జిహ్వ

 

-అల్లం కృష్ణ చైతన్య

~

    Krishna Chaitanya Allam      “ఒక సారి తిని చూడ్రా, బాగుంటది” అడిగిండు రాజు.

“అద్దు రా, నేను తిండి విషయంలో చాలా పెకీ. చూడ చక్కని ప్రేసెంటేశన్, మంచి టెక్స్చర్, సొంపైన వాసన ఉంటె కానీ నాలుక దాకా పోదురా ఏ తిండైనా” పోజు కొట్టిండు కార్తీక్.

“నీ ఇష్టం. నీ కడుపే మాడేది నాకెందుకు”

“రేయ్, నాలుక మనకున్న అవయవాల్ల గొప్పది రా. ఏది పడితే అది తిని దాని విలువని తగ్గించలెం గదా?”

“కడుపు కాల్తే నాలుకేంది, దానమ్మకు కూడా విలువుండది.”

“అది వేర్రా. ఆ రుచి ఆకలి నుండి వస్తది. ఇప్పుడు లేదు కదా ఆకలి”

“సరే నీ ఇష్టం. మాడు. ఎవడెం చేస్తడు నీలాంటోల్లతోని. నీది కూడా నేనే తింటున్న”

“పండగ చేస్కో”

“నువ్ పోయి ఈ పళ్ళెం కడుక్కో” కార్తీక్ ప్లేట్ల ఉన్న నీళ్ళ పప్పు, అన్నం తన ప్లేట్ ల ఎస్కుని ఖాళి పళ్ళెం వెనకకు ఇచ్చిండు రాజు.

“సరే కడుగుదాంతీ గనీ, ఈ జైళ్ల వంట మనిషి ఉద్యోగం చేయాలంటే ఎం చేయాల్రా?”

“జైలర్ని అడగాలే” తినుకుంటనే చెప్పిండు రాజు.

ఆలోచనల పడ్డడు కార్తీక్.

***

“కొన్ని దేశాల్ల నీసు లేకుంటే ఆల్లకు ముద్దే దిగదట తెల్సా? అక్కడ జైళ్ళల్ల కూడా నీసు పెడతారంటవారా?” రాజుని అడిగిండు కార్తీక్ పక్క సెల్ ల నుండి.

“ఎవడు పోయి చూసిండ్రా. ఎక్కడి జైలు ఐతేంది? జైలు జైలే. తిండి తిండే. నేరం చేసినోనికి కూసోవెట్టి మేపుతరా ఏంది?” తనకు తెల్సిన విజ్ఞానాన్ని పంచిండు రాజు.

“నిజమేరా. కనీ ఒక్కో సారి బయట దేశాల జైల్లన్నీ తిరిగి అక్కడ తిండి ఎట్లా పెడతారో సూడాలే అనిపిస్తది రా.” కార్తీక్ గోడకు తల ఆనించి సీలింగ్ మీదకు చూస్తా ఆలోచనల పడ్డడు.

“ప్రపంచం మా గమ్మత్ ఉంటదిరా. కొట్లాటలు, కత్తులు, తుపాకులు, విద్వేషాలు, ద్వేషాల మధ్యన నీలాంటోని కలల పరిధులు కూడా జైలుని దాటక పోవుడు ఆశ్చర్యం అనిపిస్తలేదు. కానీ స్వేచ్చని మించిన అనుభూతిని తిండిల వెతుక్కుంటున్నవంటే మొక్కాల్రా బాబు నీకు.” రాజుకు కార్తీక్ మీద జాలి పడాల్నో లేదో కూడా అర్ధం అయితలేదు.

“ఏమోరా, నా ధ్యాస ఎప్పుడూ, రుచి మీదనే ఉంటది. ఊచలు, గోడలు, పల్లాలు అన్ని రుచి చూసిన. వాసన కన్నా ముందు నాకు రుచే మతికస్తది.”

“నువ్వు తెలివున్నోనివో, మెంటలోనివో అర్ధం కాదొక్కోసారి. దేశాలు కాదు, నీ రుచి అనంతలోకాలకు చేరుకోవాల్నని ప్రార్తిస్తున్న. పండుకో ఇగ.”

