వెలివాడ అనబడు ఒక అనాధ కూడలి

 

 

-అబుల్ కలాం ఆజాద్

తెలుగుసేత: నిశీధి

~

azad

 

 

 

 

 

 

ఎండమావులై

కురుస్తున్న వెన్నల తీరాన

దుఃఖిస్తున్న మృత్యువు

 

విరిగిన రెక్కల తివాచీల్లో

ఎముకలు పిండిన దుర్గంధం

 

నిశీధి నిశబ్ధం నిండుతున్న

రక్తమోడే పక్షుల సమరాగం

 

వెచ్చని శవాల నడుమ

మొరుగుతున్న కుక్కల ఆకలి

 

ఆకాశపు నక్షత్రాలని ఉరేస్తున్నట్లు

వేలాడుతున్న తాళ్లై

తెగ తెగనరకబడిన బొటనవ్రేళ్ళు

 

చీకటి గుహల నిద్రలేని  రాత్రులలోకి

ఉమ్మేయబడ్డ మురికి గొట్టాలై  మృతదేహాలు

 

వధించబడ్డ  గాయాలేవో

కవుల ఏకాంతమై ప్రతిధ్వనిస్తూ

ఖాళీ కాగితాలని సమాధి చేస్తూ

కోరుకున్న వాక్యాల గొంతుకలని

ఎవరది తెగనరికింది

 

రైల్వే ట్రాకుల నిండా

శిరచ్చేదన తలల పూలమాలలు

ప్రేమికులంతా ఎదురుచూస్తున్న

రైలు మరో జీవితకాలపు ఆలస్యం

 

కాలం స్తంబించిన లోకంలో

బక్కచిక్కిన నోట్బుక్కోకటి

సాయం కోసం చేతులూపుతూ

లేత నీలపు  తీర సమీపంలో

తన చావుకి వదిలేయబడ్డ నత్తలా

 

ఆడ చేతుల్లో చినిగి

లేఖలయ్యే పేజిలేవో

నదుల్లో మునిగిపోతూ

చెట్ల అంచుల్లో ఊగుతూ

నిప్పుగుండాల్లోకి దూకుతూ

 

కుగ్రామాల మెడ చుట్టూ

సొంతదారులేవరు లేని

శరీరాలు కుళ్ళిన కంచెలు ఏర్పాటు చేస్తూ

 

మూసిన తలుపులు  నిండిన

వేట  మాంసపు  గురుతులు

 

ప్రతి రాత్రి ప్రకాశించే చంద్రుడు

భయంతో కళ్ళు మూసుకొనే లోపు

ఒక చోట సమూహమవుతున్న విరిగిన దీపాలు

 

మూయబడని కిటికీల్లోంచి

ట్యూబ్లైట్లు లేని రాత్రుళ్ళలోకి జారిపోతూ

లేత వర్షాలకే కరిగిపోయే అక్షరాలతో

సురక్షిత భూభాగాల్లో

సుదూర ప్రేమికుల ఉత్తరాలు

 

పూర్వీకుల ఆత్మలు వెంటాడే ఈ ఇంట్లో

మా సిగ్గంచుల్లో నిలబడ్డ ఈ  వీదుల్లో

జీవితాలని అనాధలని చేసే ఈ పట్టణాల్లో

 

 

ఒకరికొకరు

గుసగుసల కవితలు వినిపించుకుంటున్న

కన్నీళ్ళు ,ఆలస్యానికి కరిగిపోయిన కలలు

దహించబడ్డ శిశుగుట్టల పైకుప్పలుగా పడి కనబడుతూ

 

వెలివాడ అనబడు ఒక అనాధ కూడలి

                                             *

మీ మాటలు

  1. కెక్యూబ్ వర్మ says:

    వెలివాడ నేటికి అనాధ గానే మిగిలింది చినిగిన నీలి కాగితం చేతుల్లోకి తీసుకునే మనసులు కరువై.. మీకు ధన్యవాదాలు కవికి నీరాజనాలు.

