నిధుల వేటలో…ఆశనిరాశల ఊగిసలాటలో…

 

స్లీమన్ కథ-20

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

నిజానికి ఈ విడత తవ్వకాలలో బయటపడినవన్నీ అతనికి చిక్కుముడులుగానే కనిపిస్తున్నాయి. గుడ్లగూబ ఎథెనా పవిత్రచిహ్నమనీ, ఎథేనియన్ నాణేలపై అది ఉంటుందనీ అతనికి తెలుసు. కానీ, ఇక్కడ కనిపించిన గుడ్లగూబ చిహ్నాలు  మరీ చరిత్రపూర్వకాలానికి చెందినవిలా ఉన్నాయి. తను రాతి యుగపు అవశేషాలను వెలికితీశాడా అనుకున్నాడు. నిరుత్సాహం చెందాడు. అభిప్రాయం కోరుతూ ఫ్రాంక్ కల్వర్ట్ సోదరుడు జేమ్స్ కల్వర్ట్ కు ఉత్తరం రాశాడు. అతను జవాబు రాస్తూ, అందులో ఆశ్చర్యపోవలసిందేమీ లేదనీ, క్రీ.పూ. 6,7 శతాబ్దుల వరకూ గ్రీకులు చిత్రిత మృణ్మయ పాత్ర(painted pottery)లను తయారుచేసుకోలేదనీ, మీకు కనిపించిన మూర్తుల్లాంటివి ఇంతకుముందు తవ్వకాల్లో కూడా బయటపడ్డాయనీ అన్నాడు. మరీ ఆటవికకాలానికి చెందిన ప్రదేశంలో తవ్వకాలు జరుపుతున్నాననుకుని నిరుత్సాహపడనవసరంలేదనీ, ముందుకు సాగమనీ ధైర్యం చెప్పాడు.

స్లీమన్ తవ్వకాలు కొనసాగించాడు. లింగాకృతులు, బొంగరం రూపంలోని మట్టి బొమ్మలు ఇంకా ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. ఈ బొంగరం ఆకారంలోని బొమ్మలు విచిత్రంగా ట్రాయ్ మైదాన ప్రాంతంలోని శ్మశానం దిబ్బల్ని పోలి ఉన్నాయి. లావా కత్తులు(లావా వేగంగా ప్రవహిస్తూ, మంచి పదును కలిగిన నల్లని గాజు రూపంలో గడ్డకడుతుంది. దానిని కత్తిగా ఉపయోగించేవారు)కూడా కనిపించాయి. అవి ఎంత పదునుగా ఉన్నాయంటే, బహుశా వాటిని రేజర్లుగా వాడేవారేమోనని స్లీమన్ అనుకున్నాడు. ఆపైన కాల్చిన మట్టితో(terracotta) చేసిన చిన్న చిన్న పడవ బొమ్మలు కనిపించాయి. అవి భారతదేశంలో కనిపించే పడవల్లా ఉన్నాయి. ఈ వస్తువులన్నీ భారత్ నుంచి వ్యాపించి ఉండచ్చని అనుకున్నాడు. ఇక్కడ కనిపించిన లింగాకృతులను బట్టి ఈ ప్రదేశానికి వేదకాలపు భారతదేశంతో ఏదో సుదూరసంబంధం ఉండి ఉంటుందని భావించాడు. అయితే, ఈజిప్టుకు చెందినదా అనిపించే వెలిసిపోయిన శాసనలిపీ కనిపించింది. అక్కడక్కడ మట్టి పలకలపై చెక్కిన స్వస్తిక చిహ్నాలు బయటపడ్డాయి. బొంగరం ఆకారంలోని మట్టి బొమ్మల్లానే ఇవి కూడా అతనికి విస్తుగొలిపాయి.

