వంటిల్లు కథ అదే..కొన్ని సవరణలతో…!

 

-అపర్ణ తోట

~

aparnaఉపోద్ఘాతం

రాత్రి తొమ్మిదిన్నర. లాప్ టాప్ ముందు కూర్చుని ఆమె శ్రద్ధగా పని చేసుకొంటోంది. అతను కూడా…అతనికి ఆకలి వేసింది. “ భోంచేద్దామా” అన్నాడతను. ఆమె ఇప్పటికిప్పుడు పని ఆపితే లెక్క తప్పుతుంది. అరగంట నుంచి చేస్తున్నపని మళ్ళీ మొదలు పెట్టాలి. “కాసేపు”. అందామె లాప్టాప్ నుంచి కళ్ళు తిప్పకుండా.. ఇంకో పది నిముషాలు గడిచాయి. “ఎంతసేపూ?”…విసుగు! “వస్తున్నా..” కళ్ళు మరల్చకుండా అందామె. “అయిపోవచ్చింది. ఇంకో ఐదునిముషాలు…”ఆమె లెక్క తేలడం లేదు. అతను చప్పుడు చేస్తూ లేచాడు. డైనింగ్ టేబుల్ మీద కంచం గట్టిగా చప్పుడు చేస్తూ పెట్టాడు(ఒకటే కంచం, ఆమెకు లేదు. నోట్ దిస్ పాయింట్) ఉదాసీనంగా తింటున్నాడు. ఆమె హడావిడిగా లాప్ టాప్ మూసేసి వచ్చింది. “సారీ, ఎంతకీ పని తెమలలేదు.”  “పర్లేదు.” అన్నాడు. బోల్డంత పరవా ఉందందులో…

  “పొద్దుట పూట హడావిడి పడకుండా ఉండాలంటే రాత్రికే అన్నీ సిద్దం చేసుకోవాలి. కూరగాయలు టివి చూస్తూ కట్ చేసుకోవచ్చు. అలానే పిల్లల బూట్లూ, సాక్సులూ, యూనిఫాం రెడీగా ఉంచుకోవచ్చు. పనిని సంబాళించుకోవడం లో ఉంది గృహిణుల నేర్పంతా… “కర్టసి తెలుగు మాగజైన్స్ అండ్ వనితల వంటల షోస్.

భర్తకి టీ, పిల్లలకు పాలు, పిల్లలకు పోషకాహారానికి లోటు చెయ్యకూడదు. డ్రై ఫ్రూట్స్, గుడ్లు. మరి భర్తకూ, తనకూ- కొన్ని స్ప్రౌట్స్, అందరికీ ఫ్రూట్స్, ఒళ్ళు పెరగకుండా ఓట్స్, అత్తగారు మరవన్నీ తినరు. అవసరమైతే ఒక ప్లేట్ ఇడ్లి వెయ్యాలి. మరి చట్ని? ఇంకాస్త పని. రాత్రి అన్నం- పులిహార? ఫ్రైడ్ రైస్? మధ్యాహ్నం ఒక్క పప్పు, కాస్త చారు, ఒక కూరా…పెరుగు? తోడేసానా లేదా? టిఫిన్ బాక్సులు ఏవి? పనమ్మాయి సరిగ్గా తోమిందా? అన్నం సరిపడా చల్లారిందా? లేకపోతే మధ్యాహ్నానికి వాసనొస్తుంది. మళ్ళి భర్త గారికి రోటీలు. పిల్లలు ఫ్రై తప్ప తినరు. ఈయనకి కాస్త తడికూర అయితే తప్ప రోటీ గొంతు దిగదు.

“అన్నయ్యకి కాస్త ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వెయ్యి, బాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది.” ఆడపడుచు సలహా. మగవారి ఆరోగ్య రహస్యాలెప్పుడూ వారి భార్యల దగ్గరే ఉంటాయి. మరి ఆడవారి ఆరోగ్యాలో..

ఆరింటి నుంచీ తొమ్మిదింటి వరకూ ప్రతీరోజు సాగే ట్రపీజ్ షో.

సరే మరి. ఇంత శ్రమ ఎవరి కోసమట? ఇంట్లో అందరికి ఆరోగ్యం బానే ఉందే? ఈ సూపర్ హీరోయిన్ రోల్ ఎవరి కోసం. కన్నాంబా, సావిత్రి మార్కు ఆక్షన్ సమంతా సీజన్లో ఏలా?

దాదాపు ఇరవైయేళ్ళు కావొస్తోంది కుప్పిలి పద్మ “మమత(మాతృక- జనవరి- మార్చ్ 1996) ” వచ్చి! అందులో ఇప్పటి ఆధునిక మహిళని  ఆవిష్కరించారు రచయిత. చదువు, ఇష్టపడే ఉద్యోగం. ఈ రోజుల్లో ఒక అర్బన్ మిడిల్ క్లాసు అమ్మాయికి ఈ రెండూ అంత అసాధ్యమైన విషయాలేమీ కావు.

కాని పెళ్ళి! అందులోనూ వంటిల్లు! ఇంతకూ మించిన కష్టం ఉంటుందా? ఈ కథ లో ఒక జనరేషన్ ముందు నుంచే ఉద్యోగం చేస్తున్న అత్తగారూ, అమ్మా ఉంటారు. అత్తగారికి కోడలి పరిస్ధితి అర్ధమైనా ఎక్కడో కొడుకు వ్యక్తిగత వ్యవహారంగా కల్పించుకోదు. ఇలా వ్యవహరించడం ఆమెకు తెలియని సదుపాయం ఏదైనా ఉందేమో. ఆర్నెల్లు వంటగదికే పరిమితం అయిన అమ్మాయి- భర్తతో ఉండే ఇంటిమేట్ టైమ్స్ లో కూడా ‘రేపటి వంట ఏంటి’ అని ఆలోచిస్తూ ఉంటుంది.

