రేపటి మీదే ఆశ!

 

చందు తులసి

~

chanduకథంటే…
కథంటే సమస్యలు కాకపోవచ్చు….
కథంటే పరిష్కారాలు కూడా కాకపోవచ్చు, కానీ…, కథంటే జీవితం. కథలో జీవితం వుండాలి. ఇదైనా ఒప్పుకుంటారా…? ఇది ఇటీవలే జరిగిన కథసాహితీ పాతికేళ్ల సభలో ప్రముఖ రచయిత, విమర్శకులు ఎన్. వేణుగోపాల్ అడిగిన ప్రశ్న .

కథలెలా పుడతాయి. జీవితంనుంచా..? సమాజం నుంచా..? లేక కేవలం సృజనకారుల ఆలోచనల్లోంచేనా..? సృజన అంటే కల్పనే. కానీ ఏ తరహా కల్పన. జీవితాన్ని మరిపించే కల్పనా…? జీవితాన్ని నడిపించే కల్పనా..?
***
గత ఏడాది సారంగ కథల్లో సమకాలీన సమాజానికి దూరంగా వున్న కథలు కొన్నైతే… సమాజాన్ని, జీవితాలను చిత్రించిన కథలు కొన్ని వున్నాయి. అన్నదాత ఆత్మహత్యలాంటి సీరియస్ సమస్యను ఇతివృత్తంగా తీసుకొని కలాన్ని ఛర్నాకోలలా ఝళిపించిన కథ ప్రసాద మూర్తి – ఓ రైతు ప్రార్థన. తెలుగులో అరుదైపోతున్న…వ్యంగ్య రచనా శైలిలో వచ్చిన కథ. రాజకీయ చదరంగంలో రైతుల జీవితాలు ఎలా పావులుగా మారుతున్నాయో ప్రభావవంతంగా చెప్పిన కథ.
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని భూ సేకరణ నేపథ్యంలో….అమరావతి, దాని చుట్టుపట్టు పల్లెల్లో వచ్చిన సామాజిక పరిణామాలను చర్చించిన కథ ఎమ్వీ రామిరెడ్డి త్రిశంకు స్వప్నం . కలలో కూడా ఊహించని విధంగా అమాంతంగా పెరిగిపోయిన భూముల ధరలు….ఆ ప్రాంతంలోని మానవ సంబంధాల్ని ఎలాంటి మార్పులకు దారితీస్తున్నాయో ఆసక్తికరంగా వివరించిన కథ.  ఇంచు మించు అదే ఇతివృత్తంతో ఆ ప్రాంతంలోనే జరుగుతున్న రియల్ ఎస్టేట్ మోసాలను వివరిస్తూ వచ్చిన కథ బుద్ధి యజ్ఞమూర్తి మాయ.
అలాగే తెలుగులో దాదాపూ అంతరించి పోతోందేమో అని ఆందోళన కలిగించే ప్రక్రియ ఆరోగ్యకరమైన హాస్యకథ.  ఆ లోటునూ తీర్చిన కథ డా.కోగంటి విజయ్ బాబు రాసిన ఎవరు కవి. నిజాయతీ, చిత్తశుద్ధి లేని కవులు, వారి కవిత్వం దండగ అని తేల్చిచెప్పి, ఆత్మీయంగా స్పందించే చిన్న మాట గొప్ప కవితకు ఏ మాత్రం తీసిపోదు అని విలువైన సందేశం ఇచ్చిన కథ. వెర్రితలలు వేస్తున్న మతమౌఢ్యం, భక్తి పేరిట జరుగుతున్న మోసాల గుట్టు విప్పిన కథలు కే.సుభాషిణి- నీలకంఠం పి.హెచ్.డీ, శివ్-అపరిచితులు కథలు. మూఢాచారాలను ప్రశ్నించిన ఇంద్రగంటి మాధవి- భోక్త కూడా అలాంటిదే. ఈ కథలు చదివిన తర్వాత…మొత్తానికి తెలుగు కథకులు అప్రమత్తంగానే వున్నారన్న సంతోషం తప్పక కలుగుతుంది.
బలవంతులు తమ అధికారం, బలం ఉపయోగించి ప్రకృతి వనరులు కొల్లగొట్టడం….ప్రత్యక్షంగా కనిపించని దోపిడి. ఈ నేరం ఎవరిదైనా శిక్ష మాత్రం అందరూ అనుభవించాల్సిన దుస్థితి. అందుకే ఈ దిశగా పాఠకులని మరింత చైతన్యం చేయాల్సిన బాధ్యత సాహిత్య కారులపైన ఉంటుంది. ఈ బాధ్యతనే స్వీకరిస్తూ… పర్యావరణ మార్పులు, పర్యవసానాలు… సైంటిఫిక్ ఫిక్షన్ తరహాలో ఆసక్తి కరంగా చెప్పిన కథ కొట్టం రామకృష్ణారెడ్డి 3456జీబీ. భవిష్యత్ లో తెలుగు కథలు విరివిగా రావడానికి అవకాశం ఉన్న విభాగం పర్యావరణ పరిరక్షణ. ఐతే ఈ దిశగా మరింత పరిశోధన, అధ్యయనం చేయాల్సి వుంటుంది.

