ఆయన ఇంకా పాడుతున్నారు!

             

     – పన్నాల సుబ్రహ్మణ్యభట్టు

~

 

రజనిగారిని చూస్తుంటే ఇన్ని పాటలు  రాసి స్వరపరచిన ఆయన భుజబలం  ఎంత గొప్పదో ఎన్ని కల్పనల  లేసులు  అల్లినదో అని ఆశ్చర్యం కలుగుతుంది.  ఆయన సృజన ఒక ప్రహేళిక వంటిది.  జటిలంగా పాట రాసి అంత జటిలంగానూ సంగీతం సమకూర్చడం ఎలా సాధ్యమయిందీ అని ప్రశ్న ఉదయిస్తుంది.  వింటున్న కొద్దీ వివేచన పెరుగుతుంది.  సరే సంగీతం వింటుంటే ఆలోచించడానికి వీలవుతుందా, వివేచనకి వీలు  అవుతుందా అనేది సెమినారు మడి సంభాషణ. అదో సరిపెట్టలేని తీర్మానం.

ఈ కాలానికి ఆయన రాసిన కొన్ని పాటలనీ, వరుసల్నీ తలచుకొని మురిసిపోవటమే సరైన పని.  అయినా అందర్నీ చకితుల్ని చేసే మాట ఒకటి నేను చాలాకాలంగా చెప్తున్నాను ‘త్యాగరాజు తర్వాత అంతటి వాగ్గేయకారుడు పాట, సంగీతం రెండూ సమకూర్చినవాడు రజనిగారు తప్ప వేరొక ప్రతిభావంతుడు లేడు ’ అని ఆ ప్రకటన సారాంశం.  ఒకసారి తెలివిమీరిన నేను ఆయనకి ఆమాటే చెప్పి ‘మీకు బాగా గాలిపెట్టానా’ అని నవ్వాను కుర్రతనంతో. ఆయన ‘ఎక్కువే’ అని నవ్వారు.

rajani2

కానీ, ఆ గాలి ఎక్కువ కాదనే తోస్తుంది నాకు ఇప్పటికీ.  త్యాగరాజుగారి లక్ష్యయాత్ర వేరు, కాని ఇద్దరి శోధననాళిక దారీ ఒక్కటే.  స్వామివారికి రాము వారి చరిత్రగానం లక్ష్యం.  అందుకు ఆయన తీసుకున్న రాగతాళాల ఎంపిక ఒక సంగీత విధాన నిరూపణ కోసం. మళ్ళీ ఆ రాగాల లోతుపాతుల అన్వేషణ కీర్తన తెచ్చే పదాల ముళ్ళను స్వరసంచారంతో పులమడంలో గల రక్తి ప్రసాదం ఆయన పని. అదొక మేథోపరమైన కృషి.  ఆ కాలపు వాగ్గేయకారులకు అదొక కాంట్రాక్టు.

రజనిగారి లక్ష్యం మాత్రం వేరు.  త్యాగయ్యగారి లాంటి ఏకముఖమైన నైవేద్యం, నివేదన కాదు ఈయన లక్ష్యం.  ఈయన రాసిన గీతాలు అనేక రసాల దృష్టినీ, సంఘటనలనీ, ఇతివృత్తాలనీ పోగులుగా ఎత్తే పూలసేవ ఇది.  సన్నివేశ కల్పనకీ, మానసికమైన వ్యవహారగతులకీ, కాల్పనికమైన లౌకికమైన దక్షతకీ రెక్కలు  కట్టే దృష్టి గల పాటలు  ఇవి.  ఆనాటి వాగ్గేయకారుల కీర్తనలవలె ` ఇవన్నీ భజన సంప్రదాయానికి లొంగవు.

