ట్రాయ్ నగలతో సోఫియాకు అలంకారం

 

స్లీమన్ కథ-22

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

పనివాళ్లు అందరూ వెళ్ళిపోయారు. సోఫియా తిరిగివచ్చింది. స్లీమన్ ఒక జేబుకత్తితో నిక్షేపాలను తవ్వి తీయడం  ప్రారంభించాడు. మట్టి, రాతిముక్కలు, పెద్ద పెద్ద రాళ్ళతో నిండిన రక్షణకుడ్యం కుప్పకూలేలా ఉంది. కానీ కళ్ళముందు కనిపిస్తున్న ఓ పెద్ద ఖజానా  అతని భయాలన్నింటినీ హరించేసింది. మళ్ళీ సోఫియావైపు తిరిగి, “త్వరగా వెళ్ళు, నీ పెద్ద శాలువ తీసుకురా” అన్నాడు.

మరోసారి సోఫియా చెక్క నిచ్చెన మీంచి పైకి ఎక్కి, ఇంటికి వెళ్లింది. భారీగా కుట్టుపని చేసిన ఓ పెద్ద ఎరుపురంగు శాలువతో తిరిగివచ్చింది. సాధారణంగా శ్రాద్ధదినాలలో గ్రీకు మహిళలు అలాంటి శాలువలు కప్పుకుంటారు. తవ్వి తీసిన నిక్షేపాలను ఆ శాలువలో మూటగట్టి ఇద్దరూ ఇంటికి మోసుకెళ్లారు.

తలుపు గడియ పెట్టేసి ఓ చెక్క టేబులు మీద ఆ నిక్షేపాలను పరిచారు. చిన్నచిన్న వస్తువులను పెద్దవాటిలో సర్దేశారు. పురావస్తుప్రదర్శనశాలల్లో అద్దాలలోంచి కనిపించే ఇలాంటి నగా నట్రా లేత పసుపురంగులో ఉండి, తాజాగా మెరిసిపోతున్నట్టు ఉంటాయి. ఒక విచిత్రమైన నిర్జీవత వాటిలో ఉంటుంది. కానీ భూమిలోంచి తవ్వి తీసినప్పుడు అవి అద్భుతమైన ఎరుపురంగుతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ నిక్షేపాలలో ఒక రాగి డాలు, ఒక రాగి కళాయి, ఒక వెండి తొడుగు, ఒక రాగి తొడుగు, ఒక బంగారు సీసా, రెండు బంగారు కప్పులు, వెండి బంగారు మిశ్రమంతో చేసిన ఒక చిన్న నగల పాత్ర ఉన్నాయి. ఇంకా, ఒక వెండి కొమ్ము జారీ, మూడు పెద్ద వెండి కలశాలు, రెండువైపులా పదునున్న ఏడు రాగి బాకులు, ఆరు వెండి కత్తులు, పదమూడు రాగి బల్లెపు పిడులు ఉన్నాయి. ఒక పెద్ద వెండి కలశం అడుగున రెండు బంగారు శిరోభూషణాలు, నాలుగు బంగారు జూకాలలాంటివి, 56 బంగారు చెవిపోగులు, 8,750 బంగారు ఉంగరాలు, బొత్తాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం అతి చిన్నవి.

అన్నింటిలోనూ శిరోభూషణాలు ఎక్కువ ఆశ్చర్యం గొలిపాయి. వాటిలో ఒకదానికి తొంభై గొలుసులున్నాయి. వాటిపై ఆకులు, పువ్వుల చెక్కుడులు ఉన్నాయి. రెండువైపులా సన్నని బంగారు దారాలలాంటివి వేలాడుతున్నాయి. పర్షియన్, రోమన్ శిరోభూషణాలు కేవలం తలకు చుట్టుకునే పట్టీలలా మాత్రమే ఉంటాయి. వాటికి భిన్నంగా ట్రోజన్ శిరోభూషణాలు అసంఖ్యాకమైన బంగారు వలయాకార నిర్మాణాలతో నుదుటి మొత్తాన్ని కప్పేలా ఉంటాయి. అలాంటివి ఇంతకు ముందు కానీ, ఆ తర్వాత కానీ మరెక్కడా కనిపించలేదు.

