ఆరు బుట్టల్లో, బస్తాలో బంగారం తరలించాడు

 

స్లీమన్ కథ-21

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

తవ్వకాలను కొనసాగించాడు. మరికొన్ని లింగాకృతులు, చక్కని పాలరాయి నుంచి చెక్కిన ఓ పక్షి గుడ్డు తప్ప ఇంకేవీ దొరకలేదు. నాలుగు నెలలుగా వర్షాలు లేవు. రోజుల తరబడీ హిస్సాలిక్ దిబ్బను ధూళి మేఘాలు కప్పేశాయి. అలాంటిది, హఠాత్తుగా కుంభవృష్టి. దిబ్బ అంతా బురద బురద అయిపోయింది. తవ్వకాలను నిలిపేశాడు. భార్యతో కలసి ఎథెన్స్ కు వెళ్లిపోయాడు. మనిషి అస్వస్థంగా ఉన్నాడు. భార్యా, ముగ్గురు మేస్త్రీలూ, అంగరక్షకుడూ కూడా జ్వరంతో ఉన్నారు.

ఎథెన్స్ లో తిరిగి ఆరోగ్యం పుంజుకున్నాడు. ప్రియామ్ ప్రాసాదం తాలూకు ప్రణాళికను తెప్పించుకుని పరిశీలించిన బర్నూఫ్, అందులో కొన్ని లోపాలున్నాయనీ, ఫొటోగ్రాఫర్ సాయంతో మెరుగైన ప్రణాళికను తయారుచేయమనీ సూచించాడు. దాంతో నెల రోజుల తర్వాత ఫొటోగ్రాఫర్ ను వెంటబెట్టుకుని స్లీమన్ ట్రయాడ్ కు వెళ్ళాడు.

తీరా వెళ్ళాక, హిస్సాలిక్ దగ్గర నియమించిన కాపలాదారు పెద్ద పెద్ద రాళ్ళను చడీ చప్పుడు కాకుండా అమ్మేస్తున్న సంగతి బయటపడింది. సిప్లాక్ గ్రామంలో ఇళ్ల నిర్మాణానికి కొన్ని రాళ్ళు వాడుకున్నారు. ఎహ్నీ షెహర్ అనే ఒక క్రైస్తవ గ్రామంలో గంటగోపురం నిర్మించడానికి మరికొన్ని వాడుకున్నారు. స్లీమన్ ఆగ్రహం పట్టలేకపోయాడు. అప్పటికప్పుడు ఆ కాపలాదారును తొలగించి అతని స్థానంలో ఒక సాయుధ కాపలాదారుని నియమించాడు. ఫొటోగ్రాఫులతో, కొత్త ప్రణాళికలతో ఎథెన్స్ కు తిరిగివెళ్ళాడు.

మరోవైపు ట్రాయ్ తవ్వకాల్లో అద్భుతాలేవీ బయటపడకపోవడం అతన్ని కుంగదీస్తూనే ఉంది. ఇంతవరకూ తవ్వకాలు జరపని ప్రదేశాల మీదికి అతని దృష్టి మళ్ళింది. సొంత ఖర్చు మీద మైసీనియా, ఒలింపియాలలో తవ్వకాలకు అనుమతించవలసిందిగా గ్రీకు ప్రభుత్వానికి రాశాడు. వాటిలో బయటపడే విలువైన సామగ్రిని తన జీవితాంతం దగ్గర ఉంచుకుంటాననీ, తన తదనంతరం అవి గ్రీకు జాతీయసంపద అవుతాయనీ షరతు పెట్టాడు. తన పేరుతో ఒక పురావస్తు ప్రదర్శనశాలను నిర్మించే ఒప్పందం మీద 2 లక్షల ఫ్రాంకులు ఇవ్వజూపాడు. కానీ ప్రభుత్వం అతని అభ్యర్థనలను తిరస్కరించింది. దాంతో తను శాశ్వతంగా ఎథెన్స్ ను విడిచిపెట్టి పారిస్ వెళ్లిపోతానని బెదిరించడం ప్రారంభించాడు.

