అలుపూ అలకలూ లేని అద్దేపల్లి..

 

 

 -బొల్లోజు బాబా

~

 

baba“శయనిస్తున్న అతనెలా ఉన్నాడు? యోధునిలాగా లేక కవిలాగ?     హ్మ్…… కవిత్వ యోధునిలా” — జె.డి. రోబ్

ఓ మాస్టారికి ఒక  కిళ్ళీ కొట్టు వద్ద ఖాతా ఉండేది.   అయిదేళ్ళు గడిచాకా, ఓ మిత్రుడు ఆ కొట్టు యజమానికి ‘ఈయనే ప్రముఖ కవి అద్దేపల్లి రామమోహనరావు” అని పరిచయం చేసాడు.  ఆ కొట్టు యజమాని  ఓ బైండు చేసిన పుస్తకాన్ని తీసి చూపిస్తూ మనస్సు బాగోనప్పుడల్లా ఈ పుస్తకాన్ని చదువుతుంటానని చెప్పాట్ట.  ఆ పుస్తకం పేరు “అంతర్జ్వాల”.  అది  అద్దేపల్లి  రచన.  ఒక కవికి ఇంతకు మించిన పురస్కారం ఏ అకాడమీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వాలు ఇవ్వగలవు?

యాభై ఏళ్ల సాహితీప్రస్థానంలో సుమారు 30 పుస్తకాల్ని వెలువరించి, వందకు పైగా ముందుమాటలు వ్రాసి, వివిధ సభల్లో రెండువేలకు పైగా అద్యక్షోపన్యాసాలు ఇచ్చి, ఎన్నో వందల పుస్తకాలను సమీక్షించి, కొన్ని వందల తెలుగు గజల్స్ ను వ్రాసి, గానం చేసి- తెలుగు సాహితీలోకంలో ఒక కవిత్వయోధునిలా జీవించిన  అద్దేపల్లి రామమోహనరావు జీవిత చరమాంకంలో కూడా  ఒక యోధునిలానే నిష్క్రమించారు.

గత మూడునెలలుగా ఆయన అస్వస్థతకు గురయ్యారని కాకినాడ సాహితీమిత్రుల మధ్య గుసగుసలుగానే ఉండింది.  కానీ ఇంత త్వరగా విడిచిపోతారని ఎవరూ అనుకోలేదు.

తన అనారోగ్యం గురించి ఎవరికి తెలియనివ్వలేదు  అద్దేపల్లి.  ఎవరినీ ఎక్కువగా కలిసే వారు కాదు.  గతమూడునెలలుగా ఎవరైనా ఆయనను కలిసినా అస్వస్థత ప్రస్తావన లేకుండానే మాట్లాడేవారు.  ఇవతలి వ్యక్తికి తెలిసినా, ఆయన ధోరణిని బట్టి, తెలియనట్టుగానే మాట్లాడాల్సివచ్చేది.  అలాగని నిర్వేదంలో పడిపోయారా అంటే అదీకాదు,  మరణానికి వారంరోజుల ముందు వరకూ కూడా స్వయంగా ఆటో ఎక్కి రేడియేషన్ చేయించుకొని వచ్చిన వ్యక్తి.  ఒక సాహితీ మిత్రునికి ఫోన్ చేసి, ఈ సంవత్సరం ఎలాగైనా “సాహితీ స్రవంతి” పత్రికను ప్రారంభించాలి అని దిశానిర్ధేశం చేసిన వ్యక్తి  అద్దేపల్లి.  “మీరు రేడియేషన్ చేయించుకొన్నారు కదా జాగ్రత్తగా ఉండాలి” అని కుటుంబసభ్యులొకరు అన్నప్పుడు, “అన్ని సిట్టింగులు అయిపోయాయి,  రేడియేషన్ అన్న మాట ముగిసిపోయిన అధ్యాయం, ఇకదాని గురించి మాట్లాడకండి” అని వారికే తిరిగి ధైర్యం చెప్పిన వ్యక్తిత్వం  అద్దేపల్లిది.  మరణాన్ని కూడా ప్రశాంతంగా స్వీకరించాలంటే గొప్ప   రుషిత్వం ఉండాలి.