ఇక ఈ కథల్లో అస్తిత్వవాద కథలూ ఒకటి, రెండు వచ్చాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన కథ కృష్ణజ్యోతి  నేను తోలు మల్లయ్య కొడుకుని. వర్ణం, కులం, లింగం అన్ని వర్గాల వేదనల్ని సున్నితంగా చర్చిస్తూనే…పరిష్కారాన్ని కూడా చూపించిన కథ. ఇతివృత్తంతో పాటూ…రాసిన తీరు కూడా కొత్తగా ఉన్నకథ.  అలాగే కత్తి మహేశ్ నా హీరోకోసం కూడా మరో మంచి కథ. హాలీవుడ్ స్థాయికి ఎదిగాం అని సంబరపడిపోతోంది తెలుగు సినిమా.  ఓ వైపు ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులతో కలిసి పని చేయడానికి ఆరాటపడుతూ…మరోవైపు ఇక్కడే వున్న దళిత, అణగారిన వర్గాల కళాకారులని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమపై సంధించిన ప్రశ్న కత్తి మహేశ్ కథ.  దగ్గర దగ్గర వందేళ్ల చరిత్రకు చేరువవుతున్న తెలుగు సినిమా పరిశ్రమలో ..ఒక్క దళితుడు హీరోగా లేకపోవడాన్ని, కనీసం ఓ గుర్తింపు పొందిన కళాకారుడు లేకపోవడాన్ని ఏమనాలి. ?  తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పిన…ముఖ్యంగా అద్భుతమైన పాటను సృష్టించిన దళిత సృజనకారులు సినిమారంగంలో కనీసం ప్రవేశాన్నికూడా ఎందుకు పొందలేకపోయారు…? పోయే కొద్దీ లోతైన చర్చకు దారితీసే అంశమిది. మొత్తానికి ఆ దిశగా ఓ చర్చను
లేవనెత్తిన కథ నా హీరోకోసం.

