ట్రాయ్ తవ్వకాలలో ‘శివలింగా’లు, యోని చిహ్నాలు

 

స్లీమన్ కథ-19

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

అన్ని వైపులనుంచీ దాడికి సిద్ధమైన స్లీమన్, మొదటగా టర్కీలో అమెరికా రాయబారిగా ఉన్న వేన్ మేక్విగ్ కు ఒక సుదీర్ఘమైన ఉత్తరం రాశాడు. దానికి 4వేల పియాస్టర్లను జతపరిచాడు. తను హిస్సాలిక్ వెళ్లడానికీ, అక్కడి దిబ్బను కొనుగోలు చేయడానికీ విద్యామంత్రి సఫ్వెట్ పాషా ఒకవైపున అనుమతిస్తూనే, ఇంకోవైపు 3వేల పియాస్టర్లకు తనే దానిని కొనేసి మోసగించాడనీ; ఆ దిబ్బ తనకే చెందాలనీ, కనుక  మీ జోక్యాన్ని కోరుతూ దాని మూల్యం 3వేల పియాస్టర్లతో పాటు, మీ ఖర్చుల నిమిత్తం మరో వెయ్యి పియాస్టర్లు పంపుతున్నాననీ అందులో రాశాడు. ఇది వ్యాపార లావాదేవీ కాదనీ, చరిత్రకు సంబంధించిన ఒక అతి పెద్ద చిక్కుముడిని విప్పడానికి జరిపే ప్రయత్నమనీ, ఇందులో మనం వేసే ప్రతి అడుగూ మొత్తం నాగరిక ప్రపంచపు ప్రశంసలను అందుకుంటుందనీ అన్నాడు. ఆపైన కాన్ స్టాంట్ నోపిల్ లోని అధికారులకు మరెన్నో లేఖలు గుప్పించాడు. వాటిలో బెదిరింపులు, వేడికోళ్ళు, శాపనార్ధాలతో సహా అన్ని రకాల బాణీలనూ రంగరించాడు.

అయితే, ఈ లోపున అత్యవసరంగా పట్టించుకోవలసిన ఇతర పరిణామాలు తోసుకొచ్చాయి. ఆ చలికాలంలో పారిస్ నగరం ప్రష్యన్ సేనల భారీ ఫిరంగి పేలుళ్లతో దద్దరిల్లింది. తన ఆస్తుల భద్రతను తలచుకుని స్లీమన్ భయపడిపోయాడు. 6 ప్లేస్ స్ట్రీట్ మిషెల్ లో ఉన్న తన అపార్ట్ మెంట్ పై అతనికి విపరీతమైన మక్కువ. అతని పుస్తకాలూ; తూర్పు దేశాలనుంచీ, ఇథకా, తేరా లనుంచీ అతను సేకరించిన చిన్నపాటి పురావస్తు సంపదా అందులోనే ఉన్నాయి. ఒడీసీయెస్ చితాభస్మం ఉన్న కలశం కూడా వాటిలో ఉంది.

దాంతో హుటాహుటిన పారిస్ కు బయలుదేరాడు. ఎథెన్స్ లోని ప్రష్యన్ రాయబారినుంచి పరిచయలేఖ తీసుకుని మ్యూనిక్ వెళ్ళాడు. అక్కడ మరిన్ని పరిచయలేఖలు తీసుకుని స్ట్రాస్ బర్గ్ వెళ్ళి గవర్నర్ జనరల్ కౌంట్ బిస్మార్క్ బొలెన్ ను కలసుకున్నాడు. అక్కడినుంచి వెర్సై వెళ్ళి బిస్మార్క్ చేతులమీదుగా పారిస్ వెళ్ళేందుకు అనుమతిపత్రం తీసుకోడానికి ప్రయత్నించాడు. కానీ, శాంతి నెలకొనేదాకా పారిస్ లోకి ఎవరూ అడుగుపెట్టడానికి వీల్లేదంటూ బిస్మార్క్ తోపాటు అధ్యక్షుడు జూల్స్ ఫవ్రా కూడా అతని అభ్యర్ధనను తిరస్కరించాడు.

