స్మితా పాటిల్: వెలిగి నిలిచిన రూపం…

 

 

ల.లి.త.

~

 

    ల.లి.త.

మట్టిప్రమిదలో వెలిగిన దీపం ఆమె. చుట్టుగుడిసె ముందు పెట్టిన మట్టిప్రమిదలోని దీపానికి ఉన్న ఆకర్షణకి ఏది సాటి? నూనెదీపం చీకటి అసల్లేనేలేదనే భ్రాంతి కలిగించదు. చీకట్లని చిన్నగా చెదరగొడుతూ వెచ్చటి కాంతిని పరుస్తుంది. గాలేస్తే వణుకుతుంది. చినుకు మీదపడబోతే ఆరినంతపని చేస్తుంది. నూనె సరిగ్గా అందకపోతే కొడిగడుతుంది. ఎక్కువ అందితే పెద్ద జ్వాలవుతుంది. భ్రమించిన రెక్కలపురుగుల్ని చుట్టూ తిప్పుకుంటుంది. పంచభూతాలనీ పరవశించి మరీ నశిస్తుంది.

‘స్మితాపాటిల్’ అనుకోగానే అందంగా గాఢంగా వెలిగే మట్టిదీపం, మెత్తటి నాగేటి చాలు, ఆషాఢపు జల్లుకు తడిసిన నేలవాసనా, బలమైన సరుగుడు చువ్వా గుర్తొస్తాయి. స్మిత జీవితం పుస్తకంగా వస్తే బాగుండుననిపించేది. ఇన్నాళ్ళకి వచ్చేసింది. స్మిత జీవితంలోని ఒక్క మలుపునీ మెరుపునీ కూడా వదిలిపెట్టకుండా మైథిలీ రావు “Smitha Patil, A brief Incandescence” ను ఎంతో ప్రేమతోనూ ఇష్టంతోనూ రాసింది.  స్మిత జీవితఝరిని తమ జ్ఞాపకాల దోసిళ్ళలోంచి ఆమె తల్లీ, ఆమె స్నేహాన్ని ఎప్పటికీ మరచిపోలేని స్నేహితులూ అందిస్తే  మైథిలీరావు ఆ గంగను అందరికీ పంచింది.

ఒక్క పన్నెండేళ్ళే. అంతకంటే ఎక్కువ లేదు స్మితాపాటిల్ సినిమాల్లో నటించిన కాలం. 1955లో పుట్టిన ఈ నల్లటి బక్కపిల్ల న్యూ వేవ్ సినిమాని వెలిగిస్తుందని ఎవరూ ఊహించలేదు. తల్లి విద్యాతాయి నర్స్ గా పనిచేసింది. సంఘసేవిక కూడా. తండ్రి శివాజీరావు పాటిల్ రాజకీయాల్లో ఉండేవాడు. ఇద్దరూ తమ కులమేమిటో పిల్లలకు చెప్పకుండా పెంచిన ఆదర్శవాదులు. అందరికీ ఉపయోగపడటమే జీవితం అనుకున్నవాళ్ళు.  వాళ్ళ ముగ్గురాడపిల్లల్నీ రాష్ట్రీయ సేవాదళ్ అనే గాంధీవాద సంస్థలో చిన్నప్పుడే చేర్పించారు. దానితో వాళ్లకి కులమతభేదాలు లేకుండా అందరూ సమానమే అనుకోవటం చేతనయింది. చిన్న స్మిత tomboy లా తిరుగుతూ మగపిల్లలతో వాలీబాల్ ఆడుతూ, వాళ్ళని తిడుతూ తిరిగేదట.

సినిమాల్లోకి వస్తానని స్మిత ఎప్పుడూ అనుకోలేదు.  దూరదర్శన్లో మరాఠీ న్యూస్ ప్రెజెంటర్ గా స్మితను రోడ్డుమీద టీవీ షాప్ లో చూసిన అరుణ్ ఖోప్కర్ తన ఇరవై నిముషాల FTII డిప్లొమా ఫిల్మ్ “తీవ్ర మధ్యమ్ (1974)” లో ఆమెకు మొదటి అవకాశం ఇచ్చాడు. బహుమతులతోపాటు మంచిపేరు కూడా వచ్చిన డిప్లొమా ఫిల్మ్ అది.  అందులో తాన్పురా పట్టుకుని నిశ్చలంగా నిర్మలంగా ఉన్న స్మిత రూపాన్ని షబానా అజ్మీతో సహా చాలామంది కళ్ళు ఫోటో తీసుకున్నాయి.  కామెరా ఆమెతో ప్రేమలో పడిపోవటం అక్కడే మొదలైందంటారు మైథిలీ రావు.

తరువాత శ్యాంబెనగల్ ‘చరణ్ దాస్ చోర్’ లో చిన్న వేషమిచ్చాడు. ఇక వరుసగా జబ్బార్ పటేల్, బెనెగల్, ముజఫర్ అలీ, మృణాల్ సేన్ ఇంకా న్యూ వేవ్ సినిమా మహామహులందరికీ స్మితాపాటిల్ ముద్దుబిడ్డయిపోయింది. 70, 80 ల్లో దేశమంతటా పరమచెత్త అని ఏకాలంలోనైనా ఎవరైనా చెప్పగల సినిమాలు వచ్చేవి. మరోపక్క సత్యజిత్ రాయ్ నీ, ఫ్రెంచ్ న్యూ వేవ్ నూ, రిత్విక్ ఘటక్ నూ అనుసరిస్తూ సినిమా అంటే ఒట్టి కలే కాదు మన బతుక్కూడా కావచ్చని చెప్పేవీ,  సినిమాకి ‘కళా’యిపూత పెడితే మెరుస్తుందని కూడా చెప్పేవీ కొన్ని సినిమాలు వచ్చేవి. 90ల నుండీ ప్రపంచవ్యాపారంతో మనం ఏకమవటం మొదలెట్టాక ‘న్యూ వేవ్ సినిమా’ సారంలోనూ రూపంలోనూ అరుదై, పూర్తిగా నశించింది.