కవిగా, విమర్శకునిగా, వక్తగా, వ్యక్తిగా ఆయన పోషించిన వివిధ పాత్రలను తెలుసుకోవటం ద్వారా  అద్దేపల్లి చేసిన సాహిత్యకృషిని అర్ధం చేసుకొనవచ్చును.

అద్దేపల్లి కి ప్రాచీన సాహిత్యంపై  గొప్ప  పట్టు ఉండేది . మొదట్లో చందోబద్దమైన కొన్ని వందల పద్యాల్ని రచించారు.  1960 లో తొలికవిత కృష్ణాపత్రికలో అచ్చయింది.  కాలక్రమేణా తాను విశ్వసించే  హేతువాద దృక్ఫధం, అభ్యుదయత, ప్రగతిశీల భావాలకు వచనకవిత్వమే సరైనదని అనుకొని వచన కవితామార్గాన్ని ఎంచుకొన్నారు.  ప్రపంచీకరణ ప్రభావం వలన చిధ్రమౌతున్న మానవజీవనంపై కవిత్వం వ్రాసిన తొలి తెలుగుకవి  అద్దేపల్లి.  వీరి కవిత్వ సంపుటాలలో అంతర్జ్వాల (1970), రక్త సంధ్య (1978), గోదావరి నా ప్రతిబింబం (1992), పొగచూరిన ఆకాశం, సంఘం శరణం గచ్చామి, మెరుపు పువ్వు, గీటురాయి వంటివి ప్రముఖమైనవి. మినీ కవితల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి గొప్ప ప్రాచుర్యాన్ని కలిగించారు  అద్దేపల్లి.  తెలుగులో అనేక వందల గజల్ లను రచించి వాటిని గొప్ప రాగయుక్తంగా ఆలపించి అనేక సభలను రంజింపచేసేవారు. వీరి అనేక కవితలు వివిధ భాషలలోకి అనువదింపబడ్డాయి.  కవిగా  అద్దేపల్లి తెలుగు సాహితీలోకంలో ఎప్పటికీ చిరస్మరణీయుడే.

విమర్శకునిగా  అద్దేపల్లి పాత్ర గణనీయమైనది. శ్రీశ్రీ మహాప్రస్థానంపై వీరి మొదటి విమర్శనా గ్రంధం వచ్చి పలువురి ప్రసంశలు పొందింది.  ఈ వార్తవిన్న శ్రీశ్రీ యే స్వయంగా “సరోజినీ, ఈ విషయం విన్నావా, నా పుస్తకం మీద సమీక్షా గ్రంధం వస్తోంది” అని చెప్పటం ఒక మధురమైన ఘట్టం.  కుందుర్తి వచన కవితా వైభవం, స్త్రీవాద కవిత్వం-ఒక పరిశీలన, మహాకవి జాషువా కవితా సమీక్ష, తెలుగు కవిత్వంపై ఆధునికత, అభ్యుదయ విప్లవ కవిత్వాలు- సిద్దాంతాలు, శిల్పరీతులు వంటివి  అద్దేపల్లి వెలువరించిన వివిధ విమర్శనా గ్రంధాలు.  మంచిని విస్తారంగా చర్చించి, చెడును సూచనప్రాయంగా ఎత్తిచూపటం  అద్దేపల్లి విమర్శనా శైలి.