నవంబర్ 16న, పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించిన గోడల్లో ఒకదానినీ, ఒక పెద్ద ద్వారబంధాన్నీ తవ్వితీయడానికి పురమాయించాడు.  ఆరోజు మూడు గంటల సేపు అరవై అయిదుగురు పనివాళ్లు చెమటోడ్చినా అవి లొంగలేదు. మరునాడు కూడా ఆ పని కొనసాగింది. నవంబర్ 18 సెలవు దినం. ఆరోజు పని చేయబోమని సిబ్బంది చెప్పేశారు. దాంతో స్లీమన్ తవ్వకాల నివేదిక రాసుకుంటూ గడిపాడు. ఈ నివేదికల ప్రతులను ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులకు పంపడం అతనికి పరిపాటి.  లింగాకృతులు, బొంగరం ఆకారంలోని బొమ్మలు, లావా కత్తులు, స్వస్తికచిహ్నాలు, శాసనపు రాతలూ అతనికి ఎంత కొరకరాని కొయ్య లయ్యాయంటే; తనే సర్వజ్ఞుడనుకునే ఆ మనిషి కాస్తా, వాటి గురించి తెలియచెప్పి పుణ్యం కట్టుకోండంటూ తనదైన శైలిలో పండితులకు విజ్ఞప్తి చేశాడు. తను ఈ శీతాకాలాన్ని ఎథెన్స్ లో గడుపుతాననీ, అక్కడి తన చిరుమానాకు రాయవలసిందనీ కోరాడు.

ఉత్తరం నుంచి వీచే తీవ్రమైన చలి గాలులు ట్రాయ్ మైదానాన్ని ఊపేస్తున్నాయి. అయినాసరే, పెద్ద చలికోటు, నెత్తిన హెల్మెట్ తో టంచన్ గా పనిలోకి దిగిపోయి సిబ్బందిని పరుగులెత్తించే స్లీమన్, సాధ్యమైన చివరి క్షణం వరకూ తవ్వకాలను జరిపించాల్సిందే ననుకున్నాడు. కానీ, నవంబర్ 24నుంచీ రెండు రోజులపాటు పెద్ద తుపాను విరుచుకుపడడంతో తప్పనిసరై తవ్వకాలను ఆపేసి ఎథెన్స్ కు వెళ్లిపోయాడు. ఆ నిర్బంధ విరామంలో కొంత కాలాన్ని స్వస్తికాలపై తను రాసుకున్న సమాచారానికి వ్యాసరూపమిస్తూ గడిపాడు. నాజీ స్వస్తికాలలా కాకుండా అసలైన స్వస్తికాలు కుడి నుంచి ఎడమకు తిరుగుతాయి. ప్రపంచంలో అవి కనిపించని చోటు అంటూ లేదు. పురాతన చైనా చెక్కడాలపై, మిలాన్(ఇటలీ)లోని సెయింట్ యాంబ్రోస్ వేదికపై, నార్ఫిక్(ఇంగ్లండ్)లో కనిపించిన కెల్టిక్ అంత్యక్రియల కలశాలపై, రామాయణంలో వర్ణించిన ఓడల ముందు భాగంపై స్వస్తికచిహ్నాలు ఉన్నాయి. ఒక పుస్తకం రాయడానికా అన్నట్టుగా స్వస్తికాలపై అతను విస్తారమైన సమాచారాన్ని సేకరించిపెట్టుకున్నాడు.

విరామ కాలంలో ఎక్కువ సమయాన్ని తన పరిశోధన వ్యాసాలకు మెరుగులు దిద్దుకోవడం లోనే గడిపాడు. అవి అయిదు విడతలుగా అస్పెర్గర్స్ ఆల్గమైనా సైటూంగ్ లో ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత ‘ట్రోజనీష్ ఆల్టట్యూమర్’(Trojan Antiquities) పేరుతో పుస్తకరూపం ధరించాయి. స్లీమన్ ప్రారంభ వ్యాసాలపై ప్రముఖ గ్రీకు అధ్యయనవేత్త ఎర్నెస్ట్ కర్టియస్ స్పందిస్తూ, బునర్ బషీయే ట్రాయ్ తప్ప స్లీమన్ భావించినట్టు హిస్సాలిక్ కాదని నొక్కి చెప్పాడు. దాంతో స్లీమన్ అతనిపై మండిపడ్డాడు. ట్రాయ్ రాజప్రాసాదాలు హిస్సాలిక్ లో కాక, ఇంకెక్కడో ఉంటాయని భావించేవాడు వట్టి మూర్ఖుడనీ, కాకపోతే లోయ మీదుగా ట్రాయ్ నగరం బునర్ బషీ వరకూ విస్తరించి ఉండచ్చనీ అన్నాడు.