3bf230edf319b9b3d4b1cb5b56972adc

కానీ ట్రాయ్ అతన్ని విడిచిపెట్టలేదు. అక్కడ అంతవరకూ కనుగొన్న వాటిలో ఎక్కువ భాగాన్ని బయటికి తరలించేశాడన్న ఆరోపణతో టర్కీ ప్రభుత్వం తన కిచ్చిన ఫర్మానాను రద్దు చేసినట్టు అతనికి తెలిసింది. తన తరపున జోక్యం చేసుకోవలసిందని కోరుతూ ఉన్నతస్థానాలలో ఉన్న పరిచితులకు ఎప్పటిలా ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి ఊదరగొట్టాడు. ఫలితంగా తవ్వకాల కొనసాగింపునకు అనధికారిక అనుమతి వచ్చింది. వెంటనే హిస్సాలిక్ కు తిరిగి వచ్చాడు. మార్చి 1నుంచీ పని ప్రారంభిస్తానని మిత్రులతో అన్నాడు కానీ, జనవరి 31 నాటికే పనిలోకి దిగిపోయాడు. ఉత్తరం నుంచి మంచుగాలులు వీస్తున్నాయి. గాలివానలు, చర్చి పండుగల బెడదకు అదనంగా ఊహించని మరో శత్రువు అతనికి ఎదురయ్యాడు. స్మిర్నాకు చెందిన ఒక వర్తకుడు లికొరిస్(liquorice) అనే ఒకరకం వేళ్ళను[మన దగ్గర ‘అతిమధురం’ అని పిలిచే ఈ వేళ్ళు దక్షిణ యూరప్ లోనూ, మన దేశంలోనూ, ఆసియాలోని మరికొన్ని ప్రాంతాలలోనూ దొరుకుతాయి] తవ్వితీయడం కోసం రోజుకు 12 నుంచి 23 పియాస్టర్ల కూలికి 150మంది గ్రామస్తులను పనిలోకి తీసుకున్నాడు. అది స్లీమన్ చెల్లించే కూలి కన్నా ఎక్కువ. నిశ్శబ్దంగా పళ్ళు నూరడం తప్ప అతను చేయగలిగిందేమీ లేకపోయింది. 1873, మార్చి 15న ఇలా రాసుకున్నాడు:

రాత్రిళ్ళు అతిశీతలంగా ఉంటున్నాయి. పొద్దుటిపూట ఉష్ణోగ్రత గడ్డకట్టే స్థాయికి పడిపోతోంది. కానీ పగలు మాత్రం ఎండ దహించేస్తోంది. తరచు ఉష్ణోగ్రత 72 సెంటీగ్రేడ్లకు చేరుతోంది. చెట్ల ఆకులు మాడిపోతున్నాయి. ట్రాయ్ మైదానాన్ని వసంత కుసుమాలు కప్పేస్తున్నాయి. గత పదిహేనురోజులుగా చుట్టుపక్కల ఆవల్లోంచి లక్షలాది కప్పల బెకబెకలు చెవులు చిల్లులు పొడుస్తున్నాయి. గత ఎనిమిదిరోజుల్లో గూడకొంగలు తిరిగొచ్చాయి. నేను తవ్వకాలు జరిపిన చోట గోడల రంధ్రాలలో లెక్కలేనన్ని గుడ్లగూబలు గూడు కట్టుకుని, ఈ అడవి బతుకును మరింత నరకం చేస్తున్నాయి. ఏదో మార్మికతతోపాటు భయంగొలిపే వాటి అరుపులు రాత్రిళ్ళు మరీ దుర్భరంగా ఉంటున్నాయి.

