2015: కొత్త కలాల కథాకళి

      

( కథా సారంగ-2015 సమీక్ష )

~

chanduఅనంత గమ్యం వైపు సాగిపోతున్న మహా ప్రవాహం కాలం.  చాలా మంది  కాలం మనలో మార్పు తీసుకొస్తోందని… భావిస్తుంటాం. వాస్తవానికి మార్పును… కాలం తీసుకురాదు, మనమే మారుతుంటాం.
***

గడిచిన ఏడాది 2015 మన జీవితాలపై చాలా ప్రభావాన్ని చూపింది.  మన చుట్టూ తనదైన ముద్రలను ఎన్నో వదిలి వెళ్లింది. ఆర్థిక, రాజకీయ, సామాజిక కారణాల వల్లనే కాక సాహిత్య పరంగా కూడా గత సంవత్సరానికి ఓ విశిష్టత ఉంది. సాధారణంగా సాహిత్యం, సాహిత్య కారులు…రాజకీయ పాలనా అంశాలను ప్రభావితం చేసే సందర్భాలు చాలా తక్కువ. ఏ అవార్డులో, పురస్కారాల సందర్భంలో తప్ప… సాహిత్యం,  రచయితలు ప్రధాన వార్తా స్రవంతిలో ఉండడం చాలా అరుదు. అలాంటిది… గడచిన ఏడాదిని సృజనకారులే నడిపించారని చెప్పుకోవచ్చు. వివిధ రకాల అంశాలపై వారి స్పందన పట్ల…. విభిన్న రకాల అభిప్రాయాలున్నా కూడా, మొత్తానికి సృజన కారులు అప్రమత్తంగానే ఉన్నారన్న భావన ఎవరికైనా సంతోషాన్ని కలిగించేదే.  మన తెలుగు నాట కూడా ఇదే సందడి కొనసాగింది.  రకరకాల వాదనలు, చర్చలు, అభిప్రాయాలు, నిరసనలు…ఇలా 2015  వేగంగా గడిచిపోయింది.

వీటన్నింటిని నేపథ్యంగా తీసుకుంటూ సారంగ పత్రికలో గత ఏడాది కాలంలో వచ్చిన కథలను పరిశీలిస్తే… మనకు చాలా విషయాలు అవగతమవుతాయి.  గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకూ సంవత్సర కాలంలో యాభై మూడు పెద్ద కథలు, పందొమ్మిది చిన్న కథలు వచ్చాయి.  ఇవి కాకుండా  అనిల్-ఎస్-రాయల్  అనువాద కథ బ్రహ్మాండం,  అనురాధ నాదెళ్ల రాసిన గూడెం చెప్పిన కథలు లాంటి ఇతర కథలు కూడా వచ్చాయి. నామిని,  రామాచంద్రమౌళి లాంటి సీనియర్ కథకులు ఎప్పటిలాగే తమ కథాయజ్ఞాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.  అలాగే వెంకట్ సిద్ధారెడ్డి,  పింగళి చైతన్య, అల్లం ‌వంశీ, రేఖా జ్యోతి వంటి….చాలామంది  కొత్త రచయితలు వెలుగు చూడడం సంతోషకరం. పేరుకే కొత్త రచయితలైనా…వస్తువు ఎంపిక, శైలి, శిల్పం పరంగా మంచి పరిణతిని చూపిస్తున్నారు.

Artwork: Bhavani Phani

Artwork: Bhavani Phani

ఈ ఏడాది కథలన్నీ చదివిన తర్వాత…ముందుగా ఒకటి చెప్పాలి. “తెలుగు భాష త్వరలోనే అంతరించిపోతుందని” ప్రచారం చేసే వారికీ, “అవునా..?” అని భయపడేవారికి.  మరేం ఫర్వాలేదు,  తెలుగు భాషకే కాదు… తెలుగు కథకు కూడా ఇప్పట్లో ఏ ప్రమాదమూ లేదని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు.

