల్లని దుస్తులే ధరించేది. ఎవరితోనూ కలుపుగోలుగా ఉండక ఏకాకిగా బతికేది. కనుకనే ఆమెను మిథ్ (myth) అని అంటుండే వారు. రాసిన కవితలలో సింహభాగం మృత్యువు సంబంధమైనవే అయినందున ఆమెను మార్బిడ్ (Morbid) పోయెట్ అనేవాళ్లు. ఫోటో పంపమని అడిగిన సంపాదకులకు ‘I am small like the wren, and my hair is bold, like chestnut bar – and my eyes like the sherry in the glass, that the guest leaves ‘ అని చెప్పిందే కాని ఫోటో పంప లేదు. ఎక్కడో దొరికిన ఏదో ఒక Daguerreotype ముతక ఫోటోతో వాళ్లు సరిపుచ్చుకోక తప్పలేదు.

మానవ సంబంధాలకూ, ప్రపంచ రీతులకూ దూరంగా ఉన్న ఆ ఒంటరి జీవి అన్ని కవితలు ఎలా రాయగలిగిందో,  ‘ America’s true poetic genius ‘ గా ఎలా ఎదుగ గలిగిందో ఆలోచిస్తే వింతగా ఉంటుంది. ఆమెను అంటిపెట్టుకున్న పలు పుస్తకాలే అందుకు దోహదం చేసి ఉండవచ్చు. ఆమెను ప్రభావితం చేసిన కవులలో పోయెట్ ఎలిజబెత్ బార్రెట్ బ్రౌనింగ్, హాతోర్న్, థోరో, ఎమెర్సన్, లాంగ్ ఫెలో, షేక్స్ పియర్,జాన్ కీట్స్ , జార్జ్ ఇలియట్ ముఖ్యులు.
వర్డ్స్ వర్త్, కోలరిడ్జ్, కీట్స్, బైరన్, షెల్లీ, బ్లేక్  ప్రభృతులతో  ప్రారంభమైన కాల్పనిక సాహిత్యోద్యమ కెరటం ( Romantic Movement ) పలు ప్రపంచ దేశాలను చుట్టి 19 వ శతాబ్దం నాటికి అమెరికా తీరాన్ని తాకింది. రష్యాలో Pushkin, స్పేన్ లో Jose de Espronceda, పోర్చ్ గల్ లో Almeida Garette, ఇటలీ లో Ugo Foscolo, అర్జెన్టీనా లో Esteban Echeverria, బ్రాజిల్ లో Jose de Alenar  వంటి వాళ్లను  ప్రభావితం చేసిన రొమాంటిక్ కవిత్వం అమెరికా లో  విలియమ్  బ్ర్యంట్, వాల్ట్ విట్మన్, ఎమిలీ డికిన్ సన్ లను సృష్టించింది. అమెరికా జాతీయ అధునిక సాహిత్య నుడికార  సృష్టి కర్తలుగా పరిగణించ బడుతున్న ఇద్దరి లో ఒకరు వాల్ట్ విట్మన్, మరొకరు కవయిత్రి  ఎమిలీ డికిన్ సన్. విట్మన్ ది బైబల్ సంబంధిత దీర్ఘ పంక్తుల కవిత్వ మైతే, డికిన్ సన్ ది ప్రొటెస్టంట్ భావ సాంద్ర మైన లఘు వాక్యాల కవిత్వం. విట్మన్ లో విస్పష్ట భావోద్వేగం పొంగి పొరలుతే, డికిన్ సన్ లో వికల భావ అస్పష్టత దోబూచులాడుతుంది. అమెరికా లో పరిఢవిల్లుతున్న నేటి ఆంగ్ల కవితా అధునిక చైతన్య ధారకు వీళ్లిద్దరు మూలభూతులు అనడంలో సందేహం లేదు.

