క్వీన్    

 

               

 -నాదెళ్ళ అనూరాధ

~

nadellaపూణె నగరం అందమైనది అని ప్రత్యేకంగా చెప్పేందుకేముంది? చుట్టూ చిక్కనైన ప్రకృతి పరుచుకుని కొండల్లోకో, అడవుల్లోకో, సరస్సుల్లోకో మనలని ప్రయాణించేలా చేస్తుంది. ఆ అందాల్ని ఏ కవి మాత్రం వర్ణించగలడు? చూసే కళ్లకి, ఆస్వాదించే మనసుకీ మాటలు రావు మరి.

నగరంలో ఒకపక్క పశ్చిమదేశాల నాగరికత స్పష్టంగా కనిపిస్తూంటే , మరోపక్క మరాఠాల సంస్కృతి కూడా అంతే స్పష్టంగా కనిపిస్తుంది.

జనాభాలో కొట్టొచ్చినట్టు కనిపించే విద్యార్థినీ ,విద్యార్థుల శాతం, ఐ.టి. నిపుణుల శాతం నగర సంస్కృతిని సరికొత్తగా నిర్వచిస్తున్నట్టుంది.

ఆ నగరానికి అతిథిగానైనా రావటం ఎప్పుడూ ఇష్టమే శ్యామ్ కి. ఆఫీసు పని ఒక్క పూటతో తెమిలి పోతుందని , కూతురు శ్వేతని చూసే టైము కూడా ఉండదని భార్య మాధురి ని తనతో తీసుకురాలేదు. తీరా పని పూర్తి కాలేదు.  ఆఫీసు నుండి బయటపడుతూంటే కొలీగ్ రంగన్ తమ ఇంటికి ఆ రాత్రికి అతిథిగా రమ్మని ఆహ్వానించాడు. ఆహ్వానానికి కృతజ్ఞతలు చెప్పి, రాలేననీ, కూతురు శ్వేతని కలుసుకుందుకు అనుకోకుండా దొరికిన అవకాశం అని చెప్పి భండార్కర్ రోడ్డులో తనని వదిలెయ్యమని అడిగాడు శ్యామ్.

ఇదివరకెప్పుడో కెరీర్ మొదట్లో పూణేలో ఉన్నప్పుడు తాము ఉన్న ఇంటిని, ఆ పరిసరాల్ని చూస్తూ, కాస్సేపు ఫెర్గుసన్ కాలేజీ రోడ్డులోనూ ఎవో పాత జ్ఞాపకాల్ని తలుచుకుంటూ అక్కడి పురాతన శివాలయం పాతాళేశ్వర్ లోకి నడిచాడు. ఆ ప్రాంతంతో ముడిపడి ఉన్న బాంధవ్యం అపురూపమైనది.

పెందరాడే వెళ్లినా శ్వేత ఆఫీసునుండి ఇల్లు చేరదు అని తీరిగ్గా రోడ్డు ప్రక్కల ఉన్న మహా వృక్షాల్ని చూస్తూ తనూ, మాధురి నడిచిన దారుల్ని మళ్లీ మళ్లీ మననం చేసుకుంటూ భార్యకి ఫోన్ చేసాడు.

‘పని అయిపోయిందా? బయలుదేరుతున్నారా?’ అంది ఫోన్ తీస్తూనే.

‘లేదు, ఈ పూట శ్వేతని చూసే అవకాశం దొరికింది’ అన్నాడు ఉత్సాహంగా. తను మిస్ అవుతున్నందుకు మాధురి కొంచెం నిరుత్సాహ పడింది.

‘శ్వేతకి ఫోన్ చేసి నేను వస్తున్నట్టు చెప్పకు. సర్ప్రైజ్ ఇవ్వాలి’ అని భార్యకి చెప్పాడు.

‘గుల్మొహర్ పార్క్’ అపార్ట్మెంటు కాంప్లెక్స్ ముందు టాక్సీ దిగి ఫ్లాట్ నంబరు మరోసారి మననం చేసుకుని లోపలికి వెళ్లబోతుంటే గేటు దగ్గర సెక్యూరిటీ అటకాయించాడు.వివరాలు చెప్పి, విజిటర్స్ బుక్ లో సైన్ చేసి మూడో అంతస్థులో ఉన్న శ్వేత ఇంటిముందు బెల్ నొక్కాడు.మనసంతా ఉద్విగ్నంగా ఉంది. తనను చూసి కూతురు ఎంత సంతోషిస్తుందో అనుకుంటుంటే పెదవులపైకి చిరునవ్వు పరుచుకుంది.

తలుపుతీసిన వ్యక్తి ఎవరో అపరిచితుడు. ఉత్తరాది వ్యక్తి అని తెలుస్తోంది.ముఫ్ఫై సంవత్సరాలు ఉంటాయి. అప్పుడే స్నానం చేసి వచ్చినట్టున్నాడు, తల తుడుచుకుంటూ,’ఎస్’ అన్నాడు.

ఇదేమిటి తను పొరపాటున వేరొకరి ఇంటికి వచ్చాడా? అనుకుంటూ ‘ సారీ’ చెప్పబోయేంతలో లోపలినుండి శ్వేత ‘ ఎవరొచ్చారు రాహుల్’ అంటూ ఇంగ్లీషులో ప్రశ్నిస్తూ ముందుగదిలోకి వచ్చింది.

తండ్రిని చూస్తూనే, గబుక్కున రెండు అడుగులు ముందుకు వేసి,’ హాయ్ డాడ్, ప్లెజెంట్ సర్ప్రైజ్! అమ్మని కూడా తీసుకొచ్చారా? ‘ అంటూ తండ్రిని దాటి వెనక ఎవరికోసమో వెతికింది.

‘లేదురా, ఆఫీసు పనిమీద పొద్దున్నే వచ్చాను. పని అవకపోవటంతో ఆగిపోవాల్సి వచ్చింది.’ అంటూన్న తండ్రిని ఆ యువకుడికి పరిచయం చేసి, ‘ డాడ్, ఇతను రాహుల్,నా కొలీగ్ ‘ అంటూ అతన్ని పరిచయం చేసింది.

శ్యామ్ కూతురికోసం కొన్న మాంజినిస్ కేక్స్ టేబిల్ మీద పెట్టి స్నానానికి లేచాడు.

శ్వేత , రాహుల్ వంటింటి లోంచి గిన్నెలు, పళ్లేలు తెచ్చి వడ్డన చేసారు. అతనికి ఆలోచన సాగటం లేదు. యాంత్రికంగా భోజనం చేసాడు. తను కూతురికి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాడు. కాని తనకే ఇక్కడ ఒక పెద్ద సర్ ప్రైజ్ ఎదురైంది. రాహుల్ కూడా అదే అపార్ట్ మెంటులో ఉంటున్నట్టు గ్రహించుకున్నాడు.

‘ డాడ్ , ఈ రోజు ఆఫీసు నుండి త్వరగా వచ్చేం కనుక సినిమా ప్లాన్ చేసుకున్నాం మేము. చాలా రోజులుగా చూడాలని అనుకుంటున్న సినిమా. నువ్వు కూడా రా మాతో. అలసట తీరి కాస్త రిలాక్స్ అవచ్చు.’ అంటూ తండ్రిని బయలుదేరదీసింది.

కారు వెనక సీట్లో జారగిలపడి కూర్చుని, ముందు సీట్లో కబుర్లలో మునిగిపోయిన రాహుల్ ని, శ్వేతని చూస్తూ ఆలోచనలో పడ్డాడు శ్యామ్.

దాదాపు ఆరునెలలు పైనే అయింది కూతురు తమ వూరొచ్చి. ఈలోపు ‘ చాలా రోజులైపోయింది, కూతుర్ని చూడాలని ఉంది’ అని మాధురి గోల పెడుతూనే ఉంది. మధ్యలో శ్వేత ఎనిమిది వారాల పాటు ప్రాజెక్టు పనిమీద బయటకు వెళ్లింది. వచ్చిన తర్వాత ‘ ఇంటికి వస్తున్నా’ అంటూనే ఆఫీసులో పని వత్తిడి అంటూ రాలేకపోతోంది.

క్రితం సారి శ్వేత ఇంటికి వచ్చినప్పుడు కూడా తను ఆఫీసులో ఇనస్పెక్షన్ హడావుడిలో ఉన్నాడు. ఒక్క వీకెండ్ వచ్చివెళ్లిపోయింది , అప్పుడే చెప్పింది ఆఫీసుపనిమీద కొన్నాళ్లు బయటకు వెళ్తున్నానని. అంతే మళ్లీ ఇప్పుడే చూడటం.

శ్వేత వచ్చి వెళ్లాక భార్య ముభావంగా ఉండటం గమనించాడు. తను పదేపదే రెట్టించి అడగటంతో శ్వేత పెళ్లికి సుముఖంగా లేదని, కూతురి ఆలోచనలు తనకు అందటం లేదని మాధురి చెప్పుకొచ్చింది.