తన దారికి అడ్డువచ్చే సాధారణ చట్టాలనే కాదు, సైనిక శాసనాలను కూడా స్వేచ్ఛకు ఆటంకాలుగా భావించి మండిపడే స్వభావం అతనిది. అయిదు ఫ్రాంకులు చెల్లించి, క్లైన్ అనే పేరుతో ఒక నకిలీ పాస్ పోర్ట్ సంపాదించాడు. అతనికి యాభై ఏళ్ళు ఉన్నా దానిమీద ఫోటో మాత్రం ఓ ముప్పై ఏళ్ల యువకుడిది. తప్పనిసరిగా అతను జర్మనీ మీదుగా వెళ్ళాల్సిందే కనుక, అనుమానంతో మూడుసార్లు అతన్ని నిర్బంధంలోకి తీసుకుని ప్రశ్నించారు. యుక్తితో తప్పించుకుని బయటపడ్డాననీ, లేకపోతే గోడకు అభిముఖంగా నిలబెట్టి కాల్చి చంపేసేవారని ఆ తర్వాత రాసుకున్నాడు. జర్మన్లకు బిరుదులు, పదవుల పిచ్చి ఎక్కువ కనుక, ప్రతి లెఫ్టినెంటునూ జనరల్ గానూ, ప్రతి సైనికుణ్ణీ కల్నల్ గానూ సంబోధించడంతో వాళ్ళు ఉబ్బిపోయి వదిలేశారు.

పారిస్ పూర్తిగా ధ్వంసమైనట్టు ఎథెన్స్ లో అతనికి అందిన సమాచారం. తీరా చూస్తే అలాంటిదేమీలేదు. పాంథియన్, సెయింట్ సుల్పీస్ చర్చి, సర్బాన్ సహా  పరిచితమైన భవంతులన్నీ అలాగే ఉన్నాయి. అతని అపార్ట్ మెంటూ, దాని పక్కనే ఉన్న అతని మరో ఇల్లూ, ఎలా విడిచి వెళ్లాడో అలాగే ఉన్నాయి. లైబ్రరీలోకి అడుగుపెట్టినప్పుడు తన చెక్కిళ్ళ వెంట ఆనందబాష్పాలు రాలాయని, చనిపోయాడనుకున్న పిల్లవాడు బతికి కళ్ళు తెరిస్తే ఎలాంటి అనుభూతికి లోనవుతామో అలాంటి అనుభూతికి లోనయ్యాననీ అతను చెప్పుకున్నాడు. విచిత్రంగా అతని పొరుగిల్లు మాత్రం దెబ్బతింది. దానిని చూడగానే, మేమెల్ లో అన్ని గిడ్డంగులూ అగ్నికి ఆహుతై తన గిడ్డంగి మాత్రం భద్రంగా ఉన్న సంగతి గుర్తొచ్చింది. మరోసారి ఏ అదృశ్యశక్తో, ఏ దైవిక ప్రయోజనం కోసమో తనను విధ్వంసం నుంచి కాపాడిందనుకున్నాడు. వసంతం అడుగుపెట్టడంతో చెట్లన్నీ పూల దుప్పటీ కప్పుకున్నట్టు ఉన్నాయి. కమ్యూన్ కింద  కూడా పారిస్ ఎప్పటిలానే సొగసులీనింది.