  2. THIRUPALU says:

    //పూర్వీకుల ఆత్మలు వెంటాడే ఈ ఇంట్లో
    మా సిగ్గంచుల్లో నిలబడ్డ ఈ వీదుల్లో
    జీవితాలని అనాధలని చేసే ఈ పట్టణాల్లో//
    బావుంది
    జీవితమే చిరిగిన కాగితమైన చోట వెలి వాడల రోదనలే బోదనలై లేవాలి

  3. Very well written and excellent translation..!!

  4. mithil kumar says:

    wonderful transltion …
    కాలం స్తంబించిన లోకంలో
    బక్కచిక్కిన నోట్బుక్కోకటి
    సాయం కోసం చేతులూపుతూ
    లేత నీలపు తీర సమీపంలో
    తన చావుకి వదిలేయబడ్డ నత్తలా….

  5. lasya priya says:

    కాలం స్తంబించిన లోకంలో

    బక్కచిక్కిన నోట్బుక్కోకటి

    సాయం కోసం చేతులూపుతూ

    లేత నీలపు తీర సమీపంలో

    తన చావుకి వదిలేయబడ్డ నత్తలా

  6. వాసుదేవ్ says:

    అనువాదాన్నో అనుసృజన్నో జడ్జ్ చెయ్యాలంటే ఒరిజినల్ కూడా ఉండాలి పక్కనే. బహుశా ఈ శీర్షికలో అలా ఇవ్వటం కుదరదేమో. దీన్ని నేను మీ ఒరిజినల్ గానే చదివాను మొదటి ఇంప్రెషన్ కోసమని…ప్రతీవాక్యమూ ప్రతీ పదమూ చాలా జాగ్రత్తగా ఏర్చి పేర్చి కూర్చిన కవిత.
    “వధించబడ్డ గాయాలేవో/
    కవుల ఏకాంతమై ప్రతిధ్వనిస్తూ/
    ఖాళీ కాగితాలని సమాధి చేస్తూ” ఓ అద్భుత సృష్టి కవిగా!!
    కుడోస్ టు ఆజాద్ మరియు మీకు

  7. SatyaGopi says:

    అనువాదంలా అనిపించలేదు నాకు

    విరిగిన రెక్కల తివాచీల్లో

    ఎముకలు పిండిన దుర్గంధం
    ***
    చీకటి గుహల నిద్రలేని రాత్రులలోకి

    ఉమ్మేయబడ్డ మురికి గొట్టాలై మృతదేహాలు
    ***
    రైల్వే ట్రాకుల నిండా

    శిరచ్చేదన తలల పూలమాలలు

    ప్రేమికులంతా ఎదురుచూస్తున్న

    రైలు మరో జీవితకాలపు ఆలస్యం

    ***
    వాక్యాలు చదివాక

  8. subhashini says:

    గాడమైన వ్యక్తీకరణ. భావం మిస్ కాని అనువాదం. అధ్బుతం నిశి.

  9. బ్రెయిన్ డెడ్ says:

    థాంక్స్ దోస్తో !

  10. Sharada Sivapurapu says:

    ఒరిజినల్ చదవాలని అనిపించని అనువాదం చేసారు మీ మార్కు ఎక్స్ప్రెషన్ తో. కుడోస్ టు యు నిశిజీ. ప్రతి వాక్యంలో మీ శైలి కనిపిస్తోంది.

  11. అద్భుతమైన భావం మీ అక్షరాల్లో ఎప్పటిలా ఒదిగిపోయింది. మీ మనసుని తాకిన కవిత్వానికీ …రాసిన కవికీ అభినందనలు. మనసు తడిని ఆరనీయవు కొన్నిలా .

  12. Raz galipelly says:

    చీకట్ గుహల నిద్రలేని రాత్రుల్లోకి
    చాల చాల బాగుంది!

మీ మాటలు

*