కవిత్వం కాకి బంగారం కాదు: అనిశెట్టి రజిత

 

boorlaకవయిత్రి సామాజిక ఉద్యమ కారిణి అనిశెట్టి రజిత తన చిన్ననాటి నుండే ప్రజా ఉద్యమాలతో మమేకమైనవారు. కాళోజీ అడుగుజాడల్లో నడిచినవారు. ఇప్పటి వరకు ఐదు కవితా సంపుటాలు, తన సంపాదకత్వంలో అనేక కవితా సంపుటాలు ప్రకటించారు. అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇటీవల తెలంగాణ రచయితల వేదిక అలిశెట్టి ప్రభాకర్ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా అన్నవరం దేవేందర్, బూర్ల వేంకటేశ్వర్లు వారితో జరిపిన ముఖాముఖి.

 • అలిశెట్టి ప్రభాకర్ పురస్కారం స్వీకరిస్తున్నారు కదా! ఎలా అనుభూతి చెందుతున్నారు. అలిశెట్టి ప్రభావం మీ కవిత్వం మీద ఉన్నదా? ఆయన కవిత్వం పై మీ వ్యాఖ్య?

#  అలిశెట్టి ప్రభాకర్ స్మృతిలో ఒక పురస్కారం ఒకటి కరీంనగర్ తెలంగాణ రచయితల వేదిక నెలకొల్పడం, ప్రతి సంవత్సరం 12జనవరిని చరిత్రాత్మకం చేస్తుంది.  ఈ పురస్కారానికి ఈ సంవత్సరం నన్ను ఎంచుకోవడం ఆనందం కలిగినా చాలా ఆలోచిస్తున్నాను.

39 ఏళ్ల వయసు నాటికి ఒక అరాచకత్వంతో, క్రమ శిక్షణా రాహిత్యంతో, దారిద్ర్యం పడగ నీడలో బతికిన మంచి కవి సాహితీలోకం నుండి నిష్క్రమించడం తలుచుకుంటే విషాదం కమ్ముకుంటున్నది.

అలిశెట్టి కవిత్వంతో నాకు ఉన్న పరిచయం అప్పట్లో ఎక్కువేమీ కాదు. గత మూడు సంవత్సరాలుగా చాలా లోతైన అనుబంధం ఏర్పడింది. ఎంత పదునైన కవిత్వం అది. అంత చిన్న పదాల్లో అత్యంత పెద్ద భావన, చురుక్కుమనిపించే మినీ కవితలో లోకం తీరును అనితరసాధ్యంగా ప్రతిబింబిస్తుంది ఆ కవిత్వం. simply he is a great poet. పరోక్షంగా ఆయన కవిత్వ ప్రభావం నాపైన ఉన్నదనే అనుకుంటాను.

 • నలభై ఏళ్లకు పైగా సాహత్య రంగంలో ఉన్నారు. ఇప్పటికి ఐదు కవితా సంపుటాలు, రెండు దీర్ఘ కవితలు, నానీలు, హైకూలు, కథా సంపుటి, ఎనిమిది సంకలనాలకు సంపాదకత్వాలు వెలువరించారు. ఒకరకంగా చెప్పాల్సివస్తే తక్కువగా రాసినట్టే…క్రియాశీల ఉద్యమాల్లో పాల్గొన్నందున ఇలా జరిగిందా!

#  పైన పేర్కొన్న ప్రక్రియలే కాకుండా మరో రెండు ప్రక్రియలు వ్యాసం, పాట కూడా నేను రాసాను… రాస్తున్నాను. ప్రచురించబడిన రచనలు ఉన్నట్లే సంకలనం కాని రచనలు వివిధ పత్రికల్లో వచ్చినవి ఎన్నో ఉన్నాయి… కాబట్టి ఒక సామాజిక కార్యకర్తగా క్షేత్ర స్థాయిలో పని చేస్తూ సమయం సరిపోక ఇంకా ఎక్కువగా రాయలేక పోయాను అనేది లేదు.

