కొన్నాళ్లు వొక దగ్గర…

 

 

-బాల సుధాకర్ మౌళి 

~

sudhakar

 

 

 

 

 

ఇల్లు కావాలి
వుండటానికీ, వొండుకు తినడానికీ
ఇల్లు కావాలి
వూపిరి పీల్చుకోటానికి
వుక్కబోతల నుంచి రక్షించుకోటానికి
ఇల్లు
కావాలి
వూరు వదిలి
పదేళ్లవుతుంది
ఎలాగో వొక గట్టు ఎక్కాం
కొత్త ప్రపంచాన్ని వెతుక్కొంటున్నాం
ఇల్లు
సొంత ఇల్లు వొకటి
కావాలనిపిస్తుంది
వున్నపాటుగా బతకటానికి
వూహలు అల్లుకోటానికి
సొంత గూడు వొకటి కావాలనిపిస్తుంది
చిన్నప్పుడు
బతికిన ఇంటి జ్ఞాపకాలు
వూరి జ్ఞాపకాలు
మాటిమాటికీ గుర్తుకువస్తున్నాయి
మా ఇల్లు
మా వూరు
జ్ఞాపకాల్లో పదిలంగా వుండాలి
మా వూరు
మా ఇంట్లో బతకాలి
మా యిల్లు
మాలో బతకాలి
చాలా దూరం వచ్చేసాం
చాలా కాలం నడిచొచ్చినట్టనిపిస్తుంది
ఒక వూరంటూ లేనోళ్లం
కొన్నాళ్లు వొక దగ్గర వుంటాం
పిల్లల్ని కంటాం
పెళ్లిళ్లు చేస్తాం
పిల్లల్ని కంటాం
తరాలుగా వూరు వదిలి
వూరు మారే
మనుషులం మేం
అనాది శోకం
ఇవాళ నన్ను వెంబడిస్తోంది
ఎన్నటికీ కదలని – ఎప్పటికీ మారని
సొంత ఇల్లు, సొంత వూరు కోసం
వూరు వూరూ గాలించాలనిపిస్తోంది.

*

మీ మాటలు

  1. హైదరాబాద్ బతుకుల్లో అదే వెతుక్కుంతున్నాం. బాగుంది కవిత .

  2. రాజశేఖర్ గుదిబండి says:

    “మా వూరు
    మా ఇంట్లో బతకాలి
    మా యిల్లు
    మాలో బతకాలి”
    ఎంత బాగా చెప్పావు…
    అభినందనలు మౌళి..

మీ మాటలు

*