ఆమె ఎన్నోమరపు రాని ప్రణయ కవితలను, వెంటాడే మత సంబంధిత గీతాలను, ‘Master Letters’ అని కొనియాడబడిన  ఉత్తరాలు రాసింది. డికిన్ సన్ జీవితం ఎంత చిత్రమైందో, ఆమె కవిత్వం అంత అసాధారణ మైంది. భాషను కొత్త పుంతలు తొక్కించే స్వేచ్ఛాధోరిణి. వ్యాకరణ సూత్రాలను లెక్కచేయని స్వైర  ప్రయోగాత్మకత. ఆమెది ఒకవిధంగా  capre diem poetry – శక్తివంతమైన వర్తమాన క్షణాలను పొదవి పట్టుకొని ‘Seize the day’, ‘ Live-in-the-moment’, ‘Dwell in the possibility’ అంటూనే లౌకిక సీమలను అధిగమించే ఆత్మ భావన. ‘Bring me the sunset into my cup’ – అన్న ఆమె కవితా పంక్తులు అధునికత గత శతాబ్దంలోనే కవిత్వ భూములలో అడుగిడిందనటానికి ఆనవాలు. ఆమె వాక్య నిర్మాణం నవీనం. వ్యాకరణం ఆమోదించని విరామ చిహ్నాలను, డాష్ లను ఇచ్ఛానుసారం వాడుతుంటుంది అనడానికి నా ఈ యథాతథ అనువాదాలు :
             నేను నివసించేది సంభవంలో —
వచనం కన్నా అందమైనది —
దానికి కిటికీలు అనేకం —
ద్వారాలు ఉత్కృష్టం —
గట్టి కర్ర తో కట్టినవి —
కనుచూపుకు గహనమైనవి —
శాశ్వతమైన పైకప్పు కోసం
ఆకాశపు వసారాలు వాల్చబడ్డవి —
సందర్శకులు — సజ్జనులు —
వాళ్లు ఉండేందుకు — ఇది–
స్వర్గాన్ని పోగుచేసుకునేందుకు
చాచిన నా బాహువులు —

ఆమె కవితలకు శీర్షిక లుండవు. రూపం ( Form ) లోనూ, ఉత్ప్రేక్షల వినియోగం లోనూ ఆమెది అసాంప్రదాయ కవిస్వేచ్ఛ ( Poetic license ) :
             మేధ — ఆకాశం కన్నా విశాలం —
పక్క పక్కన పెడితే —
దాంట్లో రెండోది అవలీలగా ఇముడుతుంది —
మరి నీకూ ఉంటుంది పక్కన చోటు —
మెదడు సముద్రం కన్నా లోతైంది —
నీలిమనూ నీలిమనూ —
పట్టుకొని చూడు —
అది రెండో దాన్ని ఇట్టే పీల్చేసుకుంటుంది–
స్పాంజ్ — బకెట్ లా–
మస్తిష్కం బరువు దేవుని అంత —
తూచి చూడు– పౌండు కు పౌండు —
భేదం అంటూ ఉంటే–
అది ఉచ్ఛారణకూ శబ్దానికి ఉన్నంత —

కవితకు సరిపడదేమో అన్నట్టుంటుండే ఆమె ఉన్న ఫళంగా వాడిన ఆరంభ వాక్యం ఊహకు పొసగదు. Humming Bird ను ఉద్దేశించిన కవిత తొలి పంక్తి  ‘మాయ మయ్యే మార్గం’ – ‘A route of Evanescence’. కాని, ఆ కిటుకు తెలిసాక, పాఠకుకునికి సంభ్రమాశ్చర్యం తప్పదు :
  చిటికెలో మాయమయ్యే మార్గంలో
గిర్రున తిరిగే చక్రం —
పచ్చలను అనునదించే కంపనం —
ఆరుద్ర అరుణిమల శీఘ్ర గమనం —
ఆ రంగుల ఉరవడికి
వాల్చిన తలను సవరించు కుంటుంది
పూలపొద మీది ప్రతి పుష్పం
ఆది
దూరదేశం నుండి దూసుకొచ్చిన జాబేమో,
కన్వేగు వేళ హాయిగొలిపే  కాలి నడకేమో —         

ఒక్కో చోట వ్యాకరణ విరుద్ధంగా  capital letter వాడుతుంది. ఇక్కడ పువ్వు – Flower ( F in upper case) ! పైగా ఆ పువ్వు సంతోషం గా ఉన్న పువ్వు !
           ఆటకోలు మంచు
యాదృశ్ఛికంగా
తన తలను ఖండించినా
సంతోషంగా ఉన్న ఏ పువ్వూ
ఆశ్చర్య పడినట్టు లేదు —
ఆ అందాల హంతకి
అలవోకగా కదలి పోతుంటుంది —
చలించని సూర్యుని దినచర్య
యథావిధి కొనసాగుతుంటుంది —
ఆమోదించే దేవుని కోసం .