“పారిస్ లో పెద్దగా మార్పేమీ లేదు. వీథుల్లో జనసందోహం వెనకటిలానే ఉంది. అయితే గుర్రపు బండ్లు మాత్రం తక్కువగా ఉన్నాయి. ఎన్నోగుర్రాలను చంపి తినేయడమే కారణం. రాత్రిళ్ళు మాత్రం పారిస్ అంతటా ఏదో విషాదం పరచుకున్నట్టు ఉంటోంది. వీథుల్లో ఒకే ఒక చమురు దీపం వెలుగుతోంది. గ్యాస్ లైట్లు లేకపోవడంతో థియేటర్లు పగలు మాత్రమే నడుస్తున్నాయి. సర్బాన్ మినహా మ్యూజియంలు, లైబ్రరీలు అన్నీ మూతబడ్డాయి. కాలేజ్ ఆఫ్ ఫ్రాన్స్ ను రేపే తెరవబోతున్నారన్న వార్త ఆనందం నింపింది. పారిస్ లో చెట్లన్నీ కూల్చేశారన్నారు. కానీ అన్ని చెట్లూ అలాగే ఉన్నాయి” అని, ఊటెంబర్గ్ లో ఉండే ఒక వర్తకమిత్రుడు గాట్షాక్ కు రాసిన ఉత్తరంలో అన్నాడు.

పారిస్ పూర్తిగా కమ్యూనార్డ్ ల అధీనంలోకి వెళ్ళిన తర్వాత కూడా స్లీమన్ అక్కడే ఉండిపోయాడు. రాచరికం కింద ఉన్న జర్మనీపై కంటే ఫ్రాన్స్ పైనే అతనికి ఎక్కువ నమ్మకం కుదిరింది. యుద్ధగమనాన్ని దూరం నుంచి చూస్తూ తన అధ్యయనంలో ప్రశాంతంగా గడిపాడు. ఈ మధ్యలో ఫ్రాంక్ కల్వర్ట్ కు ఉత్తరం రాస్తూ, తనూ, సఫ్వెట్ పాషా, అమెరికా రాయబారీ కలసి మాట్లాడుకుంటే ప్రయోజనం ఉండచ్చనిపిస్తోందన్నాడు. ఇంతకుముందు హిస్సాలిక్ దగ్గర నిక్షేపాలు బయటపడిన సంగతి అతనికి గుర్తుంది. ఆ ప్రదేశం తను తవ్వించిన మొదటి కందకానికి ఎంతో దూరంలో లేదు. ఆంటియోకస్ ది గ్రేట్ కాలానికి చెందిన 12వందల భారీ రజత పతకాలు అక్కడ బయటపడ్డాయి. మంత్రి తన ప్రయత్నాలకు మోకాలు అడ్డడానికి అదీ ఒక కారణం కావచ్చు ననుకున్నాడు. అదే నిజమైతే అక్కడి నిధినిక్షేపాల మీద తనకు ఎలాంటి ఆసక్తీ లేనట్టు కనిపించడమే మార్గమని అతనికి తోచింది. అక్కడ వెండి, బంగారు నిక్షేపాలను కనుగొనడమే జరిగితే, ఒక్క నాణేన్ని కూడా విడిచిపెట్టకుండా మంత్రికి ఇవ్వడానికి తను సిద్ధమేననీ, తవ్వకాలు జరిపేచోట మంత్రిత్వశాఖకు చెందిన ఇద్దరు కాపలాదారులను నియమించుకోవచ్చనీ, అయితే ఒక విషయంలో మాత్రం తను ఎట్టి పరిస్థితులలోనూ రాజీపడేది లేదనీ అన్నాడు. హిస్సాలిక్ దిబ్బ మీద తనకు పూర్తి యాజమాన్య హక్కు లభించాల్సిందే! అంతవరకూ తను తిరిగి తవ్వకాలను చేపెట్టే ప్రశ్న లేదు. కేవలం ట్రాయ్ ఉనికిని నిరూపించడం తప్ప తనకు ఇందులో మరెలాంటి స్వార్థమూ లేదు. పైగా, ఈ లక్ష్యసాధనకోసం జీవితాన్నే కాదు, అపారమైన ధనాన్నీ ధారపోయడానికి తను సిద్ధమయ్యాడు. ఇంకా కావాలంటే, అక్కడ లభించే వెండి, బంగారాలకు రెట్టింపు విలువను ప్రభుత్వానికి ముట్టజెప్పడానికీ తను తయారుగా ఉన్నాడు. కాకపోతే, ప్రభుత్వ స్థలంలో తవ్వకాలు జరిపి రేపు జీవితాంతం దాని పర్యవసానాలను ఎదుర్కొనే ఓపిక మాత్రం తనకు లేదు. కనుక ఆ దిబ్బ సొంతం అయితేనే తిరిగి తవ్వకాలు ప్రారంభిస్తాడు.