Priam-treasure

స్లీమన్ సంభ్రమం పట్టలేకపోతున్నాడు. కంపిస్తున్న చేతుల్లోకి ఆ శిరోభూషణాలను తీసుకుని వెలుతురులోకి వెళ్ళి పరీక్షగా చూశాడు.  ఆ తర్వాత వాటిని సోఫియా నుదుట అలంకరించాడు. అవి ట్రోజన్ రాణికి చెందిన శిరోభూషణాలని అతను జీవితాంతం నమ్మినట్టు కనిపిస్తుంది కానీ, నిజానికి అవి రాజు ధరించిన శిరోభూషణాలు కావడానికే అవకాశ మెక్కువ. ఆమె ఒకవిధమైన ఆటవికపు వైభవంతో వెలిగిపోయేలా మెడలో నగలు దిగేశాడు. వేళ్ళకు ఉంగరాలు తొడిగాడు. మెక్లంబర్గ్ కు చెందిన ఒక అనామక చర్చి ఉద్యోగి కొడుకు ఎట్టకేలకు రాజులు నడయాడిన చోట, ఒక మహారాణిలా మెరిసిపోయే మహిళ ముందు నిలబడి ఉన్నాడు.

తను కచ్చితంగా రాజు ప్రియామ్ కు చెందిన నిక్షేపాలను కనుగొన్నాననుకున్నాడు. ట్రాయ్ తగలబడుతున్నప్పుడు వాటిని రహస్యంగా ఒక గోడలో భద్రపరిచారనీ, చివరి క్షణాలలో హడావుడిగా వాటిని ఒక చెక్కపెట్టెలో పెట్టి ఉంటారనీ, ఆ తొందరలో తాళం చెవిని అలాగే వదిలేసి ఉంటారనీ అనుకున్నాడు. కానీ అతను తాళం చెవి అనుకున్నది నిజానికి ఒక రాగి ఉలి. ఆ నిక్షేపాలను ఒక పెట్టెలో పెట్టారనడానికి కూడా ఆధారాలు కనిపించలేదు.

వాటి తయారీ విషయానికే వస్తే, బంగారు పాత్రలపై చక్కని పనితనం కనిపిస్తోంది. అయితే, తలపాగా లాంటి కిరీటా(tiara)లు చూడగానే ఆకట్టుకునేలా ఉన్నా వాటిపై పనితనం ప్రాథమికంగా ఉంది. తీగ చుట్లతోనూ, తాపడం చేసిన బంగారు రేకులతోనూ వాటిని తయారుచేశారు. ఉంగరాల మీద ఎలాంటి చెక్కడాలూ లేవు.  ఎంతో అందంగా మలచిన ఒక బంగారు కొమ్ము పాత్రను మాత్రం పనితనంలో తలమానికమని చెప్పచ్చు. అయితే కత్తులు, బాణపు మొనలు, చిత్రమైన మృణ్మయమూర్తుల మధ్య అలాంటి పాత్ర ఎందుకుందో అర్థం కాలేదు. గోడల్లో భద్రపరచిన వాటిలో వెండి, బంగారాలే కాదు; ముతక పనితనం కనిపించే దంతపు వస్తువులు, ఒకమాదిరి మేలిరకపు రాళ్ళతో మలచిన  సుత్తి గొడ్డళ్ళు, మర్మస్థానంపై స్వస్తిక చిహ్నం కలిగిన ఒక స్త్రీ తాలూకు చిన్న సీసపు బొమ్మ ఉన్నాయి. వీటన్నిటినీ పక్క పక్కన చూసినప్పుడు, మూర్తి ఆరాధనా, ఆటవికతలతో ఉత్తమ కళాభిరుచి చెట్టపట్టాలు వేసుకుందా అనిపిస్తుంది. ఇంతకీ ఇది హోమర్ చిత్రించిన ట్రాయేనా, లేక అంతకంటే వెనకటి కాలానికి, మరింత ఆటవిక కాలానికి చెందినదా అన్న అనుమానం తలెత్తుతుంది.

