అక్రమ సంబంధాల విషాదస్థలి మైసీనియా

 

స్లీమన్ కథ-23

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

మైసీనియాలో ఆ అయిదురోజుల తవ్వకాల్లో విలువైనవేవీ బయటపడకపోయినా, తప్పకుండా బయటపడతాయన్న నమ్మకంతో స్లీమన్ ఉన్నాడు. ఈ తవ్వకాల వివాదం సద్దుమణిగేదాకా రెండు మాసాలు ఓపికపట్టి ఆ తర్వాత గ్రీకు ప్రభుత్వానికి ఒక విజ్ఞాపన దాఖలు చేసుకున్నాడు. మైసీనియాలో సొంత ఖర్చు మీద తవ్వకాలు జరుపుతాననీ, వాటిలో బయటపడే వాటినన్నిటినీ ప్రభుత్వానికి అప్పజెబుతాననీ, వాటి గురించి వెల్లడించే హక్కు మాత్రమే తనకు ఉంటుందనీ అందులో ప్రతిపాదించాడు. తనను ఇంతకుముందు దొంగగా, గ్రీసుకు శత్రువుగా చిత్రించిన మంత్రే దానిని ఆమోదిస్తూ సంతకం చేశాడు.

1874 ఏప్రిల్ 21 నుంచీ తవ్వకాలు ప్రారంభించాలని అతను నిర్ణయించుకున్నాడు. అందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా, ట్రాయ్ నిక్షేపాలలో సగం తమకు అప్పజెప్పాలని కోరుతూ టర్కీ ప్రభుత్వం అతనిపై దావా వేసినట్టు సమాచారం వచ్చింది. కింది కోర్టులోనూ, పై కోర్టులోనూ దావా ఏడాదిపాటు సాగి అతని సహనాన్ని పరీక్షించింది.  అతను ఎథెన్స్ లోనే ఉండిపోవలసివచ్చింది. కోర్టు ఉత్తర్వుతో పోలీసులు వచ్చి అతని ఇంటిని సోదా చేశారు. నిక్షేపాలు కనిపించలేదు. వాటిని ఎక్కడ దాచాడో చెప్పడానికి స్లీమన్ నిరాకరించాడు. ప్రాసిక్యూషన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు సరికదా, ఎలాంటి పరిష్కారానికీ ఒప్పుకోలేదు.  పట్టుదలకుపోయి ప్రభుత్వంతో తుదికంటా పోరాడడానికే నిశ్చయించుకున్నాడు. అదే సమయంలో, తమ మధ్య ఎలాంటి వివాదం లేనట్టుగా, ట్రాయ్ లో తవ్వకాలను కొనసాగించే హక్కును కోరుతూ అదే ప్రభుత్వానికి అర్జీ మీద అర్జీ పెట్టుకుంటూవచ్చాడు.

ఆ ఏడాదంతా అతను పోలీసులతో, గ్రీకు ప్రభుత్వంతో, తన విమర్శకులతో; చివరికి సొంత న్యాయవాదులతో కూడా గొడవ పడుతూనే గడిపాడు. తన ఖర్చుతో ఒలింపియాలో తవ్వకాలు జరపడానికి ముందుకొచ్చినా; గ్రీకు ప్రభుత్వం అందుకు ప్రష్యన్ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంపై అతను మండిపడుతూ  ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. చివరికి ఆ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ గ్రీసు రాజు జార్జికి కూడా రాశాడు. అయినా ఫలితం లేకపోవడంతో,  ఉత్తరాల వల్ల పని జరగదనీ, గ్రీకు ప్రభుత్వాన్నీ, ప్రజలనీ మెప్పించే పని ఏదైనా చేసి తనవైపు తిప్పుకోవాలనీ అనుకున్నాడు.