అప్పుడే తన చిన్ననాటి స్నేహితురాలు , మానసిక విశ్లేషకురాలు అయిన మాలతిని కూడా కలిసి వచ్చింది. తను మాత్రం భార్య భయాలు, ఆలోచనలూ తేలిగ్గానే తీసుకున్నాడు.

కొన్ని నెలల క్రితం జరిగిన విషయాలు మరోసారి అతని మనోఫలకం మీదకొచ్చాయి.

 

**********

Kadha-Saranga-2-300x268

ఆ వారాంతంలో శ్వేత ఇంటికి రావటంతో మాధురి చిన్నపిల్లలా ఆనందంతో గెంతులు వేసింది.వరండా ముందు క్రొత్తగా పాకిన నైట్ క్వీన్ తీగని కూతురికి చూబించింది. అకస్మాత్తుగా పడిన వర్షపుజల్లుల్లో కూతురితో కలిసి తడిసింది. కూతుర్ని ఒక్క క్షణం వదలలేనట్లు రాత్రి పగలు కబుర్లూ, షాపింగ్ మధ్య గడిపేసింది శనివారమంతా. శ్యామ్ ఆఫీసు పని వలన కూతుర్ని మిస్ అవుతున్నాడని కూడా వెక్కిరించింది.

ఆదివారం ప్రొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ చేసి భర్త బయటకు వెళ్లిపోవటంతో , తీరిగ్గా కూతురికోసం జంతికలు చెయ్యటం మొదలు పెట్టింది మాధురి.

‘ఎందుకమ్మా, కష్టపడతావ్? అన్నీ బయట దొరుకుతూనే ఉన్నాయి. ఎప్పుడు తినాలని ఉంటే అప్పుడు కొనుక్కుంటానుగా. హాయిగా నూన్ షో చూసి, ఎక్కడైనా బయట భోజనం చేసి వచ్చే వాళ్లం కదా.’ అంటున్న కూతుర్ని మురిపెంగా చూసుకుంటూ,

‘దొరుకుతాయిరా, ఇంట్లో చేసిపెడితే నాకు తృప్తి గా ఉంటుంది’ అంది.

తల్లీ కూతుళ్ల కబుర్లు కొంచెం సేపు శ్వేత ఆఫీసు పని గురించి, స్నేహితుల గురించీ, సినిమాల గురించీ నడిచీ, శ్వేత పెళ్లి వైపుకి మలుపు తిరిగాయి.

‘చిన్నీ, చదువయ్యాక కొన్నాళ్లు ఉద్యోగం అన్నావు. ఆ సరదా తీరింది. ఇంక బుధ్ధిగా మేము చూసిన సంబంధం చేసుకో ‘  .  మాధురి ఈ సారి ఎలాగైనా కూతుర్ని పెళ్లికి సుముఖురాల్ని చెయ్యాలని పట్టుదలగా ఉంది. ఆ ముచ్చట జరిపించటం అంటే తమ బాధ్యత తీర్చుకోవటం కూడాను అనుకుంటోంది.

మాధురి స్నేహితురాలు పద్మ కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంది. పద్మ, ఆమె భర్త కూడా తమ పెద్దరికాన్ని కూతురు లక్ష్యపెట్టలేదని చిన్నబుచ్చుకున్నారు.

‘మధూ, నీ కూతుర్ని పెళ్లి విషయం తేల్చమను. ఎవరినైనా ఇష్టపడిందేమో కనుక్కో. ఎటూ వాళ్ల ఇష్టాల్ని కాదనమని తెలుసు వాళ్లకి. అన్ని  విధాలా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే లోకజ్ఞానం, వయసు, ఆర్థిక స్వతంత్రం ఉన్నాయి కదా.’ అంటూ చెబుతూనే ఉంది.

‘మనలాగా మొక్కుబడి చదువులు కావు. పెళ్లి అనగానే తలొంచుకుని సరేననేందుకు మన కాలమూ కాదు.’ పద్మ కూతురి వైవాహిక జీవితం సంతృప్తికరంగానే ఉన్నా తల్లిగా తనవైపు నుండి కొన్ని అసంతృప్తులు ఆమెలో ఇంకా ఉండిపోయాయి. అందుకే ఆమె మాటల్లో కూతురి పట్ల నిష్టూరం ధ్వనిస్తూనే ఉంటుంది.

మాధురి ఆమె మాటలు విన్నప్పుడల్లా ఆలోచనలో పడుతుంది. శ్వేత తాము చెప్పిన మాట వింటుంది, చూసిన సంబంధం చేసుకుంటుంది అని గాఢంగా నమ్ముతుంది. ఎంత చక్కగా పెంచింది తను! తన కూతురు అందరిలాటి అమ్మాయి కాదు. చదువు పూర్తి అయి, ఉద్యోగరీత్యా ఇల్లు వదిలి వెళ్లే వరకూ అమ్మనాన్నలు చెప్పిందే వేదం అన్నట్టు నడుచుకునేది.

మాధురి ఆలోచనలు అకస్మాత్తుగా చెదిరాయి,

‘పెళ్లి మాట ఎత్తకమ్మా. పెళ్లి చేసుకునే ఆలోచన లేదు నాకు. ‘ అంటున్న శ్వేతని చూసి తను ఏంవింటోందో ఒక్కసారి అర్థం కాక కూతురు తనని ఆట పట్టించటానికి అలా మాట్లాడుతోండేమో అని చూసింది. అలాటి సూచన ఏదీ కనపడకపోయేసరికి,

‘ఏమిటా పిచ్చి మాటలు?’ అంటూ కసురుకుంది.

‘పిచ్చిమాటలేముంది? నా పెళ్లి విషయం నా ఇష్టం. నాకు చేసుకోవాలని లేదు. అదే చెబుతున్నాను’ శ్వేత గట్టిగా చెప్పింది తన మనసులో మాట.

అనుకోని పిడుగుపాటులాటి ఆ మాటలకి మాధురికి కళ్లు చెమరించాయి. ఇలాటి సమాధానం ఊహించనిది. కూతురి ముందు బేలగా బయటపడకూడదని తనను తాను సర్దుకుంది.

‘ఏం, ఎందుకు చేసుకోవు? అదేదో ప్రపంచానికి కొత్త విషయంలా కొట్టిపారేస్తున్నావు. మన కుటుంబాల్లో ఎవరైనా పెళ్ళి చేసుకోకుండా మానేసేరా?’

‘అమ్మా, నువ్వు పెళ్లి చేసుకుని మూడు దశాబ్దాలు దాటింది. నువ్వు అప్పటి మనుషులు, అలవాట్లు,ఆచారాలు గురించి చూసేవు. అవన్నీ ఇప్పటి కాలానికి అనుసరించేవే అనుకుంటున్నావు. బయట ప్రపంచాన్ని చూడు. ఎన్నెన్ని మార్పులు వచ్చాయో , వస్తున్నాయో తెలుస్తుంది. నువ్వు అంటూంటావుగా, నేను చూస్తున్న ప్రపంచం నువ్వు చూసిన దానికంటే చాలా విశాలమైనది అనీ, నాకళ్లతో చూసే ప్రపంచాన్ని గురించి నీకు చెప్పమనీ. ……’

ఒక్క క్షణం ఆగింది. తల్లి ముఖం అంతలోనే వాడిపోయింది. చేస్తున్న పని పూర్తి చేసి , చేతులు కడుక్కుంటున్న తల్లి ప్రక్కనే క్షణం నిశ్శబ్దంగా నిలబడింది.

‘అమ్మా, పెళ్ళి మీద నీకున్నంత నమ్మకం నాకు లేదు. ఇప్పటి తరం జీవనశైలికి అదెంత వరకూ నప్పుతుందో చెప్పలేము.అలా అని ఎవరూ పెళ్లిళ్లు చేసుకోవట్లేదా అంటే చేసుకుంటున్నారు. కాని ఎన్ని పెళ్లిళ్లు మీ తరంలోని పెళ్లిళ్లులాగా కుదురుగా, స్థిరంగా ఉంటున్నాయి? చెప్పు’

మాధురి మౌనంగా ఉండిపోయింది. మొన్న మొన్నటిదాకా ప్రతి విషయానికీ ‘అమ్మా, నాన్నా’ అంటూ తమ వెనుకే తిరిగిన పిల్లేనా ఇప్పుడు మాట్లాడుతున్నది? తనకెందుకో ఇదంతా కొత్తగా ఉంది. ఆమోదయోగ్యంగా లేదు. తనూ పుస్తకాలు చదువుతుంది, నిత్యం న్యూస్పేపర్లూ చదువుతుంది. తన స్నేహితులు వాళ్ల  పిల్లల గురించి చెబుతున్న ఎన్నో సమస్యలు, కంప్లెయింట్లు వింటూనే ఉంది. కాని పెళ్లి అనేది శ్వేత చెప్పినట్టు ఇంత నిరసించే విషయమని మాత్రం అంగీకరించలేకపోతోంది.