ఇక ఫెమినిస్టు కథలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఆ మాటకొస్తే చాలా కథలు మహిళలే రాయడం “సారంగ” కథల్లో కనిపించిన ఒక ప్రత్యేకత.  గ్లోబలైజేషన్ తదంతర పరిణామాలు మహిళల్ని కూడా వేగంగా అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములని చేశాయి.  పర్యవసానంగా….కొత్త ప్రపంచాన్ని, కొత్త మనుషుల్ని, మనస్తత్వాల్ని మగువలు ఎదుర్కొంటున్నారు. సహజంగానే కొంత సున్నితత్వం, స్పందించే తత్వం ఉన్న స్త్రీ ఈ ఇతివృత్తాల్ని సాహిత్య రూపంలోకి అనువదించేందుకు ఆరాటపడుతోంది. ముఖ్యంగా వెబ్ పత్రికలు వచ్చిన తర్వాత…ప్రచురించే అవకాశాలు బాగా పెరిగాయి. ఫలితంగా అటు కవిత్వంలోనూ, కథా ప్రక్రియలోనూ మహిళలు అధికంగా రావడం మొదలైంది. తరతరాలుగా తమలోనే ఇంకిపోయిన భావాలను…బాహ్య ప్రపంచంలోకి తీసుకువచ్చేందుకు…చర్చించేందుకు మహిళలకు అవకాశం లభిస్తోంది. ఐతే రకరకాల కారణాల వల్ల అంతర్జాల పత్రికల్లో సంపాదకీయం పూర్తి స్థాయిలో నిర్వహించడానికి అవకాశం తక్కువ.  అక్షర దోషాలు, అన్వయ దోషాలు కూడా సవరించకుండానే పాఠకుల ముందుకు రావడం దీన్నే రుజువు చేస్తోంది.  పెరుగుతున్న వెబ్ పత్రికల అవసరాల్ని తీర్చే సంఖ్యలో రచనలు రాకపోవడం వల్ల…సంపాదకులు ప్రమాణాల విషయంలో ఓ మేర రాజీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.  ఫలితంగా వెబ్ పత్రికల వల్ల ప్రమాణాలు తగ్గుతున్నాయనే విమర్శా వినిపిస్తోంది. ఈ విమర్శలో వాస్తవం ఉన్నా, క్రమక్రమంగా రచయితల సంఖ్య పెరుగుతున్నందున… వాటంతటవే ప్రమాణాలు కూడా పెరిగే రోజు రాక తప్పదు.
ఏదైమైనా వెబ్ పత్రికల పుణ్యమాని…మున్ముందు సరికొత్త ఇతివృత్తాలను, భిన్న కోణాలు తెలుగు కథల్లో చూసేందుకు అవకాశాలు పుష్కలంగా వున్నాయి. ఆ పరిణామానికి సూచనలుగా కనిపించే కథలు…రాధిక-ఆలోక.  ఆర్. దమయంతి-అమ్ములు,  రాజ్యలక్ష్మి కథ-మహాలక్ష్మి , పాలపర్తి జ్యోతిష్మతి- వారిజాక్షులందు. . అన్నీ ఉదాత్త పాత్రలున్న ఆలోక కథ ఓ మంచి అనుభూతినిచ్చే కథ. రేపటి తరం గురించిన ఆవేదన వ్యక్తం చేస్తూ….వారిని నిర్లక్ష్యం చేస్తే
వచ్చే పరిణామాలను చూపిస్తూ హెచ్చరించే కథలు… శాంతి ప్రభోద-బాల్యం మోస్తున్న విషాదం,  అన్వీక్ష-తొలి కలుపు,  మమత కొడిదెల-బరువు. ఈ కథలు బహుశా మహిళలు మాత్రమే రాయగలిగినవి. అలాగే సారంగలో వచ్చిన చిన్న కథలు నిడివిలో చిన్నవైనా…. పెద్ద కథలకు ఏ మాత్రం తీసిపోనివి. మా రోజుల్లో అంతా బాగుండేది….అంటూ పెదవి విరచడం కన్నా… కాలంతో పాటూ మనం మారాలని చెప్పే కథ లక్ష్మీ రాఘవ –అనుబంధాల టెక్నాలజీ.  కణ్ణగి-
పిచ్చుకలు, వినోద్ అనంతోజు- చింటూ అమ్మెక్కడ..? లాంటి కథలు.., సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా…తక్కువ పరిధిలోనే ఎక్కువ ప్రయోజనాన్ని సాధించిన కథలు.
చిన్న కథల్లో ఎక్కువగా….కొత్తగా రాస్తున్నవారు, యువత వుండడం గమనార్హం. బహుశా కొత్త తరం రాస్తున్న కథల ద్వారా… తాము ఎలాంటి కథలను ఇష్టపడుతున్నారో….చెప్పకనే చెపుతున్నారని అనుకోవచ్చు.