స్లీమన్ ఆ దిబ్బమీద రెండడుగుల మందంగల గోడలతో ఒక చిన్న రాతి ఇల్లు, ఒక చెక్క ఇల్లు కట్టించాడు. రాతి ఇంటిని ఓ మేస్త్రీకి ఇచ్చి చెక్క ఇంట్లో తను ఉంటున్నాడు. గోడ పగుళ్ళలోంచి గాలి చొరబడుతోంది. మార్చి చివరిలో ఓ రోజు అర్థరాత్రి మూడు గంటలకు అతనికి హఠాత్తుగా మెలకువచ్చింది. గదంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఒక గోడ అప్పటికే తగలబడుతోంది. ఆ పడకగదిలో ఒక మూల, చెక్క పలకల మీద రాతితో ఏర్పాటు చేసిన నిప్పుగూడు ఉంది. రవ్వ పడి చెక్క అంటుకున్నట్టుంది. ఉధృతంగా వీస్తున్న ఉత్తరపు గాలి దానికి తోడైంది. గట్టిగా కేకలు వేస్తూ సోఫియాను నిద్రలేపి బయటికి పంపించేశాడు. స్నానాలగదిలోంచి నీళ్ళు తెచ్చి తగలబడుతున్న గోడ మీద కుమ్మరించాడు. ఈ కలకలానికి మేలుకున్న మేస్త్రీ వచ్చి తట్టలతో మట్టి ఎత్తిపోస్తూ మంటలు ఆర్పడానికి సాయపడ్డాడు.

ఇదంతా పావు గంటలో జరిగిపోయింది. కానీ, తనకు మెలకువ రావడంలో కేవలం కొన్ని క్షణాలు ఆలస్యమైతే తన పుస్తకాలు, కాగితాలు, తను భద్రపరిచిన పురావస్తువులు ఏమైపోయేవో; మరీ ముఖ్యంగా సోఫియా ఏమైపోయేదో నన్న ఊహ కొన్ని రోజులపాటు అతన్ని వెంటాడి వణికించింది.

మరోసారి విసుగూ, అలసటా అతని మీద దాడి చేస్తున్నాయి. ఉత్తరపు గాలి అదేపనిగా వేధిస్తూనే ఉంది. చర్చి శ్రాద్ధదినాలు దినదిన గండంగా మారి సహనాన్ని పరీక్షిస్తూనే ఉన్నాయి. డబ్బు మంచినీళ్లలా ఖర్చైపోతోంది. ఇప్పటికీ రోజుకి 160 మందిని పనిలోకి దింపుతున్నాడు. నల్లని కుండలు, రాగితో చేసిన ఒక బల్లెపు పిడీ, మరికొన్ని బొంగరం ఆకారంలోని బొమ్మలు తప్ప విశేషంగా చెప్పుకోదగినవేవీ ఇప్పటికీ బయటపడడం లేదు. బయటపడినవి కూడా పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయాయి.

ఏప్రిల్ లో ఉత్తరపు గాలి ఉపశమించింది. మైదానమంతటా పసుపురంగు పువ్వులు పరచుకున్నాయి. ఇప్పుడు పనివాళ్లు మబ్బు విడిచిన ఆకాశం కింద ఆరుబయటే నిద్రపోగలుగుతున్నారు. స్లీమన్ ను కూడా తెలియని ప్రశాంతి ఆవహించింది. ఏదో అద్భుతాన్ని కనుక్కోబోతున్నాడన్న ఓ విచిత్రమైన స్ఫురణ అతనికి కలగడం ప్రారంభించింది. ఏప్రిల్ 16న, చప్టా చేసిన ఒక వీధీ, మనిషి ఎత్తున ఉన్న తొమ్మిది అతిపెద్ద మట్టి కూజాలూ బయటపడ్డాయి. అలాంటి కూజాలు అంతవరకూ ఎక్కడా వెలుగు చూడలేదు. అనంతర కాలంలో క్రీటు ద్వీపంలోని నోసస్ లో జరిగిన తవ్వకాల్లో మాత్రమే అలాంటివి బయటపడ్డాయి. స్లీమన్ లో ఉత్సాహం ఉరకలేసింది. ఆ తర్వాత, ఒకదాని కొకటి 20 అడుగుల ఎడమున్న రెండు ద్వారాలను కనుగొన్నాడు. వాటికి వెంటనే  ‘స్కెయిన్ గేట్’ అని పేరుపెట్టాడు. వాటి వెనక కనిపించిన ఓ పెద్ద భవనాన్నే ప్రియామ్ ప్రాసాదం అన్నాడు. అక్కడే మరికొన్ని కలశాలు, గుడ్లగూబ తలలూ కనిపించాయి.