స్లీమన్ మాత్రం, తను ప్రియామ్ కు చెందిన నిక్షేపాలను తవ్వితీశాననే నిర్ధారణకు వచ్చాడు.

అతను ఎంత ప్రయత్నించినా రహస్యం పూర్తిగా దాగలేదు. ట్రాయ్ అంతటా వదంతులు వ్యాపించాయి. అమీన్ ఎఫెన్డీ ఇంటికొచ్చి, తనకు తెలియకుండా ఏదో దాచారంటూ విరుచుకుపడ్డాడు. ఇల్లు సోదా చేస్తానన్నాడు. పెట్టెలు, దుస్తుల బీరువాలతో సహా అన్నీ తెరవమని సుల్తాన్ పేరు మీద ఆదేశించాడు. స్లీమన్ కూడా ఆగ్రహంతో ఊగిపోతూ అతన్ని గెంటివేశాడు. ఆరోజు రాత్రో, ఆ మరునాటి రాత్రో తింబ్రియాలోని కల్వర్ట్ ఇంటికి నిక్షేపాలను తరలించి; ఆ తర్వాత కొన్ని రోజులకు దేశం దాటించాడు.

మరికొన్ని రోజులపాటు రక్షణకుడ్యం అడుగున గాలించాడు. ఇంకేమీ దొరకలేదు. జూన్ 17న తవ్వకాలను అకస్మాత్తుగా ఆపేశాడు. పనివాళ్ళకు వేతనం చెల్లించి పంపేశాడు. ఒక్కసారిగా నిర్జనంగా మారిపోయిన ఆ దిబ్బ మీదికి ఒక పూజారి వచ్చి మతపరమైన తంతు నిర్వహించాడు. ఎక్కడబడితే అక్కడ కందకాలతో, నడవలతో పద్మవ్యూహంలా మారిన ఆ ప్రదేశం యుద్ధరంగాన్ని తలపించింది. తను ఎథెన్స్ కు వెళ్లిపోతున్నాననీ, ట్రాయ్ గడ్డ మీద మళ్ళీ అడుగుపెట్టననీ స్లీమన్ ప్రకటించి తను సేకరించిన కొన్ని వస్తువులను తీసుకుని నిశ్శబ్దంగా అక్కడినుంచి తప్పుకున్నాడు. మిగతా వస్తువులను ముందే పంపేశాడు. జూన్ 19 కల్లా ఎథెన్స్ లో ఉన్నాడు. అదే రోజున, తను వెలికితీసిన వాటి గురించి గర్వంగా చెప్పుకుంటూ వరసపెట్టి మిత్రులకు, బంధువులకు ఉత్తరాలు రాయడం ప్రారంభించాడు.

ఉత్సాహం, ఉత్తేజం అతన్ని ఊపేస్తున్నాయి. “నేటి కాలంలోనే మహత్తరమైన, యావత్ప్రపంచం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అద్భుతాన్ని” తను కనుగొన్నాడు! ఎప్పుడూ తన గురించి గొప్పలు చెప్పుకునే ఈ పెద్దమనిషి, అలా చెప్పుకోవడం సహేతుకమేనని మొదటిసారి నిరూపించుకున్నాడు. ఆశకూ, హేతుబద్ధతకూ, అన్ని రకాల ఆధారాలకూ ఎదురీది తను ట్రాయ్ ని కనుగొన్నాడు. తన చేతుల్లో మెరిసిపోతున్న స్వర్ణ శిరోభూషణాలే అందుకు సాక్ష్యం! కాదనే ధైర్యం ఎవరి కుంటుంది?!

