ఫేస్‌బుక్‌ కవుల ఫేసు లెక్కడా?!

స్కై బాబ

~

skyసోషల్‌ మీడియా ఇంటలెక్చువల్స్‌కి, ఆక్టివిస్టులకు, కవులు, రచయితలకు ఒక ఆయుధంగా అందివచ్చింది. అందులోనూ ఫేస్‌బుక్‌ మరింత వెసులుబాటు కల్పించింది. మీడియా ‘మోడియా’గా మారిపోయిన నేపథ్యంలో ఫేస్‌బుక్‌ ఎన్నెన్నో భావ వ్యక్తీకరణలకు వేదికగా మారింది.

ఈ నేపథ్యంలో సాహిత్యానికి అతి కొద్ది స్పేస్‌ కల్పిస్తున్న మీడియా చెంప ఛెళ్లుమనిపిస్తూ ఫేస్‌బుక్‌, మరికొన్ని వెబ్‌ మాగజైన్స్‌ కవులు, రచయితల భావ వ్యక్తీకరణకు చోటు కల్పిస్తూ భావ సంఘర్షణలకు తావునివ్వడం మంచి పరిణామం. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్‌లో కొన్ని గ్రూప్స్‌ కవిత్వానికి పెద్ద పీట వేస్తూ ఎంతో కృషి చేశాయి. అందుకు పూనుకున్న కవులు, సాహిత్యకారులను తప్పక అభినందించాలి. పత్రికల సాహిత్య పేజీల కరుణా కటాక్షాల కోసం మొహం వాచి ఉన్న ఎందరికో ఫేస్‌బుక్‌, అందులోని కవిత్వ గ్రూపులు ఒక మంచి వేదికగా మారాయి. అస్సలు పత్రికలు చూసే తీరిక లేని వారి దగ్గరి నుంచి, తమలో ఒక కవి/కవయిత్రి ఉందని తెలుసుకునే అవకాశమే లేనివారి దగ్గరి నుంచి, హౌజ్‌వైఫ్‌ల దగ్గర నుంచి, సాఫ్ట్‌వేర్‌ రంగంలోని వారి నుంచి, ఎంతో తపన ఉన్న వారి దాకా ఈ వేదిక ఒక పెద్ద క్యాన్వాస్‌ అయ్యింది. దాంతో వందలాది కవులు పుట్టుకొచ్చారు. అందులో ఎందరో అతి తక్కువ కాలంలోనే ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఈ విషయం కూడా అందరూ హర్షించదగిందే.

ఈ సందర్భంలోనే ఒక వైచిత్రి చోటు చేసుకుంది. సాహిత్యమంటే అదేదో సులభమైన వాహికగా, కవిత్వం రాయడమంటే అదో చిన్న విషయంగా చాలామంది భావించడం మొదలయ్యింది. అస్సలు కవితా హృదయం లేనివారు కూడా నాలుగు ముక్కలు, నాలుగు వాక్యాలు పరిస్తే అది కవిత్వమై పోతుందని తమకు పేరొచ్చేస్తుందని భావించే దాకా ఈ వ్యవహారం వెళ్లింది. అవకాశవాదాలు, పేరుకోసం పాకులాటలు మొదలయ్యాయి. ఏ పెయిన్‌ లేనివాళ్లు కవిత్వం రాస్తే ఎలా ఉంటుందో ఇలాంటి వారి పద గారడీ అలా ఉండడం మామూలే. సరే, ఇలాంటివి ఎక్కడైనా ఉంటాయిలే అనుకోవచ్చు. మరోకోణం ఏమిటంటే, ఫ్యామిలీ అంతా సెటిల్‌ అయిపోయింది, ఇక మనం హాయిగా శేషజీవితం గడపొచ్చు అనుకున్నవారు కూడా కవులుగా పేరు తెచ్చుకోడానికి నానా తంటాలు పడడం కవిత్వానికి ఒకింత చేటు చేయడం మొదలయ్యింది. ఎందుకంటే వారి చేతిలో స్మార్ట్‌ఫోన్‌లు స్మార్టెస్ట్‌ కవిత్వం ఒలకపోయడం మొదలుపెట్టాయి.

ఇదిలా ఉంటే, ఒక కవిత రాస్తే, మిత్రులకు చూపెట్టుకొని ఎంతో భావ సంఘర్షణ తర్వాత, చర్చోపచర్చల తరువాత, మార్పులు చేర్పుల తర్వాత దాన్ని అచ్చుకి ఇచ్చే సాహసం చేసేవారు, చేస్తుంటారు గట్టి కవులు. దానికి కవుల కలయికలు, గ్రూపులు, సంఘాలు ఎన్నో, ఎన్నెన్నో..! ఇలాంటి వాతావరణం అసలే లేకుండా పోయింది ఫేస్‌బుక్‌ కవులకు. రాసింది రాసినట్లు పోస్ట్‌ చేసేస్తూ, రోజుకో కవిత, గంటకో కవిత, రెస్పాన్స్‌ వచనం రాసేసి అవే కవితలు అనుకునే స్థాయికి దిగజారడం జరిగిపోయింది. చాలామంది కాసిన్ని కవితలు రాసి మహా ఫోజు కొట్టే స్థాయికి ‘ఎదిగిపోయారు’. ఏండ్లకేండ్లు.. అన్నపానీయాలు మాని, రాత్రులలకు రాత్రులు కాల్చుకొని ఒక్కో కవితను ఒక్కో కార్యంగా భావిస్తూ, ఒక్కో దివిటీగా వెలిగిస్తూ ఎదిగొచ్చిన కవులను, వారి కవిత్వాన్ని ఎద్దేవా చేస్తూ.. ముందు నమస్కారం వెనక వెటకారం చేస్తూ.. ప్రతి విషయాన్ని జోక్‌గా మార్చేసి హిహి.. హెహెల దాకా వెళ్లారు కొందరు!

సరే, వారెవరినీ ఏమీ అనొద్దని, అసలు కవులే పుట్టడం తగ్గిపోయిన కాలంలో కొత్త తరం ఇలా పుట్టుకు రావడం, అందుకు ఫేస్‌బుక్‌ వేదిక కావడం ఎంతో మేలు అని అనుకున్న కవులు ఈ కొత్త తరాన్ని ప్రోత్సహిస్తూ కొందరు, గమనిస్తూ కొందరు ఉండిపోయారు. కొన్ని సందర్భాల్లో ‘ఏంటన్నా! మనం కవులుగా ఎంతగా తపనతో, సంఘర్షణతో కవిత్వం రాశాం.. కవిత్వానికి ఎంతటి ఉన్నత స్థానం ఉంది మన హృదయంలో.. వీళ్ళెంటి, ఇంతగా మిడిసిపడుతున్నారు.. నిలువని కవితలు, నిలువని ఒక్కో పుస్తకం వేసుకొని మహా ఫోజు కొడుతున్నారు???’ అనే ప్రశ్నలూ, ఆశ్చర్యార్ధకాలూ వినబడ్డాయి. ఏది తోస్తే అది రాసేసి కవిత్వమనుకోవడం, కవిత్వాన్ని అవహేళన చేసే శీర్షికలు పెట్టడం, భావ సంఘర్షణగానీ, భావజాల సంఘర్షణగానీ అస్సలు లేకపోవడం మొదలైనవన్నీ తీవ్రమయ్యాయి. ఎన్ని లైకులు, ఎన్ని కామెంట్లు అనే దగ్గర మొదలై, ఎవరైనా సద్విమర్శగా ఏదైనా కామెంట్ చేస్తే దాన్ని వెకిలి చేయడం దాకా వెళ్లింది. పొగడ్తలు తప్ప విమర్శను భరించలేని విపరీత బుద్ధి ఈ ‘కవుల’కు పట్టుకుంది.