“వస్తదిరా, మనక్కూడా ఓ రోజు, చలో గుడ్ నైట్”

“గుడ్ నైట్”

***

సూర్యుడు నూనెల గోలిచ్చిన పెద్ద పూరీ లెక్కనే ఉబ్బిపోయి మీదకస్తున్నడు. పూరి పక్కన లేశే నూనె నురగ లెక్కనే విచ్చుకుంటున్నై సూర్య కిరణాలన్నీ. ఊచల మధ్యన విచ్చుకున్న వెచ్చని ప్రభాతం పేర్చి పెట్టిన మైసూరు పాకుల లెక్కనే ఉన్నది.

నిద్ర లేవంగనే గట్టిగ తిత్తుల నిండా గాలి పీల్చిండు కార్తీక్. రుచికరమైన ప్రభాతం కూడా జైలు గోడల మధ్య మురికి కంపు కొడుతున్నది. తుప్పు పట్టిన ఊచలు ఉప్పటి వాసన వేస్తున్నై. చెమట, తుప్పు, దుమ్మూ, ధూళి, మన్నూ, మశానం అన్నీ ఉప్పగనే ఉంటై అనుకున్నడు కార్తీక్.

సున్నం ఉప్పగ ఉండదేమో. ఆ ఆలోచన రాంగానే గోడకున్న సున్నాన్ని నాకిండు. ఏ రుచీ లేదు. ఏ రుచీ లేకుండ ఎట్లుంటది ఇది అనుకున్నడు. ఎదో ఆలోచిస్తూ ఉండిపోయిండు.

స్నానాల టైం అయింది. రాజూ, కార్తీక్ స్నానం చేస్తున్నరు. సబ్బు వాసన ఘుమఘుమలాడుతున్నది.

“రేయ్ అది తినేది కాదు కదరా. సబ్బు వాసన చూస్తానవెం రా మెంటలోడా?”

“సర్వదోష నివారిణి, పరిశుద్ద ఆత్మ పరిరక్షణా కవచం…. “

“రేయ్ తెలుగులో చెప్పురా”

“సబ్బు గురించి రావి శాస్త్రి ఏమన్నడో తెల్సారా?”

“తెల్సు. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ.. “

“రేయ్ అది శ్రీ శ్రీ రా. ఆయన మహా కవి. ఈయన మహా కథకుడు”

“ఐతే తెల్వది రా. నువ్వే చెప్పు. వాసన సూడుమన్నడా?”

“కాదు. ఎంత మలినం అంటినా స్వచ్చంగానే ఉండే స్వయం పరిశుద్ధక పదార్థంగా అభివర్నిన్చిండు.”

“ఆహా..”

ఈ సబ్బు రుచి ఎట్లుంటదో .. సబ్బుని నాకి చూసిండు.

“రేయ్ .. ఎం పని రా అది”

ఎవరి మాటలు వినపల్లేదు కార్తీక్ కి. సబ్బు వాసన ఘాటుగా ముక్కుపుటాలని తాకుతున్నది. కళ్ళకు దగ్గర ఉన్న సబ్బు నురగతో కళ్ళు మండుతున్నై. అయినా నాలుగయిదు సార్లు సబ్బుని నాకి చూసిండు. నాలుక మీద ఏ రకమైన ఆచ్చాదనా లేదు. రుచి లేదు. నాలుక్కో పదార్ధం కూడా తాకినట్టు లేదు.

నోరు, ఒళ్ళూ కడుక్కొని ఎం మాట్లాడకుండ అక్కణ్ణించి వెల్లిపోయిండు కార్తీక్. రాజుకి ఎం మాట్లాడాల్నో అర్ధం కాలేదు.

***

మద్యానం నడి ఎండ నెత్తిమీద సుర్రున కొడుతున్నది. రాగి పళ్ళాలు చేతుల పట్టుకుని ఖైదీలందరూ లైన్ల నిల్చున్నరు.

“ఏమైందిరా పొద్దున్న?” అడిగిండు రాజు.

“కాసేపాగు..”