ఇంకోవైపు నిక్షేపాలు అతనికి మోయలేని బరువూ అయ్యాయి. సోఫియా బంధువులను కూడా ఈ గూడుపుఠాణీలోకి లాగాడు. గ్రీస్ అంతటా పశువుల కొట్టాల్లోకీ, గాదెల్లోకీ, పెరళ్ళ లోకీ గడ్డి చుట్టబెట్టిన విచిత్రమైన వస్తువులు రహస్యంగా చేరుకున్నాయి. ఒక వెదురు బుట్ట ఎలూసిస్ లో ఉంటున్న ఒక బంధువు ఇంటికి చేరింది. నిక్షేపాలను తలో చోటికీ తరలించేముందు ప్రతి వస్తువు గురించిన వివరాలను, తూకంతో సహా స్లీమన్ పూస గుచ్చినట్టు రాసుకున్నాడు. వాటిపై గ్రీకు, టర్కిష్ ప్రభుత్వాల కన్ను పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు.

తను ఎథెన్స్ లోనే ఉండిపోయాడు. సోఫియా కూతురిని తీసుకుని కొన్ని రోజులు విశ్రాంతిగా గడపడానికి ఇటలీలోని అగ్నిపర్వతద్వీపమైన ఈశ్చియాకు వెళ్లింది. కొన్ని వారాల తర్వాత ఒక నమ్మకస్తుడైన పనివాడిని పంపించి నిక్షేపాలను  ఎక్కడెక్కడ దాచాడో నోటి మాటగా ఆమెకు చెప్పించాడు.

ఇప్పుడిక మైసీనియా, ఒలింపియాలలో తవ్వకాల గురించి గట్టిగా ఆలోచించడం ప్రారంభించాడు. సొంత ఖర్చుతో తవ్వకాలు జరపడానికి అనుమతించమని ఇంతకు ముందు అడిగినప్పుడు గ్రీకు ప్రభుత్వం తిరస్కరించింది. తను కనుగొన్న నిక్షేపాలను ప్రభుత్వానికి అప్పగించే ప్రతిపాదనతో మరోసారి ప్రభుత్వాన్ని అనుమతి కోరాడు. టర్కీ ప్రభుత్వంతో ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుని ఈసారి కూడా గ్రీకు ప్రభుత్వం నిరాకరించింది.

ఆగస్టులో టర్కీ ప్రభుత్వం నుంచి స్లీమన్ కు తలనొప్పి రానే వచ్చింది. అతను నిక్షేపాలను కనుగొని, వాటిని రహస్యంగా తరలించిన సంగతి ప్రాథమిక దర్యాప్తు ద్వారా ప్రభుత్వం పసిగట్టింది. Augsburger Allegemeine Zeitung ప్రచురించిన స్లీమన్ నివేదికలు కూడా దానిని ధ్రువీకరిస్తున్నట్టు గమనించింది. తవ్వకాల దగ్గర తన ప్రతినిధిగా నియమించిన అమీన్ ఎఫెన్డీ తన విధిని సక్రమంగా నిర్వర్తించలేదన్న ఆరోపణతో ప్రభుత్వం అతనిపై చర్య తీసుకోబోతున్నట్టు స్లీమన్ కు తెలిసింది. అటోమన్ సామ్రాజ్యంలో తప్పు చేసిన అధికారికి విధించే శిక్ష ఒక్కోసారి మరణశిక్ష కూడా కావచ్చు. స్లీమన్ నైతిక సందిగ్ధంలో పడ్డాడు. తను కనుగొన్న నిక్షేపాలను టర్కీ ప్రభుత్వానికి అప్పగించే ప్రశ్న ఎలాగూ లేదు. టర్కీ వెళ్ళి అమీన్ ఎఫెన్డీ తరపున జోక్యం చేసుకునే ప్రశ్న అంతకంటే లేదు. కాకపోతే, ఎఫెన్డీ పూర్తిగా నిర్దోషి అని స్పష్టం చేస్తూ, “మానవత్వమూ, పవిత్ర న్యాయమూ” పేరిట ఉత్తరం రాసే అవకాశం తనకు ఉంది. అదే చేశాడు:

అక్కడ జరుగుతున్న ప్రతి పని పైనా అతను నిఘా పెట్టడం అసాధ్యం. ప్రతిరోజూ ఏకకాలంలో అయిదు చోట్ల తవ్వకాలు జరుగుతూ వచ్చాయి. తనే అయిదు రూపాలు ధరించి అయిదు చోట్లా కాపలా కాయగల మనిషి ఇంతవరకూ పుట్టలేదు.

అమీన్ ఎఫెన్డీ ఆ దిబ్బ మీద ఇంకో పక్క ఉన్నప్పుడు నేను నిక్షేపాలను కనుగొన్నాను. పనివాళ్ళ ద్వారా ఆ సంగతి తెలిసినప్పుడు పాపం అత నెంత డీలాపడిపోయాడో; కోపంతో రగిలిపోతూ నా ఇంటికి వచ్చి పెట్టెలూ, బీరువాలూ తెరచి చూపించమని సుల్తాన్ పేరు మీద ఎలా ఆదేశించాడో మీరు చూసి ఉంటే అతని మీద జాలిపడేవారు.

నా తవ్వకాల మీద అతనిలా రెప్పవాల్చకుండా నిఘా పెట్టినవారు ఇంకెవరూ లేరు. అయితే, పురావస్తు తవ్వకాలను పర్యవేక్షించే వ్యక్తి తప్పనిసరిగా ఓ పురావస్తునిపుణుడు అయుండాలి. అమీన్ ఎఫెన్డీ తప్పల్లా పురావస్తునిపుణుడు కాకపోవడమే…

ఆపైన, తను సమర్ధించుకోలేని తప్పు చేసి కూడా టర్కీ ప్రభుత్వంతో అడ్డదిడ్డం వాదనలోకి దిగాడు. మీరు నాక్చిన ఫర్మానాను రద్దు చేశారు కనుక, నేను ఏం చేసినా అడిగే హక్కు మీకు లేదన్నాడు. మీరు నాతో రాసుకున్న ఒప్పందాన్ని ఎప్పుడైతే ఉల్లంఘించారో, అప్పుడే దానికి కట్టుబడి ఉండాల్సిన నైతికబాధ్యతనుంచి నేను బయటపడ్డా నన్నాడు. నిక్షేపాలలో కొంతైనా లాంఛనంగా కాన్ స్టాంట్ నోపిల్ లోని ఇంపీరియల్ మ్యూజియంకు పంపవలసిందిగా ప్రభుత్వం లోపాయికారీగా అడిగింది. రవ్వంత కూడా పంపేది లేదని తెగేసి చెప్పిన స్లీమన్; ట్రాయ్ లో మరో మూడు మాసాలపాటు తవ్వకాలకు అనుమతిస్తే, ఆ తవ్వకాల్లో దొరికే ప్రతి ఒక్క వస్తువునీ మ్యూజియంకు ఇస్తానని అదే ఉత్తరంలో బేరం పెట్టాడు.

ఇక్కడ గ్రీకు ప్రభుత్వం వైఖరి కూడా అతనికి చికాకు తెప్పిస్తోంది. ఇటలీ వెళ్లిపోతే ఎలా ఉంటుందన్న ఆలోచన బుర్రను తొలవడం ప్రారంభించింది. పురావస్తునిపుణుల దృష్ట్యా పాలెమో, నేపుల్స్ లు తవ్వకాలకు ఎంతో యోగ్యమైన  ప్రదేశాలు. దాంతో ఇటలీలోని మ్యూజియం అధికారులను గిల్లడం మొదలుపెట్టాడు. ఈ ప్రదేశాలలో తను స్వేచ్ఛగా తవ్వకాలు జరపడానికి అనుమతిస్తే, వాటిలో బయటపడే వస్తువులను ఉంచడానికి సొంత ఖర్చుతో మ్యూజియం నిర్మించి ఇస్తానని ఆశపెట్టాడు.

