సాయింత్రం సూరీడు

 

mandira

Art: Mandira Bhaduri

 

మొయిద శ్రీనివాసరావు

~

Moida

నేనో చిత్రకారుడిని

గీసిన నా గత చిత్రాలను చూసి చూసి

మనసున కాసింత ఉక్కబోసి

సరికొత్త సజీవ చిత్రంతో

తిరిగి ఊపిరి పీల్చుకోవాలని

కుంచే… కాన్వాసుతో

తుమ్మచెట్టు నీడలా వున్న

ఓ ఊరి చివర కూర్చున్నాను

సాయింత్రం సూరీడు… చెరువులో

ముఖం కడుక్కుంటున్న సమయం

పగలంతా కాసిన ఎండను

కుప్పపోసినట్టుగా వున్న గడ్డివాములు

మునపటి వరిచేల యవ్వనాన్ని

పచ్చగా పొదువుకున్న మొక్కజొన్న చేలు

ఎన్ని తుపాను పాములకు

ఎదురొడ్డి నిలిచాయో గాని

వలసపోయిన పక్షులకు

గుర్తుగా మిగిలిన గిజిగాడి గూళ్ళు

పొద్దంతా పొలంలో తిరిగిన పని తూనీగను

సాయింత్రానికి అవసరాల తొండ మింగేసింది

మిగిలిన కాసింత వెలుగు ముక్కలాంటి

గొర్రెల వీపుపై

బతుకును కోల్పోయిన కత్తెర పిట్టొకటి

ముక్కల ముక్కలగా

రాత్రి పాటను పాడుతుంది

చుట్టూ మంచుతెర కమ్ముకొస్తూ

ఓ అసంపూర్ణ జీవన చిత్రం

నా చేతిలో మిగిలినప్పుడు

‘ఏటి సూస్తున్నావు నాయినా…’ అంటూ

రేపటి మొలకకై

రోజంతా మట్టిబెడ్డల్లో పడి ఇంకుతున్న

చెమట చుక్కలాంటి ఒకామె నన్నడిగింది

మరుక్షణమే నా మదిలో

ఓ సంపూర్ణ సజీవ చిత్రం నిలిచింది.

* * *

మీ మాటలు

  1. చక్కని పల్లె జీవన వర్ణన.అక్కడక్కడా మొయిద ముద్రలు. బాగుంది.

  2. విలాసాగరం రవీందర్ says:

    బాగుంది పోయెం

  3. Nellimarla srinivas says:

    Thank you mandarapu bhaduri garu for giving the beautiful picture to my poem

  4. Nellimarla srinivas says:

    Thank you narsan garu and ravindar garu

  5. పల్లె సజీవ చిత్రం.. అభినందనలు మిత్రమా..

  6. రెడ్డి రామకృష్ణ says:

    శ్రీను కవిత బాగుంది .ఒక దృశ్యాన్ని పాథకుల మున్దుంచావు .పోలికలు బాగున్నాయి .కొత్తగా గ్రామాన్ని గురించీ చెప్పాలని ప్రయత్నం చేసావ్ , అభినందనలు

    • Nellimarla srinivas says:

      రామకృష్ణ గారు మీరన్నది నిజం గ్రామం గూర్చి కొత్తగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. ధన్యవాదాలు

Leave a Reply to B.Narsan Cancel reply

*