bhattu

రజనితో భట్టు

అయినా ఇదొక రకంగా భజనే ` ప్రేమభజన, ప్రేయసికి లేఖ, ఆకాశంలో మేఘం నడిచిన రీతుల  వర్ణన, సూర్యుడి ప్రతాపం, నదీ ప్రవాహ ఝరి, ప్రకృతి ప్రకోపాలు, ఇలా ఇన్ని వర్ణించి, పాట చివరి తీగ లాగుతూ, సంగీతం డొంకమీదకి ఎక్కించాలి…  కష్టమైన ప్రొసీజర్‌, ఈ భజనల్ని శ్రోతలకు అందించటం ఎలా? త్యాగరాజుగారికి శిష్యులే శ్రోతలు, మూలవిరాట్టే వేరుగా ఉన్నారు.  కాని రజనిగారికి గల శిష్యులు, శ్రోతలు, తనపాట నచ్చే శ్రోతల్ని ఆయనే తెచ్చుకోవాలి.  అలా అక్కడే ఉంచుకోవాలి, వారికి అనేక పాటలనే వంటకాల్ని సంగీతంలో వేయించి ఊరిస్తూ ఉంచుకోవాలి.  ఇందుకు వేరే పల్లకీ ప్రబంధాలనీ, నౌకా యాత్రలనీ రచించాలి.  అంటే గేయనాటికలు, సంగీతరూపకాలు, స్వరసంకలనాలు  రచించి సంగీత వాక్యాలతో సిద్దపరచాలి.  రజనిగారిది భక్తి సామ్రాజ్య అనురక్తి కాదు. ప్రజాస్వామ్యంలో శ్రోతలనే ఓటర్ల సేవ.  అందులో సినిమా సంగీత కల్పనా  ఘట్టం కూడా తప్పదు.  పురాణ గాథ సందర్శన కూడా తప్పదు.  ఆకాశంకేసి చూసి విస్తుపోవటం భూమిలో చూసి కూరుకుపోవటము తప్పదు. రాములవారిని కాదంటే ఇంతలా జటిలమైపోయే దృశ్యం లలిత సంగీత రచనలో ఉంది.  ఈ రచనకి తనే పదకర్తయి పాటలుగా కూర్చడం గొప్పే.  నిజానికి రజనిగారికి పాట పుట్టడమే పేగు సంబంధంతో పుడుతుంది.  ఆ ముడిని ఆయన మోసినా శ్రోత మోసినా కత్తిరించలేరు.  ఆ పాట రచనలోని పరుసవేది సంగీతంతోనే ప్రకాశిస్తుంది.  ముచ్చట గొల్పుతుంది.  మురిపిస్తుంది.  విడదీసి చూస్తే ఇదొక పాట రచనా అని విసిగిపోతారు, విస్తుపోతారు.   వాటిలో తాళగతులకు ఇరికేలా రాదామనే సగటు పాట రచయిత తాపత్రయం కనబడదు.  గుర్తుకు తెచ్చుకోండి ` ఎలాగయినా, ఏ గీతశకమైనా, ఏ వరుస గుర్తుకున్నదైనా ! సంగీతాన్ని తోసుకుంటూ, పొదలోంచి పాములా, సంగీతం నాలుకలు  చాచే కనబడుతుంది కదా!

ఉదా : ‘తొంగలి రెప్ప చెంగల్వ పూవే…. తొంగి చూచెనదిగో కన్నావే!’

rajani3

ఆంద్ర విశ్వవిద్యాలయ విద్యార్థి గా – 1937-40

సంజెకెంజాయవీవనలు, క్రొంజిగువురు గుబురు జాలరులు,  తల్లీ, నీయడుగు

దామరులు!  అరుణ దరహాసమో, చందనమరున్ని శ్వాసమో’

ఇలా ఎన్నయినా గుర్తుకు తెచ్చుకోవచ్చు.  ఆ పదాల మేరకు ఊహించనివీ, ప్రకృతి రమణీయంగానో, పదగుంభనంగానో ఎవరూ దర్శించని నీతి, రచన, దృశ్య పేటికలు.  ఆ పదాలతో తెరవడం  రజనిగారి పాటల్లో ఒక మాట ‘క్రీడ’.  ఒక సంగీతపు ఊయల ఊపు.

పాట అనే ఫుట్‌బాల్‌ క్రీడలో బంతి అనే మాటను ఈ కోణంలో ఆటగాడు ఇలా నడిపిస్తాడు అని ఊహించేవారుంటారు కాని అందుకు భిన్నంగా రజనిగారు మాటని నడుపుతారు.  ‘మెస్సీ’ అనే విజేతలాగ. అంత చలన వేగంతో గోల్‌ కొట్టే శక్తి రజనిగారిది.  ఆయనకే తెలిసిన లయ విభ్రాంతితో ఆ పదాన్ని అలవోకగా అక్కడకు చేర్చడం ఆయన నేర్పు.  తెలుగు గేయ / గీత సాహిత్యంలో రజనిగారి లాంటి ఆటగాడు అవతరించలేదు.  కారణం సంగీతమనే ప్రేగుతో సహా పదం జనిస్తుంది.  లౌకిక భావకవితారక్తిమతో అలా పాట పొట్ట తట్టడం ఎవరికీ అబ్బలేదు.  త్యాగరాజు తర్వాత కొంతమందికి ప్రయత్నపూర్వకంగా సాహిత్య రచనలో ఈ విద్య అబ్బి ఉండవచ్చు.