ముఖ్యంగా మేడి చైతన్య, ఎండ్లూరి మానస, ప్రజ్ఞ వడ్లమాని చిన్న కథలు విరివిగా రాస్తూ ఆకట్టుకుంటున్నారు. తెలుగు కథల్లో ఇటీవల తాత్విక చింతన, అంతరంగ అన్వేషణ కథలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏడాది చివరలో వచ్చిన కోడూరి విజయ్ కుమార్-చివరాఖరు ప్రశ్న,  బి.హరిత-అన్వీక్షణ కథలు ఆ కోవకు చెందినవే. మానసిక ప్రపంచంలోని అలజడిని, అంతస్సంఘర్షణను కవితాత్మకంగా చిత్రించిన కథ చివరాఖరు ప్రశ్న. అన్వీక్షణ కథ ఆంగ్ల కథా రచయిత ఎండీ వెయిర్ రాసిన ది ఎగ్ స్ఫూర్తితో రాసిన కథ అని స్పష్టంగానే తెలుస్తోంది.( మూల కథను అనిల్.ఎస్.రాయల్ బ్రహ్మాండం పేరుతో సారంగలోనే అనువదించారు.) ఐనా తొలి కథలోనే రచయిత్రి చూపిన పరిణతి,  చేసిన ప్రయోగం అభినందించేలా చేస్తుంది.

ఇక ప్రాంతీయ అస్తిత్వ వాద కథలు ఒక్కటి కూడా లేకపోవడం లోతుగా తరచి చూడాల్సిన అంశం. ఇతర ప్రాంతాల సంగతి ఎలావున్నా….తెలుగు సాహిత్యంలో  ప్రత్యేక గుర్తింపు కోరుకుంటున్న…తెలంగాణ ప్రాంతీయ ఇతివృత్తంతో ఒక్క కథ కూడా లేకపోవడం గమనార్హం.  అల్లం వంశీ (రెండు పట్టాలు...) కథ,  స్కైబాబా-అన్ మోల్ రిష్తే...కథ కనిపించినా అవీ కూడా పూర్తిస్థాయి ప్రాంతీయ కథలుగా చెప్పుకోలేం. తెలంగాణ జీవితాల్ని కానీ, సమస్యలను కానీ పట్టించిన కథలు కానీ లేకపోవడం… ఈ ప్రాంత రచయితల్లో నెలకొన్న ఒక స్తబ్ధతను (ఆన్ లైన్ పత్రికలకు సంబంధించినంత వరకైనా) తెలియజేస్తుంది.  అసలు కథలు రావడం లేదా..వచ్చినా వెలుగులోకి రావడం లేదా…? అని తరచి చూసుకుని ఆ దిశగా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన బాధ్యత ఆ ప్రాంత సాహితీకారులపై వుందన్నది స్పష్టం.