మాడిపోయిన గిన్నెల తేలుతున్న నూనె, పోపు సరిపోకపోవడం వల్ల ఎక్కడా కనిపించని మసాలా పదార్థాలు, తగినంత పసుపు వాడకపోవడం వల్ల రంగు లేకుండా, ఎక్కువగా ఉడకటం వాళ్ళ అది అన్నమో, పప్పో అర్ధం కాకుండ చెమటలు చిందించి మరీ వండుతరు వంటగాళ్ళు. చెమటలెం ఖర్మ, చీమిడీ, సొల్లూ ఏమైనా చిందించి వంటలో ఉప్పు రుచి తీసుకురాగలిగిన వాళ్ళు. లేహ్యం లాంటి ఆ పదార్తమేదో పళ్ళెంల వేసిన్లు.

ఇంకో గిన్నెల నీళ్ళమీద తేలుతున్న నూనె, అక్కడక్కడా మాడిపోయిన మిరపకాయలతో సాంబారు అనబడు ఎర్రటి ద్రావకం ఒకటి గిలాసలో పోయబడ్డది.

పళ్ళెంల పడ్డ ఆ పదార్థాన్ని, గిలాసలో ఉన్న ఆ ద్రావకాన్ని ఎన్నడూ తిండి మొకం సూడని మనిషి లెక్క ఒక్క బుక్కలో తిని, ఒక్క గుక్కలో తాగిండు కార్తీక్.

గత పదేళ్ళలో తన వంటని అంత ఆప్యాయంగా, మురిపెంగా, ఆబగా, ప్రేమగా ఎవరూ తినడం చూడని వంటగాడు ఇంచు మించు కన్నీళ్ళు పెట్టుకున్నంత పని చేసిండు. కార్తీక్ని దగ్గరికి పిల్చి “ఇంకొంచెం కావాల్నా తమ్మీ” అని అడిగిండు.

“అద్దద్దు. ఇది చాలు” కార్తీక్ పళ్ళెం కడుక్కోనీకి పోయిండు.

ముక్కు మూస్కొని తినడం ఎట్లనో తెల్వక కష్టపడి కడుపులో ఆ పదార్థాల్ని పడేస్తున్న రాజు దగ్గరికి వచ్చి కూచున్నడు కార్తీక్.

“ఏమైందిరా నీకియాల?”

“రుచి పోయిందిరా.”

“ఎక్కడ పోయింది? ఎట్ల పోయింది?”

“ఏమోరా. పోయింది అంతే. పోద్దట్నించి ఎన్నింటిని నాకిన్నో, ఏమేం తిన్ననో. గడ్డీ, మట్టీ, గోడలు, చువ్వలు.. ఏదీ రుచి అస్తలేదురా.”

“నువ్వు మొదట్నుండీ అంతే కదరా”

“అట్లా కాదురా. ఇది వేరే. మొత్తానికే పోయింది. ఒక అవశేషం లెక్క, వ్యర్ధ అవయవం లెక్క అయిందిరా  నాల్క.”

“సరిపోయింది. నీ వంకలకు, నాల్కె రోగానికీ మంచిగ సరిపోయింది.”

“రేయ్, నీకర్ధం కాదురా నా బాధ. ఎక్కడున్నా, రుచేరా నా అనుభూతి, మనశ్శాంతి అన్నీ. ఆస్వాదన లేకుంటే ఎందుకురా జీవితం.”

“అట్ల ఎందుకురా అనుకునుడు. ఇట్ల సూడు. ఇక్కడ ఎలాగూ నీకు తిండి సైపదు. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండ తినచ్చు.”

“నిజమే.” నిరుత్సాహంగ చెప్పిండు కార్తీక్.

***

లంచ్ టైం అయింది. గంట కొట్టిన్లు. రోజూ లెక్కనే అందరు పళ్ళాలు, లోటాలు పట్టుకుని లైన్ల నిలబడ్డరు.

“ఎం వంట చేసిన్లు రా ఇవాళ?” అడిగిండు కార్తీక్.

“ఆనక్కాయ చేసినట్టున్నర్రా, అయినా నువ్ తెలుసుకొని చేసేదేమున్నది రా?” అన్నడు రాజు.

“నిజమే”

ఆనప కాయ. కార్తీక్ మనసు ఎక్కన్నో ఉన్నది.

“ఎం ఆలోచిస్తానవ్ రా?”