‘అమ్మా, ప్రపంచాన్ని నీకు అలవాటైన కోణం నుండి కాకుండా చూసేందుకు నీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను, ప్రీతి తెలుసుకదా నీకు. తను తిలక్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరివైపూ పెద్దల ఆమోదం దొరకలేదు. వీళ్ల నిర్ణయాన్ని నిరసించనూ లేదు. అలా అని వీళ్లని దగ్గరకు తీసుకోనూలేదు. ఇద్దరూ బానే ఉన్నారు.

తిలక్ ఈ మధ్య ఉద్యోగరీత్యా తరచూ దేశం విడిచి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ప్రీతిని, పాపాయిని తీసుకుని వెళ్లటం కుదరదు. ఇక్కడ ప్రీతి ఉద్యోగం , పాపాయిని చూసుకోవటంతో సతమతమవుతోంది. మేము స్నేహితులమున్నాం. కాని భర్తకి దూరంగా ఉండటం, అమ్మ ఇంటికో, అత్తగారి ఇంటికో వెళ్దామని ఉన్నా ఇప్పటికీ వాళ్లు ఆదరించకపోవటం తనని చాలా బాధ పెడుతున్నాయి .ఊహ తెలుస్తున్న తన కూతురికి అందరూ ఉండీ  ఒంటరిగా పెరుగుతోందని అంటుంది.

ఆ మధ్య ప్రీతి కూతురికి బావులేదని హాస్పిటల్ లో చేర్చింది. మేమంతా సాయం చేసేం. మా కొలీగ్ శ్రీనాథ్ ఆమె వెంట ఉండి చాలా సహాయం చేసేడు. అది తనకి నచ్చలేదని తిలక్ అన్నాడట. శ్రీనాథ్ లో ఒక స్నేహితుణ్ణి , శ్రేయోభిలాషిని కాకుండా ఒక మగవాణ్ని మాత్రమే చూసిన తిలక్ ని ఎలా అర్థం చేసుకోవాలంటుంది ప్రీతి. దాని గురించి ఇంకా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. అది ఎంతవరకూ వెళుతుందో అర్థం కావట్లేదు ‘ శ్వేత చెప్పిన విషయం విని నిట్టూర్చింది,

‘నిజమే. తిలక్ అలా ఆలోచించకూడదు. అందుకోసం పెళ్లి వ్యవస్థే నమ్మదగ్గది కాదు అంటే నేను ఒప్పుకోను. మన బంధువుల్లో నీ వయసు పిల్లలు బోలెడు మంది ఉన్నారు . వాళ్లెవరూ నీలా పెళ్లి వద్దని కూర్చోలేదు. ఇన్నాళ్లూ కాస్త సమయం ఇమ్మని చెప్పి ఇప్పుడు నువ్వు అసలు పెళ్లే వద్దని అంటున్నావ్. శ్వేతా, నా మనసు బాధ పెట్టకు.నువ్వు ఎవరినైనా ఇష్టపడితే చెప్పు. అంతే కాని ఇలా మాట్లాడకు.’

‘ నీకెలా చెప్పాలో తెలియట్లేదు. నాకు నమ్మకం లేనిది, అవసరం అనిపించనిదీ నువ్వు చేసుకోమంటే చేసుకుంటానని అనుకోకు.’

artwork: srujan raj

‘ఒంటరిగా జీవితమంతా ఉండిపోతావా? ఒక తోడు కావాలని నీకు అనిపించట్లేదా? మాకు ఉన్నదే నువ్వు ఒక్కదానివి. నీకు పెళ్లి చేసి ఆ ముచ్చట తీర్చుకోవాలని మాకు మాత్రం ఉండదా? కని,పెంచిన మా ఇష్టాల గురించి ఆలోచించవా? అయినా నీ వయసు పిల్లలు పెళ్లిచేసుకోవాలని, ఒకతోడు కావాలని కోరుకోవటం అసహజం కాదుకదా.’

‘అమ్మా, తోడు కావాలంటే పెళ్లే చేసుకోనక్కరలేదు. నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు కలిసి జీవించటం బావుంటుంది. అంతవరకే. పెళ్లి అనే సంకెళ్లు వేసుకోనక్కర్లేదు. పిల్లలకోసం తాపత్రయ పడక్కరలేదు. ఆ సహచర్యం సాగినన్నాళ్లు సాగుతుంది. ఆ తర్వాత ఎవరి జీవితాలు వాళ్లవి. దాని గురించి కూడా దిగుళ్లు పెట్టుకోనక్కర్లేదు .’

మాధురి కూతురివైపు విచిత్రంగా చూసింది. ఇదేమిటి? ఈ ఆలోచనలు తానింతవరకూ వినలేదే?!

తన చెల్లెలు రుక్మిణి కూతురి పెళ్లిచేస్తూ క్రిందటేడాది తనతో అన్న మాటలు తను మర్చిపోలేదు.

‘అక్కా, శ్వేత కంటే నా కూతురు లాస్య చిన్నది. శ్వేత పెళ్లి ఇప్పుడే వద్దంటోందని చెప్పావు నువ్వు. లాస్యకి మాకు తెలిసున్నకుటుంబం నుండి ఒక మంచి సంబంధం వచ్చింది. లాస్య కూడా అభ్యంతరం చెప్పలేదు. న్యాయంగా పెద్దపిల్ల కనుక శ్వేత పెళ్లి ముందు జరిగితే బావుంటుంది. కాని ఇప్పుడు పరిస్థితి ఇలా వచ్చింది’ అంది తానేదో అపరాధం చేస్తున్నట్టు.

తను నవ్వుతూ కొట్టిపారేసింది ‘ అలాటివేం పెట్టుకోకు ‘’ అని. ఆ పెళ్లి జరిగిపోయింది.

శ్వేత ఆలోచనలు ఎందుకిలా ఉన్నాయి? తన పెంపకంలో లోపమా? పెళ్లి, కుటుంబ వ్యవస్థ పట్ల కూతురిలో సరి అయిన అవగాహన కల్పించలేక పోయిందాతను? ఎక్కడుంది లోపం?మాధురిని ఒక న్యూనతా భావం కమ్ముకుంది. ఒక తల్లిగా తను సరైన బాధ్యత నిర్వర్తించలేదా? భర్తకి చెబితే ఏమంటాడు? కూతుర్నే సమర్ధిస్తాడా? అసలు అతను కాదూ ఇన్నేళ్లూ కూతురి మాటలకి వంత పాడుతూ ,పెళ్లి వాయిదా వేస్తూ వచ్చింది! తన దగ్గర చెప్పిన విషయాల్నే తండ్రి దగ్గర కూడా చెబుతుందా ? ఏమి చెయ్యలి తను?

శ్వేత ఆరాత్రే బయల్దేరి వెళ్లిపోయింది. తెల్లవార్లూ నిద్రపట్టక పక్కమీద మసులుతూనే ఉంది మాధురి. కిటికీ బయట చిక్కని వెన్నెల మనసుని సేదదీర్చలేకపోయింది.

*************

ప్రొద్దున్న శ్యామ్ ఆఫీసుకు బయలుదేరుతుంటే  మాలతి క్లినిక్ దగ్గర తనను దింపమని చెప్పింది భర్తతో.

మాలతి అప్పుడే వచ్చినట్టుంది. క్లినిక్ లో ఆమె ఒక్కతే ఉంది. మాధురి తన మనసులో  బాథ వెళ్లబోసుకుంది.

‘మధూ, శ్వేత చెప్పిన విషయం నాకు విస్మయాన్ని కలిగించటం లేదు. ఇప్పటి తరం ఆలోచనలు ఇలాగే ఉన్నాయి. నా దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వచ్చే పిల్లల్ని, తల్లిదండ్రుల్ని చూస్తున్నాను కదా.

ఈ మార్పు అనివార్యమనే అనిపిస్తోంది .మన అమ్మల కాలంలో ఉమ్మడి కుటుంబాలే చాలావరకు.వాళ్లు స్వంత ఊళ్లని వదలవలసిన అవసరం రాలేదు. మనతరం  ఉద్యోగాల పేరుతో స్వంత ఊళ్లనీ, కన్నవాళ్లనీ వదిలి పరాయి ప్రాంతాలకొచ్చేసేం. ఇదంతా సహజంగానే జరిగిపోయిందని అనుకున్నాం. వెనుక మిగిలిపోయిన వాళ్ల ఆలోచనలు ఏమిటన్నది మనం అంతగా పట్టించుకోలేదు.

ఒక్కసారి మనం పెరిగిన వాతావరణం గుర్తు తెచ్చుకో. అలాటి బలమైన కుటుంబ వ్యవస్థలో అమ్మకి దీటుగా పెద్దమ్మలు, పిన్నమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ మనం పెరిగిన నేపధ్యంలో మన వెనుకే ఉన్నారు. వాళ్లంతా మన కుటుంబంలో భాగంగానే ఉండేవాళ్లు.

మారుతున్న కాలంలో మన జీవితాలు మనమిద్దరం, మనకిద్దరు లేదా ఒక్కరు తో మొదలయ్యి, కొంచెం సంకుచితం అవుతూ వచ్చేయి. మనతరంలోనే కొందరు కులమత,వర్గాల్ని ప్రక్కకి పెట్టి పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లున్నారు. వాళ్లకి సమాజం నుండి బోలెడు వ్యతిరేకత ఎదురైంది. అయినా పెళ్లిపట్ల , స్వంత నిర్ణయం పట్ల ఉన్న కమిట్మెంట్ వాళ్ల జీవితాల్ని సవ్యంగా నడిపించింది.