అతని దృష్టి అక్కడి గిరిదుర్గం మీద ఉన్న మధ్యయుగాలనాటి వెనీషియన్(ఇటలీలోని వెనిస్ కు చెందినవారు కట్టించిన) బురుజు మీద పడింది. ఆ బురుజు ఆ పరిసరాల అందాన్ని దెబ్బతీస్తోంది. దానిని తొలగిస్తే బాగుంటుందని అందరూ అనుకోవడమే కానీ, ఆ పని చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. 80 అడుగుల ఎత్తున పాలరాయి పలకలతో నిర్మించిన ఆ బురుజులో గుడ్లగూబలు గూళ్ళు పెడుతున్నాయి. దానిని తొలగించడానికి 465 పౌండ్లు ఖర్చవుతాయని స్లీమన్ అంచనా వేసి, ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉంచాడు. ప్రభుత్వం అంగీకరించింది. అతను వెంటనే రంగంలోకి దిగి ఆ బురుజును తొలగించే పనిని విజయవంతంగా పూర్తిచేశాడు.

కోర్టులకు వేసవి సెలవులు కావడంతో అతనికి తీరిక చిక్కి ఓసారి ఉత్తర గ్రీస్ లో మెరపు పర్యటన జరిపి అర్కోమెనోస్ (గ్రీస్ లో పురావస్తు ప్రాధాన్యం కలిగిన ఒక ప్రదేశం) ను సందర్శించాడు. చారిత్రకంగా అదెంతో ప్రాముఖ్యం కలిగిన ప్రదేశమన్న నిర్ధారణకు వచ్చి, అక్కడ తవ్వకాలను చేపడితే తను ఆర్థిక సాయం చేస్తానని గ్రీకు పురావస్తు సంఘానికి రాశాడు. ఆరేళ్ళ తర్వాత  తనే అక్కడ కొన్ని తవ్వకాలు జరిపించాడు.

టర్కీ ప్రభుత్వం వేసిన దావా ఎట్టకేలకు పరిష్కారానికి వచ్చింది. స్లీమన్ ఎంతో తెలివిగా పావులు కదిపాడు. గ్రీకు న్యాయమూర్తులు టర్కీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తూ; పరిహారంగా 50 వేల ఫ్రాంకులు చెల్లించవలసిందిగా స్లీమన్ ను ఆదేశించారు. తను చేజిక్కించుకున్న ప్రియామ్ నిక్షేపాల విలువను 10 లక్షల ఫ్రాంకులుగా అంచనా వేసిన స్లీమన్, ఓడినా గెలుపు తనదే ననుకున్నాడు. ఆ 50 వేల ఫ్రాంకుల పరిహారానికి అయిదురెట్ల మొత్తాన్ని కాన్ స్టాంట్ నోపిల్ లోని ఇంపీరియల్ మ్యూజియంకు స్నేహపూర్వకంగా బహూకరించి; దాంతోపాటు ఏడు భారీ కలశాలను, నాలుగు సంచుల నిండా రాతి పురావస్తువులను పంపించాడు.

అప్పటికే అతని కీర్తి పైపైకి ఎగబాకుతోంది. దానిని ఆనందించే తీరిక ఇప్పుడు ఒకింత చిక్కింది. బ్రిటిష్ ప్రధాని గ్లాడ్ స్టన్ ప్రశంసాపూర్వకమైన లేఖ రాశాడు. ఇంగ్లండ్ లో అతనికి అతి ప్రముఖ అభిమానిగా మారిపోయాడు. 1875లో సోఫియాను, కూతురు యండ్రోమకిని వెంటబెట్టుకుని ఇంగ్లండ్ కు బయలుదేరాడు. దారిలో పారిస్ లో ఆగి, జియోగ్రాఫికల్ సొసైటీలో ప్రసంగించాడు. అలవాటుగా అతిశయోక్తులు, ఆత్మస్తుతీ రంగరిస్తూ అతను చేసిన ప్రసంగానికి శ్రోతల్లో స్పందన లేదు. ఎవరూ అతన్ని అభినందించడానికి ముందుకు రాలేదు. ప్లేస్ స్ట్రీట్ మిషెల్ లోని అతని నివాసం దగ్గర సందర్శకులు బారులు తీరలేదు.