లింగాకృతులు, బొంగరం ఆకారంలోని బొమ్మలు గడ్డు ప్రశ్నలుగా మారినా, తను పురాతన ట్రాయ్ నగరాన్ని కనుగొన్నానని అతను ఇప్పటికీ దృఢంగా నమ్ముతున్నాడు. ట్రాయ్ నగరం కేవలం ఊహల్లో తప్ప ఉనికిలో లేదని ఎర్నెస్ట్ రెనాన్, మాక్స్ ముల్లర్, లాంగ్ పెరియా లాంటి మహాపండితులు సైతం కొట్టిపారేసినా, స్లీమన్ మాత్రం అది నిజంగా ఉందని నిర్ధారణకు వచ్చాడు. 1872 మార్చిలో తన నాలుగో విడత తవ్వకాలకు ఎథెన్స్ నుంచి బయలుదేరి వెడుతూ, “హోమర్ పై నాది చెక్కు చెదరని విశ్వాసం. ప్రియామ్ ప్రాసాదాన్నీ, పురాతన ట్రాయ్ దుర్గాన్నీ కనుక నేను వెలుగులోకి తీసుకురాగలిగితే ప్రపంచవ్యాప్తంగా అదో పెద్ద సంచలనం అవుతుంది. ఆ కాలపు చారిత్రక, పవిత్ర అవశేషాలను దర్శించడానికి వందలు, వేల సంఖ్యలో హోమర్ అభిమానులు తరలివస్తారు” అని రాసుకున్నాడు.

bhaskar3

స్వస్తిక చిహ్నం కలిగిన ఒక దేవత

ఎంతో ఆత్మవిశ్వాసంతో నాలుగో విడత తవ్వకాలకు సిద్ధమయ్యాడు. లండన్ లోని అతని మాతృసంస్థ బ్రదర్స్ ష్రోడర్స్ కంపెనీ అరవై తోపుడుబళ్ళను, నాణ్యమైన ఇంగ్లీష్ పారలను, తేలికరకపు గొడ్డళ్లను కానుకగా పంపింది. మార్చి చివరిలో భార్యతో సహా దర్దనెల్లెస్ చేరుకుని ఏప్రిల్ 5న తవ్వకాలను పునః ప్రారంభించాడు.

పనివాళ్లతో సమస్యలు మామూలే. దానికితోడు వరసపెట్టి గాలివానలు, గ్రీకు పండుగ దినాలు. తొలి పదిహేనురోజుల్లో కేవలం ఎనిమిది రోజులు మాత్రమే పని జరిగింది. కొన్ని రోజులు వందమందిని, మరి కొన్ని రోజులు 126 మందిని పనిలోకి తీసుకున్నాడు. సగటున రోజుకు 20 మంది పనివాళ్ళ చొప్పున 300 ఫ్రాంకులు చెల్లించానని లెక్క వేసుకున్నాడు. మూడు వారాల తర్వాత ఒక రోజున పనివాళ్ళు పొగ తాగుతుండడం చూసి స్లీమన్ కేకలేశాడు. దాంతో వాళ్ళలో కొంతమంది ఎదురు తిరిగి పని మానుకుంటామని బెదిరించారు. పని చేసుకుంటున్న మిగిలిన వాళ్ళ మీద రాళ్ళు విసిరారు.

స్లీమన్ వెంటనే చర్యకు దిగాడు. దాదాపు అందరినీ పనిలోంచి తీసేశాడు. ఆరోజు రాత్రంతా నిద్రపోకుండా కొత్త పనివాళ్ళను వెతికాడు. మరునాడు విజయవంతంగా 120 మంది కొత్తవాళ్లను రంగంలోకి దింపాడు. పని చురుగ్గా సాగడం లేదని అదనంగా ఇంకో గంట పని చేయించాలనుకున్నాడు. ఉదయం ఓ గంట ముందుకు జరిపి, అయిదు నుంచే పని చేయించడం ప్రారంభించాడు. అయినాసరే, మధ్యలో గ్రీకు ఈస్టర్ పండుగ రావడంతో ఆరు రోజులపాటు తవ్వకాలు ఆగిపోయాయి. ఎలాగైనా తవ్వకాలు కొనసాగేలా చూడడానికి పనివాళ్ళకు అదనపు కూలీని ఎరేశాడు, బతిమాలాడు, బెదిరించాడు, సోమరిపోతులంటూ తిట్టిపోశాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇంకోవైపు, తవ్వకాలలో చెప్పుకోదగినవీ బయటపడడం లేదు. ఎలకను పట్టడానికి కొండను తవ్వుతున్నానా అనుకుంటూ తీవ్రనైరాశ్యంలోకి జారిపోయిన క్షణాలూ ఉంటున్నాయి.