మొదట్లో వంటమనిషి మానేసింది. వంట బాధ్యత కొద్దిరోజులు తీసుకొమ్మని భర్త అంటే…

“నాకు వంట సరిగ్గా రాదే” అంటుంది.

“ఆ దానిదేముంది. రెండు రోజుల్లో అలవాటయిపోతుంది.”

“మీకొచ్చా”

“అబ్బెబ్బే…రాదు”

అదే మగవాళ్ళకైతే జీవితాంతం నేర్చుకున్నారాదు. ఆడవాళ్ళకు నిముషాల్లో వచ్చేస్తుంది.

అంతెందుకు వంట గురించి మాట్లాడే మోడరన్ విమెన్ అంటే అందరికీ తెలియని గౌరవం కలుగుతుంది. చీర కట్టుకోవడం, వంట రావడం- ఇవి రెండూ మన భారతీయ సంప్రదాయానికీ, సంస్కృతికీ సోపానాలు. మరి ఆడవాళ్లందుకే కదా ఉండేది! మగవారు ఎటన్నా పోనీ!

మమత అమ్మా, అన్నయ్య భార్యా మమత బాధని అర్ధం చేసుకుంటారు. నాన్నకూ, అన్నయ్యకూ అదొక విషయం లా కూడా తోచదు. పాపం మమత వంటగది నుంచే కాదు, మాతృత్వభారాన్ని కూడా వదిలించుకోవాలి. రచయిత్రి ఇక్కడ చూపిన తెగువకు వంద సాష్టాంగాలు చెయ్యాలి.

సమస్య చిన్నదే. కాని దాని వెల చాల పెద్దది. ఎంత పెద్దది అంటే ఒక జీవితం లో సగభాగమంత. రోజులో ఐదారు గంటలంత. వంటింటిని భుజాన మోసుకు తిరిగినంత. పాతివ్రత్యమంత. మాతృత్వమంత! ‘అసలు ఆడదానివేనా’, అనే పనికిరాని మాటలకు బాధపడి గిల్ట్ ను జీవితమంతా మోసేటంత. ఇష్టమైన ఉద్యోగాన్ని పక్కకు నెట్టేసేంత. ఒక మంచి నిద్రంత. ఒక చక్కని పుస్తకం చదవలేనంత. మనకిష్టమైన స్నేహితులను పక్కన పెట్టేంత. ఎంతో ఎదురు చూస్తున్న ఒక మీటింగ్ లో మంచి మాటలు వదిలి పరిగెత్తి ఇంటికి వచ్చి పోపు వెయ్యవలసి వచ్చేంత. మహానుభావురాలు మన రచయిత. ఇడ్లి లో కొబ్బరి పచ్చడి గురించి మమత పడే టెన్షన్ అర్ధం చేసుకుంది.

Art: Srujan Raj

ఇంచుమించు అదే వయసున్న భర్త. కానీ క్రికెట్, రాజకీయాలు, సినిమలాకన్నా రేపటి వంట ఏంటి? అనే కబురు బాగా సాగుతుంది.

“ఇవాళ బాంక్ లో విశేషాలేంటి?” అడుగుతుంది మమత. వెర్రిదాన్ని చూసినట్టు చూస్తూ, “ఏమైంది” అంటాడు కిషోర్

“ఏం లేదు, ఊరికే.” దిక్కులు చూస్తూ అంటుంది.

“పకోడీలు బావున్నాయా?”

“ఇంకాస్త కరకరలాడితే బావుండును.”

“దోస బాగొచ్చిందా”

“ఇంకాస్త పల్చగా రాదా?”

“పాయసం బావుందా?”

“తీపి ఎక్కువైంది. నీకు కేరళ వాళ్ళ పాయసం వచ్చా?” సో..వంతావంతకాలు..మా మధ్య ఈ సంభాషణ బాగా జరిగేట్లుంది, అనుకుంటుంది మమత.

ఈ పనితో విసిగి పోయి నేను వంట పని చేయలేను ఉద్యోగానికి వెళ్ళిపోతానని, తెగించి చెప్పన మమత తో, “నీతో చక్కగా పనులు చేయిస్తున్నానని అంతా మెచ్చుకుంటుంటే నువ్వేంటి ఆ ఏడుపు మొహం? ఏదో, పరాయివాళ్ళకి చేసినట్టు..” పితృస్వామిక వ్యవస్తను ఇంకా భుజానేసుకు తిరుగుతున్నామని చెప్పడానికి ధీటైన వాక్యమిది.

ఈ కథలో ఇంకా ఎన్నో విస్తృతంగా చర్చించవలసిన అంశాలున్నాయి. కాని, ప్రస్తుతం వంటిటి గురించి మాత్రమే మాట్లాడదామని ఆగిపోతున్నా. ఇంత మంచి కథను రెండు దశాబ్దాల క్రితమే అందించిన పద్మగారికి అందరమూ రుణపడిపోయాము.

‘ఈ రోజుల్లో వంటేటమ్మా..మా రోజుల్లో ఐతే ఈ ఫ్రిజ్జూ, మిక్సి, కుక్కర్లు లేనే లేవు. అన్ని రోట్లో దంచుకోవడం, కుంపటి మీద వాడుకోవడం. ఈ మాత్రం దానికే ఇంత రాద్ధాంతం చేస్తే ఎలా..’

