ఫుట్‌పాత్

ARIF6

-రమా సరస్వతి

~

 

rama‘డిస్గస్టింగ్’ స్మార్ట్‌ఫోన్‌లో న్యూస్ అప్‌డేట్స్ చూసుకుంటూ!

‘వాట్ హ్యాపెండ్’ నిర్వికారంగా ఫోన్‌లోంచి తలెత్తకుండానే ఆమె కొలీగ్.

‘నిన్న రాత్రి ఒంటిగంటకు గాంధీ వే ఫుట్‌పాత్ ఓ ఆడీకార్‌ను ఢీకొట్టిందట.. అందులో ఉన్న ఇద్దరు కుర్రాళ్లు సివియర్ ఇంజ్యూర్డ్ అట.. కండిషన్ క్రిటికల్‌గా ఉందట’..

‘వాట్?’ ఆ ఆశ్చర్యం ఫోన్‌లోంచి తలెత్తి పక్కనే ఉన్న కొలీగ్ మొహంలోకి చూసేలా చేసింది

‘ఊ..’ నిజం అన్నట్టుగా తలడించింది.

‘కాంట్ బిలీవ్ ఇట్.. ఫుట్‌పాత్ కారును హిట్ చేయడమేంటి?’ ఇంకా ఆశ్చర్యం వీడలేదు.

‘అదే కదా!’

‘డీటేల్స్ ఏంటో..?’ ఆశ్చర్యం కుతూహంలా మారింది.

‘ఏంటోలే… క్లయింట్ కాల్ వస్తోంది అటెండ్ చేయాలి’ అంటూ చైర్‌ని సర్రున సిస్టమ్ ముందుకు లాక్కుని ఫోన్ కాల్ అటెండ్ అయ్యే పనిలో పడపోయింది.

కుతూహలం నిరాశ చెంది తనకేమన్నా  డీటేల్స్ దొరుకుతాయేమోనని ఫోన్‌లో వెదికే ప్రయత్నం మొదలుపెట్టింది.

మూడు రోజులయింది

‘గుడ్ మార్నింగ్‌సర్’ ఫోన్‌లో ఆన్సర్ చేశాడు గాంధీవే ఏరియా ఎస్‌ఐ.

‘ఊ…అప్‌డేట్స్ ఏంటీ?’ అవతలి నుంచి సీఐ.

‘ఆ ఇద్దరూ ఇంకా కోమాలోనే ఉన్నారు సర్.. బహుశా బయటపడక పోవచ్చు అని చెప్తున్నారు డాక్టర్లు’

‘ఆ.. నా.. కొడుకుల అయ్యలు..  మన ప్రాణాలను బయటకు తోలేటట్టున్నారు… బిగ్ షాట్స్ వ్యవహారం.. పెద్దోళ్ల ఇన్‌ఫ్లుయెన్స్ యూజ్‌చేస్తున్నారు. ప్రెషర్  ఉంది బాగా. మళ్లీ ఒకసారి ఐ విట్నెసెస్ గురించి ట్రై చెయ్’ స్వరం స్థిరంగా వచ్చింది.అది  ‘ఎం చేసైనా సరే అరెస్ట్ కావాలి’ అన్న సంకేతంగా ఎస్‌ఐకి అర్థమైంది.

‘యెస్.. స..’ అంటుంటేనే అవతల ఫోన్ డిస్కనెక్ట్ అయిన శబ్దం. ‘దీనమ్మ బతుకు’ పళ్లు కొరుక్కుంటూ ఇన్నోవా ఎక్కాడు ఎస్‌ఐ.

————————-

మధ్యాహ్నం పదకొండు గంటలు..  గాంధీవే… టీవీ 101 ఛానల్ వ్యాన్ వచ్చి ఆగింది. బిలబిలమంటూ చిన్నా, పెద్దా అంతా గుంపుగా అక్కడికి చేరారు. బ్లూ జీన్స్, రెడ్ కుర్తా, కర్లీ హెయిర్‌ను బలవంతంగా పోనీగా మలచిన ఓ 22 ఏళ్ల యంగ్ రిపోర్టర్ సెల్ ఫోన్ చూసుకుంటూ వ్యాన్‌లోంచి దిగింది. ఆ వెనకే కెమెరా మేన్, అసిస్టెంటూ దిగారు. యేం మాట్లాడకుండా ఇన్‌స్ట్రక్షన్స్ కోసం వేచి కూడా చేడకుండా కెమెరా యాంగిల్‌ను సెట్ చేసుకోసాగాడు కెమెరా మేన్. లోగో మైక్‌కున్న వైర్‌ను వృత్తాకారంలో చుడుతూ మైక్ తెచ్చి రిపోర్టర్‌కిచ్చాడు అసిస్టెంట్.  ఓ చేత్తో మైక్ పట్టుకొని, ఇంకో చేత్తో సెల్‌చూసుకుంటూ అక్కడ చేరిన గుంపు దగ్గరకు వెళ్లింది. ‘గోపాల్ ఎవరు?’ అడిగింది వాళ్లను ఉద్దేశించి.