స్మితాపాటిల్ దశావతారాలు గా 10 సినిమాలను ఎన్నుకుంది మైథిలీ రావు. అవి మంథన్, జైత్ రే జైత్ (మరాఠీ), భూమిక, అకాలేర్ సంధానే(బెంగాలీ), చక్ర, ఉంబర్తా(మరాఠీ)/సుబా(హిందీ), అర్థ్, బాజార్, తరంగ్, ఆఖిర్ క్యూఁ.  వీటిలో ఒక్క ‘అర్థ్’ మాత్రం పూర్తిగా షబానా అజ్మీ సినిమా.  తను షబానా పక్కన చిన్నగీత అవుతానని తెలిసీ స్మిత అందులో వెయ్యటం గొప్పధైర్యంతో చేసిన పని. సాటి స్త్రీ సంసారాన్ని పాడుచేసిన(?) రెండో స్త్రీగా అప్పటి సమాజం ఏ మాత్రం సానుభూతికి చోటివ్వని బలహీనమైన పాత్ర.  ఆ బలహీనురాలి  split personality ని తను ఎంతబాగా చూపించగలదో తెలియచెప్పడానికే స్మిత ‘అర్థ్’ లో చేసి ఉండొచ్చు. ఏదయినా చేసెయ్యగలనన్న ధైర్యం తనకుండేది. (‘ఇజాజత్’ లో అనూరాధా పటేల్ వేసిన neurotic other woman ను చూస్తే ‘అర్థ్’ లో స్మిత నటనలోని పస తెలుస్తుంది).

smita1

చిన్న వూరినుంచి వచ్చి (అప్పటి పూణేకు ఇప్పటంత నాజూకుతనం లేదు. పైగా స్మిత చదివింది కాన్వెంట్ లలో కాదు) సినిమాల్లో నిలదొక్కుకోవటమే కష్టంగా ఉన్న స్మితకు షబానాఅజ్మీతో పోటీ పెద్ద బాధ అయిపోయింది.  ఉప్పూ నిప్పూలాంటివాళ్ళు ఇద్దరూ. షబానాలో మనసుకంటే బుద్ధి ఎక్కువగా పనిచేస్తుంది. స్మిత సరిగ్గా ఆమెకు వ్యతిరేకం. పైగా తమ ఇద్దరి నటనకీ పోలిక తేలేని ‘అర్థ్’ లాంటి సినిమాలో పోలిక తెచ్చి,  స్మిత రెండో నాయికగానే పనికొస్తుందని షబానా అనటం ఆమెను మండించింది.  ‘అర్థ్’ లో స్మిత నటనను ఆమె దశావతారాల్లో ఒకటని చెప్పి   మైథిలీరావు షబానామీద sweet revenge తీసుకున్నారు.

‘చక్ర’, ‘మంథన్’ లాంటి సినిమాల్లో ఊరిని ఒంటినిండా నింపుకున్న స్మితను చూశాక,  తనకు బైక్ నీ  కార్లనీ   వేగంగా నడపటం ఇష్టమనీ, ఎప్పుడూ జీన్స్ లోనే ఉండేదనీ తెలుసుకోవటం ఆశ్చర్యంగా ఉంటుంది. ఫోటోలు కూడా చక్కగా తీసేదట. దూరదర్శన్లో వార్తలు చదివేటప్పుడు జీన్స్ మీదే మంచి నూలుచీరలు కప్పుకుని చదివేసేదట. స్టార్ కి ఉండాల్సిన లక్షణాలు అసల్లేవని దిలీప్ కుమార్, రాఖీ మూతులు విరిచారట. చిన్నప్పటి రాష్ట్రీయ సేవాదళ్ స్నేహితుడు తరువాత జూనియర్ ఆర్టిస్టుగా కనిపిస్తే అంత మందిలోనూ స్నేహంగా వాటేసుకుని అతన్ని ఇబ్బందిలో పెట్టేసిందట. అల్లరిస్మితనీ,  సాయం చెయ్యటానికి ఎప్పుడూ ముందుకురికే స్మితనీ ఎంతో ఇష్టంగా గుర్తు చేసుకున్నారు స్నేహితులు. ‘అకాలేర్ సంధానే’ సినిమా చేస్తున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా సర్దుకుపోతూ, అందరూ మాంసం, చేపల్తో భోజనం లాగిస్తుంటే, వంటమనిషినడిగి ఓమూల స్టవ్ మీద తను అన్నం, కూరగాయలు వండుకు తినేదట. కరువు ప్రాంతంలోని పేద రైతుకూలీగా ఆమెను తప్ప వేరెవరినీ ఊహించలేనని ధ్రితిమాన్ చటర్జీ (నటుడు) చెప్పాడు. “ఆమెలో పల్లెటూరి అమ్మాయిల ఒంటికదలికల్లాంటి ఒక లయ ఉంటుంది.. మిరపకాయకో రుచీ వాసనా ప్రత్యేకంగా ఉన్నట్టే  స్మిత వ్యక్తిత్వానికి ప్రత్యేకత ఉంటుంది”  అంటాడు అరుణ్ ఖోప్కర్.