ఈలోపల అతని పేరు మారుమోగడం ప్రారంభించింది. ట్రాయ్ లో అతను కనుగొన్న విశేషాల గురించి విని బ్రిటిష్ ప్రధాని గ్లాడ్ స్టన్ ముగ్ధుడయ్యాడు. ప్రముఖ ప్రాచ్య పండితుడు మాక్స్ ముల్లర్ వాటిపై ఒక వ్యాసం రాశాడు. జర్మనీలో అతని అనుకూల, వ్యతిరేకుల శిబిరాలు అప్పటికే ఏర్పడి యుద్ధం ప్రారంభించాయి. శిశిరం నుంచి శీతాకాలం ప్రారంభంవరకూ స్లీమన్ తన ట్రోజన్ నివేదికలకు పుస్తకరూపమిస్తూ గడిపాడు. మధ్య మధ్య ఫొటోల చేర్పుతో, Troianische Altertumer  అనే పేరుతో పూర్తి చేసిన ఆ పుస్తకాన్నీ, తనే చేసిన దాని ఫ్రెంచి అనువాదాన్నీ ప్రచురణకర్తకు పంపించాడు.

పుస్తకం పూర్తయ్యాక మళ్ళీ అస్తిమతంలోకి జారిపోయాడు. గ్రీకు ప్రభుత్వం ఒలింపియాలో తవ్వకాలు జరిపే హక్కును ప్రష్యన్ ప్రభుత్వానికి ఇచ్చినట్టు తెలిసి కోపంతో కుతకుతలాడాడు. మైసీనియా వెళ్ళి ప్రాథమిక పరిశీలన జరపాలని నిర్ణయించుకున్నాడు. ట్రాయ్ తరహా విజయాలను తను మరోసారి మూటగట్టుకునే అవకాశం అక్కడ తప్ప ఇంకెక్కడా ఉండదనుకున్నాడు.

Sophia_schliemann_treasure

సోఫియాను వెంటబెట్టుకుని, ఎవరికీ చెప్పకుండా రహస్యంగా మైసీనియాకు వెళ్లిపోయాడు. అప్పటికప్పుడు పనివాళ్లను నియమించుకున్నాడు. అయిదురోజులపాటు గిరిదుర్గం దగ్గర ముప్పైకి పైగా చిన్న చిన్న కందకాలను తవ్వించాడు. పెద్ద ప్రాముఖ్యం లేని కొన్ని కుండపెంకులు మాత్రం బయటపడ్డాయి. మైసీనియాలోని కోటగోడ లోపల వీరయుగం తాలూకు సమాధులు బయటపడగలవని తాను నమ్ముతున్నట్టు Ithaka, der Peloponnes und Troja అనే తన పుస్తకంలో చాలాకాలం క్రితమే రాసుకున్నాడు. ఆ నమ్మకం మరింత బలపడడమే ఈ అయిదురోజుల్లో అతను సాధించిన ముఖ్యమైన ఫలితం. కారణం చెప్పలేకపోయినా, ట్రాయ్ లో బంగారు నిక్షేపాలు ఉంటాయని ముందే ఊహించినట్టే; మైసీనియాలోని ప్రసిద్ధ సింహద్వారం (Lion Gate) దగ్గరలో, దానికి ఒకింత దూరంలో కచ్చితంగా రెండు గోపురం ఆకారంలోని శవాగారాలు(mortuary dome chambers) ఉంటాయని అతను ఊహించాడు. సింహద్వారానికి కొంచెం అవతల తవ్వితే తయస్టీస్, అగమెమ్నన్ తదితర మైసీనియా రాజుల సమాధులు బయటపడచ్చన్నాడు. ఇప్పటికే తను ఒడీసియస్ చితాభస్మాన్ని, ప్రియామ్ ప్రాసాదాన్ని వెలికి తీసి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేశాడు. మైసీనియా రాజుల సమాధులను కూడా బయటపెడితే అది తనకు మరో కీర్తి కిరీటాన్ని అలంకరిస్తుందని అనుకున్నాడు.