స్థూలంగా చూస్తే రాసిన కథలు బాగానే వున్నా రాయాల్సిన కథలు ఇంకా చాలా  వున్నాయనిపిస్తుంది.  సమాజంలో అనునిత్యం చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనించకుండానో, నిర్లక్ష్యం చేస్తూనో, లేదా ఉద్దేశ్యపూర్వకంగా విస్మరిస్తూనే రావడం కొంత మింగుడు పడని అంశం. ప్రపంచంలోని ఏ భాషా సాహిత్యం లేదా సాహిత్య ప్రక్రియలో అయినా ఆయా కాలాల్లో వచ్చిన సాహిత్యం ద్వారా ఆనాటి ప్రజల జీవితాల్ని, జీవన విధానాల్ని, సమాజాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించడం సహజం. ఆ రకంగా సాహిత్యం సమకాలీన జీవితాల్ని ఎంతో కొంత తప్పక ప్రతిబింబించాలి.
గత ఏడాది సారంగలో వచ్చిన కథలు సామాజిక కోణంలోంచి చూసినపుడు కొంత నిరాశ కలిగిస్తాయి.  ఇతివృత్తాల ఎంపికలో, కథలను నడిపించిన తీరులో, ముగింపులో ఇలా అడుగడుగునా ఒక కొత్త ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నవారు….సమకాలీన సామాజిక అంశాలను  ఇతివృత్తాలుగా స్వీకరించేందుకు  వెనుకంజవేయడం బాధాకరం.
రచయిత ఏ కథ రాయాలనేది అతని స్వేచ్ఛ. అందులో సందేహం లేదు.  ఆ విషయం పట్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ సామూహికంగా చూసినపుడు ఆ (రచయితలు, సృజనకారుల ) సమాజం మొత్తం దూరంగా ఉండడం వెనక కోణాల్ని, కారణాల్ని మాత్రం తప్పక చర్చించాల్సి ఉంటుంది.  సమాజాన్ని విస్మరించి వచ్చే సాహిత్యం…పెయిన్
కిల్లర్ లాగా తక్షణ సంతృప్తినివ్వవచ్చునేమో కానీ ….దీర్ఘకాలంలో నష్టాన్ని చేస్తుంది. తాత్కాలిక ఆనందాన్నిచ్చే సాహిత్యం….దాని అసలు ప్రయోజనాన్ని, సమాజపు అవసరాల్ని తీర్చలేదు. మొత్తంగా ఇటు వెలుగు, అటు చీకటి అన్నట్లుగా….సారంగ కథలన్నింటిని సింహావలోకనం చేసుకుంటే ఒకింత ఆశ, మరింత నిరాశ కలుగుతుంది. సీనియర్ల స్తబ్ధతను చీల్చుకుంటూ…ఎప్పటికప్పుడు కొత్త కలాలు వెలుగుచూడడం ఆశాభావాన్ని కలిగిస్తుండగా, ఆ రచనల్లో సామాజిక జీవితాన్ని ప్రతిబింబించకపోవడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది.

సాహిత్యం సమకాలీన జీవితంతో ఎంతోకొంత ప్రభావితం కావాలి. అలాగే తానూ సమాజాన్ని ప్రభావితం చేయాలి.

మొదటి వ్యాసంలో చెప్పినట్లు ….చాలా మంది  కాలమే  మనలో మార్పు తీసుకొస్తోందని… భావిస్తుంటాం. వాస్తవానికి మార్పును… కాలం తీసుకురాదు, మనమే మారుతుంటాం. ఈ మార్పు కొత్త సంవత్సరం కథల్లోనైనా కనిపిస్తుందని ఆశిద్దాం.

***

మీ మాటలు

  1. Its a very big task . You have successful ly completed it .

  2. Dr.Pasunoori Ravinder says:

    మంచి విశ్లేషణ. చందుకు అభినందనలు. సారంగకు కృతజ్ఞతలు.

    • చందు తులసి says:

      అన్న…. మీ ప్రోత్సాహానికి థాంక్యూ అన్నా

  3. కె.కె. రామయ్య says:

    చైతన్య పింగళి (“అస్తిత్వాల కొత్తవాయిస్ ” ~ కత్తి మహేష్ ) గారి “తనదే ఆ ఆకాశం! ” ( ఇది నా జీవితం.. ప్రతి రోజూ నేను చేయాల్సిన సాధన ~ ఒంటరి మహిళ లక్ష్మీ ) … చందు తులసి గారి “బుక్కెడు బువ్వ” ( నాకు ఒక్క ముద్ద పెట్టని కొడుకులకి…నాకు దొరికింది నేను తింటుంటే… తినొద్దని చెప్పే అధికారం, హక్కు ఎవడిచ్చాడ్రా….?” బిచ్చగాని ప్రశ్న) …. అల్లం వంశీ గారి “కలలో మనుషులు” ( “మా తాత గురించడుగుతె చెప్తగని, గాంధి తాత గురించి నాకేమెర్క..!!” ఆరో తరగతి చదివే కొడుక్కు అన్నం తినిపించుకుంట అన్న రాజన్న) సంవత్సర కాలం సారంగలో వచ్చిన మరపురాని కధలలో కొన్ని. కధల సమాహారాన్ని సమీక్షించిన చందు తులసి గారికి అభినందనలు.

    “ఆకాశంలో అడ్డు గోడలుండవు” అన్న రామిండ్రి సిన్నయ్యగోరి ( శ్రీమతి దాట్ల లలిత గారి ) “ఈదేసిన గోదావరి” 2013 లో వచ్చినవైనా కలకాలం పదిమందిని అలరించే రచన.