ఈ వజ్రాన్ని మెరుగు పెట్టినవాడు శ్యాంబెనెగల్.  మరాఠీనటి హంసావాడ్కర్  జీవితం ఆధారంగా తీసిన “భూమిక’ లో చేసేనాటికి స్మిత వయస్సు ఇరవై ఒక్కేళ్ళు. ఇంకా జీవితమే తెలీని ఆవయసులో,  మొగుడితో బాధలు, ముగ్గురు మగవాళ్ళతో ప్రేమలు, నటన, నాట్యం, పాట … ఇలా ఎన్నో అలజడులున్న హంసా వాడ్కర్  పూర్తి జీవితంలోని ప్రతివొక్క షేడ్ నీ చూపెట్టేస్తుంది స్మిత.  తను మిగతావారిలా NSDలోగానీ  FTIIలో గానీ నటనలో శిక్షణ తీసుకోలేదు. అయినా పుణేలోని FTII  లో స్నేహితులతో తిరుగుతూ ఎప్పుడూ కనిపిస్తూ ఉండటంవల్ల  FTII లో చదువుతోందేమో అనుకునేవారట. నిజానికి శ్యాం బెనెగలే స్మితకు గురువు. ఏదైనా ఇట్టే పట్టేసే చురుకుతనం ఆమె జీవలక్షణం.  సంతోషమొస్తే చిన్నపిల్లలా కీచుగొంతుతో నవ్వే స్మితనవ్వును హస్కీగా తీర్చి, ‘గుండెలోంచి మాట్లాడు’ అని చెప్పి ఆమె ‘నిండుగొంతుక’ను బైటకు తెచ్చాడట శ్యాం బెనెగల్.

స్మిత అందం కూడా వేరే.  నలుపురంగు. ఎదుటివాళ్ళని నిలబెట్టేసే సాంద్రమైన కళ్ళు.  పక్కనుంచి చూస్తే చెక్కిన శిల్పంలాంటి మొహం, పొడవైన మెడా, ‘సన్నగా ఉన్నానని నా శక్తిని తక్కువ అంచనా వెయ్యకండ’ని హెచ్చరించే దృఢమైన చెక్కిళ్ళూ, నిండు పెదవులూ, చువ్వలా నిటారుగావుండే ఆకారం .. ఇవీ స్మితంటే. పెద్దగా ఆరోగ్యవంతురాలు కాదు. ఏ కోణంలోనుంచి చిత్రీకరించినా ఆమె అందంగానే ఉంటుందంటాడు గోవింద్ నిహలానీ.  నిజానికి మరీ అందం ఉట్టిపడే ఐశ్వర్యా రాయ్ లాంటి నటుల్ని చూస్తూ, నటన కంటే మనం వాళ్ళ అందాన్ని ఎక్కువ ఆస్వాదిస్తూ ఉండిపోతాం. స్మిత ఫోటోజనిక్ మొహంలోంచి సినిమాపాత్ర వ్యక్తిత్వం, బలం, బలహీనతా అన్నీ ముందుకు వస్తాయి. గాఢమైనకళ్ళతో మాట్లాడే మనదేశపు ఆడవాళ్ళ sensuality ని  స్మితాపాటిల్ తో ఎంతబాగా చూపించవచ్చో అర్థమయింది ఆర్ట్ హౌస్ సినిమా దర్శకులకు. ‘భూమిక’, ‘మంథన్’ (శ్యాం బెనెగల్), ‘ఉంబర్తా’ (జబ్బార్ పటేల్), ‘చిదంబరం’ (అరవిందన్), ‘తరంగ్’ (కుమార్ సహానీ) సినిమాలు ఆమె స్త్రీత్వానికి హారతిచ్చేశాయ్. ‘నమక్ హలాల్ ’ లో ‘ఆజ్ రపట్ జాయేతో హమే నా ఉఠయ్యో’ అంటూ స్మిత, అమితాబ్ బచ్చన్లతో ప్రకాష్ మెహ్రా  చేయించిన వానపాటలో ఆమె ఆడతనం చిన్నబోయింది.  ఆ పాట చేశాక స్మిత బాగా ఏడిస్తే  అమితాబ్ తనని ఎదగమని(?!!) సలహా యిచ్చి ఓదార్చేడట. ‘ఉంబర్తా’ లాంటి స్త్రీవాద చిత్రాన్నీ ‘నమక్ హలాల్’ లాంటి పక్కా కమర్షియల్ సినిమానీ  ఒకేసారి చేసిందట. పదిరోజులు ‘ఉంబర్తా’ షూటింగ్ చేస్తే మరో పదిరోజులు ‘నమక్ హలాల్’.  నటిగా ఆమెది ఎంత స్కిజోఫ్రెనిక్ బ్రతుకో  చెప్పటానికి ఇది చాలంటాడు జబ్బార్ పటేల్. వ్యాపార, సమాంతర చిత్రాల్లో దేనికెలా చెయ్యాలో సరిగ్గా అర్థం చేసుకునే తెలివి ఉంది కాబట్టే అంతబాగానూ రెండిట్లోనూ నెగ్గిందని ఓంపురి అంటాడు.

 

‘చక్ర’ సినిమాలో ఆమె చేసిన స్నానంసీను పెద్దపోస్టరైపోయి  అంతటా కనిపించటం స్మితను బాధించింది. నిజానికి ఆ దృశ్యం ఉద్దేశ్యం మురికివాడల్లో ఉండేవాళ్ళ జీవితంలో దేనికీ ఏకాంతం దొరకదని చూపించటమే. అక్కడ ఆడవాళ్ళు బైట పంపు దగ్గర స్నానం చెయ్యటం చాలాసహజం. ఇప్పుడా సీన్ పెద్దవిషయం కాకపోవచ్చు గానీ 80ల్లో సాహసమే.   స్మిత గట్టినిజాయితీతో  ‘చక్ర’ లో ‘అమ్మ’ పాత్రకున్న బలాన్నీ  ధైర్యాన్నీ చూపిస్తూ  ఆ సినిమాలోని ‘voyeurism’ ను దాటి నిలవగలిగిందని మైథిలీ రావు అంటారు.