స్లీమన్ సంతృప్తి చెందాడు. తన ఇన్నేళ్ల శ్రమా ఫలించబోతోందనీ, తను ఆశించిన వాటిని కనుక్కోబోతున్నాడనే నమ్మకం చిక్కింది. అంతవరకూ తను కనుక్కొన్నవాటిని వెల్లడి చేయబోతున్నట్టు ప్రకటించాడు. వాటిలో 200 చిత్రిత ఫలకాలు, 3500 చెక్కడాలు ఉన్నాయి. హిస్సాలిక్ లాంటి ఒక చిన్న దిబ్బ హోమర్ చిత్రించిన ట్రాయ్ అయ్యే అవకాశం లేదని జనం అనుకుంటారు, నిజమే. కానీ ఆ విశాలమైన ద్వారమూ, ప్రాసాదపు గోడలూ, సహజసిద్ధమైన రాళ్ళు పేర్చి నిర్మించిన దుర్గమూ, అసంఖ్యాకమైన నల్లమట్టి కుండల తాలూకు పెంకులూ, భారీ కూజాల్లాంటి పాత్రలూ,  వేల సంఖ్యలో ఉన్న కళాకృతులూ తను ట్రాయ్ ని కనుగొన్న సంగతిని రుజువు చేస్తున్నాయని స్లీమన్ భావించాడు.

అంతలో అతని ఉత్సాహంపై నీళ్ళు చల్లే వార్త…సోఫియా తండ్రి అవసానదశలో ఉన్నాడు. ఆమె వెంటనే బయలుదేరి ఎథెన్స్ కు వెళ్లింది. కానీ ఆమె వెళ్ళేటప్పటికే తండ్రి కన్ను మూశాడు. ఆ దిబ్బ మీద  ఇంట్లో స్లీమన్ ఒంటరిగా కూర్చుని భార్యకు ఓదార్పు లేఖ రాశాడు. అంత మార్దవం నిండిన లేఖ అతని మొత్తం లేఖలలోనే ఇంకొకటి లేదు:

అద్భుతవ్యక్తి అయిన మీ నాన్న దగ్గరికి మనందరం నేడో రేపో చేరేవాళ్ళమేనన్న సంగతిని గుర్తుచేసుకుని నిన్ను నువ్వు ఓదార్చుకోవాలి. మన ప్రియమైన కూతురికి తల్లి అవసరం ఎంతో ఉంటుందనీ, తల్లితోనే తన జీవితానందం అల్లుకుని ఉంటుందనీ అర్థం చేసుకుని నువ్వు ఓదార్పు పొందాలి. మన కన్నీళ్లు మీ నాన్నను తిరిగి తీసుకురాలేవనీ; ఎంతో ఉత్తముడూ, సాహసీ  అయిన మీ నాన్న ఈ జన్మ సంబంధమైన విచారాలకూ, తాపత్రయాలకూ దూరంగా; పరిశుద్ధమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడనీ; దుఃఖవిచారాలతో మగ్గుతూ ఈ భూమ్మీద మిగిలిపోయిన మనకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాడనీ గ్రహించి నువ్వు ఓదార్పు పొందాలి. అయినా నువ్వు దుఃఖాన్ని జయించలేకపోతే, అందుబాటులో ఉన్న మొదటి ఆవిరిబోటు అందుకుని నా దగ్గరికి వచ్చెయ్యి. నీ దుఃఖ నివారణకు నేను చేయగలిగినవన్నీ చేస్తాను. నువ్వు లేకుండా ఇక్కడ ఎలాంటి తవ్వకాలూ జరగవు. త్వరలోనే రమ్మని ఆనందబాష్పాలతో వేడుకుంటున్నాను.

