వారిదే కథాకాశం..!

 

-చందు తులసి

~

 

చందు“రాయడమంటే ……నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడం..!

రాయడమంటే ఏమనుకున్నావు? రాయడమంటే  నీ లోపలున్న  అగ్నిగుండాన్ని బద్దలు చెయ్యడం. రాయడమంటే ఒక తపస్సు. అన్కాన్షియస్ సెల్ఫ్ నుండి విసిరేయబడ్డ ఎన్నో నిన్నులను జల్లెడ బట్టడం. రాయడమంటే నీ కళ్లు తెరిపించే అనుభవం. రాయడమంటే నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడం. అలా ఒక పేజీ అయినా రాయగలిగితే మనసుకి శుద్ధి జరుగుతుంది. జ్ఞానోదయమవుతుంది. అసౌకర్యంగా అనిపించినా నిన్నొక కొత్త వ్యక్తిగా ఆవిష్కరించుకుంటావు.”

ఈ వాక్యాలు  గత ఏడాది సారంగలోనే వచ్చిన వెంకట్ సిద్ధారెడ్డి-సోల్ సర్కస్ కథలోనివి.

***
నిజమే. రాయడమంటే మన లోపల మనం చేసే అన్వేషణ. ప్రస్తుత మన స్వరూపమేమిటో తరచి చూసుకొనే పరీక్ష. ఆదర్శాలు, విలువల రాళ్లతో ఘర్షణ పడి కుబుసం వదిలించుకొని…సరికొత్త రూపం పొందటానికి పడే ఘర్షణ.  ఈ ప్రయాస ఎదుర్కొనేందుకు చాలా కష్టపడాలి. బహుశా అందుకేనేమో ఒక దశ దాటిన కథకుల వేగం తగ్గిపోతుంది.  ఒక్క అక్షరం రాయడానికి వేయి ఆలోచనలు చేయాల్సి ఉంటుంది.

ఇదంతా ఎందుకంటే తెలుగులో ఇప్పుడు సీనియర్ కథకులు చాలామంది అస్త్ర సన్యాసం చేశారు. ఒకరిద్దరు మాత్రం అప్పుడప్పుడూ చాలా తక్కువగా రాస్తున్నారు.  ఓ వైపు  సీనియర్ కథకులు క్రమంగా తెరమరుగవుతుంటే ఏడాదికేడాది కొత్త కథకులు వేదికపైకి వస్తున్నారు.

గత ఏడాది నామిని రాసిన కథ కోరిన కొండ మీద వాన. తిరుపతి నగరంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చుట్టూ తిరిగే కథ.  భూములకు పెరుగుతూ , మనుషులకు తగ్గిపోతున్న ”విలువ” గురించి జమునమ్మ  అనే పాత్ర నేపథ్యంలో చర్చిస్తుంది. అలాగే మరో సీనియర్ కథకుడు రామా చంద్ర మౌళి రాసిన కథ దిగడానికి కూడా మెట్లు కావాలి. చక్కని శిల్పంతో పాటూ…చిక్కని కథనంతో సాగిపోయే కథ. జీవితంలో ఎదుగుదల కోసం ఉష అనే గాయని సాగించిన గాథ… కథలా కాకుండా ఒక వ్యక్తిత్వ వికాస పాఠం లాగా అనిపిస్తుంది. ఎదుగుతున్నామనుకుంటూ…ఎటు దిగజారుతున్నామో లోతుగా చర్చిస్తుంది.

పురుషాధిక్య భావజాలం, పేద ముస్లింల జీవితాలు, పేదరికంలోని అనుబంధాలను సున్నితంగా వివరించిన కథ  స్కైబాబా రాసిన అన్ మోల్ రిష్తే. టీవీ ప్రోగ్రాములు, ప్రకటనల ద్వారా మనం ఏం కోల్పోతున్నామో, దానికి పరిష్కారమేంటో కొత్తగా చెప్పిన కథ అరిపిరాల సత్యప్రసాద్ రాసిన  అబ్సలీట్ రియాలిటీ.  మహలక్ష్మమ్మ అనే చారిత్రక పాత్ర చుట్టూ అల్లిన ప్రయోగం దాట్ల దేవదానం రాజు కథ మన్యం వోరి మేడ. ఇలా సీనియర్ కథకులు తమదైన ముద్రతో సాగిపోతుంటే….కొత్త రచయితలు కూడా విభిన్న రకాల ప్రయోగాలతో ఆకట్టుకున్నారు.

