ఆత్మ హత్యే ఆయుధమైన వాడు..

 

-ఎండ్లూరి సుధాకర్

~

 

అలంకారాలూ వద్దు

కళంక రాజకీయ రాద్ధాంతాలూ వద్దు

అనవసరమైన ప్రతీకలూ వద్దు

నిన్ను చంపిన హంతకులెవరు?

నీ నిండు ప్రాణాన్ని దోచిందెవరు?

దోషులెవరు? ద్రోహులెవరు?

నీ కోసం పరితపిస్తున్న

నీ దోస్తులెవరు?

శిబిరంలో అహోరాత్రాలు

శిలువెక్కిన ఆ క్రీస్తులెవరు?

వేద కాలం నుంచి

కేంద్రీయ వెలివాడ దాకా

ఎవరో ఒకరు మనల్ని మట్టు పెడుతూనే ఉన్నారు

ఉరి తీసి చెట్లకు వేలాడదీస్తున్నారు

కనబడని కత్తులతో నాల్కలు కోస్తున్నారు

కంటికి కనిపించకుండా

చెవుల్లో సల సల కాగే సీసం పోస్తున్నారు

నలందాలూ తక్షశిలలూ వారణాసులూ

మనకు నిషిద్ధ విశ్వవిద్యాలయాలు

అక్షరాలు రాకపోవడమే బావుండేదేమో

ఆ రోజుల్లో అంటరాని ప్రాణాలైనా దక్కాయి

ఆనాటి అమ్మలెంతో ధన్యులు

కనీసం పిల్లల్ని కళ్ళారా చూసుకున్నారు

ఈనాటి తల్లులెంతో వేదనా మూర్తులు

ఆధునిక వెలివాడల్లో

అక్షరాలా గర్భకోశాలు కోసుకున్నారు!

జింకల్ని లోపలేసి

పులుల్ని ఎగదోసి

శాంతి వచనాలు పలికే

ఏ రాజ్యమైనా క్షేమంగా ఉండదు

దోషులెంతటి దొరలైనా

ఏదో ఒక రోజు దొరకకపోరు

చరిత్ర పొడుగునా

అస్పృశ్య క్షతగాత్రుల ఆర్తనాదాలే

వేముల రోహితా!

వెంటాడిన మృత్యు మోహితా!

నీ బలిదానం

భారద్దేశాన్నే కాదు

ఈ ప్రపంచాన్నే విప్లవీకరించింది

నీ మరణం

అంబేద్కర్ నీలి విగ్రహాలకు

ఎరుపెక్కిన కొత్త ఊపిరి పోసింది

నీ ఉనికి

కునికే ఉద్యమాలకు

ఉరుకులెత్తే శక్తినిచ్చింది

ఇప్పుడు నీ తల్లి ఒంటరిది కాదు

కోట్లాదిమంది కొడుకులున్నారు

నీకోసం ఉద్యమించిన కూతుళ్ళున్నారు

పోరాట యోధుడా!

ఆత్మహత్య ఆయుధంతో

అంటరాని యుద్ధంలో

అమ్మ ముందే అమరుడవయ్యావు

మూలవాసుల ముద్దు బిడ్డా!

ఈ మనుచరిత్ర

నీ సమాధి ముందు

నిత్య దోషిలా తల వంచుకునే ఉంటుంది

రేపటి సూర్యుడు రోజులా కాకుండా

రోహిత్ లా ఉదయిస్తాడు!

 

*

 

మీ మాటలు

  1. Telangana reddy says:

    గొప్పగా ఉంది సర్..
    —–//////-/
    రెడ్డి.

  2. సాఫ్ సీదా అడిగేసారు .కడిగేసారు..