‘అమ్మమ్మగారూ మీలా రోలూ, రోకళ్ళతో కష్టం పదకుండా ఉద్ధరిద్దమనేగా మేమంతా చదివి ఉద్యోగాలు చేస్తోంది. అయినా సంపాదన లో భాగం ఉన్నప్పుడు వంటగదిలో భాగస్వామ్యం వద్దా?’

అసలు మన ఆడవారి శీలపరీక్ష అంతా వంటగదిలోనే జరుగుతుంది. ఆవిడెవరో బాగా వంట చేసి వడ్డిస్తే చాలు. ఎంతటి క్రూరురాలైనా క్షమించేయచ్చు. పిల్లలను కొట్టినా, భర్త సంపాదన సరిపోవట్లేదని వేపుకుతిన్నా పర్లేదు. వంట చాలా బాగా చేసిపెడుతుంది. పెళ్లిలో క్వాలిఫై కావడానికి పొందవలసిన ప్రైమరీ డిగ్రీ! వంట సరిగ్గా రాని ఆడది కాదని కాదు కాని..ఆమెలో ఫెమినిటి పాలు తక్కువ! స్త్రీత్వ చాయలు తగ్గిపోతాయి..ఎండలో కి వెళితే రంగు తగ్గిపోయినట్లు. వంట రాకపోతే ఆడవారిలో ఆ స్త్రీత్వం దెబ్బతింటుంది—కొంచేమేలే!అయినా…

భర్త మనసులోకి దారి అతని కడుపేను. మరి భార్య మనసులోకి దారి? సారీ, ఈ విషయాలు మనకెవరూ చెప్పరు. అసలు తెలుసుకోవలసిన అవసరమేముంది. మగవాళ్ళ పెర్ఫార్మన్స్ ప్రెషర్ గురించి మనకెందుకు గాని ఆడవారి కిచెన్ పెర్ఫార్మన్స్ ప్రెషర్ ఏంటో తెలుసా మీకు- అందునా అత్తగారి తరఫు చుట్టలవారు వచ్చినప్పుడు?

ఇల్లు బాగా పెట్టుకుంది. వంట బాగా చేస్తుంది. మరి ఆమె వేరే పనులు కూడా చేస్తుంది. మీకు తెలుసా?

“తెలుసులేగానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలి. అయినా ఫెమినిస్టు మాటలు బాగా నేర్చారు ఈ ఆడవాళ్ళు. వాళ్ళకేం తక్కువ. ఇంట్లోనే పనమ్మాయి, బంగారం లాంటి భర్తా..ముద్దులు మూటగట్టే పిల్లలు. ఇంకేంటి?”
“అయ్యయ్యో…ఇంకా ఉన్నాయి. ఆమెకో ఉద్యోగం ఉంది తెలుసా…ఆమె ఆఫీసులో ఎన్నో వ్యవహారాలూ యిట్టే పరిష్కరిస్తుంది. ‘ఆడవారు కబుర్లు చెప్పుకుంటారు గాని పనిచెయ్యరు అనే నానుడి’ ఆమెకు బాగా తెలుసు. అందుకే ఇంకాస్త ఎక్కువ కూడా పనిచేస్తుంది. మగవారిలా టీలకనీ సిగరెట్టుకనీ రెండు మూడుసార్లు బయటికెళ్ళదు. మొన్న సెమినార్ లో ఆమె ప్రెజెంట్ చేసిన పేపరుకి…”

“అవునా, మరిన్ని చేసినామెకి ఇల్లు చక్కపెట్టుకోవడం ఎందుకు రాదంటావు?”

“మరి మీ అబ్బాయికో..? అతనికెందుకు రాదు.”

“అయ్యో, చాలా పని చేస్తాడమ్మ…ఆమె టూర్ల మీద వెళ్ళినప్పుడు, పిల్లలని హోటల్ కు తీసుకెళతాడు. స్కూల్ లో దింపుతాడు. వాళ్ళమ్మ ఫ్రిజ్జిలో వండి పెట్టినది వేడి చేసి తినిపిస్తాడు. కానీ వంట కష్టమమ్మాయ్..మగవాళ్ళు కదా..పాపం చేసుకోలేరు!”

నిజమే చాలా మారారు మగవారు! పాపం.

ఇప్పుడు విమల చెప్పిన వంటింటి తనాన్ని గురించి మాట్లాడుకుందామా?  (‘వంటిల్లు’ కవిత; ఆంధ్రజ్యోతి’ 86)

చిన్నప్పటి జ్ఞాపకాల తరువాత ఆడతనాన్ని ఆపాదించుకునే వయసులో ముఖ్యంగా అందుకోవలసినది- వంటింటితనం!

భయం భయంగా, నిశబ్దంగా, నిరాశగా

మా అమ్మొక ప్రేతం లా తేలుతూ ఉంటుందిక్కడ

అసలు మా అమ్మే నడుస్తున్న వంటిగదిలా ఉంటుంది

నడుస్తున్న వంటగదిలా ఆడవాళ్ళు కనిపించడం మానేసి చాలాకాలమైంది అనవచ్చు. కాని ఆడవాళ్ళు ఒప్పుకోరు. చిన్నప్పుడు వారి అమ్మలు పడిన కష్టాల్లో మనం పడేవి కష్టాలే కావని చెప్పొచ్చునుగాక. వారికీ మనకీ తేడా ఉందని విషయం కూడా గుర్తిస్తే బావుండును. అదేదో మా మాస్టారు మమ్మల్ని కోదండం వేయించేవాడు, మిమ్మల్ని బెత్తంతో మాత్రమే కొడుతున్నారు అని చెప్పినట్లుగా…ఏంటో ఈ సామ్యం!