కొన్ని రోజుల తర్వాత సోఫియా బయలుదేరి వచ్చేసింది. తన అవసరం ఎక్కడో ఆమెకు బాగా తెలుసు. తను లేనిదే అతను ఒంటరి అయిపోతాడు. అతని జీవితవిజయాలన్నిటికీ ఆమె పతాకచిహ్నం.

వేసవి అడుగుపెడుతోంది. పసుపు రంగు పువ్వులు మాడిపోతున్నాయి. త్వరలోనే మైదానమంతా దగ్ధభూమి కాబోతోంది. జూన్ మధ్యనాటికి తవ్వకాలు ఆపేయబోతున్నాననీ; భార్యనూ, కూతురినీ మధ్య యూరప్ లోని ఏదైనా విశ్రాంతి స్థలానికి తీసుకువెళ్లదలచుకున్నాననీ- మే 30న కొడుకు సెర్గీకి స్లీమన్ ఉత్తరం రాశాడు. గత నాలుగు నెలల పనీ తన కెంతో సంతృప్తి నిచ్చిందన్నాడు. తను ట్రాయ్ ప్రాకారాలను, ప్రియామ్ ప్రాసాదం ఉనికినీ కనిపెట్టాడు. 250,000 మీటర్ల మేరకు మట్టి తవ్వాడు. ఒక మ్యూజియం మొత్తానికి సరిపడినన్ని పురావస్తువులను సేకరించాడు…

అదే రోజున ఫ్రాంక్ కల్వర్ట్ కు కూడా ఉత్తరం రాశాడు. హిస్సాలిక్ కు కొన్ని గంటల ప్రయాణదూరంలో, బునర్ బషీకి దగ్గరలో, తింబ్రియా అనే చోట కల్వర్ట్ కు ఒక ఎస్టేట్ ఉంది. అతనికి స్లీమన్ రాసిన ఉత్తరం, కొడుక్కి రాసిన ఉత్తరానికి  పూర్తి భిన్నమైన శైలిలో సాగింది. అందులో ఒకవిధమైన భయమూ, వణకూ తొంగిచూస్తున్నాయి.  నాటకీయంగా ఉండి; తన ప్రగాఢమైన ఆశలతో, కలలతో సన్నిహితంగా పెనవేసుకున్న ఇలాంటి లేఖ అతని జీవితం మొత్తంలో ఇదే:

నామీద గట్టి నిఘా పెట్టారని మీకు తెలపడానికి విచారిస్తున్నాను. కారణం తెలియదు కానీ, ఆ టర్కిష్ కాపలాదారు నామీద అదేపనిగా మండిపడుతున్నాడు. రేపు అతను నా ఇంటిని సోదా చేయబోతున్నాడు. కనుక, సొతంత్రం తీసుకుని ఆరు బుట్టలూ, ఒక బస్తా మీ దగ్గర భద్రపరచడానికి పంపుతున్నాను. దయతో వాటిని మీ ఇంట్లో ఉంచి తాళం వేయవలసిందిగానూ, వాటిమీద టర్కుల చేయి ఏవిధంగానూ పడకుండా చూడవలసిందిగానూ వేడుకుంటున్నాను.

ఆ ఆరు బుట్టలలోనూ, బస్తాలోనూ ఉన్నవి ట్రాయ్ తవ్వకాలలో బయటపడిన స్వర్ణ నిక్షేపాలు!

Troy-jewellery-Istanbul-Archaeoloy-Museum-8051

ఈ నిక్షేపాలు కచ్చితంగా ఏ తేదీన బయటపడ్డాయో తన ప్రచురిత రచనల్లో స్లీమన్ ఎక్కడా వెల్లడించలేదు. స్థలమూ, సమయమూ మాత్రం తెలుస్తున్నాయి. ఉదయం 7 గంటలకు, ప్రియామ్ ప్రాసాదానికి దగ్గరలోని ఒక చుట్టుగోడ(circular wall)కు అడుగున, బాగా లోతైన చోట అవి దొరికాయి. కల్వర్ట్ కు ఉత్తరం రాసిన మే 30నో, లేదా అప్పటికి కొన్ని రోజుల ముందో స్లీమన్ కు అవి కనిపించి ఉంటాయి. తను నిక్షేపాలను కనుగొన్నాననీ, అయితే సమయం లేక వాటిని ఇంకా పరిశీలించడం, లెక్కించడం చేయలేదనీ మే 31న అతను మొదటిసారి తన నివేదికలో రాశాడు. అంటే, ఈ మాటలు రాయడానికి ముందే ఆ నిక్షేపాలను కల్వర్ట్ ఇంటికి తరలించి ఉంటాడు.