smita4

వ్యాపార చిత్రాల్లో చేస్తే స్టార్ డమ్ వస్తుంది కాబట్టి ఆ ఆకర్షణతో తను చేసే సమాంతర సినిమాలకు ఎక్కువమంది జనం వస్తారనీ, అలా సమాంతర సినిమాను గెలిపించాలన్న ఆలోచనతోటే వ్యాపార చిత్రాలు చేస్తున్నాననీ  స్మిత చెప్పేది. అలా అనుకుంటూ చెత్త సినిమాలు కూడా చేసేసింది. వాటిలో ‘ఆఖిర్ క్యూఁ’ తప్ప చెప్పుకోదగ్గది లేదు. అయినా వాటిలో ఆమె ఎంత నిజాయితీగా చేసిందో వివరిస్తూ ఆ సినిమాకథలు కొన్ని రాసుకొచ్చింది  మైథిలీరావు . విసుగనిపించినా స్మితాపాటిల్ చేసిన ప్రతి పాత్రనూ ఆవిడ వర్ణించటం వల్ల సమాంతర, వ్యాపార చిత్రాలు ఎంత భీకరమైన తేడాలతో ఉండేవో బాగా అర్థం అవుతుంది.  ప్రతి దృశ్యంలోనూ ఆమె నటనను వర్ణిస్తూ మోహంలో పడిపోతారు మైథిలి.  నిజానికి స్మితను ఎప్పుడూ కలవనేలేదట ఆవిడ.

స్మితాపాటిల్ అంటే గాఢత (intensity) కు నిర్వచనం అంటారు ప్రతి ఒక్కరూ.  “తనే పాత్రగా మారిపోయి లీనం కావటం స్మిత పధ్ధతి కాదు. దర్శకుడికి తనలోని నటిని పూర్తిగా అప్పచెప్పి ఆమె మనసుకు తోచినట్టు నటిస్తుంది. లోపలున్న intensity  ఆమె వేసే పాత్రల మనసు మూలాల్లోకి  ప్రవహిస్తుంది. అందువల్ల చెత్త సినిమాల్లో కూడా ఆమె చేసినపాత్రల ఉద్వేగాలు మనల్ని నమ్మిస్తాయి.  స్మితలాంటి గొప్ప నటులు నటనలో చాతుర్యాన్ని కూడా దాటేసి ఆ సినిమాలు మన జ్ఞాపకాల్లో భాగమైపోయాక కూడా ఎప్పటికీ మనల్ని తాకుతూనే ఉంటార”ని బంగారంలాంటి మాటంది మైథిలీ రావు.

స్మితాపాటిల్  తను నటిస్తున్న పాత్రలు ఎలాటిచోట పుట్టేయో ఎలా నడిచి ఎలా నవ్వి  ఎలా మాట్లాడి  బతుకుతాయో, ఎలాటి బట్టల్లో కనిపిస్తాయో లోతుగా తెలుసుకుంటుందని, ఆలాంటి కుతూహలం అందరిలోనూ ఉండదనీ ‘అనుగ్రహం’ సినిమాకి పనిచేసిన ఆరుద్ర అనేవాడు.

స్మిత తల్లి విద్యాతాయి గట్టిగా కర్రపట్టుకుని పిల్లలను పెంచింది. ఆవిడతో ఎంత ఘర్షణ పడ్డా తల్లే స్మితకు రోల్ మోడల్. ‘ఉంబర్తా’లో సంఘసేవికగా వేస్తున్నప్పుడు ప్రతి నిముషం అమ్మను గుర్తుచేసుకుంటూ నటించిందట. ‘ఉంబర్తా’ కథ విన్నాక జబ్బార్ పటేల్ తో ‘ఈ సినిమా నాదే. ఇంకెవరినైనా తీసుకుంటే నిన్ను చంపేస్తా’నందట. రాజ్ బబ్బర్ తో స్మిత పెళ్లిని విద్యాతాయి ఒప్పుకోలేకపోయింది. బిడ్డను దూరం చేసుకుంది. స్మిత తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు ఫిల్మ్ జర్నలిస్టులు తీవ్రంగా విమర్శించారు. ఒక్క స్నేహితులే వ్యక్తిగా ఆమె నిర్ణయాన్ని గౌరవించారు. “సమాంతర సినిమాకి  పోస్టర్ గర్ల్ లాంటి  స్మితాపాటిల్, నిజజీవితంలో పెళ్ళయి ఇద్దరు పిల్లలున్నవాడిని  ప్రేమించటాన్ని ఆమె వ్యక్తిత్వంలో భాగంగా సమాజం చూడలేకపోయింద”ని చెప్తాడు మహేష్ భట్. స్మితాపాటిల్ లో కూడా ‘అర్థ్’ లో ఆమె వేసిన పాత్రలోని వైరుధ్యం లాంటిదే ఉందంటాడు. స్మిత చిన్నప్పటినుంచీ తాననుకున్నదే చేసేదట. ‘తను బొహీమియన్’ అంటాడు ఓం పురి. ఓరాత్రి  అందరు స్నేహితులూ కలిసి మాట్లాడుకుంటూ ఓ గదిలో ఉండగా ఓంపురి ఒక్కడినీ బైటకు తీసుకుపోయి నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా ఆవరణలో కాసేపు కూర్చుని మాట్లాడిందట. “ఆమెను చూసి ఐదు నిముషాల్లోనే  ప్రేమలో పడని మగవాళ్ళు ఉండరు. ఆమెతో మాట్లాడిన ప్రతివాడూ తననే ప్రేమిస్తోందనీ అనుకుంటాడు. తన ఉద్దేశ్యం అదికాదని ఆమె స్పష్టం చేశాక ఒడ్డునవేసిన చేపలా గిలగిలా కొట్టుకుంటాడు” అంటాడు మోహన్ అగాషే.