ముద్రణా పత్రికల కథలతో పోలిస్తే…, సారంగలాంటి అంతర్జాల పత్రికల కథలకు కొన్ని తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. రకరకాల కారణాలతో దినపత్రికలు లేదా ఇతర వార పత్రికలు  కొన్ని రకాల ఇతివృత్తాలను అంగీకరించలేని పరిస్థితి. పైగా ఎంత కాదన్నా అక్కడ సీనియర్ కథకులు, పేరు మోసిన వారి కథలకే ప్రాధాన్యం ఎక్కువగా ఉంటోంది. ఎప్పడో తప్ప కొత్త రచయితల కథలు రావు. ఇందుకు ఇతర కారణాలూ ఉండొచ్చు.  ఆ రకంగా ఆన్ లైన్ పత్రికల కథల్లో కొత్త రక్తం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటోంది.  దాంతోపాటూ ఏ తరహా ఇతివృత్తానికైనా ఆన్ లైన్ పత్రికలు కొంత వెసులు బాటు ఇవ్వడం కూడా కొత్త దనం కనిపించడానికి కారణమవుతోంది. అలా కథా సారంగ ద్వారా పాఠకులకు చాలా కొత్త కలాలు పరిచయమయ్యాయి.

ఆ రకంగా వస్తున్న కొత్త తరంలో విభిన్న ఇతివృత్తాల ఎంపిక,  శైలి శిల్ప పరంగా సరికొత్త ప్రయోగాలు చేస్తూ కొందరు కొత్త పుంతలు తొక్కుతున్నారు. అప్పటికే చాలామంది రాసిన ఇతివృత్తాలని కూడా…. మూలాల్లోకి వెళ్ళి అన్వేషించి కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నారు. కొన్ని కథలైతే..అనుభవజ్ఞులైన రచయితలకూ తీసిపోని విధంగా ఉన్నాయి.

ఐతే ఇదంతా ఒకవైపే. మరో వైపు ఊహాజనిత సమస్యలు,  కృత్రిమ ఇతివృత్తాలు సృష్టించిన వాళ్లూ ఉన్నారు.  తమ సొంత గొడవలనే కథల పేరుతో దేశం మీదికి ప్రయోగించిన వాళ్లూ లేకపోలేదు.  కొన్ని కథలైతే డైరీలో దినచర్యను తలపించినవి కూడా లేకపోలేదు.  అయినా కూడా  కథలు రాయాలన్న తపనతో… ఓ అడుగు ముందుకు వేసినందుకు వీరినీ భుజం తట్టాల్సిందే. చిన్న చిన్న లోపాలున్నా… కొత్త కథకులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వారినీ పరిగణనలోకి తీసుకుంటున్న సారంగ సంపాదకులనూ అభినందించాల్సిందే.

చాలా మంది కొత్త రచయితలు  తమకు ఎదురైన సాధారాణ సంఘటనలనే కథలుగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. కథలు రాసే కొత్తల్లో ఏ రచయితలకుండే ఆవేశం, అత్యుత్సాహం వల్ల… కనిపించే ప్రతీ ఘటననూ కథలుగా రాయాలనుకుంటారు. పొద్దున సిటీ బస్సులో సీటు దొరక్క పోవడం నుంచీ…రాత్రికి సీరియల్ లో లేడీ విలన్ ప్రవర్తన  దాకా…కనిపించే ప్రతీ ఘటనను కథలుగా సంధించాలనుకుంటారు. అది మంచిదే. కథలు రాయాలన్న తపన అభినందనీయమే కానీ ప్రతీ అనుభవమూ కథ కాదని తెలుసుకోవాలి.  కథకు సంబంధించిన కొన్ని మౌలిక లక్షణాలపై  కొత్త రచయితలు మరింతగా అధ్యయనం చేయాలి. కవితకు సరిపోయే తక్షణ భావావేశం… కథగా మారినపుడు మాత్రం సంతృప్తి పరచదు.