వక్తగా  అద్దేపల్లి సమకాలీన సాహితీవేత్తలెవరూ అందుకోలేనంత ఎత్తులో ఉంటారు.  సభలకు ఎవరైనా పిలిస్తే దూరభారాలకు వెరవకుండా,  తప్పనిసరిగా హాజరయ్యి, ఆ సంస్థలకు, అక్కడి యువకవులకు ఎంతో స్పూర్తిని, ఉత్తేజాన్ని నింపే గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేవారు. రిజర్వేషన్ లేకపోతే 80 ఏళ్ళ వయసులోకూడా జనరల్ భోగీలో ప్రయాణించైనా సరే వస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకొనేవారు  అద్దేపల్లి.  ఈ లక్షణాన్ని గుర్తించిన తెలుగు సాహితీలోకం  అద్దేపల్లికి  “సాహితీ సంచార యోధుడు” అన్న బిరుదును ఇచ్చి సత్కరించింది.  ప్రాచీన, ఆధునిక సాహిత్యాలపై లోతైన అవగాహనతో వీరు చేసే అనర్ఘళమైన ఉపన్యాసాలు, చక్కని ఉటంకింపులతో,  చలోక్తులతో సాగి సభికులను రంజింపచేసేవి.  వీరు గత ముప్పై ఏళ్ళుగా ఇచ్చిన ఉపన్యాసాలు రెండువేలకు పైమాటే.

వ్యక్తిగా అద్దేపల్లి స్నేహశీలి, నిరాడంబరుడు, భోళాశంకరుడు, నిరంతర సాహితీకృషీవలుడు. సమయపాలన విషయంలో  అద్దేపల్లి నిక్కచ్చిగా ఉండేవారు.  వీరు అద్యక్ష్యత వహించిన సభలలో కాలం తూకం వేసినట్టు నడిచేది.   తనకన్నా చిన్నవారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని వారి కవిత్వంలోని గుణగణాలను విప్పిచెప్పి ప్రోత్సహించేవారు. ఎవరైనా   మంచి వాక్యం వ్రాస్తే భలే ఉంది అంటూ వెన్నుతట్టి మెచ్చుకొనేవారు. అద్దేపల్లి అద్యక్షత వహించిన ఒక సభలో నేను నా కవిత వినిపించి వెళిపోతుంటే, నన్ను ఆపి — బొల్లోజు బాబా కవిత్వం వాచ్యంగా ఉండదు ధ్వని ప్రధానంగా ఉంటుంది, ఇప్పుడు చదివిన కవితా పంక్తులలోని సొబగులు ఇవి అంటూ విశ్లేషించి, అభినందించటం— నేను ఎన్నటికీ మరచిపోని ఒక తీపి జ్ఞాపకం.

తెలుగు కవిత్వయోధుడు అద్దేపల్లి రామమోహనరావు ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ…….

 

*

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. kothapalli ravibabu says:

    అవును అద్దేపల్లి సంచార కవిత యోధుడు. సామ్రాజ్యవాదాన్ని ప్రపంచీకరణను దుయ్యబడుతూ కవిత్వమూ, ఉపన్యాసాలూ తెలుగునాట అలసట లేకుండా ఇచ్చిన కవి. చివరివరకు మానసికంగా యవ్వన చైతన్యంతో పరిమళించిన వాడు. ఎటువంటి దుర్వ్యసనాలు లేని వాడు. అటువంటి తెలుగు కవులు మనకు ఈనాడు అరుదు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో నాకు సమకాలికుడు. అద్దేపల్లి తెలుగు, నేను ఇంగ్లీష్ ఎంఏ చదివాము. ఆయనతో పాటు రూం లో ఉండే రామప్ప నాయుడు, చెన్నారెడ్డి మరణించారు. అద్దేపల్లి కి నా జోహార్లు

  2. వంగూరి చిట్టెన్ రాజు says:

    అద్దేపల్లి గారి అస్తమయానికి బాధగా ఉంది, మంచి మిత్రులు, పదిహేనేళ్ళ క్రితం మేము ఇండియాలో ప్రచురించిన అమెరికా తెలుగు కథ మొదటి పుస్తకాన్ని ఆయనే ఆవిష్కరించి విశ్లేషించారు. ఆయన్ని కనీసం మూడు సార్లు అమెరికా ఆహ్వానించినా రాలేకపోయారు. నేను ఎప్పుడు కాకినాడ వెళ్ళినా ఆయనని ఎక్కడో అక్కడ కలుసుకునే వాడిని. ఆయన సాహిత్య కృషి అందరికీ తెలిసినదే. ఆ సాహితీ దిగ్గజానికి జోహార్లు.