రాజ్ బబ్బర్ తో తన పెళ్ళిని అందరూ ఒప్పుకోవాలని అనుకోవటం ఆమె అమాయకత్వం.  పసుపు కుంకుమలూ, పేరంటాలకు విలువిచ్చేదనీ, సీమంతం కోసం ఆరాటపడిందనీ చెప్తుంది మైథిలీరావు కథనం. తను సహచరులుగా ఎన్నుకున్న మగవాళ్ళు కూడా ఆమెకు తగనివాళ్ళే.  “మగవాళ్ళకు నాతో బతకటం చాలా కష్టం. నన్ను నేను ఎంతగా ఇచ్చుకుంటానో అంతగానూ నావాడి నుండి తీసుకోవాలనుకుంటాను. అంత ఆదర్శంగా పరిస్థితి లేద”ని చెప్పిందట స్మిత. గంగమ్మలాంటి స్మితను మోయగల నిబ్బరం ఉన్న శివుడు ఆమె సర్కిల్లో దొరకటం అంత అసాధ్యమేమీ కాదనిపిస్తుంది.  పెళ్లి విషయంలో తనను గట్టిగా తప్పుపట్టిన జర్నలిస్టులను పట్టించుకోకుండా ఉండలేకపోయింది. వ్యాపార చిత్రాల్లో  తెగ నటించి ఆమె అంతరాత్మ అలిసిపోయింది. ఇక ఎక్కువకాలం అవి చెయ్యలేని పరిస్థితి కూడా వచ్చింది. పెళ్ళయిన స్టార్లకే రెండోభార్యలుగా మారిన హేమమాలిని, షబానాఆజ్మీ, శ్రీదేవిల నిర్ణయాలను కొన్నాళ్ళకి సమాజం ఒప్పుకుంది.  ఎలాంటి వ్యాపార చిత్రాల్లో నటించాలో ఎన్నుకోవటంలో కూడా షబానాయే స్మిత కంటే ఎక్కువ తెలివిగా ప్రవర్తించింది.

దీపక్ సావంత్ స్మితాపాటిల్ కి సొంత మేకప్ ఆర్టిస్టు. వ్యాపార సినిమాల్లో ఆమెను సున్నంకొట్టినట్టు కాకుండా సరైన లేతరంగుల మేకప్ లో చూపించటం అతని ప్రతిభ. స్మిత అతన్ని పదేపదే ఓ వింత కోరిక కోరేదట. తను చచ్చిపోయినప్పుడు తనను పుణ్యస్త్రీ (సుహాగన్)గా సాగనంపాలని..  Premonitions  తనకు వస్తుండేవట.  పిల్లలంటే చాలా ఇష్టం. గంపెడు పిల్లల్ని కనాలని కోరిక. కుటుంబంతో స్నేహితులతో సడలని బంధాలను అల్లుకుంది. తనా పరా అనేదిలేకుండా   ప్రేమను పంచుతూ పోవటమే.  సేవ చెయ్యటం, పరిచయమైన అందరితో కలిసిపోవటం, కోపమొస్తే తిట్టటమే తెలుసు. ఇప్పటికీ సినిమావాళ్ళు వాళ్ళ ప్రేమల గురించి పత్రికలతో మాట్లాడరు. ఎనభైల్లోనే స్మిత తనకు వినోద్ ఖన్నాతో  సంబంధం ఉండేదని ఫిల్మ్ ఫేర్ కి చెప్పేసుకుని తరువాతి  గోలను తట్టుకోలేకపోయిందట.  ‘తారా’ధూళిని  వెదజల్లటం చేతకాని మామూలు మనిషి…

స్మిత అమ్మకాబోయే రోజుల్లో నెమ్మదిగా విద్యాతాయికి దగ్గరయింది. సముద్రం విశాలంగా కనిపించే చోటా, బాల్కనీలో పడే వానజల్లుల్లో తను హాయిగా తడిసే వాలూ వీలూ ఉన్నచోటా ఒక అపార్ట్ మెంట్ ను బొంబాయిలో కొనుక్కుంది. తనఇంటిని కట్టడంలో శ్రమపడిన కూలీలే గృహప్రవేశానికి మొదటి అతిథులవాలనుకుంది. బిడ్డను కన్నాక  రాజ్ బబ్బర్ ను వదిలేస్తానని స్నేహితురాలితో చెప్పిందట. కొత్త ఇంట్లోకి వెళ్ళకముందే, ప్రతీక్ ను ప్రసవించిన రెండు వారాలకే డిసెంబరు 13, 1986 న బ్రెయిన్ ఫీవర్ తో మరణించింది. బాలెంత జ్వరంతో మూడురోజులు ఆమె హాస్పిటల్ కు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోవటం అర్థంకాని పజిల్. పరిస్థితి విషమించాక జస్లోక్ డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయారు.

“ఆమె స్థానాన్ని ఇంకెవరూ పూరించలేరు” అన్నాడు సత్యజిత్ రాయ్. దీపక్ సావంత్ స్మితను సుహాగన్ లాగే ముస్తాబు చేసి సాగనంపాడు.

***

ఈ పుస్తకాన్నిబట్టి,  స్మిత చిన్నతనమూ 1974 నుంచీ 1980 వరకూ వేసిన సినిమాలూ చూస్తే, అభ్యుదయవాదులతో, మేధావులతో, కళాకారులతో సావాసం, స్వేచ్ఛ, తనకు సంతోషాన్నిచ్చే పాత్రలు, షబానాతో పోటీ.. ఇదీ ఆమె జీవితం. ‘80 నుంచీ ’86 లో  చనిపోయేవరకూ వ్యాపారచిత్రాలూ, వాటి జర్నలిస్టులూ, తారలూ కూడా తన జీవితాన్ని ఆక్రమించారు. రెండుచోట్లా బాగానే చేస్తున్నట్టు కనిపించినా రెండురకాల సినిమాల ప్రభావమూ ఆమె మీద పడిందేమో! బొహీమియన్ గా కనిపించిన మనిషి, పెళ్ళీ పసుపు కుంకాల సెంటిమెంట్లలోకి వెళ్లి మనసు బాధ పెట్టుకుందంటే, రెండు ప్రపంచాల మధ్యా సరిగ్గా రాజీ పడలేకపోవటమే అయుంటుందేమో అనిపించింది. నిండైన స్త్రీత్వం కూడా ఒక బాధే…