‘గోపాల్ లేడు మేడం.. మీరు ఫోన్ చేసిన విషయం చెప్పిండు. నేను చూసుకుంటా… మీకేం కావాల్నో వీళ్లనెవర్ని అడిగినా చెప్తరు’ అన్నాడు ఆ గుంపులోని ఓ పాతికేళ్ల వ్యక్తి. ‘వీళ్లందరూ డిసెంబర్ 31 రాత్రి ఇక్కడే ఉన్నారా?’ అడిగింది.

‘అందరూ ఉన్నారు మేడం..’ అంటూ ‘అరేయ్ సాయి ముందుకు రారా.. ఆ రోజు రాత్రి చూసింది చూసినట్టు మేడంతో చెప్పుడు’అన్నాడు గుంపులో వెనకలా ఉన్న సాయిని పిలుస్తూ.

సాయి ముందుకొచ్చాడు.. సాయితోపాటే ఓ నలుగురు కూడా!

సెల్‌ఫోన్‌ను బ్యాక్‌పాకెట్లో పెట్టుకొని మైక్ సరిచూసుకుంది. కెమెరా మేన్‌కి యాంగిల్ మార్చుకొమ్మని సైగ చేసింది. అతనికి ‘రోలింగ్’ అని చెప్పి ‘యాక్సిడెంట్ జరిగినప్పడు మీరు ఇక్కడే.. ఐ మీన్ ఈ గాంధీ వే ఫుట్‌పాత్ దగ్గరే ఉన్నారా?’ అడిగింది సాయి మూతి ముందు  లోగో మైక్ పెడుతూ.

‘ఆ..’ అని ఆ అబ్బాయి సమాధానం ఇస్తున్నప్పుడే ఈ గుంపుకి చాలా దూరంగా గాంధీవే స్టేషన్ ఎస్‌ఐ  ఇన్నోవా వెహికిల్ ఆగింది.

‘సర్.. మీడియా వాళ్లు. న్యూసెన్స్ చేసి న్యూ న్యూస్ స్ప్రెడ్‌చేయడానికే వచ్చి ఉంటారు’ కోపంగా హెడ్ కానిస్టేబుల్.

‘ఊ.. చెయనియ్ ఏదో ఒకటి’ అంటూ నెమ్మదిగా ఆ గుంపు దగ్గరకి నడిచాడు ఎస్‌ఐ తన వాళ్లను అక్కడే ఆగిపొమ్మని సైగచేస్తూ!

‘ఆ యాక్సిడెంట్ అయినప్పడు టైమెంత?’ రిపోర్టర్

‘రాత్రి ఒకటి అయినట్టుంది మేడం!’

‘మీరెంత మంది ఉన్నారిక్కడ?’

‘పదిపన్నెండు మందిమి!’

‘అంత రాత్రిపూట మీకేం పని ఇక్కడ?’ రిపోర్టర్

‘అరే… మేమంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఉన్నం మేడం!’

ARIF6

‘ఏదీ ఈ రోడ్డు మీద చేసుకుంటున్నారా సెలబ్రేషన్స్’

‘రోడ్డేంది మేడం.. దీన్ని ఆనుకునే గదా.. మా ఇండ్లు.. గాంధీ వే స్లమ్ ఈ సిటీల ఎంత ఫేమసో మీకు తెల్వదనకుంటా..’ గాంధీవే స్లమ్ గొప్పతనాన్ని చెప్పలేకపోతున్నాననే ఫీలింగ్‌తో ఆ అబ్బాయి.

