మరణాన్ని మరణానికివ్వండి..  

Art: Rafi Haque

Art: Rafi Haque

   శ్రీరామోజు హరగోపాల్

~

haragopal

ఒక కవి ఈ రోడ్డున్నే

మరణిస్తున్నాడు

ఎట్లా బడితే అట్లా చస్తానన్న

కవిని ఏం చేసుకుంటాం

అతనికి కుంతలజలపాతంలో కూడా

ఐస్ నెత్తుటినీరే

అతనికి ప్రియురాలిపిలుపు కూడా

చైనాహైడ్రోజన్ బాంబులాగే

మరణాన్ని కలవరించి వరించే మహాకవికి

మహాప్రస్థానం కానుక

అన్నింట్లో అగ్నిని చూసే రుగ్వేదపురోహితునికి

అగ్ని మీళే పురోహితమ్

మానవులంతా శవాలుగా కనిపించే

అజ్ఞాతకవికి శ్మశాన వైరాగ్యమే  గిఫ్ట్

ప్రేమలు దోమలు,ఇష్టాలు కనిష్టాలు

ఆత్మీయతలు బ్రోకరిజాలు తనకు

చావునే చావనీయకుండ చంపుతున్న మహాకవీ,శవీ,రోగీ

మా చావు మేం చస్తాం, నీకెందుకు కుతర్క కుతూహలం

పొద్దున్నే పొద్దుని చూడలేని ధృతరాష్ట్రుని కోసం

ఏ గాంధారీ గంతలు కట్టుకోదు

కొంచెం మనిషిని చూడు

వాడిలో ఔన్నత్యం చూడు

అల్పత్వాలు జయించడానికి అతని ఆరాటం చూడు

మూర్ఖత్వం వొదులుకోవడానికి అతని జ్ఞానతృష్ణ చూడు

మానవత్వం పెంచడానికి మనుషుల్ని కాదు చంపేది

మనుషుల్ని మనుషులుగా బతికించే పరుసవేది కవిత్వం

నిర్లజ్జగా వీధుల్లో వీరంగం వేసేది కాదు

దిగంబరంగా సత్యాల్ని ఆవిష్కరించేది

స్ట్రిప్ టీజ్ సినిమాలకు పనికొస్తది

అర్థంపర్థంలేని డైలాగులక్కడే అమ్ముకోవచ్చు

మనుషుల్ని భయోద్విగ్నుల్ని చేయడం కాదు

అసహ్యాలు కల్పించి ట్రేడ్ మార్క్ కొట్టేయడమా

మరణాన్ని మరణానికివ్వండి

ప్రళయాలను ప్రళయాలకివ్వండి

మాటల్ని కాల్చినసీకుల్ని చెయ్యడం కాదు

ఇంకా మంచిచూపుల్ని కళ్ళకు పంచాలి

కవిత్వానికి కొంచెం గౌరవం పెంచాలి

మరణమే నీ వరణమైతే, ఆమెన్

*

మీ మాటలు

  1. చొప్ప వీరభధ్రప్ప says:

    శ్రీ రా మోజు హరిగోపాల్గారి మరణాన్ని. మరణానికివ్వండి. చదివి నాను. కవిత్వం నాకు తెలియదు. అర్థం చూచి నా ను .ఆయన కవిత్వ వైఖరి, ఆధునిక కవితారీతిని గూర్చి మారని కవుల భావజాలాన్ని ,వారి మనస్థత్వాన్ని ,తనధోరనులను వివరించారు. మార్పులు కాలాన్నిబట్టి సహజం.బహుజనామోదమయితే ఆమోదించితీరాలి.కొందరు మారరు .మేమింతే ఈ రోడ్డులోనే నడుస్తాం ఇక్కడే చస్తాం అన్నట్లుంటారు..ఆనాడెప్పుడో పాండవులు చీరలు ధరించి సభకు వచ్చి నా రట. ఈ నాడు చీరలు ఆడవారు ధరించే వాటికి వాడుక. ఇప్పటికి ఇట్టే అంటే ఎట్లా.మారాలి.లేకుంటే నవ్వుకుంటారు. కవిత్వంలోను అంతే. సమాసభూయిష్టంగా గ్రాంధిక భాషలో వ్రాస్తే చదివే వాళ్ళు కావాలి గదా. భాష మాత్రమే గాదు భావాలు మారాలంటారు.ఆ భావాలు కూడా మానవత్వం వైపు వారి అభ్యున్నతి కోరేవైపు ,ఛైతన్యం చేసేవిధంగా కవిత్వం వుండాలంటారు. ధృతరాష్రుడుగుడ్డి రాజు వెలుగు (జ్ఞానం) చూడలేడు.గా ంధారి కండ్లకు గుడ్డ గట్టింది.అజ్ఞానిని అనుసరించడం సబబా అని ప్రశ్నించారు.? అంటే మానవాభ్యుదయం ఆత్మీయతవైపు చూడమంటారు. అభ్యుదయం చూడలేని వారికి మహాప్రస్థన పుస్తకమిచ్చినా మార్పురాదు.అట్టి వారు శ్మశాన వైరాగ్యం.అగ్ని మీలే పురోహిత్యం పాతదంతాపవిత్రమైన దిగాదు .కొత్తది ఎందుకు చుడలేకపోతారని చూడమంటారు. శ్రీ శ్రీ మహాకవిని గుర్తు చేసుకొని. పదండి ముందుకు …అట్లాకదలని వారి కవిత్వం మరణానికి మరణమే ఫ్రళయానికి ప్రళయమే. వ్యర్థం అంటారు.మానవసౌభ్రతృత్వం కోరనిది .ఉపయోగం లేనిది కవిత్వం కాదు. ఇంకా అధ్బుతంగా తపనతో చెప్పారు. కొంగ్రొత్త వెలుగు దారులెవరు చూపినా పయనించాల్సిందే. వారు పెట్టిన చుక్కకు దిశానిర్దేశ శక్తి నాకు లేదు .ఒక చిన్ని కిరణాన్ని చూచి ముందు ంకున్నా.

Leave a Reply to చొప్ప వీరభధ్రప్ప Cancel reply

*