గత ఏడాది వచ్చిన కొత్త తరం కథకుల్లో ప్రత్యేకించి చెప్పాల్సిన వాళ్లు కొంతమంది ఉన్నారు. రకరకాల కారణాలతో…రంగురంగుల ముసుగులు కప్పుకొని…పైకి ఆనందపు భ్రమల్లో జీవిస్తూ, అంతర్లీనంగా మౌనంగా కుమిలి కుమిలి రోదించే అంతరాత్మలకు, పరదాలను తొలగించి… అసలు జీవించడం అంటే ఏమిటో చూపించిన కథ వెంకట్ సిద్దారెడ్డి సోల్ సర్కస్.  కథ  పేరు దగ్గర నుంచి… కథను నడిపించిన తీరు, కొటేషన్లలా దాచిపెట్టుకోదగిన వాక్యాలు, కథ ముగింపు…ఇలా అన్ని రకాలుగా ప్రత్యేకత సంతరించుకున్న కథ.  సారంగలో మాత్రమే కాకుండా గత ఏడాది వచ్చిన తెలుగు కథల్లోనే ఉత్తమ కథగా సోల్ సర్కస్ ను చెప్పుకోవచ్చు.  అలాగే ఈ కథలోని చిత్వాన్ పాత్ర కూడా పాఠకులను చాలా కాలం వెన్నాడుతుంది.  వెంకట్ సిద్దారెడ్డి రాసిన కాక్ అండ్ బుల్ స్టోరీ, టైం ఇన్ టూ స్పీడ్ కథలు కూడా పాఠకులను ఆకట్టుకున్నాయి. ఐతే కాక్ అండ్ బుల్ స్టోరీ మాత్రం..కథను నడిపించడంలో కొంత సమన్వయం తప్పినట్టు అనిపిస్తుంది. మొత్తానికి ఇతివృత్తం ఎలాంటిదైనా శిల్పంతో ఆకట్టుకోవడం వెంకట్ సిద్దారెడ్డి కలం బలం.

“జీవితమంటే ప్రయోగం చెయ్యాలి. ధైర్యం చెయ్యాలి. కష్టాలుంటాయి. కన్నీళ్ళుంటాయి. ఒంటరితనం ఉంటుంది. ఏకాంతం ఉంటుంది. ప్రేమించేవాళ్ళు ఉంటారు. ద్వేషించే వాళ్ళు ఉంటారు.  జీవితం…ఎవరికి వారు వారి జీవితానికి తగినట్లు చేయాల్సిన సాధన”  అంటూ చిన్నచిన్న పదాలతోనే జీవితానికి సరికొత్త భాష్యం చెప్పిన కథ పింగళి చైతన్య తనదే ఆ  ఆకాశం.  సహజంగా,  సరళంగా…ఒక ప్రవాహంలా సాగిపోయే కథ.  ఒక ఒంటరి మహిళపట్ల సమాజానికుండే అభిప్రాయాలు, సందేహాలకు …తనదైన సొంత వ్యక్తిత్వంతో సమాధానం ఇచ్చిన లక్ష్మి కథ. సాధారణ ఫెమినిస్టు కథలకు భిన్నంగా ఉండడంతో పాటూ లక్ష్మి పాత్రను నడిపించిన తీరు, రచయిత్రి శైలి కూడా పాఠకులను ఆకట్టుకుంటుంది. అలాగే కులాంతరం వివాహం చేసుకున్న మహిళ సమస్య…నామాలు కథ కూడా ఆసక్తికర చర్చకు దారి తీసింది.

Untitled-2

అల్లం కృష్ణ చైతన్య రాసిన …చుక్కలు తాకిన చేతులు కథ కూడా శైలి పరంగా భిన్నమైన కథ. రెండు వేరు వేరు కథలను…రషోమాన్ తరహా టెక్నిక్ తో చెప్పిన ఈ కథలోని మార్మికత పాఠకులను మెప్పిస్తుంది. ఇక భిన్న నేపథ్యంతో పాటూ, తనదైన భాషను, తనదైన ముద్రతో దూసుకొస్తున్న మరో కలం అల్లం వంశీ. ఒక సమస్యను కేవలం ఏకరవు పెట్టడం  కాకుండా…సున్నితంగా చర్చించడం,  మానవ సంబంధాలను బలంగా చెప్పడం వంశీ బలాలు. రిజర్వేషన్ అంశాన్ని మిరకిల్ కథలోనూ, తెలంగాణ-ఆంధ్ర జీవితాల్లో వైవిధ్యాన్ని రెండు పట్టాలు-ఒక రైలు కథలో చర్చించిన తీరు….సహచరి కథ నడిపించిన తీరూ ఆకట్టుకుంటాయి.