నిజానికి ప్రజాతంత్ర ఉద్యమాల్లో క్షేత్ర స్థాయిలో పాల్గొనడం వల్లనే రాయగలుగుతున్నాను. ఆ క్రియాశీల భాగస్వామ్యమే లేకపోతే బహుశా నేనూ “వాలుకుర్చీ” రచయితగా మిగిలిపోయి ఉందును as a careerist and as a professional writer గా…

 • మీరు పౌర, స్త్రీ వాద, ప్రజాతంత్ర ఉద్యమాల్లో పాల్గొంటున్నారు కదా! ఆయా ఉద్యమాల ప్రభావం సమాజం మీద క్రియాశీలంగా పని చేస్తుందా! ఫలితాలెలా ఉన్నాయి…

#  ఉద్యమాలు క్లిష్టమైన సామాజిక సాంస్కృతిక సమస్యల నుండే కదా పుట్టేది! వాటిలో పాల్గొనడం అంటే ప్రతి రోజూ ప్రతి క్షణం ఒక సంక్షోభం… అందుకే నేనంటాను ఉద్యమాలు ఉల్లాస క్రీడలు కావు అవి ప్రతినిత్యం జీవన్మరణ వేదనలని..

ఉద్యమాల ప్రభావం సమాజం మీద శాశ్వతంగానో సుదీర్ఘంగానో ఉండదు… అది తాత్కాలికంగానే ఉండదు… ఒక ఉద్యమం లోని కొన్ని డిమాండ్లు pass కాగానే సమూల మార్పులు జరిగిపోవు.. ఉద్యమాలకు చివరి అధ్యాయాలుండవు… ఒక తేదీన మొదలయి మరో తేదీన ముగిసిపోవదమూ ఉండదు. ఫలితాలు కూడా పాక్షికంగానే ఉంటాయి. సంపూర్ణతకు అర్థం లేదు. ఈ యథాతథ సమాజం కూలిపోయి సరికొత్త సమాజం ఏర్పడినపుడే ఉద్యమాలు మరో సృజనశీల రూపం తీసుకొని ప్రజా బాహుళ్యాన్ని  చైతన్య శీలురుగా మారుస్తాయి.. ఉద్యమాలు ఇంకెంతో పెరుగాల్సి ఉన్నది.. హేతు బద్ధత విస్తరించాల్సి ఉన్నది…

 • తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మనం అనుకున్న నిర్మాణానికి అడుగులు పడ్తున్నయా, ఎట్లా ఫీల్ అవుతున్నారు! ‘పునర్నిర్మాణం’ ‘బంగారు తెలంగాణ’ పట్ల మీ భావం ఏమిటి?

#  తెలంగాణ రాష్ట్రం రాజకీయంగా, భౌగోళికంగా సాధించుకున్నాం.. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తన భావజాలంతో పని చేస్తున్నది.. అంతేనా..? ప్రత్యేక రాష్ట్రం కోసం కదిలిన సకల జనుల ఉద్యమ పాత్ర అయిపోయినట్టేనా..? చేయాల్సింది చేసినం. ఇక చేయవలసిందంతా సర్కారే అనుకుంటే అతి పెద్ద ప్రమాదం… దీనివల్ల అంతా సమసిపోయిందనే అనుకోవాల్సి వస్తుంది.

ప్రజలు ఆలోచించడం.. పని చేయడం ఆగిపోయి ఎదురుచూడటం… అడుక్కోవడం మొదలయ్యిందంటే ఉద్యమ ప్రభావం అంతరించినట్టే… ఉద్యమాన్ని గతంలోకి నెట్టేస్తే ఈ నిర్మానంగానీ, పునర్నిర్మాణంగానీ, ప్రజా తెలంగాణ గానీ ఏదీ సాధ్యం కాదు.

