ఒక బాటసారి: కొన్ని మాటలూ…

 

 

– కృష్ణ మోహన్ బాబు

~

 

(ఛాయ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న సాయంత్రం 5:30కు హైదరాబాద్, దోమలగూడలోని హైదరాబాద్ స్టడీ సర్కిల్లో రాజిరెడ్డి రచనల మీద కాకుమాని శ్రీనివాసరావు ‘ఒక బాటసారి బైరాగి పదాలు’ పేరిట ప్రసంగించనున్న సందర్భంగా…)

 

mohanbabu“అక్కడ చెట్లు, మనుషులు వేర్వేరుగా లేరు. మట్టి, మనిషి వేర్వేరుగా లేరు.  ఒక సంస్కృతిగా, జీవన విధానంగా వాళ్ళు కొబ్బరిచెట్లతో మమేకమయ్యారు.  బతుకులో భాగంగా, బతుక్కి ఆలంబనగా కొబ్బరి చెట్లు కనిపించాయి”. 

కోనసీమలో మొదటిసారిగా ఓ పెళ్ళి కోసం అడుగు పెట్టినపుడు, మనుషుల్లా పరుచుకున్న చెట్లు, చెట్లై నిలబడ్డ మనుషుల్ని చూసి, జర్నలిస్ట్, రచయిత, పూడూరి రాజిరెడ్డికి కలిగిన భావన ఇది.  మామూలు, అతి మామూలు విషయాల్ని మెత్తని పదాలతో, గడుసు వాక్యాలతో రంగు రంగుల చిత్రాలుగా మలచగలిగిన నేర్పు రాజిరెడ్డిది. అలాంటి అందమయిన భావ చిత్రాల పొందికే ‘పలక – పెన్సిల్. ఇది రాజిరెడ్డి రెండో పుస్తకం.

బాల్యం నుంచి కౌమారం మీదుగా యవ్వనంలోకి అడుగు పెడుతున్న కుర్రాడి గొంతులో, ఆలోచనల్లో వచ్చే మార్పులే బలపం – పెన్సిల్ – పెన్నుగా మారి ఈ పుస్తకంలో మన ముందుకొస్తాయి.  రచయిత జ్ఞాపకాలు, అనుభవాలు చదివితే తమ జీవితంలో కూడా యించుమించు అలాంటి అనుభవాలే ఉన్న స్పృహ పాఠకులకు కలుగుతుంది.  అందుకే రచయిత వాక్యాలు పాఠకుల ఆలోచనల్ని, జ్ఞాపకాల్ని మోసుకుంటూ వెళ్తాయి.

మొదటి అనుభవాలు రేకులు విప్పినా, ‘అంమ’ అంటూ ముద్దు ముద్దుగా తొలి పలుకు గుర్తు చేసుకున్నా, ఊరి ముచ్చట్లు పెట్టి సందడి చేసినా, సిన్మాల గురించి పిల్ల ఆలోచనల్ని నెమరేసినా, మనం కూడా అమాయకంగా జారి పోయిన క్షణాల్ని తడిమి తడిమి చూసుకుంటాం. ఆనందం లాంటి విచారంలో ములిగిపోతాం.  అంగీ విప్పి హీరోయిజానికి ప్రయత్నించటం, ఆడపిల్లతో కలంస్నేహం గురించి ఆరాటపడటం, వెలుగూ వెన్నెలా అంటూ ఆమెనే కలవరించటం, కౌమారపు పీల గొంతులో మొహమాట్లాడటం, పెదాలు విప్పని నవ్వులో జర జరా జారిపోయే జ్ఞాపకాలే.