మే నెలలో మరికొన్ని శ్రాద్ధదినాలు వచ్చాయి. ఎక్కువ వేతనం ఇస్తానని ఆశపెట్టి తవ్వకాలు కొనసాగేలా చూడడానికి యధావిధిగా ప్రయత్నించాడు. చర్చి పెద్దలు మా తోలు తీస్తారంటూ పనివాళ్ళు తిరస్కరించారు. సెలవు దినాల్లో తరచు పనివాళ్ళ ఇళ్లకు వెళ్ళేవాడు. వాళ్ళల్లో, లేదా కుటుంబసభ్యుల్లో ఎవరైనా అనారోగ్యంతో తీసుకుంటూ ఉంటే మందులు సూచించేవాడు. అప్పట్లో సాధారణంగా గ్రీకు పూజారులే వైద్యం కూడా చేసేవారు. రోగి ఒంటి మీద గాటు పెట్టి, లోపల మెత్తని దూది పెట్టి మండించిన ఓ చిన్న కప్పును దాని మీద బోర్లించి అందులోకి రక్తం తీసుకునేవారు. ఆ నాటువైద్యం చూసి స్లీమన్ భయభ్రాంతుడైపోయాడు. అలా పసిపిల్లలనుంచి కూడా రక్తం తీయడం మరింత బెంబేలెత్తించింది. అందువల్ల పిల్లల్లో మాటి మాటికీ రక్తస్రావం అవుతుండడం గమనించి, వాళ్ళ పెదవుల చుట్టూ ఉండే లోతైన ముడతలే అందుకు కారణమని తీర్మానించాడు. రోగి ఒక్క రక్తపు చుక్క కూడా చిందించనవసరం లేకుండా తను నయం చేస్తూవచ్చాననీ, దాదాపు అన్ని రోగాలకూ విరుగుడుగా ఉప్పునీటినీ, సముద్రస్నానాన్నీ సూచించి అద్భుతాఫలితాలు సాధించానని అతను చెప్పుకున్నాడు.

ఓ రోజున ఒంటినిండా పుళ్ళు పడిన ఓ అమ్మాయిని అతని దగ్గరికి తీసుకొచ్చారు. ఆమె ఎడమ కన్ను పూర్తిగా పుండు పడిపోయింది. విపరీతంగా దగ్గుతూ ఒక్క అడుగు కూడా వెయ్యలేని స్థితిలో ఉంది. ఒక డోసు ఆముదం తాగించమనీ, సముద్ర స్నానాలతోపాటు ఛాతీ విశాలం కావడానికి కొన్ని అభ్యాసాలు చేయించమనీ చెప్పాడు. రెండు వారాల తర్వాత ఆ అమ్మాయి తన ఊరి నుంచి మూడు గంటల ప్రయాణదూరంలో ఉన్న హిస్సాలిక్ కు అవలీలగా నడచివచ్చి స్లీమన్ పాదాల మీద పడి, అతని బూట్లను ముద్దుపెట్టుకుంది. మొదటి సముద్రస్నానానికే తనలో తిరిగి ఆకలి పుట్టిందని చెప్పింది. ఎడమ కన్ను బాగుపడుతుందన్న ఆశ లేకపోయినా ఒంటి మీద పుళ్ళు చాలావరకూ మానిపోయాయి. ఈ అమ్మాయి ఉదంతాన్ని ప్రతిసారీ అతను గర్వంగా చెప్పుకునేవాడు.

వేసవి వచ్చింది. ఆకాశం ఉష్ణం కక్కుతోంది. ఆవల్లోని కప్పల బెకబెకలతో రాత్రిళ్ళు దద్దరిల్లుతున్నాయి. సన్నగా, గోధుమ రంగులో ఉండే చిన్న చిన్న రక్తపింజరలు తిరిగే కాలమది. అవి చాలా ప్రమాదకరమైనవి. తవ్వకాలు జరిగేచోట శిథిల్లాల్లోంచి కూడా వస్తున్నాయి. గ్రామస్తులు పాము విషానికి ముందస్తు విరుగుడుగా ఒక రకం మూలికతో కషాయం తాగుతారని తెలిసి స్లీమన్ కూడా దానిని చేయించుకుని తాగాడు.