smita3

స్మితాపాటిల్ జీవితాన్ని తలుచుకుంటే నాకు అరుంధతీరాయ్ ‘గాడ్ అఫ్ స్మాల్ థింగ్స్’లోని ఒక వాక్యం గుర్తు వస్తుంది. అందులో  రాహెల్ తనతల్లి అమ్ము చనిపోయిన వయసును (31 వ ఏట అమ్ము చనిపోతుంది) ‘a viable die-able age’ అంటుంది. 31 వ ఏటనే చనిపోయిన స్మితాపాటిల్ సినిమాజీవితం వరకూ ‘viable die-able age’ లోనే పోయింది. ఇంత నిస్పృహతో ఎందుకంటున్నానంటే ఆ తరువాత సినిమాల్లో వచ్చిన స్త్రీ పాత్రల్లో దమ్మున్నవి ఎంతవరకూ ఉన్నాయి? “మరో ‘ఉంబర్తా’ నా కోసం తియ్యవా?” అని జబ్బార్ పటేల్ ను బతిమాలారట తబూ, మాధురీ దీక్షిత్.  గాఢతలో స్మితాపాటిల్ కు తీసిపోని తబూ లాంటి నటులకు ఎన్ని మంచి సినిమాలు దొరికాయి?

ఊళ్లలో వాడల్లో ఉన్న ‘మిర్చ్ మసాలా’లాంటి  సోనుబాయ్, ‘మంథన్’ లో ‘బిందు’లాంటి దళితమందారం, ‘చక్ర’ ని తిప్పిన మహాశక్తి ‘అమ్మ’, ‘చిదంబరం’ శివగామి లాంటివాళ్ళని సినిమాల్లోకి తెచ్చేవాళ్ళెవరూ ఇప్పుడు లేరు.  సరైన సమయంలో పుట్టి, సరైన సమయంలో సరైన సినిమాల్లో వేసి వెళ్ళిపోయింది ఆమెలోని ఆర్టిస్ట్.  కానీ నిండుగా  జీవితాన్ని అనుభవించాల్సిన మానవి స్మితాపాటిల్ కథ అర్ధాంతరంగా ముగిసిపోయింది.  బతికుంటే 90ల నుంచీ తనకు తగ్గ సినిమాల్లేక మానసిక హింస పడేదేమో అనిపిస్తుంది, ఈ పుస్తకంలో ఆమె వ్యక్తిత్వం ఏమిటో పూర్తిగా తెలుసుకున్నాక..

ఆంగ్ల సాహిత్య నేపధ్యంవున్న మైథిలీరావుకి నటన అంటే ఏమిటో బాగా తెలుసు. “Smitha Patil, A brief Incandescence”  చదివితే స్మితాపాటిల్ సినిమాలు చూడనివాళ్ళకు వెంటనే అన్నీ చూసేయాలనిపిస్తుంది.  స్మిత నిండైన స్త్రీ. పరిపూర్ణమైన కళాకారిణి. ఆమె జీవితచరిత్రను మైథిలీరావు లాంటి మనసున్న స్త్రీ రాయటం మరీ సంతోషం.

స్మితాపాటిల్ ను తలుచుకుంటూ శ్యాంబెనెగల్ విద్యాతాయికి ఉత్తరం రాస్తూ, జలాలుద్దీన్ రూమీ కవితను ప్రస్తావించాడు. ఈ పుస్తకంలో చేర్చిన ఆ కవితతోనే …..

I died mineral and turned plant.

Died a plant to turn sentient.

Died a beast to wear human clothes.

So when by dying did I grow less?

Again from manhood I must die,

And once again released,

Soar through the sky

And here as well I must lose place.

Everything passes, but His face.

*

 

 

 

 

మీ మాటలు

 1. భాస్కరం కల్లూరి says:

  తెలుగులో మీరు మాత్రమే రాయగలిగినట్టు రాశారు, అభినందనలు ల.లి.త. గారూ…స్మితా పాటిల్ మార్క్ సినిమాలను చూస్తూ, మేస్తూ గడిపిన తరం ముందు ఇప్పుడో ప్రశ్న వేళ్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఏమైపోయాయి? వీటికిప్పుడు బతుకు, రిలవెన్సూ ఉందా? లేకపోతే ఎందుకులేదు? సినిమాలు బోధించే పరిణామగతి ఎలాంటిది? దీనిపై కూడా మీరొక విశ్లేషణ చేస్తే బాగుండుననిపించింది.

  • Lalitha P says:

   దానిగురించి రాస్తాను తప్పక భాస్కరంగారూ.. ఎప్పటినుంచో అనుకుంటున్నా..

 2. దేవరకొండ says:

  స్మితా పాటిల్ గురించి తెలుసుకోగలిగే పుస్తకాన్ని పరిచయం చేసినందుకు కృతజ్ఞత. పాత్రల్లో జీవించడమే తప్ప- నటిస్తున్నట్లు ఒక్కసారి కూడా ప్రేక్షకులకు అనిపించనివ్వని అతి కొద్ది మంది కళాకారుల్లో స్మితా పాటిల్ ఒకరు. సావిత్రి లానే ఈమె వ్యక్తిగత జీవితం కూడా విషాదంగా ముగిసిపోవడం సృష్టి వైచిత్రి.

 3. స్మితా పాటిల్ సినిమాల గురించీ, ఆమె వ్యక్తిత్వం గురించీ తెలియని నా వంటి వారికి ఎన్నో మంచి విషయాలు తెలియజేసారు . మీ వచనం కూడా మట్టి దీపమంత అందంగానూ ఉంటుంది . నిజంగా అద్భుతం.