ఇప్పుడు ఉద్యోగాలపేరుతో పొరుగూళ్లు, పొరుగు రాష్ట్రాలు, పొరుగు దేశాలు పట్టుకు తిరుగుతున్నారు. ఇద్దరు, ముగ్గురు సభ్యులున్న కుటుంబం కూడా రెండు వేరువేరు చోట్ల జీవించాల్సి వస్తోంది. భార్య,భర్తల ఉద్యోగమనో, పిల్లల చదువులనో ఈ రకంగా సంసారాలు రెండు , మూడు ముక్కలుగా బ్రతికేస్తున్నాయి…….’

మాలతి మాటలకి అడ్డం వస్తూ మాధురి అంది, ‘ఏమో మాలతీ ఇవన్నీ వింటుంటే భయమేస్తోంది. ఏమయిపోతోంది మన సమాజం? ఎవరు కారణం ఈ మార్పులకి?’

‘అలా భయపడితే ఎలానోయ్ అమ్మాయీ?! నువ్వు కుటుంబం వరకే పరిమితమై బయట ప్రపంచాన్ని, వస్తున్న మార్పుల్ని గమనించట్లేదని చెబుతాను. ఇప్పుడున్న సమాజాన్ని ఎవరో ఎందుకు మార్చేస్తారు? మనం, మన పిల్లలు ఆ మార్పు కి కారణం. ఏ తరంలో అయినా యువతరం ముఖ్య నిర్ణయాల్ని చేస్తూ తమకు అనువైన కొత్త మార్పుల్ని తీసుకొస్తుంటుంది కదా. క్రిందటి తరం వాళ్లు వాళ్లకు అనువైన మార్పుల్ని వాళ్ళు తెచ్చుకున్నారు సమాజంలో. అది అప్పటి పెద్దలకి పెను సవాళ్లనే విసిరింది. ఇప్పుడు ఆ సవాళ్లు ఎదుర్కోటం మనవంతు.

ఎక్కడికక్కడ ఎవరి జీవితాలు వారివి, ఎవరి సమస్యలు వారివి అయినప్పుడు మిగిలిన వాళ్లకోసం ఆలోచించే తీరిక ఎవరికుంది?

నీ కూతురు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. తన అభిప్రాయాన్ని అంత స్పష్టంగా చెప్పింది. తన ఆలోచనల పట్ల ఎలాటి అయోమయం లేదు తనకి.

ఇప్పటి వాళ్లు ప్రాక్టికల్ గా ఎదుర్కొంటున్న ఇబ్బందులున్నాయి. వాళ్లకి అనువుగా ,సౌకర్యంగా ఉన్న నిర్ణయాల్ని వాళ్లు తీసుకుంటున్నారు. నీకూతురికి కౌన్సిలింగ్ కావాలని అన్నావు కదూ. తనకు కౌన్సిలింగ్ ఇవ్వవలసిన అవసరం లేదు. నీకు మాత్రం కొంత అవసరం.’ నవ్వుతూ తను చెప్పదలచుకున్నది చెప్పింది మాలతి.

‘మాలా, నీకు వేళాకోళం గా ఉంది నా సమస్య. కూతురికి పెళ్లి చెయ్యాలన్న ఆశ, ఆ బాధ్యత తీర్చుకోవాలన్న తపన న్యాయమైనదేకదా ’ మాధురి ముఖంలో అలక.

‘వేళాకోళం కాదు మధూ, మన చుట్టూ సమాజంలో విడాకుల రేటు పెరుగుతోందన్నది చూస్తున్నావుగా. జీవితాల్లో వచ్చిన వేగం, ఉద్యోగపు ఒత్తిళ్లు, పోటీ ప్రపంచంలో భవిత గురించిన అభద్రత ఇప్పటి తరాన్ని వేధిస్తున్నాయి. వాళ్లని వాళ్లు చూసుకోవటం,వాళ్ల పోరాటాలు ….ఇవి జీవితంలో ముఖ్య సమస్యలు అయిపోయాయి. ఇంకా పెళ్లి, పిల్లలు లాటి జంఝాటాలు వాళ్లకి సహించరానివిగా ఉన్నాయి. ఇది నువ్వు ఒప్పుకుతీరాల్సిందే.

అదీకాక కూతురి పెళ్లి చెయ్యాలన్న ఆశ, అదో బాధ్యతలా భావించటం ఈ కాలానికి నప్పవు. నీ ఆనందం కోసం పిల్లలు, అది వాళ్లు పిల్లలుగా ఉన్నంతవరకే. పెంచటం వరకే నీ బాధ్యత. ఆ తర్వాత వాళ్ల జీవితాలమీద నీకు ఎలాటి హక్కూ లేదు. ఎందుకంటే జీవితం వాళ్లది. ఆ మంచి చెడులు వాళ్లని ఆలోచించుకోనీయటమే న్యాయం. వాళ్లకి అవసరమైనప్పుడు వాళ్ల వెనుక నువ్వు ఉన్నావన్న నమ్మకం వాళ్లకి కలిగించటం వరకే నువ్వు చెయ్యవలసింది. ’

‘అయితే ఇక కుటుంబాలు, వివాహ వ్యవస్థ సమాజంలోంచి మాయమైపోతాయా? సమాజం అంటే ఒంటరి వ్యక్తుల సమూహమేనా? ’

‘ఎందుకు మాయమవుతాయి? ఈ తరం వాళ్లలో శ్వేతలాగా ఆలోచించేవాళ్లతో పాటు నీ ఆలోచనలు సమర్ధించే వాళ్లు ఉన్నారు కదా. పెళ్లిళ్లు ఉంటాయి. అయితే విడాకులు, కుటుంబాలు విచ్చిన్నమవటం,మరింత పెరుగుతాయి. ఎదుటి వ్యక్తి కోసం ఆలోచించటం, సర్దుబాటు అనేవి లేనప్పుడు ఇది తప్పదు. ఒంటరి జీవితాలు అని నువ్వు అంటూన్నావే అవి కొన్నేళ్లకి మనుషుల మధ్య కొత్త బంధాలకోసం ఆరాట పడేలా చేస్తాయేమో. ఆ తర్వాత మళ్లీ సమాజంలో ఒక స్థిరత్వం కోసం ప్రయత్నాలు మొదలవుతాయేమో! అప్పుడు మళ్లీ వివాహవ్యవస్థ కావాలని బలంగా కోరుకుంటారేమో! చూద్దాం.’…..

మాలతి మాటలు పూర్తి కాకుండానే తలుపు తోసుకుని ఎవరో రావటంతో , మాధురి మళ్లీ కలుస్తానంటు లేచింది. ఇంటికొస్తుంటే దారిపొడవునా ఆలోచనలే. ఊపిరి సలపనట్టుగా అనిపిస్తోంది మాధురికి. తనను అర్థం చేసుకుంటుందనుకున్న మాలతి కూడా తన ఆలోచనధోరణి ఈ కాలానికి చెల్లదని సూటిగా చెబుతోంది.

అమ్మవాళ్ల తరం కంటే కాస్త ముందడుగు వేసి డిగ్రీ చదువులు చదివి, అంతో ఇంతో ప్రపంచాన్ని గమనిస్తూ కూడా తను కూతురి అభిప్రాయాల్ని అర్థం చేసుకోలేని దశలో ఉందన్నది మాధురి ఒప్పుకోలేకపోతోంది . తరానికి తరానికి మధ్య ఈ అగాధాలు పూడ్చలేనివేనా?

*******************

artwork: srujan raj

సినిమా ఆసక్తి కరంగా అనిపించినా మధ్యమధ్యలో భార్య గురించిన ఆలోచన అతడిని కాస్త అస్థిమితం చేస్తూనే ఉంది.

‘ ఈ సినిమాలో హీరోయిన్ తన జీవితాన్ని తనకు కావలసినట్టు మలుచుకుంది. ముందు పిరికిగా కనిపించి , ఏడుస్తూ కూర్చున్నా బయటి ప్రపంచంలోకి వచ్చాక తనకు కావలసినదేమిటో నిర్ణయించుకునే మెట్యూరిటీ ని సంపాదించింది. సినిమా పేరుకి, ఆ నాయిక పాత్రకి  తగినట్టుగానే నిజంగా క్వీన్ లాగే తన జీవితాన్ని తను రచించుకుంది. నీకు నచ్చిందా డాడ్’ అంటూ అడుగుతోంది శ్వేత సినిమా నుండి వస్తూంటే .

శ్యామ్ కూతురి అభిప్రాయాన్ని అంగీకరించాడు. ఆ సినిమా లో పాత్ర అద్భుతంగా పోషించినందుకు  నాయిక కంగనా కి జాతీయ అవార్డ్ వచ్చిందని చెబుతోంది శ్వేత.