వైవిధ్యమైన ఇతివృత్తాలను, కవితాత్మకంగా చెపుతున్న మరో రచయిత్రి వనజ తాతినేని.  ఫేస్ బుక్ అనుబంధాలకు మతం, లింగ బేధం లేదని చెప్పే స్నేహితుడా! రహస్య స్నేహితుడా.., మీడియా రంగంలో మహిళలపై వేధింపులను చర్చిస్తూ కుక్కకాటుకు-చెప్పుదెబ్బ లాంటి పరిష్కారాన్ని చూపిన కథ పిడికిట్లో పూలు. ఇతివృత్తాన్ని అందంగా చెప్పే వనజ తాతినేని కథలు ఆసాంతం చదివిస్తాయి. శైలి పరంగా షాజహానా-మనిషి పగిలిన రాత్రి ప్రత్యేకమైన కథ. అద్భుతమైన చైతన్య స్రవంతి పద్ధతిలో,  ఒక మహిళ భావాలకు అద్దం పట్టిన కవిత్వం లాంటి కథ.
బొట్టు, అదే ప్రేమ లాంటి కొత్త తరహా ఇతివృత్తాలతో ఆకట్టుకున్న మరో యువ రచయిత్రి ఎండ్లూరి మానస. ముఖ్యంగా అదే ప్రేమ కథలో ఒక సున్నితమైన అంశాన్ని చర్చకు పెట్టారు. స్వేచ్ఛ, లెటర్స్ , కీమాయ కథలతో ప్రజ్ఞ వడ్లమాని కూడా మెప్పించారు.  మైడి చైతన్య రాసిన నెర్లిచ్చిన అద్దం, అసంపూర్ణం కథలు శిల్పం, శైలి పరంగా ఆలోచింపజేస్తాయి. ది ప్రొఫెషనల్ కథతో గమన,  కృష్ణజ్యోతి కథ- పతి పత్నీ ఔర్ జస్ట్ నథింగ్, స్నాప్ ఔట్ కథతో మమత కొడిదెల, మయూఖ కథతో సెలవు లాంటి రచయితలు కొత్త తరం….భవిష్యత్ కథపై ఆశాభావాన్ని, భరోసాని కలిగిస్తారు. మొత్తంగా కొత్త తరం రాస్తున్న కథలని పరిశీలిస్తే  ఇతివృత్తం కన్నా శైలికి, శిల్పానికి ప్రాధాన్యం పెరగడాన్ని మనం గమనించవచ్చు. కొత్త కొత్త ప్రయోగాలు, భిన్న పోకడలతో  ప్రత్యేక గుర్తింపు కోసం,  తెలుగు కథని ఇంకో మెట్టు ఎక్కించడానికి కొత్త తరం కలిసి కట్టుగా చేస్తున్న ప్రయత్నించడం నిజంగా సంతోషకరం.

శైలి, శిల్పం పరంగా కె.ఎన్. మల్లీశ్వరి రాసిన రూబా, శైలజా చందు-వాన కథ, మైథిలి అబ్బరాజు- రాజహంస,  జి. వెంకట కృష్ణ-స్మృతి, ఉత్తమ కథలు. ఇంకొన్ని కథల్లో అసలు తీసుకున్న ఇతివృత్తాలే చర్చకు దారి తీసిన కథలూ ఉన్నాయి. వాటిల్లో పి. వసంత లక్ష్మి రాసిన వారిజ కథ ప్రధానంగా చెప్పుకోవచ్చు. తల్లి కావడానికి పెళ్లి చేసుకోకుండా…జీవితంతో కొత్త ప్రయోగం చేసిన మహిళ కథ వారిజ.  సహజీవనాన్ని కేవలం మాతృత్వానికి మాత్రమే పరిమితం చేసిన వారిజ నిర్ణయం కొత్తగా ఉన్నా …ఆచరణ సాధ్యమా అనే సందేహాన్ని, ఆ తర్వాత పర్యావసానాల గురించి ఆలోచింపచేస్తుంది. తాత్కాలిక ఆకర్షణలకు లోనై వివాహ బంధాన్ని చిన్నాభిన్నం చేసుకున్న మహిళ కథ బుద్ధి యజ్ఞమూర్తి రాసిన తెగని గాలి పటం. ఈ కథలో కమలిని పాత్ర ప్రవర్తన, అందుకు ఆమె భర్త శేఖర్ ప్రతిస్పందన విచిత్రంగా ఉంటాయి.