ఆ దిబ్బ మీద లోతైన కందకాలు తవ్విస్తున్నప్పుడు పెద్ద పెద్ద గోడలు కుప్పకూలి పనివాళ్లు ఆ శిథిలాల కింద కప్పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎన్నడూ, ఏ ఒక్కరూ పెద్దగా గాయపడకపోవడం చూసి ఆనందాశ్చర్యాలకు లోనయ్యేవాడు. అదో అద్భుతంలా అనిపించేది. ఒక కోతి చెట్టెక్కినంత అవలీలగా ఆ దిబ్బ ఎక్కేవాడు. రోజంతా పనివాళ్లతో కలసి ఒళ్ళు అరగదీసుకునేవాడు. రాత్రిళ్ళు నిద్ర కాచుకుంటూ నోట్సు రాసుకునేవాడు.

అయితే, పురావస్తు తవ్వకాలకు సంబంధించి అతనికి శాస్త్రీయపరిజ్ఞానం లేదు. నిజానికి అప్పటి కింకా ఆ శాస్త్రం శైశవదశలోనే ఉంది. ఎథెన్స్ లోని ఫ్రెంచ్ స్కూల్ డైరక్టర్ గా ఉన్న ఎమీల్ బర్నూఫ్ చాలా విషయాల్లో అతని అజాగ్రత్తను ఎత్తి చూపుతూ గట్టిగా మందలించాడు. లింగాకృతులు, బొంగరం ఆకృతులు, కుండ పెనుకులు వగైరాలను కేవలం తవ్వి తీస్తే సరిపోదనీ; అవి ఎలా ఉన్నాయో, ఏ పరిస్థితిలో ఉన్నాయో, ఏ ప్రదేశంలో బయటపడ్డాయో-తేదీ, సమయంతో సహా అన్ని వివరాలూ పూసగుచ్చినట్టు డే బుక్కులో నమోదు చేయాలనీ హెచ్చరించాడు. అలా చేయనప్పుడు మీరు ఎలాంటి అద్భుతాలను వెలికితీసినా వాటి గురించి ఎప్పటికీ ఒక కచ్చితమైన నిర్ధారణకు రాలేరనీ పాఠం చెప్పాడు. అప్పటినుంచీ స్లీమన్ వివరాల నమోదుపై మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ, ప్రతి వస్తువుకూ కాగితంపట్టీ అతికిస్తూ వచ్చాడు. పురావస్తు తవ్వకాలలో ఒక పద్ధతి ప్రకారం కచ్చితమైన సమాచారాన్ని పొందుపరచడం ఎంత ముఖ్యమో క్రమంగా అతనికి అనుభవపూర్వకంగా అర్థమైంది.

అయినాసరే, ఇప్పటికీ తవ్వకాల్లో గొప్ప మెరుపులేవీ బయటపడడం లేదు. పెద్ద పెద్ద ప్రాకారాలు, అక్కడక్కడ పొడవైన అంకిత పాఠాలు లిఖించిన పాలరాయి పలకలు వెలుగు చూశాయి. అయితే అవి అనంతరకాలాలకు చెందినవి. ఆపైన కొన్ని భారీ కూజాల లాంటివీ, నల్లని మృణ్మయపాత్రలూ దొరికాయి. రాజు ప్రియామ్, రాకుమారుడు హెక్టర్, అఖిలెస్ లకు చెందినవేవీ కనిపించలేదు.

bhaskar2

ట్రాయ్ తవ్వకాల్లో దొరికిన స్వస్తిక చిహ్నం

అంతలో హఠాత్తుగా జూన్ 18, 1872న  రాతిమీద మలచిన ఒక చిత్రం బయటపడింది. అపోలో అనే దేవుడు నాలుగు సూర్యుని గుర్రాలపై స్వారీ చేస్తున్న చిత్రం అది. చిన్నదైనా అందులో చక్కని పనితనం ఉట్టిపడుతోంది. ఆ గుర్రాలను పైపైన చెక్కినప్పటికీ వాటిలో జవాసత్వాలే కాక, గొప్ప శిల్ప నైపుణ్యం తొంగి చూస్తోంది. అపోలో, బంగారు వన్నెలీనే తన శిరోజాలపై పది దీర్ఘ కిరణాలు, పది హ్రస్వ కిరణాలతో మలచిన కిరీటాన్ని ధరించి ఉన్నాడు. ఆ చిత్రం ట్రాయ్ కాలానికి తర్వాతిది, బహుశా టోలెమీల కాలానికి చెందినది. అయినాసరే, స్లీమన్ దానిని చూసి ముగ్ధుడయ్యాడు.  ఫ్రాంక్ కల్వర్ట్ కు చెందిన భాగంలో కనుగొన్నాడు కనుక అతని సాయంతో దానిని తక్షణమే బయటికి తరలించాడు. ఆ చిత్రం చాలా ఏళ్లపాటు ఎథెన్స్ లోని అతని ఇంటి తోటను అలంకరించింది.