వంటగది మాత్రమే ఎదురుగా నిలబెట్టి స్త్రీల మెదడును ఎక్కడో ప్రాచీననా కాలాల్లో ఇరికించడానికి తీవ్రప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. తమ మేధస్సు ఆచూకీ తెలీక స్త్రీలు నిజంగానే తెలియని అశాంతికి లోనవుతారు.  అందుకే అంటుంది –విమల

ఒక్కోసారి ఆమె మండుతున్న పొయ్యిలా ఉంటుంది

అప్పుడు బందీ అయినా పులిలా ఆమె

వంటగదిలో అశాంతిగా తిరుగుతూంటుంది

నిస్సహాయతతో గిన్నలు దడాల్నఎత్తేస్తుంది

ఇంటి ముందు నిలబడో, బిందెల దగ్గరో కొట్టుకునే ఆడవాళ్ళని చూసి అందరూ నవ్వుకోవడం లో బోల్డంత ‘జోకు’ ఉండొచ్చుగాక..కాని అంతకన్నా భావప్రకటన స్వేచ్చని ఇవ్వలేని పితృస్వామ్య వ్యవస్ధని ఏమనగలం. సరే, అది ఒక కాలం లో జరిగింది. ఇప్పుడు ఆడవాళ్లకా ప్రారబ్ధం లేదు. ఇంచుమించుగా మధ్యతరగతి ఆడవాళ్ళందరూ  చదువుకున్నవారు. వారిలో కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు. మరి వారి పరిస్ధితేంటి? విమల చెబుతున్నారిలా…

నేనొక మంచి వంటగదిలో పడ్డానన్నారందరూ

గ్యాసు, గ్రైండరూ, సిలిండరూ, టైల్సూ…

అమ్మలా గారెలూ, అరిసెలూ గాక

కేకులూ పుడ్డింగులూ చేస్తున్నాను నేను

గిన్నెల పై పేర్లు మాత్రం నా భర్తవే.

ఈ కవిత 1986 లో రాసింది. సరిగ్గా ముప్ఫైయేళ్ళ క్రితం. నిజంగానే ఇప్పుడేం మార్పు వచ్చింది. ఒక రొటీన్ లా ఎందరు భర్తలు వంటగదిలోకి  వెళ్లి వంటతో తమ రోజును మొదలు పెడతారు? ఒక రోజు ‘చేంజ్’ కోసమో, ఒక ‘స్పెషల్ డిష్’ కోసమో కాక ఒక బాధ్యతగా ఎప్పుడు ఫీల్ అవుతారు? వంటమనిషిని పెట్టుకోవచ్చు. అది ప్రివిలేజేడ్ భార్యకు వచ్చే కన్సొలేషన్ ప్రైజ్ మాత్రమే అని ఒప్పుకుంటారా…

పాపం ఆ అమ్మాయి అంటుంది గదా…

నేనొక అలంకరించిన వంటగదిలా

కీ ఇచ్చిన బొమ్మలా ఇక్కడ తిరుగుతుంటాను

నా వంటిల్లొక యంత్రసాలలా ఉంది

ఈ యంత్రసాల ఆమెను నెమ్మదిగా ఎలా మార్చేసిందంటే….ఆమె ‘మల్లెపూలలోనూ పోపువాసనలే!!’ ఇంతకన్నా భావ దారిద్ర్యం ఇక ఉందా…వంటగది వాసనలు పడకగది వరకూ చేరుతాయి!

కూరగాయలైపోయాయి. బిగ్ బాస్కెట్ వచ్చింది. వంటగది ఇప్పుడు మోడ్యులర్ కిచెన్ అయిపోయింది. జీతం పెరిగాక కొందరు మహా అదృష్టవంతురాళ్ళకు వంటమ్మాయి కూడా దొరకొచ్చు. కానీ బాధ్యత మాత్రం- పూర్తిగా అమ్మదే. అంతేగదా అమ్మ కడుపు చూసి పెడుతుంది. మరి నాన్నేమి చేస్తాడు? నాన్న ఏమి చేసినా, అమ్మ కూడా చేయగలుగుతుంది. కాని నాన్నే పాపం. సొంతఇంటి వంటగదిలో వాలంటరీ వెలివేత తీసుకుంటాడు. అందులో ఉండే సుఖం ముందే తెలిసిన మహానుభావుడు!

శ్రమవిలువను కాల్కులేట్ చేయడంలో ఏమి తక్కువ లేదు. కాని దానికి మారకం ఏంటో తెలియడం లేదు. రోజుకు నాలుగైదు గంటల కూలి. ఆఫీసులో గంట బిల్లింగుకు వెయ్యిరూపాయిలు. మరింటిలో నాలుగు కూరలు. ఆకొన్న కుటుంబం కడుపు నింపిన తృప్తి. ఎంత సంపాదిస్తే వస్తుంది. అయ్యో… వంకల గురించీ, వెక్కిరింపుల గురించీ మాట్లాడకండి మరి.

కాదని ఎవరూ సవాలు చేయకండి. మీకు 103 డిగ్రీల జ్వరమున్న రోజున మీ భర్త తప్పక టీ పెట్టి ఇస్తారు. కొన్నిసార్లు, సూర్యుడు దారి తప్పినప్పుడో, ఆర్నాబ్ గోస్వామి నోరుమూసుకున్నప్పుడో….మీ భర్తని టీ పెట్టమనండి. ఏ కళనో టీ అందిస్తారు. ఆగండి- మరి మీరు టీ పొడి ఎక్కడుందో చెప్పారా..తిట్టుకోకండి. మరి పంచదార అనిపించకుండా పెడితే మీదే కదా తప్పు. పాలు. ఫ్రిజ్ లో ఉన్నాయని చెప్పొచ్చుకదా అంత విసుగెందుకు? కప్పులా.ఎదురుగా ఉన్నాయి కాని మీ ఆయనకీ ఆ టైం కి వంటగదిలో ఊపిరాడక కళ్ళు కనిపించడం మానేశాయి. విసుక్కుని లేస్తున్నారా..వంటగదిలోకి వచ్చి విసురుగా టీ కప్పు లాక్కున్నారా? తప్పుకదూ!