లండన్ లో మాత్రం అతన్ని ఆకాశానికి ఎత్తేశారు. గ్లాడ్ స్టన్ పొగడ్తలతో ముంచెత్తాడు. జూలై నెలంతా ప్రముఖులతో విందు వినోదాలలో గడిపాడు. సోఫియాను, కూతురినిని బ్రైటన్ లోనే ఉంచేశాడు. వారానికి ఒకటి రెండుసార్లైనా వెళ్ళి వాళ్ళను చూడడానికి వీలులేనంతగా తను లండన్ లో బిజీ అయిపోయానని చెప్పుకున్నాడు. ఫ్రెంచి జియోగ్రాఫికల్ సొసైటీ కార్యదర్శి గోచే కు లండన్ నుంచి ఉలా ఉత్తరం రాశాడు:

నేనిక్కడ ప్రసంగిస్తున్న పండిత సభలు శ్రోతలతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ నా మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. నేను మాట్లాడిన ప్రతిదీ పత్రికలు ప్రచురిస్తున్నాయి. రాజాస్థానాలనుంచి నాకు పిలుపులు అందుతున్నాయి. రాకుమారులు, రాకుమార్తెలు నన్ను ఆహ్వానించి నేను చెప్పేవి ఎంతో ఆసక్తిగా వింటున్నారు. హోమర్ ట్రాయ్ ని కనుగొన్న ఈ వ్యక్తి ఆటోగ్రాఫ్ తీసుకోడానికి అందరూ ఎగబడుతున్నారు. నన్ను స్వాగతసత్కారాలతో ముంచెత్తుతూ ఎంతో ఆదరిస్తున్న ఈ ముచ్చటైన లండన్ సమాజాన్ని విడిచిపెట్టి, నన్నో దేశద్రోహి అన్నట్టుగా చూసిన పారిస్ కు త్వరలోనే వస్తాను.

The Nine-Year Siege of Troy, after which King Agamemnon returns to his wife, Clytemnestra

అతను పారిస్ లో కొన్ని గంటలు మాత్రమే ఉన్నాడు. హాలెండ్ రాణి అతన్ని ది హేగ్ కు ఆహ్వానించింది. అక్కడ అతని గౌరవార్ధం జరిగిన విందు సమావేశానికి రాజ్యంలోని ప్రముఖులందరూ విచ్చేశారు. రాణి ప్రత్యేకంగా తనను సందర్శించే అవకాశమిచ్చి అతనితో ముచ్చటించింది. ఆమెతో కలసి లైడన్ మ్యూజియంలోని ఈజిప్టుకు చెందిన పురావస్తువులను చూస్తూ గంటల తరబడి గడిపాడు. రెండు కారణాలవల్ల స్లీమన్ కు ఆమె అమితంగా నచ్చింది. ఆమెకు పురాతత్వ శాస్త్రంపై మంచి ఆసక్తి ఉంది. ఆపైన ఏడు భాషల్ని అనర్గళంగా మాట్లాడుతుంది. లూవే మ్యూజియం కన్సర్వేటర్ రావెసొన్ కు ఇలా ఉత్తరం రాశాడు:

ఘనత వహించిన రాణి నన్ను తరచు అల్పాహారానికీ, మధ్యాహ్న, రాత్రి విందులకూ ఆహ్వానిస్తోంది. ఆమె బాగా చదువుకున్నది. అసాధారణమైన జ్ఞాపకశక్తి. ఆసియా మైనర్, గ్రీకు ద్వీపకల్పం, ఇటలీలో స్వయంగా కొన్ని తవ్వకాలను చేపట్టడానికి ఆమెను ఒప్పించగలనేమో ననిపిస్తోంది. నేను మాత్రం అందులోకి దిగకుండా సలహాదారు పాత్రకే పరిమితమవాలనుకుంటున్నాను.

