ఈ చిన్ని అద్దంలో కౌముది!

 

-కేక్యూబ్ వర్మ

~

 

varmaచిన్న అద్దంలో కొండని చూపించడం లాంటిదే కౌముది గారిని  చిరు వ్యాసంలో పరిచయం చేయడం! ఆయన కవి, కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు,అభ్యుదయ  రచయితల సంఘానికి క్రియాశీల కార్యవర్గ సభ్యుడు. ఖమ్మం జిల్లాలో అరసం  వ్యవస్థాపకుడు. కమ్యూనిస్టు  పార్టీ యువజన పత్రిక  “యువజన” కి సంపాదకుడు. “విశాలాంధ్ర” ఉద్యోగిగా జీవితం ప్రారంభించి, అధ్యాపకత్వంలో స్థిరపడ్డారు. అక్షరోద్యమ నేత గా  మారుమూల ప్రాంతాల్లో రాత్రనకా పగలనకా పర్యటించి, అక్షర సేవలో కన్ను మూసిన ఉద్యమ శీలి.  ప్రజానాట్య మండలిలో కొన్ని వందల స్టేజీ నాటకాలపై నటించిన ప్రజా నటుడు, గాయకుడు. ఇవన్నీ కాక, రచయితగా అనేక కథలూ, అనువాద రచనలూ అందించిన సృజన శీలి.

అలనాటి కమ్యూనిస్టు ఉద్యమాలతో కలిసి నడిచిన కార్యశీలిగా, ప్రజా నాట్యమండలి కళాకారునిగా ప్రాచీన కవిత్వం నుండి అత్యాధునిక కవిత్వం వరకు విశ్లేషించే సాహిత్య పిపాసిని ఈ కొద్ది మాటల్లో  పరిచయం చేయడం -కొండను అచ్చంగా అద్దంలో చూపడమే.

చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో సమకాలీన అంశాలను తన కవితలలో ప్రతిబింబిస్తూ వచన కవితా స్థాయిని ఏమాత్రం చెక్కుచెదరకుండా నిలిపి వుంచిన అక్షరశిల్పి కౌముది గారు. తన రచనా సమాహారం ’అల్విదా’ ముందుమాటలో ప్రముఖ కవి ఖాదర్ మొహియుద్దీన్ చెప్పినట్లు కౌముదిగారు కవీ, రచయితా, విమర్శకుడూ, తన యవ్వన దశని ప్రగతిశీల సాంస్కృతిక ఉద్యమానికి పరిపూర్ణంగా వెచ్చించిన సమరశీలి, ప్రతిభాశాలి. ఇంతకుమించి ఆయనకు ఎలాంటి విశేషణాలు అవసరం లేదు. కొందరి సాహితీ మూర్తిమత్వాలు ఏ విశేషణాలకూ అందవు. అటువంటి కొందరిలో ఒకరు కౌముది గారు అని అంటారు. ఇది నిఖార్సయిన నిజం. తన రచనలలోని సమరశీలత ప్రగతిశీల ధృక్పథం నేటికీ మనలను కట్టి పడేస్తాయి. ఆలోచనలను ఉర్రూతలూగిస్తాయి. రచనలలోని సమకాలీన రాజకీయ ప్రాంతీయ స్థల కాల విశ్లేషణలు నాటి సమాజాన్ని మన కనుల ముందు సాక్షాత్కరింప చేస్తాయి. ఉదాహరణకు బంగ్లాదేశ్ ఆవిర్భావం గురించి రాసిన ’ముక్తి వాహినీ విజయ్ కరే’ కవితలో

చెప్పు తల్లీ! చెప్పు మళ్ళీ

ఎందుకు పుట్టాడు దానవుడు

ఏ అపరాధం చేశాడని

వంగభూమిలో మానవుడు

 

నిద్రిస్తూన్న శిశువుమీద

నిండు చూలాలిమీద

మంచిమీద మానవత్వం మీద

అఘాయిత్యాల సంపుటి

అమ్మా! ఇది గుండె మీది కుంపటి!

….

 

మతాలు, గతానుగతికాలు

మనస్సును కుంచించే సంకుచితాలు కుత్సితాలు!

మానవతామృధ్జ్యోత్స్నావగాహుడైన మనిషికి

కానే కావు సమ్మతాలు

-అంటారు.