అలాగే  కొత్త రచయితలే కాక…సీనియర్లు కూడా దృష్టి కోణంలో వ్యక్తిగత జీవిత పరిధిని దాటలేక పోతున్నారు. తమకు తెలిసిందే రాయాలన్నదే మంచి నిర్ణయమే ఐనా కేవలం తమ కతలే….కథలు కాబోవని కూడా గుర్తించాల్సి ఉంది.   సృజనకారులకు వ్యక్తి గత జీవితం, వ్యక్తిగత బాధ్యతలే కాదు… సాంఘిక జీవితం, సామూహిక బాధ్యతా ఉంటాయి.  తమ వ్యక్తిగత దృక్కోణంలోంచే కాకుండా….సమాజ కోణంలోంచి కూడా  అంశాలను తప్పక పరిశీలించాలి.

artwork: Srujan

artwork: Srujan

ఇక ఇక్కడ లోతుగా చర్చించాల్సిన విషయమూ ఇంకొకటి ఉంది. మాండలికం కథల గురించి.  ఏదీ మాండలికం..? ఏదీ యాస…? ఏదీ గ్రామ్యం…ఏది వ్యవహారం…? అంటూ ప్రశ్నించాల్సిన అవసరమూ ఉంది. ఎందుకంటే కొందరు మాండలికం పేరుతో….కేవలం గ్రామ్యం రాస్తున్నారు.  నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు కొన్ని పదాల ఉచ్ఛారణను తమకు అనుగుణంగా మార్చుకున్న వాటినే మాండలికం అనుకుంటున్నారు. కథకు తగిన విధంగా, పాత్రకు అనుగుణంగా  ఏభాష వాడినా అభ్యంతరం ఉండదు. కానీ ఓ పక్క గ్రామ్యం రాస్తూ….మళ్లీ మధ్య మధ్యలో  సంస్కృత భూయిష్ట సమాసాలు, ఆంగ్ల భాష పదాలు రాయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి…?

కొంచెం ఇష్టం కొంచె కష్టం అన్నట్లుగా….కొంచెం కథ రాసి, ఇంకొంచెం కవిత్వం కలిపి రాసిన వాళ్లూ ఉన్నారు.  తెలుగు కథల్లో వస్తున్న ఓ ఆధునిక పరిణామంగా దీన్ని చూడాల్సి ఉంటుంది.     అలాగే  ఒక సున్నిత సమస్యను తీసుకొని …దాన్ని వ్యతిరేకించేవారు కూడా అద్భుతం అని మెచ్చుకునేలా రాసిన కథలూ ఉన్నాయి.  వెంకట్ సిద్దారెడ్డి సోల్ సర్కస్ కథ, పింగళి చైతన్య -తనదే ఆకాశం, అల్లం వంశీ మిరకిల్…ఎండ్లూరి మానస అదే ప్రేమ..కథలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎంచుకున్న ఇతివృత్తాలు వివాదాస్పద అంశాలైనా…చెప్పిన కోణం, ఒప్పించిన తీరుతో పాఠకుల్ని ఆకట్టుకున్నాయి.

రైతు ఆత్మహత్యలు, కొత్త రాజధాని కోసం భూ-సేకరణ, కరువు, వివేక్, శృతి ఎన్ కౌంటర్… లాంటి అంశాలు గత ఏడాది తెలుగునాట తీవ్రంగా చర్చకు వచ్చాయి. కానీ ఈ కథల్లో అలాంటివేమీ కనపడవు. రైతు ఆత్మహత్యలు, భూ సేకరణ మీద మాత్రం ఒక్కో కథ వచ్చాయి.  అంటే సామాజిక సమస్యలు రచయితలను స్పందింప జేయలేకపోయాయా..? లేదా రచయితలు స్పందించలేకపోయారా..?