వేర్వేరు సమయాలలో రాసిన మూడు వేర్వేరు కథనాలను బట్టి, మే నెలలో విపరీతంగా ఎండ కాసే ఒకరోజున అతను ఈ నిక్షేపాలను కనిపెట్టాడని అర్థమవుతోంది. ఆరోజున మైదాన మంతటినీ తళతళలాడే పసుపురంగు ధూళి పొగలా కమ్మేసింది. అంతకు ఎనిమిదిరోజుల ముందు అతనికి ఒక భారీ వెండి కలశం కనిపించింది. దానిలోపల ఓ చిన్న వెండి చెంబు ఉంది. దానికి దగ్గరలోనే ఒక రాగి శిరస్త్రాణం ఉంది. అది ఛిద్రమైనా, లింగాకారంలోని దాని కొమ్ములు మాత్రం భద్రంగా ఉన్నాయి. ఆ చుట్టుపక్కల కచ్చితంగా మరికొన్ని నిక్షేపాలు కనబడతాయన్న అంచనాతో తవ్వకాలు కొనసాగించాడు.

పనివాళ్లను గుంపులు గుంపులుగా విడదీసి వేర్వేరు చోట్ల తవ్వకాలు జరపడానికి పంపించేశాడు. వాళ్ళు కందకాల్లోనూ, నడవల్లోనూ పనిచేసుకుంటూ ఉంటే, నిక్షేపాలను గుట్టు చప్పుడు కాకుండా దిబ్బ మీది తన ఇంటికి తరలించవచ్చని అతని ఆలోచన. ముఖ్యంగా ప్రభుత్వ ప్రతినిధి అమీన్ ఎఫెన్డీ ఆ సమీపంలో లేకుండా జాగ్రత్తపడాలనుకున్నాడు.

స్లీమన్, అతని భార్య, కొద్దిమంది పనివాళ్లు స్కేయిన్ గేటుకి దగ్గరలోని చుట్టుగోడ పొడవునా తవ్వకాలు జరుపుకుంటూ వెళ్లారు. 28 అడుగుల లోతున, విశేషమైన పనితనం కలిగిన ఒక రాగి పేటిక లాంటిది అతనికి కనిపించింది. పైన పేరుకుపోయిన దుమ్మును, ధూళిని పక్కకు తప్పిస్తూ చూసి, అది మూడడుగుల పొడవూ, 18 అంగుళాల ఎత్తూ ఉంటుందని అంచనా వేశాడు. ఆ పేటిక పైన శిరస్త్రాణం ఆకారంలోని రెండు వస్తువులు, ఒక భారీ దీపపు కుందె లాంటిది ఉన్నాయి. ఆ పేటిక బద్దలై ఉంది. అందులోంచి కొన్ని వెండి పాత్రలు తొంగి చూస్తున్నాయి. దానికి చుట్టుపక్కల నాలుగైదు అడుగుల మందాన ఎరుపు, గోధుమ రంగుల్లో ఉన్న దగ్ధశిథిలాలు ఉన్నాయి. అవి రాయంత కఠినంగా ఉన్నాయి. వాటికిపైన అయిదడుగుల వెడల్పు, ఇరవై అడుగుల ఎత్తు ఉన్న భారీ రక్షణకుడ్యాలు ఉన్నాయి.