అక్కడినుంచి అతను కోపెన్ హేగన్ వెళ్ళాడు. వారంరోజులపాటు అక్కడి మ్యూజియం లను సందర్శిస్తూ గడిపాడు. వాటిలో ప్రదర్శించిన కొన్ని శిలాయుగపు ఆయుధాలకూ, ట్రాయ్ లో కనుగొన్నవాటికీ మధ్య ఆసక్తికరమైన పోలికలు గమనించాడు. ఆ తర్వాత రోష్టాక్ వెళ్ళి తన ట్రాయ్ తవ్వకాలపై మరో ప్రసంగం చేశాడు. తిరుగు ప్రయాణంలో ఇటలీ అతన్ని ఆహ్వానించింది. తను నేపుల్స్ లోనే శేషజీవితాన్ని గడపదలచుకున్నానని అక్కడ ప్రకటించాడు. అల్బ లాంగో(ఇటలీలోని ఒక పురాతన ప్రదేశం)లో కొన్ని వారాలు గడిపాడు. అక్కడ ఇటీవలే కొన్ని అంత్యక్రియల కలశాలు బయటపడ్డాయి. మరిన్ని విశేషాలు వెల్లడవుతాయని అతనికి అనిపించలేదు. సీసీలీ పశ్చిమతీర సమీప ద్వీపమైన మోత్యాలో ఒకప్పుడు కార్తజీనియన్ (నేటి ట్యునీసియా రాజధాని ట్యూనిస్ శివార్లలో కార్తేజ్ అనే పురాతన నగరం ఉండేది. ఆ నగరానికి చెందినవారు కార్తజీనియన్లు) జనావాసం ఉండేది. అక్కడ చెప్పుకోదగిన పురాసంపద బయటపడే అవకాశముందని అనుకున్నాడు కానీ, తీరా చూశాక అలాంటి సూచనలేవీ కనిపించలేదు. ఇటలీలోని సెగ్వెంటే అనే పురాతన ప్రదేశంలో జరిపిన ప్రాథమిక తవ్వకాల్లో కూడా గొప్పవేవీ దొరకలేదు. అక్టోబర్ చివరినాటికి ఎటు అడుగువేయాలో తోచని స్థితిలో పడ్డాడు. ఉన్నపళంగా ట్రాయ్ వెళ్ళి తను చేయగలిగిందేమీ లేదు; గ్రీస్ కు తిరిగివెళ్ళడమంటే, అక్కడి ప్రభుత్వంతో ఎడతెగని ఘర్షణతో తలమునకలవడమే.

ఎంతైనా తనకు పేరు ప్రతిష్టలు తెచ్చింది ట్రాయే. డిసెంబర్ ప్రారంభంలో హఠాత్తుగా నేపుల్స్ విడిచిపెట్టి కాన్ స్టాంట్ నోపిల్ కు వెళ్లిపోయాడు. విద్యామంత్రి సఫ్వెట్ పాషాను కలసి కొత్త ఫర్మానా ఇప్పించమని కోరాడు. ఈసారి తవ్వకాల్లో బయటపడేవాటిని అన్నింటినీ నమ్మకంగా ఇంపీరియల్ మ్యూజియంకు అప్పగిస్తానంటే, ఫర్మానా ఇప్పించడానికి ప్రయత్నిస్తానని సఫ్వెట్ పాషా మాట ఇచ్చాడు.

1876 ఏప్రిల్ లో అతనికి ఫర్మానా అందింది. కానీ ఈలోపల, మైసీనియాలోని రాచ సమాధుల దగ్గర తవ్వకాలు జరపాలన్న ఆలోచనే అతని బుర్రను పూర్తిగా ఆక్రమించుకుంది. మైసీనియా గురించిన అధ్యయనంలో మునిగితేలుతున్న కొద్దీ అది సూదంటురాయిలా అతన్ని మరీ మరీ గుంజి లాగడం ప్రారంభించింది. తను ఎలాగూ ఒలింపియాలో తవ్వకాలు జరపలేడు, హిస్సాలిక్ లో దాదాపు తను ఆశించినవన్నీ కనుగొన్నాడు, ఇక మిగిలింది మైసీనియాయే. పౌరాణిక విశ్వాసం ప్రకారం దనాయ్, జియస్ ల కొడుకు పెర్సియస్ మైసీనియా రాజ్యాన్ని స్థాపించాడు. దనాయ్ కు అతను కనకవర్షం కురుస్తుండగా కనిపించాడు. మరోసారి తనకు స్వర్ణనిక్షేపాలు కనిపించడమంటూ జరిగితే అక్కడే నని స్లీమన్ నిశ్చయానికి వచ్చాడు.