ఇక్కడ గ్రహించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఫేస్‌బుక్‌ కవులుగా ఎదిగి వచ్చిన వారిలో బీసీ, ఎస్సీ కులాలకు చెందిన కవులు, కవయిత్రులు ఎక్కువమందే ఉన్నారు. మైనారిటీలు కూడా ఉన్నారు. వీరిలో చాలామంది మొదట్లో తమ జాతుల వెతలను, సంఘర్షణను కవిత్వీకరించారు. కాని ఆ కవితలకు వచ్చిన రెస్పాన్స్‌ కన్నా పువ్వూ ప్రకృతీ ప్రేమ సౌందర్యం లాంటి భావ కవిత్వం రాస్తే వచ్చే రెస్పాన్స్‌ సాధారణంగానే ఫేస్‌బుక్‌లో చాలా ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నెట్ వాడే సౌకర్యం అగ్రవర్ణాల వారికి, ‘సాఫ్ట్‌వేర్‌ కోళ్ల’కే ఎక్కువగా ఉంటుంది. వారిలో 99 శాతంమందికి అణగారిన జాతుల కవిత్వం పట్ల, వారి సామాజిక సమస్యల ఏమాత్రం కన్‌సర్న్‌ ఉండదు, అవగాహన ఉండదు. అది వారికి అవసరం లేని విషయంగా తయారయింది వ్యవస్థ. దీనికి తగ్గట్టుగానే కొందరు కవులు కూడా ‘భావ కవిత్వం’ రాయడానికే మద్దతునిచ్చి ఆ కొత్తతరం ఫేస్‌బుక్‌ కవులకు మార్గదర్శకులుగా మారడంతో వారు భావకవిత్వానికి పరిమితమవడం మొదలయింది. దాంతో వారు వేసుకుంటూ వచ్చిన కవితా సంపుటులకు అలాంటి  పేర్లే పెట్టడం, ఏ అస్తిత్వమూ అంటకుండా జాగ్రత్తలు తీసుకోవడం వేగంగా జరిగిపోయింది. ఎన్నో కవితా సంపుటులు వెలువడ్డాయి. ఆవిష్కరణలు, పార్టీలు, చిన్న చిన్న రివ్యూలు, ఒకరిద్దరి ఇంటర్వ్యూలు జరిగిపోయాయి. వీరు గురుసమానులుగా భావించినవారు ఎంతగా వీరిని ప్రభావితం చేశారంటే అస్తిత్వవాదులు, విప్లవవాదులు, సామాజిక సమస్యల మీద కవిత్వం రాసే ఎవరితోనో వీరికి సాంగత్యమే లేకుండా పోయింది. మొదట్లో ఉన్నా తర్వాత్తరువాత అది అంతరించి పోయింది.

సరే, మరికొంత కాలం గడిచింది.. ఈ మిడిసిపడ్డ కవులంతా ఒక్కొక్కరూ మాయమైపోతూ వస్తున్నారు.. చాలామంది ఫేస్‌బుక్‌లో కనబడ్డమే మానేసారు. ఏ గ్రూపుల నుంచి ఎదిగొచ్చారో వాటి మీదే జోకులెయ్యడం.. వాటికి వ్యతిరేకమవ్వడం కూడా జరిగిపోయింది.. ఫేస్‌బుక్‌లోకి రాట్లేదు అని ‘మేధావు’ల్లాగా అనేదాకా వచ్చింది. మొత్తంగా సామాజిక సమస్యలకు వీరు మొత్తంగానే స్పందించడం మానేసారు. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా లాగా తయారయింది కొందరి పరిస్థితి.

తమ ఇంటి కాడ, కుటుంబంలో, కులంలో, మతంలో, తమ ఊర్లలో, ప్రాంతంలో ఉన్న సమస్యల పట్ల స్పందించే గుణం కోల్పోయి, ముఖ్యంగా ఆ పెయిన్‌ను కోల్పోయి జడపదార్ధాలుగా మారిపోతున్నారు. కంటికి సూటిగా కనిపించే ప్రేమ ప్రకృతి అందం తప్ప ‘కాళ్ల కింది నేల కోతకు గురవుతున్న’ విషయం పట్టని స్థితి ఇది. ఇదే ఇవాళ దేశాన్ని కుదిపేస్తున్న రోహిత్‌ వేముల ‘హత్య’ పట్లగాని, హిందూత్వవాదుల, బ్రాహ్మణీయ ఆధిపత్య శక్తుల దాడుల పట్ల గాని ఆయా కవుల నుంచి స్పందన కరువైన పరిస్థితిని అద్దం పడుతున్నది. పైగా కొందరు ‘కవుల’ మనుకుంటున్నవారు కొత్తగా తమ వెనుకబాటుతనాన్ని బట్టబయలు చేసుకుంటూ తామేదో కొత్త విషయాన్ని కనుగొన్నట్లు పోస్టులు పెట్టే స్థాయికి ఈ పరిస్థితి దారితీసింది. ఈ సందర్భంలోనే ఫేస్‌బుక్‌ ‘యువ’, ‘నవ’ కవులను, ‘పెద్ద’ కవులమైపోయామనుకుంటున్న వారిని ‘గౌతమి మాసుల’ (Gouthami Masula) నిగ్గదీసి అడిగారు.. ఇలా-

 

”కవులెక్కడ ? మరీ ముఖ్యంగా యువకవులు 

ఏ అమ్మాయి పిరుదుల మీద పద్యాల్లో బిజి ఉన్నారో తెలుసుకోవచ్చా ? (vis-A_vis ) 
అత్యాచారం లాంటి కేసులకి వద్దన్నా బక్కెటడు కవిత్వం గుమ్మరించి మొసలి కన్నీరు కార్చే కవులెక్కడ ? 
అమ్మ దినం అయ్యా దినం ఆ దినం ఈ దినం అనగానే ఉరుక్కుంట వచ్చి ఫేస్బుక్ నిండా బరికి పోతారు వద్దురాభై అంటే కూడా అట్లాంటి కవులెక్కడ ? 
హత్య అంటే భయపడ్డారా ? లేక ఆకుకి పోక కి అందని చిదానంద స్వాముల అవతారం ఎత్తారా ?