అవును, క్వీన్ ఈ కాలపు పిల్ల. తనకు ఏమికావాలో తను నిర్ణయించుకుంది.

శ్వేత తన జీవితం పట్ల తీసుకున్న నిర్ణయాన్ని మాధురికి అర్థం అయ్యేలా చెప్పడానికి శ్యామ్ సిధ్ధపడ్డాడు.

******************

 

 

మీ మాటలు

  1. వివాహం పట్ల ప్రస్తుత యువత ధోరణిని స్పష్టంగా చెప్పడమే కాదు, అటువంటి పరిస్థితి తల్లిదండ్రులుగా తమకే వస్తే మానసికంగా సన్నద్ధం కావడానికి, శ్వేత వంటి పిల్లల స్పష్టమైన, దృఢమైన ఆలోచనలని అర్ధం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఈ కథ . మంచి కథ అందించినందుకు ధన్యవాదాలు అనురాధ నాదెళ్ళ గారు

    ..

  2. తహిరో says:

    కథ స్పష్టంగా రాశారు అనూరాధ గారూ. ఆ మధ్య చూసిన మణిరత్నం గారి “ఒకే బంగారం ” గుర్తుకు వచ్చింది. మారుతున్న వైవాహిక బంధాలకు ఒక ప్రతీక మీ కథ.
    అన్నట్టు కథలో ఒక దగ్గర నైట్ క్వీన్ “తీగ ” అని రాసారు – అది పొద అనుకుంటా.

  3. సమాజం లో మార్పులు సహజం ..సహజాతి సహజం ..మన తరం లో వచ్చిన మార్పులలో మనం భాగం అవడం వల్ల , ఆ మార్పుల వల్ల కలిగిన షాక్ లకి మనం గురి కాలేదు , ఈ తరం కి మన తరం ఒక గతం ..గతం ఎప్ప్పుడూ ముదుకి చూస్తూ భయ ఆందోళనలకి గురి అవుతూ ఉంటుంది , సారధి గా ఉంటారు ఒకరో ,ఇద్దరో ..అంతా కాల ప్రవహాం ..మునగాలి ,తేలాలి ,తప్పదు .
    చాలా మంచి కథ చదివిన తృప్తి కలిగింది .

    వసంత లక్ష్మి .

  4. స్టోరీస్ చాల నీట్ గ ప్రెసెంట్ చేసారు.మార్పు తప్పదు సమాజంలో.మన ప్రమేయం లేకుండా జరిగిపోతాయి.చాల ధర్యం గ రాసారు.కాంగ్రతులషన్స్ అనురాధ గారు.

  5. మారుతున్న వివాహ వ్యవస్థ మరియు living together కాన్సెప్ట్ చాల చక్కగా చెప్పేరు రచయిత్రిగారు. మనం ఇలాంటివి ఎన్ని చూస్తున్నా ఈ సమాజంలో, మనదాక వస్తే మనం మాధురిలాగే react అవుతాము. మన తరం వాళ్ళు ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి- Change is what is constant in life ..

  6. ఈ కధను ప్రచురించినందుకు ముందుగ సారంగ వారికి అభినందనలు . కూతురి గురించి తల్లి పడే తపన , మార్పు తప్పదని ,దాన్ని accept చేయడానికి చేసే ఆలోచన విధానం చాల బాగున్నై .

  7. ఈ కధను ప్రచురించినందుకు ముందుగ సారంగ వారికి అభినందనలు . కూతురి గురించి తల్లి పడే తపన , ముఖ్యంగా మారుతున్న ఈనాటి సమాజాన్ని చుస్తుకుడా తనదాక వస్తేకాని తెలీదు అన్న చందంగా ప్రవర్తించిన తీరు బాగా తెలిపేరు రచయత్రిగారు . మారుతున్న కాలంతో మనము మారవలసిన అవసరం ఎంతైనా వుందని బాగా చెప్పేరు .

  8. Sitha challa says:

    ప్రస్తుత పరిస్థితిని మృదువుగా విడమర్చి చెప్పేరు. ప్రతి ఇంటిలోనూ జరుగుతున్న జనరేషన్ struggles లో మరి ఒకటి!! మార్పు ముఖ్యం కాని కొన్ని మార్పులు తల్లి తండ్రులకు తమ నించి పిల్లలు ఎంత దూరంలో వున్నారో చెప్తున్నాయి.
    అనురాధ గారు ఇంకొక ఆణిముత్యం అందిచినందుకు మా కృతఙ్ఞతలు.

  9. sreedevi canada says:

    తల్లి తండ్రుల మధన కంటే ఈ కధ లో పిల్లల ఆలోచనా తీరు బాగా రాసేరు. ఇప్పటి కాలం పిల్లలకి సర్దుకు పోయే తత్త్వం లేదు.స్వార్ధం ఎక్కువగా కనపడుతోంది. ఈ కథ ఒక మంచి ఉదాహరణ. ‘నాది’, ‘నాకు’ అనే మనస్తత్వం వలన ఎవరితో ను కలసి పంచుకోవడం ఇష్టపడటం లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో అభివ్రుది చెందు తున్నాయి, అన్నీ క్షణం లో అందు బాటులో ఉంటున్నాయి ..ఇది ఒక కారణం కావచ్చు.కధ మంచి డిబేట్ తో రాసేరు.ఇరు ప్రక్షాలు కరెక్ట్ గానే వారి వారి కాలానికి అనుగుణంగా ఉన్నారు.

  10. ఈ కాలపు యువతీయువకులు ముందు చూపు కలవారు . తమ ఆలోచనలను ఆచరణలో పెట్టి వాటికి అనుగుణంగా జీవితాన్ని ఆనందంగా గడపాలనుకుంటారు .
    సహజీవనం అంటే వివాహ బంధం , దాని ద్వారా వచ్చే సమస్యలు , కుటుంబం కోసం , పిల్లల కోసం పడే శ్రమ – వీటినుండి విముక్తులు కావడానికి ఎంచుకున్న మార్గం అనుకుంటాను . జీవితాన్ని కోరుకున్న వారితో హాయిగా గడిపి , మలి దశలో సంపాదించిన దానితో Star Hotels లాటి Old Age Homes లో ప్రశాంతంగా జీవించవచ్చు . జీవితం ఇక చాలు అనుకుంటే చాలా మార్గాలు వున్నాయి. మంచి ఆలోచన . ఇందులో మరే ఇతర సమస్యలు రావు .
    గతంలో ఇలాటి ఆలోచనలు లేక పోవడంతో కొందరు వ్రుధ్ధులు సంపాదించినదంతా కుటుంబం కోసం ఖర్చు చేసి , చివరి దశలో పిల్లల వద్ద చేరి , వారి ఆంక్షలు , చీత్కారాలు భరిస్తూ కాలం గడుపుతున్నారు గదా ! బహుశా ఇవి చూసే వారు ఈ సమస్యలకు పరిష్కారం సహజీవనం మాత్రమే అని నమ్మినట్లు కనబడుతుంది .
    ఇవి నా ఆలోచనలే సుమా !!

    • మంజరి లక్ష్మి says:

      బాగా రాశారు రాజుగారు. పిల్లల్ని కనే బాదర బందీ కూడా వద్దనుకుంటున్నట్లున్నారు కదా వీళ్ళు. అందరు ఆడవాళ్ళు అలా అనుకుంటే మానవ సృష్టే ఆగిపోతుందా అని కొంచెం అనుమాన పడ్డాను. కానీ ఇదంతా డబ్బున్న వాళ్ళ సంగతి కదా. మళ్ళా వీళ్ళకోసం అన్ని దశల్లోనూ, వీళ్ళకు సేవలు, అనేక శ్రమలు చెయ్యాల్సిన వాళ్ళు కావాలంటే పేదవాళ్ల పిల్లలుంటారు కదా. వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ కోసమైనా పిల్లల్ని ఇబ్బడిముబ్బడిగా కనవలసిందే. స్టార్ హోటేల్స్ లాంటి వృద్ధాశ్రమాలలో వీళ్ళ కోసం పని చెయ్యవలసిందే అని సమాధానం చెప్పుకున్నాను.

  11. చందు తులసి says:

    వివాహ వ్యవస్థను… ఆధునిక యువత ఆలోచనను లోతుగా చర్చించారు అనురాధ గారు.
    సమాజం లో వేగంగా జరుగుతున్న పరిణామాన్ని ఆసక్తిగా చెప్పారు.
    మీరన్నట్లు మార్పు జరుగుతూనే వుంటుంది . ఇపుడు సహజీవనం ఆధునికం. భవిష్యత్లో మళ్లీ పెళ్లికి క్రేజ్ రావచ్చు. మంచి కథ. అభినందనలు మేడమ్

  12. అనురాధ గారి క్వీన్ కధ చాల బాగుంది .ఈతరము తల్లితండ్రుల ఆలోచనా విధానములో మార్పుకు దోహదము చేస్తుంది.కాలముతో మారాల్సిన అవసరము వున్నాఈ మార్పు అంత సులభము కాదేమో అనిపించింది. ఈ కధ సమాజాన్ని కొంత ఆలోచిమ్పచేసేడిగా ఉంది . ప్రచురించిన సారంగ వార పత్రిక కు నా ధన్య వాదాలు.