అయితే, ఇదంతా పైకి వినిపించిన వాదమే తప్ప నిజం కాదు. తవ్వకాలలో లభించబోయే నిధినిక్షేపాలను తను చేజిక్కించుకుని తీరాలని అతను అప్పటికే నిర్ణయించుకున్నాడు. ఆ టర్కులిద్దరూ తనను వంచించబోయారు కనుక, ఒక ఆరితేరిన వర్తకుడిగా వారి ఎత్తుకు పై ఎత్తు వేసి వారిని తను వంచించదలచుకున్నాడు. ఆ రోజుల్లో తరచు తన అభిమాన పాత్ర అయిన ఒడీసియెస్ ను గుర్తుచేసుకునే వాడు. దేశదిమ్మరి అయిన ఒడీసీయెస్ వంచనలోనూ సిద్ధహస్తుడే. అతని ప్రభావం స్లీమన్ పై బాల్యంలోనే పడింది. ఆపైన  సోఫియా ఇప్పుడు గర్భవతి. కొడుకే పుడతాడన్న నమ్మకంతో ఒడీసియెస్ పేరు పెట్టాలని అప్పటికే అతను నిర్ణయించుకున్నాడు.

ఎలాంటి జంకూ కొంకూ లేకుండా మరోసారి నకిలీ పాస్ పోర్ట్ తో జర్మనీ మీదుగా ప్రయాణించి మే నెలలో ఎథెన్స్ కు చేరుకున్నాడు. సోఫియా ప్రసవించింది. ఆడపిల్ల. ఆ పిల్లకు ట్రాయ్ వీరుడు హెక్టర్ భార్య యండ్రోమకి పేరు పెట్టేశాడు.

జూన్ లో కాన్ స్టాంట్ నోపిల్ కు వెళ్ళి సఫ్వెట్ పాషాను కలిశాడు. అమెరికా రాయబారి వేన్ మేక్విగ్, రాయబార కార్యాలయం కార్యదర్శి జాన్ బ్రౌన్ ల సహకారంతో అక్షరరూపమిచ్చిన కొత్త ప్రతిపాదనను అతని ముందు ఉంచాడు. దాని ప్రకారం, హిస్సాలిక్ దిబ్బపై యాజమాన్య హక్కుకు తను పట్టుబట్టడు. అక్కడి తవ్వకాలలో గొప్ప నిధినిక్షేపాలు దొరుకుతాయని తను భావించడం లేదు. ఒకవేళ దొరకడమే జరిగితే, ఉభయులం(తనూ, టర్కిష్ ప్రభుత్వమూ) దానిని సమానంగా పంచుకోవాలి. తన భాగాన్ని దేశం నుంచి తరలించడానికి అనుమతించాలి. తవ్వకాలకు అయ్యే ఖర్చంతా తనే భరిస్తాడు. ప్రభుత్వమే ఆ దిబ్బను కొనేసి ఆ టర్కుల తలనొప్పి వదిలించింది కనుక దానిపై తను హక్కును కోరబోడు. అయితే, ఆ మారుమూల ప్రాంతంలో, ఒక విదేశీయుడిగా తనకూ, అక్కడ వెలుగు చూసే చారిత్రక సంపదకూ ప్రభుత్వం రక్షణ కల్పించాలి.