Art: Srujan Raj

Art: Srujan Raj

ఐతే వంటింటి సామ్రాజ్యానికి తాము మహారాణులమని ఇంట్లో ఏదైనా తమ కనుసైగల పైనే నడుస్తుందని భ్రమించే కొందరు ‘సూపర్ మామ్’ లు ఉంటారు. ఇలాంటి ‘కంట్రోల్ ఫ్రీక్ మామ్స్’ తో ఏం చెప్పినా చిక్కే! అన్నింటా తామే అయ్యే అడ్వర్టైస్మెంట్ అమ్మల్లా ఉందామనుకునే ఆడవారంటే జాలిపడాలి. ఆమెకు నడుమునొప్పి వస్తే కానీ ఎవరికీ, ఆఖరుకి  భర్తకు కూడా సాయం చేయాలని తోచదు. అది కూడా మూవ్ కాని విక్స్ కానీ రాసేవరకే. ఆమె బాగుపడగానే  మళ్ళీ ఆమె దారి –రహదారి- అదే వంటిటికి దారి.

మనదేశంలో వంటిల్లంటే వంటపనే కాదు. చాలాసార్లు ఆరోగ్యమూ, వ్యక్తిత్వము కూడా పెట్టుబడవుతాయి. కొన్నిసార్లు ఈ కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ లో ఆడవారు ఘోరమైన లాస్ లో పడతారు. కొన్నిసార్లు ఆరోగ్యం నష్టపోతే ఇంకోన్నిసార్లు వ్యక్తిత్వాన్ని కోల్పోయి. టైం బావుండకపోతే, కొన్నిసార్లు రెండూ తన్నేస్తాయి.

సూపెర్ మామ్ సిండ్రోమ్’- సుప్రభాతం, 20 జూన్, 1996, ఇల్లలకగానే– ఉదయం వారపత్రిక, 4 మే, 1990

సత్యవతిగారి ఈ రెండు కథలూ అదే చెబుతాయి. పైన చెప్పిన పరిస్ధితి ‘సుపర్ మామ్  సిండ్రోమ్’ లో ప్రస్తావిస్తే, ‘ఇల్లలకగానే’ కథలో ఇంటికే జీవితాన్నంతా ధారబోసిన ఆమె తన ఉనికి పూర్తిగా మర్చిపోయేంత ప్రమాదంలో పడుతుంది. కుటుంబం కొరకు సర్వమూ త్యాగం చేసే ఆడవారికి ఈ విషయం అర్ధమవుతుందా? ఆమె పేరే ఆమె వ్యక్తిత్వమైతే …ఆమె ఏది? భర్త పేరు లోనో, పిల్లలపేరులోనో, ఆ చివరింటి ఆవిడగానో ఆమె మిగిలి పోతుంది. పెళ్ళికి ముందు ఆమె చదివిన చదువులు, వాదించిన ఉపన్యాసాలూ, స్నేహితులూ…వీరంతా ఏరి. ఫన్ని విషయం ఏంటంటే- ఇల్లలికే ఈగ మాత్రమే తన పేరు మరచిపోతోంది అన్నారప్పుడు. ఇప్పుడు ఇల్లూ, ఉద్యోగమూ చక్కబెట్టే ఈగనేమనాలి? ఈగలనెప్పుడూ ఉద్యోగాలతో కొలవరు. కొలిచినా మన కుటుంబవ్యవస్ధలో దానికే గుర్తింపూ ఉండదు. ఆడవారి ఔన్నత్యాన్ని కొలవడానికి మొదటి మూడు స్థానాల్లో- కన్యత్వమూ, పాతివ్రత్యమూ, మాతృత్వమూ ఉంటాయి. కల్పనా చావ్లా, కిరణ్ బేడి, సునీత విలియమ్స్  ఇలాంటి వారింట్లో వారిని ఏమన్నారో తెలుసుకోవాలని మహా ఉబలాటంగా ఉంటుందెప్పుడూ…

చాలా చదువులు చదివాం కాని ఈ వంటింటి గోల మాత్రం తప్పట్లేదు. వంట మనుషులని పెట్టుకున్నంత మాత్రాన ఆడవారు వంటిల్లు తప్పించుకున్నరనుకోకూడదు. వంటింటి చాకిరీ నుంచి తెరపి ఉండొచ్చు కాని, నైతికంగా…అవును నైతికంగానే, వంటిల్లు, ఇంట్లో అందరికీ తిండి ఏర్పాటు చేసే బాధ్యత భార్యదే. చేయని భార్యలు లేరా అని అడగకండి. ఉన్నారు. వారిని గురించి ఎలా మాట్లాడతారో, వారికి అందే గౌరవం ఏంటో మనందరికీ తెలుసు. చాల చాలా తక్కువ సందర్భాలలో- భార్య ఉన్నతోద్యోగం చేస్తూ, వంటింటికీ ఆమెకే బాధ్యత లేదనుకునే కొన్ని ఉద్యోగాలలో ఉన్నప్పుడు మాత్రమే ఆమెకు ఈ నైతిక శీలపరీక్ష నుంచి విడుదల. లేకపోతే ఈ పరీక్షకు ఏ పూటకు ఆ పూట సిద్ధపడుతూ ఉండవలసిందే.