రోహిత్ హత్యకి ప్రో గానే రాయమని కాదు కనీసం ఒక ఇస్శ్యు జరిగినప్పుడు మనకి ఎదో ఒక అభిప్రాయం లేకుండా అభావంగా బ్రతికేసే దిక్కుమాలిన సేఫ్ ప్లే ఇపుడు కొత్త తరం కూడా నేర్చుకుంది అంటే మాత్రం ఇన్నాళ్ళు వీళ్ళనా అభిమానించి వాళ్ళ వాక్యం కోసం ప్రపంచంతో పోరాడింది అని అసహ్యం వేస్తుంది

రైటో మేమంతా అంటీ సోషల్ ఎలిమేంట్స్ ఒప్పుకుంటున్నా. కానసలు మండిపోతున్న సోషల్ ఎలిమెంట్ మీద కూడా నోరిప్పలేని కలం ఎందుకు 
ఇదంతా మానవతా వాదం మేమసలు కులం మతం లేని సొసైటీ నే చూడాలనుకుంటున్నాం అంటే మాత్రం మీ అంత సమస్య ని వదిలిపోయే పిరికి సన్నాసులు లేరని ఘంటాపథంగా రాసివ్వగలను స్టాంప్ పేపర్ మీద.” (జనవరి 22, సా. 6:53)

అయితే, ఫేస్‌బుక్‌ వల్ల ఇంకా ఎందరో కొత్తవాళ్లు పుట్టుకొస్తున్నారు. వారికి కూడా సరైన దిశానిర్దేశం లేదు. వారి పరిస్థితి కూడా రేపు ఇంతే. అందుకని, కనీసం ఆయా గ్రూపులవాళ్లు, కవిత్వ ప్రేమికులు కొత్తవారితోనైనా కవులనుకునేవారికోసమైనా, కవిత్వం పట్ల తపన ఉన్నవారికోసమైనా కొన్ని అంతర్గత సమావేశాలు, గ్రూప్‌ డిస్కషన్స్‌ పెట్టి భావ సంఘర్షణకు, భావజాలాల సంఘర్షణకు తావు కల్పిస్తే తప్ప కొత్తతరం ఎదిగివచ్చి నిలదొక్కుకునే పరిస్థితి లేదు. అందుకు వారు పూనుకోవాలని, పూనుకున్నవారికి సహకరించాలని మనవి.

*

 

మీ మాటలు

  1. స్కై
    నీ బాధ అక్షరాల నిజం. కొత్త కవిత్వంలో వస్తున్న కొత్త ధోరణులను అర్థం చేసుకోకుండానే రాసేస్తున్నారు అందుకే వాటిలో కళాత్మక విలువలు ఉండడం లేదు.

  2. విజయ్ కోగంటి says:

    అవసరమైన చర్చ. మానవత, కవిత్వమూ కులాతీతమే! నిజమైన కవిత్వపు తీరు తెలుసుకుని హృదయంతో అనుభవించి వ్రాయ గలగడం గ్రహిస్తే చాలు. అభినందనలు.

  3. బ్రెయిన్ డెడ్ says:

    వాక్యాన్ని ప్రేమించినవాళ్ళం నిజానికి వాక్యంతో మళ్ళీ మళ్ళీ ఈ ఊపిరాడనివ్వని ర్యాట్ రేస్లో కాస్త జీవం పోసుకుంటున్నవాళ్ళం నిజానికి ఫేస్బుక్ ద్వారా ఆ కవిత్వం వలన గొప్పరిలీఫ్ జోన్లో పడ్డాం ఆ ప్రాసెస్లో , అయితే మీరు చెప్పిన పాయింట్లన్నీ గమనించాక వచ్చిన ఏవగింపులో అసలు కొత్త తరం లో అయిన వాక్యాన్ని ప్రోత్సాహించాలి అన్న ఐడియా ఉండింది . ఇందులో పెద్ద విషాదం ఏమిటంటే అసలు కొత్త తరం యువతరం కవులు కూడా ఇష్యూస్ టైంలో మొహం దాచేయడం . నిజంగా ఎక్స్పెక్ట్ చేయని విషయం , ఒక షాక్ కూడా .

  4. చాన్నాళ్లక్రితం ఈనాడు పేపర్లో ఒక న్యూస్ గుర్తొచ్చింది.ఎంతో కష్టపడి చదువుకుని జ్నానాన్ని సంపాదించి పెద్ద ఉన్నతోద్యోగం చేస్తున్నవాళ్లు సంపాదించే నెల జీతాన్ని వాళ్ల పిల్లలు జస్ట్ అలా ఇంజనీరింగ్ కంప్లీట్ కాగానే అవలీలగా దాటేస్తున్నారని!
    బహుశా ఇది ఇక్కడ రాయాల్సిన విషయం కాదు కానీ గుర్తొచ్చింది అంతే.
    ఇక మీరు రాసిన విషయానికొస్తే మేగ్జిమం నిజాలే రాశారు.పుట్టగొడుగుల్లా ఫేస్బుక్ లో పుట్టుకొస్తున్న కవుల వల్ల కవిత్వానికి అపచారం జరుగుతుందన్న మాట వాస్తవం.అయితే ప్రతిదాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నట్లు..ఎఫ్.బి లేకపోతే పుస్తకాల ముద్రణ అంతరించిపోతున్న ఈ కాలంలో మీలాంటి గొప్పకవుల గురించి తెలుసుకునే అవకాశం కొత్త తరానికి ఉండకపోయేది.అలాగే అదే సమయంలో కొంతమంది టాలెంటెడ్ ఫెలోస్ కూడా వెలుగులోకివచ్చారు.ఎఫ్.బి లేకపోతే చాలామంది అవుట్ పుట్ నిద్రాణస్థితిలోనే వుండేదేమో !
    (మనకి నచ్చనివి చదవకపోయే/చూడకపోయే- వెసులుబాటు కూడా ఈ మాధ్యమంలో వుంది)

    ఇంతమంది ముహాలు చాటేస్తున్నారని,స్పందించడంలేదని మీరు కాని,గౌతమి మాసుల గారు కానీ అనుకోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది!
    మీరు సరైనదే అనుకున్న విషయాన్ని అందరూ అలాగే అనుకోవాలని ఎక్కడుంది? మీ విషయాన్నే ఉదాహరణ తీసుకుంటే మీరు ఒక వర్గం చేసే అకృత్యాలని ఎప్పుడూ చూసీచూడనట్లుంటారు.కొండొకచో సమర్ధించడానికి మీ అక్షరాలని తెలివిగా వాడుతుంటారు.అదే మరో వర్గం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తుంటారు.అవకాశం దొరికినవెంటనే అక్షరాలతో కన్నీళ్లు కార్చేస్తుంటారు!
    మీరు ఒప్పుకోకపోయినా ఇవి నిజాలే.