 4. గొరుసు says:

  మైథిలీ గారు ఎలా రాశారో నాకు తెలియదు కానీ … మీ పరిచయం చదివాక కళ్ళు చెమ్మ గిల్లాయి లలిత గారూ . ఈ మధ్యనే “అనుగ్రహం ” చూసాను. కల్లూరి భాస్కరం గారు అన్నట్టు మీరు మాత్రమే పరిచయం చేయగలిగిన “స్మితాపాటిల్ ” ఆమె. మీ వచనంలోనే ఒక సరళత , ఆర్ద్రత మేళవించి ఉంటాయి – అవి మాలాంటి వాళ్ళను మరింతగా భావావేశానికి గురిచేస్తాయి – గొరుసు

 5. గోర్ల says:

  ల.లి.త గారు చాలా బాగా రాశారు. మీరు కూడా మనస్సుతోనే ఈ వ్యాసం రాశారు. స్మీతా పాటిల్ సినిమాలు ఈ మధ్యే కొన్ని చూశాను. అద్భుతమైన నటన ఆమెది. చాలా విషయాలు… చాలా అద్భుతంగా రాశారు మీరు. వ్యాసం ద్వారా ఆమె గురించి మరిన్ని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు.

 6. స్మితా పాటిల్ రమణ గారి రచనలో బాపుగారి సినిమాలో (వారు తీసిన వ్యాపార సినిమాలు కాదు మనసుపెట్టి తీసిన మంచి సినిమాలు)నటిస్తే ఆమే విలువలకి తగిన పాత్రలో మనకి తెలుగులో ఒక మంచి సినిమా వచ్చేది.
  ఆమె గూర్చిన పుస్తకాన్ని మాలతీ చందూర్ గారి తరహాలో పరిచయం చేసారు చాలా baagundi

 7. రమణ says:

  బాపూ-రమణలపై మీ అభిమానం అలాంటిదే కానీ, స్మితా పాటిల్ నటించి మెప్పించిన సినిమాల (వ్యాపారచిత్రాలు కానివి) రేంజిని వాళ్ళ నుంచి ఊహించలేమండీ. వాళ్ళది పూర్తిగా డిఫరెంట్ టేక్. రామ్ గోపాలవర్మ నుంచి సంసారపక్షం సినిమాను ఆశిస్తే ఎలా ఉంటుందో, స్మితా పాటిల్ తో బాపూ-రమణల సినిమాను ఆశించడం అలాగే ఉంటుంది.
  మీ వ్యాసం చాలా బాగుంది లలితగారూ, కాంగ్రాట్స్.

 8. ప్రకృతి తనను దర్శించే వారిని ఎంచుకుంటుంది !
  ధన్యవాదాలు …
  పున్నా కృష్ణమూర్తి

 9. ల .లి . తా !
  స్మితా పాటిల్ అంటే ఎంత ఇష్టమో నాకూనూ ..మీ వ్యాసం అద్భుతంగా ఉంది .
  చాలా బాధ నాకు ,ఆమె జీవితం అలా అర్హ్ద్దంతరంగా ముగిసిందని .. మళ్ళీ ఆ బాధని అనుభవిస్తున్నాను , కొంత మంది అంతే ,మనకి పరిచయం లేక పోయినా ,అభిమానిస్తాం , సొంతం చేసుకుంటాం ..థాంక్యూ , మంచి జ్ఞాపకంని పంచినందుకు .

  వసంత లక్ష్మి .

 10. Venkat Suresh says:

  స్మిత పాటిల్ బాజార్, మండి, ఇంకొన్ని సినిమాలు చూసి ఉన్నాను…కాని ఎందుకో స్మిత పాటిల్ కంటే షబానా అజ్మి అంటే ఇష్టం మొదటి నుంచి. మీ ఆర్టికల్ చాలా బాగుంది . ధన్యవాదాలు

 11. మీ వ్యాసం నాచేత ఈరోజు ఈ పుస్తకాన్ని కొనిపించింది. మీకు ధన్యవాదాలు.

 12. ఉణుదుర్తి సుధాకర్ says:

  హృదయపు లోతుల్లోంచి, విశ్లేషణా శిఖిరం నుంచీ రాసిన సమీక్ష. ఒక తరాన్ని గుర్తుచేసుకుంటూ రాసినందుకు మిత్రులు ల.లి.త. కు ధన్యవాదాలు. ఇప్పుడిక పుస్తకం చదవాలి.

 13. సమీక్షలని కూడా సృజనాత్మకంగా రాయవచ్చని తెలిసింది. థాంక్స్.

 14. కె.కె. రామయ్య says:

  ” హృదయపు లోతుల్లోంచి, విశ్లేషణా శిఖిరం నుంచీ రాసిన సమీక్ష ” ఎంత చక్కగా చెప్పారు సుధాకర్ గారు.
  లలిత గారి సమీక్షలు అన్నీ అలాగే ఉంటాయి. పరిస్తితుల పట్ల కొన్నింటిలో వారి ఆగ్రహం, హేళన కనిపిస్తే స్మితా పాటిల్ జీవిత చరిత్ర పుస్తక సమీక్షలో ఆదినుంచే అనురాగ పూరితమైన ఓ సంవేదన కనిపించింది ( ‘స్మితాపాటిల్’ అనుకోగానే అందంగా గాఢంగా వెలిగే మట్టిదీపం, మెత్తటి నాగేటి చాలు, ఆషాఢపు జల్లుకు తడిసిన నేలవాసనా, బలమైన సరుగుడు చువ్వా గుర్తొస్తాయి. ).

  రాడికల్ పొలిటికల్ సినిమా, న్యూ వేవ్ సినిమాలలో ప్రతిభావంతమైన నటిగానే కాకుండా, యాక్టివ్ ఫెమినిస్ట్ గా కూడా గుర్తింపు పొందారు స్మిత.

  ” పుణేలోని FTII ( ఫిల్మ్ అండ్ టెలివిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ) లో స్నేహితులతో తిరుగుతూ ఎప్పుడూ కనిపిస్తూ ఉండటంవల్ల FTII లో చదువుతోందేమో అనుకునేవారట. ” ఇప్పటికీ చాలా మంది స్మితా పాటిల్ FTII అల్యుమినీ అని అనుకుంటున్నారు.