    • చందు తులసి says:

      రామయ్య గారూ….మీ స్పందన కు ధన్యవాదములు. ఇద్దరు మావయ్యల ను….
      బుడ్డగిత్తను మర్చిపోయారు. మీరు చెప్పినవి మంచికథలే. నా సమీక్ష 2015. సారంగ కథలకే పరిమితం.
      మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.

  4. తహిరో says:

    బాగుంది చందు తులసి గారూ. పాము చావకుండా కట్టె విరగ కుండా చాలా గడుసుగా చక్కని విశ్లేషణ చేశారు. సమీక్షకుడికి ఉండాల్సిన లక్షణం కూడా ఇదే – ఒకరిని సంకన ఎత్తుకోవద్దు, మరొకరిని నడిపించ వద్దు. రచయిల మీద మీ వశీకరణ మంత్రం ఉపయోగించి కథల తప్పొప్పులు చెప్పారు. మీ సమీక్ష చదివిన తర్వాత కలాన్ని మూలకు నిలబెట్టిన మాజీ కథకుల్లో కూడా మళ్ళీ కథ రాయాలన్న కోరిక చిగురిస్తుంది. నిజానికి ఏడాది కథలను సమీక్షించడం కత్తిమీది సాము – మీరు ఆ కసరత్తును అవలీలగా చేశారు – అందుకు మనసా శుభాకాంక్షలు మీకు.

    • చందు తులసి says:

      కత్తి సాము చేశాను. గాట్లు ఎవరైనా చేస్తారేమో చూడాలే. మళ్లీ కథ రాయాలనే కోరిక గురించి చెప్పారు.
      గజఈతగాళ్ల లాంటి మాజీ కథకులు …
      మళ్లీ కథలు రాయాలని కోరుకుంటున్నాను. రామయ్య గారి తరపున కూడా కోరుకుంటున్నాను.

  5. మంచి విశ్లేషణ చందూ…!
    కీప్ ఇట్ అప్..!
    మీరు మంచి అప్కమింగ్ రచయిత..
    ఆల్ ది బెస్ట్…
    -భాస్కర్.

    • చందు తులసి says:

      థాంక్యూ భాస్కర్ గారూ..మీ ప్రశంస మరింత బలాన్నిస్తోంది.

  6. Vijaya Karra says:

    సమీక్ష బావుంది చందు గారు ! కథ పట్ల మీ శ్రద్దా, సమీక్షలో మీ సహనం తెలుస్తున్నాయి.

    • చందు తులసి says:

      థాంక్యూ విజయ్ గారూ. మంచి కథలు ఎవరైనా ఇష్టపడతారు కదా. మీ స్పందనకు ధన్యవాదాలు

  7. విశ్లేషణ బాగుంది తులసి గారూ. కొంత తృప్తి, ఎక్కువ అసంతృప్తి మీ విశ్లేషణలో కనిపించింది. మీరు చెప్పింది సరైనదే. ఇప్పటి కథల్లో అనుభూతికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, సామాజిక సమస్యలకు దూరంగా జరుగుతుండటం కొట్టవచ్చినట్లు కనిపిస్తోందన్నది నిజం. మీ విశ్లేషణ ‘సారంగ’కు మాత్రమే పరిమితమైనా, పెద్ద పత్రికల్లో వస్తున్న కథలు కూడా అదే చెబుతున్నాయి. మారిన వాతావరణంలో కొత్త కథకులు వస్తుంటే, వారికి దిశా నిర్దేశం చేయాల్సిన సీనియర్ కథకులు అస్త్ర సన్యాసం చేస్తున్నారు. మీ వ్యాసం చదివాక అయినా వారిలో మార్పు వస్తే బాగుండు.

  8. చందు తులసి says:

    అవును యజ్ఞమూర్తి గారూ. సీనియర్ రచయితలు కొంత కృషి చేయక తప్పదు.