 

చలనశీలమైన సమాజంలో మార్పును కాంక్షించే అభ్యుదయ వాదిగా కౌముది గారు ’ఇలాగే వస్తుంది మార్పు’ కవితలో –

ఇలాగే వస్తుంది మార్పు

ప్రజలు వినిపించినప్పుడు తీర్పు

ఇలాగే వస్తుంది మార్పు

 

నగరాలు నినాదాలు యిస్తాయి

రాస్తాలు వూరేగింపులు తీస్తాయి

రేపటి వుదయానికి ఆకాశం

పంచరంగుల పోస్టర్లను ఆవిష్కరిస్తుంది

పిల్లగాలుల పత్రికా విలేకర్లు

ఈ వార్తను అందుకొని ఎగిరిపోతారు

దిక్కులు భేరీ భాంకృతుల్తో ఈ సత్యాన్ని ప్రకటిస్తాయి

-అని రేపటి మార్పుని ఓ గొప్ప ఆశావహ దృక్పథంతో ఆవిష్కరిస్తారు.

ప్రతీ కవితలో అన్నార్తుల అభాగ్యుల జీవన వేదనను చిత్రిస్తూ చివరిగా రేపటి తరంలోని మంచి మార్పును ఆశించి సాగిన కవిత్వం కౌముది గారిది. నాటి అభ్యుదయ భావజాలం నేటి సామాజిక స్థితికి కూడా దగ్గరగా వుండడం వారి రచనలలోని సజీవత్వానికి నిదర్శనం. ’ఉదయిస్తున్నాడు రేపటి రవి’ కవితలో

పాలులేక మరణించిన

పసిపాప సమాధిమీద

పాడె బట్ట నోచుకోని

పరమదరిద్రుడి శవం మీద

ఇరుకు బ్రతుకు, మురికి గుడిశ

ఆకటి, చీకటి, చిత్తడుల మీద

పచ్చ పచ్చగా వెలుతురు

పరుగెత్తుతూంది చూడు!

– అంటారు..

హరించిపోతున్న మానవత్వం కోసం పరితపించడం కౌముది గారి కవితలలో ప్రతి చోటా మనల్ని నిలువనీయదు. సూటిగా ప్రశ్నించడం తన కవితలలో ఓ గొప్ప లక్షణం. చాలా నిక్కచ్చిగా నిర్మొహమటంగా మనలోని సంకుచితత్వాన్ని మతతత్వాన్ని ప్రశ్నిస్తూనే రేపటి ఉషస్సుకోసం ఆరాటపడడం ప్రతి కవితలో ప్రస్ఫుటం. వెన్నెలను కలం పేరుగా మార్చుకున్నా తన రచనలలో మాత్రం అగ్నిశిఖలా వెలిగిపోవడం కౌముది గారి ప్రత్యేకత. చివరిగా మహాకవి, మహానాయకుడు మఖ్దూమ్ స్మృతిలో తను రాసిన కవితా పాదాలే తనకోసం ఉదహరిస్తూ ’అల్విదా’ తో ముగిస్తాను.

గీతశిల్పి వెళ్ళిపోయాడు

గీతం తెగిపోయింది

ఏ సంకేతమూ లేకుండా

ఎవ్వరికీ చెప్పకుండా

అనుకోకుండా తెగి

గాలిలో కరిగిపోయే నక్షత్రంలా

అకస్మాత్తుగా జారి

మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కలా

ఉన్నట్టుండి హఠాత్తుగా

సభ మధ్యలోంచి తలవంచుకొని

షాయర్ వెళ్ళిపోయాడు

ముషాయరా ఆరిపోయింది…

 

*

 

మీ మాటలు

  1. బ్రెయిన్ డెడ్ says:

    షాయర్ వెళ్ళిపోయాడు

    ముషాయరా మాత్రం సాగుతూనే ఉంటుంది మనందరిలో ఇలా . వెళ్ళిపోవడం బాధాకరమే కాని గుండెల్ని వెలిగించి వెళ్ళిన వాళ్ళు మనతోనే , జనంలోనే .

    చాల విషయాలు తెలుసుకున్నాను సర్ జీ థాంక్స్

  2. Koumudi gari jeevanayaanam spoorthidaayakam… johaarlu.

    • కెక్యూబ్ వర్మ says:

      స్పందించిన మీకు dhanyavaadaalu ప్రసూన గారు

  3. రెడ్డి రామకృష్ణ says:

    వర్మగారూ ,కౌముదిగారి గురించి వినటమే తప్ప వారి రచనలు చదవలేదు యింతవరకు ,మీ వ్యాసం మరికొంత పరిచయం చేసింది. బాగుంది .అభినందనలు

    • కెక్యూబ్ వర్మ says:

      Esaari మనం కలిసినప్పుడు మీకు ఓ కాపి ఇస్తాను సర్..ధన్యవాదాలు

  4. విష్వక్సేనుడు వినోద్ says:

    Good to know about him sir. well introduced and inspiration to young poets.