rajani1

అలవాటులో లేని రాగాలలో పాటకి వరుస కూర్చడం ఎక్కడైనా ఉంటుంది అనుకున్న వరుసలో రాగాలలో పాటనప్పడం ఆనాటి వాగ్గేయకారుల నుండి ఈకాలపు సంగీత దర్శకులకీ అలవాటే.  పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్‌ అనే స్వామి వారి శిష్యుడి నుండి ఈనాటి ఆసామీ గాయకులకీ సాగే విద్యే వారికి తాళాలూ  మాటలూ  సర్దడం సమకూర్చుకుంటూ పోవటం శ్రమే.

కానీ లలిత సంగీతంలో పాట ముందు ఆముఖం వినిపించే పరిచయ ఆహార్యం, చరణాలకీ, చరణానికీ మధ్య పొడిగించే, నడిపించే సుఖనిద్ర కల్పించే, సకల భోగాలు వండటం అందరికీ అలవడే విద్యకాదు.  రజనిగారు అందులో స్పెషలిస్టు వరసిద్ధిపొందినవారు.  సంగీతంలో నుండే పాటను పుట్టించి తానే సంగీత చరణాల మధ్య అలంకరాలనూ, ఘోష చైతన్య స్ఫూర్తినీ స్వరబంధంగా మలచి ఒక సాకారమూర్తిని ప్రదర్శించటం రజనిగారి పాటలోని విశేషం.  ఆయనది అంతటి కల్పనా  ప్రకాశం.  ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు.  అటు పాటగానూ, సంగీతంగానూ ఆ పాట ఎంత ముద్ర వేయగలదో చూపవచ్చు.  లేకపోతే తుఫాను గురించి ‘నిష్పడన మంధానం’ అని కూర్చగలరు?  తుఫాను నాశనం చేసిందని ‘ధ్వంస విధి విధానము, నివాత శూన్య స్థంభం అని ఎత్తుగడను శూన్యంలోకి దించటం ఎంత రిస్కు.  ఇంకా గగుర్పాట్లు! అది ‘పరిభ్రామ్యమాణరోదసీ రాక్షసి నిటలాక్షం’ట.  పశుపక్షి మనుష్య సౌఖ్యహరణ జీవనాటంకం’  పాటకి ఇన్ని ఆటంకాలా అని మరొకరెవరైనా జారిపోయేటంత ప్రతిభ రజనిది.  ఇక ఆ పాట ఆముఖ సంగీతం వినవలసినదే.  ఇంకా ఆశ తీరక ‘పలువంకల స్వార్థ ప్రజపాపాల్‌ చిలికే కవ్వం’ అన్నారు.  అందుకే ఆయన సూటి సంగీత తంత్రవేత్త మాట మంత్రవేత్త దేశంలోని సమకాలీన లయకారులలోనే ఉండరు.  తెలుగు జాతి భాషలో మాత్రం త్రిమూర్తుల తర్వాత ఇలా సంగీత సాహిత్యాలని సాగు చేసినవాడు లేడు.  ఆయనా వారిలాగే, మనలాగే ఈ నేల మీద నడిచారనీ, ఇప్పటికీ 96 ఏళ్ళుపైనా బడినా నిజంగా నడుస్తున్నారని  ఒక ఆనందం.  ఇంత పులకింత.

*

మీ మాటలు

 1. “లలిత సంగీతంలో పాట ముందు ఆముఖం వినిపించే పరిచయ ఆహార్యం, చరణాలకీ, చరణానికీ మధ్య పొడిగించే, నడిపించే సుఖనిద్ర కల్పించే, సకల భోగాలు వండటం అందరికీ అలవడే విద్యకాదు. రజనిగారు అందులో స్పెషలిస్టు వరసిద్ధిపొందినవారు.”
  ఈ మాటలు అక్షరసత్యాలు.

 2. Aranya Krishna says:

  మంచి రైటప్!