ఎట్టకేలకు నిక్షేపాలను కనిపెట్టాననుకున్నాడు. టర్కుల చూపు పడకుండా వాటిని రక్షించడ మెలా అన్నది తక్షణ సమస్య. పనివాళ్లలో ఎవరూ పసిగట్టలేదు. సోఫియా అతని పక్కనే ఉంది. ఆమెవైపు తిరిగి, “నువ్వు వెంటనే వెళ్ళి ‘పైడోస్’ అని కేకపెట్టు” అని చెప్పాడు. పైడోస్ అనే ఆ గ్రీకు మాటకు సెలవుదినం అని అర్థం.

సోఫియా అప్పటికింకా నిక్షేపాలను గమనించలేదు. దాంతో ఆశ్చర్యపోయింది. “అదేమిటి, ఇంత హఠాత్తుగా?” అని అడిగింది. “అవును. ఇవాళ నా పుట్టినరోజనీ, ఇప్పుడే ఆ సంగతి గుర్తొచ్చిందనీ చెప్పు. పని చేయకపోయినా ఈరోజుకు పూర్తి వేతనం ఇస్తామని చెప్పు. అంతా ఊళ్ళకు వెళ్లిపోతారు. ఆ ఓవర్సీర్ ఇక్కడికి రాకుండా చూడు. త్వరగా వెళ్ళు. పైడోస్ అని కేకపెట్టు” అని స్లీమన్ ఆమెను తొందరపెట్టాడు.

 

సోఫియా చెక్క నిచ్చెన ఎక్కి, పైకి వెళ్ళి అతను చెప్పినట్టే చేసింది. సెలవుదినాలను ప్రకటించడం ప్రతిసారీ సోఫియా వంతు. వెంటనే పనివాళ్లు తవ్వకాలు ఆపేసి వెళ్లిపోవడం ప్రారంభించారు. అనుకోని విధంగా వేతనంతో సెలవు దొరికినందుకు సంతోషించినా, ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా హఠాత్తుగా సెలవు ప్రకటించలేదు కనుక కొంత అయోమయానికి గురయ్యారు. ప్రభుత్వ ప్రతినిధి అమీన్ ఎఫెన్డీ మరింత విస్తుపోయాడు. తనకు ముందుగా చెప్పకుండా ఇంత ఆకస్మికంగా ఎప్పుడూ సెలవు ప్రకటించలేదు.

(సశేషం)

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. కల్లూరి భాస్కరం says:

    స్లీమన్ కథ-21 కి దీనిని ఫుట్ నోట్ గా చదువుకోగలరు:
    “తీరా వెళ్ళాక, హిస్సాలిక్ దగ్గర నియమించిన కాపలాదారు పెద్ద పెద్ద రాళ్ళను చడీ చప్పుడు కాకుండా అమ్మేస్తున్న సంగతి బయటపడింది. సిప్లాక్ గ్రామంలో ఇళ్ల నిర్మాణానికి కొన్ని రాళ్ళు వాడుకున్నారు. ఎహ్నీ షెహర్ అనే ఒక క్రైస్తవ గ్రామంలో గంటగోపురం నిర్మించడానికి మరికొన్ని వాడుకున్నారు.”
    ఇది రాస్తున్నప్పుడు గార్డన్ చైల్డ్ హరప్పా గురించి రాసిన విషయం గుర్తొచ్చింది:
    “హరప్పా నగరంలో ప్రాకారానికి లోపలి ప్రాంతమే 1853 సంవత్సరంలో 21.2 చదరపు మైళ్లుగా అంచనా వేయబడింది. కానీ ప్రాకారానికి బయట కూడా భవనాలున్నాయి. ఈ శిథిలాల్లోని ఇటుకల్తో దాదాపు వందమైళ్ళ రైలుకట్ట పోశారు. ఐదు వేల జనాభా ఉన్న ఒక ఆధునికగ్రామాన్ని నిర్మించారు. ఇంత దుర్వినియోగం జరిగినా ఈ శిథిలాలు ఇంకా గొప్పగానే ఉన్నాయి.” (చరిత్రలో ఏం జరిగింది?-అనువాదం: వల్లంపాటి వెంకట సుబ్బయ్య)

మీ మాటలు

*