  3. Syamala Kallury says:

    మృత్యువంత వేదనాభరితం మీకవిత
    కవికాంచని కోణాలుండవు
    కవిత్వమావిష్కకరించలేని్ఆవేదనలుండవు
    అక్షరమిచ్చిన శక్తి మీది
    కవిత పలికించిన సత్యమిది
    వేదకాలంలో ఏమైనా
    ఈరోజు మీ పలుకే బంగారమై
    అక్షరమే ఆయుధమై
    మీరుపూరించే యుద్దనాదమే
    అణచబడుతున్న జాతులకొక
    క్రొత్తవూపిరి! కలసి పోరాడి
    క్రాంతికోసం మార్పుకోసం
    మనుగడ కోసం దేశవాసులంతా
    తలయెత్తుకు తిరగాలంటే
    నిరాశని దగ్గరికి రానీయకండి!
    నిట్టూర్పులని అణచి్వేయకండి
    కలలో కూడా నిన్న ఇవాల్టికన్న
    మెరుగన్న భావన రానీయకండి!
    మీతో సంఘటించే శక్తులకి
    కులాలు లేవు, మతభేదాలు లేవు!
    అవి నాలుగైనా చాలు!
    మానవత్వానికి నవసమాజ
    నిర్మాణానికిఅవే పునాదులు!

  4. చందు తులసి says:

    రేపటి సూర్యుడు రోహిత్ లా ఉదయిస్తాడు….
    బాగా చెప్పారు సర్.

  5. Aranya Krishna says:

    బాగుంది కవిత.

  6. విలాసాగరం రవీందర్ says:

    జింకల్ని లోపలేసి

    పులుల్ని ఎగదోసి

    శాంతి వచనాలు పలికే

    ఏ రాజ్యమైనా క్షేమంగా ఉండదు

    దోషులెంతటి దొరలైనా

    ఏదో ఒక రోజు దొరకకపోరు

    చరిత్ర పొడుగునా

    అస్పృశ్య క్షతగాత్రుల ఆర్తనాదాలే

    నిజం సార్
    గొప్ప గా ఉంది కవిత

  7. Mercy Margaret says:

    రేపటి సూర్యుడు రోజులా కాకుండా

    రోహిత్ లా ఉదయిస్తాడు!…. Wonderful and heart touching lines sit..

  8. THIRUPALU says:

    //పోరాట యోధుడా!
    ఆత్మహత్య ఆయుధంతో
    అంటరాని యుద్ధంలో
    అమ్మ ముందే అమరుడవయ్యావు
    మూలవాసుల ముద్దు బిడ్డా!
    ఈ మనుచరిత్ర
    నీ సమాధి ముందు
    నిత్య దోషిలా తల వంచుకునే ఉంటుంది //
    చాలా భావుంది. మను చరిత్ర దోషి కానిదెపుడు ? దానికి ‘ నైతికత’ అనే పదం దాని నిఘంటువులో లేనే లేదు.

  9. manindhar says:

    అద్భుతమైన అభివ్యక్తి. జాతికి మేలుకొలుపు

  10. మస్తాన్ ఖాన్ పఠాన్ says:

    రోహిత్ మౌనరోదనా ధ్వనులు మీలోనూ ప్రతిధ్వనించాయి…వేల సంవత్సరాల అణచివేత,వివక్షను,హింసను వెలివేతను మరోసారి యింజెక్ట్ చేశారు…అందరి లాగే రోహిత్తో
    సంఘీభావం ప్రకటించి కండీషన్డ్ భవిష్యత్తును వూహిస్తున్నారూ…మేము యీ కవితలో మీ నుంచి వో కొత్త వ్యూహంతో,కొత్త ప్రణాళికలతో మరో వుధ్యమ నాంది కన్పిస్తుందని ఆశించాం…మీ మేధాలోచనలూ కులనిర్మూలన పోరాటాలను..పెత్తందారి కుల లక్షణపు హింసను నిర్మూలించే వైయక్తిక స్థాయి నుంచి రాజ్యాధికారం వరకూ చేయవలసిన అన్కండిషన్డ్ ఫాక్టర్స్ పట్ల ఆలోచించ మనవి…

  11. నారాయణస్వామి says:

    బాగున్నదన్నా కవిత ఆవేదనా భరితంగానూ ఆర్ద్రన్గానూ ఉన్నది

మీ మాటలు

*