 3. guru ram prasad peddada says:

  అద్భుతః: భట్టు మావయ్య …ఆయన మీది ప్రేమనంతా అక్షర రూపంలో వొలక పోశారు -మీ వ్యాఖ్యానంతో రజని గారి ప్రతిభకి రంగులద్దారు

 4. G B Sastry says:

  భట్టుగారు
  మీ పెసరట్టుకన్నా కమ్మగా ఉంది మీవ్యాసం
  నాలాటివారికి త్యాగయ్యకి (కాంప్లాన్ త్యాగయ్య కాదు నిజం త్యాగయ్యకి)బాలాంత్రపువారికి ఉన్న/లేని వెసులుబాటు చక్కగా చెప్పారు
  మీరు రజని గారి విశాఖ సన్మాన సభలో ఇచ్చిన ఉపన్యాసం సమయా భావంతో కుదించారు సారంగ లాంటి మాధ్యమంద్వారా చదువుకునేందుకు అవకాశం కలగజేయాలని కోరుతున్నాను.

 5. త్రిమూర్తి (అవధానుల అప్పల రామమూర్తి) says:

  భట్టు గారు రజని గురించి ఎన్నిమారు ఎన్ని మాటలు చెప్పినా ఆయనకీ, మనకి తనివితీరదు. ఆ వజ్రాన్ని సానపట్టే
  ఆయన నిశితమైన ఆలోచన ప్రతిమారు కొత్త కోణంలో మరో తలం మీద సంపూర్ణ అంతరాపరావర్తనం చెంది మరో ఇంద్ర ధనుస్సు లా విరిసిన ఈ వ్యాసం సప్తవర్ణాల సప్తస్వరాల కలయిక.బాగుంది.

 6. రాధ మండువ says:

  ఇప్పటికీ 96 ఏళ్ళుపైనా బడినా నిజంగా నడుస్తున్నారని ఒక ఆనందం. ఇంత పులకింత – ఇంకా పాడుతున్నారనుకుంటే బోలెడంత ఆనందం కూడా… మంచి రైటప్. బాగుంది

 7. ఇంత మంచి ఆర్టికల్ అందించినందుకు ధన్యవాదాలు సర్

 8. సుబ్రహ్మణ్యభట్టు గారూ! రజని గారి ప్రతిభ గురించీ, ఆయన సంగీత సాహిత్య విశేషాల గురించీ మీరు రాసింది ఎంతో బాగుంది. ఇదంతా అనుభవించి మీరు పలవరించినట్టు… మీ మార్కు పెసరట్టును మేం రుచి చూసినట్టు..!

  ‘ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు’ అన్నారు కదా? ఆ ఉదాహరణలు మరిన్ని చెప్పకుండా ఊరుకోవటం మీకు భావ్యం కాదు. రజని గారి పాటల గురించి అంతగా తెలియని కొత్త తరం శ్రోతలను దృష్టిలో పెట్టుకుని మీరు మరో వ్యాసం రాస్తే చదవాలని నా కోరిక.

 9. అదిగొ అల్లదిగో చందమామ(రజనీకాంతుడు) అని చూపే భట్టు గారి ప్రయత్నం చాలా బాగుంది.ధన్యవాదాలు.
  సంగీతము,సాహిత్యము నాకేమీ తెలీదు గానీ 1958 లో అనుకుంటా శ్రీ రంగం గోపాలరత్నం “స్వైరిణి అన్నారు నన్ను శ్యామసుందరా” అని పాడగా విన్నాను.
  ఇప్పటికీ మరపు రాలేదు.వ్రాసిన రజనీ గారంటె అదే ఇష్టము.భట్టు గారు చెప్పాక మరింత.
  Jhonson ,Boswell జోడీ లాగా మరొక జంట కదూ!

 10. ఇంతటి వాగ్గేయకారుని సమకాలికునిగా వున్నందుకు ఎంత సంతోషంగా ఉందొ ! అంతేగాక ఇప్పుడు బెజవాడ లో తరచూ ఆయనను కలుసుకునే అవకాశం లభిస్తున్నందుకు అప్పుడప్పుడు ఆయన పాటలు వింటున్నందుకు ఎంత ఆనందమో! వీరి సోదరుడే నళినీకాంత రావు. మొదటిసారిగా అంతర్జాతీయ శ్రామిక గేయాన్ని తెలుగు లోకి అనువాదం చేసారు.

 11. Krishna murthy says:

  ” సంగీతంలోంచే పాట పుట్టిస్తారు “💐😊💐

మీ మాటలు

*