    Sent from http://bit.ly/f02wSy

  5. Indus Martin says:

    స్కై సాబ్ , గౌతమి అడిగిన ప్రశ్నను మీరు కేనొనైజ్ చేస్తూ దాగుడుమూతల కవుల్ని నిలదీసిన విధానం బాగుంది. ఒకపక్క అభ్యుదయ కవిత్వం రాస్తున్నామంటూ సరిగ్గా నిలబడాల్సిన సమయానికి నమ్రతల ముసుగుల వెనక నక్కుతున్న ఈతరం నయా మాయా కవులకు ఒక లెంపకాయ అవసరమే !!!

  6. విలాసాగరం రవీందర్ says:

    స్కైబాబా గారు
    మీరు రాసింది అక్షరాల నిజం. సామాజిక బాధ్యత లోపించింది. ఏది రాయాలి అని దిశానిర్ధేశం చేసే వారే కరువయ్యారు… లైకులు కామెంటు ల మాయాజాలం లో పడి పొయ్యారు…

  7. సాయి పద్మ says:

    మంచి వ్యాసం స్కై గారూ
    ఫేస్బుక్ నిజానికి చాలామంది కవులని ఇచ్చింది. కవిత్వపు రైతు బజారు నుండి, శిలాక్షరాలుగా మిగిలే కవిత్వం కూడా రాసారు చాలామంది
    కవిత్వం ఎప్పుడైనా ఫీల్ అయి రాసేదే.. రోహిత్ విషయంలో జరుగుతున్న విపరీతమైన చర్చలు, నిందారోపణ, ఏమి రాసినా అది అగ్రవర్ణ కవిత్వం, నిమ్న వర్గ కవిత్వం అంటూ గీతాలు గీసి, వ్యక్తిగత దూషణకు దిగటం వల్ల కూడా చాలా మంది రాయాల్సిన వాళ్ళు, రాసి పోస్ట్ చేయటానికి భయపడే స్టేజ్ కి వెళ్ళిపోయారు.
    ఈ తిట్లకి గాయపడ్డ మనసులకి ఏం సమాధానం చెప్పగలరు ?
    ఇంకో విషయం, రోహిత్ విషయం పూర్తిస్థాయి రాజకీయం నుండి , దురదృష్టవశాత్తూ దళారీతనంలోకి వెళ్ళిపోయింది
    ఈ దళారీతనం చేసే మనుషులు, దళితుల్లోనూ ఉన్నారు, అగ్రవర్నాల్లోనూ ఉన్నారు, విద్యార్ధి సంఘాలైన ABVP లోనూ ఉన్నారు.
    ఈ ప్రాసెస్ లో, ఎవరు ఎటు వైపు అనే ప్రశ్న వస్తోంది అంటే … రోహిత్ చావు పట్ల అందరూ వొక అభిప్రాయంలో లేమా ? ఇలా అలోచిన్చుకోవటమే ఎంత హైన్యమైన విషయం కదూ ..!
    కరక్ట్ గా అందుకే .. చాలా మంది రాయటం లేదు అని నేను అనుకుంటున్నాను. రాసి, తిట్లు తిని, మరింత గాయపడి, ఆ ఆబ్బాయి కి సరైన అశ్రు నివాళి బదులు.. సొంత గాయాలకి , మందులు రాసుకుంటూ , మూలగలేక..!!
    చాలా మంది నిశ్శబ్దం అందుకే .. ఫేస్బుక్ కవిత్వమే కాదు.. ఫేస్బుక్ తీవ్రవాదం భరించలేక..
    అంతేగానీ .. ఫేసు లేకా కాదు .. ఫేస్ చేయలేకా కాదు ..
    రెంటికీ చాలా తేడా ఉంది .. గమనించండి.
    దీనిపై చర్చ కోరుకోవటం లేదు . మీరందరూ ఎంత తిట్టినా సరే.. స్వచ్చంగా, రోహిత్ కోసం , అతన్ని సంస్థాపరంగా మర్డర్ చేసిన, పరిస్తుతులపై బాధపడని, మనిషి లేడు, కవి కూడా లేడు.
    యువ కవులపై, నాకు చాలా నమ్మకం. సాహిత్యంపై కూడా.. అరుణ్ సాగర్ గారి దీర్ఘ కవితలా ..
    రోహిత్, మరణం .. కుల మరణాలకి, ఆ వొంటరితనం లోంచి మరో ప్రస్థానం లాంటి సాహిత్యం ..వస్తుందని అనుకుంటున్నాను.. వస్తుంది కూడా..! కేవలం నీ జర్క్ రియాక్షన్ మాత్రమే సాహిత్యం కాదు.. ముస్లిం సాహిత్యంలో మీదంటూ వొక మార్క్ సృష్టించుకున్న మీకు .. ఆ విషయం తెలియదు అనుకోను..!
    మీరు, గౌతమి కాకుండా, దళిత, బహుజనవాదం కేవలం బిజినెస్ గా మార్చుకున్న , వేరేవేరైనా అంటే నేను కూడా కనీసం సమాధానం ఇవ్వటానికి తటపటాయించేదాన్ని .. ప్రో గా రాయటానికి కూడా భయపడే కవుల్లా..!
    –సాయి పద్మ
    దీని వెనుక , ఇంకా నాకు తెలియని విషయాలు/రాజకీయాలు ఏమన్నా ఉంటె, క్షమించండి.

    • //దళిత, బహుజనవాదం కేవలం బిజినెస్ గా మార్చుకున్న , వేరేవేరైనా అంటే నేను కూడా కనీసం సమాధానం ఇవ్వటానికి తటపటాయించేదాన్ని//
      చాలా చక్కగా చెప్పారు సాయి పద్మ గారు

  8. I Totally agree with Sai Padma gaari comment sir

    • //దళిత, బహుజనవాదం కేవలం బిజినెస్ గా మార్చుకున్న , వేరేవేరైనా అంటే నేను కూడా కనీసం సమాధానం ఇవ్వటానికి తటపటాయించేదాన్ని //
      చాలా చక్కగా చెప్పారు సాయి పద్మ గారు.

  9. విజయ్ కోగంటి says:

    “…ఇంకో విషయం, రోహిత్ విషయం పూర్తిస్థాయి రాజకీయం నుండి , దురదృష్టవశాత్తూ దళారీతనంలోకి వెళ్ళిపోయింది
    ఈ దళారీతనం చేసే మనుషులు, దళితుల్లోనూ ఉన్నారు, అగ్రవర్నాల్లోనూ ఉన్నారు, విద్యార్ధి సంఘాలైన ABVP లోనూ ఉన్నారు.
    ఈ ప్రాసెస్ లో, ఎవరు ఎటు వైపు అనే ప్రశ్న వస్తోంది అంటే … రోహిత్ చావు పట్ల అందరూ వొక అభిప్రాయంలో లేమా ? ఇలా అలోచిన్చుకోవటమే ఎంత హైన్యమైన విషయం కదూ ..!…”

    చాలా బాగా చెప్పారు పద్మ గారూ. కవులు కూడా దళారీలయే దురదృష్టం పట్టరాదు.