***

స్లీమన్ రోజుల్లో మైసీనియా వెళ్ళే పర్యాటకు లెవరికైనా ఆర్గోస్ మైదానం దుబ్బులతోనూ, ధూళితోనూ నిండి పసుపు, తెలుపు రంగుల్లో కనిపించేది. 2,500 అడుగుల ఎత్తు ఉన్న రెండు పర్వతాల మధ్యనున్న బాటను కాపలా కాస్తున్నదా అన్నట్టుగా అక్కడ ఒకప్పుడు ఒక పెద్ద కోటనగరం ఉండేది. అక్కడిప్పుడు రాళ్ళగుట్ట తప్ప మరేమీ కనిపించదు. ఆ బృహత్ పర్వతాలు ఇప్పటికీ భయం గొలుపుతూ, వాటి పాదాల దగ్గర ఉన్న గుట్టల్లోంచి తోడేళ్ళ అరుపులు వినిపిస్తూనే ఉంటాయి కానీ; ఇటీవలి కాలంలో ఆ పరిసరాల్లో వచ్చిన మార్పూ కనిపిస్తుంది. ఇప్పుడా మైదానంలో మంచి వ్యవసాయం సాగుతోంది. చక్కని రోడ్లు పడ్డాయి. పొగాకు, పత్తి పొలాలమధ్య తోటల పెంపకం సాగుతోంది. పర్వతపాదాల దగ్గర బార్లీ పండిస్తున్నారు. అయినాసరే, ఆకూ అలమూ లేని ఆ నీలిరంగు బోసి పర్వతాల నేపథ్యంతో; అక్కడి అన్ని దారులపై ఆధిపత్యం చెలాయిస్తోందా అన్నట్టుగా మైసీనియా ఈరోజుకీ గుబులు రేపుతూనే ఉంటుంది.

ఆర్గోస్ మైదానం అంతటిపై పెత్తనం చేయడానికి అనువైన చోట మైసీనియా ఉంది. అక్కడికి దక్షిణంగా తొమ్మిది మైళ్ళ దూరంలో నాఫ్లియో దగ్గర పెట్టని కోటలా అఖాతం ఉంది. చరిత్రపూర్వకాలం నుంచీ ఈ ప్రాంతంలో జనాలు నివసించినట్టు ఆధారాలున్నాయి. క్రీ.పూ. 1700లో,  ప్రబలుడైన ఒక రాజు అప్పటికే ఇక్కడ ఉన్న కంచుయుగ ప్రారంభ కాలానికి చెందిన నగరం చుట్టూ బ్రహ్మాండమైన ప్రాకారాలను, కొత్తగా ఒక ప్రాసాదాన్ని నిర్మించాడు. అతని పేరేమిటో, ఎక్కడినుంచి వచ్చాడో తెలియదు. నగరంలోకి వెళ్లడానికి చప్టా చేసిన రహదారి, దానికి రెండుపక్కలా బురుజులూ ఉన్నాయి. ఈ బురుజుల లోతట్టున ఇప్పటికీ ఒక పెద్ద సింహద్వారం(Lion Gate)ఉంది.