‘కరెక్ట్‌గా సంజయ్ ఆడీకారు ఇక్కడికి వచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు’

‘ రోడ్డు మీద నిప్పురవ్వలు తేలుతయా అన్నంత స్పీడ్‌తో వచ్చింది మేడం కార్. ఆ సౌండ్‌కి అందరం ఆ కారు దిక్కు చూసినం. సరిగ్గా అప్పుడే అగో రోడ్డుకి అటు సైడ్ ఉన్న ఆ ఫుట్‌పాత్  ఈ కారు కన్నా స్పీడ్‌గా రోడ్డు నడిమధ్యలకొచ్చి కారును ఒక్క గుద్దు గుద్ది అంతే స్పీడ్‌గా మళ్లీ దాని జాగలకు అది వెళ్లిపోయింది మేడం!’ తాను చూసిన వింతను అంతే విస్మయంగా వివరిస్తూ చెప్పాడు.

‘మీరు అప్పుడు తాగి ఉన్నారా?’

‘మేడం… మా ఎవరికీ తాగే అలవాటు లేదు. ఆ రోజు పోలీసోళ్లు కూడా చెక్ చేసిండ్రు’ మమ్మల్ని అవమానపరుస్తున్నారు అన్న భావంతో సమాధానం వచ్చింది.

‘మరి లేకపోతే ఫుట్‌పాత్ వచ్చి కారును ఢీకొట్టడమేంటి?’

‘మాకు కనిపిచ్చింది.. మేం చూసింది గదే మేడం.. మేమే కాదు ఆ సౌండ్‌కి ఇండ్లలల్ల ఉన్న మా పెద్దోళ్లు కూడా ఉరికొచ్చిండ్రు కావాలంటే వాళ్లను కూడా అడుగుండ్రి…’  అన్నాడు మైక్ ఉన్న అబ్బాయి పక్క కుర్రాడు.

వీళ్ల ఉత్సాహం వెనకనే ఉన్న ఎస్‌ఐ టీమ్‌ను గ్రహించే పరిస్థితిలో లేదు.

‘ఫుట్‌పాత్ వచ్చి కారుని ఢీకొట్టగానే మీ రియాక్షన్ ఎలా ఉండింది?’ మైక్‌ను ఇందాక జవాబు చెప్పిన అబ్బాయి నోటి ముందుకు మారుస్తూ రిపోర్టర్.

‘షాక్ అయినం. అసలేం జరుగుతుందో అర్థంకాలే. చిన్న పోరలైతే ఫ్రీజ్ అయిండ్రు. పెద్దోళ్లకు మాటరాలే’

‘కార్లో ఉన్న సంజయ్, ఆయన ఫ్రెండ్ సిట్యుయేషన్  ఎలా ఉంది?’

‘బ్యానెట్ తుక్కు తక్కు అయింది.  డ్రైవింగ్ సైడ్ ఉన్న డోర్ ఊడిపోయి ఒకాయన కిందపడ్డడు. మరి ఆయన సంజయో ఇంకెవరో తెల్వదు. తలకు పగిలింది. ఫ్రంట్ సీట్ల బెలూన్లు ఓపెన్ అయినయో లేదో కూడా  తెల్వదు. పక్క సీట్ల ఉన్నాయన డాష్ బోర్డ్ మీదకు వొంగినట్టుంది. ఆయక్కూడ తలకు బాగా దెబ్బ తగిలింది. కింద పడ్డాయనను చూసి మా అమ్మకు చెక్కరొచ్చింది. ఆయన దాహం.. దాహం అని అడిగిండు. అగో మురళిగాడి దగ్గర బాటిల్ ఉండే తాగించడానికి ట్రై చేసిండు కానీ తాగలే… స్పృహ తప్పిపోయిండు’ కళ్లకు కట్టినట్లు చెప్పాడు ఆ అబ్బాయి.

‘104కి ఫోన్‌చేయలేదా?’

‘చేసినం.. అదొచ్చే సరికి అద్దగంట అయింది. పోలీస్‌లకు కూడా కాల్ చేసినం’

‘వాళ్ల ఫ్రెండ్స్‌కి ఎలా తెలిసింది?’

‘పోలీసోలొచ్చిన తర్వాత కిందపడ్డాయన జేబుల్నించి సెల్ దీసి అందులనుంచి ఎవరెవరికో కాల్ చేసిండ్రు. అండ్ల వాళ్ల ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు’

‘కావచ్చు.. ఎందుకంటే ఓ అయిదారుగురు బుల్లెట్ బండ్లేసుకొని వచ్చిండ్రు గాంధీవేలనే ఉన్న లూథర్‌కింగ్ పబ్‌కెంచి’ గుంపులోని ఇంకో అతను చెప్పాడు.

‘నీకెలా తెలుసు వాళ్లు లూథర్‌కింగ్ పబ్‌నుంచే వచ్చారని.. వాళ్లు సంజయ్ ఫ్రెండ్సే అని!’ రిపోర్టర్ కొనసాగించింది.