“ఆనప కాయ గురించి. మా ఇంట్ల చిన్నప్పుడు తిండికి సరిగ ఎల్లేది కాదు. మా అవ్వ ఎన్నుంచి తెచ్చేదో కానీ ఇంటి మీద మొత్తం, ఆనప తీగెలు, బీరకాయ తీగలు, గుమ్మడి కాయ తీగలు, బచ్చలాకు అన్ని రకాల తీగల కూరలు పాకిపోయ్ ఉండేటియ్. పిందెలు కాంగనే మా అవ్వ కళ్ళళ్ళ చిన్న సంబురం కనిపించేది. నాలుగు రవ్వలు ఆదా అయితున్నయనో, నాలుగు తిండి గింజలు దొరికినయనో తెల్వది కని.”

“పళ్ళెం పట్టు” పాత జ్ఞాపకాల్ల మునిగిపోయిన కార్తీక్ వడ్డించే వాని పిలుపుతో మళ్ళీ ఈ లోకంలకు వచ్చిండు.

ఇద్దరు కలిసి రోజూ తినే జాగాలకు పోయిన్లు.

“దూది పిందెల లెక్క ఎముంటై రా ఈ ముక్కలు. సారీ రా. ఇందాకటిది కంటిన్యూ చెయ్.” తిండి ఆస్వాదనలో మునిగిపోయి అన్నడు రాజు.

“అన్ని కూరగాయలు చేతికి అందెతట్టు కాశేటియ్. దొంగ ముండ ఆనపకాయకు మాత్రం మాదండి బలుపు. అదొక్కటి మాత్రం ఇంటి మీద కాశేది. అది కోయ్యాల్నంటే ఇల్లెక్కాలే. అది కోయ్యాల్నంటే నా సాయం కావాల్శిందే మా అవ్వకు. ఒక సారి అది కోయ్యబోయి గూన పెంకుల మీదికెల్లి జారి పడ్డ. ఊళ్ళ ఆరెంపీ పెద్దగ పైసలేం తీస్కోడు కని ఇచ్చే ఆ నాలుగు పైసలు కూడా కనాకష్టమే మా ఇంట్ల. పక్కింట్ల చేబదులు పట్కచ్చింది మా అవ్వ.

రెండ్రోజులకు పక్కింటి శీను గాడు మా ఇంటి మీద కనిపిచ్చిండు.

“రేయ్ ఎం చేత్తానావ్ రా ఆడ” అన్న. “మీ అవ్వే ఎక్కమన్నదిరా” అన్నడు వాడు.

నాకు దెబ్బ తాకిందని వాణ్ని ఇల్లు ఎక్కిచ్చిందేమో అనుకున్న. వాడు గంప నిండా ఆనపకాయలు కోస్కోని వాని సందాన వాడు పోయిండు.

“అవ్వా, ఏందే వాడు కాయలు కోస్కోని పోతాంటే సప్పుడు చెయ్యవ్?” అడిగిన.

“రాజవ్వనే అన్నది రా, మొన్న దీస్కున్న చేబదులు వంతు పైసలేం అద్దు కనీ ఆనక్కాయలిమ్మన్నది. సరేతీమన్న. మల్ల కాత్తైతీరా.” చానా సులువుగ చెప్పింది మా అవ్వ. అవి కాశినంక సాంబారు, కూర, అనపకాయ సర్వపిండి ఎన్ని తినచ్చో అని నా మనసుల గుర్రాలు ఉర్కుతుండే. గప్పుడు అన్ని మాయం అయినై ఒక్క సారే.

“అది సరే రుచికీ ఈ కథకీ సంబంధం?”

“అయిదింటికి రావాల్సిన బస్ రాత్రి పన్నెండిటికి అస్తే? అయిదింటికే వస్తే బస్ ఎక్కి పోతవ్. పన్నెండింటికి వచ్చింది కాబట్టి ఆ ప్రయాణం గుర్తుండి పోతది. రెండో కాపు కాసే వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. మళ్ళీ కొన్ని నెలలు పట్టింది. లేత ఆనపకాయలు ఎన్నో రోజుల ఎదురు చూపుల తరవాత నాలుకతో నలుగుతుంటే స్వర్గం కనిపించింది.”

“నిజమేరా. ఎక్కడిదో ముచ్చట యాదికి ఉంచుకున్నవ్ బాగనే”

“రుచి అంటే అదే రా. స్మృతులని తడిమే సాధనం. ఒక్కో రుచికీ ఒక్కో కథ. ఎన్నో జ్ఞాపకాలు. నోట్లోకి పోయిన పదార్ధం యధార్ధాన్ని బయటకు తీసి అడుగున పడిన జ్ఞాపకాలని తట్టి లేపుతది”

***

మూడు నెల్ల శిక్షా కాలం అయిపొయింది ఇద్దరికీ.