  ఫోర్బ్స్ ఇండియా పత్రిక వాళ్లు ఎంపిక చేసిన 25 Greatest Acting Performances of Indian Cinema లిస్ట్ లో స్మితా పాటిల్ నటించిన ‘మిర్చి మసాలా’ సినిమా లోని సోన్ బాయి పాత్ర ఒకటి.

  కలకాలం గుర్తుండిపోయే వ్యాసానిచ్చిన ల.లి.త. గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. ( పాత గొంతెమ్మ కోరిక మళ్లీ : గౌతంఘోష్‌ ‘మాభూమి’ సినిమా గురించి రాయరూ )

  • తెలంగాణా సాయుధ పోరాటాన్ని రికార్డు చేసిన ‘మాభూమి’ రియలిస్ట్ తెలుగు సినిమాల్లో ముఖ్యమైనదే. చూసి చాలా కాలం అయింది. యు ట్యూబ్ లో పెట్టారు గానీ సినిమా పూర్తిగాలేదు. ప్రయత్నిస్తానండీ…

 15. రాధ మండువ says:

  చాలా మంచి సమీక్షండీ… మొన్ననే అనుగ్రహం సినిమా చూశాను. ఓ భావావేశంతో రాసిన ఇలాంటి సమీక్షలు అరుదుగా ఉంటాయనిపించింది చదవగానే. అభినందనలు

 16. paresh n doshi says:

  అర్థ్ చూసి యెంతగా impress అయ్యానంటే మా అమ్మాయి పేరు పూజ అని పెట్టాను. అర్థ్ లో షబానా వేసిన పాత్ర పూజా సక్సేనా. మొన్నీమధ్య బాజిరవ్ మస్తాని చూసినప్పుడు అర్థ్ గుర్తుకొచ్చింది. సమాజంలో వొక అబ్బాయిగా పుట్టటంతోటే అన్ని హక్కులు,మర్యాదలు,తొక్కాతోలూ సమకూరి పుడతాడో అలానే సమాజంలో వొక వివాహిత స్త్రీకి వొక acceptance-respectibility ఇస్తుంది సమాజం. మనం కూడా ఆ పాత్రలతో మమేకం అవుతామేమో యెక్కువ నచ్చుతాయి ఆ పాత్రలు. బాజిరావు లో దీపిక వొక కావ్యకన్యలా వొక వూహా వూర్వసిలా యెక్కువ కనిపిస్తుంది. అర్థ్లో స్మిత రక్త మాన్సాలున్న మనిషిలా. అందుకే ఆ స్కిజొఫ్రెనిక్ పాత్రపోషణ. అప్పుడు తెలీలేదుకాని ఇప్పుడు ఆలోచిస్తుంటే షబనా పాత్ర కంటే స్మిత పోషించిన పాత్ర యెక్కువ కష్టమైనది. (నిజ జీవితంలో పర్వీన్ బాబి స్కిజొఫ్రీనియాతో మరణించింది). అర్థ్ లో స్మితను మరిచిపోవడంకూడా అంతే కష్టం.

  స్మితా పాటిల్ గురించి వ్రాసేటప్పుడు షబానా ఆజ్మి ప్రస్తావన లేదుండా వ్రాయడం కష్టం చేసేశారు వాళ్ళిద్దరు. 80లలో వీళ్ళిద్దరిలో యెవరు గొప్ప నటి అని తెగ చర్చలు జరిగేవి. నేను షబానా పార్టి. ఇంటర్వ్యూలు అవీ ఫాలో అయ్యేవాడిని. మహేష్ భట్ట్ లాంటి వాళ్లు షబానా accomplished నటి అన్నట్టు గుర్తు. శ్యాం బెనెగళ్ లాంటి వారు ఇద్దరూ గొప్ప నటులే అని వూరుకున్నారు.

  షబానా method నటి. లతా మంగెష్కర్ పాడుతున్నప్పుడు యెక్కడా తూకం లొ ఇంత తేడా కూదా వుందదు; మళ్లీ అంత ఎక్స్ప్రెషన్. అది షబానా అయితే, స్మిత యెలాంటి నటి అంటే : సంగీతం నేర్చుకోకుండా, పూర్వజన్మ సంస్కారాలు అబ్బి వొక మామూలు మనిషి మనోధర్మ సంగీతం ఆలపిస్తే యెలా వుంటుందో, అలా.
  అరవిందన్ తీసిన చిదంబరం చూస్తే నేను చెప్పేది అర్థం అవుతుంది. ముణియంది పిచ్చివాడిలా వూరూరా తిరిగి తిరిగి చిదంబరం గుది మెట్ల దగ్గర కూర్చున్న బిచ్చగత్తెల మధ్య గుర్తు పడతాడు. ఆమె నెమ్మదిగా తలెత్తి చూస్తున్నప్పుడు credits అయితే గోపురం మీదుగా ఆకాశంలోకెళ్ళిపోయినా, ఆ చూపు మనల్ని వీడదు.

  Though she lived a short life, she has left a great repertoire of movies. France paid her a tribute by organising a retro of her films.
  And now, thanks to you for refreshing my memories.

 17. స్పందించిన అందరికీ ధన్యవాదాలు. స్మితాపాటిల్ ను అందరం ఇలా తలుచుకోవటం నాకు సంతోషంగా ఉంది.

 18. Jayashree Naidu says:

  ల.లి.త గారు…

  స్మితా పాటిల్ గురించి ఎంత రాసినా తక్కువే. ఆమే ఒక కళా నిఘంటువు.
  ప్రతి అమ్శాన్నీ స్పృశిస్తూ మీరు రాసిన వ్యాసం అ గ్రేట్ ట్రిబ్యూట్. ఒక్కటొక్కటిగా ఆమె సినిమాలు చూస్తూ ఆ నటనా కౌశలానికి పరవసిన్సిన రోజులు మళ్ళీ గుర్తుకు తెచ్చారు థాంక్ యూ..

మీ మాటలు

*