మ‌ళ్ళీ వెళ్ళిపోవ‌డానికైనా మ‌ళ్ళీ రా…

 

లాలస
~
అనంతాంబ‌రం  దిగువున ప్రతి వస్తువూ కవిత్వమే … అనంతాకాశం పైన కూడా అవ‌ధులు లేని ప్ర‌పంచం నిండా కవిత్వమేనని సంబ‌ర‌ప‌డి కవితలు రాసి రాసి దాచుకున్న  రోజుల్లోనే శాస్రవేత్తలు చిన్న ప్లూటో  గ్రహమే కాద‌న్న‌పుడు అలిగి నక్ష‌త్రాల కవితలు ఇక వద్ద‌నుక‌న్నాను. ఆ వార్త విన్న‌పుడు న‌క్ష‌త్రాల‌ను   ప్రేమించిన నువ్వు కూడ  నాలా నిర్ఘాంత పోయి ఉంటావా లేక  చిన్న ప్లూటో క‌న్నా ముందు  చాలా గ్రహాలున్నాయ‌నే మురిసిపోయావో తెలియదు. కానీ వివక్ష‌ల నీలి నీడల నుంచి మళ్ళీ నువ్వొక ఆత్మ‌గౌర‌వ సూచికా సూర్య నక్ష‌త్రంగా ఎక్కడో  వెలుగుతుంటావ‌ని తెలుసు.
చెట్టు నుంచి విరిగిన కొమ్మ  బాధ ఎంత కాలం ఉండ‌గ‌లదులే .  నేను వీడినలోకం ఎంత కాలం పరితాపం ప‌డుతుందిలే అనుకున్నావో తెలియ‌దు కానీ  మొట్ట మొద‌టి సారి ఉట్టి లేఖ పేరుతో  చివరి మరణ మహావచనం ఒకటి నీ హృద‌యం నుంచి కత్తిరించి ఎన్నో హృద‌యాల‌ అంచున  ప‌ర్మినెంట్‌గా పేస్ట్ చేశాని తెలుసు.
నీకు న‌చ్చిన మేఘాలు లేక‌పోయిన నా పైన ఈ వాన .. పాట నీకెంత ఇష్ట‌మో తెలియ‌దు. కానీ దేహ‌మొక గాయ‌మై,  చూపు ప్ర‌శ్న గా మారి గుండె దిగాలైన ఈ లోకం మీది…మీది.. మీది ముమ్మాటికీ మీదే. నాది.. నాలాంటి వాళ్ళ‌ది కాదంటూ నీ ఆత్మ చేసిన గానం మాత్రం యే దునియా అగ‌ర్ మిల్ భి జాయే తో క్యాహై ( ఈ లోకం చేతికందిన‌నేమి) అని మాత్రం తెలుసు.
నీకు ఎప్ప‌టికీ చేర‌ని ఈ ఉత్త‌రం రాస్తుంటే కాఫ్కా ర‌చ‌న‌లోని వాక్యాలు  గుర్తుకువ‌స్తున్నాయి. …నేనెప్ప‌టికీ అర్ధం చేయించ‌లేను. నాలోని అంత‌ర్మ‌ధ‌నం నేనెప్ప‌టికీ అర్ధం చేయించ‌లేను…. ఈ రెండు వ్యాక్యాల త‌రువాతి వ్యాక్య‌మైన నాలో ఏమి జ‌రుగుతుందో నాకే తెలియ‌దు… నీకు వ‌రిస్తుందో లేదో తెలియ‌దు. కానీ నీకు అర్ధం కాన‌ట్లు ఉంటోంద‌ని మేం గ్ర‌హించ‌లేక‌పోవ‌డం మాత్రం ముమ్మాటికీ నేరమేన‌ని తెలుసు.
నీ అభిమాన రచయిత కార్ల్ సాగ‌న్  చెప్పినట్లు.Absence of evidence is not absence of evidence.  ఉత్తరంలో శూన్యం మాత్రమే ఎందుకు చెప్పావో తెలియ‌దు.  నువ్వు
రాయకపోయినా కానీ మన‌సున్న వాడే విరిగిపోతాడ‌ని  జీవితం మీద అనురక్తితోనే విర‌క్తీ క‌లుగుతుంద‌ని, నీ పోరాటంలో విరక్తి . నీ విరక్తిలో శూన్యంలో అనురాగం ఉంద‌నీ తెలుసు.
నీ మనసు పాస్‌వర్డ్‌ ఏదో తెలిసీ తెలిసినట్లుంది. ఈ ఉత్తరం ముగించాల‌ని లేదు.  కానీ  నా చుట్టూ  నడిరాత్రి.. . .  బ‌హుశా ఆ దుర్దినం  నీ మ‌న‌సు క‌మ్మేసిన చిమ్మ చీక‌టిలా..
మరణమే  ప్ర‌గాఢ ప‌రిచ‌య‌మైన నీకు తమ్ముడూ పుట్టిన రోజు ఇంత క‌న్నా ఏం చెప్ప‌గ‌లం
మ‌ళ్ళీ వెళ్ళిపోవ‌డానికైనా మ‌ళ్ళీ రా…
*