బయటకు రాంగనే పిల్లగాలోకటి స్వాగతం చెప్పింది.

“ఒక్క నిముషం నిల్చోరా ఇక్కన్నే” కార్తీక్ అడిగిండు.

ఇద్దరు జైలు తలుపు ముందర నిల్చొని స్వేచ్చా లోకాన్ని చూస్తున్నరు.

“ఏముందిరా.. ఈ గాలి” రాజు తిత్తుల నిండా గట్టిగ గాలి పీల్చుకున్నడు. బయట దుర్గంధం కూడా సువాసన లాగనే ఉన్నది.

రెండు చేతులూ పాంటు జేబుల్ల పెట్టుకొని నిలబడ్డడు కార్తీక్. ప్రశాంతంగా లోకం దిక్కు చూస్తున్నడు.

“గాలి కాదురా. స్వేచ్చా వాయువు. సమస్త జీవరాశులకూ సమానంగా పంచబడనిది. ఆటవిక జంతుజాలం, మనిషి మాత్రమె అనుభవించగలిగింది. పదే పదే దుర్వినియోగం చేయపడేది. అవధులు, పరిధుల్ని దాటి రెక్కలు విచ్చుకుని ఎగరాల్నని అనుక్షణం తహతహలాడేది. ఒకళ్ళ చేతుల ప్రేమగా, మరొకళ్ళ చేతిల ఆయుధంగ మారిపోయే కనిపించని మానసిక విశేషం.”

“… ..”

దానికి ఎట్లా ప్రతి సమాధానం ఇయాల్నో అర్ధం కాలే రాజుకు.

“పదా చాయ్ తాగుదాం.” ఎదురుగ ఉన్న చాయ్ స్టాల్ కు పోయిన్లు ఇద్దరు.

ఘాటుగా, తియ్యగా, వెచ్చని పొగ ఆవిరిలో నుంచి అల్లం చాయ్ వాసన వస్తున్నది. చాలా రోజుల తరవాత ముక్కు పుటాలకు సుఖమైన వాసన.

చాయ్ గ్లాస్ నోట్లో పెట్టుకుని ఒక సిప్ చేసిండు కార్తీక్.

తియ్యగా, ఘాటుగా, వెచ్చగా, సుఖంగా అనిపించింది.

రెండు నీటి చుక్కలు బోట బొటామని కారినై కార్తీక్ కుడి కన్ను నుండి.

ఎందుకని అడగలేదు రాజు.

***

మీ మాటలు

  1. Allam Vamshi says:

    “సెన్సెస్” మీద చాల మంచిగా రాసారు. కొత్త ప్రయోగం అభినందనీయం

  2. అనుభూతుల మీద అద్భుతమైన కథ. అభినందనలు

  3. చందు తులసి says:

    రుచుల మీద బహుశా నేను చదివిన మొదటి కథ. బాగుంది చైతన్య గారూ. జీవితంలో ఒక్కో సంఘటన ఒక్కో రుచిలా వుంటుంది. ఒకే సంఘటన వేరువేరు రుచులనూ చూపిస్తుంది.

  4. yashwanth says:

    “అయిదింటికి రావాల్సిన బస్ రాత్రి పన్నెండిటికి అస్తే? అయిదింటికే వస్తే బస్ ఎక్కి పోతవ్. పన్నెండింటికి వచ్చింది కాబట్టి ఆ ప్రయాణం గుర్తుండి పోతది.
    మస్తు రాసినవ్ అన్న …

  5. subhashini says:

    ముందు రుచులపై కథ ఏమిటా అనుకున్న. కానీ మీ కథలు మొత్తం చదివితే అంతర్లీనం గా ఏదో ఒక తాత్విక కోణం ఉంటుంది. కార్తీక్ తను పోగొట్టుకున్న “స్వేచ్ఛా రుచి” ని ఛాయ్ లో వెతుక్కున్నట్టున్నాడు. మంచి ప్రయోగం చైతన్య గారు..

Leave a Reply to చందు తులసి Cancel reply

*