వాక్యాల వింత విరుపులతో, భావావరణాల కుదింపులతో కూడిన అందమైన అస్పష్టత :
           ఘోర విషాదం పిదప
మామూలై పోయిన స్తబ్ద యాంత్రికత —
నరాలు ఆచార్య పీఠం వేసుకొని కూర్చుంటవి — సమాధుల్లా,
బిగుసుకు పోయిన హృదయం ప్రశ్నిస్తుంటుంది
అతడేనా భరించింది ?
మరి ఇది నిన్నమొన్ననాటిదా  లేక శతాబ్దాలకు ముందుదా?’ అని–
కలప బాట మీదో, గాలిమీదో, దేనిమీదో
కాళ్లు యాంత్రికంగా కదలాడుతుంటవి —
లోన ఏదీ పట్టని బండబారిన నిర్లక్ష్య స్ఫటిక  నిశ్చలత —
సీసంలా ఘనీభవించిన సమయం —
చలి బారికి బతికి బయట పడి గడ్డ కట్టినా
మంచునే స్మరించే మనుషులు —
మొదట చలి, పిదప దిగ్భ్రాంతి,
ఆపిదప వదలివేత — అనాసక్త స్వేచ్ఛ —

చిత్రమైన భ్రాంతి మెలకువల సందిగ్ధ భావ చిత్రం . మన ఊహకే వదిలివేయబడిన అర్ధాంతర ముగింపు :
         నా తలలో ఒక శవయాత్ర కదలిక ,
నా మెదడులో  ఒక అంతిమ క్రియాకాండ —
సంతాపకులు అదేపనిగా అటూ ఇటూ తిరుగుతూ,
నా ఆలోచనను ఆసాంతం అణగదొక్కుతూ —
సందడి.
ఆ తతంగం అంతా ఒక భరించరాని ఢంకా మ్రోతలా ఉన్నది
ఎడతెగని ఆ కఠోర ధ్వనికి నా తల దిమ్మెక్కేట్టున్నది.
వాళ్లు ఆ శవపేటికను ఎత్తేటప్పుడు
కీచు శబ్దమేదో నా గుండెల్లోంచి దూసుకు పోతున్నది,
వాళ్ల ఇనుప బూట్ల తొక్కిడికి లోని నేల కూలు తున్నది.
స్వర్గసీమలన్నీ కలసి  ఒక పెద్ద ఘంటగా మారినట్టు,
నా అస్తిత్వం అంతా వెరసి అది వినేందుకే ఉందన్నట్టు,
నేనూ నా నిశ్శబ్దం ఏదో వింత ఒరిపిడికి విరిగి ఒరిగినట్టు ,
ఇక్కడ నేను ఒంటరినై మిగిలి పోయినట్టు —  ఉన్నది.
నా కాలికింది కలప పగిలి నేను పడిపోతున్నాను —
కిందకు – మరింత కిందకు —
ఒక్కో పతనంలో ఒక్కో ప్రపంచపు తాకిడి,
ఒక్కో తాకిడితో ఒక్కో శిథిలమైన ఎరుక మరపు —
– – –
మరి ఆవెనుక – – – –