1871, ఆగస్టు 2న అతను లండన్ లో ఉండగా, కాన్ స్టాంట్ నోపిల్ లోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి ఒక సీల్డు పెట్టె అందింది. అందులో టర్కిష్ ప్రభుత్వం ఇచ్చిన ఫర్మానా ఉంది. తక్షణమే తవ్వకాలను ప్రారంభించే తహతహలో ఉన్న స్లీమన్ అప్పటికప్పుడు ఫ్రాంక్ కల్వర్ట్ కు ఉత్తరం రాశాడు. సెప్టెంబర్ చివరిలో తను తవ్వకాలను చేపట్టాలనుకుంటున్నాననీ, అక్టోబర్ లో దర్దనెల్లెస్ వాతావరణం ఎలా ఉంటుందో, అప్పటికి జ్వరాలు వగైరా తగ్గుముఖం పడతాయో లేదో తన ఎథెన్స్ చిరునామాకు ఉత్తరం రాయవలసిందనీ కోరాడు.

సెప్టెంబర్ 27న భార్యతో కలసి దర్దనెల్లెస్ చేరుకున్నాడు. తీరా వెళ్ళాక ఫర్మానా పాఠంపై సందేహాలు తలెత్తాయి. అది హిస్సాలిక్ దిబ్బ గురించే ప్రస్తావిస్తోందా అన్నది స్పష్టం కాలేదు. ఆపైన దర్దనెల్లెస్ గవర్నర్ అక్మెడ్ పాషాకు ఎలాంటి ఉత్తర్వూ రాలేదు. తవ్వకాలప్పుడు “ పురాతన, చరిత్రప్రసిద్ధమైన ఆ నగరం తాలూకు ప్రాకారాలకు ఎలాంటి హానీ జరగకూడదు” అని ఆ ఫర్మానా ఆదేశిస్తోంది. పొరపాటున ఏ గోడో దెబ్బతింటే పర్యవసానాలు ఎలా ఉంటాయో అతనికి అర్థం కాలేదు.

సందేహాలతో సతమతమవుతూనే  సిప్లాక్ గ్రామంలో తన ముఖ్యకార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మేస్త్రీని, పనివాళ్లను నియమించుకున్నాడు. తోపుడు బళ్ళు, తట్టలు, పారలు, గొడ్డళ్ళు సహా సామగ్రి అంతా సిద్ధంగా ఉంది.  ఆ దిబ్బ మీద దాడికి దిగడానికి ముందు, అధికారుల మందకొడితనం అనే చివరి అడ్డంకిని దాటడం ఒక్కటే మిగిలింది. ఫర్మానాపై సందేహానివృత్తిని కోరుతూ జాన్ బ్రౌన్ కు అత్యవసర సందేశం పంపించాడు. స్పందన లేకపోవడంతో మూడు రోజుల తర్వాత మళ్ళీ పంపాడు. టర్కిష్ ప్రభుత్వం కల్పించిన పూర్తి రక్షణలో ఎట్టకేలకు అక్టోబర్ 11 వ తేదీన పని ప్రారంభించాడు.

ప్రభుత్వం జియోర్జోస్ సర్కిస్ అనే అధికారిని తన కాపలాదారుగా నియమించింది.  పుట్టుకతో అతను ఆర్మేనియన్. ఇంతకుముందు దర్దనెల్లెస్ లోని చాన్సెరీ ఆఫ్ జస్టిస్ లో సెకండ్ సెక్రెటరీగా పనిచేశాడు. స్లీమన్ కు నీడలా వెన్నంటి ఉంటూ, ప్రభుత్వం కళ్ళు కప్పి అక్కడినుంచి ఎలాంటి నిధినిక్షేపాలనూ తరలించకుండా నిరంతరం కాపలా కాయడం అతని పని. స్లీమన్ మాటల్లో చెప్పాలంటే ప్రభుత్వానికి అతను “కళ్ళూ-చెవులూ”.