వివాహేతర సంబంధాల పట్ల ఆసక్తి, స్వలింగ సంపర్కుల  సమస్యలు వంటి సున్నిత అంశాలపైన కూడా స్పందిస్తున్న మన కథకులు … సామాజిక సంక్షోభాల్ని, సమాజాన్ని కుదిపేస్తున్న తీవ్ర పరిణామాలను మాత్రం ఎలా పక్కకు పెట్టగలుగుతున్నారు…?  ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్నారా అన్న సందేహమూ కలుగుతుంది…?
ఇలా రకరకాల అభిప్రాయాలకు తావిస్తున్న కథా సారంగ కథలను వివరంగా చర్చిద్దాం.

                                      (మిగతా వచ్చే వారం)

మీ మాటలు

  1. కృష్ణ చైతన్య అల్లం says:

    “””” ఇక ఇక్కడ లోతుగా చర్చించాల్సిన విషయమూ ఇంకొకటి ఉంది. మాండలికం కథల గురించి. ఏదీ మాండలికం..? ఏదీ యాస…? ఏదీ గ్రామ్యం…ఏది వ్యవహారం…? అంటూ ప్రశ్నించాల్సిన అవసరమూ ఉంది. ఎందుకంటే కొందరు మాండలికం పేరుతో….కేవలం గ్రామ్యం రాస్తున్నారు. నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు కొన్ని పదాల ఉచ్ఛారణను తమకు అనుగుణంగా మార్చుకున్న వాటినే మాండలికం అనుకుంటున్నారు. కథకు తగిన విధంగా, పాత్రకు అనుగుణంగా ఏభాష వాడినా అభ్యంతరం ఉండదు. కానీ ఓ పక్క గ్రామ్యం రాస్తూ….మళ్లీ మధ్య మధ్యలో సంస్కృత భూయిష్ట సమాసాలు, ఆంగ్ల భాష పదాలు రాయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి…? “”””
    ===============
    బేసిక్ గా నా అసొంటి గ్రామీణుడు ఇంగ్లీష్ మాట్లాడద్దు అంటరు. మంచిగుంది.
    అక్షరాస్యులు కాంగనే సొంత భాష మార్సుకోని తెచ్చి పెట్టుకున్న తెలుగు మాట్లాడాలె, రాయాలె అంటరు. మంచిగుంది.

    తెలంగాణా ఎం ఆర్ ఐ లని చూసిన్లా ఎవలనన్న. ఎట్ల మాట్లాడుతరు? సొంత భాష మీద ఇంసెక్యూర్ ఫీల్ అయి భాష మార్చుకునే సూడో తెలంగాణా వాదులు కాదు. గుండెల నిండ అస్తిత్వం నింపుకున్న తెలంగాణ బిడ్డల గురించి. మిలియనీర్లు, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టినోల్లు కూడా అచ్చమైన గ్రామీణ భాష మాట్లాడుతరు, వాళ్ళు గ్రామీణ ప్రాంత కుటుంబం నుండి వచ్చినోల్లయితే.
    లేదా గ్రామీణ ప్రాంతం వాడు అసలు కథకుడే అయి ఉండే అవకాశం లేదనా?