ఇదే తరహా అంశంతో లివ్-ఇన్ రిలేషన్ షిప్ గురించి చర్చించిన మరో కథ కృష్ణవేణి రాసిన తెగిన గాలిపటం. ఈ తరహా కథలన్నీ ఆధునిక మహిళల ఆలోచనలకు అద్దం పడుతూ… వివాహ వ్యవస్థలో ఇమిడిపోలేక ఎదుర్కొంటున్న సంఘర్షణను చూపిస్తాయి. కానీ వాటికి రచయితలు చూపిన పరిష్కారం సమంజసమా ( ముఖ్యంగా వారిజ కథలో ) అనే సందేహం కలుగుతుంది.
ఇక్కడో ఆసక్తి కరమైన విషయమేమిటంటే…మిగతా సాహిత్య ప్రక్రియల సంగతి ఏమోకానీ ఇటీవలి కాలంలో కథా ప్రక్రియలో పురుషుల కన్నా మహిళా రచయితలే అధికంగా రాస్తున్నారు. ఒకప్పుడు నవలా ప్రక్రియను మహారాణుల్లా ఏలిన మహిళలే…సమీప భవిష్యత్తులో తెలుగు కథను కూడా తమ చేతుల్లోకి తీసుకొనే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఐతే ఇందుకు దారితీస్తున్న పరిస్థితులేమిటి..?  ఏ కారణాల చేత మహిళా రచయితలు అధికంగా రాస్తున్నారు.?  ఏ అంతర్గత సామాజిక పరిస్థితులు వారిని ఈ దిశగా నడిపిస్తున్నాయన్నదీ తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

( ముగింపు వచ్చేవారం )

మీ మాటలు

 1. తహిరో says:

  విశ్లేషణా పరంపర పసందుగా సాగుతోంది – చందు తులసి గారికి అభినందనలు.

 2. sasi kala says:

  సోల్ సర్కస్ లింక్ ఇస్తార . మిగిలిన కధలు లింక్ ఇచ్చి ఉంటె బాగుండేది . మంచి విశ్లేషణ

 3. Allam Vamshi says:

  కథలూ, కథకుల పరిచయం చాన బాగుందన్నా! చాన చాన థాంక్స్.. :)

 4. కె.కె. రామయ్య says:

  సీనియర్ రచయితలు నామిని అన్న, తిరపతి ఆర్.ఎం. ఉమా, భమిడిపాటి జగన్నాథరావు, ఒంగోలు రమక్క ( బత్తుల రమాసుందరి ), రిషీవ్యాలీ రాధ మండువ, అజయ్ ప్రసాద్, ఆవినేని భాస్కర్ గార్లు ఇంకా మరెందరెంరో ప్రశంస లందుకున్న పుట్టా పెంచల్దాసు గారి ( సీమ ప్రాంతంలోని ఓ మారుమూల పల్లె పేద దళిత యువకుడి ) మొదటి కధ “బుడ్డగిత్త రంకి” ( జనవరి 7, 2015 ) కినిగే అంతర్జాల పత్రికలో వచ్చింది ( http://patrika.kinige.com/?p=4667 ) కూడా పరిశీలించరా. సభా మర్యాదలు పాటించకుండా నా హిడెన్ అజెండాను ప్రస్తావిస్తున్నందుకు, వ్యాసం రెండో భాగం వచ్చే వరకూ వోపికపట్టనందుకూ మన్నించండి చందు తులసి గారు.

  • మంచి సూచన. కాని, ఇది సారంగలోని కథల సమీక్ష మాత్రమే!

మీ మాటలు

*