ప్రజలు సంతోషంగా ఉన్నారా.. మెలకువతో ఉన్నారా.. సుభిక్షమైన తెలంగాణే బంగారు తెలంగాణంటే.. దాని కోసం తమ భాగస్వామ్యాన్ని గుర్తిస్తున్నారా.. తమ పని అయిపోయిందని చేతులు దులుపేసుకుంటున్నారా.. తమ ఆకాంక్షలు ఏమిటి? అవి తీరే దారి ఏమిటి? వీటి గురించి చిత్త శుద్దితో ఆలోచిస్తేనే ఏదైనా సాధ్యం…

 • ప్రస్తుత కవితారంగం ఎటువైపు ప్రయాణిస్తున్నది? ఇంకా ఎలాంటి మార్పును తీసుకోవలసి ఉన్నది?

#  కవిత్వం మన లోపల కాలుష్యాలను ప్రక్షాళనం చేసి మంచి వైపుకే లాక్కుపోతుంది. కవితారంగం బాగా రాణిస్తున్నది…పురోగమిస్తున్నది… ఎటొచ్చీ కవులే కార్మికులు కాకుండా వైట్ కాలర్ ఉద్యోగుల్లా ప్రవర్తిస్తున్నారు. ముసుగు వీరుల్లా ముసుగు మనుషుల్లా సొంత డబ్బాలు మోగిస్తూ.. కోటరీలను తయారు చేసుకుంటూ..లొంగిపోయి బతుకుతున్నారు.

దేనికి లొంగిపోయి అంటే తమ వ్యక్తిగత అవకాశాల కోసం, కీర్తి కండూతి కోసం తమను తాము గొప్ప కవులుగా ప్రమోట్ చేసుకోవడానికీ.. సొంత దుకాణాలను బాగా అభివృద్ధి చేసుకొని ‘యాజమాన్యం’ చెలాయించడానికి దొంగ దారుల్లో.. పక్క దారుల్లో.. తప్పుడు దారుల్లో అడ్డదారులు పట్టి ఎగబడిపోతున్నారు. అందమైన తొడుగుల్నీ, ముసుగుల్నీ వేసుకొని చెలామణి అయిపోతున్నారు. సామాజిక స్పృహను కోల్పోయి దృష్టి హీనత్వం తెచ్చుకుంటున్నారు..

కవిత్వం కాకి బంగారంలా సింగారించబడి అహో ఒహోల్ల్లో సుడి చుట్టుకపోతున్నది. మనిషి కానివాడు కవెట్లయితడు? ఈ ముసుగులూ తొడుగుల్నీ చీల్చుకొని నిఖార్సైన మనుషుల్లా కవులు బయిటికి రావాల్సి ఉన్నది.. వ్యక్తిగత కాలుష్యాల నుండి కవిత్వరంగం ప్రక్షాళన కోరుకుంటున్నది.

 • తెలంగాణ ఆవిర్భావం తర్వాత కవి/రచయితల పాత్ర ఎట్లా ఉన్నది? ప్రస్తుత కర్తవ్యం ఏమిటి?

#  చాలా మంది కవులు అయోమయంలో ఉన్నారు… కిం కర్తవ్యం అనే డైలమాలో పడిపోయారు.. దారి తప్పిపోయిన వాళ్ళూ.. దారి తెలియక తచ్చాడుతున్న వాళ్ళుగా చీలిపోయారు.. ఉమ్మడి లక్ష్యం తెలంగాణ వచ్చేసింది.. ఇంకేమున్నది అన్న నిర్లిప్తతలో ఉన్నారు. నిశ్శబ్దం గుహల్లో దాక్కుంటున్నారు.. పిరికితనంతో ముడుచుకుపోయి మూగగా రోదిస్తున్నారు.