mycenae-lion-gate-00ఒకప్పుడు దానిని రెండు చెక్క తలుపులతో మూసి ఉంచేవారు. ఆ తలుపుల మీద ఓ పెద్ద దూలం, దాని మీద ఒకదాని కొకటి అభిముఖంగా ఉన్న రెండు సివంగుల బొమ్మలూ ఉన్నాయి. ఆ సింహద్వారంలోంచి లోపలికి వెడితే, 16 అడుగుల మందం కలిగిన ప్రాకారాలకు అవతల ఒక వలయాకారపు చప్పరం(terrace) కనిపిస్తుంది. స్లీమన్ రోజుల్లో ఈ చప్పరం రాళ్ళగుట్టలతోనూ, ఏళ్ల తరబడిగా పేరుకుపోయిన చెత్తతోనూ నిండి ఉండేది. దీనికి అవతల రాజప్రాసాదాలు, ఇళ్ల తాలూకు శిథిలాలు ఉన్నాయి. వాటిని నాచు, కలుపు కప్పేశాయి. కొండ వాలుల్లోనూ, చుట్టుపక్కల ఉన్న లోయలోనూ దిగువ నగరం తాలూకు శిథిలాలు ఉన్నాయి. ఓ అడవిలా భయం గొలిప ఈ కొండ పరిసరాల్లోకి ఎప్పుడైనా దొంగలు తప్పిస్తే ఇంకెవరూ వెళ్లరు. ఇన్ని శతాబ్దాలలో ఇక్కడ పెద్దగా వచ్చిన మార్పేమీలేదు.  క్రీ.శ. రెండవ శతాబ్దికి చెందిన గ్రీకు పర్యాటకుడు, భౌగోళికవేత్త పసన్నియాస్ ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడూ దాదాపు ఇప్పుడున్నట్టే ఉంది.

ఒకప్పుడు ఇక్కడ విశాలమైన వీధులతో, రథమార్గాలతో, తళతళా మెరిసిపోయే బాటలతో ఒక పెద్ద సుసంపన్న నగరం ఉండేది. ఈ ప్రాంతాన్ని బలవత్తరుడైన ఒక రాజు పాలించేవాడు. ఇక్కడి సింహద్వారంలోంచి భారీ సైన్యాలు రాకపోకలు సాగిస్తూ ఉండేవి.  రాజు అధీనంలో పెద్ద పెద్ద స్వర్ణ కోశాగారాలు ఉండేవి.  మైసీనియాను స్వర్ణనగరంగా హోమర్, సొఫొక్లీస్ లు ఇద్దరూ అభివర్ణించారు. ఈ నగరరాజ్యాన్ని పెర్సియస్ స్థాపించాడనీ, ఈ ప్రదేశంలో తన కత్తి ఉంచుకునే ఒర తాలూకు పై తొడుగు(mykes)ను పోగొట్టుకోవడం వల్లనో, ఇక్కడ కనిపించిన పుట్టగొడుగు(mykes)ల వల్లనో మైసీనియా అని పేరుపెట్టాడనీ పసన్నియాస్ రాశాడు. ఆర్గోలిస్ మైదానం ఎడ్లకు ప్రసిద్ధి కనుక అవి వేసే రంకె(mykithmos)లను సూచించేలా ఆ పేరు వచ్చి ఉండచ్చని స్లీమన్ అనుకున్నాడు.

పెర్సియస్, అతని వారసుల పాలన ప్రశాంతంగా సాగిపోయింది. కానీ ఆ తర్వాత ఏట్రియస్ నెలకొల్పిన రాజవంశం విషాదగ్రస్తంగా మిగిలిపోయింది. తన భార్యను సోదరుడు థయస్టీస్ లోబరచుకున్నాడని తెలిసిన ఏట్రియస్ అతని కొడుకులిద్దరినీ చంపి వారి మాంసంతో థయస్టీస్ కు విందు ఇచ్చాడు. ఆ సంగతి తెలిసిన థయస్టీస్ తిన్నది వాంతి చేసుకుని, భోజనం బల్లను ఎత్తిపడేసి, ఏట్రియస్ వంశం సర్వనాశనమైపోతుందని శాపనార్థాలు పెడుతూ అక్కడినినుంచి పరుగెత్తాడు. ఆ తర్వాత ఏట్రియస్ పై ఎలా పగ తీర్చుకోవాలో చెప్పమని దేవదూతను కోరాడు. నీ కూతురు పెలోపియా ద్వారా నీకు కలిగే కొడుకు మాత్రమే ఏట్రియస్ పై పగ తీర్చుకోగలడని దేవదూత పలికింది. ఓ రోజు రాత్రి థయస్టీస్ బలి ఇస్తుండగా ఒక అమ్మాయి అతనిని సమీపించింది. తన కూతురని తెలియక థయస్టీస్ ఆ అమ్మాయిని లోబరచుకున్నాడు. ఆమెకు కొడుకు పుట్టాడు. అతను ఏగిస్త్వస్ అనే పేరుతో పెరిగిపెద్దవాడై ఏట్రియస్ ను హతమార్చాడు. ఆ తర్వాత థయస్టీస్ కొంతకాలం రాజ్యాన్ని పాలించాడు. అతని తర్వాత ఏట్రియస్ కొడుకు అగమెమ్నన్ రాజయ్యాడు.