‘ఆ వచ్చినోళ్లు పోలీసోళ్లతో చెప్తుంటే విన్నా..  ఇప్పటిదాకా మాతోనే ఉన్నాడు సర్.. లూథర్‌కింగ్ పబ్‌లో! ఇందాకనే ఏదో ఫోన్ వచ్చిందని బయలుదేరాడు అనిల్‌తో కలిసి’ అని’’ చెప్పాడు.

ఇంచుమించు అలాంటి ప్రశ్నలనే తిరగేసి.. మరగేసి ఇంకో అయిదుగుర్ని అడిగింది. అందులో ఇద్దరు ఆడవాళ్లు కూడా ఉన్నారు. పెద్ద శబ్దం వస్తే బయటకు వచ్చి చూశామని అప్పటికే అతను కిందపడిపోయి ఉన్నాడని… అంతకుమించి తమకేం తెలియదని చెప్పారు.. మైక్ పెట్టనీయకుండా.. కెమెరా వైపు చూడకుండా!

రిపోర్టర్  మైక్ తీసుకొని వెంటనే కెమెరా వైపు తిరిగి ‘డిసెంబర్ థర్టీఫస్ట్ ఒంటి గంట రాత్రి గాంధీవే ఫుట్‌పాత్ దగ్గర జరిగిన యాక్సిడెంట్‌కి వీళ్లు ప్రత్యక్ష్య సాక్షులు. ఈ సాక్షులు చెప్తున్నది వింటుంటే ఆ రాత్రేదో మాయా జరిగినట్టు.. ఫుట్‌పాత్‌కి కాళ్లు.. ఆ కాళ్లకు చక్రాలు మొలిచినట్టు.. అదే సంజయ్ కారును ఢీకొట్టినట్టు తేలుతోంది. ఆ రాత్రి వీళ్లు తప్ప ఇంకెవరూ అక్కడ లేరు.. న్యూ ఇయర్‌సెలబ్రేషన్స్ జరిగే సమయం.. కుర్రకారుకు హుషారు ఎక్కువై ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నా పోలీస్ పెట్రోలింగ్ లేదు. దాంతో ఈ యాక్సిడెంట్‌కి ఇంకో విట్నెస్ లేకుండా పోయింది. ఏమైనా ఈ యాక్సిడెంట్ మిస్టరీ వీడే ఛాన్సే లేక ఈ ‘హిట్ అండ్ కిల్’ కేసు ఎక్కడ మొదలైన ఫుట్‌పాత్ అక్కడే ఆగిపోయిన చందంగా ఉండేట్టుంది. టీవీ 101 కోసం కెమెరామేన్ రాంబాబుతో గంగాభవాని’ అంటూ గబగబా పీస్ టు కెమెరా ప్రెజెంటేషన్ ఇచ్చేసింది   రిపోర్టర్.

‘మనం ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం లేదు సర్’ అని ఎస్‌ఐతో హెడ్ అంటుంటే టీవీ 101 ఛానల్ వ్యాన్ రేజ్ చేసుకుంటూ వెళ్లిపోయింది. అది వదిలిన పొగతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు ఎస్‌ఐ అండ్ టీమ్.

———————————————————

ARIF6‘చనిపోయారు కదా.. .. గొడవ పెద్దగానే ఉంటది’ లాయర్ అంటున్నాడు.

‘బలిసినోళ్ల ప్రాణం కదా సర్ తీపిగానే ఉంటది. ఆ రోజు ఈ నా కొడుకులే తప్పతాగి ఫుట్‌పాత్ మీదున్న మా వాళ్ల మీదకు కార్‌ను తోలినప్పుడు   వాళ్ల అయ్యలకు తెల్సుంటే బాగుండేది సర్ మాలాంటోళ్ల ప్రాణాలు కూడా అంతే తీపిగా ఉంటాయని’ గోపాల్ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి.. పూడుకుపోయిన దుఃఖంతో గొంతు పెగలట్లేదు.

తెల్లవారి… ఏడు గంటలకు  కాలనీ పార్క్‌లో … రిటైర్డ్ పర్సన్స్ ఇద్దరూ మార్నింగ్ వాక్ చేస్తూ…

‘ఫుట్‌పాత్ మనుషుల్ని చంపడమేంటి? అందులో ఏ ఫుట్‌పాత్‌కి సంబంధించి హిట్ అండ్ రన్‌లో నిర్దోషులుగా తేలారో వాళ్లను’ ఆశ్చర్యం, అనుమానంతో అన్నాడు.