  10. renuka ayola says:

    ఇంకో విషయం, రోహిత్ విషయం పూర్తిస్థాయి రాజకీయం నుండి , దురదృష్టవశాత్తూ దళారీతనంలోకి వెళ్ళిపోయింది
    రోహిత్ చావు పట్ల అందరూ వొక అభిప్రాయంలో లేమా ?
    ఏమి రాసినా అది అగ్రవర్ణ కవిత్వం, నిమ్న వర్గ కవిత్వం అంటూ గీతాలు గీసి, వ్యక్తిగత దూషణకు దిగటం వల్ల కూడా చాలా మంది రాయాల్సిన వాళ్ళు, రాసి పోస్ట్ చేయటానికి భయపడే స్టేజ్ కి వెళ్ళిపోయారు.”

    ఇది ఒక్క సాయి పద్మ అభిప్రయమే కాదు అందరి ఆలోచన ,ఆత్మ హత్య వైపు ఆలోచిస్తే
    కవిత్వం ఒక ఉప్పెన అవుతుంది దాని కోసం మంచి కవిత్వం కోసం ఎదురు చుద్దాము స్కై బాబా గారు …..

  11. Rammohan thummuri says:

    సాయి పద్మ గారితో ఏకీభవిస్తూ మీరిచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం.అన్ని విషయాలపై అందరికీ లోతైన అవగాహన ఉండక పోవచ్చు.అందరూ స్పందించక పోవచ్చు.అంతమాత్రంగా జరిగిన ఘోరం
    గురించి పట్టించుకోనట్లు కాదు. సహానుభూతి లేనట్లు కాదు.

  12. Aranya Krishna says:

    స్కై బాబా గారూ! చాలా మంచి ఆర్టికల్. మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలే. సాయి పద్మ చెప్పిన రీజన్లో కూడా వాస్తవముంది. మీరు చెప్పినదానికి ఆమె రాసినది యాడిశనే కానీ వైరుధ్యం కాదు. రోహిత్ మరణానికి స్పందించిన వారి చైతన్యస్థాయిల్ని బట్టి వారిని అర్ధం చేసుకోవటం కాకుండా వారి కులాల్ని బట్టి అర్ధం చేసుకోవటం జరిగింది.

  13. చందు తులసి says:

    స్కైబాబా సార్. అవసరమైన సమయంలో
    అత్యవసరమైన వ్యాసం. మీఆగ్రహం, ఆవేదన న్యాయం.
    ఒక సమాజం మొత్తమీద ప్రభావం చూపే సంఘటనపై ఆ సమాజంలోని పౌరులు స్పందించకపోవడం దురదృష్టకరం. కానీ
    స్పందింకుండా అడ్డుకునే భయానక వాతావరణం వుండడం ప్రమాదకరం.

  14. telangana reddy says:

    సరి అయిన సమయ0. లో –సరి అయిన తిరు లో చాల చక్కటి వ్యాసం రాశారు స్కై బాబా గారు
    salutes…
    స్పందించడానికి బ య 0.. దేనికి ??ఎందుకు ??
    నిజాలు రాయడం –చెప్పడం తప్పు కాదు చందు తులసి గారు
    —————————————————————
    reddy..

  15. ఎవరు దేనికి స్పందించాలనుకుంటే దానికి స్పందించి రాస్తారు, అదివాళ్ళ ఇంట్రెస్టు, అవసరం, ఫీల్ ని బట్టి ఉంటుంది . ఈ బలవంతాలూ, వెక్కిరింపులూ ఎందుకూ ??

  16. ఈ మధ్య కాలంలో సారంగలో వెలువడ్డ సారం లేని వ్యాసాల్లో ఇదొకటి. ఈ గౌతమి ఎవరు? ఆ ఫేస్‌బుక్ గొడవ ఏమిటి? పూర్వోత్తర సంబంధం చెప్పకుండా ఎక్కడో ఏదో చర్చ జరిగితే దాని మీద స్పందనలా ఓ పత్రికలో వ్యాసం రాయటమేంటి?

    ఫేస్‌బుక్‌లోనైనా ఇంకో బుక్‌లోనైనా ఎవరిష్టమొచ్చింది వారు రాసుకుంటారు. చదివిన వారు చదువుతారు, లేకపోతే లేదు. సత్తా ఉన్న కవులు నిలబడతారు, లేనోళ్ళు ఎన్ని టన్నులు గిలికినా దండగే. వారి గురించి ఆవేశపడిపోనక్కర్లేదు.

    ఇంతకీ – వివక్షకి వ్యతిరేకంగా కవితలు రాస్తున్నానని చెప్పుకునే వ్యక్తి నోటెంట ‘సాఫ్ట్‌వేర్ కోళ్లు’ లాంటి ఎద్దేవా మాటలేంటో! ఆ కోళ్లు మీ పెరట్లో గింజలేమైనా కాజేస్తున్నాయా స్కైబాబా గారు? దీన్నే రకం వివక్ష అనాలి?

  17. K Niranjan says:

    “నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష !”…. విడి విడి కుంపట్ల గుర్తింపు జబ్బు ముదిరితే ఇట్లాగే ఉండదా మరి . ఫేక్ బుక్ ..ఫేక్ లుక్ ….ఫేక్ కవిత్యం ఫేక్ సాహిత్యం ఫేక్ కబుర్లు ఫేడ్ అవుట్ అయి పోయే దశ అతి దగ్గరలోనే ఉందన్న అసలు సంగతి తెలుసు కోక పోతే ఎలా ?