సామాన్య కథ “ కల్పన” లో ఇదే చర్చకు వస్తుంది. “ ఎంత పెద్ద చదువులు చదివినా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా, ఎంత టీం లీడర్ గా ఎదిగినా ఎక్కడుందీ లోపం ఒక చిన్న కుటుంబ వ్యవస్ధ ను మేనేజ్ చేయలేకపోతున్నాం. “ అని. నిజమే. ఈ మాట అంటే నాతో ఒక పెద్దావిడ అన్నది. “ఇప్పటి పిల్లలలకి తెలివి ఉండడం లేదు. భర్తను, అత్తగారింటి వారిని ఎలా తనవైపుకు తిప్పుకోవాలో తెలీదు.” బహుశా నిజమేనేమో..ప్రేమకన్నా లౌక్యం తోనే పెళ్ళిళ్ళు నిలబడతాయనిపిస్తుంది. మరి మన చదువుల్లో వంటింటి బాధ్యతా మరియు లౌక్యం అనే అంశాన్ని కూడా చేరిస్తే బావుండు.

మరిప్పటి పిల్లలకో? చైతన్య, నారాయణ, ఐఐటి, బిట్స్ పిలాని వీటిని దాటాక ప్రొఫెషనల్ కోర్సులు- తర్వాత ఉద్యోగమూ…తర్వాత పెళ్ళి. సరిసరి. ఇప్పుడుగదా మళ్ళీ వంటింటి గురించి మాట్లాడవలసింది. సామాన్య ‘కల్పన’ కథలో కల్పన చెబుతుంది. “ ఎంతెంత పెద్ద కార్పరేట్ ఆఫీసుల్లో, యునివర్సిటీల్లో పనిచేస్తున్నాం ఇప్పటి ఆడపిల్లలం. ఎంతమంది కస్టమర్స్ ని హాండిల్ చేస్తున్నాం. విదేశాలకు కూడా ఒంటరిగా వెళ్ళి వచ్చేస్తాం. టీం ని లీడ్ చేసేస్తాం. కాని కుటుంబం విషయం వచ్చేసరికి ఎక్కడో తప్పు జరిగిపోతుంది. మన తెలివంతా ఎక్కడికి పోతుంది అనిపిస్తుంది. మన జనేరేషన్ ఆడపిల్లలం చదువు నుండి నేరుగా ఉద్యోగాల్లోకి, పెళ్ళిలోకీ వచ్చేస్తున్నాం కదా. తినడం తప్ప వంట నేర్చుకునే తీరిక కుడా ఉందని షెడ్యూల్స్ కదా మనవి.“  మరి తనను ఒకేసారి వంటగదికి పంపి అత్తగారు. తమాషా చూద్దామనుకుని బయటకు వచ్చేసారు. “ పాపం కల్పన చింతపండు వెయ్యని సాంబారు చేసిననదుకు పెద్ద రాద్ధాంతం చేసారు. అదేదో ప్రపంచ యుద్ధమైనట్టు.  ‘మమత’ కథలానే ‘కల్పన’ అత కూడా విస్తృతి ఎక్కువ. ప్రస్తుత చర్చ కోసం ఈ భాగాన్ని మాత్రమే ప్రస్తావించాను. కాని కథా మూలాలలోకి వెళితే ఎన్నో విషయాలు అర్ధమవుతాయి.

కామన్ గా వినే మాటేంటంటే…’మీరు వంట నేర్చుకోకపోతే మమ్మల్నంటారు.’ అమ్మ వైపు వాళ్ళంతా పెళ్ళికి ముందనే మాటలివి. ఎందుకంటారు? అబ్బాయి పుట్టింటివారిని ఎప్పుడైనా  అతని అత్తగారంటారా? మీరు మీ అబ్బాయికి వంటనేర్పలేదేమని?

అత్త- కోడలు మధ్య దెబ్బలాటలలో పెద్ద అంశం- వంటిల్లు ఎవరిదీ? అనీ. కోడలుకు పూర్తిగా బాధ్యత లేకపోతే అత్తకు ఇష్టం ఉండదు. అలా అని పూర్తి బాధ్యతా కోడలి మీద వేయలేదు. ఈ వంటింటి పవర్ డైనమిక్స్ చూస్తే దుఖ్ఖం వస్తుంది. కాని మన కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పది. ఇలాంటి ఆడవారి మధ్య ఇటువంటి చిల్లర గొడవల సృష్టించడం వలనే వలనే మన వ్యవస్థను కాపాడుకుంటున్నాము. ఈ గొడవలో వంటింటికి ఎవరు రాజీనామా చేసిన రాజకీయ కారణాలు వెతికినా అది సమాజానికి పెద్ద ముప్పే. ఎందుకంటే, పెళ్ళికాని మగవారికి కుటుంబమంటే ఒక వంటిల్లు కలిసిరావడం. ఆడవారికి కుటుంబమంటే వంటచేయడం. పిల్లలు పుట్టాక అడిషనల్ మార్పులు రావచ్చుగాని నిజం ఇదే. మారా వంటింటి వ్యవస్ధకే ఉసురు తగిలితే..అమ్మో, కాపురాలు కూలిపోతాయి.