  5. కె.కె. రామయ్య says:

    “ఇప్పుడెందుకో ఒక్కో (యోధుడి) సమాధిని శుభ్రం చేయాలనుంది ” అన్న కెక్యూబ్ వర్మ గారు! నా చిరకాల కోరిక తీర్చారు.

    రచయితా, విమర్శకుడూ, తన యవ్వన దశని ప్రగతిశీల సాంస్కృతిక ఉద్యమానికి పరిపూర్ణంగా వెచ్చించిన సమరశీలి, ప్రతిభాశాలి, అక్షరశిల్పి, అక్షర సేవలో కన్ను మూసిన ఉద్యమ శీలి కౌముది ( షంషుద్దీన్ 1940 -1998 ) గారి గురించి ఇన్నాళ్ళూ తెలుసుకోని నేరభావన నుండి కొంత విముక్త భావన కలిగించారు.

    జనవరి 18న కౌముది గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించటం సందర్భోచితంగా ఉన్నది.

    కౌముది గారి “కల్యాణ మంజీరాలు” పుస్తకం వీక్షణం వేణు గారిని కాని, రిషీవ్యాలీ రాధ మండువ గారిని కాని అభ్యర్దించి సంపాదించి చదవాలని ఉంది. అలాగే కౌముది గారి రచనల సమగ్ర సంకలనాలు అచ్చులోకి తీసుకురావడానికి సంకల్పించిన ” కౌముది రచనల ప్రచురణల సమితి” ( గుర్రం సీతారాములు; Email: seetaramulu@gmail.com ) గురించిన వివరాలు తెలుసుకోవాలని ఉన్నది.

    మీ మాటల్లోనే ” వెలుగు దివ్వే కౌముది గారికి జోహార్లు “.

    • రామయ్య గారికి కౌముది గారి కళ్యాణ మంజీరాలు (కళంకిని – శిలప్పాధికారం మాతృక ) నా దగ్గర ఉంది కావాలి అంటే జీరాక్ష్ ఇస్తాను. ఇక పోతే కౌముది కవిత్వం ‘అల్విదా’ విశాలాంద్ర లో అందుబాటులో ఉంది. ఇంకా ఆయన రాసిన ‘విజయ’ నవల దొరకడం లేదు వెతికే పనిలో ఉన్నా. వేటపాలెం లైబ్రరీ లో దొరకొచ్చు. చానా విలువయిన సమీక్షలు, విమర్శనా వ్యాసాలూ, కవిత్వం ఇంకా మూడు నాలుగు పుస్తకాలు గా వేయగలిగినంత రాసి ఉంటారు. అయన ఒక అరుదయిన వ్యక్తి నేను ఎరిగిన గొప్ప పండితుడు. అడుగులకు మడుగులు వత్తే పనికి మాలిన వెధవల చెత్త అంతా పుస్తకాల అల్మారాలో ఉంది. అంత గొప్ప వ్యక్తి సాహిత్యం సమగ్రంగా తేలేక పోయినందుకు బాధగా ఉంది. నేను వ్యక్తిగత బాధ్యతగా అయన శిష్యుడు గా తప్పకుండా ఆ పని చేస్తా. ఇంకా పరిశోదన లోనే ఉండడం మూలంగా ఆ పని చేయలేక పోయా త్వరలో అన్నీ సేకరించి వచ్చే కనీసం వచ్చే వర్దంతి కల్లా అఫ్సర్ తో కలిసి ఈ పని పూర్తి చేస్తా

  6. రాధ మండువ says:

    కౌముది గారి గురించి విన్నాను కాని ఆయన గురించి మీరు చేసిన చిరుపరిచయంలో ఆయన గురించిన విషయాలు తెలిశాయి. ఆయనకి ఈ సందర్భంగా నివాళులు అర్పించుకుంటున్నాను.

  7. విజయ్ కోగంటి says:

    ఎంత కదిలించే కవిత్వం? నిజమైన కవిత్వానికి చిరునామా! చాలా బాగుంది. ధన్యవాదాలు.

  8. కె.కె. రామయ్య says:

    కౌముది గారి పట్ల ఆర్తితో స్పందించి వారి రచనలు లభించే వివరాలు తెలియజేసిన గుర్రం సీతారాములు గారూ, కృతజ్ఞతలు. కౌముది లాంటి ఓ అరుదైన విలువైన వ్యక్తిని ఎరిగున్న మీరు ధ్యన్యులు. మీ కృషి ద్వారా కౌముది రచనలు నలుగురికీ లభించాలని ఆశిస్తున్నాను.

Leave a Reply to విజయ్ కోగంటి Cancel reply

*