స్లీమన్ ఫ్రాన్స్ నుంచి ఎనిమిది తోపుడు బళ్ళు తెప్పించుకున్నాడు. కనుక మొదటి రోజున ఎనిమిదిమందిని పనిలోకి దింపాడు. తవ్వకాలు చురుగ్గా సాగడంతో మరునాడు ముప్పై అయిదుగురినీ, ఆ మరునాడు డెబ్బై నలుగురినీ పనిలోకి తీసుకున్నాడు. ఒక్కొక్కరికీ 9 పియాస్టర్లు చెల్లించాడు. వేతనాల చెల్లింపు నికొలస్ జెఫిరోస్ జానకిస్ అనే స్ఫురద్రూపి అయిన ఓ గ్రీకు చేతిమీదుగా జరిగేది. స్లీమన్ తన వివాహమైన వెంటనే అతన్ని ఉద్యోగంలోకి తీసుకున్నాడు. రెంకోయ్ గ్రామానికి చెందిన జానకిస్ కు స్థానిక మాండలికాలు అన్నీ తెలుసు. స్లీమన్ కు అంగరక్షకుడు, వంటమనిషి, డబ్బు లావాదేవీలు జరిపేవాడూ…అన్నీ అతనే. తన దగ్గర పనిచేసే ప్రతి ఒకరినీ గ్రీకు పురాణాలలోని ఏదో ఒక పేరుతో పిలవడం స్లీమన్ కు అలవాటు. కానీ తనకెంతో నమ్మకస్తుడైన జానకిస్ ను మాత్రం అసలు పేరుతోనే పిలిచేవాడు. స్లీమన్ ఎక్కడున్నా అతని దరిదాపుల్లో జానకిస్ విధిగా ఉండాల్సిందే. స్థానిక అధికారికి ఎవరికైనా చేతులు తడపాల్సి వస్తే, స్లీమన్ దానిని జానకిస్ కు వదిలేసేవాడు. ముడుపుల చెల్లింపు కోసం, ఇతర ఖర్చుల కోసం జానకిస్ తన బెల్టు కింద బంగారు నాణేలను ఎప్పుడూ ఉంచుకునేవాడు.

వర్షాలు మొదలయ్యాయి, అయినా తవ్వకాలు కొనసాగాయి. ఎప్పటిలా స్లీమన్ తొందరలో ఉన్నాడు. ఆరు వారాల్లో ప్రియామ్ ప్రాసాదాన్ని వెలికి తీయాలని అనుకున్నాడు. వర్షంలో కూడా పనివాళ్లు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరువరకు పని చేశారు. మధ్యలో ఉదయం తొమ్మిదింటికి అరగంటసేపు అల్పాహార విరామం. మధ్యాహ్నం గంటన్నరసేపు భోజన విరామం. అప్పుడు తప్ప మరెప్పుడూ పొగ తాగడానికి వీల్లేదు. ధూమపానం మనిషి శక్తిని తగ్గిస్తుందనీ, ఏకాగ్రతను దెబ్బతీస్తుందనీ స్లీమన్ సిద్ధాంతం. పని జరుగుతున్నంత సేపూ అతను చండశాసనుడు. పని వాళ్ళ పీకల మీద ఉన్నట్టు ఉండేవాడు. వర్షాలను, మధ్య మధ్య పనికి ఆటంకమయ్యే గ్రీకు శ్రాద్ధదినాలనూ తిట్టిపోసేవాడు. దానికితోడు నెలలో మూడుసార్లు తుపానులు సంభవించి, తవ్వకాలను నిలిపివేయవలసివచ్చింది. ఆ విరామకాలంలో తవ్వకాల గురించిన నివేదికలు రాసుకునేవాడు.