ప్రస్తుతమైనా ఎప్పుడైనా కవీ, రచయితా, మేధావీ సమాజానికి సరైన దిశా నిర్దేశకత్వం చేయాలి.. ప్రజా పక్షంలో ఉండాలి.. సమాజాన్ని కాపాడుకోవడం.. ఎప్పటికప్పుడు కొత్త నిర్మాణాలు చేస్తుండటం మన పని. ఏ బాధ్యతా లేదు, ఏ పనీ లేదు.. ఏ మేధావిగా ఆలోచనా రాదు అనుకుంటే కవిగా, రచయితగా, మేధావిగా, అంతా end అయినట్టే…

ఇప్పుడు కవులూ రచయితలూ చాలా మంది తమకో కర్తవ్యం బాధ్యత అస్తిత్వం ఉందనుకుంటున్నారా? అచేతనం నీడలో విశ్రమించకుండా ‘సోయి’ లోకి రావడం తక్షణ కర్తవ్యం. ఎటు గాలి వీస్తే అటు కొట్టుకపోవడం అగమ్యం.. అరాచకం.. దీన్ని గుర్తెరిగి కవులు తమను తాము నిరూపించుకోవాల్సి ఉంది.

 

 

 • ఇంకా ఏమైనా చెప్పదల్చుకున్నారా?

నేనింకా చెప్పదల్చుకున్నది.. కవులు తమ బాధ్యత గుర్తెరుగక పొతే, మాట్లాడటం ఆగిపోగానే మనిషి నత్తగుల్లలోకి పలాయనం చిత్తగించినట్టవుతుంది. లాలూచీలు, రాజీ పడటాలు, పటాటోపాలు, తళుకు బెళుకులు కవులు రచయితలకు సంబంధించిన లక్షణాలు కావు.

అటు ఇటు కాకుండా ఏదో కవిత్వం కెలికి కవులమని రచయితలమని పురస్కారాలు పుచ్చుకుంటే అది ఆత్మవంచనకు పరాకాష్ట. సమాజం కోసమే కలం పట్టాలె… ప్రజల కోసమే నిలబడాలె. అదీ కవంటే.. అదీ కవిత్వమంటే.. ఇయ్యాల అలిశెట్టి ప్రభాకర్ కవిగా అందుకే చిరంజీవుడు.

ఇప్పుడున్న ఇంకొక ట్రెండ్ అకవిత్వం… అకవుల బెడద.. కవిత్వం సాధన చేయకుండా అకవులు వెల్లువెత్తుతున్నారు.. ఇక బోగస్ కవులూ పుడ్తున్నారు.. అవకాశవాదం ఎంతకైనా లోబడుతుంది. లోబడు కవులూ తేలుతున్నారు. ఈ చరిత్ర ద్రోహం నుండీ, చరిత్ర హీనత్వం నుండీ బయట పడమని నేను కవులనూ రచయితలనూ కోరుతున్నాను.

 

మీ మాటలు

 1. B. Narsan says:

  సమాధానాల్లో రజితగారి సూటిదనం కొరడా దెబ్బల్లా ఉంది. కవులలో రకాలని తెలియపరుస్తూ, నిజకవుల ప్రస్తుత కర్తవ్యాన్ని తేటతెల్లం చేశారు. సందర్భోచిత ప్రశ్నలతో బూర్ల ఉపయుక్త సమాచారాన్ని రాబట్టారు. అభినందనలు.

 2. చందు తులసి says:

  అవును..రజిత గారి ఆవేశంలో వాస్తవం ఉంది.
  కవులు, కళాకారులు సోయిలోకి రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ సమాజానికి మేల్కొలుపు లాంటి ఇంటర్వ్యూ.
  రజిత గారికి, దేవేందర్ గారికి, వెంకటేశ్వర్లు గారికి అభినందనలు

 3. విజయ్ కోగంటి says:

  చాలా సూటియైన, గుర్తించి మలుచుకోవలసిన అవసరాన్ని తెలియచేసే మాటలు. ఆలోచనాత్మకంగా వుంది. అభినందనలు.

మీ మాటలు

*