    పోనీ నేను చెప్పన్నా తప్పు ఎక్కడ జరిగిందో?
    తప్పు మీది కాదు. తెలంగాణం కావచ్చు, సీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు. గ్రామీణ భాష సదవనీకి, సూడనీకి ఎబ్బెట్టుగా అనిపించేటట్టు మార్చబడ్డది. సినిమాలు, కొందరు రచయితల భావ దారిద్ర్యం వల్ల ఈ భాషలు, యాసలు నిరక్షరాస్యులకూ, అర్భకులకూ మాత్రమె చెందే వాటిగా చూపబడినై. సూటు, బూటు ఎస్కుని కోట్లు సంపాదించే మనిషిని సగటు గ్రామీణ భాష మాట్లాడే వానిగా సూన్నీకి మనసు ఒప్పుకోదు. ఇంక వాడు ఇంగ్లీష్ కూడా మాట్లాడితే ఇంకా ఎబ్బెట్టుగ అనిపిస్తది. నేను అసొంటి మనుషులని నిజ జీవితంల కోకొల్లలు సూశిన. వాళ్ళు కళలకు, కలాలకు అనర్హులు అని ఎవడో తెలుగు సినిమా మనిషి సూపెడితే అదే భావ దారిద్ర్యం అందరిలోపల పేర్కపోయింది.
    —–
    కోపంగ/తో రాస్తలేను. పెర్స్పెక్టివ్ మారాలె అని.. అంతే.
    పద్మ భూషణ్ కాళోజీ నారాయణ రావు గారు చెప్పినట్టు, “ఎవని భాషల వాడు మాట్లాడాలె. ఎవని భాషల వాడు రాయాలె”
    ——–
    గమనిక: పైన రాసిందంత సగటు తెలుగు సినిమా మల్లేష్ యాదవ్, పాత బస్తీ రౌడీ, లేదా చిల్లర వేణు మాధవ్ గొంతుల సదవద్దని మనవి. నాదెళ్ళ సత్య చెప్పిండు అనుకోని సడువున్లి. పర్స్పెక్టివ్ చేంజ్ అయితది. ఏమంటరు?

  2. విలాసాగరం రవీందర్ says:

    ఎవని భాషల వాడు మాట్లాడాలె. ఎవని భాషల వాడు రాయాలె”
    ——–

    అద్దం ముందు నిలబడితే మన వీపు కన్పస్తది
    విమర్శ అలాటిదే

    • కృష్ణ చైతన్య అల్లం says:

      రవీందర్, సినిమాలు పంచిన, పెంచిన భావ దారిద్ర్యం, కొన్ని రకాల రచనా శైలులకు మాత్రమె అలవాటు పడ్డ భావనా రాహిత్యం గురించి చెప్పిన. బహుశా నా గ్రామ్యం మీకు అర్ధం కాలే కావచ్చు. :)
      చెప్పింది మొత్తం అదిలేశి విమర్శ స్వీకరించలేని ప్రతిస్పందనగా నా కామెంట్ని చూశిన మీ మేదోశక్తి అమోఘం.

      సొంత అస్తిస్త్వాలు బావుటాలు ఎగురేస్తున్న కాలం ఇది. మీకు భాష రాదన్నఅహంకారపు రోజులు పోయినై. కొత్త రచనా శైలిలు అస్తుంటై. పర్స్పెక్టివ్స్ మారాలె.
      చిన్న కేస్ స్టడీ:
      “వర్షం కుండపోతగా కురుస్తున్నది” , “పొట్టు పొట్టు వాన పడ్తాంది”
      మొదటిది మంచిగుంది కదా. రెండోది గలీస్ అనిపిస్తుంది కదా. రెండో వాక్యంల సౌందర్యం చూడలేని వాళ్లకు కొత్త కళ్ళు, తెరిచి ఉంచాల్సిన మనసులు కావాలె.

  3. విశ్లేషణ బాగుంది. రోగి డాక్టర్ దగ్గరికి పొతే రోగం కుదురుతుంది, కథకుడు సమస్య దగ్గరికెళితే రచన పండుతుంది.భాషదేముంది, వద్దన్నా వెంబడ స్తది.

  4. తహిరో says:

    ” కొత్త కాలాల కథాకళి ” సారంగ 2015 లో వచ్చిన కథలు చదివి , విశ్లేషించడానికి శ్రీ చందు తులసి గారు “కథాకళి ” ఆడినట్టు ఉన్నారు. బాగుంది. కొత్త రచయితల రచనలను ఆకళింపు చేసుకొని, భుజం తట్టి వారు మరిన్ని కథలు రాయడానికి ప్రోస్తాహం ఇచ్చినట్టు ఉంది. భవిష్యత్తులో తెలుగు కథ చిరంజీవిగా వర్దిల్లునని జ్యోసమ్ పలకడం మరింత సంతోషం కలిగింది – తథాస్తు !