  18. స్కై బాబా గారు, జస్ట్ కొద్ది రోజుల క్రితం Pune లో ఒక దళిత బాలుడిని దొంగ అని అనుమానంతో ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ పోసి కాల్చి చంపేసారు జస్ట్ డౌట్ తో మాత్రమే. ముందుగ కొట్టటం తో మొదలయ్యి, ఆ బాలుడిని, హిందువు అని తెలియగానే దారుణం గా కాల్చివేసారు. ఆ చంపినవారు ముగ్గురు ముస్లిం మతానికి చెందినా వారు. ఆ బాలుడు దళితుడు . కానీ ఈ విషయం యే మీడియా కి పట్టలేదు. పోలిసులు మాములు దర్యాప్తులో ఆ అబ్బాయి మరణ వంగ్ములంతో ఇది బయటపడింది. ఆ తర్వాత అర్రేస్ట్టులు జరిగి పోయాయి. కానీ ఎవరు కూడా ఒక్క కన్నీటి బొట్టు కూడా కర్చలేదు ఆ కుటుంబం తప్ప. ప్రింట్ మీడియాలో లోపలి పెజిలల్లో ఒక మూల వచ్చింది. ఇది రోహిత్ ఇష్యూ అయిన తర్వాతనే జరిగింది. దీనికి ఎవరిని నిందించాలి. ఈ నిర్లిప్త ధోరణికి రాజకీయ పరమావధి కారణం కాదా. ఆ ముగ్గురు అగ్ర వర్ణలవారైతే కూడా ఇట్లాగే ఉండేదా. ఏ ఒక్కరు బాధ్యత కలిగినవారు పరమర్సించ లేదు. ఎందుకంటే ఎవరికీ యే మాత్రమూ లాభము లేదు కదా, రాజకీయ నాయకులకైన , మీడియాకైనా మరియు కవులుకైనా. చావు ఎవరిదైన బాధాకరమే, ఇతరుల చేతిలో చనిపొఇనప్పుదు అన్యాయంగా. నేను రోహిత్ మరణాన్ని సమర్ధించడం లేదు. మీడియా, రాజకీయా నాయకులవిక్రుతత్వాన్ని చెప్తున్నాను.సమాజం అందరు దానిలో భాగమే.

  19. హాయ్ ఫ్రెండ్స్ !
    ఇంత మంది భుజాలు తడుముకోవడం ఆశ్చర్యంగా ఉంది. మనసులోని ఫీల్ వ్యక్తం చేయడానికి అగ్ర కులం అయినా సంశయం అవసరం లేదు. రోహిత్ ‘ హత్య’ మీద మనం ఏం ఫీల్ అవుతున్నామో స్పందిస్తే చాలు. స్పందించకున్నా బలవంతం ఏమీ లేదు. ఫేస్బుక్ మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్లకు, అందులోనూ ‘కవులకు’ ఈ ఆర్టికల్ అర్ధం అవుతుంది. అఫ్కోర్స్, తగలాల్సిన వాళ్లకు తగిలితే చాలు.. పైగా ఈ ఆర్టికల్ ఒక్క రోహిత్ అంశం మీదే రాసింది కాదు.. అది కూడా గమనించకుండానే మాట్లాడేయడం ప్రస్తుతమున్న సున్నిత స్తితిని తెలుపుతోంది…

  20. సారం అంటే ఏంటి అనిల్ !
    సమ్మగా.. అదే, కమ్మగా ఉండడమా? అలాంటి వ్యాసాలు మీకు చాలా చోట్లా కనబడతాయి.. మీకు నచ్చనివన్నీ సారం లేనివై పోతాయా? హహ్హ్హా !
    మీ కామెంట్ లో అసహనమేదో కొట్టిచ్చినట్లు కనబడుతోంది.. కారణమేంటో మీకే తెలియాలి..
    ఇక ‘సాఫ్ట్ వేర్ కోళ్ళు’ అంటే మీకెందుకంత బాధ ?! మీరు సాఫ్ట్ వేరా? సాహిత్యం, సామాజిక సమస్యల గురించి ఏమాత్రం అవగాహన లేకుండానే కూసే కోళ్ళ గురించి అలా అంటుంటారు లెండి, మీరు ఇన్నట్టు లేదు .. అది మిమ్మల్ని ఉద్దేశించి అన్నమాట కాదు.. లీవ్ ఇట్. మొత్తానికి మీ పరిచయం ఇలా కావడం ఇంటరెస్టింగ్ ..!

  21. K Niranjan says:

    ఫాషన్ పెరేడ్ ఫేస్బుక్ కవులను తయారు చేసింది గుర్తింపు జబ్బు….కుల గోత్రాల కుమ్ములాటలు….తోవ ఎక్కడ సోనియా ..అంతా అగమ్యగోచరం … అంతా గాఢాన్ధకారమ్ …తోకలేక్కడ …దళిత పురోహితులేక్కడ …blurred సన్నివేశం ..కరునింపుము దేవా….వీళ్ళు వీల్ చైర్ మేధావులు ..మెదట్లో సాలె గూల్లల్లుకుని పరవశించే ఈజి చైర్ తాత్వికులు ….ఫేస్బుక్ .. కవిసంగమం జాతరలో వీరు కాట గలిసిన కవిగారేమో…మేడలో ఒక ట్యాగ్ తగిలించాలేమో… అవార్డులతో స్కై ని తాకిన్చాలేమో…ఎవరక్కడ …ఎవరక్కడ..

  22. balasudhakarmouli says:

    అవును.. స్పందనాశీలత ముఖ్యం.

  23. krothapalli srinivas prasad says:

    నిజమే ..’మాల్త రిఒత్స్’ మీద కవిత్వం ఒలికించిన వాడు ఒక్కడూ లేడు..’పఠాన్ కోట సంఘటన’ మీద కవిత్వం గెలికిన’భాయి ‘ఒక్కడూ లేదు …పూనా లో దళితుడిని కులం అడిగి మరీ ‘సజీవ దహనం’ చేసిన చోట కవిత్వం వుబికినోడు ఒక్కడూ లేడు ..ఏమి చేద్దాం ?

  24. Srinivas Sathiraju says:

    స్కై బాబా గారి బాధ చోస్తుంటె జాలి వేస్తోంది కొడి కుంపటి లెక పోయిన తెల్లవారుతుఉంది అనె నిజాన్ని గ్రహించి మసలుకొమ్మని ప్రార్ధన.

  25. సాయి పద్మ జీ !
    మీ కామెంట్ లో కొన్ని మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయనిపించింది- ‘విపరీత చర్చలూ’.. ‘దళారీతనంలోకి వెళ్ళిపోవడం’.. ‘జర్క్ రియాక్షన్ మాత్రమే కవిత్వం కాదు’ -లాంటివి.
    చర్చలు ఇకనైనా జరగాల్సిందే. అన్ని కోణాల నుండీ !
    దళారీతనం లోకి??? ఎవరి దళారీతనం??? మీలాంటి వాళ్లకు మాత్రమే అలా అనిపించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ?
    కొన్ని సందర్భాల్లో ఒక కేవల నినాదం కూడా కవిత్వం కన్నా బలంగా వుంటుంది..
    ఇక మీరు అగ్రవర్ణాల వారిని, స్పందనలు కరువైన ‘కవులను’ వెనకేసుకు రావడం విచిత్రం..!
    అలాగే, ఒక బాధితులకు మరో బాధితుల పెయిన్ ఎక్కువ అర్ధమయ్యే అవకాశముంది.. అర్ధం అవ్వాలి కూడా ! ఆ విషయం లో మీరు వెనకబడిపోతున్నారేమో..!