  3. amarendra says:

    ఆయన సంచార కవితా యోధుడే గాదు..ఎవరు పిలిచి ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు ఒకరిద్దరు యువకవులనూ తీసుకువెళ్ళి వాళ్లకు విశాల సాహితీ ప్రాపంచాన్నీ , ఆ ప్రపంచానికి వాళ్ళనూ పరిచయం చేసేవారు..అరుదైన మనిషి అద్దేపల్లి..నలభై అయిదు ఏళ్ళ పరిచయం మాది..

  4. Dr.Pasunoori Ravinder says:

    వి మిస్ యూ అద్దేప‌ల్లి…!!
    నాలాంటి యువ‌కవుల‌ను అక్కున చేర్చుకొని, భ‌విష్య‌త్తు మీదే అనేవాడు.
    ఎక్క‌డ క‌లిసినా ఆయ‌న ఆత్మీయ‌తలో మాత్రం మార్పు ఉండేది కాదు.
    గ్రేట్ హ్యుమానిటేరియ‌న్ నేచ‌ర్ ఆయ‌న సొంతం..
    జోహ‌ర్లు అద్దేప‌ల్లి గారికి!!
    -ప‌సునూరి ర‌వీంద‌ర్‌

  5. అద్దేపల్లి ఇక లేరంటే చాలా బాధగా ఉంది.ఆయన మహాప్రస్థానం మీద వెలువరించిన విమర్శా గ్రంధం అమ్దరికీ ఒక వరం.నావి రెండు కవితలు ఆయన స్వయంగా చదివి తన అభిప్రాయాలను చెప్పటం నా అదృష్టం.ఆయన ఆత్మకు శాంతి కలుగు గాక.

    సాహిత్యాభిమాని
    శివ్

  6. sailajamithra says:

    నేడు కవిత్వం చదవకుండా వ్యక్తి మీద ఎవరో చెప్పిన ఒక అభిప్రాయానికి జీవితాంతం కట్టుబడి అదే ముద్రను వేసే సాహితీ లోకంలో నా ‘అంతర్మధన వేళ’ అనే కవిత సంపుటి చదివి ”నువ్వు మంచి కవిత్వం రాస్తున్నావు . ఏదో అర్థం లేకుండా రాస్తుంది అని ఎవరో అంటుంటే నీ కవిత్వంపై నేను పెద్దగా ద్రుష్టి పెట్టలేదు . ఇప్పుడనిపిస్తోంది తప్పు చేసానని అని అప్పటినుండి నా కొత్త కవితల్ని చదివి వినిపించుకుని ‘రాతి చిగుళ్ళు ” అనే కవిత సంపుటికి ముందు మాట రాస్తానని చెప్పి రాసిన గొప్ప వ్యక్తి అద్దేపల్లి. నీకు సాహిత్యం లో మంచి భవిష్యత్తు ఉందని ప్రోత్సహించిన మార్గదర్శి. ఎవరైనా ఎపుడో ఒకరోజు పోవాల్సిన వారమే. అయినా ఏదో ఆశ. మనతో మంచిగా మాట్లాడిన వారు ఇంకొంత కాలం ఉండాలని. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ

  7. కె.కె. రామయ్య says:

    ప్రగతిశీలతకు, ప్రతిభకు మారుపేరైన కవి, విమర్శకుడు, ఉపన్యాసకుడు, నిబద్ధ సామ్యవాద భావుకుడు డాక్టర్‌ అద్దేపల్లి రామమోహనరావు గారు తన ఆరు దశాబ్దాల సాహిత్య యాత్రలోని విస్తారమైన స్నేహ సంబంధాలు, పేరుప్రతిష్టలు, పరిచయాలు స్వంతానికి వాడుకోని విలక్షణ వ్యక్తి. బిరుదుల కోసం, పదవుల కోసం ఎన్నడూ ఆరాటపడని వ్యక్తి. వ్యసనాలు, వ్యామోహాలు దరికి రానివ్వని వ్యక్తి. ( అద్దేపల్లి రామమోహనరావు గారు బందరు వారనే ముచ్చట మిత్రుడు రాజనాల వేంకట రమణ గారి ద్వారా తెలిసింది ).

    ‘నే సలాము చేస్తా ఈ జనానికి, పేదవాడి కోసం పోరు చేసేవాళ్లకు’ అని పాడుతుండే సంచార కవితా యోధుడు, సాహితీ దిగ్గజం అద్దేపల్లికి జోహార్లు.

    వారబ్బాయి ‘రిబెక్కమ్మ కధా రచయిత’ కాకినాడ అద్దేపల్లి ప్రభుకి, సాహితీ కుటుంబ సభ్యులకీ ప్రఘాడ సంతాపాలు.

  8. Aranya Krishna says:

    అద్దేపల్లి వ్యక్తిత్వాన్ని చక్కగా ఆవిష్కరించారు. నిజమే ఆయనో సంచార సాహిత్య యోధుడు. నిగర్వి. మనుశులంటే అపార ప్రేమ. కవిత్వం పేరు చెబితే ఉరకలేసే ఉత్సాహం ఆయనది. కొన్ని సంవత్సరాలు ఆయనకీ సన్నిహితంగా ఉండగలగటమ్ నా అదృశ్టమ్. ఆయన తన కవిత్వాన్ని ప్రమోట్ చేసుకోలేదు ఇతరుల కవిత్వాన్ని ప్రమోట్ చేసుకున్నమ్తగా. ఆయన హుషారు అనితర సాధ్యం. మంచి నివాళి తెలియచేసారు.

  9. అద్దేపల్లి నాకు shahitya గురువు .మా అన్నలకు తెలుగు లెక్చరర్ .కాకినాడ charties కాలేజీ లో అద్దేపల్లి అంటే ఒక తెలుగు నిఘంటువు .కాలేజీ రాజకీయాల జోలికి పోకుండా విద్యార్ధులకు కవులు గురించే చెప్పిన జాతీయ ఉత్తమ uphadhyayudu అద్దేపల్లి .ఒక జ్వాల అద్దేపల్లి.ఒక మెరిసిన పువ్వు అద్దేపల్లి.ఒక గోదావరి కెరటం అద్దేపల్లి. తెలుగు shayitya ప్రపంచంలో చాలామందికి తెలుసో తెలియదో నాకు మాత్రం తెలియదు కానీ ////////////////అతి కష్టత కలిగిన వచనకవిత్వ ధారణ సృష్తికర్త అద్దేపల్లి .నాచే వందలాది వచన కవితలను ధారణ చేయించిన అపర బ్రహ్మ అద్దేపల్లి.వారిని చివరి సారిగా చూచి పాదాభి వందనం చేసుకోలేని నాజీవన గమనాన్ని నేనే తిట్టికుంటూ ——————————వారి కి నా అశ్రు తర్పణం. గురువుగరూ ! —————- మీ కోసం చూస్తూ ఉంటానా ! కనురెప్పలు తెగి పోతాయని పిస్తుంది ! ఇంకా అలాగే చూస్తూ ఉంటానా ! కనుగుడ్డు మీద నీటి పొరకమ్ముకుంటుంది ! అయినాఅదే పనిగా చూస్త్తూ ఉంటానా ! మీరు నా కాళ్ళ నుంచి గోదావరిలా వుప్పొంగుతారు!

మీ మాటలు

*