  5. Allam Vamshi says:

    ఇంత ఓపిగ్గా, ఆసక్తితో కథలూ కలాల గురించి ఇంత వివరంగా సమీక్ష రాస్తున్నందుకు చందు తులసి అన్న కు మనస్పూర్తిగా క్రుతఙ్ఞతలు.. చాన సంతోషం.. :)
    కని కథల కంటెంట్ ను పక్కన పారేశి భాష, యాస గురించి విమర్శో సమీక్షో రాషుడు అనవసరమైన పని అని నా ఫీలింగ్.. ఎవరికి నచ్చినట్టు వాల్లు రాస్తరు, ఇంకోని భాష యాస ను విమర్షించే హక్కు మనకు లేదు కద! అండ్ అఫ్ కోర్స్ మీరు రాసిన సమిక్షలో మీ అభిప్రాయాన్ని చెప్పకుండా ఆపె హక్కు నాక్ సుత లేదనుకోండి, కని నాకైతె యాస గురించి రివ్యూ లు చుసినప్పుడల్ల మస్తు గమ్మత్ అనిపిస్తది :)
    సరే అదంత కాదుగని, ఆల్ ద్ బెస్ట్ అన్నా, మీ చర్చ మస్తు మంచిగ ఉంటదని ఆశించుకుంట.. మల్లొకసారి తాంక్స్ :)

  6. Allam Vamshi says:

    “వెచ్చని టీ తాగుతూ, పుస్తకం చదువుకోవడం” కంటే నాకు “గరం గరం చాయ్ తాగుకుంట బుక్కు సదూకునుడే” మస్తనిపిస్తది!
    నాకట్లనే ఇష్టం.. అది గ్రాంధికమ, గ్రామ్యమా, హిందీ, ఇంగ్లీషు, తెలుగు కలిశిపుట్టిన కొత్త భాషనా నాకెర్కలేదు.. కని నాకట్లనే ఇష్టం! దీని గురించి ఇంకొకరు సమీక్షో విమర్శో చేసి ఇది ఇట్ల ఉండద్దు అట్ల ఉండాలే అని భాష గురించి కొత్త రాజ్యాంగం రాశే ప్రయత్నం ఏదైనా చేస్తే మాత్రం నేన్ మస్తు నవ్వుకుంట… :)
    నేనేం చందు తులసి అన్న సమీక్షను విమర్శిస్తలేనూ & ఇట్ల రాయి అట్ల రాయి అని అన్నకు సలహా బీ ఇస్తలేను. నా ఫీలింగు చెప్తున్నా అంతే :)

  7. సరే యాస ల లొల్లి పక్కకువెడ్తె, కథల సబ్జెక్టుల గురించీ, ఆ కలాల బలాల గురించీ, అవి ఎంతమందికి చదువరులకు మంచిగ రీచ్ అయినయ్..ఇంక ఏం రాస్తె ఇంకింత మంచిగ రీచ్ ఐతయ్! ఇసొంటి ముచ్చట్ల గురించి మీరు చెయ్యబోయే మాంచి చర్చ కోసం మస్తు ఎదురుచూస్తూ.. మీకు మళ్లొక్కసారి థాంక్స్… :)

  8. ఎ కె ప్రభాకర్ says:

    వంశీ చెప్పే దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తా. ఎవరి భాషలో వాళ్లను రాసుకోనివ్వండి. ఆంక్షలతో ఇప్పటివరకు జరిగిన నష్టం చాలు. కథ అందులోని వస్తువు నేపధ్యం భాషని నిర్ధారిస్తాయి.
    వార్షిక సమీక్షకు చందు తులసి వేసుకున్న బేస్ బాగుంది – భాషా యాస – మాండలికం విషయాలు పక్కనపెడితే.
    కథల సమీక్షకు ఎదురుచూస్తూ…

  9. >> “కథకు తగిన విధంగా, పాత్రకు అనుగుణంగా ఏభాష వాడినా అభ్యంతరం ఉండదు. కానీ ఓ పక్క గ్రామ్యం రాస్తూ….మళ్లీ మధ్య మధ్యలో సంస్కృత భూయిష్ట సమాసాలు, ఆంగ్ల భాష పదాలు రాయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి…?”