ఒక పక్క వేసవి ముదురుతున్నా, హోమర్ చిత్రించిన ట్రాయ్ ఆనవాళ్ళు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఉండి ఉండి నైరాశ్యం అతన్ని కుంగదీస్తోంది. ఎంతో డబ్బు ఖర్చుపెట్టి, ఆ దిబ్బ ఉత్తరం వాలున ఓ పెద్ద చప్పరా(terrace)న్ని, ఓ రాతిగోపురాన్ని వెలికితీయించాడు. అయినాసరే, రోజు రోజుకీ అతనిలో సందేహాలు పెరిగిపోతున్నాయి. కాన్ స్టాంట్ నోపిల్ లోని బ్రిటిష్ కాన్సూల్ మరో 20 తోపుడు బళ్ళను,10 లాగుడు బళ్ళను, 6 గుర్రపు బళ్ళను; పెద్ద సంఖ్యలో రకరకాల తవ్వుడు సామగ్రిని పంపించడంతో పనైతే సునాయాసంగా జరిగిపోతోంది కానీ, స్లీమన్ లో మాత్రం ఆశ అడుగంటిపోతోంది.

ఆ వేసవిలో మొదటిసారి అతనిలో అలసటా, అనారోగ్యం తొంగిచూశాయి. వెనకటి ఉత్సాహం మందగించింది. టర్కీ ప్రభుత్వం ఇచ్చిన ఫర్మానాను మంచి వనరులున్న ఏ పురావస్తు సంస్థకో, విదేశీ ప్రభుత్వానికో అప్పగించి చేతులు దులుపుకుందామా అనుకున్న క్షణాలున్నాయి. తన డబ్బంతా వృథా అవుతోందన్న చింత పట్టుకుంది. ఆపైన రోజుల తరబడి గాలిదుమారం రేగుతోంది. పనివాళ్ళకు ఎదురుగా ఏముందో కూడా కనిపించని పరిస్థితి. జులై రాగానే దుర్వాసనతో కూడిన చీడ వ్యాపించడం ప్రారంభించింది. కుళ్ళిపోయిన లక్షలాది కప్పల కళేబరాలనుంచి అది వ్యాపిస్తోందని స్లీమన్ అనుకున్నాడు. హిస్సాలిక్ దిబ్బ మీద అతను కట్టించిన ఇంటి దూలాలమీంచి పాములు కింద పడుతున్నాయి. వాటికితోడు తేళ్ళ భయం,

ఒక్కోసారి ఒంటరితనం నుంచి బయటపడడానికి పొరుగునే ఉన్న ఓ గ్రామానికి వెళ్ళేవాడు. అక్కడ ఒక గ్రీకు దుకాణదారు పరిచయమయ్యాడు. అతని పేరు కొస్తాదినోస్ కొలబాస్. పుట్టుకతోనే వికలాంగుడు. ఇటాలియన్, ఫ్రెంచి భాషలు తెలుసు. ఇలియడ్ ను పేజీలకు పేజీలు అప్పజెప్పేవాడు. అతనితో పండితగోష్ఠిని స్లీమన్ ఆనందించేవాడు. విసిరేసినట్టు ఉన్న ఆ మారుమూల ప్రాంతంలో అతనికి ఒకింత ఉల్లాసం కలిగించింది అదొక్కటే.

ఆగస్టు 4…అప్పటికే అతను జ్వరంతో బాధపడుతున్నాడు. ఇక ఆ వేసవిలో తవ్వకాలు ఆపేద్దామనుకుంటున్నాడు. అంతలో అతను ఎదురుచూస్తున్న నిధి మొదటసారి కంటబడింది. ఆనందపు అంబర మెక్కించేంత గొప్ప నిధిగా అతనికి తొలిచూపులో కనిపించలేదు. మూడు బంగారు చెవిపోగులు, ఒక బంగారు బొత్తం…! దగ్గరలోనే ఒక అస్థిపంజరం. అది ఒక యవతిదనీ; ఎముకల రంగును బట్టి, ట్రాయ్ తగలబడినప్పుడు మంటల్లో చిక్కుకుని మరణించి ఉంటుందనీ స్లీమన్ అంచనాకు వచ్చాడు.

(సశేషం)

 

 

మీ మాటలు

*