రాయడానికి కూడా పెద్దగా ఏమీ కనిపించలేదు. కొన్ని నాణేలూ, కాలిన ఎముకలు, భారీ కుడ్యాలు, హోమర్ కంటే కూడా చాలా వెనకటి కాలానికి చెందిన విచిత్రమైన లింగాకృతులు బయటపడ్డాయి. ఇవి చక్కగా మెరుగుపెట్టిన నల్లరాతి లింగాకృతులు. వీటిలో కొన్నిటిపై తెల్లని చారలున్నాయి. అక్టోబర్ 30న జరిపిన తవ్వకాలలో ఇవే కాక, ఆకుపచ్చని రాయితో చేసిన బల్లెం పిడులు, అగ్నిపర్వతాలను తలపించే చిత్రమైన ఆకృతులు, పంది కోరలు, దంతాలు వందల సంఖ్యలో వెలికివచ్చాయి. ఆ తర్వాత కూడా రోజు రోజుకీ ఇలాంటివే బయటపడడం ప్రారంభించాయి. ఇంకా లోపలికి వెడుతున్న కొద్దీ గుడ్లగూబను పోలిన చిన్న చిన్న మృణ్మయమూర్తులు, గుడ్లగూబ తలను చెక్కిన రాతిపలకలు తగిలాయి. వాటిని చూడగానే ‘గుడ్లగూబ  ముఖం’ కలిగిన ఎథెనా గురించి హోమర్ చెప్పడం స్లీమన్ కు గుర్తొచ్చింది. గుడ్లగూబ పల్లాస్ ఎథెనాకు చెందిన ఓ పవిత్రచిహ్నం. కన్య అయిన ఎథెనా, ఎథెన్స్ కు రక్షణ దేవత. ఈ దేవత కళ్ళు గుడ్లగూబ కళ్లలా ప్రకాశవంతంగానూ, చీకట్లో కూడా చూడగలిగేలానూ ఉంటాయని ‘గుడ్లగూబ ముఖం కలిగిన ఎథెనా’ అన్న హోమర్ మాటకు పండితులు అర్థం చెప్పారు.

పదడుగుల లోతున, చిన్నపాటి బొంగరం ఆకారంలో ఉన్న మృణ్మయమూర్తులు కనిపించడం, వాటిలో కొన్నింటికి రెండు రంధ్రాలు ఉండడం చూసి స్లీమన్ మరింత విస్తుపోయాడు. భారతదేశంలోని దేవాలయాలలో తను చూసిన నల్లరాతి భారీ శివలింగాలు అతనికి చటుక్కున గుర్తొచ్చాయి. ఈ తవ్వకాలలో కూడా పెద్ద సంఖ్యలో కనిపించిన లింగాకృతులు పురుషసూత్రానికి చెందినవైతే; రంధ్రాలు చేసిన బొంగరం ఆకృతులు స్త్రీసూత్రానికి చెంది ఉంటాయనుకున్నాడు. ఇంతకీ ప్రియామ్ ప్రాసాదంలో ఇలాంటివి ఎందుకున్నాయో అతనికి అర్థం కాలేదు.

(సశేషం)

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. Satyanarayana Rapolu says:

    కల్లూరి భాస్కరం గారు విషయాన్ని, వివరణను, కథనాన్ని పోటీపడి ఆసక్తికరంగ నడుపుతున్నరు. అభినందనలు! అయితె తుర్కీ దేశం పేరును రోమన్/ ఇంగ్లిష్ లిపి మాధ్యమం వలన టర్కీ అని పలుకుతున్నరు; టర్కీ అని లిప్యంతరీకరణ చేస్తున్నరు. ఆ పొరపాటును రచయిత లందరు సరిదిద్దు కొనవలసినదిగ విజ్ఞప్తి! తురక, తురకలు, తురుష్క పదాలు మనకు పెద్దల ద్వార నిత్య వ్యవహారంలో వినిపించెడివే కద!

    • కల్లూరి భాస్కరం says:

      ధన్యవాదాలు సత్యనారాయణగారూ, తుర్కీ గురించి మీరు చేసిన సూచన మంచిదే. కానీ మొదలెడితే వ్యవహారంలో ఉన్న చాలా మాటల్నే మార్చాల్సివస్తుంది. అది ఇంకో ఉద్యమం అవుతుంది. అదీగాక, రచన మధ్యలో మార్చడం మరో ఇబ్బంది అవుతుంది. ఇంతకీ ‘తురక’ అనే మాటను ఈ రోజున వాడచ్చా?

మీ మాటలు

*