    వ్యాసకర్త చెప్పినదాంట్లో మాండలికంలో కథలు రాయొద్దనే అర్ధమేమీ ధ్వనించటంలేదే. ఆయన అనని మాటలపై ఇన్ని వ్యాఖ్యలా!?!

    • కృష్ణ చైతన్య అల్లం says:

      అనీల్, ఆయన మాండలికంల కథలు రాయద్దని అన్నరని అనలె.
      ఏది నిరక్షరాస్యుల భాష? ఏది పండితుల భాష? ఏది ఆంగ్ల భాష? ఏది గ్రామ్యం? ఏది గ్రాన్దీకం? చదివేటప్పుడూ రాశేటప్పుడూ పాత్రల మీద నీ నా అభిప్రాయాలు వేరే ఉంటై. పాత్రలు, స్వభావాల మీద ఒక్కోల్లకీ ఒక్కో అభిప్రాయం ఉంటది అని చెప్పే ప్రయత్నం అంతే.

  10. Allam Vamshi says:

    “బాంకు పాస్ బుక్కులు ఏడవెట్టిన్నో మతికత్తలేదు”
    “టీవీ రిమోటు, షెల్లు పోను గిప్పుడే తనబ్బిల ఓరకు వెట్టిన”
    “అమిరిక నుంచి మీ అన్నగాడు కంపూటర్ల ముచ్చటవెడ్తాండ”
    “లో కరెంటచ్చి మోటర ఖరాబైంది,లైటు బుగ్గలు మాడిపేనయ్”
    “చికిన్ కూరకు పొద్దటికల్లుకు పొత్తు మంచిగుంటది”
    “ఆయిటివూనింది స్కూటరు తియ్యకు బాంచెన్, అటేంక తిప్పలవడ్తవు నాయినా తొవ్వపొంటి రోడ్డుమీన అన్ని పొక్కలే!”
    “గంగ తానం పోదాం కారు తీత్తవా”
    “టీవీ ల గా తెలంగాణ చానెలు వెట్టు”
    “ఈసారి కేశీయారు గెలుత్తడా?”

    ఇయన్ని మా 97 యేండ్ల తాత మాట్లాడే మాటలు.. ఆయినె 97 యేండ్లు పల్లెటూరిలోనే ఉన్న 100% తెలంగాణా నిరక్షరాశ్యుడైన ఒక చానా మాములూ మనిషి..
    మరిప్పుదు నాకు మా తాత గురించి రాయబుద్దైతె ఇంకేం పదాలు వాడి మిమ్ముల తృప్తి పర్చాలె?
    ఏఎ మాటలను ఇట్ల కాకుంట ఇంకెట్ల రాయాలె?? 97 యేండ్లు పల్లెటూరిలో పుట్టిపెరిగిన మనిషి మాట్లడిన భాషకంటె ఇంక “గ్రామ్యం” ఏముంటదో అనిల్ ఎస్ రాయల్ గారు కానీ ఇంకెవరైనా గానీ అర్థంచేయించ మనవి :)

  11. మధు says:

    మన దేశం లో గ్రామానికో మాండలికం అన్నట్లున్నాయి. అందరూ తలా ఓ మాండలికంలో కథలు రాసుకుంటూ పోతే రాసుకున్న వాళ్లకి, వాళ్ల చుట్టుపక్కల వారికీ తప్ప మిగతా వాళ్లకి రస స్ఫూర్తి కలగడం కష్టం. ఉదాహరణకి ఎక్కడో రంగూన్ లోసెటిలై వున్న తెలుగువాడు రెండు దశాబ్దాల క్రితం ఇక్కడ వాడుకలో వుండే భాషని ఇంట్లో వాడుతున్నానుకదాని, ఇపుడు కథలో వాడితే ఎలా వుంటుంది? గుడి గోడలమీదుండే శ్రీ కృష్ణదేవరాయలవారి శాసనాల్లా ఎంతమందికి అర్ధమౌతుంది? కొత్తగా తెలుగు నేర్చే వారు ఎన్నితెలుగులు నేర్చు కోవాలి? తనది కాని మాండలీకం లోని వస్తువుని నిఘంటువు చూసుకుంటూ ఎంతమంది చదువుతారు? ఇంగ్లీష్ లోనూ పుస్తకాలు అన్నీ, మండలీకాల్లో వుంటే మనం ఎన్నని చదవగలం? భాష ఏదైనా బహుళ ప్రాచుర్యంలో పది కాలాలు మనగలగాలంటే ప్రామాణికత తప్పనిసరి. కథా, భాషే ఎందుకు? ఏదైనా సరే..