‘జీవిత రైలు కొత్త ప్లాట్ ఫామ్ మీదకు రాబోతున్నది!’, ‘డైరీలో ఏం రాయాలి?’,  ‘భోగి మంటల్లో ఏం వేద్దాం?’,  ‘మనుషుల మ్యూజియం’ –  అంటూ గంభీరమైన గొంతుతో పలకరించినపుడు, అప్పుడప్పుడే స్థిరపడుతున్న ఆలోచనలతో కొంచెం తలెత్తుకుని చిరు పొగరుతో మాట్లాడిన కాలం మన ముందుంటుంది.  ‘ప్రేమ’, ‘మనసు కేరాఫ్’,  ‘క్షణికం’,  ‘మాయ’ – చదువుతున్నప్పుడు  అప్పుడే గీసుకున్న లేత గడ్డం తాలూకు సన్నని మంటలా, చేతివేళ్ళ కంటుకున్న సిరా మరకల్లా మన జ్ఞాపకాలు మనల్ని  ఒరుసుకుంటూ వెళ్ళటం చూడొచ్చు.  ఏ రచనైనా ఏదో రూపంలో మనల్ని తనలోకి లాక్కోవడం— అదో ఎక్స్పీరియన్స్.

కొన్ని కొన్ని సందర్భాలలో రచయిత తిరుగులేని స్టేట్మెంట్స్ మన ముందుంచుతాడు.  వాటి నుంచి మనం తప్పించుకోలేము.  ఎలా డీల్ చేయాలో తెలియక తికమక పడతాం.  ‘అల్లరి వీళ్ళ కవల పిల్ల’, అంటూ పిల్లల కోసం రాసిన రచనలో రచయిత ఏమంటున్నాడో చూడండి:

“యుధ్ధాలకు కారణం వాళ్ళు కాదు.  కరువుకు కారణం వాళ్ళు కాదు.  అవినీతికి, ఆర్ధిక మాంధ్యానికి వాళ్ళకు సంబంధం లేదు.  కులం, మతం, పేదరికం అనే శబ్దాలు విన్నప్పుడు వాళ్లెప్పుడూ చప్పట్లు కొట్టలేదు.  గ్లోబల్ వార్మింగ్ కు వాళ్ళే కారణం అని ఎక్కడా ఋజువు కాలేదు.  ఆకలి చావులు, శరణార్థి శిబిరాలు, బాంబు దాడులు… ఇవేవీ వాళ్ళు ఉపయోగించే పదబంధాలు కావు.  అయినా వీటన్నిటినీ వాళ్ళు ఎదుర్కోవాలి.  ఇన్ని సమస్యలు వాళ్ళ ముందుంచి, వాళ్ళకు మేమేం తక్కువ చేశామంటాం.  వాళ్ళు స్వేచ్ఛగా విహరించాలంటాం.  వాళ్ళు సదా సంతోషంగా ఉండాలంటాం.  ఎలా?  పిల్లలే గనక ఈ ప్రశ్న అడిగితే పెద్దల దగ్గర సమాధానం ఏమైనా ఉంటుందా?.”

ఇది చదివాక అనేక విషాద చిత్రాలు మన ముందు మెదుల్తాయి.  ఏమీ చేయలేక పోతున్నామనే నిస్సహాత ఆవరిస్తుంది.  తెలియని గిల్ట్ ఏదో మనల్ని బోనులో నిలబెడ్తుంది.  ఇలా తను చెప్పదల్చుకున్న విషయం పట్ల, మన ఆలోచనల్ని లాక్కెళ్ళగలగడం రచయిత సాధించిన విజయం.

రాజిరెడ్డి రచనలన్నీట్లో సాధారణంగా ఉండే ఒక మార్మిక గొంతు ఈ పుస్తకంలోనూ స్పష్టంగా కన్పిస్తుంది.  చాలా రచనలు ఓ బలమైన తాత్విక అంశంతో ముగియడం వల్ల ఆ రచన తాలూకు ఫీలింగ్స్ చాలా సేపటి వరకు మనల్ని వదలకుండా వెంటాడతాయి.  మచ్చుకు కొన్ని చూడండి:

“జీవితాన్ని పొడిగించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం… వీలైనన్ని ఎక్కువ జ్ఞాపకాలు పోగేసుకోవడమే.

“ఏ మార్మిక చిక్కుముడులు విప్పడానికి జీవితం యిలాంటి చిక్కు అలవాట్లను కల్పిస్తుందో!