శుభమా అని ఇంటిలో అందరి యోగక్షేమాలూ పట్టించుకునే దేవత లాంటి ఆడవారి హృదయాన్ని ఇలా విషపూరితం చేసే ధోరణిలో రాసే నాకు నిష్కృతి లేదు. తెలుసు. కానీ, ఈ వంటింటి పాతివ్రత్యాన్ని వదిలించుకోని ఆడవారికి ఎలా చెప్పాలి? కొత్తగా పెళ్లైన కోడలు అత్తగారింట్లో అందరి మనసుని అలరించడానికి ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకూ…పుట్టింటి నుంచి తెచ్చిన జెమినీ టీ వాడుతూనే ఉంటారు. కాలం మారింది కదా మరి వంటింటి విషయమో? ష్..ఇన్ని విషయాలు మనం మాట్లాడకూడదు.

ఉపసంహారం:

“అరే, భలే ఇంత కాలానికి కలిసామే! రా టీ తాగుదాం.”

“ఓయ్, మీటింగ్ కి వచ్చావా…టీ నా, లేదురా పనుంది.”

“ఆడవారి హక్కుల గురించి భలే మాట్లాడావే. నువ్వెప్పుడు మాట్లాడినా చాలా నేర్చుకున్నానో  అనిపిస్తుంది.”

“హక్కులే కాదు, వారి సెక్సువాలిటి లిమిటేషన్స్ నుంచి బయట పడవలసిన అవసరం ఎంతో ఉంది. అసలు “ సెకండ్ సెక్స్” అనే పుస్తకం చదివావా నువ్వు? చదివితే మతిపోతుంది.”

“నీ నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. నీలా అందరు మగవాళ్ళూ ఆలోచిస్తే ఎంత బావుంటుంది. ఇంటికి రా మాట్లాడుకుందాం.”

“ఆ..నీకే పిలుస్తావు. అసలు ఇన్నిసార్లు కలిసాం కదా. ఎన్నో ఏళ్లుగా పెళ్లాం పిల్లలు లేనివాన్ని. ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టవేమి.”

 

 

 *

 

 

 

 

 

మీ మాటలు

  1. భలే రాసారు . చక్కని వచనం, అందులోని విషయం సద్విమర్శాయుతంగా ఉంది . మంచి కథల్నీ , కవితలనీ కూడా ఎంతో బాగా విశ్లేషించారు.
    వంట చెయ్యడమంటే పెద్దగా ఆసక్తి లేదన్న నిజాన్ని నిజాయితీగా చెప్పి చూడండి. ఒక కఠిన నేరస్తురాలని చూసినప్పటి దిగ్భ్రమతో పాలిపోయిన ఎదుటివారి ప్రతిబింబం మీ కనుపాపల్లో మెరవకపోతే అడగండి .

  2. చాలా బాగుంది. ఎన్నుకొన్న కధలు, రాసిన పద్దతి. … అన్నీ. షహీదా కూడా ఇంటి పని మీద ఒక మంచి కధ రాసింది. ‘ఇందుగలదందులేదని’ జాజి పూల పరిమళం పుస్తకంలో…

  3. మన కధ మనమే చదువుకుని నవ్వుకున్నంత హాయిగా ..మన వంట మనమే లొట్టలు వేస్తూ తింటున్నత కమ్మగా.. ఉంది.
    ఒక్కరోజు వంట చేయకపోతే ..గిల్టీగా ఫీల్ అయ్యే ” దేవతల్లో” నేనూ ఒకదాన్నే.:-)

  4. మాతృకలో వచ్చిన కధ పేరు ‘థాంక్యూ’ . ‘మమత’ కాదు

  5. మంజరి లక్ష్మి says:

    బాగుంది. బాగా చెప్పారు.

  6. అందరి జీవితాలూ అలాగే లేవు ఇప్పుడు.వంట అనేది లైఫ్ స్కిల్, స్విమ్మింగ్ లాగ.జెండర్ తో పని లేకుండా అందరూ నేర్చుకోవలిసిన చతుశ్శష్టి కళలలో ఒకటి.మొగుడు మంచోడైతే ఇవ్వన్నీ చిన్న విషయాలు.సరైన మొగుళ్ళ నీ , పెళ్లాలనీ తయారు చేసే విద్యా వ్యవస్థ మనకి లేదు.
    However , ఈ కధనం చాలా మందికి వర్తిస్తుంది అనుకుంటా.చదువు కోవడానికి చాలా సరదాగా వుంది.ఇది అలాంటి అత్తలూ , భర్తలూ చదివితే బాగుణ్ను, అనుకుంటా. కానీ చదివే మంచి అలవాటు వున్నవాళ్ళు అలా ఎందుకు ఉంటార్లే !

    • suvarchala chintalacheruvu says:

      చాలా బాగా సరీగ్గా భలే చెప్పారు రాధిక గారూ!

  7. చైతన్య says:

    రోహిత్ గురించి మనసు మరల్చుకోటానికి బలవంతంగా చదవటం మొదలుపెట్ట కానీ.. పరుగులు పెట్టించింది మనసుని. పెళ్ళే అంత! పుట్టింటి నుండి టి.సి, వంట గదిలో కాండక్ట్ సర్టిఫికట్ ఇస్తారు,మనం అదక్కపోయినా. వంట గది పోలిటిక్స్ ని బాగా రాశవ్..

  8. రాధ మండువ says:

    బావుంది. అయితే ఇది చాలా చిన్న సమస్య. చదువుకున్నవాళ్ళం ఈజీగా పరిష్కరించుకోగలిగిన సమస్య. :)

  9. Vijaya Karra says:

    బావుంది అపర్ణ ! :-)

  10. గోర్ల says:

    మీరు రాసిన తీరు బాగుంది. కాలం మారుతోంది…. భార్యా భర్తలు ఇద్దరూ కల్సి నెలలో ఎక్కువ రోజులు బయటే తింటున్నారు. ఆసుపత్రి పాలవుతున్నారు.