  9. చందు తులసి says:

    విజయ్ కర్రా, యజ్ఞమూర్తి గారూ …గత ఏడాది సారంగ కథలపై వచ్చిన సమీక్షలో ఇది మూడో వ్యాసం. ఆ వ్యాసాలను సారంగ గత సంచికల్లో చూడవచ్చు.

  10. చందు గారు, కధలని బాగా సమీక్షించారు.
    Your love for the craft is contagious..keep it up!

  11. హరిత says:

    చందు గారు,

    >>అన్వీక్షణ కథ ఆంగ్ల కథా రచయిత ఎండీ వెయిర్ రాసిన ది ఎగ్ స్ఫూర్తితో రాసిన కథ అని స్పష్టంగానే తెలుస్తోంది.

    అన్యాయమండీ! నేను నా కథకు పెట్టిన కమెంట్లో, “ది ఎగ్” అనే కథను గుర్తుకు తెస్తోంది అని ఎవరో రాసేంతవరకు ఆ కథను చదవలేదు. అలాంటి కథ ఒకటుందని కూడా నాకు తెలియదు. ఒక కథ తెలుగులో వచ్చింది అంటే తప్పనిసరిగా దానికి ఆంగ్లంలో మాతృక ఉండి తీరాలి అన్నట్లుగా మాట్లాడడం సరి కాదు.

    మీ సమీక్ష బాగుంది!

    –హరిత

    • చందు తులసి says:

      హరిత గారూ… నా వ్యాఖ్య మిమ్మల్ని బాధిస్తే సారీ అండీ…..
      కానీ నేను అలా రాయడానికి కారణాలు….
      మీ కథ రావడానికి….రెండు వారాల ముందుగా అనిల్ రాయల్ గారూ… ది ఎగ్ కథను తెలుగులో అనువదించి సారంగలో అందించారు. దాని మీద చాలా చర్చ జరిగింది…

      మీ కథ కూడా ది ఎగ్…. లాగే సెకండ్ పర్సన్ నేరేషన్. ఇది యాదృచ్చికమైనా….ఆశ్చర్యమే.

      మీ కథ కు అనిల్ గారూ స్పందించారు కదా.
      నేనే కాదు….మరో రచయిత కూడా ది ఎగ్ …గుర్తొచ్చిందని రాశారు కదా..

      కాబట్టి చాలా దగ్గరి పోలికలవల్ల అలా అనుకున్నాను.
      మీరు కూడా వెంటనే ఆ కథ కు సంబంధం లేదని చెప్పాల్సిందండీ. మీరు కూడా స్పందించకపోవడం వల్ల…ఎగ్ స్పూర్తితోనే రాశారనుకున్నాను. సారీ అండీ..

      మీ కొత్త కథ కోసం ఎదురు చూస్తూ…

      • హరిత says:

        చందు గారు,
        బాధించడం అని కాదు కాని మీరు ఆ కథనుండి స్ఫూర్తి పొందిందేమో అనకుండా స్ఫూర్తితో రాసిందని తెలుస్తోంది అని స్టేట్మెంట్ ఇవ్వడం వలనే నేను స్పందించాల్సి వచ్చింది. నా కథకు వచ్చిన కమెంట్లో ఆయనెవరో ‘ద ఎగ్’ కథను గుర్తుకు తెచ్చిందన్నారు కాని ఆయన “మీ కథకు స్ఫూర్తి ఆ కథా?” అని అడగలేదు అందుకనే నేను కలగజేసుకోలేదు. ఆయన కమెంట్ తరువాత నేనా కథను వెతికి చదివాను. అనిల్ గారి అనువాదం నేను చూడలేదు.
        నమస్తే!

  12. మన్నే ఏలియా says:

    మీ సమీక్షలు చదువుతుంటే మల్లోకసారి ఆ కథలు చదవాలనే కోరిక బలంగా కల్గుతుంది . మీ విశ్లేషణ చాల చాల బాగుంది . ఎందరికో బాగా ఉపయోగ పడతాయి . సాహిత్య సేవ లో మీ పాత్ర చాల అవసరం . మన్నె ఏలియా . ఆదిలాబాద్

  13. రాధ మండువ says:

    సమీక్ష బావుంది చందు గారూ..

మీ మాటలు

*