మీ మాటలు

 1. Rammohanrao says:

  మనస్పర్షి నివాళి

 2. వాసుదేవ్ says:

  యూఫేమిసం గురించిన పూర్తి అవగాహన తెచ్చుకునే ప్రయత్నమేదీ చెయ్యలేదు. కానీ మీఈ కవిత చదివాక మనసుని మెలిపెట్టే ఎంతటి విషయాన్నైనా ఇంత సున్నితంగా చెప్పొచ్చా అన్న ఆశ్చర్యంలోంచి ఇంకా తేరుకోలేకపోతున్నా. వెరీ క్యూట్. కొన్ని మరణాలు ఇలా చరిత్రలో నిల్చిపోతాయేమో కదా. కొంతమందికి వారి అదృష్టం వారు ఉన్నప్పుటికంటే పోయాకనే తెలిసేది. ఐతే అదితెల్సుకోడానికి వారు లేకపోవటమే ట్రాజెడి. వెరీ వెల్ రిటెన్.

 3. చాలా బాగా రాసారు

 4. ‘మొట్ట మొద‌టి సారి ఉట్టి లేఖ పేరుతో చివరి మరణ మహావచనం ఒకటి నీ హృద‌యం నుంచి కత్తిరించి ఎన్నో హృద‌యాల‌ అంచున ప‌ర్మినెంట్‌గా పేస్ట్ చేశాని తెలుసు.

  మన‌సున్న వాడే విరిగిపోతాడు. జీవితం మీద అనురక్తితోనే విర‌క్తీ క‌లుగుతుంది. నీ పోరాటంలో విరక్తి. నీ విరక్తిలో, శూన్యంలో అనురాగం ఉంద‌నీ తెలుసు.’

  Touching!

 5. బాగుంది మీ చివరి ఉత్తరం.

 6. విలువలతో కూడిన జీవితం ఎప్పటికి ఒంటరిదే . అంతా ఋజుమా ర్గంలో , సరళంగా నిజాయితీగా జరుగుతున్నట్లనిపిస్తూనే హటాతుగా ఒంటరిని చేసేస్తుంది . ఎంతటి వారికైనా నమ్మకద్రోహం, ఒంటరితనం భరింప శక్యం కానివే . . మనసున్న మనిషి నిష్క్రమణం ఎంతో బాధాకరం . కంటిలో నలుసులా బాధిస్తూనే ఉంటుంది. మరింత శక్తి పుంజుకుని ఎగసి పడే ఝున్ఝామరుతంలా మరలా రాకూడదు , అవకాశవాదుల సింహాస్వప్నమై….

 7. సాయి పద్మ says:

  “నీ అభిమాన రచయిత కార్ల్ సాగ‌న్ చెప్పినట్లు.Absence of evidence is not absence of evidence. ఉత్తరంలో శూన్యం మాత్రమే ఎందుకు చెప్పావో తెలియ‌దు. నువ్వు
  రాయకపోయినా కానీ మన‌సున్న వాడే విరిగిపోతాడ‌ని జీవితం మీద అనురక్తితోనే విర‌క్తీ క‌లుగుతుంద‌ని, నీ పోరాటంలో విరక్తి . నీ విరక్తిలో శూన్యంలో అనురాగం ఉంద‌నీ తెలుసు.”
  లాలస వాక్యాలు మనసుని నిజంగా కత్తిరించి అవసరమైన చోట, పేస్ట్ చేస్తాయి..!
  రోహిత్ మరణం ఎంత బాధాకరం.. వొక యువకుడి మరణం.. నడిరాత్రి ముగించని ఉత్తరం ..సగం మరణం.. అంతా శూన్యం..
  ఖాళీ తనం … మనిషిగా బ్రతుకుతున్నామని నమ్మించుకోడానికి కూడా భయపడేతనం..!!
  ఖాళీగా ఉంది లాలసా.. స్నేహితులూ, మిత్రులూ, బంధువులూ, హితులూ, సన్నిహితులూ.. చెరో కొమ్మలు పట్టుకొని రాబందుల్లా వేల్లాడుతుంటే.. ఖాళీ మైదాన స్మశానంలో శాశ్వత నిద్రకి ఉపక్రమిస్తున్నట్లు ఉంది..
  మంచి రైటప్ ..
  –సాయి పద్మ

 8. Srinivas Vuruputuri says:

  “Absence of evidence is not absence of evidence.”

  It might be an irrelevant interjection but I would like to mention that this quotation is incorrect. Carl Sagan said, “Absence of evidence is not evidence of absence”.

  Perhaps, that was what you meant to say. That you are not yet convinced that Rohith is no more…

మీ మాటలు

*