  13. Seshulakshmi konduri says:

    ఈతరాల ఆలోచనలని పూర్తిగా అంగీకరించే స్తాయికి మనం ఎదగ లేదు తల్లిదండ్రుల ఘర్షణ ఆవేదన స్పష్టంగా చెప్పగలిగారు రచయిత్రి ఐతే eye ta-ra valla ఆలోచనలలో ఉన్న లోపాలని సమస్యలని ఇంకొంచం విపులీకరిస్తే బాగుండేది రచయిత్రిఈతరాన్ని పూర్తిగాసమర్దిస్తున్నర anipinchindi

  14. Deepthi . P says:

    క్వీన్ టైటిల్ చాల బావుంది .. ఇది చాల confusing concept..థర్డ్ పర్సన్ ల చూస్తె సమస్య చిన్నదిగా ఉంటుంది. తన దాక వస్తే గాని నొప్పి తెలిదు.. పేరెంట్స్ రియాక్షన్ చాల natural .. మధురి లానే అందరు mothers react అవతారు.. మార్పు అన్నది మంచిదే బట్ ఇలా no strings attached or living together నాకు అర్ధం కావు .. ఎంత ఫాస్ట్ అయిన , ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిన we are humans అండ్ will remain so.. Emotional dependency లేకుండా ఎలా ఉండగలుగుతము? రేపు రేలషన్శిప్ స్టేటస్ ఏంటో తెలియకుండా ఎలా? Saying that I don’t mean all marriages are successful .. Canada sridevi గారు అన్నట్టు ఇది మంచి debate కాన్సెప్ట్..

  15. నిజమే రచయత్రి గారు మంచి debatable కధని ఇచ్చేరు. తల్లిగా మధురి ఆవేదన చాలా కరెక్ట్. ఆవిడా వివాహ వ్యవస్థని నమ్మింది. అందులో ఉన్న మంచి చెడులని నమ్మింది కనుక కూతురికి నచ్చ చెపుదామని తాపత్రయం. కాని శ్వేత ఈ కాలపు పిల్ల. ఇప్పటి తరానికి ఇది కాక పొతే ఇంకొకటి అనే మనతత్వం ఉంటోంది, రాహుల్ కాకా పొతే రంగన్. దీప్తి గారు బాగా రాసేరు ‘ఎమోషనల్ dependency అన్నది చాలా ముఖ్యం మన రోజు వారి జీవితం లో. మన అమ్మమ్మలు చెప్పినట్టు మనుషులకి మృగాలకి తేడ లేదు ఈ కాలం లో. రచయత్రి గారు క్వీన్ సినిమా తో పోల్చి ఎంతో బాగా ఈ కధని మనకి అందించేరు.

  16. క్వీన్ పేరు సరిగ్గా సరిపోయింది.శ్వేత లాంటి ఈ తరం వాళ్లకి ఇలాంటి సినిమాలు నచ్చడంలో ఏమి కొత్త కాదు. వాళ్లకి కావలిసినట్టుగా చూపించారు మరి. అది రెండు గంటల సినిమా మాత్రమే అని గ్రహించలేక పోయింది, అది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే. చిన్నప్పుడు రాజు రాణి కధలు చదివి మురిసిపోయినట్టు గా ఉంది. ప్రీతి గురించి అంత గట్టిగా చెప్పిన శ్వేత, సినిమా కధని స్ఫూర్తి గా తీసుకోవడం విచిత్రం. ఏది ఏమైనా సమాజం లో మార్పులు జీవితాలని ఎంతో influence చేస్తున్నాయి. రచయత్రి గారు రాసినట్టు కమిట్మెంట్ ఇష్టపడడం లేదు ఇప్పటి కాలంలో ఎవరూ. శేషు గారు రాసినట్టు మనదాక వస్తే మనం కూడా మాధురిలాగే react అవుతాము.

  17. శ్వేత పాత్ర ఎంతో నచ్చింది, చాలా ధైర్యం గా, వివరం గా అమ్మ కి చెప్పింది. పెళ్లి వల్లనే జీవితం ఆనందం గా ఉంటుంది అనే ఆలోచనలు మారాలి.తల్లితండ్రులు అయిన ప్రతివాళ్ళ ఆలోచనలు మారిపోతాయి. వాళ్ళ చిన్నతనం లో ఉన్న ఆలోచనలు, ఉత్చ్చాహం ఏమయిపోతాయి? పిల్లలలకి పిరికితనం నూరి పూస్తారు. రాజు గారి కామెంట్ ఎంతో బాగా చెప్పేరు. కలసి బతకడానికి పెళ్లి అని పేరు ఎందుకు పెట్టాలి? శ్వేత సంతోషం గా రాహుల్ తో జీవనం గడపడానికి ‘పెళ్లి’ ఒక్కటే మార్గమా? ఎప్పుడో ఏదో హర్ట్ అవుతారేమో అని ఇప్పుడు సంతోషాన్ని మానుకోమంటారా? పెళ్లి చేసుకుంటే మాత్రం హర్ట్ అవరా? ప్రీతి ఉదాహరణ చాలా చక్కగా వివరించేరు.మార్పు అన్నది తరాల నుండి వస్తున్నదే. మార్పు లేనిదే అభివ్రుది లేదు. మాలతి ఎంతో చక్కగా మాధురికి చెప్పింది. రైటర్ కధని సమస్య లాగా మొదలు పెట్టి పరిష్కారం కూడా ఎంతో చక్కగా చెప్పేరు.

  18. బాధ్యత లేని అటువంటి సంబందానికి బోలెడుమంది మొగోళ్ళు ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు. చివరికి నష్టం ఆడపిల్లకే. కామన్ సెన్సు! తిండి పెట్టి పోషించి చదివించి ప్ర్యోజకురాలిని చేసిన అమ్మకీ అబ్బాకీ కూడా కనీసం మాట మాత్రం చెప్పకుండా నాకు నచ్చిన వాడితో నేను వుంటాను అన్నట్టు ఒక్క సారిగా షాక్ కి(తండ్రి పిల్ల గడపలో అడుగు పెట్టగానే ఎవడో తలుపు తియ్యడం) చెయ్యడం బాధ్యతా రాహిత్యం. రేపు ఆ పిల్లకి పరిస్థితి తిరగ బడితే మళ్ళీ ఆదుకునేది తల్లి తండ్రులే. ఈ కొత్త చెత్త మార్పు వల్ల అమ్మాయికి ఇసుమంత లాభం, చట్ట్ట పరమైన రక్షణ లేవు సరికదా బోలెడు సమస్యలు వస్తాయి. కాలూ చెయ్యి ఆడినంత కాలం వయసు ఉన్నంత వరకూ బానే వుంటది, తీరా వయసు అయిపోయి అమా అబ్బా కూడా పోయాక అసలు కదా మొదలు. పెళ్ళిలో వున్నా సమస్యలకు కనిబెట్టిన ఈ పరిష్కారం ఏడ్చినట్టుంది … పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టు. రచయిత్రి క్షమించాలి…వ్యాఖ్యలు పెర్సోనల్గా తీసుకోకండి..ii ఈ ధోరణి పనికి వచ్చేది కాదని నా అభిప్రాయం-ముఖ్యంగా ఆడపిల్లలికి నష్ట కరం.

    .

    • విశ్వజ says:

      అను గారూ, మీ ఆవేశం అర్థం అయ్యింది . పక్షులు , జంతువులూ పిల్లలను పెంచుతాయి కానీ పెళ్లి చేసి అత్తా వారింటికి పంపవు – తమకు కావలసిన జోడీ ని అవే వెతుక్కుంటాయి. అందుకే అమ్మాయిలకు ఆర్ధిక స్వాతంత్రం ఉండాలని గొంతెత్తి చెప్పేది. పిల్లలను పోషించి చదివించింది కాక లక్షలు అప్పు చేసి పెళ్లి చెయ్యాలంటే ఎలా ? తనకు నచ్చిన వాడితో కలిసి ఉన్నంత మాత్రాన కన్న వాళ్ళ మీద ప్రేమ పోతుందని ఎందుకు అనుకుంటున్నారు – ఇంకా పాత వ్యవస్థ లోనే ఉంటే ఎలా? కాలంతోపాటు మనమూ మారొద్దా? అమ్మా నాయిన పెళ్లి చేసిన వారికి చట్ట పరమయిన రక్షణ ఉందంటారా ? అమ్మాయి తనకు నచ్చిన వాడితో కొంత కాలమే ఉంటుందో … జీవితాంతం ఉంటుందో – అది వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ మీద ఆధార పడి ఉంటుంది – ఒక వేళ ప్రేమ లేకపోయినా తిట్టుకుంటూ కొట్టుకుంటూ కలిసి ఉండమని అంటారా ?
      సారంగలో ఆ మధ్య పింగళి చైతన్య గారి కథ ఒకటి వచ్చింది. చదవండి
      – మార్పు కు ఎవరూ ముందడుగు వేయక పోతే ఎలా అనూ గారూ – నా వాఖ్యలు పర్సనల్ గా తీసు కోకండి.