థయస్టీస్ శాపం ఆ తర్వాత కూడా ప్రభావం చూపించింది. అగమెమ్నన్ ట్రాయ్ లో యుద్ధం చేస్తున్న సమయంలో అతని భార్య క్లైటెమెనెస్ట్రాతో ఏగిస్త్వస్ సంబంధం పెట్టుకున్నాడు. యుద్ధం నుంచి తిరిగి రాగానే అగమెమ్నన్ ను అంతమొందించాలని ఇద్దరూ పన్నాగం పన్నారు. ట్రాయ్ నుంచి యుద్ధఖైదీలతో ఓడలు తిరిగి వస్తున్న సంగతిని గమనించి తమకు చెప్పమని ఒక కావలివాడిని సముద్రతీరానికి పంపించారు. ఏమాత్రం అనుమానం కలగని అగమెమ్నన్, సేనలు వెంటరాగా రథం మీద మైదానం దాటి కోటకు చేరుకున్నాడు. అక్కడ తనకు ఏర్పాటు చేసిన  విందుకు వెళ్ళాడు. ఆ విందులోనో, లేదా సమీపంలోని స్నానశాలలోనో ఏగిస్త్వస్, క్లైటెమెనెస్ట్రా లు అతన్ని హత్యచేశారు. దానికి ప్రతీకారంగా ఆ తర్వాత అగమెమ్నన్ సంతానమైన ఒరెస్టీస్, ఎలెక్త్రాలు క్లైటెమెనెస్ట్రాను, ఏగిస్త్వస్ ను హతమార్చారు. ఒరెస్టస్ రాజయ్యాడు.

అగమెమ్నన్ హత్యను హోమర్, ఎస్క్యులస్(క్రీ.పూ. 525, గ్రీకు విషాదాంత నాటకకర్త), సొఫొక్లీస్, యురిపిడీస్(క్రీ.పూ. 480, గ్రీకు విషాదాంత నాటక కర్త)లు ముగ్గురూ విశేషంగా కథనం చేశారు. ట్రాయ్ పతనాన్నీ, ఏట్రియస్ కుటుంబంలో పుట్టిన ముసలాన్నీ వీరయుగపు విషాదాంత ఘటనలుగా గ్రీకులు భావిస్తారు. వాటిమీదే తమ భావజగత్తును నిర్మించుకుంటూ, స్ఫూర్తిని పుంజుకుంటూ వచ్చారు. ట్రాయ్, మైసీనియాలు రెండింటినీ మహావీరుల స్మృతులు వెంటాడే పవిత్రస్థలాలుగా వారు భావిస్తారు.

ట్రాయ్ విషయంలోలానే, మైసీనియా విషయంలో కూడా తనదైన సరళ తర్కాన్ని అనుసరించి ముందుకెళ్లాలని స్లీమన్ అనుకున్నాడు. ట్రాయ్ లో నగరానికి దారితీసే ప్రధానద్వారం దగ్గర తను స్వర్ణనిక్షేపాలను కనిపెట్టాడు. మైసీనియాలో కూడా ప్రధానద్వారం దగ్గరే నిక్షేపాలను కనిపెట్టగలననుకున్నాడు.

(సశేషం)

 

 

 

 

మీ మాటలు

*