ఆమె ఒక విధంగా మత విశ్వాసాల కవయిత్రే. వ్యక్తిగత జూడీ-క్రిస్టియన్ నమ్మకాలకూ శుద్ధ భగవత్ తత్వ భావానికీ మధ్య నున్న లంకె కోసం ఆన్వేషించింది. ‘ Hope is the thing with feathers ”అనే కవితలో అమూర్త అంశాలకూ భౌతిక విషయాలకూ మధ్య నున్న సమగ్రతను పట్టుకోవడం కోసం పరితపించింది. ఆమె కవితా ప్రక్రియ ఎంత జటిలమైందో, ఆమె మత పరమైన భావధార కూడా అంత క్లిష్టమైంది. స్వీయాత్మ చింతనా నేపథ్యంలో, దేవున్ని కరుణ హీనునిగా చిత్రించింది.చర్చికి వెళ్లడం మానేసింది. ‘ Tell the Truth, but, tell it slant ‘లో పరోక్షంగా దూషించినా,’ My Life has stood — A loading gun ‘వంటి  కవితలలో నేరుగా దేవున్ని క్రూరునిగా దుయ్యబట్టింది. అయితే, ఆమెను నాస్తికురాలని అనలేము. ఆమెకు తనదైన స్వయంకపోలకల్పిత  దైవీయ భావన ఆమెకుంది – A home-spun theology of her own.
డికిన్సన్ ను విశిష్ట కవయిత్రిగా నిలిపింది మాత్రం ఆమె అసాంప్రదాయ అధునిక శైలీ శిల్పాలనే చెప్పాలి. భావ గాఢతను మించిన శైలీ విన్యాసం. Style is the poetry అన్నంతగా రచనలు చేసింది. పదాల పోహళింపును  (Syntax) తలకిందులు చేసి, అసంబద్ధ పదబంధాలను, విరోధాభాస (Paradox) పదాలను పక్క పక్కన పేర్చి    ( Parataxis technic  ), కామాలటో, డాష్ లతో, ఊహించని పునరుక్తులతో, అసదృశ Word Play తో తనదైన విశిష్ట వైయక్తిక శైలిని ( Ideosyncracy ) సంతరింప  జేసుకుంది కనుకనే అమెరికన్ అంగ్ల అధునిక సాహితీ వైతాళిక కవయిత్రిగా ఆమెకు స్థానం స్థిరపడింది. అయితే, ఆమె లోని ఈ వినూత్న విశిష్ట వైకృతులకు అనితర సాధ్యమైన అభివ్యక్తీకరణ సత్తా  ఉన్నందువల్లనే ఆమె నూత్న ప్రక్రియ అంతగా రాణించింది. డికిన్సన్ చూపిన అధునిక సృజన వైఖరి వల్ల అమెరికన్ ఆంగ్ల సాహిత్యం కొత్త మలుపులు తిరిగింది. ఆమె నవ్య ధోరిణికి ప్రభావితమైన వర్ధమాన కవితాలోకం నవనవంగా వర్ధిల్లింది. ‘డికిన్స్ ప్రభావిత కవిత’ పేర ప్రతి సంవత్సరం Poetry Society of America బహుమతి ప్రధానం చేస్తున్నది. అది ఆమెకు అమెరికా ఇస్తున్న సృజన నివాళి.

మీ మాటలు

 1. Rammohanrao Thummuri says:

  ఓహ్ చాలా బాగుంది కొమ్మ చాటు కోకిల పరిచయం.ఎవరి మెప్పుకో రాయకుండా తనలోని భావోద్వేగం పెల్లుబికినప్పుడే అచ్చమైన కవిత ఉరికి వస్తుందనేది,అది నిసర్గ సుందరంగా ఉంటుందనేది తెలిసింది.ఇప్పుడు నాగరాజు రామస్వామి గారి బాధ్యతమరింత పెరిగింది.ఇంకా ఇలా గుబుర్లలో దాగిన ఎన్నికోకిలలున్నాయో.
  వాటిని వెదికి పట్టి పాటలు వినిపిస్తే సంతోషం.అభినందనలు.

 2. మీ ఉదారమైన అభినందనలకు హృదయపూర్వక ధన్యవాదాలు.

 3. నారాయణస్వామి says:

  అద్భుతంగా ఉంది సర్ ఎమిలీ డికెంసన్ ని చాలా విశదంగా పరిచయం చేసినరు – అమెరికా కవిత్వ చరిత్రను అందులో డికెంసన్ పాత్ర ను చక్కగా వివరించినరు ఆమె కవిత్వ రీతులను రూపాలను వివరించి తెలియని విషయాలెన్నో చెప్పినరు. ముఖ్యంగా “ఆమె అసాంప్రదాయ అధునిక శైలీ శిల్పాలనే చెప్పాలి. భావ గాఢతను మించిన శైలీ విన్యాసం. Style is the poetry అన్నంతగా రచనలు చేసింది. పదాల పోహళింపును (Syntax) తలకిందులు చేసి, అసంబద్ధ పదబంధాలను, విరోధాభాస (Paradox) పదాలను పక్క పక్కన పేర్చి ( Parataxis technic ), కామాలటో, డాష్ లతో, ఊహించని పునరుక్తులతో, అసదృశ Word Play తో తనదైన విశిష్ట వైయక్తిక శైలిని ( Ideosyncracy ) సంతరింప జేసుకుంది” – చాలా బాగుంది.

 4. ఎంతో అందమైన పదాలతో అంత కంటే గొప్ప కవయిత్రిని పరిచయం చేసారు . ధన్యవాదాలు

 5. నారాయణ స్వామి గారికి, భవాని గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు .

మీ మాటలు

*