      • ప్రేమ చాల ఇన్ఫెరిఒర్ పదం. బాధ్యతా మంఛి పదం.జీవితంలో పనికి వచ్చేది. బాధ్యతా వున్నా చోట దాపరికం వుండదు. బాధ్యతా లేని చోట చాటు మాటు వ్యవహారం వుంటుంది. పెళ్ళికి లక్షలు అవసరం లేని మంచి మార్పు రావాలి. పెళ్ళికి అంటే తతంగం కాదు…ఇద్దరి సహజీవనానికి సమాజం ఇచ్చ్జే గుర్తింపు. దానిని సరలీకరిమ్వ్హోచ్చి ..సంస్కరించ వ అచ్చు . చరిత్రలో పెళ్లి ఆధునికం. పెళ్లి లేని జంతుత్వం ప్రాచీనం.మనిషి ఇతర జంతువులతో సమానం కాదు . మనిషి వేరుపదిపోయాడు . వెనక్కి పోలేడు.

  19. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ తో పాటు అప్పాజోస్యుల విష్ణుభొట్ల వారి సన్మాన గ్రహీత ఓల్గా గతంలో రాసిన ప్రయోగం కథని మర్చిపోతే ఎలా?ఆ కథ అప్పట్లో ఓ పెద్ద సంచలనం. ఇప్పుడదంతా గతం. ఆ కథా వస్తువులు పాత చింతకాయ పచ్చడి అయి పోయాయి. కలిసి ఉండటం తెలుగు సాహిత్యకారులకీ పాఠకులకే కొత్త. సమాజం ఎంతో ముందుకి పోయింది.
    – శశాంక

  20. suryanarayana says:

    ప్రస్తుత సమాజంలో వివాహ వ్యవస్థ, కలిసి ఉండటం అన్న విషయాన్ని చాల చక్కగా చెప్పేరు రచయిత్రిగారు. ఇలాంటివి మనం ఎన్ని చూస్తున్నా ప్రస్తుత ప్రస్తుత పరిస్తితులలో మనదాకా వస్తే మనం మాధురిలాగే ప్రవర్తిస్తము మార్పు అన్నది తప్పనిసరి అని తప్పక గుర్తు చేసుకోవాలి. ఇటువంటి కధ సమాజాన్ని కొంత ఆలోచింప చసది గ ఉంది .

  21. suryanarayana says:

    ప్రస్తుత వివాహ వ్యవస్థను, యువత ఆలోచనను చక్కగా చర్చించారు రచిత్రి గారు. నటి సమాజం లోజరుగుతున్న పరిణామాన్ని ఆసక్తిగా చెప్పారు. మార్పు అన్నది జరుగుతూనే వుంటుంది . మారుతున్న కాలంతో మనము మారవలసిన అవసరం ఎంతైనా వుందని బాగా చెప్పేరు .ఇపుడు సహజీవనం తక్కువ కనపడుతున్నది భవిష్యత్లో మళ్లీ పెళ్లికి క్రేజ్ రావచ్చు.

  22. sreedevi canada says:

    ప్రతి relation కి ఒక పేరు ఉంటుంది.పేరు లేక పొతే ఆంటీ అంకుల్ కజిన్ అంటాము. అలాగే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం, దానికి ప్రోస్ అండ్ కాంస్ ఉంటాయి. మధురి నమ్మినది తర తారా లుగా చూస్తున్నది కూతురుకి చేపుదామనుకోవడంలో తప్పు లేదు. అలాగే శ్వేత తను నమ్మిన దాన్ని పాటించడంలో కూడా తప్పు లేదు. ఇలాంటి సహజీవనం లో ఆడవాళ్ళే నష్టపోతారు అనేది మారాలి. ఎంతో మంది మగవాళ్ళు ఎంతో డిప్రెషన్ తో ఉంటున్నారు ఎందుకంటే ఈ కాలం ఆడపిల్లలు ఎందుకూ తీసిపోరు వాళ్ళు మేకప్ లకి, షోకులకి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు, పిల్లలని కనడానికి ఇష్ట పడడం లేదు. అందుకని ఇది పెద్ద డిబేట్ విషయం. ఎలా మారతాయి రోజులు అనేది కాల ప్రవాహం లో చూడడమే. మన వరకూ వచేవరకు ఇలాంటి డిబేట్ లు ఉంటాయి, మన వరకు వచేక అది ఒక సమస్య లేక సమాజ మార్పా అనేది అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం , just like the story and its characters . మంచి కనువిప్పు విషయం ఇది.

  23. మా ఫ్రెండ్స్ సర్కిల్ లో చాలా మంది మగవాళ్ళకి పెళ్లి, పెళ్ళాం, పిల్లలు అనే బాధ్యత వద్దు.టింగురంగా మంటూ ఆడపిల్లలతో తిరగటం మాత్రమే ఇష్టం. Living together అన్న కాన్సెప్ట్ సెక్స్ ఇష్యూ తోనే చూడకూడదు.పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుక్కునే వరకూ ఎన్నో పనులు షేర్ చేసుకుంటాం.కిచెన్,బాత్రూం, క్లీనింగ్, వాషింగ్, టీవీ ,షాపింగ్ మరియు expenses . ఆఫీసులో పని వత్తిడి వాళ్ళ లేట్ గా రావడాల్లు…ఇవన్నీ కూడా మార్పులే మన జీవితాల్లో. అందుకే నాకు శ్వేత పాత్ర నచ్చింది. ఎమోషనల్ dependency అన్నది మొగుడు పిల్లలతోనే ఉండదు.మన ఫ్రెండ్స్ తో చుప్పుకున్నత ఇంటిలో వాళ్ళతో చెప్పుకోము చాలా సార్లు. ‘Gay ‘ ఇష్యూ ఇప్పుడు ఎంత అలవాటులో ఉందొ అలాగే Living together అన్నది ఈ పైన అలవాటులోకి రావచు.దానికి తల్లి తండ్రుల సహకారం ఎంతైనా మా పిల్లలకి కావలి.

    • G B Sastry says:

      ఎదురు బడిన ఆడతనం పక్వానికొచ్చిన పండులా కనబడి
      నదురు బెదురు లేకుండా లటుక్కున కోసి గుటుక్కునతినే
      ఆలోచన మగాడి మెనింజైటిస్ గా ఉన్నంతకాలం,పడతితన
      ఆడతనం బలహీనతని భావించినంతకాలం స్త్రీకివిమోచనేలేదే
      ఓ గులుకు రాణి

    • ఒకప్పటి తో పోలిస్తే లివింగ్ టుగెదర్ కి ప్రస్తుతం మర్కెట్ లో డిమాండ్ తగ్గింది. ప్రస్తుతం గే రైట్స్ కు డిమాండ్ పెరిగింది. అందుకు ఒక కారణం గే సమస్య పై అమెరికా వాడు మూడవ ప్రపంచ దేశాలలో 2012 నుంచి 4,500 కోట్లు (700మిలియన్ డాలర్లు) కుమ్మరించాడు. కాని ఆశించిన ఫలితలు రాలేదని, పైగా అది దేశాల ప్రజలకు నచ్చక బాక్ ఫైర్ అయ్యిందని న్యు యార్క్ టైంస్ లో వార్తలు వచ్చాయి.

      ఒకప్పుడు ఉద్యోగం చేస్తూ అద్దె ఇల్లు కొరకు ప్రయత్నిస్తే గేటేడ్ కమ్యునిటిలలో చాలా సులువుగా అద్దెకు ఇచ్చే వారు. చదువుకొన్న వాళ్ళు, యం.యన్.సి. లొ పనిచేసే వారు గదా, వ్యక్తిగత విషయాల గురించి పెద్దగా పఒనర్ ట్టించుకోకుండా వెంటనే ఇచ్చేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఆడమగ జంటగా కలసి వచ్చి మాకు ఇల్లు కావాలి, మేము భార్యా భర్తలం అని చెప్పినా, మేరేజ్ సర్టిఫికేట్ చూపించండి అని అడిగే గేటేడ్ కమ్యునిటి ఆఫిసులు చాలా ఉన్నాయి. ఇల్లుగల వారు లివింగ్ టుగెదర్ అని చెపితే అద్దెకు ఇవ్వటానికి సుముఖత చూపటం లేదు. వాళ్లు ఎంత పెద్ద కంపెని లో పని చేస్తున్నా. కారణం అపార్ట్ మెంట్ లో పక్కకాపురాల వారికి అభ్యంతరం ఉండటం.

      లివింగ్ టుగెదర్ ఖర్చు తో కూడుకొన్న వ్యవహారం. అలా ఉండాలనుకొనే వారికి స్వంత ఇల్లు ఉండాలి. సిటి లో ఇల్లు అంటే 50లక్షల పైమాటే!