  11. sreelatha says:

    మంచి విశ్లేషణ. బాగా రాసారు

  12. అమ్మలా గారెలూ, అరిసెలూ గాక

    కేకులూ పుడ్డింగులూ చేస్తున్నాను నేను

    గిన్నెల పై పేర్లు మాత్రం నా భర్తవే.

    మమ్మీ వంట నువ్వు చేస్తావు కదా మరి గిన్నెలన్నింటిమీద డాడీ పేరెందుకు. కిచెన్ లోకే రాడు కదా అని పదేళ్ల నా కొడుకు అన్నప్పటినుండి నేను కొత్త వంటింటి వస్తువులు కొన్నప్పుడు నా పేరే రాయిస్తున్నా..

    పి.సత్యవతిగారి ఇల్లలుకగానే కథలోని హీరోయిన్ కధ నా కథ ఒకటే.. సేమ్ టు సేమ్..

    ఐనా అపర్ణ ఎన్ని మాట్లాడి, చర్చించి, గొడవపడి, రాద్ధాంతం చేసినా ఏమీ మారదు. ఎవరూ మారరు. ఇంకేమన్నా అంటే మగవాళ్లు కూడా ఇంటిపని చేస్తున్నారు అని గొడవకు వస్తారు. తప్పనిసరై ఒకటి రెంఢు పనులు వాళ్లకు చాలా గొప్ప కాని ఆడవాళ్లు చేసే ఎన్నో పనులు తను చేయాల్సింది. తప్పినా తప్పకున్నా చేయక తప్పదు. అంతే..

  13. Sharada Sivapurapu says:

    లేటుగా లేచిన రోజు గబా గబా వంట చేసినట్టు, ఆత్రంగా చదివించింది నీ #ఎనాలిసిస్# సూపర్బ్ ఎ రకంగా చూసినా ఆడవాళ్ళదె వంటింటి బాధ్యతా. వచ్చే జన్మంటూ ఉంటె మగాడిగా పుడితే బాగుంటుందని ఆశ, హొప్ఫుల్లీ అప్పటికి పరిస్తితి తారుమారవకపోతే చాలు.

  14. రోజువారీ rationalization కి అద్దంలా ఉంది మీ విశ్లేషణ. మా ఆయన పెట్టిచ్చిన టీ తో రోజు మొదలు పెట్టే నేను, పిల్లల లంచ్ డబ్బా మాత్రం నా చేతి వంట కాకపోతే అల్లాడిపోతాను.. యేదో కల కరిగిపోతున్నట్టు. ఆ సమయంలో నేను వాళ్ళని చదివించ వచ్చు, లేదా ఇంకేదయినా విధంగా ఎంగేజ్ చేయవచ్చు. కాని తిండి చాల బేసిక్ కదా అన్న తర్కం నా చేత వంట చేయిస్తుంది. యేదో చిన్ని ఆశ. ప్రతి భోజనంలోనూ అమ్మ తలపు ఉండాలని.
    ఇంద్రా నూయి ఒక ఇంటర్వ్యూ లో చెప్పారూ: “No, Women Can’t Have It All ” అని (నాట్ exactly ఇన్ ది context అఫ్ కుకింగ్, థో). http://mashable.com/2014/07/02/pepsico-indra-nooyi-women-have-it-all/#AArSYly6LEqF

    2-3 లక్షల employees కి మార్గదర్శి, ఇలా చెప్పారంటే, కథ continues :-)

  15. Vibhavari says:

    Chala బాగా చెప్పారు

  16. చాలా చక్కగా విశ్లేషించారు అపర్ణ తోట. ఈ విశ్లేషణ ఆ తర్వాత పాటకుల స్పందన చూశాను. స్పందించిన వారంతా దాదాపుగా మహిళలే. ఎందుకని ఇలా..? వంటిల్లు తమది అనోలేక వంటింటి సమస్యలు తమవి అనుకొవదమా.. వంటిన్టితో
    తమకి సంబంధం లేదు అది మహిళల వ్యవహారం అని పురుషులు భావించదమా .. కారణం ఏమి ఉంటుంది అంటారు ..?

  17. Jayashree Naidu says:

    అల్ రోడ్స్ లీడ్ తో రోమ్క్ష్ వ్యవహారం లాగా… ప్రొద్దున్నే లేవగానే కప్పుడు టీ నుంచీ రాత్రి డిన్నర్ వ్యవహారం వరకూ…. వంట గది అన్నదీ తెలియకుండా ఇరుక్కుపోయిన, తెలిసీ వదల లేకపోతున్న వ్యవహారం.

  18. G B Sastry says:

    పోలీసు దేబ్బలంతా బాగా తగిలేట్టు వాళ్ళదెబ్బలలాగానే పైకి కనబడనట్టు నర్మగర్భమైన ధోరణిలో కొరడాదెబ్బలా చెప్పారు
    మారుతున్న కొన్ని మంచి ధోరణులు ఈవిషయాల్లో మారనీకుండ ఉన్న ఒకవిషయం మీరు గుర్తించాలి. అల్లుడు కూతురికి పనిలో సాయంచేస్తే అతను మంచి అల్లుడు అదే కొడుకు కోడలికి సాయంచేస్తే వాడు చవట అన్న భావదాశ్యమ్ నుండి కొత్తగా అత్తలుగా ప్రమోటైన ఆడవారు గుర్తించాలి అప్పుడు డివిజన్ ఆఫ్ లేబర్ చక్కగా అమలులోకి ఇంకొంచెం తొందరగా రావచ్చు ఎక్కువ మంది మిస్టర్ పెళ్ళాలు కావచ్చు

Leave a Reply to రాధ మండువ Cancel reply

*