  26. బ్లూ says:

    తెలుగు వాళ్ళు ఏడు కోట్ల మంది అనుకుందాం. ఒక ఐదు కోట్ల మంది అక్షరాస్యులు అనుకుందాం. ఒక రెండు కోట్ల మంది తెలుగు మీడియం అనుకుందాం. అందులో కవితలు చదివే వాళ్ళు ఎంత మంది ఉంటారు? కొన్ని వందల మాత్రమే. సరే, కొన్ని వేల మంది అనుకుందాం. కానీ రాసే వాళ్ళు మాత్రం కేవలం కొన్ని వందల మందే ఉంటారు. వ్యాసకర్తలు, పేపర్/ప్రింట్ మీడియాలో ఉన్నవాళ్ళూ, ఫుల్ టైం రచయితలూ, గృహిణులనూ మినహాయిస్తే మిగిలిన కొద్దిమందికీ కవిత్వం ప్రవ్రుత్తి మాత్రమే. బయట ఉదయం లేస్తే చేయాల్సిన పనులు, నడవాల్సిన మైళ్ళు ఎన్నో ఉంటాయి.
    దూరపు కొండలు నునుపే కావచ్చు. అయితే అందరి జీవితాలూ సుఖంగా ఉన్నాయి. మేము మాత్రమే తపన, వేదన, సంక్షోభం నుండి కవిత్వాన్ని వెలికి తీస్తున్నామనుకునే వాళ్ళు ఒక సారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒక్కొకరి జీవితాల్లో ఒక్కో యుద్ధం ఉంటుంది. ఎవరి యుద్ధం వాళ్లకు కష్టంగానే ఉంటుంది. మీరు రాసినంత ఫ్రీక్వెంట్గా రాయనంత మాత్రాన, మీకు నచ్చినట్టు రాయనంత మాత్రాన జీవితాన్ని ఈదుతున్న వాళ్ళు సాఫ్ట్ వేర్ కోళ్ళు అయిపోయారా? ఎవరి జీవితాల్లో ఏం సంఘర్శణలున్నాయో? వ్యాసకర్త మనసులో ఉన్నది ఈర్శ్యనో, మనస్తాపమో అని సందేహం కలుగుతుంది.
    పనీ పాటా లేకుండా కవిత్వం రాసుకుంటాడు, కొత్తగా రాసే వాళ్ళని ఆడి పోసుకుంటాడు అని ఎవరన్నా అంటే ఎలా ఉంటుంది మీకు? మీ వేదన పనీ పాటా లేకుండా ఉండడం వల్ల వచ్చి ఉండవచ్చు అని అంటే?
    అయినా సీనియర్లు, పెద్దమనిషి స్థాయి తీసుకోవాల్సిన వాళ్ళు రాసిన వాటిపై సూచనలు ఇచ్చి వెన్ను తట్టి ప్రోత్సాహించాలి కానీ, నా లాగా అస్తమానం రాయట్లేదు, నా లాగా రాయట్లేదు అని అసలు రాయని దాని గురించి రాద్ధాంతం చేయడం చిన్నతనంగా లేదూ?
    మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు మీ ఇష్టం. మీ సంస్కారానికే వదిలేస్తున్నా.

  27. True. Please be responsible about the the down trodden people. Its a call from Sky sir to all poets. Thank యు.

  28. True. Please be responsible about the the down trodden people. Its a call from Sky sir to all poets. Thank you.

  29. GANAPATHI.V.R. says:

    ఇవ్వాళ కవులై జ్వలిస్తున్న వాళ్ళలో కొందరు బావిలో కప్పలయితే మిగిలిన చాలామంది చెరువుల్లో కప్పలు. చెరువుల్లో కప్పలు చెరువే ప్రపంచమనుకున్టై. ఇవి మేధావి కప్పలు. బావుల్లో ఉండే కప్పలంటే వీటికి చిన్న చూపు. బావిలో కప్పలు కుల సాహిత్యం రాస్తాయి. మేధావి చెరువు కప్పలు మత సాహిత్యం కారుస్తాయి. చెరువులు, బావులు దాటి బోల్డంత ప్రపంచం ఉందని ఇవి మరిచిపోతాయి పాపం. ప్చ్!!.

  30. పాపం.. కొన్ని బోరు బావి కప్పలు కూడా ఉంటాయి..
    వాటికి తమ ఉనికి ఏమిటో కూడా తెలియదు.. వాటిది అసలు వెలుగే పడని జీవితం..!

  31. GANAPATHI.V.R. says:

    బలేగా గుర్తు చేశారు. మిమ్మల్ని మరిచేపోయా. అవును.

  32. Mamidi Amarendar says:

    తీరుబడి వర్గాలనుంచి వచ్చి సామాజిక బాధ్యత లేకుండా ప్రేమ బామ అంటూ.. ప్రకృతిపై కక్కుర్తి కవితలు రాసే కవులారా.. సామాజిక స్పృహ లేని మీ మౌనం కూడా ఆదిపత్య అహంకారమే..
    ఈ వ్యాసం చేరవలసిన వారికి చేరింది.. కాలవలసిన వారికి కాలింది. స్కైబాబా గారికి జై భింలు.!

  33. తీరుబడి వర్గాలు అన్ని సమాజాలలోనూ ఉన్నాయండీ..ప్రేమ కవిత్వమూ, ప్రక్రుతి కవిత్వమూ రాసేవాళ్ళంతా ఆధిపత్యధోరణి కలవారే అని అంటున్న మీ ధోరణి నాకు అర్ధం కావడం లేదు.. పై కామెంటులో నరేష్ కుమార్ గారు చెప్పిన విషయాలు దాదాపుగా నిజాలే.. వాటి గురించి పెద్దలు స్కై బాబ గారు మాట్లాడితే బాగుంటుంది.. విస్మరిద్దాం అనుకుంటే అన్నీ విస్మరించాలి .. ఈ సెలెక్టివ్ ధోరణులెందుకు…

  34. Mamidi Amarendar says:

    కొత్తతరమైన పాత తరమైన..కవుల గోడమీది పిల్లి రాతలు పసిగడుతూనే ఉన్నరు.. పీడిత ప్రజల పక్షం నిలిచిన కవులనే ఇప్పుడు మనం గుర్తు పెట్టుకుంటున్నం .. భవిష్యత్తులో జరిగేది కూడా అదే.. సామాజిక స్పృహ లేకుండా.. స్పందించే సందర్భంలో మౌనం వహించేవారు ముమ్మాటికి మనువాద కవులే.. వారినే లీజర్ పోయెట్స్ అంటరు..