  24. వనజ తాతినేని says:

    ప్రపంచ వ్యాప్తంగా ..చాలా వేగవంతంగా మార్పులు వస్తున్నాయి. ఈ కాలంలో జరుగుతున్న వివాహాలేవీ పూర్తిగా విజయవంతం కావడంలేదు. కమిట్మెంట్,పరిపక్వత చెందిన ఆలోచనల వల్ల వివాహబంధానికి ఏ పగుళ్ళు ఏర్పడని ముందుతరం వారిలో చాలా మందికి వివాహవ్యవస్థ మంచిదనే అభిప్రాయం ఉంది. నేటి తరం వారి ఆలోచనలు వారికున్న స్పష్టతని మనం మెచ్చుకోవాల్సిందే కానీ తరాల అంతరాల వల్ల జరిగే మార్పుకి మానసికంగా సిద్దపడకపోవడం వల్ల మాధురికి కల్గిన ఆశాభంగాలే చాలా మంది తల్లిదండ్రులకి ఎదురవుతాయి. చదువులు, ఆర్ధిక స్వేచ్ఛ కల్గి ఉండటం మూలంగా … ఎగువ మధ్యతరగతి,సంపన్న కుటుంబాలలో పుట్టినవారి స్వేఛ్చా ధోరణి ఇలాగే ఉంటుంది. మధ్య తరగతి ఆడపిల్లలకి పేదవారికి పెళ్లి ,పిల్లలు, కట్నాలు,వేధింపులు ఇవ్వన్నీ ఎలాగు తప్పవు. మార్పు కొన్నివర్గాలకే పరిమితం అని నా అభిప్రాయం.
    మాలతి మాటల ద్వారా … ఒక ఆశావాద దృక్ఫదాన్ని వెలిబుచ్చారు రచయిత. అలాగే కథ కూడా ఇరువాదాల వైపు సమతూకంగా నడిపించారు. చివరికంటా ఆసక్తిగా చదివించిందీ కథ . అనూరాధ గారు విషయాన్ని ఒప్పించారు. అభినందనలు.

  25. lakshmi ramesh says:

    Queen story is a good realistic fiction. characters in the story are beautifuly portrayed. లైవ్ ఇన్ రేలషన్శిప్ or అరేంజ్డ్ marriages ప్రొబ్లెమ్స్ వుంటాయి. అవి ఎదురుకునే శక్తి అమ్మాయిలు లో ఉండాలి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఐన ఇండిపెండెంట్ గ సాల్వ్ చెయ్యగలరు. పిల్లలు కూడా తల్లి తండ్రులుని decision making లో involve చేసి , pros and cons discuss చేయాలి . Because parents are always their well wishers. shruti’s father should have enquired her about the person living with her, instead of remaining calm ignoring his responsibility.

  26. radha krishna thanikella says:

    ఈ కథలో పాతర్ల స్వభావం ఎలా ఉన్న , అవి పడే భాధ ప్రుస్పతంగా కనిపించిది . సమాజం లో మార్పు సహజం. కాలానుగుణంగా సమాజంతో పటు మనషులు కూడా మారాలి. ఇవన్ని ప్రకన్న పెడితే , తల్లి పడే భాధలో భాద్యత కనిపించిది , కానీ తండ్రి పడే భాధలో భాధ్యత కనిపించలేదు. పిల్లలిని ఆర్ధిక, సామజిక మరియు కుటుంబ భాధయతతో పెంచితే , కొంతవరకు వారి ఆలోచనలు , చేతలు భాధయతగా ఉండడానికి అవకాసం ఉంటుది. ఏది ఏమిన ఈ కథ రాసినదుకు అనురాధ గారికి , ప్రచిరించినదుకు సారంగ వారికి అభినందనలు.

  27. తల్లి తండ్రులు jeevitam లో ఒక దారిచుపిస్తారు. అది వారి సమాజం, ఆ కాలం, వారి పరిస్తితులకు సరిపడే లా వుంటాయి. పిల్లలు పెరిగి వారి ప్రపంచంలో ఆ కాలం నాటి మార్పులు ద్రుష్టి లో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ గా వుండే మన ఏరా లో, judgement కి తావులేకుండా ఎవరు ఎలావుంటే బావుంటుందో, ఏది మంచిదో, samaajam అబ్భ్యున్నతికి కావాలిసిన స్కోప్ లేకుండా మనం బిజీ అయిపోయాము. ఈ కథ ఆ angle ని కూడా చక్కగా ఆలోచించేలా చేసింది.

  28. amarendra says:

    టైం ఫర్ పేరెంట్స్ to గ్రో అప్ ..టైం ఫర్ such స్టోరీస్ ..థాంక్స్ అనురాధ గారూ..

  29. nadella anuradha says:

    కథ చదివి శ్రద్ధగా అభిప్రాయాలను,అభినందనలను తెలియజేసిన మిత్రులందరికీ థాంక్స్ .అనూరాధ

  30. ఒకప్పుడు – కుటుంబ జీవనానికి ఉమ్మడిగా జీవించడమే ఆదర్శమైన పద్ధతి అనే నమ్మకమూ, అందుకు తగిన ఆర్ధిక సాంఘిక పరిస్థితులూ ఉండేవి.. వేరుకాపురం పెట్టడమంటే తల్లి వేరుని తెంచుకు పోతున్నంత క్రూరంగానూ పరిగణించబడేదని, ఆ కాలంలో వెలువడిన సాహిత్యం వలన తేటతెల్లమౌతుంది. బహుసంతానం ఆక్షేపణీయం కాని ఆ రోజుల్లో, ఒక తండ్రికి పుట్టిన నలుగురు కొడుకులూ ఒకే ఇంట్లో కాపురాలు చేసుకుంటూ, జీవితాలు గడిపేవారు. ఆ ఏర్పాటులో కొన్ని ఎడ్వాంటేజీలు, మరి కొన్ని డిజెడ్వాంటేజీలు ఉండేవి. కానీ సాంఘిక ఆర్ధిక రాజకీయ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వచ్చి, వాటికి అనుగుణంగా కుటుంబాలు కుంచించుకుపోతున్న నేటి రోజుల్లో, భారతీయవివాహ వ్యవస్థ మీద కూడా ప్రశ్నలు రేగడం మనందరికీ తెలిసిందే.. పెళ్ళికెదిగిన వ్యక్తుల్లో ఒకనాడు లేని ఆర్దిక స్వాతంత్ర్యం ఈనాడు వుంది కాబట్టి, వాళ్ళ ఆలోచనా ధోరణికి బలం చేకూరుతోంది. అయితే, తరాల మధ్య వున్న అంతరం ఆనాడు చూపించిన ప్రభావాలనే ఇప్పుడూ చూపిస్తోంది. అనూరాధగారు దాన్నే తమ కథలో చక్కగా ప్రదర్శించారు. పాత్రల మానసిక చిత్రణ చాలా సహజంగా వుండి, వాటి ఆలోచనా స్వాతంత్ర్యాన్ని పటిష్టంగా ఆవిష్కరిస్తూ, జడ్జిమెంటల్ గా కాకుండా, ఒక తల్లి వేదనని, ఒక కూతురి పరిపక్వతనీ చక్కగా ప్రదర్శించారు. ఇంత మంచి కథని ఇచ్చినందుకు ధన్యవాదాలు! ఎస్ ఆర్ బందా.

  31. bhaskar g says:

    మ్యారేజ్ అనేది ఆప్షనల్, ఐ గెట్ దట్. In many of the available choices for a relationship, it’s one of them. It’s not the be all and end all in a relationship between 2 loving souls. నాకు ఒక్క విషయం అర్థం కావటం లేదు. In an ‘accepted’ relationship, marriage seems to be the ultimate goal, at least going by the struggles of the LGBT community worldwide, if not why are they trying to legitimize/legalize their relationship in the society or even in the legal system? What I believe is, you don’t have to blindly marry anyone your parents choose, or even trust your own judgement when you fall in love, living together should be a phase in the relationship (to work out the kinks as it were), if things don’t work out, there shouldn’t be any hard feelings when they break up (if it’s mutual), but once you get older, marriage as an institution provides that emotional support system and even legal support system. I’ve heard cases where gay couples who were living together for a long time couldn’t get dependent health care, or even be entitled to death benefits of their partner etc. So, as long as putting a label of ‘marriage’ doesn’t really change the essential nature of the relationship, its not a bad thing, but if you disagree on what marriage entails, for example, if you can’t be exclusive to each other, can’t be responsible for each other in the hour of need, etc, there’s no point in even living together. As I said, when you are young and healthy you feel you don’t need anyone and can take on the world, but as you get older your perspective changes. So living together is not a bad thing, but if a couple is going to live together with no promises of any type of commitment to each other, I don’t know what we can call it (I can think of some crude words, but I don’t need to be explicit), if they are living together to see if its relationship they want to be commited to, after a period of time, they don’t have to totally against the entire concept of marriage. It’s not black or white proposition, its a gray area.

  32. Rajeswari says:

    Rachayitri Katha chaduvu tunnappudu prativariki same incidents vinnatlu vuntundi
    She wrote a good narrative starting with Pune surroundings
    I read her another story visiting grand fathers place
    Presentation skills required for story writers
    are there in her
    Rajeswari

Leave a Reply to వనజ తాతినేని Cancel reply

*