  12. వారి వారి మాండలికాలలో కథలు వ్రాయగలిగామనే సంత్రుప్తి , వారి భాషను [ మాండలికాన్ని ] కాపాడుకోగలిగామనే ఆనందం వారికి వుండనివ్వండి . చదివి అర్థం చేసుకోగలిగే వాళ్ళు చేసుకుంటారు . అంతకంటే వారికి ఎక్కువ ప్రచారం [నా వుద్దేశం పాఠకులని ] అక్కరలేదనుకుంటాను , కథావస్తువు ఎంత గొప్పదైనా !

  13. “ వివాహేతర సంబంధాలపట్ల ఆసక్తి , స్వలింగ సంపర్కుల సమస్యలు వంటి సున్నిత అంశాలపైన కూడా స్పందిస్తున్న మన కథకులు …… సామాజిక సంక్షోభాల్ని , సమాజాన్ని కుదిపేస్తున్న తీవ్ర పరిణామాలను మాత్రం ఎలా పక్కకు పెట్టగలుగుతున్నారు ? ” — Simple . మీరంటున్న సంక్షోభాల గురించి కథలల్లితే వారిని కమ్యూనిష్టులుగానో , తీవ్రవాదులుగానో ముద్ర వేస్తారు , తరువాత జరిగే పరిణామాలకు తట్టుకోవాలి !
    అందుకే సమాజంలో ఏ ఒక్క సమూహానికో సంబంధించిన అంశాలపై , వాటిపట్ల సామాన్య ప్రజలకు అంతగా ఆసక్తి లేకపోయినా , కథలల్లి , కథకులుగా గుర్తింపు పొందుతారు . వాటిపైన స్పందించేవారు ఎలాగూ వుంటారు !!

  14. రాధ మండువ says:

    బావుందండీ, నాకు కూడా ఈ మాండలికం గురించి చాలా సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు భాషలో చాలా మార్పులు వచ్చేశాయి కదా, పెద్దవాళ్ళు మాట్లాడిన మాటలు పిల్లలు మాట్లాడటం లేదు. అలాగే చిత్తూరు జిల్లాలోనే అనేక చోట్ల కొన్ని కొన్ని పదాలు మారిపోతుంటాయి. అయితే అనిల్ ఎస్ రాయల్ అంటున్నట్లుగా మాండలికంలో రాసేప్పుడు ఒక ప్రాంతపు భాషని మరో ప్రాంతపు భాషతో కలపకుండా ఒకే రకమైన భాషని వాడటం చేస్తే చాలేమో కదా! మంచి వ్యాసం అభినందనలు

    • రాధ మండువ says:

      సారీ అనిల్ గారు అంటున్నట్లు కాదు చందు తులసి గారన్నట్లు. ( “మీరన్నట్లు” – అని చదువుకోండి చందు తులసి గారూ :) )

  15. విజయ్ కోగంటి says:

    చందు తులసి గారూ విశ్లేషణ బాగుంది. ఇలా ఒక సంవత్సరం లో వచ్చిన కధలను విశ్లేషించడమనేది ఒక మంచి ఆలోచన. అభినందనలు.

  16. అసలు సమీక్ష కోసం ఎదురుచూస్తూ…

మీ మాటలు

*