అయితే దురదృష్టవశాత్తూ మైసీనియాలో తవ్వకాలను చేపట్టడానికి అతనికి అనుమతి లేదు. అక్కడ అతను రహస్యంగా తవ్వకాలు జరిపిస్తున్న వార్త గ్రీకు ప్రభుత్వం చెవిన పడనే పడింది. తక్షణమే వాటిని ఆపవలసిందిగా  ఆర్గోలిస్ (గ్రీస్ లోని ఒక ప్రాంతీయ పరిపాలనా విభాగం)ముఖ్యాధికారికి తంతి ఆదేశాలు పంపింది. ఆ తర్వాత, స్లీమన్ అంతవరకూ తవ్వితీసిన వాటిని జప్తు చేయవలసిందనీ, అతని పెట్టే బేడా సోదా చేయవలసిందనీ వెంట వెంటనే మరో రెండు టెలిగ్రాములు పంపింది.

ఈ పనులను నాఫ్లియోలోని పోలీస్ ఉన్నతాధికారికి అప్పగించారు. అతను స్లీమన్ ఉంటున్న ఇంటికి వెళ్ళాడు. అతనితో కలసి ప్రశాంతంగా కాఫీ సేవిస్తూ సంగతేమిటని అడిగాడు. స్లీమన్ ఓ బుట్టెడు కుండ పెంకులు చూపించాడు. పురాతన నగరాల్లో అలాంటి కుండపెంకులు ప్రతి సందులోనూ, గొందులోనూ దొరుకుతాయనీ, విలువైనవేవీ తనకు కనిపించలేదనీ, కనుక అక్కడితో దానిని వదిలేశాననీ ఆ పోలీస్ అధికారి పైవాళ్ళకు రాశాడు.

ఎథెన్స్ కు తిరిగి వచ్చిన స్లీమన్, తనపై ప్రభుత్వం కత్తులు నూరుతున్న సంగతి గమనించాడు. ట్రాయ్ లో నిక్షేపాలను కనుగొన్నప్పటినుంచీ అతను అతిపెద్ద అనుమానితుల జాబితాలో చేరిపోయాడు. పోలీస్ అధికారి, ఆర్గోలిస్ ముఖ్యాధికారి, మైసీనియా మేయర్ చేతకాని దద్దమ్మలని గ్రీకు విద్యామంత్రి తిట్టిపోశాడు. “గ్రీసుకు ఎలాంటి రక్షణా లేదనీ; ఎవడైనాసరే చట్టాలను ఇష్టానుసారం కాలరాస్తూ ఈ నేలలోకి చొరబడి ఏమైనా చేయచ్చనీ తమ చర్యల ద్వారా నిరూపించా”రని దుయ్యబట్టాడు.

  (సశేషం)

 

 

మీ మాటలు

  1. ఎంతో ఆసక్తికరమైన కథనం సర్ . కామెంట్ పెట్టకపోయినా ప్రతి వారం తప్పని సరిగా చదువుతున్నాను . ధన్యవాదాలు

  2. భాస్కరం కల్లూరి says:

    థాంక్స్ భవానీ ఫణిగారూ…స్లీమన్ కథను మీలాంటి కొందరైనా ఆసక్తితో చదువుతున్నందుకు.

మీ మాటలు

*