  35. Aranya Krishna says:

    అనేకమంది తటస్థ వాదులుంటారు సమాజంలో. ఇటివల జరిగిన ఫేస్బుక్ చర్చల్లో బ్రాహ్మణ్యానికి, బ్రాహ్మణులకి తేడా చూడకుండా మాట్లాడితే వాళ్ళన్దరూ తమ మూలాల్లోకి వెళ్ళిపోవటం వాళ్ళ పోస్టుల్లో నేను చూస్తున్నాను. వ్యక్తిలో వుండే ఆ వైరుధ్యాల మధ్య ఘర్షణ జరిగి ప్రగతికాముకంగా ఆలోచించే లోపల మనమే వాళ్ళ మీద కులం కార్పెట్ కప్పేసి “చూసారా? మీరిన్తేనమ్మా” అంటే వచ్చే ప్రయోజనం ఏమిటి? చిన్న విబేదానికి అగ్రవర్ణ, బ్రాహ్మణీయ, హిన్దూత్వ భావజాలమనే రెటారిక్ వినీవినీ ఏం చెప్పాలో తెలియటం లేదు. మన స్పందనలో ప్రజాస్వామికత లోపిస్తే మనం పీఠాధిపతులమే అవుతాం. తటస్థుల సంగతి వదిలేస్తే, ప్రగతిశీల వాదిననుకునేవాడెవడైనా సరే రోహిత్ సందర్భం లో మౌనంగా వుండటం ఆ వ్యక్తీ మేధో మరణం గానే భావించాలి.

  36. subhashini says:

    “బ్లూ” గారి కామెంట్ తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఏమండీ స్కై గారు…”పత్రికల కరుణా కటాక్షాల కోసం కవులు మొహం వాచి” ఉన్నారా? ఫేస్బుక్ మీడియా వేరు..ప్రింట్ మీడియా వేరు. ఇక్కడ ఒక కవిత రాస్తే దానికి తక్షణ స్పందన వస్తది. ఒక కవికి తన స్ట్రాటజీ ఏంటో తెలుసు. పత్రిక కు పంపిస్తే వాళ్లకు నచ్చితే వేస్తారు..లేకుంటే లేదు..దీంట్లో నష్టమేముంది? నిజమైన సత్తా ఉన్న కథ, కవిత్వం అలా నిలిచి ఉంటాయి. ఒక చలం, ఒక కాళోజీ, ఒక గురజాడ,ఒక శ్రీశ్రీ కాలం లో ఈ ఫేస్ బుక్ లు ఉన్నాయా? వాళ్ళ సాహిత్యం ఇప్పటిదాకా ఎలా నిలబడింది? ఫేస్ బుక్ రాతల జీవిత కాలం చాలా చాలా తక్కువ.సరైన సాహిత్యాన్ని గుర్తించే వాళ్ళు ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా పుస్తకాలు వేస్తుంటారు. ఇక డబ్బుండీ , నా కవిత్వం ఎవ్వరూ చదవట్లేదు అనుకున్నోళ్ళు ఎలాగో సొంత కవిత్వాన్ని వేసుకుంటే వాటి స్థానం ఏంటో బుక్ ఫెయిర్ లల్లో , పుస్తకాల షాపుల్లో చూస్తున్నాం. అప్ కమింగ్ కవులు చెట్టు మీద రాస్తే ఏం ..పుట్ట మీద రాస్తే ఏం? చూసి కాసేపు నవ్వుకుంటే పోలా…దానికింత ఆవేదన ఎందుకు? ఇక “కవులు -సామాజిక బాధ్యత”..ఎవరు దేనికి, ఎలా , ఎందుకు స్పందించాలి అని మనం నిర్దేశించడం ఏంటి?అంటే మనకు అన్యాయం అనిపించిన విషయాలు వేరే వాళ్లకు అనిపించకుంటే వాళ్లకు సామాజిక బాధ్యత లేనట్టేనా?”ఆలోచనా లోచన”(నిశి గతం లో అడ్మిన్) అనే గ్రూప్ లో కులం మీద, మతం మీద, ఆడవాళ్ళ మీద భయంకరమైన పదాల దాడి జరిగేది…అప్పుడేమయ్యారు ఈ కవులంతా? అప్పుడు నేనొక కామెంట్ రాస్తే…నా ఇన్బాక్స్ లోకి వచ్చి ప్రేమగా…”సుభాషిణీ …నువ్వొక మంచి కవివి..అలాంటివి రాయొచ్చా ” అని నన్ను హెచ్చరించిన పెద్ద మనిషి ఒకరున్నారు. ఇక “సాఫ్ట్ వేర్ కోళ్ళ” కు సాహిత్యాభిలాష ఉండదని మీరెలా డిసైడ్ చేస్తారు?సదరు సాఫ్ట్ వేర్ కోళ్ళ డబ్బులతో ఇక్కడ పుస్తకాలు అచ్చు వేయించుకున్న వాళ్ళు ఉన్నారు.

  37. బాగా చెప్పారండి సుభాషిణి గారు..
    పై కామెంటుల్లో సాయి పద్మ గారు అన్నట్లు

    “కవిత్వం ఎప్పుడైనా ఫీల్ అయి రాసేదే.. రోహిత్ విషయంలో జరుగుతున్న విపరీతమైన చర్చలు, నిందారోపణ, ఏమి రాసినా అది అగ్రవర్ణ కవిత్వం, నిమ్న వర్గ కవిత్వం అంటూ గీతాలు గీసి, వ్యక్తిగత దూషణకు దిగటం వల్ల కూడా చాలా మంది రాయాల్సిన వాళ్ళు, రాసి పోస్ట్ చేయటానికి భయపడే స్టేజ్ కి వెళ్ళిపోయారు.
    ఈ తిట్లకి గాయపడ్డ మనసులకి ఏం సమాధానం చెప్పగలరు ?
    ఇంకో విషయం, రోహిత్ విషయం పూర్తిస్థాయి రాజకీయం నుండి , దురదృష్టవశాత్తూ దళారీతనంలోకి వెళ్ళిపోయింది
    ఈ దళారీతనం చేసే మనుషులు, దళితుల్లోనూ ఉన్నారు, అగ్రవర్నాల్లోనూ ఉన్నారు, విద్యార్ధి సంఘాలైన ABVP లోనూ ఉన్నారు.
    ఈ ప్రాసెస్ లో, ఎవరు ఎటు వైపు అనే ప్రశ్న వస్తోంది అంటే … రోహిత్ చావు పట్ల అందరూ వొక అభిప్రాయంలో లేమా ? ఇలా అలోచిన్చుకోవటమే ఎంత హైన్యమైన విషయం కదూ ..!”..

  38. రైతు ఆత్మహత్య కన్నా , రోహిత్ ఆత్మహత్య ఎక్కువ కాదు, రైతు ని కూడా ఈ సమాజమే చంపేస్తుంది.

  39. syed sabir hussain says:

    ఆర్ధిక సంస్కరణల తరువాత…మానవ సంభందాలన్నీ మార్కెట్ బంధలయ్యాక …ఎండియా గుండెలు..తడారిన మనసులు…భౌతిక బతుకుల వెంట పరుగెడుతున్న పరిస్థితుల్లో…కవిత్వానికే కాదు మనిషి బతుక్కీ దిద్శా నిర్దేశం లేకుండా పోయింది…సాబిర్ హుస్సేన్

Leave a Reply to Prasuna Cancel reply

*