“ఇల్లు మారినప్పుడు ఎలాగైతే పాత సామానులను వదిలేయక మోసుకెళ్తూ ఉంటామో, అలాగే భావాలను మోసుకెళ్తూ ఉంటాము.

“రోజూ సూర్యాస్తమయ సమయంలో ఆకాశం తగలబడి పోతూ ఉంటుంది.  బహుశా, అందువల్లేనేమో రాత్రి మరింత నిర్మలంగా కనబడుతుంది.

“నువ్వున్నావన్న ఒకే ఒక్క కారణంగా ఈ ప్రపంచాన్ని క్షమించేశాను.

“బతుకు ప్రవాహం స్థూలంగా అందరిదీ ఒకటే. సూక్ష్మంగా దేనికదే ప్రత్యేకం.”

 

ఇలాంటివి అనేకం, అనేకానేకం.

 

కొన్ని కొన్ని చోట్ల రచయిత ఏ అరమరికలు లేకుండా తన సర్వ గుణాలను మన ముందుంచుతాడు. ‘నేనేమిటి?’ అంటూ మొదలు పెట్టి ఒక్కొక్క పొర విప్పుతుంటే ఆ పదాల్లో మన ప్రతిబింబం కూడా కనబడి ఉలిక్కి పడతాం. పుస్తకం చదవటం పూర్తయ్యేసరికి మనం మండుటెండలో వేడి వేడి నీళ్ల స్నానం చేసి, ఏ.సి.లోకి వచ్చి సేద తీరుతున్న చిత్రమైన అనుభూతి పొందుతాం.

మిమ్మల్ని ఎప్పుడైనా చిన్న చిన్న చికాకులు చుట్టుముట్టినప్పుడు, ఏమిటో ఈ జీవితం అని నిర్లిప్తత ఆవరించినప్పుడు ఈ పుస్తకం చదవండి.  అప్పుడు, ఇప్పుడుగా ఎగిరి పోయిన ఆనందపు క్షణాలు పక్షులై మీ గుండె గోడల మీద వాల్తాయి.  మిమ్మల్ని మీరు సంబాళించుకునేలా చేస్తాయి. గ్యారంటీ.

 

 

*

 

 

మీ మాటలు

 1. చందు తులసి says:

  జీవితాన్ని పొడిగించడానికి ఏకైక మార్గం….
  ఎక్కువ అనుభవాలను పోగేసుకోవడమే…
  రాజిరెడ్డి భయ్యా సూపర్ గా చెప్పినవ్…

  కృష్ణమోహన్ గారూ రాజిరెడ్డన్న గురించి బాగా చెప్పారు.

 2. సిగ్గరిని చూపిన అద్దం

 3. Kuppilipadma says:

  కొన్ని కొన్ని చోట్ల రచయిత ఏ అరమరికలు లేకుండా తన సర్వ గుణాలను మన ముందుంచుతాడు. ‘నేనేమిటి?’ అంటూ మొదలు పెట్టి ఒక్కొక్క పొర విప్పుతుంటే ఆ పదాల్లో మన ప్రతిబింబం కూడా కనబడి ఉలిక్కి పడతాం… అరమరికలు లేకుండా రాయటం తేలిక కాదు. రాసి చదువరిని వులిక్కిపడేట్టు చేసే రాజిరెడ్డి గారి రచనల మీద కృష్ణమోహన్ గారి రచన ముచ్చటగా వుంది.

 4. అన్ని వాస్తవాలే రాజన్న రచన లో — పరిచయెం బాగుంది sir..
  ——————————————————————-
  reddi…

 5. కె.కె. రామయ్య says:

  “నువ్వున్నావన్న ఒకే ఒక్క కారణంగా ఈ ప్రపంచాన్ని క్షమించేశాను.” వాక్యం త్రిపుర కోసమే రాసాడనుకుంటూ పూడూరి రాజిరెడ్డిని అభిమానిస్తున్నాను కుప్పిలి పద్మ గారు.

మీ మాటలు

*