‘ఆశ్చర్యమేముంది సర్.. చుండూరు కేసులో దళితులే వాళ్లను వాళ్లు చంపుకొని గోతాముల్లో కుట్టుకుని చెరువులోకి దూకగలిగినప్పుడు,  హిట్ అండ్ రన్ కేసులో ఫుట్‌పాత్ మీద పడుకున్న వాళ్లను ఫుట్‌పాతే పొట్టనపెట్టుకోగలిగినప్పుడు.. హిట్ అండ్ కిల్ కేసులో ఫుట్‌పాతే యాక్సిడెంట్ చేయడంలో ఆశ్చర్యమేముంది? వింతేముంది సర్!’ తేలిగ్గా చెప్పేశాడు ఇంకోతను.

అయోమయంగా చూస్తూ  అతన్ని  అనుసరించాడు మొదటి వ్యక్తి!

*

 

 

 

 

మీ మాటలు

  1. చందు - తులసి says:

    పాయింటే…!

  2. మాధవ్ శింగరాజు says:

    ‘రోడ్డేంది మేడం.. దీన్ని ఆనుకునే గదా.. మా ఇండ్లు..

    అరె! వా!! స్ట్రింగ్ ని లాగిపట్టి బాణం వదిలారు రమగారూ!

    ఇలాంటి ఒక్క వాక్యం చాలు… మన సోషల్ సిస్టమ్ మొత్తాన్నీ వైబ్రేట్ చేయడానికి.

    దేవుడు మనకొక వీధిని ఇల్లుగా ఇస్తాడు. ప్రభుత్వాలు ఆ ఇంటిని చదును చేసి ఫుట్ పాత్ లు కట్టిస్తాయి!!

  3. Hemalata.Ayyagari says:

    అద్భుతం! ఇటీవలి పర్నమలను చెప్పుతో కొట్టినట్టు వ్రాసారు.

  4. తహిరో says:

    రమా … లాజిక్ బాగుంది . పతంజలి “పిలక తిరుగుడు పువ్వు ” కథ గుర్తుకొచ్చింది. చూసినవా … నీ కథ ప్రభావం – అంతర్జాలం దిక్కు కన్నెత్తి చూడని మాధవ్ కూడా కామెంట్ పెట్టిండు :)

  5. Y RAJYALAKSHMI says:

    చాల బావుంది. భలే రాసారు.

  6. గుడ్‌, మంచి ప్రయత్నం రమా!
    కాకపోతే ఒక చిన్న అబ్సర్వేషన్‌. ఆ బస్తీ పోరగాళ్లు తాగకుండా ఎందుకు అడ్డుకున్నవ్‌. అసలు ఆ ప్రస్తావనే రాకపోతే కథ వేరు. ఆ ప్రస్తావన చేసి దానికి వాల్యూలోడెడ్‌ వాక్యం యాడ్‌ చేసి- ఎందుకు అదంతా? డిసెంబర్‌ 31 రాత్రి పబ్బుల్లో పార్టీలుంటే బస్తీల్లో మాత్రం భజన కార్యక్రమాలు ఉంటాయా!(భజన కంటే తాగుడే బెటరనుకో, అది వేరే విషయం). మనం ఎవరి వైపున అయినా నిలబడడానికి వారు తాగని వారు కానక్కర్లేదు. మనం మంచి అనుకునే ఏవో కొన్ని పనులు చేసేవారో మనం చెడు అనుకునే ఏవో కొన్ని పనులు చేయనివారో కానక్కర్లేదు. వాళ్లకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నిలబడతాం మన చైతన్యాన్ని బట్టి, అంతే. ఈ రకమైన ధోరణిని వదిలించుకోవాల్సి ఉంది.

  7. THIRUPALU says:

    మార్నింగ్ వాక్ చేస్తూ రిటైర్డ్ పర్సన్స్ ఇద్దరూ ఇచ్చిన జడ్జిమెంట్ సూపర్ !

  8. రమ, కథ బాగుంది.. రాంమోహన్ గారు మీతో ఏకీభవించలేను..మీరు అభ్యంతరం చెప్తున్న విషయమే కథకు ప్రాణం. బస్తీ లో చాలా మంది మద్యానికి దూరంగా ఉంటారనే వాస్తవం ఎక్కడో చోట ప్రస్తావనకు రావాలి.

Leave a Reply to మాధవ్ శింగరాజు Cancel reply

*